వేమూరి వేంకటేశ్వరరావు
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎంతో రహశ్యంగా, ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, ఎన్నో కష్టాలు పడి అమెరికా ప్రభుత్వం మూడు అణుబాంబులని నిర్మించింది. బాంబులు అనుకున్నట్టు పని చేస్తున్నాయో లేదో చూడటానికి వాటిల్లో ఒక దానిని నూ మెక్సికో రాష్ట్రంలో ఉన్న ఎడారిలో, అలమగోర్డో అనే చోట, ప్రయోగాత్మకంగా పేల్చి చూసేరు. రెండోదానిని జపానులోని హీరోషిమా నగరం మీద, మూడో దానిని నాగసాకి నగరం మీద పేల్చేరు. అలమగోర్డొ లో ప్రయోగాత్మకంగా పేల్చినది, నాగసాకి మీద పేల్చిన మూడోది ప్లూటోనియం తో చేసినవి; అందుకని వాటిని ప్లూటోనియం బాంబులు అని కూడ అంటారు. హీరోషిమా మీద పేల్చినది యురేనియంతో చేసేరు; కనుక దీనిని యురేనియం బాంబు అని కూడ అంటారు. ఈ రెండు రకాల బాంబుల తయారీలోను, రచన లోనూ, నిర్మాణ శిల్పం లోనూ మౌలికమైన తేడాలు ఉన్నాయి.
యురేనియంతో చేసే బాంబు నిర్మాణంలో ఉన్న కొన్ని సాధకబాధకాలని చూద్దాం. యురేనియంలో రెండు రకాలు ఉన్నాయి: బరువు యురేనియం, లేదా యు-238, తేలిక యురేనియం, లేదా యు-235. ప్రకృతిలో ఈ రెండు కలిసి దొరుకుతాయి; బరువు యురేనియం సమృద్ధిగా దొరుకుతుంది కాని బాంబుల నిర్మాణానికి పనికిరాదు. తేలిక యురేనియం చాల అరుదు; కాని బాంబులు చెయ్యాలంటే ఈ తేలిక యురేనియం కావాలి. కొండరాళ్లల్లో దాగున్న పిసరంత బంగారం కోసం కొండంతా తవ్వి, గుండ చేసి, ఆ గుండని నీళ్లల్లో పోసి, గాలించి, అందులోంచి బంగారం నలుసుని ఏరుకున్నట్లే బరువు యురేనియం నుండి తేలిక యురేనియం ని విడతియ్యాలి. రాళ్లల్లోంచి బంగారపు నలుసులని ఏరటమే తేలిక. ఈ రెండు రకాల యురేనియంల నుండి తేలిక యురేనియం విడదీయటం చాల శ్రమతో కూడిన పని. ఈ సమశ్యని భేదించి తేలిక యురేనియంని మొదట విడదీసిన ఘనత ఎర్నెస్ట్ లారెన్స్ అనే వ్యక్తికి దక్కింది.
లారెన్స్ ఏమి చేశాడంటే ఈ రెండు రకాల యురేనియం కలిసి ఉన్న ఖనిజాన్ని గుండ చేసి, దానిని వేడి చేసి, దానిని కావిరి (vapor) గా (బాష్పంగా) మార్చి, ఆ కావిరిని ఒక త్వరణి (accelerator) లో పెట్టి, ఆ త్వరణి చుట్టూ బలమైన అయస్కాంత క్షేత్రం సృష్టించేడు. ఈ అయస్కాంత క్షేత్రంలో జోరుగా ప్రయాణం చేస్తూన్న తేలిక యురేనియం యొక్క మార్గం ఒక పక్కకి ఒంగిపోతుంది, బరువుగా ఉన్న యురేనియం తిన్నగా వెళిపోతుంది. ఈ పద్ధతి ఉపయోగించి, కష్టపడి ఒక్క బాంబుకి సరిపడా తేలిక యురేనియంని విడదీశాడాయన. ఆ బాంబు హీరోషిమా మీద పడింది.
హిరోషిమా, నాగసాకిల మీద పడ్డ బాంబులతో జపాను లొంగిపోకుండా నిలదొక్కుకుని ఉండి ఉంటే పర్యవసానం ఎలాగుండేదో?
No comments:
Post a Comment