Sunday, March 10, 2013

హోలోగ్రాములు


హోలోగ్రాములు

వేమూరి వేంకటేశ్వరరావు

హోలోగ్రాము అంటే ఏమిటో కొంతవరకు వర్ణించి చెప్పవచ్చు కాని అంతా చెప్పటం కష్టం; చూడాలి అంతే. ఇక్కడ కాగితం మీద చూపించే సావకాశం లేదు కనుక వీలయినంత వరకు వర్ణించి ప్రయత్నం చేస్తాను. మంచి హోలోగ్రాము చూడాలంటే ఏ సైన్సు ప్రదర్శనకో వెళ్లి చూడండి. ఏదో దేశవాళీ హోలోగ్రాము చూడాలనుకుంటే మీ జేబులో ఉన్న క్రెడిట్ కార్డ్ మీద తళతళలాడే చిన్న బొమ్మని చూడండి.

గ్రీకు భాషలో “హోలో” అంటే పూర్తి, “గ్రామోస్” అంటే సందేశం (మెసేజ్, message), కనుక హోలోగ్రాం అంటే పరిపూర్ణమైన సందేశం. గ్రామఫోన్ లేదా ఫోనోగ్రాం అంటే “శబ్ద సందేశం”. ఈ లెక్కని “సినఫోగ్రాం” అంటే మేఘసందేశం. ఇదే విధంగా ఇంగ్లీషులో “హోలోగ్రాఫిక్ విల్” అంటే పరిపూర్ణమైన వీలునామా. పరిపూర్ణమైన అంటే వీలునామా అంతా – పత్రము, సంతకము, అంతా - చేవ్రాలుతో ఉన్నదని అర్థం. కనుక ఒక “మూర్తి” యొక్క హోలోగ్రాము ఆ మూర్తి ఆకారానికి పరిపూర్ణమైన పునఃసృష్టి. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు అసలు ముఖానికి ప్రతిబింబానికి పరిపూర్ణమైన పోలికలు ఉండటం లేదూ. అద్దం వెనక్కి చెయ్యి పెట్టి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కాని మన ముఖంలో ఉన్న సమస్త కళలు ఆ ప్రతిబింబంలో ఉంటాయి. అద్దంలో ప్రతిబింబాన్ని చూసి ఎవరూ ఆశ్చర్యపోరు; ఎందుకంటే అది మనకి అలవాటు అయిపోయింది కనుక! కనుక ఒక విధంగా అద్దంలో కనిపించే ప్రతిబింబం హోలోగ్రాముకి ఉదాహరణగా అనుకోవచ్చు.

సినిమా తెర మీద చూసిన బొమ్మలు పల్చగా, అప్పడాలులా, కదలాడుతూ ఉంటాయి కాని వాటికి లోతు (మందం) ఉండదు. అంటే, ఈ బొమ్మలకి పొడుగు, వెడల్పు ఉంటాయి కాని లోతు ఉండదు. శిల్పాలకి, విగ్రహాలకి పొడుగు, వెడల్పు, లోతు ఉంటాయి కాని అవి కదలాడవు. మనని ముమ్మూర్తులా పోలి, పొడుగు, వెడల్పు, లోతు ఉన్నవి, మన కదలికలని అనుసరిస్తూ కదలాడేవి కావాలంటే హోలోగ్రాము తయారు చెయ్యాలి. హోలోగ్రాముని చూసినప్పుడు అసలేదో, నకిలీ ఎదో తెలియదు. దగ్గరకెళ్లి పట్టుకుందామంటే అసలుది చేతికి చిక్కుతుంది కాని నకిలీది పట్టుకి దొరకదు.

బల్లపరుపుగా ఉన్న సమతలం మీద పొడుగు, వెడల్పు, లోతు కనిపించే విధంగా ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ప్రక్షేపిస్తే (ప్రొజెక్టు చేస్తే) దానిని హోలోగ్రాము అంటారు. ఈ ప్రక్షేపణ (ప్రొజెక్షన్, projection) తెర లాంటి సమతలం మీద జరగాలని నియమం లేదు. ఖాళీగా ఉన్న ప్రదేశం మీదకి కూడ ప్రక్షేపించవచ్చు. అప్పుడు ఎదురుగా, “గాలిలో”, ఏ అలంబనం లేకుండా, మూడు దిశలలో వ్యాప్తి చెందిన విగ్రహమూర్తి కనబడుతుంది. ఆ విగ్రహమూర్తికి ఫొటో తీస్తే మామూలు ఫొటోలాగే వస్తుంది. కాని ఆ విగ్రహమూర్తి కనిపిస్తూన్న చోట చెయ్యి పెట్టి తడిమితే ఏమీ తగలదు. ఇది ఒక రకం హోలోగ్రాము. క్రెడిట్ కార్డులమీద కనిపించే హోలోగ్రాము మరొక రకం.

హోలోగ్రాముని ఎలా చేస్తారో, అది పనిచేసే విధానంలోని కిటుకు ఏమిటో తరువాత చూద్దాం. ప్రస్తుతానికి, హోలోగ్రాము ఉపయోగం ఒకటి చెబుతాను. ఆలోచించి చూడండి.

తిరుపతి కొండ ఎక్కి వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకోవటం ఎంత ప్రయాసతో కూడిన పనో భక్తులకి నేను వేరే చెప్పక్కరలేదు. పదేళ్ల క్రితం, ఎవ్వరి సహాయం లేకుండా, ఏ పలుకుబడి ఉపయోగించకుండా, మద్రాసులో తెల్లవారు ఝామున ఒకరు బస్సు ఎక్కించి, ప్రత్యేక దర్శనం అని చెప్పి టికెట్టు కొనిచ్చి పంపెరు. వరసలో 12 గంటల పాటు నిలబడవలసి వచ్చింది. ఊపిరి తిరగని ఆ కొట్టు గదులలో, ఆ కూపాలలో, శిక్షించబడ్డ నేరస్తుడిలా నిలబడి, ఏ పాపం చేసి ఈ పొరపాటు చేసి దర్శనానికి వచ్చేనురా దేవుడా అని నన్ను నేనే తీట్టుకుని, రాత్రి 10 గంటలకి వరసలోంచి బయట పడి, బస్సు ఎక్కి మద్రాసు తిరిగి చేరుకునే సరికి రాత్రి రెండు అయింది. దర్శనం ఒక్క క్షణమే. స్వామివారి విగ్రహాన్ని అల్లంత దూరంలోంచి తప్ప దగ్గరగా చూడటమే అవలేదు. “కదలండి, కదలండి” అని ఒకటే గోల. దేవుడు సర్వాంతర్యామి కదా. ఈ కొండ ఎక్కే చూడాలా? ఈ తొడతొక్కిడిలో, అనారోగ్యకరమైన పరిస్థితులలో, ఈ దర్శనం ఎందుకు అనిపించింది. అప్పుడు ఒక తరుణోపాయం తట్టింది.

స్వామి వారి గర్భగుడికి, విగ్రహానికి, ఆ విగ్రహం చుట్టూ ఉన్న సామగ్రికి, విగ్రహం పాదాల దగ్గర కూర్చున్న అర్చక స్వాములకి – ఆ వాతావరణం అంతటికి - హోలోగ్రాము తీసి నాలుగైదు చోట్ల ప్రక్షేపించి, మైలు పైగా పొడుగున్న ఆ వరసలని నాలుగైదు వరసలుగా విడగొడితే వేచి ఉండే సమయమూ తగ్గించవచ్చు. దర్శన సమయం పెంచ వచ్చు. తొడతొక్కిడి తగ్గించవచ్చు. కొండ ఎక్కటానికి అనుకూలపడని వారికి దిగువ తిరుపతిలోనే దర్శనభాగ్యం కలిగించవచ్చు. భక్తులకోసం స్వామి ఎన్ని సార్లు కొండ దిగి రాలేదు? గోపికలకోసం ఒకే కృష్ణుడు విడివిడిగా కనిపించేడు కదా. అమెరికాలో, మా ఊళ్లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనం చేసుకుందికి వెళ్లినప్పుడు “నా ఎదట ఉన్నది నకిలీ స్వామి, అసలు స్వామి తిరపతిలో ఉన్నాడు” అని ఏనాడైనా నేను అనుకున్నానా? భక్తుల సంఖ్య ఘాతీయంగా (ఎక్స్పొనెన్షియల్, exponential) పెరిగిపోతూన్న ఈ రోజుల్లో సాంకేతిక పరిష్కారాలమీద ఆగమ శాస్త్రాలు మాత్రం శీతకన్ను ఎందుకు వేస్తాయి?

దగ్గరకెళ్ళి చేత్తో తడిమి చూస్తే కాని అసలుకి, హోలోగ్రాముకీ తేడా తెలియదు. మనని ఎలాగూ గర్భగుడిలోకి వెళ్లి విగ్రహాన్ని ముట్టుకోనివ్వరు, పూజలు చెయ్యనివ్వరు, హారతులివ్వనివ్వరు. దూరం నుండి దర్శనం చేసుకోటానికి రాతి విగ్రహం అయితేనేమిటి, గాలి విగ్రహం అయితేనేమిటి? వినాయకుడి బొమ్మని శక్తిని బట్టి బంగారంతో చెయ్యవచ్చు, వెండితో చెయ్యవచ్చు, మట్టితో చెయ్యవచ్చు, ఆఖరికి పసుపుతో చెయ్యవచ్చు. శివలింగాలు కూడ అన్ని పదార్థాలతోటీ చెయ్యవచ్చు. జ్యోతిర్లింగం అంటే ఏమిటి?

ఈ రోజుల్లో హోలోగ్రాములని లేసరు కాంతితో చేస్తున్నారు. కనుక హోలోగ్రాము అంటే కాంతి విగ్రహం, జ్యోతిర్‌విగ్రహం.





No comments:

Post a Comment