Sunday, June 16, 2013

అణు బాంబు చెయ్యటం ఎలా?


అణు బాంబు చెయ్యటం ఎలా?

వేమూరి వేంకటేశ్వరరావు

నిజానికి యురేనియం బాంబుని తయారు చెయ్యటం పెద్ద కష్టం ఏమీ కాదు: కల్తీ లేని రెండు తేలిక యురేనియం “ముద్దలు” తీసుకుని వాటిని ఒకదానితో మరొకటి జోరుగా ఢీకొనేటట్లు చెయ్యాలి, అంతే. ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అవి ఢీకొన్న తరువాత వాటి మొత్తం గరిమ యురేనియం యొక్క “కీలక గరిమ” ని మించాలి, అంతే. ఇక్కడ వివరాలు అన్నీ అరటి పండు ఒలిచినట్లు చెపుతూ పోతే ఇది భౌతిక శాస్త్రంలో పాఠం అయిపోతుంది. బాంబు పేలే లోగా మీకు నిద్ర వచ్చెస్తుంది. కనుక టూకీగా తెముల్చుతాను. హీరోషిమా మీద పేలిన బాంబుని చెయ్యటానికి 100 పౌనుల స్వచ్ఛమైన తేలిక యురేనియంని వాడేరు ట. కనుక 100 పౌనుల స్వచ్ఛమైన తేలిక యురేనియం ఒక కుర్ర కుంకకి ఇచ్చి, వాడికో ఫిరంగిలాంటి పరికరం ఇస్తే బాంబు తయారు! ఫిరంగిలో సగం యురేనియం ముద్దని, ఎదట మిగిలిన సగాన్ని పెట్టి, గురి తప్పకుండా రెండు ముద్దలని ఢీకొట్టిస్తే అది పేలుతుంది.

ఇక్కడ కీలకమైనది, కష్టమైనది ఏమిటంటే యురేనియంని శుద్ధి చేసి, విడదీయటం. సహజ సిద్దంగా గనులలో దొరికే యురేనియం ఖనిజంలో వెయ్యింట ఏడు పాళ్లు తేలిక యురేనియం (U-235) ఉంటుంది. నూటికి నూరు పాళ్లు తేలిక యురేనియం ఉండేటట్లు దీనిని పరిపూర్ణంగా శుద్ధి చెయ్యాలి. రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికా వారు ఒక ఏడు శ్రమించి 100 పౌనుల శుద్ధ తేలిక యురేనియం ని కూడగట్టగలిగేరు. యుద్ధం అయిపోయిన తరువాత ఉష్ణ విసరణం (థెర్మల్ డిఫ్యూషన్, thermal diffusion) అనే పద్ధతి ఉపయోగించి, టెఫ్లాన్ తో వడపోసి శుద్ధి చేసే ప్రక్రియ కనుక్కున్నారు. ఇప్పుడు ఇంకా అధునాతనమైన ప్రక్రియలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనది అపకేంద్రయంత్రం (“సెంట్రిప్యూజు”) సహాయంతో చెయ్యటం పేరెన్నికగన్న పద్ధతి.

హీరీషిమా మీద పేల్చిన యురేనియం బాంబు దరిదాపు 5 టన్నుల బరువు ఉంటుంది. అందులో ఉన్న తేలిక యురేనియం 175 పౌనులు (లేదా 80 కిలోగ్రాములు). ఇందులో కేవలం 0.0015 పౌనుల (అంటే, 700 మిల్లీగ్రాములు లేదా 30 వడ్లగింజల బరువు) పదార్థమే శక్తిగా మారింది. పేలిన బాంబు 16,000 టన్నుల టి.ఎన్.టి. పేలినంత శక్తిని విడుదల చేసింది.

యురేనియం కంటె ప్లూటోనియంతో బాంబు నిర్మించటం తేలిక. ప్లూటోనియం కీలక గరిమ 13 పౌనులే. సీసమే సాంద్రమైన పదార్థం అనుకుంటే, ప్లూటోనియం సాంద్రత సీసానికి రెట్టింపు. ఇంత ఎక్కువ సాంద్రత ఉంది కనుక 13 పౌనుల ప్లూటోనియం 12 ఔన్సుల కోకాకోలా డబ్బాలో పట్టెస్తుంది. ఈ 13 పౌనుల ప్లూటోనియంలో ఉన్న ప్రతి అణువు పేలిపోతే 100 కిలోటన్నుల టి. ఎన్. టి. (TNT) పేలినంత శక్తి విడుదల అవుతుంది. అమెరికా అలమగొర్డొ లో ప్రయోగాత్మకంగా పేల్చినది పూర్తిగా పేలలేదు. బాంబులో పెట్టిన ప్లూటోనియంలో 20 శాతం మాత్రమే పేలింది. కనుక అది విడుదల చేసిన శక్తి కేవలం 20,000 టన్నుల టి. ఎన్. టి. తో సమానం. తరువాత్తరువాత అమెరికా, రష్యాలు పోటాపోటీగా పేల్చిన బాంబులతో పోల్చితే ఇది కేవలం సిసింద్రీ. ఈ సిసింద్రీ పేలుడు చూసేసరికే ఆపెన్‌హైమర్ కి గొంతుకలో తడారిపోయి, భగవద్గీతలో ఉన్న దివిసూర్య సహస్రస్య… అన్న శ్లోకం జ్ఞాపకం వచ్చేసింది ట.

No comments:

Post a Comment