Thursday, February 28, 2013

చిట్టి పొట్టి కబుర్లతో భౌతిక శాస్త్రం


చిట్టి పొట్టి కబుర్లతో భౌతిక శాస్త్రం

వేమూరి వేంకటేశ్వరరావు

సాధారంగా సైన్సు చదవటానికి చాలమంది ఇష్టపడరు. సైన్సు అర్థం చేసుకోవటం శ్రమతో కూడిన వ్యవహారమని చాల మంది నమ్మకం. స్థూలంగా సైన్సుని రెండు శాఖలుగా విడగొట్టవచ్చు: భౌతిక ప్రపంచం లేదా ప్రాణం లేని జడ పదార్థాన్ని గురించి చెప్పేది ఒక శాఖ, ప్రాణంతో సంబంధం ఉన్న పదార్థాన్ని గురించి చెప్పేది రెండవ శాఖ. భౌతిక శాఖని అర్థం చేసుకోటానికి గణితం అత్యవసరం. మాటలతో వర్ణించటానికి కష్టమైన విషయాలు గణిత పరిభాషలో వర్ణించటం తేలిక. అలాగని వాక్యాలకి బదులు సమీకరణాలు రాసినంత మాత్రాన తేలికగా అర్థం అవాలని లేదు. చాలమంది “ఆల్జీబ్రా, గాండ్‌గాభరా” అని భయపడిపోయి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాంకేతిక శాస్త్రాలు చదవటం మానేసి ఏదో “తేలికైన” అంశాలు ఎంపిక చేసుకుని చదువు అయిందనిపిస్తారు. భౌతిక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించలేకపోయినా కొన్ని విషయాల గురించి మౌలిక మైన అవగాహన ఉంటే జీవితంలో ఒక విధమైన సంతృప్తి ఉంటుందని నా నమ్మకం. “కాసింత కలాపోసన లేకపోయిన తరువాత మడిసికి గొడ్డుకి ఏంటి తేడా?” అన్నట్లే కాసింత శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయిన తరువాత మడిసికీ గొడ్డుకీ ఏమిటి తేడా?

ఈ వెలితిని పూడ్చటానికి మన దైనందిన జీవితాలలో తారసపడే కొన్ని విషయాలని తీసుకుని, వాటి వెనక ఉన్న భౌతిక శాస్త్రపు కిటుకులని, తేలిక భాషలో, గణిత సమీకరణాల బెడద లేకుండా, విడమర్చి చెప్పాలనే ఆశతో రాసిన చిన్న చిన్న వ్యాసాలు ఇవి. ఫ్రతి వ్యాసం ఒకటి లేక రెండు పుటలకి మించి ఉండదు. అప్పుడప్పుడు అర పేజీ ఉన్నా ఉండొచ్చు. కావ్యాలు, ఖండకావ్యాలు, నవలలు, కథలు, కథానికలు, గల్పికలు, కార్డు కథలు ఉన్నట్లే సైన్సులో కూడ పొడుగాటి విజ్ఞానసర్వస్వాలు, పాఠ్యపుస్తకాలు, పరిశోధక వ్యాసాలు, జనరంజక వ్యాసాలు, చిట్టిపొట్టి వ్యాసాలు రాయవచ్చు. చిన్న విషయం తీసుకుని, దానిని ఒక కోణం నుండి పరీక్షించి, క్లుప్తంగా, చిన్న కార్డు కథలా చెప్పటమే ఈ వ్యాసాల ఉద్దేశం. చిన్నవి కనుక మీకు విసుగు పుట్టే లోగా చదవటం అయిపోతుంది. ఈ వ్యాసాలు ఒక వరుస క్రమంలో చదవాలని లేదు కాని, సంబంధిత వ్యాసాలని దగ్గర దగ్గరగా అమర్చేను.

అసలు భౌతిక శాస్త్రం అంటే ఏమిటి? పదార్థము (మేటర్), శక్తి (ఎనర్జీ) అనే రెండింటి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలని అధ్యయనం చేసేదే భౌతిక శాస్త్రం. శక్తి యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుందికి చేసే ప్రయత్నమే భౌతిక శాస్త్రం. ఈ శక్తి మనకి అనేక రూపాల్లో అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఇది చలన రూపంలోను, వేడి రూపంలోను, వెలుగు రూపంలోను, విద్యుత్ రూపం లోను, వికిరణం రూపంలోను, గురుత్వాకర్షణ రూపంలోను – ఇలా అనేక రూపాల్లో మనకి తారసపడుతూ ఉంటుంది. ఈ శక్తికి కళ్లెం వేసి మన అవసరాలకి ఉపయోగించుకోవటానికి మనకి సైన్సుతో కనీసం పరిచయం ఉండాలి. ఈ రకం పరిచయం విద్యార్థులకి తప్పనిసరి. రాజకీయాలలో ఉండి మనకి నాయకత్వం వహించటానికి ప్రయత్నించే వినాయకులకి ఇంకా అవసరం. ఇక్కడ నేను చెయ్యబోయే ప్రయత్నం అదే. చదవండి. చదివినది అంతా అర్థం కాకపోయినా సూత్రప్రాయంగా అర్థం అయితే చాలు.

No comments:

Post a Comment