Friday, May 25, 2018

గుళిక రసాయనం అనబడే క్వాంటం కెమిస్ట్రీనేను రాసిన పుస్తకాలలో మూడు తెలుగు ఇ-పుస్తకాలు అంతర్జాలం ద్వారా ఉచితంగా
దింపుకొనే వెసులుబాటు కల్పించేను. కినిగె వారి సమాచారం ప్రకారం దింపుకోలు
గణాంకాలు ఇలా ఉన్నాయి:


Total downloads

రామానుజన్ నుండి ఇటూ, అటూ: 1729
ఫెర్మా చివరి సిద్ధాంతం: 493
చుక్కల్లో చంద్రుడు - చంద్రశేఖర్ చరిత్ర: 302


కానీ ఈ 2,524 వ్యక్తులలో ఒక్కరు - మాటవరసకు ఒక్కరు - వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చిన
పాపాన్న పోలేదు: బాగుంది, బాగులేదు, అర్థం అవలేదు, వగైరా. మిగిలిన రచయితల
సంగతి నాకు తెలియదు కానీ నా రాతలపై స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలనే
కుతూహలం నాకు ఉంది. కనీసం పుస్తకాన్ని విపణివీధిలో పెట్టినప్పుడు అమ్మకాల
గణాంకాలు చూసి పాఠకుల స్పందనని అంచనా వెయ్యవచ్చు. అందుకని పుస్తకాలని
ఉచితంగా పంచిపెట్టడంలో విజ్ఞత కనిపించడం లేదు. ఈ కోణంలో ఆలోచించి నా
తరువాత పుస్తకాన్ని విక్రయించడానికే నిశ్చయించుకున్నాను.


నేను ఇదివరలో జనరంజక శైలిలో చాల సైన్సు పుస్తకాలు రాసేను. కాని ఆ పుస్తకాలలో
గణిత సమీకరణాలు వంటి బరువైన అంశాలు లేకుండా జాగ్రత్త పడ్డాను. “మనవాళ్లకి
గణితం అంటే భయం లేదు, మీరు ధైర్యంగా గణితం వాడి ఒక పుస్తకం రాయండి,”
అని ఒక మిత్రుడు ప్రోత్సాహపరచడంతో “క్వాంటం కెమెస్ట్రీ” ని తెలుగులో పరిచయం
చెయ్యడానికి ఒక చిన్న పుస్తకం రాసేను. కినిగె (kinige.com) సంస్థ ప్రచురించేరు.


ఈ పుస్తకం రసాయన శాస్త్రం అధ్యయనం చేసే విద్యార్థులని ఉద్దేశించి రాసినది.
అలాగని ఇది పాఠ్య పుస్తకం కాదు. జనరంజక శైలిలో రాసినదీ కాదు. మధ్యే మార్గంలో
ఉంటుంది. అమెరికాలో ఉన్నత పాఠశాలలో ఉన్న 12 వ తరగతి విద్యార్థులు కానీ,
కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు కానీ ఈ స్థాయిలో ఉన్న పాఠ్యాంశాలని
చదువుతారు. అందుకని తెలుగు దేశంలో మొదటి సంవత్సరం కళాశాల విద్యార్థులకి
ఇది అందుబాటులో ఉంటుందనే అనుకుంటున్నాను.


ఇది 20 వ శతాబ్దపు ఆరంభ దశలో భౌతిక, రసాయన శాస్త్రాలలో జరిగిన విప్లవాల కథ.
ఏదో కాశీమజిలీ కథలు చదివేసినట్లు కాకుండా కాసింత దృష్టి నిలిపి చదివితే అర్థం
అవుతుంది. కథలోని పతాక సన్నివేశాలు చదివి ఆనందించాలంటే గణితం సహాయం
లేకుండా సాధ్యం కాదు. అందుకని గణిత సమీకరణాలు వాడక తప్పలేదు. ఆ సమీకరణాలు
ఎలా ఉత్పన్నమయాయో అర్థం కాకపోయినా అవి చెప్పే కథ అర్థం చేసుకుంటే విషయం
లోతుగా అర్థం అవుతుంది.

పేరుకి రసాయన శాస్త్రం అని అన్నాను కానీ, ఈ  పుస్తకంలో ఎక్కువగా కనిపించేది
రసాయన శాస్త్రానికి కావలసిన భౌతిక శాస్త్రపు పునాదులు, ఆ శాస్త్రంలో కనిపించే
వాదాలు (theories), ప్రయోగాలు (experiments), వాటిని ఆకళింపు చేసుకోడానికి
కావలసిన గణితం. భౌతిక శాస్త్రంలో వచ్చిన “గుళిక విప్లవం” (quantum revolution)
రసాయన శాస్త్రాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.

Sunday, May 13, 2018

ప్రాణి ఎలా పుట్టింది?అనాది కాలం నుండీ మానవ మేధస్సుని వేధిస్తూన్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. 

నేను ఎవరు? ఎక్కడనుండి వచ్చేను? “నేను” అంటే ఏమిటి? భౌతిక శరీరమా? లేక ఈ శరీరానికి చైతన్యాన్ని ఇచ్చే ప్రాణమా? ప్రాణం అంటే ఏమిటి? ఆత్మ అన్నా ప్రాణం అన్నా ఒకటేనా? ఆత్మకీ (soul), ప్రాణానికీ (life), చేతస్సుకీ  (consciousness) సంబంధం ఏమిటి? అసలు ప్రాణికీ జడ పదార్థానికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? 

ఈ ప్రశ్నలకి ఆధునిక శాస్త్రీయ దృక్పథంతో సమాధానాలు వెతకడం కోసం "ప్రాణి ఎలా పుట్టింది?" అనే పేరుతో ఒక ఇ-పుస్తకం kinige.com ద్వారా ప్రచురించేను.  ఈ నాటి జీవశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో జడ పదార్థం నుండి ప్రాణి ఎలా పుట్టుకొచ్చిందో చాలమట్టుకి అర్థం అయింది. కాని మరొక ప్రాణి సహాయం లేకుండా, కేవలం జడ పదార్థంతో మొదలుపెట్టి, ప్రయోగశాలలో ఆ జడ పదార్థానికి ప్రాణం పొయ్యడం మనకి ఇంకా చేతకాలేదు. రేపో, మాపో అదీ జరుగుతుంది. అనాది కాలం నుండీ నేటి వరకు ఈ దిశలో శాస్త్రీయ పరిశోధన లోని ముఖ్య ఘట్టాలని సందర్శించడమే ఈ పుస్తకం యొక్క ముఖ్య లక్ష్యం. 

అంతే కాదు. జడ పదార్థానికి ప్రాణం పోసి మనం సాధించేది ఏమిటి? ఈ అన్వేషణ, ఈ పరిశోధన, అంతా కేవలం మన కుతూహలం అనే దాహం తీర్చుకోడానికేనా? లేక, ఈ విద్య సముపార్జించడం వల్ల మన దైనందిన అవసరాలు తీరుతాయా? ఈ పరిజ్ఞానం వల్ల మన జీవితాలని - మన ఆర్థిక పరిస్థితిని, మన ఆరోగ్య పరిస్థితిని - మెరుగుపరచుకునే సావకాశాలు ఉన్నాయా? మన ప్రధాన లక్ష్యం మీద గురి ఉంచి, దారిలో ఎదురయే ఈ ప్రశ్నలకి కూడ సమాధానాలు వెతుకుదాం. 

"ఇరవయ్యో శతాబ్దం భౌతిక శాస్త్రాలు (physical sciences) కి స్వర్ణయుగం అయితే ఇరవయ్యొకటవ శతాబ్దం జీవశాస్త్రాలు (biological sciences) కి  స్వర్ణయుగం కాబోతూంది" అని విజ్ఞులు అంటున్నారు. ఈ మాటలో నిజం ఎంతో అతిశయోక్తి ఎంతో  నిర్ధారించి చెప్పలేను కాని, ఒకటి మాత్రం నిర్ద్వందంగా నిజం – భౌతిక శాస్త్రపు పరిధి కంటె జీవశాస్త్రపు పరిధి బాగా పెద్దది. ఉదాహరణకి  అమెరికా ప్రభుత్వం జీవశాస్త్రం మీద పెట్టే ఖర్చు చూసినా, జీవశాస్త్రపు పరిధిలో ఉన్న పనివారి సంఖ్య చూసినా, జీవశాస్త్రంలో మనం చేసే పరిశోధనల వల్ల  మనకి వచ్చే లాభాలని లెక్క వేసుకొన్నా – ఇలా ఏ దృక్కోణంలో చూసినా - జీవశాస్త్రం ఇరవయ్యొకటవ శతాబ్దాన్ని ఏలెస్తుందనడంలో సందేహం లేదు. నిజానికి జీవశాస్త్రపు లోతుల్లో ఉన్న రహస్యాలని పరిశోధించి వెలికి తీసుకు రావడం వల్ల కలిగే తాకిడి మన ఆర్ధిక వ్యవస్థనీ, నైతిక దృక్పథాన్నీ, ఆఖరికి మన మనుగడనీ విపరీతంగా ప్రభావితం చేస్తుందనటంలో సందేహం లేదు. కనుక ఈ పుస్తకంలో సృజించే విషయాలు కేవలం జీవశాస్త్రపు విద్యార్థులనే దృష్టిలో పెట్టుకుని రాసినవి కావు. జనసామాన్యం, పాలక వర్గాలు కూడ తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ ముచ్చటించేను.

జీవశాస్త్రం (biology), జీవ సాంకేతికం (biotechnology), జన్యు సాంకేతికం (genetic technology) కూడ కలన యంత్రాలు తొక్కిన దారి వెంబడే ప్రయాణించిన పక్షంలో – అంటే ఒక మహా పరిశ్రమలా కొద్దిమంది చేతులలో కాకుండా, "ఇంటింటా ఒక సొంత కంప్యూటరు" తో ఒక కుటీర పరిశ్రమలా తయారయిన నాడు – జీవశాస్త్రపు పరిశ్రమలకి కూడ ఒక స్వర్ణ యుగం వస్తుంది. మొన్న మొన్నటి వరకూ బీద దేశంగా మగ్గిన భారత దేశం కంప్యూటర్ల ధర్మమా అని అకస్మాత్తుగా మధ్య తరగతి దేశమైనట్లే, ఈ జన్యు సాంకేతికం కూడ కుటీర పరిశ్రమలా పరివర్తన చెందిన నాడు మన దేశం మరొక అడుగు ముందుకు వేసి సకల ఐశ్వర్యాలతో తులతూగుతుందని జోశ్యం చెబుతున్నాను. ఆ రోజు ఎప్పుడు వస్తుంది? కంప్యూటరు పరిశ్రమ ఊపు ఎలా అందుకుందో అటువంటి పరిస్థితులు మళ్లా జన్యు సాంకేతికం విషయంలో సమకూడిన నాడు!  కంప్యూటర్ల ధర నలుగురికీ అందుబాటు లోకి రావటం, కంప్యూటరు వాడకానికి క్రమణికలు (programs) రాయగలిగే ప్రతిభ అందరికీ అవసరం లేకపోవటం, అంతర్జాలం (Internet) అనే రహదారి ద్వారా సమాచారాన్ని ప్రపంచంలో ఒక మూల నుండి మరొక మూలకి లిప్త మాత్రపు కాలంలో పంపగలిగే స్థోమత రావటం – ఈ మూడూ కంప్యూటర్లని కుటీర పరిశ్రమగా మార్చటానికి తోడ్పడ్డాయి. ఈ రకపు త్రివేణీ సంగమం  జీవసాంకేతిక రంగంలో ఏర్పడిననాడు - అంటే, వినియోగదారులకి అనుకూలమైన స్నేహశీల (user-friendly) వాతావరణం వచ్చిన నాడు - మనం కంటూన్న కల నిజం అవుతుంది. 

జన్యుసాంకేతికంలోని కీలకమైన భావాలు జనసామాన్యానికి, పాలకవర్గానికి అవగాహన అయితే ఒరిగేదేమిటి? ఈ రోజుల్లో వార్తాపత్రికలలో తరచుగా వచ్చే వార్తలలో రెండు ముఖ్యాంశాలు కనబడుతున్నాయి: ఒకటి, బహుళజాతి సంస్థలు లాభాపేక్షతో జన్యుపరంగా మార్పులు చేసిన పంటలని మన రైతుల నెత్తి మీద వేసి రుద్దుతున్నారనిన్నీ, వీటి వల్ల మన కర్షక వర్గానికి ధన నష్టం, ప్రాణ నష్టం కలగడమే కాకుండా ఈ కొత్త రకం ఆహారం తినడం వల్ల ప్రజాబాహుళ్యం వ్యాధిగ్రస్తం అవుతున్నాదనీ ఆందోళన చేస్తున్నారు. రెండు, జన్యు సాంకేతికం అవగాహనలోకి వస్తూన్నకొద్దీ ఇంతవరకు లొంగని రోగాలకి క్రొంగొత్త మందులు కనిపెడుతున్నారనిన్నీ, వీటి వల్ల కేన్సరు, డయబెటీస్, వంశపారంపర్యంగా సంక్రమించే కొన్ని రకాల జన్యు రోగాలకి చికిత్స దొరుకుతుంద్నీ ఆశ పడుతున్నారు. ఒక పక్క నుండి భయం! మరొక పక్క నుండి ఆస! చీకటిలో కాలికి మెత్తని తాడు తగిలితే అది పాము అని భయపడతాం. ఆ చీకటిలో ఒక వెలుగు రేఖ ప్రసరించగానే  అది పాము కాదనీ, కేవలం తాడు మాత్రమేననీ తెలిసిన తరువాత ఆ భయం పూర్తిగా పోతుంది. ఈ పుస్తకం అటువంటి కిరణరేఖని ఒకదానిని ప్రసరించగలిగితే నా ప్రయత్నం సఫలం అయినట్లే.