Tuesday, August 29, 2017

స్వీడన్‌లో మాతృ భాష వాడకం (written in c 2010)

స్వీడన్‌లో మాతృ భాష వాడకం
(మాతృభాష దినోత్సవం సందర్భంగా మరొక సారి విడుదల చేస్తున్నాను.)

వేమూరి వేంకటేశ్వరరావు

నేను ఈమధ్య స్వీడన్ వెళ్ళి అక్కడ ఓ నెల రోజులపాటు ఉండడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మాతృభాషని మొహమాటం లేకుండా, చీటికీ మాటికీ ఇంగ్లీషు మాటలు దొర్లించకుండా, అన్ని చోట్లా నిరభ్యంతరంగా మాట్లాడేసుకుంటూ ఉంటే చూడ ముచ్చటేసింది. వీళ్ళల్లా మన దేశంలో, మొహమాటం లేకుండా మనం ఎందుకు మాట్లాడుకోలేక పోతున్నామా అని అక్కడ ఉన్న ఐదు వారాలూ నా మనస్సులో ఒకటే తపన.

స్వీడన్ దరిదాపుగా కేలిఫోర్నియా అంత ఉంటుంది - వైశాల్యంలో. కానీ, జనాభా పరంగా స్వీడన్ చాల చిన్న దేశం. స్టాక్‌హోం కి ఎగువన జనావాసాలు బహు కొద్ది. అంటే దేశం సగానికి పైగా ఖాళీ. జనావాసాలు ఉన్న స్థలాల్లో జనాభా అంతా కూడగట్టి జాగ్రత్తగా లెక్క పెడితే ఎనిమిది మిలియన్లు ఉంటారు - మహా ఉంటే.  పోలికకి, కేలిఫోర్నియా జనాభా 33 మిలియన్లు.

మన ఆంధ్ర ప్రదేష్ కూడ వైశాల్యంలో ఉరమరగా స్వీడన్ అంత ఉంటుంది. మన తెలుగు దేశంలో తెలుగు మాతృభాషగా చెలామణీ అయేవారి సంఖ్య దరిదాపు ఎనభై మిలియన్లు - ఎనిమిది కాదు, ఎనభై! అంటే స్వీడిష్ భాష మాట్లాడే వారి కంటె తెలుగు వారు పదింతలు ఉన్నారు. అయినా మాతృభాష వాడకంలో మన వైఖరికీ వారి వైఖరికీ బోలెడంత తేడా ఉంది.

నిజానికి స్వీడన్‌లో ఏ మూలకి వెళ్ళినా వాళ్ళ వాడుక భాష స్వీడిష్ భాషే. రైలు స్టేషన్‌లో ఉన్న ప్రకటనలు - బల్లల మీద రాసేవి, నోటితో చెప్పేవి - అన్నీ స్వీడిష్ భాష లోనే. రైళ్ళ రాకపోకల వేళలు చూపే కరపత్రాలన్నీ స్వీడిష్ భాష లోనే. రైలు టికెట్టు మీద రాత అంతా స్వీడిష్ భాష లోనే. తుపాకేసి వెతికినా స్వీడిష్ పక్కన ఇంగ్లీషు కనిపించదు - ఒక్క స్టాక్‌హోం వంటి నగరాలలో తప్ప. బజారులో దుకాణాల మీద పేర్లు, బేంకుల మీద పేర్లు, మొదలైనవన్నీ స్వీడిష్ భాష లోనే. బజారులో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ఆ పొట్లం మీద ఆ వస్తువు పేరు, అందులో ఉండే ఘటక ద్రవ్యాల ("ఇన్‌గ్రీడియంట్స్") పేర్లు, ఆ వస్తువుని వాడే విధానం అంతా స్వీడిష్ భాష లోనే. నేను ఉన్న విద్యాలయపు అతిథిగృహంలో ఉన్న టెలివిజన్ లో వచ్చే వార్తా కార్యక్రమాలన్నీ స్వీడిష్ భాష లోనే. "సి. ఎన్. ఎన్." లో ఇంగ్లీషు వార్తలు వినడానికి ఒక భారతీయుడి ఇంటికి వెళ్ళి వినవలసి వచ్చింది.

వీళ్ళు ఇలా వాళ్ళ భాషలో మాట్లాడుకుందికి వెసులుబాటుగా వీరికి పదసంపద ఉందా లేక ఇంగ్లీషు మాటలనే స్వీడిష్ లిపి లో రాసేసుకుని వాడేసుకుంటున్నారా అని ఒక అనుమానం వచ్చింది. ప్లాట్‌ఫారం, గేటు, టికెట్టు, ఓల్టేజి, కరెంటు, కంప్యూటరు వంటి మాటలని వారు ఏమంటున్నారో అని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూసేను. వీటన్నిటికి వారికి స్వీడిష్ భాషలో వేరే మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఎలా పుట్టుకొచ్చాయా  అని మరికొంచెం పరిశోధన చేసేను. ప్లాట్‌ఫారం అన్న మాటకి  సమానార్ధకాలుగా మనకి వేదిక, చపటా, తీనె, ఇలారం అనే మాటలు ఉన్నట్టే స్వీడిష్ భాషలో కూడ వారికి సమానార్ధకాలు ఉన్నాయి. వారు నిరభ్యంతరంగా, నిర్భయంగా, మొహమాటం లేకుండా ఆ మాటలలో ఒకదానిని ప్లాట్‌ఫారం కి బదులు వాడుతున్నారు తప్ప ఇంగ్లీషు మాటని వాడడం నాకు కనిపించ లేదు. ఇదే ఆచారాన్ని మన తెలుగుదేశం లో ప్రవేశపెట్టేమనుకొండి. అప్పుడు, మనవాళ్ళు, పుర్రెకో బుద్ధి కనుక, ఒకొక్కరు ఒకొక్క మాట వాడతారు తప్ప ఏకీభావంతో ఒక ఒప్పందానికి రారు. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి స్వీడిష్ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. రైలు స్టేషన్  లో ఉండే ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో, ఉపన్యాసం ఇచ్చే  ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో మొదలైన విషయాలు ఈ కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయిట. అటుపైన ప్రభుత్వపు అధీనం నుండి విడుదలయే పత్రాలన్నిటిలోనూ ఆ మాటని ఆ అర్ధంతో వాడతారుట.

ఇక ఇంగ్లీషు నుండి అరువు తెచ్చుకున్న మాటల సంగతి చూద్దాం. స్వీడిష్ వాళ్ళు మనలా ఇంగ్లీషు మాటలని యథాతథంగా వాడడం తక్కువే. ఒక వేళ వాడినా, వారి వాడకంలో తత్సమాలకంటె తద్భవాలే ఎక్కువ కనిపించాయి. ఒకానొకప్పుడు తెలుగు దేశంలో కూడ ఇటువంటి ఆచారం ఉండేది. ఉదాహరణకి బందరులో వలంద పాలెం (డచ్ కోలనీ), పరాసు పేట (ఫ్రెంచి కోలనీ) ఉండేవి. పోర్చుగీసు వాళ్ళని బుడతగీచులు అనే వారు. హాస్పటల్ ని ఆసుపత్రి అనే వారు. ఇలా తెలుగులో తద్భవాలని తయారు చేసుకుని వాడే ఆచారం క్రమంగా నశిస్తోంది. నశించడమే కాదు; ఎవ్వరైనా ఈ తద్భవాలని వాడితే వారిని శుద్ధ పల్లెటూరి బైతులులా పరిగణించి వారిని చులకన చేస్తాం.

తత్సమాలకీ, తద్భవాలకి మధ్యే మార్గంలో కొన్నాళ్ళు గడిపేం. కారు, బస్సు, కోర్టు, మొదలైన ప్రథమా విభక్తితో అంతం అయే మాటలకి నెమ్మదిగా స్వస్తి చెప్పి, ఇటీవల హలంతాలైన తత్సమాలని వాడడం రివాజు అయింది - కార్, బస్, కోర్ట్. అంటే ఏమిటన్న మాట? క్రమేపీ ఇంగ్లీషు సంప్రదాయాన్ని ఎక్కువెక్కువగా అవలంబిస్తున్నాం. అజంతమైన మన తెలుగు భాషలో హలంతమైన ఇంగ్లీషు మాటలు ఇమడవు. అయినా సరే ఎలాగో ఒకలాగ కష్ట పడి ఇముడ్చుతున్నాం. ఒక్క మాటలే కాదు. ఇంగ్లీషు వ్యాకరణ సూత్రాలని కూడ తెలుగుతో మేళవించి సరికొత్త భాషని పుట్టిస్తున్నామేమో అని ఒక అనుమానం పుట్టుకొస్తోంది.

స్వీడన్‌లో నలుగురు మనుష్యులు కలుసుకున్నప్పుడు వారు మాట్లాడుకునే భాష స్వీడిష్. తెలిసిన ముఖాన్ని కాని, తెలియని ముఖాన్ని కాని చూసినప్పుడు వారు ప్రత్యుత్థానం చేసేది స్వీడిష్ భాష లో. ఇలా అన్నానని స్వీడన్ దేశీయులకి ఇంగ్లీషు రాదనుకునేరు.  స్వీడన్ లో ఇంగ్లీషు రాని ఆసామి నాకు, నేనున్న ఐదు వారాలలో, కనపడ లేదు. ఉండడం ఉన్నారుట - వయసు మీరిన వారిలోనూ, పల్లెటూళ్ళల్లోను వెతికితే కనిపిస్తారుట. నాకు స్వీడిష్ భాష రాదు కనుక నేను బస్సు డ్రైవర్లతోను, చెకౌట్ కౌంటర్ దగ్గర అమ్మాయిలతోనూ, స్టేషన్లో టికెట్లు అమ్మే గుమస్తాల తోనూ, రైల్లో టికెట్లు తనిఖీ చేసే వ్యక్తుల తోనూ - ఇలా తారసపడ్డ వారందరితోనూ - ఇంగ్లీషులోనే మాట్లాడే వాడిని. వాళ్ళు చక్కటి ఇంగ్లీషులో సమాధానం చెప్పేవారు. వాళ్ళకి ఇంగ్లీషు రాకపోవడమనే ప్రశ్నే లేదు.  మన దేశంలో సగటు భారతీయుడు మాట్లాడే ఇంగ్లీషు కంటే  మంచి ఇంగ్లీషు - ఫ్రెంచి వాళ్ళు, జెర్మనీ వాళ్ళు మాట్లాడినట్లు యాసతో కాకుండా - చక్కటి ఇంగ్లీషు, అమెరికా ఫణితితో మాట్లాడ గలిగే స్థోమత వారిలో కనిపించింది.  (తెలుగు వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడితే తెలుగులా వినిపిస్తుందనిన్నీ, తెలుగు వాళ్ళు రాసిన ఇంగ్లీషు వాక్యాలు చదువుతూ ఉంటే తెలుగు చదువుతూన్నట్టు అనిపిస్తుందనిన్నీ ఒక తెలుగాయన నాతో అన్నాడు.) స్వీడిష్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అచ్చం అమెరికా వాళ్ళ ఇంగ్లీషులా వినిపించింది. కనుక స్వీడన్ వాళ్ళు స్వీడిష్ మాట్లాడడం ఇంగ్లీషు రాక కాదు; వాళ్ళ మాతృభాష మాట్లాడాలనే కోరిక గట్టిగా ఉండబట్టే.

ఇక్కడ, ఈ సందర్భంలో స్వీడనునీ మెక్సికోనీ పోల్చి చూద్దాం. స్వీడనులో స్వీడిష్ భాష ఎంత ప్రాచుర్యంలో ఉందో, మెక్సికోలో స్పేనిష్ భాష కూడ అంత ప్రాచుర్యంలోనూ ఉంది. కాని, స్వీడన్‌లో అండరికీ ఇంగ్లీషు బాగా వచ్చు. మెక్సికోలో ఇంగ్లీషు చాల తక్కువ మందికి వచ్చు. ఈ వచ్చిన వాళ్ళలో కూడ ఇంగ్లీషు బాగ వచ్చినవాళ్ళు బహు కొద్ది మంది. వైశాల్యంలోనూ, జనాభా లోనూ, సహజ సంపద, వనరుల లభ్యత లోనూ మెక్సికో స్వీడన్ కంటె మెరుగు. కాని కంటికి కనిపించే ఐశ్వర్యం లోనూ , ప్రపంచంలోని అంతర్జాతీయ వేదికల మీద చెలామణీ అయే పరపతి లోనూ స్వీడన్‌దే పై చేయి అని నాకు అనిపించింది. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించేను. ప్రపంచ భాష అయిన ఇంగ్లీషుకి మెక్సికోలో ఆలంబన లేక పోవడమూ, ఇంగ్లీషు స్వీడన్‌లో నిలదొక్కుకుని ఉండడమూ కారణాలుగా నాకు స్ఫురించేయి. స్వీడన్ దేశీయులు వారి మాతృభాష పై ఎంత అభిమానం ఉన్నా ఇంగ్లీషుని విస్మరించ లేదు. అలాగని ఇంగ్లీషు వ్యామోహంలో పడిపోయి వారి మాతృభాషని చిన్న చూపు చూడనూ లేదు.

ఇక సాహిత్య సారస్వతాల సంగతి చూద్దాం.  తెలుగు సారస్వతంతో పోల్చి చూస్తే స్వీడిష్ భాష లోని సాహిత్యం, సారస్వతం పూజ్యం కాక పోవచ్చునేమో గాని, రాసి లోను, వాసి లోను తేడా హస్తిమశకాంతరం అని నా కొద్ది అనుభవం తోటీ చెప్పగలను. అయినా సరే ఈ రంగంలో స్వీడన్ దేశీయులకి రెండో, మూడో నోబెల్ బహుమానాలు వచ్చేయి. తెలుగు సాహిత్యం లో గాలివాన అనే కథానిక కి అంతర్జాతీయంగా చిన్న గుర్తింపు వచ్చింది అంతే. ప్రతిభ లేక కాదు; ఉన్న ప్రతిభని చాటుకునే ప్రజ్ఞ లేక.

ఇక విద్యా బోధన విషయం చూద్దాం. స్వీడన్ లోని విశ్వవిద్యాలయాల్లో - వాళ్ళ పాఠ్య గ్రంథాలు ఇంగ్లీషులోనే ఉన్నా - బోధన అంతా స్వీడిష్ భాష లోనే. అక్కడి ఆచార్య వర్గాలు ప్రచురించే పరిశోధన పత్రాలు చాల మట్టుకు ఇంగ్లీషులోనే ఉన్నా, వాళ్ళ సమావేశలలోనూ, సదస్సులలోనూ వారు మాట్లాడుకునేది వారి మాతృభాష లోనే. వారి కులపతి చేరువలో ఆచార్యులు మాట్లాడే భాష వారి మాతృభాష.

ఏదీ, వి.సి. గారి ఆఫీసుకి వెళ్ళినప్పుడు, తప్పులు తడకలతో అయినా సరే మనం ఇంగ్లీషే మాట్లాడతాం కాని తెలుగు మాట్లాడం. ఒక సారి మా హైస్కూల్లో హెడ్ మాస్టారు గారి ఆఫీసు నుండి సెలవు నోటీసు వచ్చింది. అది కూడా మా పెద్ద తెలుగు మేష్టారు పాఠం చెపుతూ ఉండగా వచ్చింది. ఆ నోటీసు ఇంగ్లీషులో ఉంది. మా తెలుగు మేష్టారు ఉభయభాషా ప్రవీణ. కనుక ఆ నోటీసుని చదవకుండా, అందులో ఉన్న సారాంశాన్ని మాకు చెప్పేరు. కుర్ర కుంకలం కదా! మేం మేష్టారిని ఆ నోటీసు చదవమని యాగీ చేసేం. "నెల తక్కువ వెధవల్లారా" అని ఆయన మమ్మల్ని తిట్టి ఊరుకున్నారు. ఇదీ బొడ్డూడని రోజుల దగ్గరనుండీ మన భాష మీద, మన భాషని నేర్పే గురువుల మీద మనకి ఉన్న గౌరవం!

స్వీడన్ లో నా ఆఫీసుకి ఎదురుగా ఉన్న రోడ్డు దాటి అవతలకి వెళితే అక్కడ ఎరిక్‌సన్ వారి ఆఫీసు ప్రాంగణం ఉంది. ఎరిక్‌సన్ చాల పెద్ద అంతర్జాతీయ స్థాయి కంపెనీ. ఆ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. అంటే స్వీడన్ దేశీయులు కూడ ఆ కంపెనీ ప్రాంగణంలో ఉన్నంత సేపూ - మరొక స్వీడన్ దేశీయుడితోనైనా సరే -  ఇంగ్లీషే మాట్లాడాలి. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అడిగేను. "అయ్యా, రోడ్డు దాటి అవతలికి వెళితే యూనివర్శిటీలో అధికార భాష స్వీడిష్. ఇటు వస్తే మీ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. ఇలాగైతే ఎలా?" ఈ ప్రశ్నకి సమాధానం చాల సులభం. ఎరిక్‌సన్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేసే సంస్థ. వారికి వ్యాపారం లాభదాయకంగా కొనసాగడం ముఖ్యం. ఆ లాభాలకి మూలాధారం అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు. యూనివర్శిటీని నడపడానికి డబ్బు ప్రభుత్వం ఇస్తుంది. కనుక యూనివర్శిటీలో అధికార భాష ఉండాలని ఆదేశించింది, ప్రోత్సహించింది. యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్ధులకి ఉద్యోగాలు కావాలంటే, వారికి ఇంగ్లీషు బాగా వచ్చి తీరాలి. కనుక ప్రజలు, ప్రభుత్వం ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నారు. మనం మన దేశంలో ఇటు ఇంగ్లీషూ రాక, అటు తెలుగూ రాక రెండింటికి చెడ్డ రేవళ్ళమైతే, స్వీడన్ వారు ఇటు ఇంగ్లీషు లోనూ అటు స్వీడిష్ లోనూ సామర్ధ్యం సంపాదించి నాలాంటి వాళ్ళని ఆశ్చర్య చకితులని చేసేరు.

ఈ కథనం యొక్క నీతి ఏమిటి? ఇంగ్లండులో ఇంగ్లీషు, స్వీడను లో స్వీడిష్, జెర్మనీలో జెర్మన్, ఫ్రాంసులో ఫ్రెంచి, మెక్సికోలో స్పేనిష్, జపానులో జపనీసు, చైనాలో చైనీసు, కొరియాలో కొరియనూ, తమిళనాడులో తమిళం వినిపిస్తున్నాయి కాని తెలుగు దేశంలో తెలుగు వినపడడం లేదు. చెన్నపట్నంలో దుకాణానికి వెళితే వారు నన్ను తమిళంలో పలకరించేరు. నాకు తమిళం రాదని తెలిసిన తర్వాత ఇంగ్లీషులో మాట్లాడేరు. హైదరాబాదులో బట్టల దుకాణానికి వెళితే నన్ను ఇంగ్లీషులో పలకరించేరు. నేను తెలుగులో సమాధానం చెబితే నాకు తిరుగు సమాధానం ఇంగ్లీషులో చెప్పేడు, అక్కడ ఉన్న తెలుగు ఆసామీ. ఒక నాడు రైలులో రిజర్వేషను చేయించుకుందికి సికింద్రాబాదు స్టేషన్‌కి వెళితే ఒక దరఖాస్తు కాగితం నింపమని ఇచ్చేడు అక్కడి గుమస్తా. అంతా హిందీలో ఉంది. నాకు హిందీ రాదు. అందుకని తెలుగులో ఉన్న దరఖాస్తు కాగితం కావాలని అడిగేను. లోపలికి వెళ్ళి వెతికి ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తు కాగితం పట్టుకొచ్చి ఇచ్చేడు. తెలుగులో ఉన్నది కావాలని మళ్లా అడిగేను. తెలుగులో అచ్చేసిన దరఖాస్తులు లేవన్నాడు. పోనీలే అనుకుని ఆ ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తునే  తెలుగులో నింపి ఇచ్చేను. జూ లోంచి పారిపోయొచ్చిన జంతువుని చూసినట్లు చూసి తెలుగులో నింపిన దరఖాస్తు తీసుకోనన్నాడు. పైపెచ్చు, "అయ్యా, మీరు ఫారిన్ నుంచి వచ్చినట్లున్నారు. మీకు ఇంగ్లీషు రాకనా. నన్ను ఇబ్బంది పెడుతున్నారు కానీ" అంటూ నీళ్ళు నమిలేడు. ఇది మన తెలుగు రాష్ట్రానికి రాజధానీ నగరంలో జరిగిన ఉదంతం.

ఎలాగైతేనేం టికెట్టు కొనుక్కుని విశాఖపట్నం వెళ్ళేను. అక్కడ నా మేనగోడలు కొడుకుని కలుసుకున్నాను. వాడు హైస్కూల్లోనో, మొదటి సంవత్సరం కాలేజీలోనో ఉన్నాడు. వాడి చదువు ఎలా సాగుతోందో చూద్దాం అని వాడి పాఠ్య పుస్తకాలు తిరగెయ్యడం మొదలు పెట్టేను. వాడి దగ్గర తుపాకేస్తే తెలుగు పుస్తకం లేదు. తెలుగు కి బదులు సంస్కృతం చదువుతున్నాట్ట. "ఏదీ నీ సంస్కృతం పుస్తకం చూపించు" అన్నాను. వాడు ఇచ్చిన పుస్తకం చూద్దును కదా! లోపల దేవనాగరి లిపిలో కాని, తెలుగు లిపిలో కాని మచ్చుకి ఒక్క అక్షరం ముక్క కంచు కాగడా వేసి వెతికినా కనిపించ లేదు. అంతా ఇంగ్లీషు లిపే! ఈ కుర్ర కుంకలకి ఇంగ్లీషే సరిగ్గా రాదు. ఆ వచ్చీ రాని ఇంగ్లీషు మాధ్యమంగా సంస్కృతం వెలగబెడుతున్నాడుట. వాడికి పోతన పద్యాలతో పరిచయం లేదు. తిక్కన భారతం గురించి తెలియనే తెలియదుట. లక్ష్మణ కవి సుభాషితాల గురించి విననే లేదుట. పోనీ సంస్కృతం దేవ భాష, అదైనా వస్తే ఏ శాకుంతలమో చదివుంటాడనుకున్నాను. అప్పుడు చెప్పేడు అసలు రహస్యం. సంస్కృతంలో నూటికి తొంభై మార్కులు గ్యారంటీట. అందుకోసం సంస్కృతం చదువుతున్నాడుట.

వాడు పాపం తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. "చదవడం, రాయడం వచ్చా?" అని అడుగుదామనుకుంటూ నాలిక కరుచుకున్నాను. వాడివ్వబోయే సమాధానానికి హార్ట్ ఎటాక్ వచ్చేనా? ఎందుకొచ్చిన రభస, బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు అని అనుకుంటూ తెలుగు మీద అంత వరకు నేను చేసిన పరిశోధనకి తిలోదకాలిచ్చేసి, తోక ముడిచి తిరుగు ముఖం పట్టేను.
=======================

5 comments:

 1. మిత్రులు వేమూరి వారూ,
  మీ సుదీర్ఘమైన ఈ టపాను చదివిన తరువాత కన్నీళ్ళు వచ్చాయి. ఏం చేస్తాం ప్రస్తుతం తెలుగు దశాదిశా ఏమీ బాగో లేవు. రేపోమాపో మరోసారి దేవుడు భూమ్మీదకు పంపేటప్పుడు, తెలుగువాడిగా పుట్టే అవకాశం గురించి ఆలోచిస్తే, ఇద్దామన్నా ఆయనకూ, అడుగుదామన్నా నాకూ, అది ఉండే అవకాశం ఉండదనే బెంగగా ఉంది. ఇకొంచెం కాలానికే తెలుగు అనే భాష ఉండేది అని వేరే భాషల్లో పుణ్యాత్ములు జాలిగా తలచుకొనే పరిస్తితి కదా. మీరు పోతన అంటున్నారు - ఈ కాలం పిల్లలకు అల్పుడెపుడూ పల్కు అంటూ వేమనపద్యం చెప్పినా ఒక్కముక్కా అర్థం కాదు! నా చిన్నతమ్ముడి కూతురు ఇంకా చిన్నపిల్ల - ఆమధ్య ఏనుగంటావేం ఎలిఫెంట్ అని చెప్పొచ్చు కదా అంది ఒక సందర్భంలో. ఇంకేం తెలుగు! ఇంక మనమే మన తెలుగును మర్చిపోకుండా వీలైనంతగా మననం చేసుకొని (మనలో మనమే మాట్లాడుకొని) సంతోషించాలి. కొబ్బరినీళ్ళు ఎవడిక్కావాలీ కోకాకోలా తప్ప, అమృతం ఎవడిక్కావాలి అరకప్పు కాఫీ తప్ప!
  -తాడిగడప శ్యామలరావు.

  ReplyDelete
  Replies
  1. మీతో అంగీకరిస్తాను. నా మిత్రుడు యు.పి. వాడు.వాడిది కుడా ఇదే గోల. వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ లో హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు ఏవి వినపడవట. ఒక్క ఇంగ్లీష్ తప్పించి.

   ఇక ఈ తరం తెలుగు తల్లుల సంగతి చెప్పక్కర లేదు. పిల్లలతో తెలుగు మాట్లాడితే ప్రమాదం అన్నట్లున్నారు. మా గేటెడ్ కమ్యూనిటీ లో ఒక పిల్ల/పిల్లోడిని కనటం, ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించటం. ఆదివారం నాడు ఊరి మీద పడి (మాల్ లో) తినటం. పదేళ్లకె పిల్లవాడు/పిల్ల ఊబకాయం తో పాతికేళ్ల వాళ్ళ లా ఉంట్టున్నారు. ఇది నేటి జీవితం.

   Delete
 2. చాలా మంది నేటితరం తెలుగు హీరోలకి తెలుగు చదవటం రాదని నెట్ లో చదివాను. మహేష్ బాబు తెలుగును ఇంగ్లీష్ లో రాసుకొని డైలాగులు చెపుతాడట.

  ReplyDelete
 3. నేటితరం తెలుగువాడు
  తెలుగు చదవలేని వాడు
  అదే మన తెలుగు గోడు
  ఓ కూనలమ్మా

  ReplyDelete
 4. రావు గారు, వ్యాసం చాలా బావుంది. స్వీడన్, జర్మనీ లాంటి దేశాలు వాళ్ళ మాతృ భాషనీ పరిపుష్టం చేసుకొన్న పద్దతిలో మన భాషనీ కాపాడుకోవటం సాధ్యం కాదేమో. మనకున్న ప్రాధమ్యాలు, ఉద్యోగం కోసం చదువులు, ఎందుకు మాతృ భాష ముఖ్యం అన్నది తెలియకపోవటం ఇంకా మరికొన్ని కారణాల వల్ల ఇది తీరని కోరికేమో.

  ReplyDelete