వేమూరి వేంకటేశ్వరరావు
ఈ మధ్య సెల్ ఫోనుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సా. శ. 2011 లో ఈ భూలోకం జనాభా 7 బిలియనులు (7,000,000,000) అయితే 5 బిలియనుల సెల్ ఫోనులు వాడకంలో ఉన్నాయిట.
ఇప్పుడిప్పుడే సెల్ ఫోనుల వల్ల కేన్సరు వ్యాధి వచ్చే ప్రమాదం ఉందేమో అని కొందరు అనుమానం పడుతూ ఉంటే ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.
ముందు మనందరికీ బాగా పరిచయం ఉన్న రేడియో, టెలివిషన్ వంటి ఉపకరణాలకీ సెల్ ఫోనుకీ మధ్య పోలికలు, తేడాలు చూద్దాం. రేడియో కేంద్రం ఎక్కడో ఉంటుంది. అక్కడ నుండి ప్రసారితమైన వాకేతాలని (సిగ్నల్, signal) మన ఇంట్లో ఉన్న రేడియో గ్రాహకి (రిసీవర్, receiver) అందుకుంటోంది. ఈ “డబ్బా” రేడియో వార్తలని అందుకోగలదు కాని పంపలేదు. ఆ వార్తలని అందుకోటానికి బయట వాకట్లో పొడుగాటి తీగని వేలాడగడతాం. ఈ తీగనే పూర్వం ఏరియల్ అనేవారు, ఇప్పుడు ఎంటెనా అంటున్నారు. ఇదే విధంగా వార్తలని పంపే రేడియో ప్రసారిణి (ట్రాన్స్‌మిటర్, transmitter) కూడ ఒక పొడుగాటి తీగని వాడుతుంది. ఈ తీగనీ ఎంటెనా అనే అంటారు. ఈ ఎంటెనాని ఎత్తయిన, బురుజులాంటి కట్టడం (టవర్, tower) మీద ప్రతిస్థాపిస్తారు.
సెల్ ఫోను రేడియో గ్రాహకిలా వాకేతాలనీ అందుకుంటుంది, రేడియో ప్రసారిణిలా వాకేతాలని పంపుతుంది. చేతిలో పట్టే ఉపకరణం కనుక పంపటానికి వాడే తీగ, అందుకోటానికి వాడే తీగ (ఎంటెనా) కూడ పొడుగ్గా, భారీగా కాకుండా, చిన్నగా ఉండి ఫోను లోపల ఇమడాలి. ఇలా అన్నిటిని కైవారంలో కుదించి, చేతిలో పట్టే ఉపకరణంగా చెయ్యాలంటే పొడుగాటి “రేడియో తరంగాలు” పనికిరావు; అందుకని పొట్టిగా ఉండేవి, శక్తిమంతమైనవి అయిన సూక్ష్మ తరంగాలు (మైక్రోవేవ్స్, microwaves) వాడతారు. మౌలికంగా అదీ సాధారణమైన రేడియోకి, సెల్ ఫోనుకి తేడా.
మరికొంచెం తరిచి లోతుకి వెళ్లి చూద్దాం. మానవులని బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అని వర్గాలుగా విడగొట్టినా మనం అంతా మనుష్యులమే కదా; వయస్సులో తేడా. అలాగే రేడియో తరంగాలన్నా, కాంతి తరంగాలన్నా, సూక్ష్మ తరంగాలన్నా, X-కిరణాలు అన్నా, గామా కిరణాలు అన్నా – ఇవన్నీ పేర్లలో తేడా మాత్రమే. ఈ పేర్లలో తేడా ఈ తరంగాల పొడుగుని బట్టి మారుతూ ఉంటుంది. రేడియో తరంగాలు పొడుగ్గా ఉంటాయి. కాంతి తరంగాలు అంతకంటె పొట్టి, సూక్ష్మ తరంగాలు ఇంకా పొట్టి. ఎక్స్-కిరణాలు మరికొంచెం పొట్టి, గామా కిరణాలు బాగా పొట్టి. అవసరాన్ని బట్టి వీటిని విడివిడిగా పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు లేకపోతే వీటన్నిటినీ కలగట్టి “విద్యుదయస్కాంత తరంగాలు” అని పిలవచ్చు.
“పొట్టి వాడికి పుట్టెడు బుద్ధులు” అన్నట్లు తరంగం పొట్టిగా ఉంటే దాంట్లో శక్తి ఎక్కువ ఉంటుంది. కనుక గామా కిరణాలు (ఇవీ తరంగాలే, సంప్రదాయికంగా కిరణాలు అని పిలుస్తారు) ఎంత శక్తిమంతమైనవి అంటే అవి మన శరీరాన్ని తాకితే చర్మం కాలిపోతుంది. ఎక్స్-కిరణాలు కూడ శక్తిమంతమైనవే. అందుకనే వైద్యుడు ఎక్స్-రే ఫొటోలు తీసేటప్పుడు చాల జాగ్రత్తలు తీసుకుంటాడు. కడుపులో ఉన్న పిండానికి ఎక్స్-కిరణాల తాకిడి మంచిది కాదు. ఇంకా పొడుగైన తరంగాలు అతినీలలోహిత కిరణాలు. ఇవి కంటికి కనబడవు కాని, మనం బయటకి ఎండలోకి వెళితే ఈ కిరణాల ప్రభావానికి శరీరం “కాలి” కమిలి పోతుంది. శీతల దేశాలలో ఉన్న తెల్లవాళ్లు శరీరం మరీ పాలిపోయినట్లు ఉంటే బాగుండదని ప్రత్యేకించి బీచికి వెళ్లి ఎండలో కూర్చుంటారు. అప్పుడు ఈ అతినీలలోహిత కిరణాల మోతాదు ఎక్కువైతే శరీరం కమిలిపోవటమే కాకుండా చర్మపు కేన్సరు వస్తుంది. ఇంకా పొడుగైన కిరణాలు కంటికి కనిపించే కాంతి. ఎండలోకి వెళ్లటం వల్ల మనకి ఏమి ప్రమాదం వస్తున్నాది? వేడికి ఒళ్లు చుర్రుమంటుంది. ఎండలో ఎక్కువ సేపు కూర్చుంటే ఒళ్లు కాలినా కాలుతుంది. ఇంకా పొడుగైనవి సూక్ష్మ తరంగాలు లేదా మైక్రోవేవ్స్. ఈ కిరణాలని ఉపయోగించి “సూక్ష్మతరంగ ఆవాలు” తయారు చేస్తున్నారు కదా. వీటిలో ఆహార పదార్థాలని వేడి చేసుకున్నప్పుడు ఆ ఆహారం 700 సెల్సియస్ డిగ్రీలవరకు వేడెక్కి పోతుంది. నీళ్లు 100 డిగ్రీల దగ్గర మరుగుతాయి కనుక 700 ఎంత వేడో మీరే ఊహించుకొండి. కనుక సూక్ష్మ తరంగాలు ఒంటికి తగిలితే ఒళ్లు కాలే ప్రమాదం ఉంది. ఇంకా పొడుగైనవి రేడియో తరంగాలు. వీటిని వాడటం మొదలుపెట్టి దరిదాపు ఒక శతాబ్దం అవుతోంది. వీటివల్ల ఆరోగ్యానికి భంగం అని ఎవ్వరు అనలేదు.
పైన ఉదహరించిన తరంగాలన్నిటిని కట్టకట్టి “విద్యుదయస్కాంత తరంగాలు” అని కాని “విద్యుదయస్కాంత వికిరణం” అని కాని అంటారు. ఈ కథనాన్ని బట్టి అన్ని వికిరణాలు ఆరోగ్యానికి హాని చెయ్యవు. శక్తిమంతమైనవే ప్రమాదం. ఈ శక్తిమంతమైన వాటిల్లో గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు ఎక్కువ ప్రమాదం. అతి నీలలోహిత తరంగాలు మరికొంచెం తక్కువ హాని చేస్తాయి. సూక్ష్మ తరంగాలు ఇంకా తక్కువ హానికరం. టెలివిషన్, రేడియో తరంగాలు, మన ఇళ్లకి విద్యుత్తు సరఫరా చేసే తీగలలో ప్రవహించే తరంగాలు సిద్ధాంతరీత్యా హాని చెయ్యటానికి వీలు లేదు.
ఇదే విషయాన్ని మరొక విధంగా చెబుతాను. గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు, అతి నీలలోహిత కిరణాల తాకిడి వల్ల కేన్సరు వంటి వ్యాధులు వస్తాయనటానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీటిల్లో శక్తి “మోలు ఒక్కంటికి 480 కిలోజూలులు” దాటి ఉంటుంది కనుక వీటి తాకిడి ధాటీకి తట్టుకోలేక మన శరీరంలోని రసాయన బంధాలు తెగిపోతాయి. ఆకుపచ్చ కాంతిలో శక్తి “మోలు ఒక్కంటికి 240 కిలోజూలులు” ఉంటుంది. ఈ శక్తికి మన కంటి రెటీనా లో ఉండే బంధాలు తెగవు కాని, చలించి ఒంగుతాయి. ఇలా ఒంగి నప్పుడు రెటీనా విద్యుత్ వాకేతాలని ఉత్పత్తి చేసి మెదడుకి పంపుతుంది. సెల్ ఫోనులో పుట్టే శక్తి “మోలు ఒక్కంటికి 0.001 కిలోజూలు కంటె తక్కువ. ఈ శక్తి కంటె ఆకుపచ్చ కాంతి పుట్టించే శక్తి 240,000 రెట్లు ఎక్కువ. ఈ శక్తి కంటె అతి నీలలోహిత కిరణాలు పుట్టించే శక్తి 480,000 రెట్లు ఎక్కువ.
ఈ లెక్క ప్రకారం సెల్ ఫోనులకి అపకారం చెయ్యగలిగే స్థోమతలేదు. ఎక్స్-కిరణాలకి అపకారం చేసే స్థోమత ఉన్నా వాటి వాడకం మానెస్తున్నామా? తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అతినీలలోహిత కిరణాలు హాని చేస్తాయని తెలుసు కనుక ఎండలోకి వెళ్లినప్పుడు ఒంటికి లేపనం పూసుకోవటం, చలవ కళ్లజోడు పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సెల్ ఫోనులు ప్రసరించే రేడియేషన్ వల్ల ప్రమాదం లేకపోయినా, సెల్ ఫోనుల విషయంలో కొన్ని మౌలికమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
మొదటి జాగ్రత్త. సెల్ ఫోనుని చేత్తో పట్టుకుని, చెవికి ఆనించి మాట్లాడటం కంటె ఫోనుని జేబులోనో, బల్లమీదో పెట్టుకుని, దాని నుండి ఒక తీగని చెవిదాకా తీసుకొచ్చి వినటానికి, మాట్లాడటానికీ సదుపాయం ఉంటే కొంత ఊరట. తలకీ, సెల్ ఫోనుకీ దూరం పెంచండి. అదే విధంగా, వీలయినప్పుడల్లా శరీరానికి, సెల్ ఫోనుకీ దూరం పెంచండి. ఈ జాగ్రత్తలకి కారణం సెల్ ఫోనులో ఉండే బేటరీ పేలిపోయి, కాలిపోయే సావకాశం ఉంది కనుక!!
రెండవ జాగ్రత్త. సెల్ ఫోను అందుబాటులో ఉంది కదా అని ఇరవైనాలుగు గంటలు అదే పనిగా దానిని చెవికి ఆనించి మాట్లాడటం కంటె, సెల్ ఫోను లోకాభిరామాయణానికి కాదని, అవసరం వెంబడి వార్తలని చేరవెయ్యటానికనీ గమనించి, క్లుప్తంగా వాడటం నేర్చుకోవాలి.
పై రెండు జాగ్రత్తల వల్ల సూక్ష్మ వికిరణ వల్ల ప్రాప్తించే హాని తగ్గుతుంది.
మూడో జాగ్రత్త. కారు, రైలు వంటి వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోను మీద మాట్లాడ వద్దు. నాకు తెలుసున్న వ్యక్తి, కుర్రాడు, నవీ ముంబాయిలో కారు తోలుతూ సెల్ ఫోనులో మైమరచి మాట్లాడుతూ ఎదురుగా వచ్చే బండిని చూసుకోకుండా గుద్దేసి నిష్కారణంగా అసువులు బాసేడు. బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు.
Thank you sir! బాగా ఎక్ష్ప్లైన్ చేసారండి . ఈమధ్యన ఈ రేడియేషన్ గురించి ఎడాపెడా ఫార్వర్డ్ hoax మెసేజెస్, వాటికి ఇంకొంచెం spices కలిపి వండి వడ్డించే విశ్లేషణలు ఒకరకం కాదులెండి !
ReplyDeleteInformative post.
ReplyDeleteచాలా చక్కగా తెలియపరిచారు. ఇంతవరకు ఇంత విపులంగా నేను ఎక్కడా చదవలేదు. ధన్యవాదాలు.
ReplyDelete-డి.విశ్వేశ్వరరావు, హైదరాబాదు.
good information sir
ReplyDelete