Wednesday, September 1, 2010

లెక్కకు అందని కాలమానం

విశ్వస్వరూపం (గత సంచిక తరువాయి)

1. లెక్కకు అందని కాలమానం

వేమూరి వేంకటేశ్వరరావు

విశ్వం, సృష్టి ఎంతో పురాతనమైనవని పాశ్చాత్యులు మొన్నమొన్నటి వరకు ఒప్పుకోనే లేదు. బైబిలు ప్రకారం దేవుడు ఈ విశ్వాన్ని 5,000 ఏళ్ల క్రితం సృష్టించేడు. వారి దృష్టిలో దేవుడు మానవ స్వరూపుడు, మగ వాడు.

విశ్వమూ, సృష్టీ ఆదిమధ్యాంతరహితం అని మనం అంటాం. ఆదిమధ్యాంతరహితుడయిన సృష్టికర్తని మానవ కాలమానం తోటీ, దైర్ఘ్య మానం తోటీ కొలవలేము. అయినా ఆ సృష్టి ప్రక్రియలని వర్ణించటానికి పెద్ద పెద్ద సంఖ్యలు కావాలి. అందుకనే కాబోలు పెద్ద పెద్ద సంఖ్యలంటే మనవాళ్లకి బొత్తిగా భయం లేదు. “పాశ్చాత్యులకి పెద్ద పెద్ద సంఖ్యలంటే భయమా?” అని మీరు నన్ను అడగొచ్చు. వాళ్లకి భయమో కాదో నాకు తెలియదు కాని, వాళ్ల పురాతన సంస్కృతిలో పెద పెద్ద సంఖ్యల ప్రస్తావనే లేదు; వాటి అవసరం వాళ్లకి వచ్చినట్లే లేదు. ఎందుకొస్తుంది? క్రైస్తవుల దృష్టిలో సృష్టికి ముందు ఏదీ లేదు. కనుక 5,000 ని మించిన పెద్ద సంఖ్య అవసరం వాళ్లకి తట్టి ఉండక పోవచ్చు - కనీసం కాలాన్ని కొలిచేటప్పుడు.

1. రావణాసురుడి కథ
నా చిన్నతనంలో మా నాన్నగారు తమాషాకి ఒక కథ చెప్పే వారు. రావణాసురుడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యం ఏలేడని అంటారు కదా. రావణుడు పుట్టగానే ఎవ్వరో బ్రహ్మ దగ్గరకి ఈ వార్తని మోసుకెళ్ళి మనవడికి జాతకం రాయమని అడిగేరుట. బ్రహ్మ అప్పుడే కాలకృత్యాలు తీర్చుకుందుకని చెంబు చేత పుచ్చుకుని బైలుకి బయలుదేరుతున్నవాడు కావున, “ఈ పని అయిన తర్వాత ఆ పని చూద్దాం” అన్నాడుట. బ్రహ్మ పని ముగించుకుని తిరిగి వస్తూ ఉంటే, మరొకరెవ్వరో, “తాతా! నీ మనవడు చచ్చిపోయేడు” అని చావు వార్త చల్లగా అందించేరుట. మన కాలమానం ఎంత విస్తృతమైనదో ఊహించుకోటానికి ఈ కథ ఉపయోగపడుతుంది.


2. హైందవ కాలమానం
మన కాలమానం ప్రకారం కలియుగం ఒక్కటే 432,000 సంవత్సరాలు నడుస్తుంది. కలియుగం కంటె ద్వాపరయుగం రెండింతలు, త్రేతాయుగం మూడింతలు, కృతయుగం నాలుగింతలు. ఈ నాలుగు యుగాలనీ కలిపి ఒక మహాయుగం అంటారు. అంటే ఒక మహాయుగం కలియుగం కంటే పదింతలు, లేదా 4,320,000 సంవత్సరాలు. ఆధునిక పరిభాషలో 4.32 మిలియను సంవత్సరాలు. మనందరికీ ఈ రోజుల్లో ఐన్‌స్టయిన్ సిద్ధాంతాలు కరతలామలకాలు అయిపోయాయి కనుక, పైన చెప్పిన ‘సంవత్సరాలు’ మన భూలోకం లెక్క ప్రకారం అని మరచిపోకండి. కనుక వీటిని ‘మానవ సంవత్సరాలు’ అందాం.

కాని సృష్టి జరిపే బ్రహ్మ ఎక్కడో సత్యలోకంలో ఉంటాడు. అక్కడ సంవత్సరం పొడుగు వేరు. అక్కడ లెక్క ఇలా ఉంటుంది. సత్యలోకంలో పగటి పూటని ఒక కల్పం అనీ రాత్రి పూటని ఒక కల్పం అనీ అంటారు. ఒక పగలూ, ఒక రాత్రీ కలపగా వచ్చిన దినాన్ని విశేష కల్పం అంటారు.

సత్యలోకంలో బ్రహ్మ కాలకృత్యాలు తీర్చుకుని “అక్కడి సూర్యోదయం” వేళకి సృష్టి మొదలు పెడతాడు. సాయంత్రం అయేసరికి సృష్టి లయమై పోతుంది. దీనినే ప్రళయం అంటారు. రాత్రి బ్రహ్మకి విశ్రాంతి సమయం. రాత్రి వేళప్పుడు మన మెదడు కలలు కంటూ ఎలా ‘విశ్రాంతి’ తీసుకుంటుందో అదే విధంగా బ్రహ్మ నిద్రపోతూన్నప్పుడు, మరునాటి సృష్టికి జరగవలసిన ప్రయత్నాలు జరుగుతాయన్నమాట. ఇటువంటి ప్రక్రియనే ఇంగ్లీషులో ‘రీ గ్రూపింగ్’ అంటారు.

ఒక కల్పం పొడుగు 14 మన్వంతరాలు. ఒకొక్క మన్వంతరం 71 మహాయుగాల మీద కొంత చిల్లర. ఈ చిల్లర ఎక్కడనుండి వచ్చిందంటే – అదంతా ఒక సంక్లిష్టమైన లెక్క; ఇప్పుడు చెప్పటం మొదలు పెడితే అది పెడ దారి అవుతుంది, కాల యాపన అవుతుంది. ఏది ఏమైతే నేమి ఒక కల్పంలో 14*71 = 994 మహాయుగాలు. (ఇక్కడ నక్షత్రాన్ని గుణకారానికి గుర్తుగా వాడేను.) దీనికి పైన చెప్పిన చిల్లర కలిపితే 1 కల్పం = 1,000 మహాయుగాలు. చూశారా, దశాంశ పద్ధతిలో ఇమడ్చటానికి లెక్కని ఎలా కిట్టించేరో. ఒకొక్క మహాయుగం 4.32 మిలియను సంవత్సరాలు కనుక 1 కల్పం = 1,000 * 4.32 మిలియను = 4.32 బిలియను మానవ సంవత్సరాలు. (అమెరికాలో వాడే పద్ధతి ప్రకారం ఒక బిలియను అంటే 1 తర్వాత 9 సున్నలు. ఈ పద్ధతే ఇక్కడ వాడబోతున్నాను.)

కనుక బ్రహ్మ పగలు 4.32 బిలియను, రాత్రి 4.32 బిలియను మానవ సంవత్సరాలు. లేదా సత్యలోకంలో ఒక దినం 8.64 బిలియను మానవ సంవత్సరాలు. ఇటువంటివి 360 దినాలు గడిస్తే అది ఒక సత్యలోకపు సంవత్సరం. (చూసారా, ఇక్కడ మన భూలోకంలో 360 రోజులు ఒక సంవత్సరం అవుతుంది కాని, మరే లోకం లోను అవాలని లేదు, సాధారణంగా కాదు. మానవ సంవత్సరాల పొడుగుని సత్యలోకపు సంవత్సరానికి అంటగట్టేం. దీనినే మానవ కేంద్ర దృక్పథం - anthropomorphic view - అంటారు. కాని ఇది మనకి ఇప్పుడు అనవసరం.) కనుక బ్రహ్మకి ఒక సంవత్సరం గడిచేసరికి ఈ భూలోకంలో 360 * 8.64 = 3.1104 ట్రిలియను సంవత్సరాలు. (అమెరికాలో వాడే పద్ధతి ప్రకారం ఒక ట్రిలియను అంటే 1 తర్వాత 12 సున్నలు.)

బ్రహ్మ ఆయుర్దాయం 100 సత్య లోకపు సంవత్సరాలు, లేదా 311.04 ట్రిలియను సంవత్సరాలు. ఈ కాలాన్నే ‘పర’ అంటారు. ఇందులో సగం ‘పరార్ధం.’ మన బ్రహ్మకి ఏభై ఏళ్ళ వరకూ ఉన్న కాలం ప్రథమ పరార్ధం. మన ఇప్పటి బ్రహ్మ ఇప్పటి వయస్సు 51; కనుక మనం ఇప్పుడు ద్వితీయ పరార్ధంలో ఉన్నాం. ఈ 51 వ సంవత్సరాన్ని శ్వేత వరాహ కల్పం అంటారు. (మన భూలోకంలో ప్రభవ, విభవ, లాంటి పేర్లు ఉన్నట్లే, సత్యలోకంలో ప్రతి ‘ఏడు’ కి ఒక పేరు ఉందన్న మాట..) ఈ శ్వేత వరాహ కల్పంలో ప్రస్తుతం నడుస్తూన్న మన్వంతరం పేరు వైవశ్వత మన్వంతరం. ఈ వైవశ్వత మన్వంతరంలోని 28 వ మహాయుగంలోని కలియుగంలో, ప్రథమ పాదంలో ఉన్నాం. ఈ కలియుగం శ్రీకృష్ణ నిర్యాణంతో ఉరమరగా 5,000 ఏళ్ళ క్రితం మొదలైంది. ఈ ప్రథమ పాదంలోనే కలియుగం ఇలా మండిపోతోంది. ఇహ చతుర్ధ పాదంలో ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తాను.

పై పేరాలో ‘మన ఇప్పటి బ్రహ్మ ఇప్పటి వయస్సు’ అని వాడేను. చదువరులలో కుశాగ్రబుద్ధులు కొందరు, “మరొకప్పుడు మరొక బ్రహ్మ ఉండేవాడా?” అని అడగొచ్చు. అలా అడిగేవారికి పిట్టకథ ఒకటి చెబుతాను. సావధానంగా ఆలకించండి.

3. ఆష్టావక్రుడు, రోమహర్షుడు
ఒకనాడు స్వర్గలోకంలో ఇంద్రుడు చాల ఉషారుగా ఉన్నాడు. అప్పుడే రాక్షసుల మీద దండయాత్ర చేసి, వారిని హతమార్చి, విజయోత్సాహంతో ఉన్నాడేమో వ్యక్తి అఘమేఘాల్లోనే ఉన్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక విజయ స్థంబం – ఛ! స్థంబం ఏమిటి, మరీ భూలోకపు రాజుల్లా – ఒక పెద్ద భవనం నిర్మించటానికి సమకట్టేడు. (ధర్మరాజులవారు రాజసూయ యాగం చేసే ముందు మయ సభ నిర్మిచ లేదూ, అలాగన్న మాట.) వెంటనే విశ్వకర్మకి కబురు పెట్టేడు. విశ్వకర్మ ఇంద్రుడి ఆజ్ఞని శిరసావహించి రాజభవనానికి కావలసిన హంగులన్నీ కూర్చి ఒక దివ్యమైన కట్టడానికి రూపు రేఖలు దిద్దుతున్నాడు. కట్టబోయే భవనం నమూనాలు చూసినప్పుడల్లా ఇంద్రుడి మనస్సులో కొత్తకొత్తవి, పెద్దపెద్దవి అయిన ఊహలు మొలకెత్తటం మొదలెట్టేయి. తనంతటి వాడు తను. రాక్షసుల చేత మట్టి కరిపించిన తను. తన అంతస్తుకి తెస్సోడుతూన్న భవనమా? అందుకని భవనం చుట్టూ ఒక ఉద్యానవనం కావాలన్నాడు. విశ్వకర్మ ‘సరే’ అన్నాడు. తర్వాత వనంలో పాలరాతి లతాగృహం అన్నాడు. విశ్వకర్మ ‘సరే’ అన్నాడు. తర్వాత పాలరాతి గోడలమీద రత్నాలు తాపడం పెట్టాలన్నాడు. విశ్వకర్మ ‘సరే’ అన్నాడు. ఆ తర్వాత జలయంత్రాలు, అంబుస్పోటాలు కావాలన్నాడు ఇంద్రుడు. ఇలా అధికార మదాంధతతో రోజుకో కొత్త కోరిక వెలిబుచ్చటం మొదలు పెట్టేసరికి విశ్వకర్మకి విసుగు పుట్టుకొచ్చింది.

విశ్వకర్మ రహశ్యంగా ఊర్ధ్వలోకమైన సత్యలోకానికి ప్రయాణమై వెళ్ళేడు. బ్రహ్మకి అసలు విషయం అవగాహన అయింది. పరిస్థితికి తగిన చర్య జరుగుతుందని నచ్చజెప్పి, విశ్వకర్మని దిగువకి పంపి తనేమో ఊర్ధ్వలోకమైన వైకుంఠానికి వెళ్ళేడు. అక్కడ విష్ణుమూర్తి కథ అంతా సావధానంగా విన్నాడు.

మరునాడు ఇంద్రుడు సింహాసనారూఢుడై, అప్సరసల సాన్నిధ్యంలో ఆనంద డోలికలో ఊగిసలాడుతూ ఉన్న సమయంలో పట్టుమని పదేళ్లు కూడ నిండని ఒక బాలుడు ఒక చేతిలో దండం, మరొక చేత కమండలం, చంకలో కృష్ణాజినం, ముఖంలో దివ్యమైన తేజస్సుతో ఆస్థానంలో ప్రవేశించేడు. అతడు సకల విద్యా కోవిదుడని చెప్పకుండానే తెలుస్తోంది.

ఇంద్రుడు ఆ బాలుడిని చూసి సింహాసనం దిగి ఎదురేగి స్వాగతం పలికేడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి యధోచితంగా అతిధిని సత్కరించి, “స్వామీ, తమరెవరో, తమ రాకకి కారణం ఏమిటో శలవియ్యండి” అంటూ వినయ విధేయతలతో అడిగేడు.

“ఓ, మహాబలీ! ప్రపంచంలో ఎక్కడా కనీ వినీ ఎరగని అత్యద్భుతమైన రాజప్రాసాదాన్ని నిర్మిస్తున్నావని నాలుగు నోట్లా విని విషయావలోకన చేసి పోదామని వచ్చేను. గతంలో ఏ ఇంద్రుడూ ఇటువంటి సౌధాన్ని నిర్మించలేదటగదా?”

గర్వమదాంధతతో ఉన్న ఇంద్రుడు ఈ ముక్కుపచ్చలారని బాలుని ధిషణని పరాభవించటానికా అన్నట్లు, తూష్ణీంభావంతో, “వత్సా, ఎంతమంది ఇంద్రులని చూసేవేమిటి? అహ, ఎంతమంది ఇంద్రుల గురించి విన్నావేమిటి?” అని హేళనగా అడిగేడు.

ఆ ప్రశ్నకి సమాధానంగా మందస్మిత వదనారవిందంతో ఆ బాలుడు ఇలా అన్నాడు.

“దేవేంద్రా! కుమారా! సావధానంగా విను. నేను చాల మంది ఇంద్రులని చూసేను. నీ తండ్రి కశ్యపుడిని నాకు తెలుసు. బ్రహ్మకి కుమారుడు, నీకు తాత అయిన మరీచిని నాకు తెలుసు. ఆ బ్రహ్మ విష్ణుమూర్తి నాభి లోని కమలం నుండి ఉద్భవించటం నేను స్వయంగా ఎరుగుదును. ఆ మాటకొస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే నేను ఎరుగుదును.

“సృష్ట్యాది ప్రళయ పర్యంతం జరిగే కార్యక్రమాన్ని అంతా కళ్లారా చూసిన వ్యక్తిని నేను. ఒక సారి కాదు. పదే పదే చూసిన వాడిని. ప్రళయ సమయంలో విశ్వస్వరూపం ఎలా ఉంటుందో తెలుసా? ‘ఈ విశ్వం’ లోని స్థావర జంగమాత్మకమైన ప్రతి అణువు నామరూపాలు లేకుండా నశించిపోయి ప్రళయ నిశీధిలోని అనంతంలో లీనమై అదృశ్యమైపోతుంది. ఆ దృశ్యం వర్ణనాతీతం.

“ ‘ఈ విశ్వం’ అన్నాను కదూ? ఇటువంటి విశ్వాలు ఎన్నో! ఎన్నని ఎవరు లెక్కపెట్టగలరు? అవి అనంతం. సముద్రంలోని నీటి బుడగలులా అనంతమైన విశ్వాలు అలా ఉద్భవిస్తూనే ఉంటాయి, నశిస్తూనే ఉంటాయి. ఒకొక్క విశ్వంలో సృష్టికార్యాలు నిర్వహించటానికి ఒకొక్క బ్రహ్మ. ఇటువంటి విశ్వాలలోని ప్రపంచాలలో ఇక ఇంద్రులు ఎంతమంది ఉంటారో? వారిని లెక్క పెట్టే ఓపిక ఎవ్వరికి ఉంది? సముద్రపుటొడ్డున ఉన్న ఇసక రేణువులని లెక్కపెట్టగలమా?

“ఒకొక్క ఇంద్రుడు ఒకొక్క మన్వంతరం పాటు రాజ్యం ఏలుతాడు. ఇలాంటి ఇంద్రులు 28 అయేసరికి బ్రహ్మకి ఒక రోజు…..”
ఇలా చెప్పుకు పోతూన్న ఆ కథనాన్ని ఆ బాలుడు హటాత్తుగా ఆపి, నేల మీద బారెడు వెడల్పున బారులు తీర్చి పోతూన్న చీమలని చూసి ఒక చిరునవ్వు నవ్వేడు.

“మహానుభావా! ఎందుకు కథనాన్ని ఆపివేసేరు? ఎందుకలా నవ్వుతున్నారు?” అని ఇంద్రుడు ఆత్రుతగా అడిగేడు.
“ఎందుకు నవ్వుతున్నానా? అది పరమ రహశ్యం. దుఃఖానికి మూల కారణం ఏమిటో ఈ రహశ్యంలో ఇమిడి ఉంది. చీకటిలో తాడుని చూసి పాము అని ఎలా అనుకుంటామో, దీపపు వెలుగులో అది పాము కాదు, తాడే అని ఎలా తెలుసుకుంటామో అలాగే జ్ఞానోదయం అయిన వ్యక్తి ఈ సృష్టిలోని నిజానిజాల తారతమ్యాన్ని తెలుసుకో గలుగుతున్నాడు. చూడు, ఈ చీమల బారు ఎంత పెద్దగా ఉందో. బారెడు వెడల్పుతో ఒక నదీ ప్రవాహంలా పాకుతూన్న ఈ చీమలన్నీ ఒకనొకప్పుడు నీలాగే ఇంద్ర పదవిని అధిష్టించిన వారే. వారి కర్మానుసారం ఇలా చీమల జన్మ ఎత్తి కర్మ పరిపక్వం కొరకు ఎదురుచూస్తున్నారు…..”

ఆ బాలుడు ఇలా ఉపదేశం చేస్తూ ఉంటే సభలోనికి మరొక విచిత్రమైన వ్యక్తి వచ్చేడు. అతనికి నఖశిఖ పర్యంతం జుత్తే. ఛాతీ మీద మాత్రం గుండ్రంగా కొంత మేర రోమాలేవీ లేకుండా బోడిగా ఉంది. ఆ ఖాళీ చుట్టూ వలయాకారంగా బొద్దుగా జుత్తు పెరిగి ఉంది.

ఇప్పటికే సంభ్రమాశ్చ్యర్యాలలో ములిగి తేలుతూన్న ఇంద్రుడు తేరుకొని, “మహానుభావా! తమరు ఎవ్వరు? ఎక్కడనుండి వస్తున్నారు? నేను మీకు ఏ విధంగా సేవ చెయ్యగలను?” అని కుశల ప్రశ్నలు వేసేడు.

“ఇంద్రా! నువ్వు దిగ్విజయ యాత్ర ముగించుకొని ఒక అత్యద్భుతమైన భవనం నిర్మిస్తున్నావని విని ఆ భవనం చూసిపోదామని వచ్చేను.

“నేనెవరినా? నన్ను రోమహర్షుడు అంటారు. నా వక్షస్థలం చూస్తున్నావు కదా. ఒకొక్క ఇంద్రుడు మరణించినప్పుడల్లా ఒకొక్క వెంట్రుక ఈ వక్షస్థలం నుండి రాలి పోతుంది. అందుకనే మధ్యలో వెంట్రుకలు లేకుండా బోసిగా ఉంది.

ఈ ద్వితీయ పరార్ధం పూర్తి అయేసరికి ఇప్పటి బ్రహ్మ జీవితం చాలిస్తాడు. అప్పుడు వచ్చే మహా ప్రళయంలో నేను కూడ లీనమయిపోతాను. ఇటువంటి అల్పాయుద్దాయంతో పెళ్లి చేసుకుని జంఝాటన పెంచుకోవటమెందుకని బ్రహ్మచారిగా ఉండిపోటానికే నిశ్చయించుకున్నాను. ఆ విష్ణు మూర్తి ఒక్క సారి కళ్ళు తెరచి మూసే వ్యవధిలో ఒక బ్రహ్మ జీవిత కాలం పూర్తి అయిపోతుంది.”
ఈ మాటలు చెబుతూ రోమహర్షుడు అకస్మాత్తుగా అదృశ్యమై పోయాడు. చీమల బారు గురించి చెబుతూ ఉన్న బాలుడు ఎప్పుడో అదృశ్యమైపోయాడు.

ఇదంతా వింటూన్న ఇంద్రుడికి గర్వభంగం అయింది. తను భవన నిర్మాణ పథకాన్ని విరమించుకున్నట్లు విశ్వకర్మతో సవినయంగా మనవి చేసుకున్నాడు.

అదండీ, భారతీయులు ఈ విశ్వం ఎంత పురాతనమైనదో చెప్పటానికి ఈ కథ అల్లి చెప్పేరు.

10 comments:

 1. చాల బాగుంది .

  ReplyDelete
 2. అద్భుతం ! పరమాద్భుతం గా ఉంది.ఎప్పుడూ ఆ పదాలను వినడమే కానీ అర్థం తెలీదు( శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమ పాదే, జంబూ ద్వీపే....) చాలా చక్కగా వివరించారు. కృతజ్ఙతలు.

  ReplyDelete
 3. చక్కటి వివరాలు అందించారు. ధన్యవాదాలు.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. బాగుంది మాష్టారు

  ReplyDelete
 6. చాలా గొప్పగా ఉందండి!
  చిన్న అనుమానం. "కల్పం" అంటే బ్రహ్మకి సగం రోజు అని చెప్పారు కదా. మరి ఒక (బ్రహ్మ)సంవత్సరానికి శ్వేతవరాహ "కల్పం" అని పేరెందుకు ఉంది?

  ReplyDelete
 7. కామేశ్వరరావు గారు

  మంచి ప్రశ్నే. కొంచెం పరిశోధన చేసి సమాధానం చెబుతాను. ఈ అధ్యాయానికి చిన్న అనుబంధం రాస్తున్నాను. అందులో లెక్కలన్నీ వివరంగా చేసి చూపుతాను.

  ReplyDelete
 8. చాలా బాగుందండి కథ.
  నాకు ఒక సందేహం వుండేది. భౌతిక శాస్త్రం ప్రకారం సృష్టి వయస్సు 10 బిలియను ఏండ్లంటారు. దానికి తోడు కాలగమనవేగము గురుత్వాకర్షన శక్తితో మారుతుందంటారు. అయిన ఎక్కడి కాలగమనవేగముఁ బట్టిఁ అది 10 బిలియను అయినదా అని.
  ఆ అంశము పైన దీర్ఘమైన టపా ఒకటి వేస్తారని ఆశిస్తున్నాను.

  రాకేశ్వర

  ReplyDelete
 9. రాకేశ్వర:

  సృష్తి జరిగి 13.7 బిలియను సంవత్సరాలు అయిందని ఆధునిక అంచనాలు. ఇది కేవలం అంచనా మాత్రమే. అయిదేళ్ల క్రితం వరకు ఈ అంచనా 17 బిలియను సంవత్సరాలు దగ్గర ఉండేది. ఈ మధ్య ఈ అంచనా 10 బిలియనుల సంవత్సరాలని ఎవరైనా అన్నారేమో. ఆ విషయం నాకు తెలియదు.

  పోతే కాలగమన వేగం (how fast time is moving) మీద కూడ చాల తర్జనభర్జనలు జరుగుతున్నాయి. బలమైన గురుత్వాకర్షక క్షేత్రాల్లో కాల గమనం జోరు తగ్గుతోందా అనే విషయం కూడ అధ్యయనం చెయ్యవలసిన విషయమే.

  ఇప్పటికి రాసిన 16 వ్యాసాలు ప్రచురణ పూర్తి అయే వేళకి ఈ విషయం మీద కూడ ప్రత్యేకించి ఒక వ్యాసం రాస్తాను.

  ReplyDelete
 10. Nice Post. There was a similar story in Bhagavatam to show Lord Brahma, how Krishna is supreme God :-)

  ReplyDelete