Sunday, March 3, 2013

ఉప్పెన, టైడల్ వేవ్, సునామీ



ఉప్పెన, టైడల్ వేవ్, సునామీ

వేమూరి వేంకటేశ్వరరావు

రక్తాక్షి నామ సంవత్సరంలో బందరులో ఉప్పెన వచ్చిందని చెప్పేవారు. ఉప్పెన అంటే సముద్రం చెలియలికట్టని దాటి జనావాసాలని ముంచెయ్యటం. బందరు ఊరంతా ములిగిపోయిందనీ, రెండో అంతస్తు మేడలు మాత్రం ములగకుండా మిగిలేయని విన్నాను. సాక్షులు ఇప్పుడు దొరకరు కనుక వినికిడి కబుర్లే నిజం అనుకోవాలి.

కాకినాడ ఇంజనీరింగు కాలేజీ పెరట్లో, సరుగుడు తోటలకి అవతల, రెండు కిలోమీటర్లు దూరంలో సముద్రం ఉంది. నేను చదువుకునే రోజుల్లో, ఒకనాడు రాత్రి “టైడల్ వేవ్ వస్తోంది” అన్న గాలి వార్త విని చాల మంది కుర్రాళ్లు హాస్టల్ ఒదిలిపెట్టేసి పై ఊళ్లు వెళ్లిపోయేరు. తెల్లారి లేచి చూసుకుంటే టైడల్ వేవూ రాలేదు, చిట్టి కెరటమూ రాలేదని తేలింది.

ఈ మధ్య హిందూమహాసముద్రంలో సునామీ వచ్చి తమిళనాడు దక్షిణ కోస్తా బాగా దెబ్బ తింది. దీని బీభత్సాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు చూసేరు కనుక ఇక్కడ ప్రత్యేకించి వివరణ రాయక్కరలేదు.

నేను అమెరికా వచ్చిన కొత్త రోజుల్లో, అనగా 1961 ప్రాంతాలలో, అమెరికాలో టైడల్ వేవ్ అన్న మాటే వాడుకలో ఉండేది. మొదటిసారి సునామీ అన్న మాట పరిశోధన పత్రాలలో 1976 లో చూసేను. జపానీ భాషలో సునామీ అంటే “రేవులని ముంచేసే పెద్ద కెరటం” అని అర్థం. మనకి ఇంగ్లీషు మాటలు వాడటం అంటే ఎంత వ్యామోహమో అలాగే ఇంగ్లీషు మాతృభాషగా ఉన్న వాళ్లకి విదేశీ మాటల మీద మోజు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపానుకీ అమెరికాకి సత్సంబంధాలు, రాకపోకలు పెరగటంతో జపానీతో పరిచయం పెరిగి ఈ “సునామీ” ఇంగ్లీషులో ప్రవేశించి, “టైడల్ వేవ్” ని వాడుకలోంచి తప్పించింది. మన టెలుగూస్ కి ఇంగ్లీషు మీద వ్యామోహం కదా. ఇంగ్లీషు వార్తా పత్రికలలో సునామీ అన్న మాట చూసి ఉప్పెనని పక్కకి నెట్టేసి మనమూ సునామీ అనే అంటున్నాం.

వాడకపోతే పోయేరు, “అసలు టైడల్ వేవ్ అన్న మాటే తప్పు ప్రయోగం, అది వాడకూడదు, సునామీ అన్నదే సరి అయిన ప్రయోగం” అని కొందరు వాదించటం మొదలుపెట్టేరు. ఈ వాదనలో ఉద్రేకం ఉందేమో కాని ఊపు లేదు. టైడ్స్ ని పోలినది, కెరటంలా జోరుగా వచ్చేది కనుక దీనికి ఇంగ్లీషులో టైడల్ వేవ్ అని పేరొచ్చింది. ఈ వ్యవహారం పూర్తిగా అర్థం కావాలంటే మనం వాడే భాషలోని మాటలకి నిర్దిష్టమైన అర్థాలు తెలియాలి.

ఇంగ్లీషులో టైడ్స్ అంటే సముద్రంలో వచ్చే ఆటుపోటులు. ఇవి కెరటాలు కావు; కెరటాలలా జోరుగా వచ్చి ఒడ్డుకి కొట్టుకోవు. టైడ్స్ అంటే ఒక రకమైన “పొంగు” (ఫోటు), “తీత” (ఆటు). నా చిన్నతనంలో “సముద్రం పొంగుతోంది” అనే వారు. అంటే సముద్రపు నీటి మట్టం పైకి లేస్తోంది అని అర్థం. గట్టు తెగిన గోదావరి పొంగులా జోరుగా కాకుండా నెమ్మదిగా సముద్రమట్టం లేస్తుంది; రోజుకి రెండు సార్లు లేస్తుంది. లేచిన మట్టం మళ్లా తరుగుతుంది. ఈ పొంగునే పోటు అనీ, తీతని ఆటు అనీ అంటాం. ఈ ఆటుపోట్లు ఏ వేళప్పుడు వస్తాయో లెక్క కట్టి చెప్పవచ్చు. ఈ సమాచారాన్ని వాడుకుని రేవులోకి పడవలు ఎప్పుడు వస్తే సదుపాయంగా ఉంటుందో నావికులు నిర్ణయిస్తారు.

ఆటుపోట్ల వల్ల సముద్రమట్టం లేచినప్పుడు సముద్రం ముందుకి వస్తుంది, పడినప్పుడు వెనక్కి వెళుతుంది. ఇలా ఎంత ముందుకి వస్తుంది, ఎంత వెనక్కి వెళుతుంది అనేది ఆ ప్రదేశం యొక్క భౌగోళిక అమరిక మీద కొంతా, ఆ రోజు పౌర్ణమా, అమావాశ్యా, గ్రహణమా అనే ఖగోళ పరిస్థితుల మీద కొంతా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే ఈ ఆటుపోట్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు కావు. టూకీగా ఇదీ టైడ్స్ కథ.

పోతే, టైడల్ వేవ్ అనేది పెద్ద కొండెత్తు కెరటం. ఇది చెలియలికట్టని దాటి, ఊళ్లో పడుతుంది. కనుక టైడల్ వేవ్ అన్నా, సునామీ అన్నా, ఉప్పెన అన్నా ఒక్కటే – అని నా నమ్మకం.

ఇంతకీ సునామీ లేదా ఉప్పెన అంటే ఏమిటి? మొదటగా, ఇది చాల జోరుగా ప్రయాణం చేసే కెరటం. ఇది చాల “పొడవైన” కెరటం. ఇక్కడ “జోరు”, “పొడవు”, “కెరటం” అన్న మాటలకి నిర్దిష్టమైన అర్థాలు ఉన్నాయి. కొంచెం శాస్త్రం, పరిభాష ఉపయోగించి చెప్పటం అవసరం. మనకి తెలుగులో అల, కెరటం, తరంగం అనే మాటలు వాడుకలో ఉన్నాయి. నిర్ధిష్టత కోసం వీటికి శాస్త్రీయమైన అర్థాలు ఇద్దాం. సముద్రపుటొడ్డున నిలబడి చూస్తూ ఉంటే నీరు ఉవ్వెత్తున పైకి లేచి, విరిగి పడుతూ ఉంటుంది. అలా పైకి లేచినప్పుడు దాని గరిష్ఠ ఊర్ధ్వభాగానికి “శిఖ” అని పేరు పెడదాం. ఈ శిఖ వెనక నీటి మట్టం లోతుగా దిగిపోతుంది. ఇక్కడ గరిష్ఠ అధో భాగానికి “గర్త” అని పేరు పెడదాం. ఒక శిఖ, ఒక గర్త ఆక్రమించిన ప్రాంతాన్ని కెరటం అందాం. మరి కొంచెం విశదంగా చెబుతాను. “కెరటం” అంటే ఒక విశ్రమ స్థానం నుండి (నీటి) మట్టం పైకి లేచి, గరిష్ఠ పరిమితి చేరుకుని, కిందకి దిగి, కనిష్ఠ పరిమితి చేరుకుని మళ్లా విశ్రమ స్థానాన్ని చేరుకున్న మేర. ఈ కెరటం వెనక మరో కెరటం వస్తుంది. దానికీ శిఖ, గర్త ఉంటాయి. ఇలా నిర్విరామంగా వచ్చే కెరటాల సమాహారాన్ని “తరంగం” అందాం. ఒక తరంగంలో ఒక శిఖ నుండి దాని వెనక వచ్చే శిఖ కి మధ్య దూరాన్ని ఆ తరంగం “పొడుగు” అంటారు. దీన్నే మన వాళ్లు తరంగ దైర్ఘ్యం అని పాఠ్య పుస్తకాలలో అంటున్నారు. మనం “తరంగం పొడుగు” అనేసి ఊరుకుందాం. దీనినే ఇంగ్లీషులో వేవ్ లెంగ్త్ (wave length) అంటారు.

ప్రతి తరంగానికి పొడుగు (wavelength), డోలన వ్యాప్తి లేక ప్రవర్ధమానం లేక ఎత్తు (amplitude) ఉంటాయి. సాధారణంగా సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే ఈ ఎత్తు సుమారు రెండో, మూడో మీటర్లు ఉంటుంది. పొడుగు మహా ఉంటే 50 మీటర్లు ఉండొచ్చు. కాని ఇది సునామీ అయితే ఆ కెరటం ఎత్తు సుమారు 10 మీటర్లు (30 అడుగులు), పొడుగు సుమారు 15 కిలోమీటర్లు ఉంటాయి.

సునామీ సముద్రం మధ్యలో ఎక్కడో పుట్టి గంటకి సుమారు 500 కిలోమీటర్ల వేగంతో (అంటే విమానం వేగంతో) ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎదట గర్త, దాని వెనక శిఖ ఉంటాయి కనుక ఒడ్డున ఉండి చూసేవాళ్లకి ముందస్తుగా గర్త తగులుతుంది. అందువల్ల సముద్రం బాగా వెనక్కి వెళ్లిపోతూ కనిపిస్తుంది. దాని వెనక ఎక్కడో 15 కిలోమీటర్లు దూరంలో కొండంత ఎత్తు ఉన్న శిఖ జోరుగా వస్తోందన్న విషయం ఒడ్డున ఉన్న వ్యక్తికి ఎలా తెలుస్తుంది? తెలియదు. అమాయకంగా సముద్రం ఎందుకు వెనక్కి తగ్గిపోతోందా అని ఆశ్చర్యపడి కళ్లప్పగించి చూస్తూ ఉంటాడు. ఆ వెనక నుండి విమానం జోరుతో వస్తూన్న శిఖ ఒడ్డు చేరుకోడానికి 2 నిమిషాలు కూడ పట్టదు. ఆ వచ్చే కెరటం ఎత్తు 10 మీటర్లు అనుకుంటే నీటి మట్టం క్షణానికి 8 సెంటీమీటలు (2 అంగుళాలు) చొప్పున పెరుగుతుంది అన్నమాట. అంటే ఇరవై అంకెలు లెక్కపెట్టే లోగా నిలువెత్తు మనిషి ములిగి పోతాడు. కనుక ప్రాణం మీద ఆశ ఉంటే సముద్రం తీతని చూడగానే కాలికి బుద్ధి చెప్పో, కారు ఎక్కో, ఎత్తయిన ప్రదేశానికి పారిపోవాలి.

3 comments:

  1. ఓహ్ ! సునామీ, టైడల్ వేవ్ ఒకటే అంటారా ? టైడల్ వేవ్ అంటే మామూలుగా సముద్రం ఆటుపోట్ల వల్ల ఏర్పడేది, సునామీ అంటే భూకంపం లాంటి వాటి వల్ల ఏర్పడేది అనుకుంటున్నాను ఇప్పటి వరకు.
    బావుందండి !

    ReplyDelete
    Replies
    1. నిర్వచనాలతో ఇబ్బంది లేకపోలేదు.

      సముద్రంలో వచ్చే ఆటుపోట్లని టైడ్స్ అంటారు. ఇంతవరకు అసందిగ్ధత లేదు.

      కొన్ని కొన్ని భౌగోళిక పరిస్థితుల ప్రభావం వల్ల ఈ టైడ్స్ పెద్దవిగా రావచ్చు. పెద్దవి అంటే, పోటు వచ్చినప్పుడు సముద్ర మట్టం దరిదాపు 30-40 అడుగులు లేచే అవకాశాలు ఉన్నాయి. ఈ రకం ఆటు, పోట్లని మనం గణన చేసి, ఎప్పుడు వస్తాయో చెప్పగలం. పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నా టైడ్స్ టైడ్సే! పేరు మారదు. టైడ్ అంటే కెరటం కాదు.

      టైడల్ వేవ్ అన్నది మనం గణన చేసి నియతంగా ఫలానా తేదీలలో ఫలానా వేళప్పుడు వస్తుందని చెప్పలేం. ఇవి అకస్మాత్తుగా వచ్చి పడే కెరటాలు. ఎక్కడో సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడో, లేక చక్రవాకాల ప్రభావం వల్లో ఈ రకం పెనుకెరటాలు రావచ్చు. ఆయా సందర్భాలలో ఇవి చెలియలికట్టని ఎప్పుడు తాకుతాయో మనం చెప్పొచ్చు. కాని ఇవి ఒక నీయత కాలంలో పదే పదే వచ్చే కెరటాలు కావు. టైడల్ అన్న విశేషణాన్ని చూసి, వీటికీ టైడ్స్ కీ సంబంధం ఉందనుకోవడం పొరపాటని నా అభిప్రాయం.

      పేర్లు పెట్టడం మన చేతులో ఉంది కనుక, నిర్ధిష్టత కోసం, కావలిస్తే -

      భూకంపం ప్రేరణగా వచ్చిన పెనుకెరటాలని సునామీలనిన్నీ, అల్పపీడనం ప్రభావం వల్ల పుటూకొచ్చే పెనుకెరటాలని ఉప్పెన అనిన్నీ మనం నిర్వచించవచ్చు. అప్పుడు తెలుగులో ఉప్పెనకి ఒక అర్థం, సునామీకి మరొక అర్థం ఆపాదించవచ్చు. అప్పుడు మన భాషలో పదజాలం పెరుగుతుంది, పదాలకి నిర్దిష్టమైన అర్థం వస్తుంది. ఏమంటారు?


      Delete
  2. భూకంపం ప్రేరణగా వచ్చిన పెనుకెరటాలని సునామీలనిన్నీ, అల్పపీడనం ప్రభావం వల్ల పుటూకొచ్చే పెనుకెరటాలని ఉప్పెన అనిన్నీ మనం నిర్వచించవచ్చు.
    -----------------------------
    ఇప్పుడు చాలా స్పష్టం గా ఉందండి . 2004 లో సునామీ వచ్చినప్పుడు న్యూస్ చానెల్స్ కూడా మొదటి రిపోర్టింగ్ లో ఉప్పెన అనే వాడిన గుర్తుందండి నాకు . నేను అప్పుడే మొదటిసారి సునామీ అన్న మాట విన్నాను . ఆ తరవాత మాత్రం చాల చాల ఎక్కువగా వింటున్నా / చదువుతున్నా అనుకోండి :-)
    మీ ఈపోస్టు చూసిన తరవాత కొంచెం కొంచెం మరచిపోతున్న వేవ్ లెంగ్త్ , వేగం ఈ సమీకరణాలు, ఒకసారి గుర్తు చేసుకున్నానండి. థాంక్ యు రావ్ గారు !

    ReplyDelete