Saturday, March 30, 2013

అసలు ఆల్కహాలు, నకిలీ ఆల్కహాలు


అసలు ఆల్కహాలు, నకిలీ ఆల్కహాలు

వేమూరి వేంకటేశ్వరరావు

అమెరికాలో విచిత్రమైన చట్టాలు చాల ఉన్నాయి. మనుష్యులు తాగే ఆల్కహాలు “సహజసిద్దమైన” శాకాలు, పళ్లు, ధాన్యాలు, వగైరాలతోనే కాని కృత్రిమంగా రసాయన మంత్రాలు ఉపయోగించి సృష్టించినది కాకూడదు” అనే చట్టం ఒకటి ఉంది. సాధారణంగా మనం తాగే ఆల్కహాలు (కల్లు, సారా, విస్కీ, బ్రాందీ, జిన్ను, వాద్కా, వగైరాలన్నీ) చెట్ల నుండి లభించే పదార్ధాల ద్వారా చేస్తారు. అంటే తాటి నీరా, ద్రాక్ష, చెరకు, బియ్యం, బార్లీ, మొదలైనవి ముడి పదార్థాలుగా వాడతారు. వీటన్నిటిలోను మనకి మత్తెక్కించే అసలు పదార్థం పేరు ఆల్కహాలు. “ఒక సూర్యుండు సమస్థ జీవులకు తానొకొక్కడై తోచు పోలిక” అన్నట్లు ఈ ఒక్క ఆల్కహాలూ రకరకాల పేర్లతో, రకరకాల రంగులతో, రకరకాల ఆకారాలు ఉన్న సీసాలలో మనకి తారస పడుతూ ఉంటుంది. శాస్త్ర పరంగా ఆల్కహాళ్లల్లో రకాలు ఉన్నాయి కనుక నిర్దిష్టతకి మనకి కావలసిన ఆల్కహాలు పేరు ఎతల్ ఆల్కహాలు. సౌలభ్యానికి “ఆల్కహాలు” అని టూకీగా అనెద్దాం.

ఒక ఆల్కహాలు బణువులో (మోలిక్యూలు) ఎన్నెన్ని కర్బనపు అణువులు (ఏటం) ఉన్నాయో, ఉదజని అణువులు ఉన్నాయో, ఆమ్లజని అణువులు ఉన్నాయో మనకి తెలుసు. అంతే కాదు. ఈ అణువులు ఏ అమరికలో ఉన్నాయో తెలుసు. కనుక ప్రయోగశాలలో ఆయా అణువులని చేరదీసి మనకి కావలసిన విధంగా అమర్చితే మనకి చెట్ల అవసరం లేకుండా కృత్రిమంగా ఆల్కహాలుని సృష్టించగలిగే స్థోమత ఉంది. ఈ రోజుల్లో ఇదేమీ బ్రహ్మ విద్య కాదు. కర్రని పోలిన కర్రని సృష్టించవచ్చు. పట్టుని పోలిన పదార్థం నైలాన్ ని సృష్టించేము కదా. పట్టు చీరల కంటె నైలాను చీరలు చవక కూడా. అలాగే ఆల్కహాలుని పోలిన ఆల్కహాలుని ప్రయోగశాలలో సృష్టించవచ్చు. మూడొంతులు అసలు సరుకు కంటే చవగ్గా అమ్మ వచ్చు.

ఆల్కహాలుని ఇలా సృష్టించదలుచుకుంటే మనకి కావలసిన ముడి పదార్థం ముడి చమురు లేదా క్రూడ్ ఆయిల్. భూమి లోపల నుండి బయటకి తీసిన ముడి చమురుని అంశిక స్వేదనం (ఫ్రేక్షనల్ డిస్టిలేషన్) చేసి కిరసనాయిలు, పెట్రోలు, వగైరాలు తీసినట్లే ఆల్కహాలుని కూడ తయారు చెయ్య వచ్చు. ఈ పద్ధతిలో చేసిన ఆల్కహాలుని నకిలీ ఆల్కహాలు అని పిలుద్దాం. దినుసులని పులియబెట్టి చేసిన ఆల్కహాలుకీ, ఈ నకిలీ సరుకుకి రసాయనంగా కాని, రుచిలో కాని, వాసనలో గాని ఏమాత్రం తేడా ఉండదు. రెండింటిలో ఏది తాగినా ప్రాణానికేమీ అపాయం ఉండదు. రెండూ ఒకే మాదిరి “కిక్కు” ఇస్తాయి. అటువంటప్పుడు అమెరికాలో ప్రవేశపెట్టిన చట్టానికి కారణం? ఈ చట్టం వల్ల రెండు లాబీ వర్గాలకి లాభం ఉంది. బజారులో ఆల్కహాలు సరఫరా తక్కువగా ఉంటే ధర పెరిగి అందరికీ అందుబాటులో ఉండదు కనుక ప్రజలు తాగుడు తగ్గిస్తారు అన్న ఆశావాదుల లాబీ ఒకటి. ఖనిజపు చమురుకి సంబంధించిన వ్యాపార వర్గాల నుండి ఆల్కహాలు పోటీకి రాకపోతే “మందు” అమ్మే వ్యాపారులకి లాభదాయికం అనే ఆశించే వర్గం మరొకటి. అందుకని ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చినప్పుడు ఇరు పక్షాలవారూ సంతోషించేరు.

ఈ చట్టం అమలులో పెట్టటం ఎలా? “అసలు” ఆల్కహాలుకీ “నకిలీ” ఆల్కహాలుకీ తేడా లేకపోతే నకిలీ ఆల్కహాలుని తయారు చేసేవాళ్లని పట్టుకుని శిక్షించటం ఎలా? పోలీసులు భౌతిక శాస్త్రవేత్తలని సంప్రదించేరు. ఈ తేడాని పసిగట్టటానికి ఒకటే కీలక సూత్రం ఉంది. అసలు ఆల్కహాలుకి అతి కొద్ది మోతాదులో వికిరణ ఉత్తేజితం (“రేడియో ఏక్టివిటీ”) ఉంటుంది. ఇదెలాగంటే, అసలు ఆల్కహాలులో ఉన్న కర్బనం మొక్కలనుండి సంక్రమిస్తుంది కదా. మొక్కలలోకి కర్బనం వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు నుండి సంక్రమిస్తుంది. వాతావరణంలో ఉన్న కర్బనంలో అతి స్వల్ప మోతాదులో వికిరణ ఉత్తేజితమైన కర్బనం-14 (రేడియో ఏక్టివ్ కార్బన్-14”) ఉంటుంది. ఈ కర్బనం-14 ఉనికిని ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు పట్టుకోకలరు.

నేల లోంచి తీసిన రాతి చమురు (పెట్రోలియం) కూడ మొక్కల నుండి వచ్చినదే. కాని ఈ మొక్కలు ఎప్పుడో 100 మిలియను సంవత్సరాల కిందటి రోజుల్లో భూమి మీద బతికినవి. ఇవి చచ్చి, భూగర్భంలో పాతుకుపోయిన కొత్త రోజుల్లో ఇవి కూడ వికిరణ ఉత్తేజితాన్ని ప్రదర్శించే ఉంటాయి. కాని కర్బనం-14 అర్ధాయుస్షు 5,700 సంవత్సరాలు కనుక వాటి శక్తి ప్రతి 5,700 సంవత్సరాలకి సగం తగ్గుతూ 50 దశలలో, అనగా 300,000 సంవత్సరాలు గతించేసరికి, లేశం కూడ ఉండకుండా నశించిపోయి ఉంటాయి. అందుచేత రాతి చమురు (“క్రూడ్ ఆయిల్”) కి రేడియో ఏక్టివిటీ ఉండదు.

కల్తీ వ్యాపారం చేసే వాడి “శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు” ఉంటాయి. వాడు నల్ల బాజారులో కర్బనం-14 కొని నకిలీ ఆల్కహాలులో కలపొచ్చు. కాని బజారులో కర్బనం-14 కొనుక్కోవటం అంత సులభం కాదు. పోతే అసలు ఆల్కహాలుని కొద్దిగా నకిలీ ఆల్కహాలులో కలపొచ్చు. ఈ రకం “అవిడియాలు” కావాలంటే మా ఊరు వర్తకులని అడగండి, చెబుతారు. పప్పులోనూ, బియ్యంలోనూ కలపటానికి వీలయిన సైజులో రాళ్లు మా ఊరు దగ్గర ఉన్న పెంటకోట రేవు నుండే ఎగుమతి అయేవని చెబుతారు. ఈ నిజాయతీకి నిదర్శనంగా పెంటకోట సముద్రపుటోడ్డున శిధిలమయిన దీపస్తంభం ఒకటి ఉండేది – నా చిన్న తనంలో.

Saturday, March 23, 2013

సెల్ ఫోనులు


సెల్ ఫోనులు 

వేమూరి వేంకటేశ్వరరావు

ఈ మధ్య సెల్ ఫోనుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సా. శ. 2011 లో ఈ భూలోకం జనాభా 7 బిలియనులు (7,000,000,000) అయితే 5 బిలియనుల సెల్ ఫోనులు వాడకంలో ఉన్నాయిట.

ఇప్పుడిప్పుడే సెల్ ఫోనుల వల్ల కేన్సరు వ్యాధి వచ్చే ప్రమాదం ఉందేమో అని కొందరు అనుమానం పడుతూ ఉంటే ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.

ముందు మనందరికీ బాగా పరిచయం ఉన్న రేడియో, టెలివిషన్ వంటి ఉపకరణాలకీ సెల్ ఫోనుకీ మధ్య పోలికలు, తేడాలు చూద్దాం. రేడియో కేంద్రం ఎక్కడో ఉంటుంది. అక్కడ నుండి ప్రసారితమైన వాకేతాలని (సిగ్నల్, signal) మన ఇంట్లో ఉన్న రేడియో గ్రాహకి (రిసీవర్, receiver) అందుకుంటోంది. ఈ “డబ్బా” రేడియో వార్తలని అందుకోగలదు కాని పంపలేదు. ఆ వార్తలని అందుకోటానికి బయట వాకట్లో పొడుగాటి తీగని వేలాడగడతాం. ఈ తీగనే పూర్వం ఏరియల్ అనేవారు, ఇప్పుడు ఎంటెనా అంటున్నారు. ఇదే విధంగా వార్తలని పంపే రేడియో ప్రసారిణి (ట్రాన్స్‌మిటర్, transmitter) కూడ ఒక పొడుగాటి తీగని వాడుతుంది. ఈ తీగనీ ఎంటెనా అనే అంటారు. ఈ ఎంటెనాని ఎత్తయిన, బురుజులాంటి కట్టడం (టవర్, tower) మీద ప్రతిస్థాపిస్తారు.

సెల్ ఫోను రేడియో గ్రాహకిలా వాకేతాలనీ అందుకుంటుంది, రేడియో ప్రసారిణిలా వాకేతాలని పంపుతుంది. చేతిలో పట్టే ఉపకరణం కనుక పంపటానికి వాడే తీగ, అందుకోటానికి వాడే తీగ (ఎంటెనా) కూడ పొడుగ్గా, భారీగా కాకుండా, చిన్నగా ఉండి ఫోను లోపల ఇమడాలి. ఇలా అన్నిటిని కైవారంలో కుదించి, చేతిలో పట్టే ఉపకరణంగా చెయ్యాలంటే పొడుగాటి “రేడియో తరంగాలు” పనికిరావు; అందుకని పొట్టిగా ఉండేవి, శక్తిమంతమైనవి అయిన సూక్ష్మ తరంగాలు (మైక్రోవేవ్స్, microwaves) వాడతారు. మౌలికంగా అదీ సాధారణమైన రేడియోకి, సెల్ ఫోనుకి తేడా.

మరికొంచెం తరిచి లోతుకి వెళ్లి చూద్దాం. మానవులని బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అని వర్గాలుగా విడగొట్టినా మనం అంతా మనుష్యులమే కదా; వయస్సులో తేడా. అలాగే రేడియో తరంగాలన్నా, కాంతి తరంగాలన్నా, సూక్ష్మ తరంగాలన్నా, X-కిరణాలు అన్నా, గామా కిరణాలు అన్నా – ఇవన్నీ పేర్లలో తేడా మాత్రమే. ఈ పేర్లలో తేడా ఈ తరంగాల పొడుగుని బట్టి మారుతూ ఉంటుంది. రేడియో తరంగాలు పొడుగ్గా ఉంటాయి. కాంతి తరంగాలు అంతకంటె పొట్టి, సూక్ష్మ తరంగాలు ఇంకా పొట్టి. ఎక్స్-కిరణాలు మరికొంచెం పొట్టి, గామా కిరణాలు బాగా పొట్టి. అవసరాన్ని బట్టి వీటిని విడివిడిగా పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు లేకపోతే వీటన్నిటినీ కలగట్టి “విద్యుదయస్కాంత తరంగాలు” అని పిలవచ్చు.

“పొట్టి వాడికి పుట్టెడు బుద్ధులు” అన్నట్లు తరంగం పొట్టిగా ఉంటే దాంట్లో శక్తి ఎక్కువ ఉంటుంది. కనుక గామా కిరణాలు (ఇవీ తరంగాలే, సంప్రదాయికంగా కిరణాలు అని పిలుస్తారు) ఎంత శక్తిమంతమైనవి అంటే అవి మన శరీరాన్ని తాకితే చర్మం కాలిపోతుంది. ఎక్స్-కిరణాలు కూడ శక్తిమంతమైనవే. అందుకనే వైద్యుడు ఎక్స్-రే ఫొటోలు తీసేటప్పుడు చాల జాగ్రత్తలు తీసుకుంటాడు. కడుపులో ఉన్న పిండానికి ఎక్స్-కిరణాల తాకిడి మంచిది కాదు. ఇంకా పొడుగైన తరంగాలు అతినీలలోహిత కిరణాలు. ఇవి కంటికి కనబడవు కాని, మనం బయటకి ఎండలోకి వెళితే ఈ కిరణాల ప్రభావానికి శరీరం “కాలి” కమిలి పోతుంది. శీతల దేశాలలో ఉన్న తెల్లవాళ్లు శరీరం మరీ పాలిపోయినట్లు ఉంటే బాగుండదని ప్రత్యేకించి బీచికి వెళ్లి ఎండలో కూర్చుంటారు. అప్పుడు ఈ అతినీలలోహిత కిరణాల మోతాదు ఎక్కువైతే శరీరం కమిలిపోవటమే కాకుండా చర్మపు కేన్సరు వస్తుంది. ఇంకా పొడుగైన కిరణాలు కంటికి కనిపించే కాంతి. ఎండలోకి వెళ్లటం వల్ల మనకి ఏమి ప్రమాదం వస్తున్నాది? వేడికి ఒళ్లు చుర్రుమంటుంది. ఎండలో ఎక్కువ సేపు కూర్చుంటే ఒళ్లు కాలినా కాలుతుంది. ఇంకా పొడుగైనవి సూక్ష్మ తరంగాలు లేదా మైక్రోవేవ్స్. ఈ కిరణాలని ఉపయోగించి “సూక్ష్మతరంగ ఆవాలు” తయారు చేస్తున్నారు కదా. వీటిలో ఆహార పదార్థాలని వేడి చేసుకున్నప్పుడు ఆ ఆహారం 700 సెల్సియస్ డిగ్రీలవరకు వేడెక్కి పోతుంది. నీళ్లు 100 డిగ్రీల దగ్గర మరుగుతాయి కనుక 700 ఎంత వేడో మీరే ఊహించుకొండి. కనుక సూక్ష్మ తరంగాలు ఒంటికి తగిలితే ఒళ్లు కాలే ప్రమాదం ఉంది. ఇంకా పొడుగైనవి రేడియో తరంగాలు. వీటిని వాడటం మొదలుపెట్టి దరిదాపు ఒక శతాబ్దం అవుతోంది. వీటివల్ల ఆరోగ్యానికి భంగం అని ఎవ్వరు అనలేదు.

పైన ఉదహరించిన తరంగాలన్నిటిని కట్టకట్టి “విద్యుదయస్కాంత తరంగాలు” అని కాని “విద్యుదయస్కాంత వికిరణం” అని కాని అంటారు. ఈ కథనాన్ని బట్టి అన్ని వికిరణాలు ఆరోగ్యానికి హాని చెయ్యవు. శక్తిమంతమైనవే ప్రమాదం. ఈ శక్తిమంతమైన వాటిల్లో గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు ఎక్కువ ప్రమాదం. అతి నీలలోహిత తరంగాలు మరికొంచెం తక్కువ హాని చేస్తాయి. సూక్ష్మ తరంగాలు ఇంకా తక్కువ హానికరం. టెలివిషన్, రేడియో తరంగాలు, మన ఇళ్లకి విద్యుత్తు సరఫరా చేసే తీగలలో ప్రవహించే తరంగాలు సిద్ధాంతరీత్యా హాని చెయ్యటానికి వీలు లేదు.

ఇదే విషయాన్ని మరొక విధంగా చెబుతాను. గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు, అతి నీలలోహిత కిరణాల తాకిడి వల్ల కేన్సరు వంటి వ్యాధులు వస్తాయనటానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీటిల్లో శక్తి “మోలు ఒక్కంటికి 480 కిలోజూలులు” దాటి ఉంటుంది కనుక వీటి తాకిడి ధాటీకి తట్టుకోలేక మన శరీరంలోని రసాయన బంధాలు తెగిపోతాయి. ఆకుపచ్చ కాంతిలో శక్తి “మోలు ఒక్కంటికి 240 కిలోజూలులు” ఉంటుంది. ఈ శక్తికి మన కంటి రెటీనా లో ఉండే బంధాలు తెగవు కాని, చలించి ఒంగుతాయి. ఇలా ఒంగి నప్పుడు రెటీనా విద్యుత్ వాకేతాలని ఉత్పత్తి చేసి మెదడుకి పంపుతుంది. సెల్ ఫోనులో పుట్టే శక్తి “మోలు ఒక్కంటికి 0.001 కిలోజూలు కంటె తక్కువ. ఈ శక్తి కంటె ఆకుపచ్చ కాంతి పుట్టించే శక్తి 240,000 రెట్లు ఎక్కువ. ఈ శక్తి కంటె అతి నీలలోహిత కిరణాలు పుట్టించే శక్తి 480,000 రెట్లు ఎక్కువ.

ఈ లెక్క ప్రకారం సెల్ ఫోనులకి అపకారం చెయ్యగలిగే స్థోమతలేదు. ఎక్స్-కిరణాలకి అపకారం చేసే స్థోమత ఉన్నా వాటి వాడకం మానెస్తున్నామా? తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అతినీలలోహిత కిరణాలు హాని చేస్తాయని తెలుసు కనుక ఎండలోకి వెళ్లినప్పుడు ఒంటికి లేపనం పూసుకోవటం, చలవ కళ్లజోడు పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సెల్ ఫోనులు ప్రసరించే రేడియేషన్ వల్ల ప్రమాదం లేకపోయినా, సెల్ ఫోనుల విషయంలో కొన్ని మౌలికమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

మొదటి జాగ్రత్త. సెల్ ఫోనుని చేత్తో పట్టుకుని, చెవికి ఆనించి మాట్లాడటం కంటె ఫోనుని జేబులోనో, బల్లమీదో పెట్టుకుని, దాని నుండి ఒక తీగని చెవిదాకా తీసుకొచ్చి వినటానికి, మాట్లాడటానికీ సదుపాయం ఉంటే కొంత ఊరట. తలకీ, సెల్ ఫోనుకీ దూరం పెంచండి. అదే విధంగా, వీలయినప్పుడల్లా శరీరానికి, సెల్ ఫోనుకీ దూరం పెంచండి. ఈ జాగ్రత్తలకి కారణం సెల్ ఫోనులో ఉండే బేటరీ పేలిపోయి, కాలిపోయే సావకాశం ఉంది కనుక!!

రెండవ జాగ్రత్త. సెల్ ఫోను అందుబాటులో ఉంది కదా అని ఇరవైనాలుగు గంటలు అదే పనిగా దానిని చెవికి ఆనించి మాట్లాడటం కంటె, సెల్ ఫోను లోకాభిరామాయణానికి కాదని, అవసరం వెంబడి వార్తలని చేరవెయ్యటానికనీ గమనించి, క్లుప్తంగా వాడటం నేర్చుకోవాలి.

పై రెండు జాగ్రత్తల వల్ల సూక్ష్మ వికిరణ వల్ల ప్రాప్తించే హాని తగ్గుతుంది.

మూడో జాగ్రత్త. కారు, రైలు వంటి వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోను మీద మాట్లాడ వద్దు. నాకు తెలుసున్న వ్యక్తి, కుర్రాడు, నవీ ముంబాయిలో కారు తోలుతూ సెల్ ఫోనులో మైమరచి మాట్లాడుతూ ఎదురుగా వచ్చే బండిని చూసుకోకుండా గుద్దేసి నిష్కారణంగా అసువులు బాసేడు. బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు.Saturday, March 16, 2013

రేడియేషన్ అంటే ఏమిటి? రేడియో ఏక్టివిటీ అంటే ఏమిటి?


రేడియేషన్ అంటే ఏమిటి? రేడియో ఏక్టివిటీ అంటే ఏమిటి?

వేమూరి వేంకటేశ్వరరావు

రేడియేషన్ (radiation), రేడియో ఏక్టివ్ (radioactive), రేడియో (radio) అన్న మాటలలో పోలికలు ఉన్నా వాటి అర్థాలు వేర్వేరు.

ముందు ఆకాశవాణి వారి రేడియో లాంటి ఉపకరణం గురించి చెబుతాను. ట్రాన్సిస్టర్ రేడియో ని “ట్రాన్సిస్టర్” అనటం లేదూ అలాగే “రేడియో రిసీవర్” అన్న మాటని పూర్తిగా అనటానికి బద్దకించి కుదించగా “రేడియో” వచ్చింది.

రేడియో రిసీవర్ దేనిని “రిసీవ్” చేసుకుంటుంది? రేడియేషన్ ని!

రేడియేషన్ అంటే ఏమిటి?

బోగి మంట దగ్గర కూర్చున్నప్పుడు మనకి తగిలే వేడి, వెలుతురు “రేడియేషన్” అనే ప్రక్రియకి ఉదాహరణలు.
కిరణాల రూపంలో కాని, కెరటాల రూపంలో కాని ప్రసరించి ప్రయాణం చేసే శక్తి (energy) రేడియేషన్‌కి మరొక ఉదాహరణ.
ఈ ప్రక్రియకి రేడియేషన్ అన్న పేరు ఎందుకు పెట్టేరు?

ఒక కేద్రం నుండి “రేడియల్” దిశలలో ప్రవహిస్తుంది కనుక దీనిని “రేడియేషన్” అన్నారు. కేంద్రం నుండి పరిధికి గీసిన ఏ గీత అయినా సరే ఇంగ్లీషులో “రేడియస్” అనే పిలవబడుతుంది. ఈ నామవాచకం నుండి వచ్చిన విశేషణమే “రేడియల్”. కనుక ఒక కేంద్రం నుండి అన్ని దిశల వైపు ప్రవహించేది “రేడియేషన్”.

తెలుగులో “రేడియస్” ని వ్యాసార్ధం అంటాం. కాని ఈ మాట పైన చెప్పిన విధంగా రకరకాలుగా మలచటానికి లొంగలేదు. వ్యాసం (డయామీటర్, diameter) అనే మాట కొంచెం లొంగుతుంది. వ్యాప్తి చెందేది వ్యాసం కనుక, అన్ని దిశలలోకీ కిరణాలలా ప్రసరించే ఈ రేడియేషన్ అన్న మాట కి తెలుగులో “వ్యాకిరణం” అనొచ్చు. కాని సాంకేతిక పదాలు తయారు చేసిన వాళ్ల మతి మరో దిశలో ప్రవహించి ఉంటుంది. దీనికి “వికిరణం” అని పేరు పెట్టేరు. ఆన్ని పక్కలకి ప్రసరించేది కనుక దీన్ని “ప్రసారం” అని కూడ అనొచ్చు. కాని “ప్రసారం” అన్న మాటని బ్రాడ్‌కేస్టింగ్ (broadcasting) కి కేటాయించినట్లున్నారు.

“రేడియేషన్” అన్న మాటని భౌతిక శాస్త్రంలో వాడినప్పుడు ఈ ప్రవహించేది “శక్తి” అవుతుంది. ఈ శక్తి వేడి రూపంలో ఉంటే ఈ ప్రవాహం “హీట్ రేడియేషన్” లేదా “ఉష్ణ వికిరణం”. ఈ ప్రవహించేది కాంతి అయితే అది “కాంతి వికిరణం” (లైట్ రేడియేషన్, light radiation). ఈ ప్రవహించేది “మైక్రోవేవ్ తరంగాలు” అయితే ఇది “సూక్ష్మ తరంగ వికిరణం”.

మన ఆకాశవాణి వంటి రేడియో కేంద్రాలు, దూరదర్శని వంటి టెలివిషన్ కేంద్రాలు వార్తలని విశేషాలని ప్రసారం చేసేటప్పుడు స్టేషన్ నుండి అన్ని దిశలలోకి ప్రవహించేవి రేడియో తరంగాలు. ఇవీ వికిరణానికి ఉదాహరణే.

రేడియేషన్ అన్న మాటని సాధారణమైన అర్థంతో కూడ వాడవచ్చు. ఆత్మవిశ్వాసంతో పిటపిటలాడుతూన్న వ్యక్తిని ఇంగ్లీషులో “రేడియేటింగ్ కాన్‌ఫిడెన్స్” అంటాం.

రేడియేషన్ అన్న మాట అర్థం అయింది కనుక ఇప్పుడు “రేడియో ఏక్టివ్” అన్న మాటకి అర్థం ఏమిటో చూద్దాం. ముందుగా మనం వార్తలు వినే “రేడియో” కి మనం ఇక్కడ మాట్లాడుతూన్న “రేడియో ఏక్టివిటీ” కి ఉంటే గింటే ఏదో బాదరాయణ సంబంధం పీకితే పీకొచ్చునేమో కాని, దగ్గర సంబంధం లేదు అని గమనించండి.

కొన్ని పదార్థాలు, ప్రత్యేకించి వాటి అణు కేంద్రకంలో అస్థిర నిశ్చలత ఉన్నవి, అకస్మాత్తుగా, బాహ్య శక్తుల ప్రోద్బలం లేకుండా వికిరణాన్ని విడుదల చేస్తాయి. ఇలా విడుదల చెయ్యబడ్డ వికిరణంలో సర్వసాధారణంగా ఆల్ఫా రేణువులు, ఎలక్‌ట్రానులు, కేంద్రకంలో ఉండే నూట్రానుల వంటి పరమాణు రేణువులు, గామా కిరణాలు వంటివి ఉంటాయి. ఈ జాతి పదార్థాలని “వికిరణలో చలాకీ తనం చూపించేవి” అని అంటారు. “వికిరణలో చలాకీతనం” అంటే ఏమిటి? బాహ్య శక్తుల ప్రమేయం లేకుండా, వాటి అణుగర్భాలలో ఉన్న అస్థిరత వల్ల విచ్ఛిన్నం అయిపోయి, ఆ విచ్ఛిత్తిలో కొన్ని అణుశకలాలు బయట పడటం. ఈ రకం పదార్థాలని ఇంగ్లీషులో “రేడియో ఏక్టివ్” (radio active) అంటారు. అంటే, వికిరణలో ఉత్తేజం చూపించే పదార్థాలు అని అర్థం. దీనికి తెలుగు మాట “వికిరణ ఉత్తేజిత పదార్థం.” మన నిఘంటువులలో దీనిని “రేడియో ధార్మిక పదార్థం” అని తెలిగించేరు. మీరే చెప్పండి, ఈ రెండింటిలో ఏ అనువాదం వివరణాత్మకంగా ఉందో.

“రేడియేషన్” అన్నా “రేడియో ఏక్టివ్” అన్న మాట విన్నా మనకి అణు బాంబులు, అణు విద్యుత్ కేంద్రాలలో ప్రమాదాలు, కేన్సరు వ్యాధి, మొదలైన భయంకరమైన విషయాలు మనస్సులో మెదులుతాయి. కాని పైన ఇచ్చిన వివరణ చదివిన తరువాత ఈ రెండూ ప్రకృతిలో సహజ సిద్ధమైన ప్రక్రియలే కాని ప్రత్యేకించి ప్రమాదమైనవి కావని తెలుస్తూనే ఉంది కదా. ఏదైన శృతి మించినా, మితి మీరినా ప్రమాదమే. మితిమీరితే అన్ని రకాల వికిరణలూ ప్రమాదమే. బోగి మంటకి మరీ దగ్గరగా వెళితే ఒళ్లు కాలదూ?
నిజానికి మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా వికిరణ ఉత్తేజిత పదార్థంతో నిండి ఉంది అని చెబితే నమ్మగలరా? వాతావరణానికి ఈ వికిరణ ఉత్తేజితం ఎక్కడినుండి వచ్చింది? రోదసి లోతుల్లోంచి వచ్చే అతి శక్తిమంతమైన కాస్మిక్ కిరణాలు మన వాతావరణంలోని నత్రజని అణువులని ఢీకొన్నప్పుడు వాటిల్లో కొన్ని రూపాంతరం చెంది “కార్బన్-14” గా మారతాయి. ఈ కార్బన్-14 ఒక వికిరణ ఉత్తేజిత పదార్థం. అందుకనే దీనిని ఇంగ్లీషులో “రేడియో కార్బన్” అని కూడ అంటారు. మనం “ఉత్తేజిత కర్బనం” అందాం. దీనినే “సి-14” (C-14) అని కూడ పిలుస్తారు.

మన వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) కూడ ఉంటుంది కదా. ఈ కార్బన్ డై ఆక్సైడ్ బణువు (మోలిక్యూల్, molecule) తయారయినప్పుడు అందులోకి ఈ కార్బన్-14 ప్రవేశించే సావకాశం ఉంది. ఒక ట్రిలియను (1,000,000,000,000) కార్బన్ డై ఆక్సైడ్ బణువులని పరీక్షించి చూస్తే వాటిల్లో ఒక బణువులో ఈ కార్బన్-14 అణువు ఉండే సావకాశం ఉంది. అంటే ఉత్తేజిత కర్బనం గాలి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందన్న మాటే కదా?

భూమి మీద ఉన్న వృక్ష సామ్రాజ్యం అంతా కిరణజన్య సంయోగక్రియ కొరకు వాతావరణంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ని పీల్చుకుంటాయని చిన్నప్పుడే చదువుకున్నాం కదా. ఈ ప్రక్రియలో చెట్లు కొంత ఉత్తేజిత కర్బనాన్ని కూడ పీల్చుకుంటాయి. కనుక చెట్లన్నీ వికిరణ ఉత్తేజితాలే! (“రేడియో ఏక్టివ్”). ఆ చెట్లని మేసిన జంతువులు కూడ వికిరణ ఉత్తేజితాలే! ఆ చెట్లని కాని, జంతువులని కాని తిన్న మానవులూ వికిరణ ఉత్తేజితానికి నిత్యం గురి అవుతూనే ఉంటున్నారు. దీనిని మనం నేపథ్య వికిరణం (బేక్‌గ్రౌండ్ రేడియేషన్) అనొచ్చు.

మనం (చెట్లు, జంతువులు, మనుష్యులు) మరణించినప్పుడు, గాలి పీల్చటం మానెస్తాము కనుక, ఈ వికిరణ ఉత్తేజితం పేరుక్నటం మాని నశించటం మొదలుపెడుతుంది. కాల చక్రం 5,700 సంవత్సరాలు తిరిగేటప్పటికి ఈ వికిరణ ఉత్తేజితంలో సగం భాగం నశిస్తుంది. అందుకనే ఈ 5,700 సంవత్సరాల కాలాన్ని కర్బనం-14 యొక్క అర్ధాయుష్షు (హాఫ్ లైఫ్, half-life) అంటారు. ఒక చెట్టు అవశేషాలలో కాని, ఒక జంతువు యొక్క అవశేషాలలో కాని కర్బనం-14 కి సంబంధించిన వికిరణ ఉత్తేజితం ఇంకా ఎంత మిగిలి ఉందో తెలిస్తే ఆ చెట్టు ఎన్నాళ్ల క్రితం చచ్చిపోయిందో లెక్క కట్టి చెప్పొచ్చు. ఉదాహరణకి కర్బనం-14 లో ఉన్న వికిరణ ఉత్తేజితం పరిపూర్ణంగా నశించిపోవటానికి 50 అర్ధాయుష్షుల కాలం పడుతుంది. అంటే, ఒక ప్రాణి చచ్చిపోయిన తరువాత ఆ ప్రాణి అవశేషాలలో 300,000 సంవత్సరాలపాటు ఈ వికిరణ ఉత్తేజితం ఉంటుంది.


Sunday, March 10, 2013

హోలోగ్రాములు


హోలోగ్రాములు

వేమూరి వేంకటేశ్వరరావు

హోలోగ్రాము అంటే ఏమిటో కొంతవరకు వర్ణించి చెప్పవచ్చు కాని అంతా చెప్పటం కష్టం; చూడాలి అంతే. ఇక్కడ కాగితం మీద చూపించే సావకాశం లేదు కనుక వీలయినంత వరకు వర్ణించి ప్రయత్నం చేస్తాను. మంచి హోలోగ్రాము చూడాలంటే ఏ సైన్సు ప్రదర్శనకో వెళ్లి చూడండి. ఏదో దేశవాళీ హోలోగ్రాము చూడాలనుకుంటే మీ జేబులో ఉన్న క్రెడిట్ కార్డ్ మీద తళతళలాడే చిన్న బొమ్మని చూడండి.

గ్రీకు భాషలో “హోలో” అంటే పూర్తి, “గ్రామోస్” అంటే సందేశం (మెసేజ్, message), కనుక హోలోగ్రాం అంటే పరిపూర్ణమైన సందేశం. గ్రామఫోన్ లేదా ఫోనోగ్రాం అంటే “శబ్ద సందేశం”. ఈ లెక్కని “సినఫోగ్రాం” అంటే మేఘసందేశం. ఇదే విధంగా ఇంగ్లీషులో “హోలోగ్రాఫిక్ విల్” అంటే పరిపూర్ణమైన వీలునామా. పరిపూర్ణమైన అంటే వీలునామా అంతా – పత్రము, సంతకము, అంతా - చేవ్రాలుతో ఉన్నదని అర్థం. కనుక ఒక “మూర్తి” యొక్క హోలోగ్రాము ఆ మూర్తి ఆకారానికి పరిపూర్ణమైన పునఃసృష్టి. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు అసలు ముఖానికి ప్రతిబింబానికి పరిపూర్ణమైన పోలికలు ఉండటం లేదూ. అద్దం వెనక్కి చెయ్యి పెట్టి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కాని మన ముఖంలో ఉన్న సమస్త కళలు ఆ ప్రతిబింబంలో ఉంటాయి. అద్దంలో ప్రతిబింబాన్ని చూసి ఎవరూ ఆశ్చర్యపోరు; ఎందుకంటే అది మనకి అలవాటు అయిపోయింది కనుక! కనుక ఒక విధంగా అద్దంలో కనిపించే ప్రతిబింబం హోలోగ్రాముకి ఉదాహరణగా అనుకోవచ్చు.

సినిమా తెర మీద చూసిన బొమ్మలు పల్చగా, అప్పడాలులా, కదలాడుతూ ఉంటాయి కాని వాటికి లోతు (మందం) ఉండదు. అంటే, ఈ బొమ్మలకి పొడుగు, వెడల్పు ఉంటాయి కాని లోతు ఉండదు. శిల్పాలకి, విగ్రహాలకి పొడుగు, వెడల్పు, లోతు ఉంటాయి కాని అవి కదలాడవు. మనని ముమ్మూర్తులా పోలి, పొడుగు, వెడల్పు, లోతు ఉన్నవి, మన కదలికలని అనుసరిస్తూ కదలాడేవి కావాలంటే హోలోగ్రాము తయారు చెయ్యాలి. హోలోగ్రాముని చూసినప్పుడు అసలేదో, నకిలీ ఎదో తెలియదు. దగ్గరకెళ్లి పట్టుకుందామంటే అసలుది చేతికి చిక్కుతుంది కాని నకిలీది పట్టుకి దొరకదు.

బల్లపరుపుగా ఉన్న సమతలం మీద పొడుగు, వెడల్పు, లోతు కనిపించే విధంగా ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ప్రక్షేపిస్తే (ప్రొజెక్టు చేస్తే) దానిని హోలోగ్రాము అంటారు. ఈ ప్రక్షేపణ (ప్రొజెక్షన్, projection) తెర లాంటి సమతలం మీద జరగాలని నియమం లేదు. ఖాళీగా ఉన్న ప్రదేశం మీదకి కూడ ప్రక్షేపించవచ్చు. అప్పుడు ఎదురుగా, “గాలిలో”, ఏ అలంబనం లేకుండా, మూడు దిశలలో వ్యాప్తి చెందిన విగ్రహమూర్తి కనబడుతుంది. ఆ విగ్రహమూర్తికి ఫొటో తీస్తే మామూలు ఫొటోలాగే వస్తుంది. కాని ఆ విగ్రహమూర్తి కనిపిస్తూన్న చోట చెయ్యి పెట్టి తడిమితే ఏమీ తగలదు. ఇది ఒక రకం హోలోగ్రాము. క్రెడిట్ కార్డులమీద కనిపించే హోలోగ్రాము మరొక రకం.

హోలోగ్రాముని ఎలా చేస్తారో, అది పనిచేసే విధానంలోని కిటుకు ఏమిటో తరువాత చూద్దాం. ప్రస్తుతానికి, హోలోగ్రాము ఉపయోగం ఒకటి చెబుతాను. ఆలోచించి చూడండి.

తిరుపతి కొండ ఎక్కి వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకోవటం ఎంత ప్రయాసతో కూడిన పనో భక్తులకి నేను వేరే చెప్పక్కరలేదు. పదేళ్ల క్రితం, ఎవ్వరి సహాయం లేకుండా, ఏ పలుకుబడి ఉపయోగించకుండా, మద్రాసులో తెల్లవారు ఝామున ఒకరు బస్సు ఎక్కించి, ప్రత్యేక దర్శనం అని చెప్పి టికెట్టు కొనిచ్చి పంపెరు. వరసలో 12 గంటల పాటు నిలబడవలసి వచ్చింది. ఊపిరి తిరగని ఆ కొట్టు గదులలో, ఆ కూపాలలో, శిక్షించబడ్డ నేరస్తుడిలా నిలబడి, ఏ పాపం చేసి ఈ పొరపాటు చేసి దర్శనానికి వచ్చేనురా దేవుడా అని నన్ను నేనే తీట్టుకుని, రాత్రి 10 గంటలకి వరసలోంచి బయట పడి, బస్సు ఎక్కి మద్రాసు తిరిగి చేరుకునే సరికి రాత్రి రెండు అయింది. దర్శనం ఒక్క క్షణమే. స్వామివారి విగ్రహాన్ని అల్లంత దూరంలోంచి తప్ప దగ్గరగా చూడటమే అవలేదు. “కదలండి, కదలండి” అని ఒకటే గోల. దేవుడు సర్వాంతర్యామి కదా. ఈ కొండ ఎక్కే చూడాలా? ఈ తొడతొక్కిడిలో, అనారోగ్యకరమైన పరిస్థితులలో, ఈ దర్శనం ఎందుకు అనిపించింది. అప్పుడు ఒక తరుణోపాయం తట్టింది.

స్వామి వారి గర్భగుడికి, విగ్రహానికి, ఆ విగ్రహం చుట్టూ ఉన్న సామగ్రికి, విగ్రహం పాదాల దగ్గర కూర్చున్న అర్చక స్వాములకి – ఆ వాతావరణం అంతటికి - హోలోగ్రాము తీసి నాలుగైదు చోట్ల ప్రక్షేపించి, మైలు పైగా పొడుగున్న ఆ వరసలని నాలుగైదు వరసలుగా విడగొడితే వేచి ఉండే సమయమూ తగ్గించవచ్చు. దర్శన సమయం పెంచ వచ్చు. తొడతొక్కిడి తగ్గించవచ్చు. కొండ ఎక్కటానికి అనుకూలపడని వారికి దిగువ తిరుపతిలోనే దర్శనభాగ్యం కలిగించవచ్చు. భక్తులకోసం స్వామి ఎన్ని సార్లు కొండ దిగి రాలేదు? గోపికలకోసం ఒకే కృష్ణుడు విడివిడిగా కనిపించేడు కదా. అమెరికాలో, మా ఊళ్లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనం చేసుకుందికి వెళ్లినప్పుడు “నా ఎదట ఉన్నది నకిలీ స్వామి, అసలు స్వామి తిరపతిలో ఉన్నాడు” అని ఏనాడైనా నేను అనుకున్నానా? భక్తుల సంఖ్య ఘాతీయంగా (ఎక్స్పొనెన్షియల్, exponential) పెరిగిపోతూన్న ఈ రోజుల్లో సాంకేతిక పరిష్కారాలమీద ఆగమ శాస్త్రాలు మాత్రం శీతకన్ను ఎందుకు వేస్తాయి?

దగ్గరకెళ్ళి చేత్తో తడిమి చూస్తే కాని అసలుకి, హోలోగ్రాముకీ తేడా తెలియదు. మనని ఎలాగూ గర్భగుడిలోకి వెళ్లి విగ్రహాన్ని ముట్టుకోనివ్వరు, పూజలు చెయ్యనివ్వరు, హారతులివ్వనివ్వరు. దూరం నుండి దర్శనం చేసుకోటానికి రాతి విగ్రహం అయితేనేమిటి, గాలి విగ్రహం అయితేనేమిటి? వినాయకుడి బొమ్మని శక్తిని బట్టి బంగారంతో చెయ్యవచ్చు, వెండితో చెయ్యవచ్చు, మట్టితో చెయ్యవచ్చు, ఆఖరికి పసుపుతో చెయ్యవచ్చు. శివలింగాలు కూడ అన్ని పదార్థాలతోటీ చెయ్యవచ్చు. జ్యోతిర్లింగం అంటే ఏమిటి?

ఈ రోజుల్లో హోలోగ్రాములని లేసరు కాంతితో చేస్తున్నారు. కనుక హోలోగ్రాము అంటే కాంతి విగ్రహం, జ్యోతిర్‌విగ్రహం.

Sunday, March 3, 2013

ఉప్పెన, టైడల్ వేవ్, సునామీఉప్పెన, టైడల్ వేవ్, సునామీ

వేమూరి వేంకటేశ్వరరావు

రక్తాక్షి నామ సంవత్సరంలో బందరులో ఉప్పెన వచ్చిందని చెప్పేవారు. ఉప్పెన అంటే సముద్రం చెలియలికట్టని దాటి జనావాసాలని ముంచెయ్యటం. బందరు ఊరంతా ములిగిపోయిందనీ, రెండో అంతస్తు మేడలు మాత్రం ములగకుండా మిగిలేయని విన్నాను. సాక్షులు ఇప్పుడు దొరకరు కనుక వినికిడి కబుర్లే నిజం అనుకోవాలి.

కాకినాడ ఇంజనీరింగు కాలేజీ పెరట్లో, సరుగుడు తోటలకి అవతల, రెండు కిలోమీటర్లు దూరంలో సముద్రం ఉంది. నేను చదువుకునే రోజుల్లో, ఒకనాడు రాత్రి “టైడల్ వేవ్ వస్తోంది” అన్న గాలి వార్త విని చాల మంది కుర్రాళ్లు హాస్టల్ ఒదిలిపెట్టేసి పై ఊళ్లు వెళ్లిపోయేరు. తెల్లారి లేచి చూసుకుంటే టైడల్ వేవూ రాలేదు, చిట్టి కెరటమూ రాలేదని తేలింది.

ఈ మధ్య హిందూమహాసముద్రంలో సునామీ వచ్చి తమిళనాడు దక్షిణ కోస్తా బాగా దెబ్బ తింది. దీని బీభత్సాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు చూసేరు కనుక ఇక్కడ ప్రత్యేకించి వివరణ రాయక్కరలేదు.

నేను అమెరికా వచ్చిన కొత్త రోజుల్లో, అనగా 1961 ప్రాంతాలలో, అమెరికాలో టైడల్ వేవ్ అన్న మాటే వాడుకలో ఉండేది. మొదటిసారి సునామీ అన్న మాట పరిశోధన పత్రాలలో 1976 లో చూసేను. జపానీ భాషలో సునామీ అంటే “రేవులని ముంచేసే పెద్ద కెరటం” అని అర్థం. మనకి ఇంగ్లీషు మాటలు వాడటం అంటే ఎంత వ్యామోహమో అలాగే ఇంగ్లీషు మాతృభాషగా ఉన్న వాళ్లకి విదేశీ మాటల మీద మోజు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపానుకీ అమెరికాకి సత్సంబంధాలు, రాకపోకలు పెరగటంతో జపానీతో పరిచయం పెరిగి ఈ “సునామీ” ఇంగ్లీషులో ప్రవేశించి, “టైడల్ వేవ్” ని వాడుకలోంచి తప్పించింది. మన టెలుగూస్ కి ఇంగ్లీషు మీద వ్యామోహం కదా. ఇంగ్లీషు వార్తా పత్రికలలో సునామీ అన్న మాట చూసి ఉప్పెనని పక్కకి నెట్టేసి మనమూ సునామీ అనే అంటున్నాం.

వాడకపోతే పోయేరు, “అసలు టైడల్ వేవ్ అన్న మాటే తప్పు ప్రయోగం, అది వాడకూడదు, సునామీ అన్నదే సరి అయిన ప్రయోగం” అని కొందరు వాదించటం మొదలుపెట్టేరు. ఈ వాదనలో ఉద్రేకం ఉందేమో కాని ఊపు లేదు. టైడ్స్ ని పోలినది, కెరటంలా జోరుగా వచ్చేది కనుక దీనికి ఇంగ్లీషులో టైడల్ వేవ్ అని పేరొచ్చింది. ఈ వ్యవహారం పూర్తిగా అర్థం కావాలంటే మనం వాడే భాషలోని మాటలకి నిర్దిష్టమైన అర్థాలు తెలియాలి.

ఇంగ్లీషులో టైడ్స్ అంటే సముద్రంలో వచ్చే ఆటుపోటులు. ఇవి కెరటాలు కావు; కెరటాలలా జోరుగా వచ్చి ఒడ్డుకి కొట్టుకోవు. టైడ్స్ అంటే ఒక రకమైన “పొంగు” (ఫోటు), “తీత” (ఆటు). నా చిన్నతనంలో “సముద్రం పొంగుతోంది” అనే వారు. అంటే సముద్రపు నీటి మట్టం పైకి లేస్తోంది అని అర్థం. గట్టు తెగిన గోదావరి పొంగులా జోరుగా కాకుండా నెమ్మదిగా సముద్రమట్టం లేస్తుంది; రోజుకి రెండు సార్లు లేస్తుంది. లేచిన మట్టం మళ్లా తరుగుతుంది. ఈ పొంగునే పోటు అనీ, తీతని ఆటు అనీ అంటాం. ఈ ఆటుపోట్లు ఏ వేళప్పుడు వస్తాయో లెక్క కట్టి చెప్పవచ్చు. ఈ సమాచారాన్ని వాడుకుని రేవులోకి పడవలు ఎప్పుడు వస్తే సదుపాయంగా ఉంటుందో నావికులు నిర్ణయిస్తారు.

ఆటుపోట్ల వల్ల సముద్రమట్టం లేచినప్పుడు సముద్రం ముందుకి వస్తుంది, పడినప్పుడు వెనక్కి వెళుతుంది. ఇలా ఎంత ముందుకి వస్తుంది, ఎంత వెనక్కి వెళుతుంది అనేది ఆ ప్రదేశం యొక్క భౌగోళిక అమరిక మీద కొంతా, ఆ రోజు పౌర్ణమా, అమావాశ్యా, గ్రహణమా అనే ఖగోళ పరిస్థితుల మీద కొంతా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే ఈ ఆటుపోట్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు కావు. టూకీగా ఇదీ టైడ్స్ కథ.

పోతే, టైడల్ వేవ్ అనేది పెద్ద కొండెత్తు కెరటం. ఇది చెలియలికట్టని దాటి, ఊళ్లో పడుతుంది. కనుక టైడల్ వేవ్ అన్నా, సునామీ అన్నా, ఉప్పెన అన్నా ఒక్కటే – అని నా నమ్మకం.

ఇంతకీ సునామీ లేదా ఉప్పెన అంటే ఏమిటి? మొదటగా, ఇది చాల జోరుగా ప్రయాణం చేసే కెరటం. ఇది చాల “పొడవైన” కెరటం. ఇక్కడ “జోరు”, “పొడవు”, “కెరటం” అన్న మాటలకి నిర్దిష్టమైన అర్థాలు ఉన్నాయి. కొంచెం శాస్త్రం, పరిభాష ఉపయోగించి చెప్పటం అవసరం. మనకి తెలుగులో అల, కెరటం, తరంగం అనే మాటలు వాడుకలో ఉన్నాయి. నిర్ధిష్టత కోసం వీటికి శాస్త్రీయమైన అర్థాలు ఇద్దాం. సముద్రపుటొడ్డున నిలబడి చూస్తూ ఉంటే నీరు ఉవ్వెత్తున పైకి లేచి, విరిగి పడుతూ ఉంటుంది. అలా పైకి లేచినప్పుడు దాని గరిష్ఠ ఊర్ధ్వభాగానికి “శిఖ” అని పేరు పెడదాం. ఈ శిఖ వెనక నీటి మట్టం లోతుగా దిగిపోతుంది. ఇక్కడ గరిష్ఠ అధో భాగానికి “గర్త” అని పేరు పెడదాం. ఒక శిఖ, ఒక గర్త ఆక్రమించిన ప్రాంతాన్ని కెరటం అందాం. మరి కొంచెం విశదంగా చెబుతాను. “కెరటం” అంటే ఒక విశ్రమ స్థానం నుండి (నీటి) మట్టం పైకి లేచి, గరిష్ఠ పరిమితి చేరుకుని, కిందకి దిగి, కనిష్ఠ పరిమితి చేరుకుని మళ్లా విశ్రమ స్థానాన్ని చేరుకున్న మేర. ఈ కెరటం వెనక మరో కెరటం వస్తుంది. దానికీ శిఖ, గర్త ఉంటాయి. ఇలా నిర్విరామంగా వచ్చే కెరటాల సమాహారాన్ని “తరంగం” అందాం. ఒక తరంగంలో ఒక శిఖ నుండి దాని వెనక వచ్చే శిఖ కి మధ్య దూరాన్ని ఆ తరంగం “పొడుగు” అంటారు. దీన్నే మన వాళ్లు తరంగ దైర్ఘ్యం అని పాఠ్య పుస్తకాలలో అంటున్నారు. మనం “తరంగం పొడుగు” అనేసి ఊరుకుందాం. దీనినే ఇంగ్లీషులో వేవ్ లెంగ్త్ (wave length) అంటారు.

ప్రతి తరంగానికి పొడుగు (wavelength), డోలన వ్యాప్తి లేక ప్రవర్ధమానం లేక ఎత్తు (amplitude) ఉంటాయి. సాధారణంగా సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే ఈ ఎత్తు సుమారు రెండో, మూడో మీటర్లు ఉంటుంది. పొడుగు మహా ఉంటే 50 మీటర్లు ఉండొచ్చు. కాని ఇది సునామీ అయితే ఆ కెరటం ఎత్తు సుమారు 10 మీటర్లు (30 అడుగులు), పొడుగు సుమారు 15 కిలోమీటర్లు ఉంటాయి.

సునామీ సముద్రం మధ్యలో ఎక్కడో పుట్టి గంటకి సుమారు 500 కిలోమీటర్ల వేగంతో (అంటే విమానం వేగంతో) ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎదట గర్త, దాని వెనక శిఖ ఉంటాయి కనుక ఒడ్డున ఉండి చూసేవాళ్లకి ముందస్తుగా గర్త తగులుతుంది. అందువల్ల సముద్రం బాగా వెనక్కి వెళ్లిపోతూ కనిపిస్తుంది. దాని వెనక ఎక్కడో 15 కిలోమీటర్లు దూరంలో కొండంత ఎత్తు ఉన్న శిఖ జోరుగా వస్తోందన్న విషయం ఒడ్డున ఉన్న వ్యక్తికి ఎలా తెలుస్తుంది? తెలియదు. అమాయకంగా సముద్రం ఎందుకు వెనక్కి తగ్గిపోతోందా అని ఆశ్చర్యపడి కళ్లప్పగించి చూస్తూ ఉంటాడు. ఆ వెనక నుండి విమానం జోరుతో వస్తూన్న శిఖ ఒడ్డు చేరుకోడానికి 2 నిమిషాలు కూడ పట్టదు. ఆ వచ్చే కెరటం ఎత్తు 10 మీటర్లు అనుకుంటే నీటి మట్టం క్షణానికి 8 సెంటీమీటలు (2 అంగుళాలు) చొప్పున పెరుగుతుంది అన్నమాట. అంటే ఇరవై అంకెలు లెక్కపెట్టే లోగా నిలువెత్తు మనిషి ములిగి పోతాడు. కనుక ప్రాణం మీద ఆశ ఉంటే సముద్రం తీతని చూడగానే కాలికి బుద్ధి చెప్పో, కారు ఎక్కో, ఎత్తయిన ప్రదేశానికి పారిపోవాలి.