Friday, June 28, 2013

అసలు వజ్రాలు, నకిలీ వజ్రాలు


అసలు వజ్రాలు, నకిలీ వజ్రాలు
వేమూరి వేంకటేశ్వరరావు

వజ్రాలు ధగధగ మెరుస్తాయి కనుక వాటికి ఆ ఆకర్షణ వచ్చింది. అలా మెరవటానికి కారణం వజ్రం యొక్క విక్షేపక సామర్ధ్యం (డిస్‌పర్సివ్ కెపేసిటీ, dispersive capacity) చాల ఎక్కువ. విక్షేపక సామర్ధ్యం అంటే ఏమిటి? కాంతి కిరణం వజ్రంలో ప్రవేశించినప్పుడు కాంతిలో ఉన్న “సప్త” వర్ణాలు విడిపోయి ఎవరికివారే అన్నట్లు అన్ని దిశలలోనూ, వివిధమైన వేగాలతో ప్రయాణం చెయ్యగలిగే సమర్ధత. నిపుణులు వజ్రాలని మలచినప్పుడు కాంతి ఎన్నో రంగులుగా విడిపోయి అవి అన్ని దిశలలోకీ చెల్లాచెదురయేటట్లు చేస్తారు. అందుకే వజ్రానికి ఆ ధగధగ!

ఒకానొకప్పుడు వజ్రాలు విరళం, అపురూపం. మహరాజుల కిరీటాలలో కాని, సింహాసనాలలో కాని పొదగబడేవి. అందరికీ లభ్యం అయేవి కావు. అందుకని వాటికి బజారు ధర అంటూ ఏదీ ఉండేది కాదు. ఈ రోజుల్లో అసలు వజ్రాలు పూర్వపు రోజుల్లోలా అపురూపం కాదు కనుక వాటి ధర అంత ఎక్కువ ఉండవలసిన అవసరం లేదు. కాని వజ్రాల వర్తకులు కూడబలుక్కుని వజ్రాల సరఫరా అదుపులో పెట్టి వాటి ధర ఎక్కువ పలికేటట్లు చేస్తున్నారు. పైపెచ్చు "వజ్రం ప్రేమకి చిహ్నం," “ప్రేమ లాగే వజ్రాలు కూడ శాశ్వతం” అని ఒక పుకారు లేవదీసి, ప్రేమలో పడ్డ కుర్రాళ్లకి కిర్రెక్కించి వజ్రాల గిరాకి పడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. వజ్రాలే కాదు, వైడూర్యాలూ శాశ్వతమే, ప్లేశ్టిక్‌తో చేసిన పాల సంచులూ శాశ్వతమే అన్న విషయం మనం మరచిపోకూడదు.

ప్రకృతిసిద్ధంగా దొరికే వస్తువులన్నిటిలో వజ్రం ఎక్కువ కఠినమైనది. అందుకని పరిశ్రమలలో వజ్రానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంత కఠినంగా ఉండే పదార్థం ప్రేమకి ఎలా చిహ్నమౌతుంది? ప్రియురాలికి ప్రేమని చాటాలంటే వజ్రాల దుద్దులు, వజ్రపు ఉంగరం, వజ్రాల తావళం బహుమతిగా ఇవ్వాలనే ఆచారం అనాదిగా ఉన్నది కాదు; ఈ మధ్య వజ్రపు వ్యాపారులు పుట్టించినది.

దక్షిణ ఆఫ్రికాలో, సా. శ. 1870 లో, బ్రిటిష్ వాళ్లకి వజ్రపు గనులు కనిపించేయి. అంతవరకు వజ్రాలు చాల అపురూపం. సామాన్యులకి అందుబాటులో ఉండేవి కావు; కనుక వాటి బజారు ధర ప్రసక్తే లేదు. కొత్తగా కనుక్కున్న గనులలో వజ్రాలు కొల్లలుగా కనిపించడంతో అవి అందరికీ అందుబాటు ధరలోకి వచ్చేయి. ఇన్ని వజ్రాలు ఒక్క సారి బజారున పడితే వాటి ధర పడడం ఖాయం. అందుకని ఆ గనులలో పెట్టుబడి పెట్టిన వాటాదారులు కూడబలుక్కుని, డి బీర్స్ అనే కంపెనీ పెట్టి, ఆ వజ్రాల సరఫరాని అదుపులో పెట్టాలని నిశ్చయించుకున్నారు.

సరఫరాని అదుపులో పెడితే సరిపోదు కదా. ఉన్న వజ్రాలని ప్రజల చేత కొనిపించాలి. అందుకని డి బీర్స్ అమెరికాలో ఉన్న “ఎన్. డబ్ల్యు. ఏయర్స్” అనే పౌర సంబంధ కంపెనీని ఆశ్రయించి వారిచేత వ్యాపార ప్రకటనలు తయారు చేయించేరు. ఈ కంపెనీ చెయ్యవలసిన పని వజ్రాలు అమ్మడం కాదు, బజారులో ఒక షాపుకి ప్రజలని రప్పించడం కాదు; వారు చెయ్యవలసినదల్లా ఒక ఊహని అమ్మడం. ఏమిటా ఊహ? ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ప్రేమించేడనడానికి రుజువు తోటలో స్టెప్పులు వెయ్యడం కాదు, విరహవేదనతో పాటలు పాడడం కాదు. నిజమైన ప్రేమని చాటాలంటే వజ్రం తోటే చాటాలి. ఈ భావాన్ని ప్రజలకి అమ్మాలి. ఏయర్స్ కంపెనీ వారు రంగంలోకి దిగేరు. రకరకాల కలం పేర్లతో పత్రికలలో కథలు, వ్యాసాలు ప్రచురించేరు. తెర తారల వేళ్లకి వజ్రాల ఉంగరాలు, మెడలలో తావళాలు ఉన్నట్లు రంగురంగుల బొమ్మలు వేయించేరు. ఆ వజ్రాల పరిమాణం ఎంతో, విలువెంతో ప్రచారం చేసేరు. ప్రియురాలికి ఇచ్చే వజ్రం మీద ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత ప్రేమ అనుకునేటట్లు కథలు అల్లి ఈ లోకాన్ని మభ్యపెట్టింది ఆ కంపెనీ. “ఎ డయమండ్ ఈజ్ ఫర్ ఎవర్” అనే నినాదం 1949 నాటికి అందరి నోటా నానే ఒక సామెతగా రూపొందింది. సామాన్యులు కూడా అప్పో, సొప్పో చేసి ప్రియురాలికి వజ్రపు ఉంగరం కొనకపోతే అదేదో మహా పాపంలా భావించేవారు. ఈ ధోరణి ఇప్పటికీ తగ్గలేదు.
అమెరికా ప్రభుత్వం వ్యాపారరంగంలో గుత్తాధిపత్యం ఎవ్వరికీ ఉండకూడదని నిబంధనలు (antitrust laws) జారీ చెయ్యడంతో డి బూర్స్ కంపెనీ ఆటలు సాగలేదు. ఇప్పుడు వజ్రాల వ్యాపారంలో దరిదాపు గుత్తాధిపత్యం సంపాదించినది రష్యా దేశపు “అల్‌రోజా” అనే కంపెనీ. వజ్రాల ధరలు పడిపోతున్నాయని ఈ కంపెనీ వజ్రాల సరఫరాని డిసెంబరు 2008 లో ఆపివేసింది. “ధరని నిలబెట్టలేకపోతే వజ్రానికి విలువెక్కడుంది? అది కేవలం బొగ్గే కదా!” అన్నాడుట అల్‌రోజా తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతూ ఒక వ్యక్తి.

మరి పేదవాడు తన ప్రేమని ఎలా చాటుతాడు? ఈ వెలితిని పూడ్చటానికి ఈ రోజుల్లో జనతా వజ్రాలు – క్యూబిక్ జర్కోనియా - సులభంగా విపణివీధిలో దొరుకుతున్నాయి. ఈ నకిలీ వజ్రాలని ప్రయోగశాలలో తయారు చెయ్యవచ్చు. అసలువాటి కంటె ఈ నకిలీ వజ్రాల విక్షేపక సామర్ధ్యం ఎక్కువ. అందుకని ఇవి అసలువాటి కంటె బాగా మెరుస్తాయి. అసలు వజ్రాలలో లోపాలు ఉంటాయి. ఈ నకిలీ వజ్రాలని ఏ లోపాలు లేకుండా చాల అందంగా, ఏ ఆకారంలో కావలిస్తే ఆ ఆకారంలో చెయ్యవచ్చు. పైపెచ్చు అసలు వాటితో పోల్చితే ఇవి చచ్చు చవక. నా దగ్గర ఈ రకం నకిలీ వజ్రపు ఉంగరం ఉంది. నా శ్రీమతి నాచేత కొనిపించింది తప్ప తను కొని ఇవ్వనంది. తనే కొనిస్తే తన ప్రేమని చవకబారు ప్రేమ కింద జమ కట్టెస్తానేమోనని భయం ట.

అసలు వజ్రాల కంటె ఈ నకిలీ వజ్రాలు అందంగా ఉండటంతో ఒక చిక్కు వచ్చి పడింది. వజ్రాల ప్రసక్తి వచ్చేసరికి “అందం ముఖ్యమా? వెల ముఖ్యమా?” అని ప్రజలని అడిగితే వెలకే ఓట్లు పడ్డాయి. అసలు వజ్రపు తావళం వెల ఎక్కువగా ఉండటానికి కారణం ఆ తావళం అందమూ కాదు, ఆ తావళంలో ఉన్న బంగారపు వెలా కాదు; వజ్రాల వెల ఎక్కువగా ఉండటం.

క్యూబిక్ జర్కోనియాతో వచ్చిన మరొక చిక్కు ఏమిటంటే నిజానికి ఇది వజ్రం కంటె అందంగా ఉంటుందేమో, “ఇంత అందంగా ఉన్న వజ్రం, ఇంత పెద్ద వజ్రం, ఈ గొట్టం గాడు ఎలా కొనగలడు, కనుక ఇది మూడొంతులు నకిలీదే అయుంటుంది” అని నకిలీ వజ్రాలు ధరించిన వారిని మొహమాటం లేకుండా ముఖం మీదే అడిగెస్తున్నారు. అందుకని ఇప్పుడు శాస్త్రవేత్తల ముందు ఉన్న సవాలు ఏమిటంటే – క్యూబిక్ జర్కోనియా అందం ఒక్క రవ తగ్గించి నిజం రవ్వలలా కనిపించేటట్టు చెయ్యటం. అప్పుడు నిజం రవ్వలేవో నకిలీ రవ్వలేవో చెప్పటం నిజంగా కష్టం.

Saturday, June 22, 2013

యానకంలో కాంతి వేగం


యానకంలో కాంతి వేగం

వేమూరి వేంకటేశ్వరరావు

మనం మాట్లాడేటప్పుడు సోమరితనం ప్రదర్శిస్తాం. “ట్రాన్సిస్టర్ రేడియో” అనటానికి బద్దకించి మనలో చాలమంది “ట్రాన్సిస్టర్” అనేసి ఊరుకుంటాం. అలాగే “మైక్రోవేవ్ అవెన్” అనటానికి బద్దకించి “మైక్రోవేవ్” అనేసి ఊరుకుంటాం. ఇదే విధంగా “కాంతి వేగం” అన్నప్పుడు సాధారణంగా మన ఉద్దేశం “శూన్యంలో కాంతి వేగం”. “కాంతి వేగాన్ని మించి ఏదీ ప్రయాణం చెయ్యలేదు” అని శాస్త్రవేత్తలు అన్నప్పుడు “శూన్యంలో కాంతి ప్రయాణం చెయ్యగలిగే వేగాన్ని మించి ఏదీ ప్రయాణం చెయ్యలేదు” అని మనం తాత్పర్యం చెప్పుకోవాలి.

శూన్యంలో కాంతి వేగం ఎంత? క్షణానికి 186,282 మైళ్లు. లేదా కచ్చితంగా క్షణానికి 299,792,458 మీటర్లు. తేలిగ్గా జ్ఞాపకం ఉంచుకుందికి దీనిని క్షణానికి 300,000 కిలోమీటర్లు అని ఉరమర సంఖ్య వాడుతూ ఉంటాం.

శూన్యంలో కాకుండా మరే ఇతర పదార్థ యానకంలో ప్రయాణం చేసినా కాంతి వేగం కుంటు పడుతుంది. ఖాళీగా ఉన్న మైదానంలో పరిగెట్టగలిగినంత జోరుగా జనసమ్మర్దం ఉన్న బజారు వీధిలో పరిగెట్టగలమా? శూన్యంలో కంటె గాలిలో కాంతి వేగం తగ్గుతుంది. గాలిలో కంటె గాజు దిమ్మలో కాంతి వేగం తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? ఒక యానకం (మీడియం, medium) లో కాంతి వేగం ఎంత తగ్గుతుందో దానిని ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం (ఇండెక్స్ అఫ్ రిఫ్రేక్షన్, index of refraction) అంటారు. నీటి యొక్క వక్రీభవన గుణకం 1.33. గాజు వక్రీభవన గుణకం 1.5. వజ్రం వక్రీభవన గుణకం 2.4. అంటే వజ్రంలో కాంతి వేగం కేవలం క్షణానికి 77,618 మైళ్లు లేదా 124,188 కిలోమీటర్లు. అంటే వజ్రంలో కాంతి పెళ్లినడకలు నడుస్తూ ప్రయాణం చేస్తుందన్నమాట. అందుకోసమే వజ్రం అలా మెరుస్తుందంటారా? ఏమో, నాకు తెలియదు. ఎవరినైనా అడిగి చూడాలి.

కాంతి వేగం యానకంలో ఎందుకు తగ్గుతుంది? కాంతి అంటే విద్యుత్ తరంగాలు, అయస్కాంత తరంగాలు కలిసి ప్రయాణం చేసే జంట తరంగాలు. ఈ విద్యుత్ తరంగాలు యానకంలో ఉన్న అణువుల మీద తమ ప్రభావం చూపి వాటిలో భ్రమణం కలిగిస్తాయి. (తోటలో ఉన్న చెట్లు గాలి తాకిడికి ఊగిసలాడవూ? అలాగన్నమాట.) దీని పర్యవసానం ఏమిటంటే ఏ గురుత్వం లేని “ఫోటానులు” అనే కాంతి కణాలు గురుత్వం సంతరించుకున్నట్లు ప్రవర్తిస్తాయి. గురుత్వం పెరిగితే జోరు తగ్గుతుంది. ఫోటానుల జోరు తగ్గితే కాంతి వేగం తగ్గినట్లే కదా. ఇదంతా మేక్‌స్వెల్ సమికరణాలు రాసి, వాటిని పరిష్కరించి, చూపించవచ్చు.

Sunday, June 16, 2013

అణు బాంబు చెయ్యటం ఎలా?


అణు బాంబు చెయ్యటం ఎలా?

వేమూరి వేంకటేశ్వరరావు

నిజానికి యురేనియం బాంబుని తయారు చెయ్యటం పెద్ద కష్టం ఏమీ కాదు: కల్తీ లేని రెండు తేలిక యురేనియం “ముద్దలు” తీసుకుని వాటిని ఒకదానితో మరొకటి జోరుగా ఢీకొనేటట్లు చెయ్యాలి, అంతే. ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అవి ఢీకొన్న తరువాత వాటి మొత్తం గరిమ యురేనియం యొక్క “కీలక గరిమ” ని మించాలి, అంతే. ఇక్కడ వివరాలు అన్నీ అరటి పండు ఒలిచినట్లు చెపుతూ పోతే ఇది భౌతిక శాస్త్రంలో పాఠం అయిపోతుంది. బాంబు పేలే లోగా మీకు నిద్ర వచ్చెస్తుంది. కనుక టూకీగా తెముల్చుతాను. హీరోషిమా మీద పేలిన బాంబుని చెయ్యటానికి 100 పౌనుల స్వచ్ఛమైన తేలిక యురేనియంని వాడేరు ట. కనుక 100 పౌనుల స్వచ్ఛమైన తేలిక యురేనియం ఒక కుర్ర కుంకకి ఇచ్చి, వాడికో ఫిరంగిలాంటి పరికరం ఇస్తే బాంబు తయారు! ఫిరంగిలో సగం యురేనియం ముద్దని, ఎదట మిగిలిన సగాన్ని పెట్టి, గురి తప్పకుండా రెండు ముద్దలని ఢీకొట్టిస్తే అది పేలుతుంది.

ఇక్కడ కీలకమైనది కష్టమైనది ఏమిటంటే యురేనియంని శుద్ధి చేసి, విడదీయటం. సహజ సిద్దంగా గనులలో దొరికే యురేనియం ఖనిజంలో వెయ్యింట ఏడు పాళ్లు తేలిక యురేనియం ఉంటుంది. నూటికి నూరు పాళ్లు తేలిక యురేనియం ఉండేటట్లు దీనిని పరిపూర్ణంగా శుద్ధి చెయ్యాలి. రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికా వారు ఒక ఏడు శ్రమించి 100 పౌనుల శుద్ధ తేలిక యురేనియం ని కూడగట్టగలిగేరు. యుద్ధం అయిపోయిన తరువాత ఉష్ణ విసరణం (థెర్మల్ డిఫ్యూషన్, thermal diffusion) అనే పద్ధతి ఉపయోగించి, టెఫ్లాన్ తో వడపోసి శుద్ధి చేసే ప్రక్రియ కనుక్కున్నారు. ఇప్పుడు ఇంకా అధునాతనమైన ప్రక్రియలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనది అపకేంద్రయంత్రం (“సెంట్రిప్యూజు”) సహాయంతో చెయ్యటం పేరెన్నికగన్న పద్ధతి.

హీరీషిమా మీద పేల్చిన యురేనియం బాంబు దరిదాపు 5 టన్నుల బరువు ఉంటుంది. అందులో ఉన్న తేలిక యురేనియం 175 పౌనులు (లేదా 80 కిలోగ్రాములు). ఇందులో కేవలం 0.0015 పౌనుల (అంటే, 700 మిల్లీగ్రాములు లేదా 30 వడ్లగింజల బరువు) పదార్థమే శక్తిగా మారింది. పేలిన బాంబు 16,000 టన్నుల టి.ఎన్.టి. పేలినంత శక్తిని విడుదల చేసింది.

యురేనియం కంటె ప్లూటోనియంతో బాంబు నిర్మించటం తేలిక. ప్లూటోనియం కీలక గరిమ 13 పౌనులే. సీసమే సాంద్రమైన పదార్థం అనుకుంటే, ప్లూటోనియం సాంద్రత సీసానికి రెట్టింపు. ఇంత ఎక్కువ సాంద్రత ఉంది కనుక 13 పౌనుల ప్లూటోనియం 12 ఔన్సుల కోకాకోలా డబ్బాలో పట్టెస్తుంది. ఈ 13 పౌనుల ప్లూటోనియంలో ఉన్న ప్రతి అణువు పేలిపోతే 100 కిలోటన్నుల టి. ఎన్. టి. (TNT) పేలినంత శక్తి విడుదల అవుతుంది. అమెరికా అలమగొర్డొ లో ప్రయోగాత్మకంగా పేల్చినది పూర్తిగా పేలలేదు. బాంబులో పెట్టిన ప్లూటోనియంలో 20 శాతం మాత్రమే పేలింది. కనుక అది విడుదల చేసిన శక్తి కేవలం 20,000 టన్నుల టి. ఎన్. టి. తో సమానం. తరువాత్తరువాత అమెరికా, రష్యాలు పోటాపోటీగా పేల్చిన బాంబులతో పోల్చితే ఇది కేవలం సిసింద్రీ. ఈ సిసింద్రీ పేలుడు చూసేసరికే ఆపెన్‌హైమర్ కి గొంతుకలో తడారిపోయి, భగవద్గీతలో ఉన్న దివిసూర్య సహస్రస్య… అన్న శ్లోకం జ్ఞాపకం వచ్చేసింది ట.

Saturday, June 8, 2013

అణ్వస్త్రాలు


అణ్వస్త్రాలు

వేమూరి వేంకటేశ్వరరావు

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎంతో రహశ్యంగా, ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, ఎన్నో కష్టాలు పడి అమెరికా ప్రభుత్వం మూడు అణుబాంబులని నిర్మించింది. బాంబులు అనుకున్నట్టు పని చేస్తున్నాయో లేదో చూడటానికి వాటిల్లో ఒక దానిని నూ మెక్సికో రాష్ట్రంలో ఉన్న ఎడారిలో, అలమగోర్డో అనే చోట, ప్రయోగాత్మకంగా పేల్చి చూసేరు. రెండోదానిని జపానులోని హీరోషిమా నగరం మీద, మూడో దానిని నాగసాకి నగరం మీద పేల్చేరు. అలమగోర్డొ లో ప్రయోగాత్మకంగా పేల్చినది, నాగసాకి మీద పేల్చిన మూడోది ప్లూటోనియం తో చేసినవి; అందుకని వాటిని ప్లూటోనియం బాంబులు అని కూడ అంటారు. హీరోషిమా మీద పేల్చినది యురేనియంతో చేసేరు; కనుక దీనిని యురేనియం బాంబు అని కూడ అంటారు. ఈ రెండు రకాల బాంబుల తయారీలోను, రచన లోనూ, నిర్మాణ శిల్పం లోనూ మౌలికమైన తేడాలు ఉన్నాయి.

యురేనియంతో చేసే బాంబు నిర్మాణంలో ఉన్న కొన్ని సాధకబాధకాలని చూద్దాం. యురేనియంలో రెండు రకాలు ఉన్నాయి: బరువు యురేనియం, లేదా యు-238, తేలిక యురేనియం, లేదా యు-235. ప్రకృతిలో ఈ రెండు కలిసి దొరుకుతాయి; బరువు యురేనియం సమృద్ధిగా దొరుకుతుంది కాని బాంబుల నిర్మాణానికి పనికిరాదు. తేలిక యురేనియం చాల అరుదు; కాని బాంబులు చెయ్యాలంటే ఈ తేలిక యురేనియం కావాలి. కొండరాళ్లల్లో దాగున్న పిసరంత బంగారం కోసం కొండంతా తవ్వి, గుండ చేసి, ఆ గుండని నీళ్లల్లో పోసి, గాలించి, అందులోంచి బంగారం నలుసుని ఏరుకున్నట్లే బరువు యురేనియం నుండి తేలిక యురేనియం ని విడతియ్యాలి. రాళ్లల్లోంచి బంగారపు నలుసులని ఏరటమే తేలిక. ఈ రెండు రకాల యురేనియంల నుండి తేలిక యురేనియం విడదీయటం చాల శ్రమతో కూడిన పని. ఈ సమశ్యని భేదించి తేలిక యురేనియంని మొదట విడదీసిన ఘనత ఎర్నెస్ట్ లారెన్స్ అనే వ్యక్తికి దక్కింది.

లారెన్స్ ఏమి చేశాడంటే ఈ రెండు రకాల యురేనియం కలిసి ఉన్న ఖనిజాన్ని గుండ చేసి, దానిని వేడి చేసి, దానిని బాష్పంగా మార్చి, ఆ బాష్పాన్ని ఒక త్వరణిలో పెట్టి, ఆ త్వరణి చుట్టూ బలమైన అయస్కాంత క్షేత్రం సృష్టించేడు. ఈ అయస్కాంత క్షేత్రంలో జోరుగా ప్రయాణం చేస్తూన్న తేలిక యురేనియం యొక్క మార్గం ఒక పక్కకి ఒంగిపోతుంది, బరువుగా ఉన్న యురేనియం తిన్నగా వెళిపోతుంది. ఈ పద్ధతి ఉపయోగించి, కష్టపడి ఒక్క బాంబుకి సరిపడా తేలిక యురేనియంని విడదీశాడాయన. ఆ బాంబు హీరోషిమా మీద పడింది.

హిరోషిమా, నాగసాకిల మీద పడ్డ బాంబులతో జపాను లొంగిపోకుండా నిలదొక్కుకుని ఉండి ఉంటే పర్యవసానం ఎలాగుండేదో?

Saturday, June 1, 2013

అణు విద్యుత్తు


అణు విద్యుత్తు

వేమూరి వేంకటేశ్వరరావు

ఈ మధ్య పెద్ద సునామీ వచ్చి జపాను బాగా దెబ్బ తింది. బట్టతలవాడు ఎండ దెబ్బ తట్టుకోలేక తాటిచెట్టు నీడని నిలబడితే తాటిపండు నెత్తిమీద పడ్డాదిట. అలా వక్రించింది జపాను జాతకం.

ఎక్కడో సముద్రగర్భంలో భూకంపం వచ్చింది. ఆ ధాటికి అక్కడ భూమి గతక్కున దిగజారిపోయింది. భూమితోపాటు సముద్రంలోని నీరు ఆ అగాథంలోకి పడింది. దానితో సముద్రంలో పెద్ద కెరటం పుట్టింది. ఉవ్వెత్తున లేచిన కెరటం విమానం పరిగెట్టినంత జోరుతో పరుగు తీసి జపాను కోస్తా ప్రాంతాలమీద విరుచుకు పడింది. జనావాసాలు ములిగిపోయేయి. భారీగా ప్రాణ నష్టం వచ్చింది. నిజంగా ఎంత నష్టం వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. చాల మంది ఆ ఉప్పెనలో కొట్టుకుపోయారు. ఇంకా భారీగా ఆస్తి నష్టం వచ్చింది. ఇదంతా ప్రకృతి వైపరీత్యం తప్ప మానవుడు చేసిన తప్పు లేదు.

ఈ సునామీని ప్రేరేపించిన భూకంపం చిన్నదేమీకాదు. ఈ భూకంపానికి జపాను కోస్తాలో ఉన్న ఫుకుషిమా అనే ఊళ్లో ఉన్న అణు విద్యుత్ ఉత్పాదక కేద్రం దెబ్బతింది. ఎలా అని అడగరేం? భూకంపం తాకిడికి కేంద్రంలోని కాంక్రీటు కట్టడాలు బాగానే తట్టుకున్నాయి. సునామీ తెచ్చిన ముంపు వల్ల కూడ కట్టడాలకి హాని జరగలేదు. “రియాక్టర్” ని చల్లబరచటానికి వాడే నీటి పంపులని నడిపే యంత్రాంగానికి విద్యుత్ సరఫరా కావాలి కదా. ఆ సరఫరా చేసే వలయం దెబ్బ తింది. ఈ వలయానికి వెనక దన్నుగా మరొకదానిని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రాథమిక సూత్రం మరిచిపోయేరు. దానితో రియాక్టరుకి శీతలోపచారాలు చేసే కార్యక్రమం కుంటు పడింది. దాంతో “రియాక్టరు” వేడెక్కి కరిగిపోయి, లోపల ఉన్న వికిరణాన్ని బయటకి విడుదల చేసింది. దీనితో ఆ చుట్టుపట్ల 12 మైళ్లు దూరంలో ఉన్న జనావాసాలు ఖాళీ చెయ్యవలసి వచ్చింది. విపరీతమైన ధన నష్టం వచ్చింది. అసలే డబుల్ టైఫాయిడ్ వచ్చి బాధ పడుతూన్న వ్యక్తికి నుమోనియా కూడ వచ్చినట్లయింది ఈ ఫుకుషీమా దగ్గర. అయినా కేవలం వికిరణం తాకిడి వల్ల చచ్చిపోయిన వాళ్ల సంఖ్య ప్రస్తుతానికి అత్యల్పం.

జపానులో భూకంపాలు తరచు వస్తూ ఉంటాయి. భూకంపంతోపాటు సునామీ రావటం కొంచెం అరుదు. భూకంపం కంటె సునామీ ఎక్కువ హాని చేసింది. సునామీ వల్ల జరిగిన ప్రాణ నష్టంతో పోల్చి చూస్తే ఫుకుషిమా రియాక్టరు వల్ల జరిగిన ప్రాణ నష్టం అత్యల్పం. కాని వార్తలలో పతాక శీర్షిక అధిరోహించినది ఈ అణుశక్తి కేంద్రంలో జరిగిన ప్రమాదం.

భారతదేశంలో, రోడ్డు ప్రమాదాలలో, 2007 లో 1 లక్ష 14 వేల మంది, 2010 లో 1 లక్ష 30 వేల మంది చచ్చిపోయేరుట. ఈ గణాంకాలు చూసి రోడ్ల మీద ప్రయాణాలు మానుకుంటామా? ప్రయాణాలు ప్రమాదరహితంగా ఉండటానికి మంచి రోడ్లు ఉండాలి, మంచి కారులు ఉండాలి, చోదకులు బాధ్యతాయుతంగా కార్లు నడపాలి, వారిపై పోలీసు పర్యవేక్షణ ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలలో ప్రతి ఏటా దరిదాపు 1,000 మంది మాత్రమే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినా విమాన ప్రమాదం ప్రపంచంలో ఏ మూల జరిగినా పత్రికలలో పతాక శీర్షికే. ప్రపంచవ్యాప్తంగా, గత 60 సంవత్సరాలలో, అణు విద్యుత్ కేంద్రాలలో కేవలం 4 ప్రమాదాలు జరిగేయి. వీటిలో ప్రమాదం కారణంగా 66 మంది, సంబంధిత కారణాల వల్ల 4,000 మంది చచ్చిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదాలని సందర్భోచితమైన సమదృష్టితో చూసినప్పుడు ఉద్రేకరహితమైన అవగాహన ఏర్పడుతుంది.

భారతదేశం కూడ అగ్ర రాజ్యాలలో ఒకటిగా లెక్కింపబడాలంటే శక్తి వనరులకి ఇతరులమీద ఎక్కువగా ఆధారపడటం మంచిది కాదు. కాని ఖనిజ తైలాల, సహజ వాయువుల నిక్షిప్తాలు మన దేశంలో దరిదాపు పూజ్యం; ప్రపంచంలో ఉన్న నిక్షిప్తాలలో నూరింట ఒక పాలు మాత్రమే మనదేశంలో ఉన్నాయి. కాని, ప్రపంచంలో ఉన్న ప్రతి 100 మందిలో 17 మంది మన దేశంలోనే ఉన్నారు. మన దేశంలో ఉన్న శక్తి వనరులు అత్యల్పం కావటం వల్ల ఏటా 100 బిలియను డాలర్లు ఖర్చుపెట్టి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. ఇలా ఎన్నాళ్లు సాగుతుంది? ఎప్పటికయినా మన కాళ్ల మీద మనం నిలబడాలంటే కేవలం విద్యుత్ ఉత్పాదనకని శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం తగ్గించాలి. ఈ విధంగా విచారణ చేసి చూస్తే భారతదేశం అణు విద్యుత్తు మీద ఆధారపడటం తప్ప గత్యంతరం ఉన్నట్లు కనిపించటం లేదు. కనుక ఇప్పుడు బహిరంగ వేదికల మీద చర్చించవలసిన అంశం ఏమిటంటే “అణు విద్యుత్ కేంద్రాలని సురక్షితం చెయ్యటానికి ఏయే పనులు చెయ్యాలి?”

దేశ రక్షణ కోణం నూండి కూడ చూద్దాం. చైనా వద్ద 240 బాంబులు ఉన్నాయి; వీటిల్లో చాల మట్టుకు భారత పట్టణాలపై గురి పెట్టి ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 80 బాంబులు ఉన్నాయి; ఇవన్నీ ఇండియా మీదే గురిపెట్టి ఉన్నాయి. వాళ్లు ఆ మారణాయుధాలని మనమీద ప్రయోగించకుండా ఉండాలంటే మన దగ్గర అంతకంటె పెద్దవి, మంచివి ఉన్నాయని వాళ్లల్లో నమ్మకం కలిగించాలి. ఈ పని చెయ్యాలంటే అణు శక్తి మీద, అణు విద్యుత్తు మీద మనం అలా పరిశోధనలు చేస్తూనే ఉండాలి. మన పరిశోధనా ఫలితాలని ప్రపంచానికి చాటుతూ ఉండాలి.

విమాన ప్రయాణాలు ఇప్పుడు ఇంత సురక్షితంగా ఉండటానికి కారణం? ఏ మూల ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా “ఆ ప్రమాదానికి కారణం ఏమిటి? మళ్లా అటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ఏమిటి చెయ్యాలి?” అని ప్రశ్నలు లేవదీసి, వాటికి సమాధానాలు వెతికి తగు చర్యలు తీసుకోవటమే. అదే విధంగా అణు విద్యుత్ ని కూడ మచ్చిక చేసుకోవాలి కాని, జపాను లోను, ఉక్రెయిన్ లోను జరిగిన ప్రమాదాలని ఆసరాగా తీసుకుని “మాకు అణు విద్యుత్ కేంద్రాలేవద్దు” అని మంకు పట్టు పట్టి కూర్చుంటే వేసవి కాలంలో మనకి విసనకర్రలే శరణ్యం.