Wednesday, November 29, 2017

అలనాటి అమెరికా అనుభవాలునేను రాసిన "అమెరికా అనుభవాలు" పుస్తకం మొదట్లో ఎమెస్కోవారు ప్రచురించేరు. ఆ ప్రతులు ఇప్పుడు లభ్యం అవుతూన్నట్లు లేదు. చాలమంది మిత్రులు ఆ పుస్తకం కావాలని పదే పదే అడుగుతున్నారు. ఆ పుస్తకం మూల ప్రతి నా కంప్యూటర్ల మార్పిడిలో ఎక్కడో పోయిందనే అనుకున్నాను. కాని కాకతాళీయంగా, మరొక అంశం వెదుకుతూ ఉంటే నా కళ్ళ పడింది. అప్పుడు దానికి కొన్ని కొత్త అంశాలు, బొమ్మలు చేర్చి ఈ రెండవ విడత తయారు చేసి ఇ-పుస్తకం రూపంలో ప్రచురించేను. కిరణ్ ప్రభ గారి సలహా మేరకి పుస్తకం పేరు "అలనాటి అమెరికా అనుభవాలు" అని మార్చేను. ఇవి ఈ నాటి అనుభవాలు కావు. ఆ నాడు నేను చూసిన అమెరికా ఇప్పుడు లేదు. అచ్చు పుస్తకాన్ని చదివి అభినందించినవారు ఈ ఇ-పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

http://kinige.com/kbook.php?id=8521

Wednesday, September 6, 2017

తుపాను, ఉప్పెన, టైడల్ వేవ్, సునామీ

తుపాను, ఉప్పెన, టైడల్ వేవ్, సునామీ


వందేళ్ల క్రితం, రక్తాక్షి నామ సంవత్సరంలో, 1 నవంబరు 1864 న, బందరులో సముద్రం పొంగి, ఊరు ములిగిపోయిందని చెప్పుకుంటారు. నేను విన్న “స్థలపూరాణం” ప్రకారం “ఉమ గోల్డ్ కవరింగ్” వారి భవనం మొదటి అంతస్తు అంతా ములిగిపోయి, నీరు రెండవ అంతస్తు వరకు వచ్చేసిందిట. వివరాలకి ఇప్పుడు సాక్షులు దొరకరు కాని వినికిడి కబుర్లే నిజం అయితే 30,000 మంది చచ్చిపోయారుట. సముద్రం చెలియలికట్టని దాటి, నాలుగైదు కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచేసిందన్న మాట! దీనిని “బందరు ఉప్పెన” అని ప్రజలు అభివర్ణిస్తారు.

ఇటీవల, అనగా 19 నవంబరు 1977 న, కృష్ణా డెల్టాలోని దివిసీమ ములిగిపోయి 10,000 మందికి పైబడి చచ్చిపోయారుట. అపారమైన ధన నష్టంతో పాటు, 10 లక్షల పశువులు కూడ అసువులు బాసేయని వార్తా పత్రికలలో వచ్చింది. దీనిని “దివిసీమలో ఉప్పెన”  అని పత్రికలు రాసేయి.

ఈమధ్య, అనగా 26 డిసెంబరు 2004 తేదీన, ఇండోనేసియా దగ్గర హిందూ మహాసముద్రంలో భూకంపం కారణంగా వచ్చిన సునామీ వల్ల 30 మీటర్లు ఎత్తున్న కెరటాలు వచ్చి మీద పడడంతో శ్రీలంక తూర్పు తీరం, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాలు బాగా దెబ్బ తిన్నాయి. ఈ సునామీ తాకిడి ఆఫ్రికా ఖండపు పశ్చిమ కోస్తా వరకు ప్రయాణించింది. దీని బీభత్సాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు టెలివిషన్ తెరల మీద చూసేరు కనుక ఇక్కడ ప్రత్యేకించి వివరణ రాయక్కరలేదు.

విశాఖపట్నం మీద 12 అక్టోబరు 2014 న విరుచుకుపడ్డ హుద్‌హుద్ అనే తుపాను తాకిడితో మరో రకం భయానక దృశ్యాన్ని చూసేం.

నేను కాకినాడ ఇంజనీరింగు కాలేజీలో చదువుకునే రోజుల్లో (సుమారు 1958 లో), ఒకనాడు రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి కాని, వాన కాని లేవు. “టైడల్ వేవ్ వస్తోంది” అన్న గాలి వార్త విని చాల మంది కుర్రాళ్లు హాస్టల్ వదిలిపెట్టేసి పై ఊళ్లు వెళ్లిపోయేరు. తెల్లారి లేచి చూసుకుంటే టైడల్ వేవూ రాలేదు, చిట్టి కెరటమూ రాలేదని తేలింది. వచ్చుంటే చచ్చుండేవాడిని కదా; ఇక్కడ ఇప్పుడు ఈ వ్యాసం రాయడానికి  ఉండేవాడిని కాదు. !

ఈ అనుభవాల నేపథ్యంలో ఆటుపోట్లు (tides), తుపాను (cyclone), ఉప్పెన, టైడల్ వేవ్, సునామీ, చక్రవాతం (tornado) అన్న మాటలకి నిర్దిష్టమైన అర్థాలు ఉన్నాయా లేక ఒక మాటకి బదులు మరొక మాట వాడెయ్య వచ్చా అన్న అనుమానం రాక మానదు. పామరులు, పాత్రికేయులు, పండిత వర్గాలు ఈ మాటలని అజాగ్రత్తగా వాడి కొంత గందరగోళానికి కారకులయ్యారు.

శాస్త్రంలో సందిగ్ధతకి తావు లేదు. అంతే కాదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో మనం ముఖ్యంగా చేసే పని “పేర్లు పెట్టడం.” అంటే, మన అనుభవ పరిధి లోకి వచ్చిన దృగ్విషయాలకి నిర్ద్వందంగా ఉండేటట్లు పేర్లు పెట్టడం. ఇప్పుడు మనం గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్ధిష్టమైన అర్థాలు నిర్దేశిద్దాం.

గాలితో వచ్చే వాన గాలివాన. ఈ గాలి వేగం ఒక హద్దు మీరి ఎక్కువగా ఉంటే అది తుపాను. హిందూ మహాసముద్రంలో పుట్టే తుపానులని “సైక్లోనులు” అంటారు. అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టే తుపానులని హరికేన్ (hurricane) అనిన్నీ, పసిఫిక్ మహాసముద్రంలో - అంతర్జాతీయ తేదీ రేఖకి తూర్పున పుట్టేవాటిని టైఫూన్ (typhoon) అనిన్నీ అంటారు. ఈ తుపానులలో వీచే గాలి జోరు ఒక హద్దు దాటితే దానికి ఒక ప్రత్యేక నామకరణం చేస్తారు. అంటే, అన్ని గాలివానలూ తుపానులు కావు, అన్ని తుపానులకీ పేర్లు పెట్టరు. కొన్ని చోట్ల వాన ఉన్నా లేకపోయినా కేవలం సుడిగాలి అతి వేగంతో తిరుగుతూ వస్తుంది. ఆ సుడిగాలి వేగం ఒక హద్దు దాటినప్పుడు దానిని చక్రవాతం (tornado) అంటారు.సాధారణంగా తుపాను (cyclone) వచ్చినప్పుడు ఆ గాలి తాకిడికి సముద్రంలో పెద్ద కెరటాలు లేస్తాయి. ఈ కెరటాల వల్ల తీర ప్రాంతాలలో ముంపు కలుగుతుంది: ఈ కెరటాలు భూమి లోపుకి ఎక్కువగా చొచ్చుకుని రావు. గాలివాన, తుపానుల వల్ల కలిగే నష్టం ముఖ్యంగా గాలి వల్ల, కొంత వరకు వాన వల్ల. హుద్‌హుద్ వల్ల విశాఖ ప్రాంతాలకి కలిగిన నష్టం ఇటువంటిదే.

నేను అమెరికా వెళ్లిన కొత్తలో, అనగా 1960 దశకంలో, అమెరికాలో “టైడల్ వేవ్” అన్న మాటే వాడుకలో ఉండేది. మొదటి సారి సునామీ అన్న మాట పరిశోధన పత్రాలలో 1976 లో చూసేను. జపానీ భాషలో సునామీ అంటే “రేవులని ముంచేసే పెద్ద కెరటం” అని అర్థం. మనకి ఇంగ్లీషు మాటలు వాడటం అంటే ఎంత వ్యామోహమో అలాగే ఇంగ్లీషు మాతృభాషగా ఉన్న వాళ్లకి విదేశీ మాటల మీద మోజు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపానుకీ అమెరికాకి సత్సంబంధాలు, రాకపోకలు పెరగటంతో జపానీతో పరిచయం పెరిగి ఈ “సునామీ” ఇంగ్లీషులో ప్రవేశించడంతో “టైడల్ వేవ్” కి సునామీకి మధ్య తేడా తెలియక కొంత తికమకకి దారి తీసింది.

“అసలు టైడల్ వేవ్ (tidal wave) అన్న మాటే తప్పుడు ప్రయోగం, అది వాడకూడదు, సునామీ అన్నదే సరి అయిన ప్రయోగం” అని అమెరికాలో కొందరు వాదించటం మొదలుపెట్టేరు. నేను కూడ  “ఉప్పెన,”  “సునామీ” అనే మాటలు “టైడల్ వేవ్” కి పర్యాయ పదాలు అనుకునేవాడిని. కాని “దివిసీమలో ఉప్పెన,” “బందరు ఉప్పెన” అన్న ప్రయోగాలు వార్తాపత్రికలలో చూసిన తరువాత, నిలకడ మీద ఆలోచించి చూడగా బందరులోనూ దివిసీమలోనూ వచ్చినది ఉప్పెన అనే మనస్సులో తీర్మానించుకున్నాను - అనగా సునామీ కాదని తాత్పర్యం.

ఉప్పెన అంటే “సముద్రం పోటు పెడుతూన్న సమయంలోనే తుపాను కారణంగా వచ్చిన ముంపు” అని నా నిర్వచనం. బందరు, దివిసీమ - ఈ రెండూ - సముద్రమట్టంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి సముద్రపు నీరు లోపలికి చొచ్చుకు రావడానికి అవకాశం ఎక్కువ. ఈ రకం ముంపుని ఇంగ్లీషులో “టైడల్ వేవ్” అంటారు. ఎందుకుట? సముద్రపు పోటు (tides), తుపానువల్ల వచ్చే కెరటాలు (waves) కలిసిపోయాయి కనుక! ఇలా ఆలోచిస్తే “టైడల్‌వేవ్” అన్న ఇంగ్లీషు మాటకి ఉప్పెన సమానార్థకమైన తెలుగు మాట - అని నా అభిప్రాయం.

పోతే, మిగిలినది సునామీ. సముద్ర గర్భంలో, ఎక్కడో, భూమి కంపించడం వల్ల సముద్రం అడుగున ఉన్న భూమి కుంగి, కూలిపోయిన సందర్భంలో, పరిస్థితులు అనుకూలిస్తే ఒక మహత్తర కెరటం పుట్టుకొచ్చి అది మహా వేగంతో ఒడ్డుని ఢీకొంటుంది. అదీ సునామీ అంటే! సునామీ ఒక ఊరికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు; సునామీ వల్ల భౌగోళికంగా చాల ప్రాంతాలు దెబ్బ తింటాయి.

సముద్రపు ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటే కెరటాలు నెమ్మదిగా పైకి లేచి, ఒడ్డుని తాకినప్పుడు విరిగి, నురుగలు కక్కుకుంటూ గట్టుని చేరుకుంటాయి. ఈ కెరటాలు తయారవడానికి, పెరగడానికి, విరగడానికి కారణం గాలి. తుపాను సమయంలో గాలి జోరుకి ఈ కెరటాలు కూడ పెద్దగా పైకి లేస్తాయి, జోరుగా ముందుకి వస్తాయి. అప్పుడు అవి తీర ప్రాంతాలని ముంచెయ్యవచ్చు. ఈ కెరటాలకి మరొక లక్షణం ఉంది. కెరటాలతో సముద్రం ఎంత కల్లోలభరితంగా ఉన్నా ఆ కల్లోలం అంతా పైపైనే – అందంలా. ఒకటి రెండు మీటర్లు లోతుకి వెళితే అక్కడ సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది – పైన ఎంత కల్లోలంగా ఉన్నా!

గాలి వల్ల కెరటాలలో కలిగే చలనం ఒక రకం అయితే సూర్య చంద్రుల ఆకర్షణ వల్ల మరొక రకం చలనం కలుగుతుంది. మనం బీచికి షికారుకి వెళ్లినప్పుడు ఈ రకం చలనం కనిపించదు. కాని సముద్రంలో ప్రయాణం చేసే పడవలకి ఇది ముఖ్యం. ఇంగ్లీషులో ఈ రకం చలనాన్ని టైడ్స్ (tides) అంటారు. టైడ్స్ అని బహువచనం వాడినప్పుడు దాని అర్థం సముద్రంలో వచ్చే ఆటుపోటులు. ఇవి కెరటాలు కావు; కెరటాలలా జోరుగా వచ్చి ఒడ్డుకి కొట్టుకోవు. టైడ్స్ అంటే ఒక రకమైన “పొంగు.” సముద్రం ఇలా పొంగినప్పుడు సముద్ర మట్టం అంతా పైకి లేస్తుంది – పాలు పొంగినట్లు. ఇలా సముద్రం పొంగినప్పుడు దానిని తెలుగులో “పోటు” అంటాం, ఇంగ్లీషులో, ఏకవచనంలో, “టైడ్” (tide) అని కానీ, “ఫ్లో” (flow) అని కాని అంటాం. పుట్టుట గిట్టుట కొరకే అన్నట్లు పైకి లేచిన పొంగు పడి, కిందకి దిగాలి. అలా సముద్ర మట్టం తగ్గడాన్ని “ఆటు” అని కాని “తీత” అని కాని తెలుగులోనూ, “ఎబ్” (ebb) అని ఇంగ్లీషులోనూ అంటారు.

నా చిన్నతనంలో గ్రహణం పట్టినప్పుడు సముద్ర స్నానానికి వెళితే “సముద్రం పొంగుతోంది” అనే మాట వినేవాడిని. అంటే సముద్రపు నీటి మట్టం పైకి లేస్తోంది అని అర్థం. పొంగు అంటే జోరుగా కాకుండా నెమ్మదిగా సముద్రమట్టం లేవడం; రోజుకి రెండు సార్లు లేస్తుంది మన సముద్రం. లేచిన మట్టం మళ్లా తరుగుతుంది. ఈ ఆటుపోట్లు ఏ వేళప్పుడు వస్తాయో లెక్క కట్టి చెప్పవచ్చు. ఈ సమాచారాన్ని వాడుకుని రేవులోకి పడవలు ఎప్పుడు వస్తే సదుపాయంగా ఉంటుందో నావికులు నిర్ణయిస్తారు. కనుక సముద్రంలో వచ్చే ఆటుపోట్లు ప్రమాదం కాదు, మనకి ఎంతో ఉపయోగం.

ఆటుపోట్ల వల్ల సముద్రమట్టం లేచినప్పుడు సముద్రం ముందుకి వస్తుంది, పడినప్పుడు వెనక్కి వెళుతుంది. ఇలా ఎంత ముందుకి వస్తుంది, ఎంత వెనక్కి వెళుతుంది అనేది ఆ ప్రదేశం యొక్క భౌగోళిక అమరిక మీద కొంతా, ఆ రోజు పౌర్ణమా, అమావాశ్యా, గ్రహణమా అనే ఖగోళ పరిస్థితుల మీద కొంతా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే ఈ ఆటుపోట్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు కావు; వీటి రాకపోకలని మనం లెక్క కట్టి చెప్పవచ్చు. టూకీగా ఇదీ టైడ్స్ కథ.

ఇప్పుడు ఆటుపోట్లు ఎక్కువగా వచ్చే సమయంలోనే తుపాను కూడా వచ్చిందనుకుందాం. “అసలే కోతి, కల్లు తాగింది, నిప్పు తొక్కింది”  అన్న సామెతలా పోటుతో పైకి లేచిన సముద్రం వేగంగా  వీచే గాలి తాకిడికి భూమి మీదకి చొచ్చుకు రావచ్చు. అప్పుడు గాలి, వానతో పాటు ముంపు కూడా వస్తుంది. ఈ పరిస్థితిని “ఉప్పెన”  అని తెలుగు లోనూ, “టైడల్ వేవ్” అని ఇంగ్లీషులోనూ అనొచ్చు.

సునామీ అన్నది అకారాంత పదం కనుక తెలుగులో తేలికగా ఇమిడిపోతుంది. అందుకని దీనిని యథాతథంగా తెలుగులోకి దింపేసుంటే నాకు అభ్యంతరం లేదు. ఇంతకీ సునామీ అంటే ఏమిటి? మొదటగా, ఇది చాల జోరుగా ప్రయాణం చేసే కెరటం. ఇది చాల “పొడవైన” కెరటం. ఇక్కడ “జోరు”, “పొడవు”, “కెరటం” అన్న మాటలకి నిర్దిష్టమైన అర్థాలు ఉన్నాయి. కొంచెం శాస్త్రం, పరిభాష ఉపయోగించి చెప్పటం అవసరం. మనకి తెలుగులో అల, కెరటం, తరంగం అనే మాటలు వాడుకలో ఉన్నాయి. నిర్ధిష్టత కోసం వీటికి శాస్త్రీయమైన అర్థాలు ఇద్దాం. సముద్రపుటొడ్డున నిలబడి చూస్తూ ఉంటే నీరు ఉవ్వెత్తున పైకి లేచి, విరిగి పడుతూ ఉంటుంది. అలా పైకి లేచినప్పుడు దాని గరిష్ఠ ఊర్ధ్వభాగానికి “శిఖ” (peak) అని పేరు పెడదాం. ఈ శిఖ వెనక నీటి మట్టం లోతుగా దిగిపోతుంది. ఇక్కడ గరిష్ఠ అధో భాగానికి “గర్త” (trough) అని పేరు పెడదాం. ఒక శిఖ, ఒక గర్త ఆక్రమించిన ప్రాంతాన్ని కెరటం (wavelet) అందాం.

మరి కొంచెం విశదంగా చెబుతాను. “కెరటం” (wavelet) అంటే ఒక విశ్రమ స్థానం నుండి (నీటి) మట్టం పైకి లేచి, గరిష్ఠ పరిమితి చేరుకుని, కిందకి దిగి, కనిష్ఠ పరిమితి చేరుకుని మళ్లా విశ్రమ స్థానాన్ని చేరుకున్న మేర. ఈ కెరటం వెనక మరో కెరటం వస్తుంది. దానికీ శిఖ, గర్త ఉంటాయి. ఇలా నిర్విరామంగా వచ్చే కెరటాల సమాహారాన్ని “తరంగం” (wave or wave train) అందాం. ఒక తరంగంలో ఒక శిఖ నుండి దాని వెనక వచ్చే శిఖ కి మధ్య దూరాన్ని ఆ తరంగం “పొడుగు” అంటారు. దీన్నే మన వాళ్లు తరంగ దైర్ఘ్యం అని పాఠ్య పుస్తకాలలో అంటున్నారు. మనం “తరంగం పొడుగు” అనేసి ఊరుకుందాం. దీనినే ఇంగ్లీషులో వేవ్ లెంగ్త్ (wavelength) అంటారు.

ప్రతి తరంగానికి పొడుగు (wavelength), డోలన వ్యాప్తి లేక ప్రవర్ధమానం లేక ఎత్తు (amplitude) ఉంటాయి. సాధారణంగా సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే ఈ ఎత్తు సుమారు రెండో, మూడో మీటర్లు ఉంటుంది. పొడుగు మహా ఉంటే 50 మీటర్లు ఉండొచ్చు. కాని ఇది సునామీ అయితే ఆ కెరటం ఎత్తు సుమారు 10 మీటర్లు (30 అడుగులు), పొడుగు సుమారు 15 కిలోమీటర్లు ఉండొచ్చు. సునామీ సముద్రం మధ్యలో ఎక్కడో పుట్టి గంటకి సుమారు 500 కిలోమీటర్ల వేగంతో (అంటే విమానం వేగంతో) ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎదట గర్త, దాని వెనక శిఖ ఉంటాయి కనుక ఒడ్డున ఉండి చూసేవాళ్లకి ముందస్తుగా గర్త తగులుతుంది. అందువల్ల సముద్రం బాగా వెనక్కి వెళ్లిపోతూ కనిపిస్తుంది. దాని వెనక ఎక్కడో 15 కిలోమీటర్లు దూరంలో కొండంత ఎత్తు ఉన్న శిఖ జోరుగా వస్తోందన్న విషయం ఒడ్డున ఉన్న వ్యక్తికి ఎలా తెలుస్తుంది? తెలియదు. అమాయకంగా సముద్రం ఎందుకు వెనక్కి తగ్గిపోతోందా అని ఆశ్చర్యపడి కళ్లప్పగించి చూస్తూ ఉంటాడు. ఆ వెనక నుండి విమానం జోరుతో వస్తూన్న శిఖ ఒడ్డు చేరుకోడానికి 2 నిమిషాలు కూడ పట్టదు. ఆ వచ్చే కెరటం ఎత్తు 10 మీటర్లు అనుకుంటే నీటి మట్టం క్షణానికి 8 సెంటీమీటర్లు  (2 అంగుళాలు) చొప్పున పెరుగుతుంది అన్నమాట. అంటే ఇరవై అంకెలు లెక్కపెట్టే లోగా నిలువెత్తు మనిషి ములిగి పోతాడు. కనుక ప్రాణం మీద ఆశ ఉంటే సముద్రం తీతని చూడగానే కాలికి బుద్ధి చెప్పో, కారు ఎక్కో, ఎత్తయిన ప్రదేశానికి పారిపోవాలి.

ఈ సునామీలు పుట్టడానికి ముఖ్య కారణం సముద్ర గర్భంలో భూకంపం. భూమి కంపించడానికి కారణం సముద్రపు అడుగున ఉన్న నేల “విరిగి కూలిపోవడం.” మనం డాబా మీద ఉన్నప్పుడు మన కాలి కింద నేల విరిగి కూలిపోతే మనం అమాంతం కింద పడిపోయినట్లే సముద్రపు నేల కూలి పోయినప్పుడు సముద్రం పేద్ద గోతిలోకి పడిపోతుంది. ఈ తాకిడికి సముద్రంలో పుట్టే చలనమే సునామీ తరంగం. ఇది జోరుగా అన్ని దిశలలోకీ వ్యాపించడం మొదలు పెడుతుంది. సముద్రం లోతుగా ఉన్న చోట ఈ తరంగం చాప కింద నీరులా వెళిపోతుంది; పైన నీటిలో తేలియాడే పడవ ఈ తరంగం ప్రభావానికి కంగనైనా కంగదు. ఈ తరంగం ఒడ్డు చేరుకునే దరిదాపుల్లో నేల రాపిడికి జోరు కొద్దిగా తగ్గి ఉవ్వెత్తున పైకి కొండంత ఎత్తుకి లేస్తుంది. దీనిని చెలియలికట్ట ఆపలేదు. ఇది ఊళ్లల్లోకి విరుచుకుపడి మార్గంలో ఉన్న సమస్థాన్నీ సర్వనాశనం చేసేస్తుంది.

ఈ దిగువ బొమ్మలు చూస్తే ఈ సునామీ ఎలాగుంటుందో తెలుస్తుంది.Tuesday, August 29, 2017

స్వీడన్‌లో మాతృ భాష వాడకం (written in c 2010)

స్వీడన్‌లో మాతృ భాష వాడకం
(మాతృభాష దినోత్సవం సందర్భంగా మరొక సారి విడుదల చేస్తున్నాను.)

వేమూరి వేంకటేశ్వరరావు

నేను ఈమధ్య స్వీడన్ వెళ్ళి అక్కడ ఓ నెల రోజులపాటు ఉండడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మాతృభాషని మొహమాటం లేకుండా, చీటికీ మాటికీ ఇంగ్లీషు మాటలు దొర్లించకుండా, అన్ని చోట్లా నిరభ్యంతరంగా మాట్లాడేసుకుంటూ ఉంటే చూడ ముచ్చటేసింది. వీళ్ళల్లా మన దేశంలో, మొహమాటం లేకుండా మనం ఎందుకు మాట్లాడుకోలేక పోతున్నామా అని అక్కడ ఉన్న ఐదు వారాలూ నా మనస్సులో ఒకటే తపన.

స్వీడన్ దరిదాపుగా కేలిఫోర్నియా అంత ఉంటుంది - వైశాల్యంలో. కానీ, జనాభా పరంగా స్వీడన్ చాల చిన్న దేశం. స్టాక్‌హోం కి ఎగువన జనావాసాలు బహు కొద్ది. అంటే దేశం సగానికి పైగా ఖాళీ. జనావాసాలు ఉన్న స్థలాల్లో జనాభా అంతా కూడగట్టి జాగ్రత్తగా లెక్క పెడితే ఎనిమిది మిలియన్లు ఉంటారు - మహా ఉంటే.  పోలికకి, కేలిఫోర్నియా జనాభా 33 మిలియన్లు.

మన ఆంధ్ర ప్రదేష్ కూడ వైశాల్యంలో ఉరమరగా స్వీడన్ అంత ఉంటుంది. మన తెలుగు దేశంలో తెలుగు మాతృభాషగా చెలామణీ అయేవారి సంఖ్య దరిదాపు ఎనభై మిలియన్లు - ఎనిమిది కాదు, ఎనభై! అంటే స్వీడిష్ భాష మాట్లాడే వారి కంటె తెలుగు వారు పదింతలు ఉన్నారు. అయినా మాతృభాష వాడకంలో మన వైఖరికీ వారి వైఖరికీ బోలెడంత తేడా ఉంది.

నిజానికి స్వీడన్‌లో ఏ మూలకి వెళ్ళినా వాళ్ళ వాడుక భాష స్వీడిష్ భాషే. రైలు స్టేషన్‌లో ఉన్న ప్రకటనలు - బల్లల మీద రాసేవి, నోటితో చెప్పేవి - అన్నీ స్వీడిష్ భాష లోనే. రైళ్ళ రాకపోకల వేళలు చూపే కరపత్రాలన్నీ స్వీడిష్ భాష లోనే. రైలు టికెట్టు మీద రాత అంతా స్వీడిష్ భాష లోనే. తుపాకేసి వెతికినా స్వీడిష్ పక్కన ఇంగ్లీషు కనిపించదు - ఒక్క స్టాక్‌హోం వంటి నగరాలలో తప్ప. బజారులో దుకాణాల మీద పేర్లు, బేంకుల మీద పేర్లు, మొదలైనవన్నీ స్వీడిష్ భాష లోనే. బజారులో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ఆ పొట్లం మీద ఆ వస్తువు పేరు, అందులో ఉండే ఘటక ద్రవ్యాల ("ఇన్‌గ్రీడియంట్స్") పేర్లు, ఆ వస్తువుని వాడే విధానం అంతా స్వీడిష్ భాష లోనే. నేను ఉన్న విద్యాలయపు అతిథిగృహంలో ఉన్న టెలివిజన్ లో వచ్చే వార్తా కార్యక్రమాలన్నీ స్వీడిష్ భాష లోనే. "సి. ఎన్. ఎన్." లో ఇంగ్లీషు వార్తలు వినడానికి ఒక భారతీయుడి ఇంటికి వెళ్ళి వినవలసి వచ్చింది.

వీళ్ళు ఇలా వాళ్ళ భాషలో మాట్లాడుకుందికి వెసులుబాటుగా వీరికి పదసంపద ఉందా లేక ఇంగ్లీషు మాటలనే స్వీడిష్ లిపి లో రాసేసుకుని వాడేసుకుంటున్నారా అని ఒక అనుమానం వచ్చింది. ప్లాట్‌ఫారం, గేటు, టికెట్టు, ఓల్టేజి, కరెంటు, కంప్యూటరు వంటి మాటలని వారు ఏమంటున్నారో అని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూసేను. వీటన్నిటికి వారికి స్వీడిష్ భాషలో వేరే మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఎలా పుట్టుకొచ్చాయా  అని మరికొంచెం పరిశోధన చేసేను. ప్లాట్‌ఫారం అన్న మాటకి  సమానార్ధకాలుగా మనకి వేదిక, చపటా, తీనె, ఇలారం అనే మాటలు ఉన్నట్టే స్వీడిష్ భాషలో కూడ వారికి సమానార్ధకాలు ఉన్నాయి. వారు నిరభ్యంతరంగా, నిర్భయంగా, మొహమాటం లేకుండా ఆ మాటలలో ఒకదానిని ప్లాట్‌ఫారం కి బదులు వాడుతున్నారు తప్ప ఇంగ్లీషు మాటని వాడడం నాకు కనిపించ లేదు. ఇదే ఆచారాన్ని మన తెలుగుదేశం లో ప్రవేశపెట్టేమనుకొండి. అప్పుడు, మనవాళ్ళు, పుర్రెకో బుద్ధి కనుక, ఒకొక్కరు ఒకొక్క మాట వాడతారు తప్ప ఏకీభావంతో ఒక ఒప్పందానికి రారు. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి స్వీడిష్ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. రైలు స్టేషన్  లో ఉండే ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో, ఉపన్యాసం ఇచ్చే  ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో మొదలైన విషయాలు ఈ కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయిట. అటుపైన ప్రభుత్వపు అధీనం నుండి విడుదలయే పత్రాలన్నిటిలోనూ ఆ మాటని ఆ అర్ధంతో వాడతారుట.

ఇక ఇంగ్లీషు నుండి అరువు తెచ్చుకున్న మాటల సంగతి చూద్దాం. స్వీడిష్ వాళ్ళు మనలా ఇంగ్లీషు మాటలని యథాతథంగా వాడడం తక్కువే. ఒక వేళ వాడినా, వారి వాడకంలో తత్సమాలకంటె తద్భవాలే ఎక్కువ కనిపించాయి. ఒకానొకప్పుడు తెలుగు దేశంలో కూడ ఇటువంటి ఆచారం ఉండేది. ఉదాహరణకి బందరులో వలంద పాలెం (డచ్ కోలనీ), పరాసు పేట (ఫ్రెంచి కోలనీ) ఉండేవి. పోర్చుగీసు వాళ్ళని బుడతగీచులు అనే వారు. హాస్పటల్ ని ఆసుపత్రి అనే వారు. ఇలా తెలుగులో తద్భవాలని తయారు చేసుకుని వాడే ఆచారం క్రమంగా నశిస్తోంది. నశించడమే కాదు; ఎవ్వరైనా ఈ తద్భవాలని వాడితే వారిని శుద్ధ పల్లెటూరి బైతులులా పరిగణించి వారిని చులకన చేస్తాం.

తత్సమాలకీ, తద్భవాలకి మధ్యే మార్గంలో కొన్నాళ్ళు గడిపేం. కారు, బస్సు, కోర్టు, మొదలైన ప్రథమా విభక్తితో అంతం అయే మాటలకి నెమ్మదిగా స్వస్తి చెప్పి, ఇటీవల హలంతాలైన తత్సమాలని వాడడం రివాజు అయింది - కార్, బస్, కోర్ట్. అంటే ఏమిటన్న మాట? క్రమేపీ ఇంగ్లీషు సంప్రదాయాన్ని ఎక్కువెక్కువగా అవలంబిస్తున్నాం. అజంతమైన మన తెలుగు భాషలో హలంతమైన ఇంగ్లీషు మాటలు ఇమడవు. అయినా సరే ఎలాగో ఒకలాగ కష్ట పడి ఇముడ్చుతున్నాం. ఒక్క మాటలే కాదు. ఇంగ్లీషు వ్యాకరణ సూత్రాలని కూడ తెలుగుతో మేళవించి సరికొత్త భాషని పుట్టిస్తున్నామేమో అని ఒక అనుమానం పుట్టుకొస్తోంది.

స్వీడన్‌లో నలుగురు మనుష్యులు కలుసుకున్నప్పుడు వారు మాట్లాడుకునే భాష స్వీడిష్. తెలిసిన ముఖాన్ని కాని, తెలియని ముఖాన్ని కాని చూసినప్పుడు వారు ప్రత్యుత్థానం చేసేది స్వీడిష్ భాష లో. ఇలా అన్నానని స్వీడన్ దేశీయులకి ఇంగ్లీషు రాదనుకునేరు.  స్వీడన్ లో ఇంగ్లీషు రాని ఆసామి నాకు, నేనున్న ఐదు వారాలలో, కనపడ లేదు. ఉండడం ఉన్నారుట - వయసు మీరిన వారిలోనూ, పల్లెటూళ్ళల్లోను వెతికితే కనిపిస్తారుట. నాకు స్వీడిష్ భాష రాదు కనుక నేను బస్సు డ్రైవర్లతోను, చెకౌట్ కౌంటర్ దగ్గర అమ్మాయిలతోనూ, స్టేషన్లో టికెట్లు అమ్మే గుమస్తాల తోనూ, రైల్లో టికెట్లు తనిఖీ చేసే వ్యక్తుల తోనూ - ఇలా తారసపడ్డ వారందరితోనూ - ఇంగ్లీషులోనే మాట్లాడే వాడిని. వాళ్ళు చక్కటి ఇంగ్లీషులో సమాధానం చెప్పేవారు. వాళ్ళకి ఇంగ్లీషు రాకపోవడమనే ప్రశ్నే లేదు.  మన దేశంలో సగటు భారతీయుడు మాట్లాడే ఇంగ్లీషు కంటే  మంచి ఇంగ్లీషు - ఫ్రెంచి వాళ్ళు, జెర్మనీ వాళ్ళు మాట్లాడినట్లు యాసతో కాకుండా - చక్కటి ఇంగ్లీషు, అమెరికా ఫణితితో మాట్లాడ గలిగే స్థోమత వారిలో కనిపించింది.  (తెలుగు వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడితే తెలుగులా వినిపిస్తుందనిన్నీ, తెలుగు వాళ్ళు రాసిన ఇంగ్లీషు వాక్యాలు చదువుతూ ఉంటే తెలుగు చదువుతూన్నట్టు అనిపిస్తుందనిన్నీ ఒక తెలుగాయన నాతో అన్నాడు.) స్వీడిష్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అచ్చం అమెరికా వాళ్ళ ఇంగ్లీషులా వినిపించింది. కనుక స్వీడన్ వాళ్ళు స్వీడిష్ మాట్లాడడం ఇంగ్లీషు రాక కాదు; వాళ్ళ మాతృభాష మాట్లాడాలనే కోరిక గట్టిగా ఉండబట్టే.

ఇక్కడ, ఈ సందర్భంలో స్వీడనునీ మెక్సికోనీ పోల్చి చూద్దాం. స్వీడనులో స్వీడిష్ భాష ఎంత ప్రాచుర్యంలో ఉందో, మెక్సికోలో స్పేనిష్ భాష కూడ అంత ప్రాచుర్యంలోనూ ఉంది. కాని, స్వీడన్‌లో అండరికీ ఇంగ్లీషు బాగా వచ్చు. మెక్సికోలో ఇంగ్లీషు చాల తక్కువ మందికి వచ్చు. ఈ వచ్చిన వాళ్ళలో కూడ ఇంగ్లీషు బాగ వచ్చినవాళ్ళు బహు కొద్ది మంది. వైశాల్యంలోనూ, జనాభా లోనూ, సహజ సంపద, వనరుల లభ్యత లోనూ మెక్సికో స్వీడన్ కంటె మెరుగు. కాని కంటికి కనిపించే ఐశ్వర్యం లోనూ , ప్రపంచంలోని అంతర్జాతీయ వేదికల మీద చెలామణీ అయే పరపతి లోనూ స్వీడన్‌దే పై చేయి అని నాకు అనిపించింది. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించేను. ప్రపంచ భాష అయిన ఇంగ్లీషుకి మెక్సికోలో ఆలంబన లేక పోవడమూ, ఇంగ్లీషు స్వీడన్‌లో నిలదొక్కుకుని ఉండడమూ కారణాలుగా నాకు స్ఫురించేయి. స్వీడన్ దేశీయులు వారి మాతృభాష పై ఎంత అభిమానం ఉన్నా ఇంగ్లీషుని విస్మరించ లేదు. అలాగని ఇంగ్లీషు వ్యామోహంలో పడిపోయి వారి మాతృభాషని చిన్న చూపు చూడనూ లేదు.

ఇక సాహిత్య సారస్వతాల సంగతి చూద్దాం.  తెలుగు సారస్వతంతో పోల్చి చూస్తే స్వీడిష్ భాష లోని సాహిత్యం, సారస్వతం పూజ్యం కాక పోవచ్చునేమో గాని, రాసి లోను, వాసి లోను తేడా హస్తిమశకాంతరం అని నా కొద్ది అనుభవం తోటీ చెప్పగలను. అయినా సరే ఈ రంగంలో స్వీడన్ దేశీయులకి రెండో, మూడో నోబెల్ బహుమానాలు వచ్చేయి. తెలుగు సాహిత్యం లో గాలివాన అనే కథానిక కి అంతర్జాతీయంగా చిన్న గుర్తింపు వచ్చింది అంతే. ప్రతిభ లేక కాదు; ఉన్న ప్రతిభని చాటుకునే ప్రజ్ఞ లేక.

ఇక విద్యా బోధన విషయం చూద్దాం. స్వీడన్ లోని విశ్వవిద్యాలయాల్లో - వాళ్ళ పాఠ్య గ్రంథాలు ఇంగ్లీషులోనే ఉన్నా - బోధన అంతా స్వీడిష్ భాష లోనే. అక్కడి ఆచార్య వర్గాలు ప్రచురించే పరిశోధన పత్రాలు చాల మట్టుకు ఇంగ్లీషులోనే ఉన్నా, వాళ్ళ సమావేశలలోనూ, సదస్సులలోనూ వారు మాట్లాడుకునేది వారి మాతృభాష లోనే. వారి కులపతి చేరువలో ఆచార్యులు మాట్లాడే భాష వారి మాతృభాష.

ఏదీ, వి.సి. గారి ఆఫీసుకి వెళ్ళినప్పుడు, తప్పులు తడకలతో అయినా సరే మనం ఇంగ్లీషే మాట్లాడతాం కాని తెలుగు మాట్లాడం. ఒక సారి మా హైస్కూల్లో హెడ్ మాస్టారు గారి ఆఫీసు నుండి సెలవు నోటీసు వచ్చింది. అది కూడా మా పెద్ద తెలుగు మేష్టారు పాఠం చెపుతూ ఉండగా వచ్చింది. ఆ నోటీసు ఇంగ్లీషులో ఉంది. మా తెలుగు మేష్టారు ఉభయభాషా ప్రవీణ. కనుక ఆ నోటీసుని చదవకుండా, అందులో ఉన్న సారాంశాన్ని మాకు చెప్పేరు. కుర్ర కుంకలం కదా! మేం మేష్టారిని ఆ నోటీసు చదవమని యాగీ చేసేం. "నెల తక్కువ వెధవల్లారా" అని ఆయన మమ్మల్ని తిట్టి ఊరుకున్నారు. ఇదీ బొడ్డూడని రోజుల దగ్గరనుండీ మన భాష మీద, మన భాషని నేర్పే గురువుల మీద మనకి ఉన్న గౌరవం!

స్వీడన్ లో నా ఆఫీసుకి ఎదురుగా ఉన్న రోడ్డు దాటి అవతలకి వెళితే అక్కడ ఎరిక్‌సన్ వారి ఆఫీసు ప్రాంగణం ఉంది. ఎరిక్‌సన్ చాల పెద్ద అంతర్జాతీయ స్థాయి కంపెనీ. ఆ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. అంటే స్వీడన్ దేశీయులు కూడ ఆ కంపెనీ ప్రాంగణంలో ఉన్నంత సేపూ - మరొక స్వీడన్ దేశీయుడితోనైనా సరే -  ఇంగ్లీషే మాట్లాడాలి. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అడిగేను. "అయ్యా, రోడ్డు దాటి అవతలికి వెళితే యూనివర్శిటీలో అధికార భాష స్వీడిష్. ఇటు వస్తే మీ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. ఇలాగైతే ఎలా?" ఈ ప్రశ్నకి సమాధానం చాల సులభం. ఎరిక్‌సన్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేసే సంస్థ. వారికి వ్యాపారం లాభదాయకంగా కొనసాగడం ముఖ్యం. ఆ లాభాలకి మూలాధారం అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు. యూనివర్శిటీని నడపడానికి డబ్బు ప్రభుత్వం ఇస్తుంది. కనుక యూనివర్శిటీలో అధికార భాష ఉండాలని ఆదేశించింది, ప్రోత్సహించింది. యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్ధులకి ఉద్యోగాలు కావాలంటే, వారికి ఇంగ్లీషు బాగా వచ్చి తీరాలి. కనుక ప్రజలు, ప్రభుత్వం ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నారు. మనం మన దేశంలో ఇటు ఇంగ్లీషూ రాక, అటు తెలుగూ రాక రెండింటికి చెడ్డ రేవళ్ళమైతే, స్వీడన్ వారు ఇటు ఇంగ్లీషు లోనూ అటు స్వీడిష్ లోనూ సామర్ధ్యం సంపాదించి నాలాంటి వాళ్ళని ఆశ్చర్య చకితులని చేసేరు.

ఈ కథనం యొక్క నీతి ఏమిటి? ఇంగ్లండులో ఇంగ్లీషు, స్వీడను లో స్వీడిష్, జెర్మనీలో జెర్మన్, ఫ్రాంసులో ఫ్రెంచి, మెక్సికోలో స్పేనిష్, జపానులో జపనీసు, చైనాలో చైనీసు, కొరియాలో కొరియనూ, తమిళనాడులో తమిళం వినిపిస్తున్నాయి కాని తెలుగు దేశంలో తెలుగు వినపడడం లేదు. చెన్నపట్నంలో దుకాణానికి వెళితే వారు నన్ను తమిళంలో పలకరించేరు. నాకు తమిళం రాదని తెలిసిన తర్వాత ఇంగ్లీషులో మాట్లాడేరు. హైదరాబాదులో బట్టల దుకాణానికి వెళితే నన్ను ఇంగ్లీషులో పలకరించేరు. నేను తెలుగులో సమాధానం చెబితే నాకు తిరుగు సమాధానం ఇంగ్లీషులో చెప్పేడు, అక్కడ ఉన్న తెలుగు ఆసామీ. ఒక నాడు రైలులో రిజర్వేషను చేయించుకుందికి సికింద్రాబాదు స్టేషన్‌కి వెళితే ఒక దరఖాస్తు కాగితం నింపమని ఇచ్చేడు అక్కడి గుమస్తా. అంతా హిందీలో ఉంది. నాకు హిందీ రాదు. అందుకని తెలుగులో ఉన్న దరఖాస్తు కాగితం కావాలని అడిగేను. లోపలికి వెళ్ళి వెతికి ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తు కాగితం పట్టుకొచ్చి ఇచ్చేడు. తెలుగులో ఉన్నది కావాలని మళ్లా అడిగేను. తెలుగులో అచ్చేసిన దరఖాస్తులు లేవన్నాడు. పోనీలే అనుకుని ఆ ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తునే  తెలుగులో నింపి ఇచ్చేను. జూ లోంచి పారిపోయొచ్చిన జంతువుని చూసినట్లు చూసి తెలుగులో నింపిన దరఖాస్తు తీసుకోనన్నాడు. పైపెచ్చు, "అయ్యా, మీరు ఫారిన్ నుంచి వచ్చినట్లున్నారు. మీకు ఇంగ్లీషు రాకనా. నన్ను ఇబ్బంది పెడుతున్నారు కానీ" అంటూ నీళ్ళు నమిలేడు. ఇది మన తెలుగు రాష్ట్రానికి రాజధానీ నగరంలో జరిగిన ఉదంతం.

ఎలాగైతేనేం టికెట్టు కొనుక్కుని విశాఖపట్నం వెళ్ళేను. అక్కడ నా మేనగోడలు కొడుకుని కలుసుకున్నాను. వాడు హైస్కూల్లోనో, మొదటి సంవత్సరం కాలేజీలోనో ఉన్నాడు. వాడి చదువు ఎలా సాగుతోందో చూద్దాం అని వాడి పాఠ్య పుస్తకాలు తిరగెయ్యడం మొదలు పెట్టేను. వాడి దగ్గర తుపాకేస్తే తెలుగు పుస్తకం లేదు. తెలుగు కి బదులు సంస్కృతం చదువుతున్నాట్ట. "ఏదీ నీ సంస్కృతం పుస్తకం చూపించు" అన్నాను. వాడు ఇచ్చిన పుస్తకం చూద్దును కదా! లోపల దేవనాగరి లిపిలో కాని, తెలుగు లిపిలో కాని మచ్చుకి ఒక్క అక్షరం ముక్క కంచు కాగడా వేసి వెతికినా కనిపించ లేదు. అంతా ఇంగ్లీషు లిపే! ఈ కుర్ర కుంకలకి ఇంగ్లీషే సరిగ్గా రాదు. ఆ వచ్చీ రాని ఇంగ్లీషు మాధ్యమంగా సంస్కృతం వెలగబెడుతున్నాడుట. వాడికి పోతన పద్యాలతో పరిచయం లేదు. తిక్కన భారతం గురించి తెలియనే తెలియదుట. లక్ష్మణ కవి సుభాషితాల గురించి విననే లేదుట. పోనీ సంస్కృతం దేవ భాష, అదైనా వస్తే ఏ శాకుంతలమో చదివుంటాడనుకున్నాను. అప్పుడు చెప్పేడు అసలు రహస్యం. సంస్కృతంలో నూటికి తొంభై మార్కులు గ్యారంటీట. అందుకోసం సంస్కృతం చదువుతున్నాడుట.

వాడు పాపం తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. "చదవడం, రాయడం వచ్చా?" అని అడుగుదామనుకుంటూ నాలిక కరుచుకున్నాను. వాడివ్వబోయే సమాధానానికి హార్ట్ ఎటాక్ వచ్చేనా? ఎందుకొచ్చిన రభస, బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు అని అనుకుంటూ తెలుగు మీద అంత వరకు నేను చేసిన పరిశోధనకి తిలోదకాలిచ్చేసి, తోక ముడిచి తిరుగు ముఖం పట్టేను.
=======================

Thursday, August 3, 2017

చంద్రశేఖర్ చరిత్ర ‘చుక్కల్లో చంద్రుడు’ – Silicon Andhra SujanaRanjani

I've attempted to write a biography of Dr. S. Chandrasekhar in Telugu. Here is the link.
వేమూరి వేంకటేశ్వరరావు తొలిపలుకు రామ కథ రావణుడితో ముడిపడి ఉంది. రావణుడు లేకపోతే రామాయణమే లేదు. రావణుడు మాత్రం సామాన్యుడా? అసమాన్య ప్రతిభావంతుడు. చివరికి రావణుడిని పడగొట్టింది అతని అహంకారం. చంద్రశేఖర్ కథ ఎడింగ్టన్ తో ముడిపడి ఉంది. ఎడింగ్టన్ లేకపోతే చంద్రశేఖర్ కథ మరొకలా ఉండి ఉండేదేమో! ఎడింగ్టన్ మాత్రం…


SUJANARANJANI.SILICONANDHRA.ORG

Sunday, July 30, 2017

ష్రోడింగర్ పిల్లిష్రోడింగర్ పిల్లి గురించి తెలుగులో రాయమని పలువురు అడిగేరు కాబట్టి రాస్తున్నాను. ష్రోడింగర్ పిల్లి అనేది ఒక స్ఫురణ ప్రయోగం (thought experiment), అనగా ఇది కేవలం ఊహాజనితమైన ప్రయోగం. ఈ ప్రయోగం చెయ్యడానికి ష్రోడింగరూ  అక్కర లేదు, పిల్లీ అవసరం లేదు. పడక కుర్చీలో వాలి, ఆలోచించగలిగే శక్తి ఉంటే చాలు.

రజ్జుసర్ప భ్రాంతి అనే పదబంధం వినే  ఉంటారు. రజ్జువు అంటే తాడు, సర్పం అంటే పాము కనుక రజ్జు సర్ప భ్రాంతి అంటే తాడుని పామనుకోవడం. చీకట్లో నడుస్తూన్నప్పుడు కాలికి ఎదో పొడుగ్గా, మెత్తగా తగులుతుంది. అది పామేమో అని భ్రాంతిపడి, భయపడతాము. గుండె దడదడ కొట్టుకుంటుంది. అది కేవలం తాడు మాత్రమే అయితే బాగుండిపోతుంది అని మనస్సులో దేవుడికి దండం పెట్టుకుంటాం. చేతిలో దీపం ఉంది. ఆ  దీపాన్ని పాదాల మీద వేసి చూస్తే నిజం తేలిపోతుంది. కానీ ఆ దీపం వేసి చూసేవరకు కాలి కింద పడినది ఏమిటి? తాడు, పాము - రెండూ నిజాలే! దీపం వేసి చూడగానే అది కేవలం తాడు మాత్రమే అని తెలుసుకున్నప్పుడు ముందు పడ్డ భయం అంతా మటుమాయం  అయిపోతుంది. ఇక్కడ “దీపాన్ని పాదాల మీద వేయడం” అన్నది ప్రయోగం. ఈ  ప్రయోగం జరిగిన తరువాత “తాడా? పామా?” అని రెండు దిశలలో పరిగెడుతున్న మనస్సు కుదుటపడి అది తాడు మాత్రమే అని నిశ్చయించుకుంటుంది. అప్పుడు మనస్సులో పాముకి ఇహ చోటు లేదు.

ఆధునిక భౌతిక శాస్త్రంలో ఇటువంటి పరిస్థితి ఒకటి ఎదురవుతుంది. సృష్టిలో అణువు కంటే చిన్నది ఒకటి ఉంది; దాని పేరు ఎలక్ట్రాను. ఇది కంటికి కనబడనంత చిన్నది. కానీ ఉండడం ఉంది. దీని ఉనికిని గణితపరంగా వర్ణించగలం.  మొదట్లో ఇది చిన్న నలుసులా ఉంటుందనుకునేవారు. అప్పుడు ఆ నలుసు ఎక్కడ ఉంది? ఎంత జోరుగా కదులుతోంది? ఎంత శక్తిమంతంగా ఉంది? వగైరా ప్రశ్నలు పుడతాయి కదా? వీటన్నిటిని గుత్తగుచ్చి గణితపరంగా వర్ణించడానికి “తరంగ ప్రమేయం” (wave function) అనే ఊహనాన్ని వాడడం ఒక పద్ధతి. ఈ తరంగ ప్రమేయం ఒక “కెరటం” వంటి ఆకారాన్ని గణిత సమీకరణం ద్వారా వర్ణిస్తుంది. ఎటువంటి కెరటం?  నిశ్చలంగా ఉన్న తటాకం మధ్యలో ఒక గులకరాయి వేస్తే  గుండ్రంగా, కదులుతున్న చక్రాలు మాదిరి  పుట్టే కెరటం అనుకోవచ్చు. “ఈ  కెరటం ఎక్కడ ఉంది?” అని ప్రశ్నిస్తే ఎక్కడ అని చెప్పగలం? అది చెరువు అంతటా వ్యాపించి ఉంటుంది కదా! కానీ చుట్టూ చీకటి ఉన్నప్పుడు ఇవేమీ  కనబడవు. మన చేతిలో ఉన్న దీపాన్ని చెరువు అంతటా  వ్యాపించేటట్లు వెయ్యలేము కనుక ఎదో ఒక చోట వేస్తాం. అక్కడ కెరటం కనిపిస్తుంది. “కెరటం ఎక్కడ ఉంది?” అని అడిగితే “దీపం వేసిన చోట ఉంది” అని చెబుతారు. అనగా, దీపం ఎక్కడ వేస్తే  అక్కడ కెరటం ఉన్నట్లు కనిపిస్తుంది. కేవలం కనిపించడమే కాదు; గుళిక వాదం (Quantum theory) ప్రకారం “దీపం ఎక్కడ వేస్తే  కెరటం అక్కడే స్థిరపడిపోతుంది, మరెక్కడా ఉండదు.”

ఈ  దృగ్విషయాన్నే ఇంగ్లీషులో collapse of the wave function అంటారు.  ఈ  దృగ్విషయాన్ని  ఉహించుకుందుకి ఒక ఉపమానం చెబుతాను. నాలుగు అంగుళాలు పొడుగున్న రోకలిబండ (centipede) నేల మీద పాకుతూ కనబడుతుంది. అ నాలుగంగుళాలు పొడుగున్న రోకలిబండే మన ఎలక్ట్రాను విహరించగలిగే సర్వ ప్రపంచం అనుకుందాం. అనగా మన తరంగ ప్రమేయం ఈ నాలుగంగుళాల మేర వ్యాపించి ఉంటుంది. ఎలక్ట్రాను ఎక్కడ ఉంది? అని అడిగితే అది ఈ నాలుగంగుళాల మేర వ్యాపించి ఉందని చెప్పాలి - గుళిక శాస్త్రం ప్రకారం. ఇప్పుడు ఒక చీపురుపుల్లతో ఆ రోకలిబండని ఎదో ఒక చోట తాకుదాం. (ఇది మనం చేసిన ప్రయోగం!) అప్పుడు ఆ రోకలిబండ ఆ తాకిన ప్రదేశం చుట్టూ చుట్ట చుట్టుకుపోతుంది. అనగా పొడుగ్గా ఉన్న రోకలిబండ తాకిన ప్రదేశం దగ్గర స్థిరపడిపోతుంది (లేదా కూలిపోతుంది, లేదా collapse అయిపోతుంది). అదే విధంగా ఎలక్ట్రాను ఫలానా చోట ఉందా, లేదా అని ప్రయోగం చేసి నిశ్చయిద్దామని ప్రయత్నిస్తే ఆ ఎలక్ట్రాను ఆ “ఫలానా చోట” కూలబడిపోతుంది! .

పరమాత్మ అంతటా ఉన్నాడంటాం. అంతటా ఉంటే ఎలా చూడకలం? అందుకని ఎక్కడ ప్రతిష్ట చేస్తే అక్కడే ఉన్నాడంటాం కదా? అలాగనుకోండి.  అందుకనే పరమాత్మ విశ్వవ్యాప్తం అని తెలిసుండి కూడా చూడడానికి దేవాలయానికి వెళతాం.

అదే విధంగా ఎలక్ట్రాను ఉనికి విశ్వవ్యాప్తం. అది ఎక్కడ ఉందో చూడాలంటే దాని మీద దీపం వెయ్యాలి. దీపం ఎక్కడ వేస్తే అక్కడే ప్రతిస్థాపితమై  కనిపిస్తుంది. అంటే మనం ప్రయోగం చేస్తే కానీ ఎలక్ట్రాను ఉనికిని నిర్ధారించలేము. ప్రయోగం ఎక్కడ చేస్తే అక్కడే కనిపిస్తుంది. ప్రయోగం చెయ్యకపోతే అది సర్వవ్యాప్తం! ఈ  ఊహ  అందరికి సులభంగా అర్థం అయేటట్లు చెప్పడానికి ష్రోడింగర్ ఒక స్పురణ ప్రయోగం చేసి చూడమని సలహా ఇచ్చేడు. ఆ స్ఫురణ ప్రయోగానికి బదులు నేను భారతీయ వేదాంత తత్త్వం దృష్టిలో వ్యాఖ్యానించేను.

ఇంతకీ ష్రోడింగర్ ప్రతిపాదించిన స్పురణ ప్రయోగం ఏమిటి?  

తలుపులు, కిటికీలు అన్ని మూసేసిన ఒక చీకటి గదిలో ఒక పిల్లిని పెట్టమన్నాడు. ఆ గదిలో విషం కలిపిన పాల సీసా ఉంటుంది. సగటున, ఒక గంట వ్యవధిలో, ఎప్పుడో ఒకప్పుడు,  ఆ సీసా ఒలుకుతుంది. అప్పుడు ఆ పాలు తాగి ఆ పిల్లి చచ్చిపోతుంది. ఆ సీసా ఎప్పుడు ఒలుకుతుందో ఇదమిత్థంగా చెప్పలేము; అది యాదృచ్చికంగా జరిగే ప్రక్రియ.

ప్రశ్న: కొంత కాలం పోయిన తరువాత ఆ పిల్లి ఇంకా బతికే ఉంటుందా, చచ్చిపోయి ఉంటుందా? ష్రోడింగర్ ఏమన్నాడంటే “ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే “తలుపు తీసి చూడడం” అన్న ప్రయోగం చేసి చూడాలి. తలుపు తీసి చూడనంత సేపూ “ఆ పిల్లి బ్రతికీ  ఉంటుంది, చచ్చిపోయీ ఉంటుంది.”  కానీ “తలుపు తీసి చూడడం” అన్న ప్రయోగం చెయ్యగానే సందిగ్ధతకు తావు లేదు. చావో, బతుకో చూడగానే తేలిపోతుంది.

అదే విధంగా ఎలక్ట్రాను స్థితిని మనం అర్థం చేసుకోవాలి అంటాడు ష్రోడింగర్! మనం రజ్జుసర్ప భ్రాంతి అన్న భావాన్నే భౌతిక శాస్త్రంలో  “ష్రోడింగర్ పిల్లి” అంటారు. పిల్లిని గదిలో బంధించి, అది బతికి ఉందా, చచ్చిపోయిందా అని మెట్ట వేదాంతపు ధోరణిలో వాదించుకుంటూ గంటలకొద్దీ కాలం గడపవచ్చు. అదంతా కంచిగరుడ సేవే అవుతుంది. ప్రయోగం చెయ్యగా వచ్చిన ఫలితానిదే ఎప్పుడూ పై చేయి అవుతుంది. తలుపు తెరచి చూడు: పిల్లి బతికి ఉందొ చచ్చిపోయిందో తేలుతుంది. దీపం వేసి చూడు: కాలికి తగిలినది తాడో, పోమో తేలిపోతుంది. నహి నహి రక్షతి డుకృమ్ కరణే!

Schrodinger, in speaking of the universe in which particles are represented by wave functions, said, “The unity and continuity of Vedanta are reflected in the unity and continuity of wave mechanics. This is entirely consistent with the Vedanta concept of All in One.”

“The multiplicity is only apparent. This is the doctrine of the Upanishads. And not of the Upanishads only. The mystical experience of the union with God regularly leads to this view, unless strong prejudices stand in the West.” (Erwin Schrodinger: What is Life?, page 129, Cambridge University Press)

Thursday, May 18, 2017

తెలుగులో కొత్త మాటలు

మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. అలాగని టోకు బేరంలా, పెద్ద ఎత్తున, ఇంగ్లీషులోని మాటలని తెలుగులోకి దింపేసుకుంటే అవి మన నుడికారానికి నప్పవు. కనుక మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని ఎవరు చేస్తారు? మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో ఘటోత్కచుడు చెప్పినట్లు మాటలు మనం పట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?
భాష వాడుకకి కమిటీలు అక్కర లేదు. మన అవసరానికి అనుకూలంగా ఒక ఇంగ్లీషు మాటకి సరి అయిన తెలుగు మాట లేదని తెలియగానే అదే సందర్భంలో ఇంగ్లీషు రాని తెలుగు వ్యక్తి ఏమి చేస్తాడని అలోచించండి. అప్పుడు తెలుగు మాట మీ బుర్రకే తడుతుంది. మీ బుర్రకి తట్టిన మాట అందరూ సమ్మతిస్తారా అని ఆవేదన పడకండి; అలాగని మీ మాట మీద విపరీతంగా మమకారం పెంచేసుకోకండి. ప్రయోగించి చూడండి. అది పలకక పోతే మరో సందర్భంలో మరో మాట స్ఫురిస్తుంది. తగిన మాట ఏదీ స్ఫురించకపోతే ఇంగ్లీషు మాట ఉండనే ఉంది.
మరొక విషయం. ఎప్పుడూ ఇంగ్లీషు మాటలనే ఎరువు తెచ్చుకుని వాడాలని నియమం ఏముంది? మనకి అనేక భాషలతో సంపర్కం ఉంది కనుక అన్నింటిని సమదృష్టితో చూసి నాలుగు భాషల నుండీ స్వీకరిస్తే భాష మరీ ఇంగ్లీషు వాసన వెయ్యకుండా ఉంటుంది. ఆలోచించండి. ప్రయత్నించండి.