Tuesday, September 7, 2010

1. లెక్కకు అందని కాలమానం - అనుబంధం

విశ్వస్వరూపం:

1. లెక్కకు అందని కాలమానం - అనుబంధం

హిందూ పురాణాలలో (ముఖ్యంగా, విష్ణుపురాణంలో) కాలమానం ఈ దిగువ చూపిన విధంగా వర్ణించబడింది. ఈ వర్ణన నేను సంప్రదించిన అన్ని గ్రంధాలలోనూ ఒకేలా లేదు. కాని, స్థూలంగా కథ ఈ దిగువ చూపిన విధంగా ఉంటుంది. ఈ దిగువ చూపిన కాలమానం నిజమా కాదా అన్న వివేచన ఇక్కడ అప్రస్తుతం; కాలగమనానికి ఇంత విస్తృతమైన నమూనా మన పూర్వులు నిర్మించేరంటే అది వారి ఊహాశక్తికి ఒక అపురూపమైన నిదర్శనం.

ఈ కింది లెక్క చూస్తూ ఉంటే మరొక విషయం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. యుగాల, మహాయుగాల, మన్వంతరాల, సంధ్యకాలాల పొడుగులు, బ్రహ్మ ఆయుర్దాయం, మొదలైన సంఖ్యలు – అన్నీ - 432 అనే సంఖ్య చుట్టూ పరిభ్రమించే విధంగా కిట్టించినట్టు కనబడుతుంది. ఉదాహరణకి మన భూలోకంలో ఒక సంవత్సరం పొడుగు ఇదమిత్థంగా “ఇంత” అని చెప్పలేము; ఏదో ఉరమరగా 365.242199 రోజులు అని సర్దుకుపోతున్నాం. కాని ఈ దిగువ లెక్కలో సంవత్సరం పొడుగు 360 రోజులు అని సౌలభ్యం కొరకు వాడబడింది. ఈ 360 ఇక్కడ వాడకపోతే తరువాత ఆ 432 రాదు. అలాగే మానవుని ఆయుర్దాయం 100 మానవ సంవత్సరాలు అనీ, బ్రహ్మ ఆయుర్దాయం 100 “బ్రహ్మ సంవత్సరాలు” అనీ అనటం లో శాస్త్రీయత లేదు. కనుక ఈ దిగువ చూపిన లెక్కలని ఓ గుటికెడు కషాయంతో సేవించండి.

మచ్చుకి ఈ కింది లెక్క చూడండి.. మన భూలోకంలో -

4,32,000 సంవత్సరములు = కలియుగం
8,64,000 సంవత్సరములు = ద్వాపర్యుగం
12,96,000 సంవత్సరములు = త్రేతాయుగం
17,28,000 సంవత్సరములు = కృతయుగం

ఈ 432 ఎక్కడనుండి వచ్చిందని అడగకండి. అదొక పెడదారి పట్టిస్తుంది.

ఈ నాలుగు యుగాల కాలాన్ని కూడితే 43,20,000 సంవత్సరాలు వస్తాయి. దీనిని ఒక మహాయుగం అంటారు. కనుక,

1 మహాయుగం = 43,20,000 సంవత్సరములు = 4.32 మిలియను సంవత్సరములు

1 మన్వంతరం = 71 మహాయుగాలు = 4.32 *71 = 306.72 మిలియను సంవత్సరాలు (ఇక్కడ నక్షత్రం గుర్తు గుణకారానికి వాడబడింది.)

ఇలాంటి మన్వంతరాలు 14 ఉన్నాయిట. (ఈ 71 అనే సంఖ్య 14 అనే సంఖ్య ఎక్కడినుండి ఊడిపడ్డాయో తెలుసుకోవాలంటే ఈ దిగువ ఇచ్చిన లెక్కని జాగ్రత్తగా చూడాలి.)

ప్రతి మన్వంతరం ప్రారంభంలోనూ, అంతంలోనూ కృతయుగపు ప్రమాణంలో ఒక సంధి కాలం (లేదా, సంధ్యా కాలం) ఉందని ఊహించుకుంటే ఒక కల్పం పొడుగు తెలుస్తుంది.

1 కల్పం = 14 మన్వంతరాలు + 15 సంధి కాలాలు = బ్రహ్మకి ఒక పగలు

1 బ్రహ్మ పగలు = 1 కల్పం = 306.72*14 + 1.728*15 = 4294.08 + 25.92 = 4,320 మిలియను సంవత్సరాలు = 4.32 బిలియను సంవత్సరాలు (ఇది బిలియను, మిలియను అని పొరబడకండి)

చూశారా, ఈ 432 అనే సంఖ్య రావటం కోసం ఎంత తంటాలు పడ్డారో. ఈ 432 కి వేద కాలం నుండీ ఒక ప్రత్యేకత ఉంది.

మరొక విషయం ఏమిటంటే, ఆధునిక శాస్త్రం ప్రకారం భూమి పుట్టి దరిదాపు 4 బిలియను సంవత్సరాలు పైబడి. ఇది కేవలం కాకతాళీయం అని మనం ఎంత అనుకున్నా, పురాణాలలో ఉన్న లెక్కకీ, మన ఆధునిక లెక్కకీ ఉన్న పోలిక కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఏది ఏమైతేనేమి – ఇటుపైన చెప్పే లెక్క అన్ని చోట్లా ఒకేలా కనిపించటం లేదు. చిన్న చిన్న తేడాలని విస్మరించి, లెక్కని స్థూలంగా చూద్దాం.

1 బ్రహ్మ రాత్రి = 1 కల్పం = 306.72*14 + 1.728*15 = 4294.08 + 25.92 = 4,320 మిలియను సంవత్సరాలు = 4.32 బిలియను సంవత్సరాలు

బ్రహ్మకి ఒక దినం = 1 పగలు + 1 రాత్రి = 8.640 బిలియను భూలోక సంవత్సరాలు

బ్రహ్మ ఆయుర్దాయం 100 బ్రహ్మ దినాలా, 100 బ్రహ్మ సంవత్సరాలా అన్నది ఒకొక్క చోట ఒక్కోలా ఉంది. మనం బ్రహ్మ ఆయుర్దాయం 100 బ్రహ్మ సంవత్సరాలు అనుకుందాం.

బ్రహ్మ ఆయుర్దాయం = 100 సంవత్సరాలు = 100 * 360 * 8.640 బిలియను భూలోక సంవత్సరాలు = 31104 బిలియను సంవత్సరాలు = 31.104 ట్రిలియను భూలోక సంవత్సరాలు = 1 పర

సృష్టి మొదలయిన దగ్గరనుండి ఇప్పటికి ఆరుగురు బ్రహ్మలు గతించేరు. గతించిన బ్రహ్మల పేర్లు: మానస, చాక్షుష, వాచిక, శ్రావణ, సత్య, అండజ.

ఇప్పుడు ఏడవ బ్రహ్మ అయిన పద్మజుని కాలంలో ఉన్నాం. ఈయన వయస్సు 51 వ సంవత్సరాలు. ఇందులో ప్రథమ కల్పమైన శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. మన సంవత్సరాలకి ప్రభవ, విభవ, శుక్ల మొదలైనవి 60 పేర్లు ఉన్నట్లే, ఈ కల్పాలకి 30 పేర్లు ఉన్నాయిట. ఆవి ఇక్కడ ఏకరవు పెట్టవలసిన అవసరం లేదు. కుతూహలం ఉన్నవాళ్లకి ఈ పేర్లు పురాణాలలో దొరుకుతాయి. ఉదాహరణకి కప్పగంతుల సుబ్బరాయశర్మ, కాలచక్రం, చూడండి. http://www.samputi.com/app_data/magazines/samputi12.pdf

ఇప్పుడు మనం ఈ శ్వేతవరాహ కల్పంలో వచ్చే 14 మన్వంతరాలలో ఏడవ మన్వంతరం అయిన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. సరదా ఉన్న వాళ్లకి ఈ 14 మన్వంతరాల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను: స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుస, వైవశ్వత, సూర్యసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, మరియు బౌచ్చ. (అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర పై జాబితాలో రెండవ మనువైన స్వారోచిష మనువు గురించి అనుకుంటాను.)

ఈ వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచి, ఇప్పుడు 28 వ మహాయుగంలో ఉన్నాం. ఈ 28 వ మహాయుగంలో కృత, త్రేత, ద్వాపర్ యుగాలు గడచిపోయేయి. కలియుగం ప్రవేశించి 5111 సంవత్సరాలు (ఇది రాసిన తేదీ సా. శ. 2010).

ఇంతవరకు కాలనిర్ణయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్థల నిర్ణయం ఎలా జరుగుతుందో చూద్దాం.

పరిపాలనా సౌలభ్యం కొరకు మనువులు భూమిని 7 భాగాలుగా విభజించి పాలించేరు. ఆ ఏడు భాగాల పేర్లు ఇవి: జంబూద్వీపం, ప్లక్షద్వీపం, క్రౌంచద్వీపం, శాల్మిక ద్వీపం, పుష్కరద్వీపం, శాకద్వీపం. (ఈ ఏడు ద్వీపాలనీ ఏడు ఖండాలుగా మనం ఊహించుకోవచ్చు: ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా (ఇండియా ఉపఖండాన్ని మినహాయించి), మరియు ఇండియా ఉపఖండం.

ఆధునిక భారత దేశం జంబూద్వీపంలో ఉంది. ఈ జంబూ ద్వీపానికి అధిపతి పేరు నాభి. ఈ నాభికి మేరూదేవి యందు ఋషభుడు కలిగేడు. ఈ ఋషభుడుకి 100 మంది సంతానం. వీరిలో పెద్దవాడు భరతుడు. ఈ భరతుడు పాలించిన ప్రాంతమే భరతవర్షం. సముద్రానికి ఉత్తరమున, హిమాలయాలకి దక్షిణమున ఉన్న ప్రాంతమే భరతవర్షం. ఆధునిక పరిభాషలో చెప్పుకోవాలంటే ఇండియన్ సబ్‌కాంటినెంట్.

కనుక మనం పూజ చేసేటప్పుడు దేవుడికి మన చిరునామా నిర్ద్వందంగా చెబితే ఆయన మనం కోరిన కోరికలని మన చిరునామాకి పంపుతాడు. అందుకనే…”అద్యబ్రహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే. అంటూ మనం ఉన్న కాలాన్ని, స్థలాన్ని చెప్పి అంతటితో ఊరుకోము. ఆ తరువాత మనం ఆ పూజ ఎప్పుడు చేస్తున్నామో కూడ “వేళ” చెప్పటానికి “అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (…సంవత్సరే, ….ఆయనే, ….ఋతౌ, ….మాసే,…..పక్షే, ….తిధౌ,…, అంటూ కాలనిర్ణయం చేస్తాం.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మన ఉనికిని చెప్పటానికి ఒక్క స్థలనిర్ణయం చేస్తే సరిపోదు, కాలనిర్ణయం కూడా చెయ్యాలని వేదకాలం నుండీ మనవాళ్లు గమనించేరు. ఇదే విషయాన్ని ఇరవైయ్యవ శతాబ్దపు ఆరంభంలో అయిన్‌స్టయిన్ వచ్చి, సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రవచించి, స్థల-కాల సమవాయాం (space-time continuum) అనే భావన ప్రవేశపెట్టి, “ఈ విశ్వం చతుర్ మితీయం – అనగా, ఈ విశ్వం నాలుగు దిశలలో వ్యాపించి ఉంది” అని ఉటంకించేసరికి, “ఔర! ఇదంతా మా పురాణాల్లో ఉందిస్మీ!” అని ఇప్పుడు అనుకుంటున్నాం.

మనవాళ్లు మరొక అడుగు ముందుకు వేసి, స్థలం, కాలం చెప్పినంత మాత్రాన్న సరిపోదు, మన ప్రవర కూడ చెప్పాలి అన్నారు. ఒక వంశవృక్షంలో ఉత్తమోత్తమమైన పూర్వుల పేర్లు చెప్పి, వారి వంశం వాడిని అని చెప్పటాన్ని “ప్రవర” చెప్పటం అంటారు. ఎవరికి తోచిన “పూర్వుల పేర్లు” వారు చెప్పకుండా ఒకే వంశంలో ఉన్నవారంతా ఒకే “పూర్వుల సమితిని” చెప్పటం ఆనవాయితీ. ఉదాహరణకి రామ శర్మ అనే వ్యక్తి ప్రవర చెబితే ఇలా ఉండొచ్చు:

“చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణెభ్యః శుభం భవతు
ఆంగీరస భారద్వాజ గార్గ్య శైన్య త్రయాఋషయోః ప్రవరాన్విత
గర్గ్య భారద్వాజ గోత్రః
ఆపస్తంబ సూత్రః తైత్రీయ కృష్ణ యజుః శాఖాధాయీ
శ్రీ రామ శర్మః అహం భో ఆభివాదయే”

అభివాదం అంటే నమ్రతతో పూర్వులకి నమస్కరించటం. ఈ ప్రవర చెప్పేటప్పుడు ఒక్క గోత్రాన్నే కాకుండా, ఆ వ్యక్తి కుటుంబం యొక్క “సూత్రం” ఏమిటో, “వేదం” ఏమిటో, చెప్పి అప్పుడు పేరు చెబుతారు. అంటే మనం ఎవ్వరమో చెప్పాలంటే మనం ఉన్న స్థలం, కాలం, ప్రవర చెప్పాలన్నమాట. స్థలానికి అక్షాంశం, రేఖాంశం, ఎత్తు అనే మూడు అంశాలు, కాలానికి ఒక అంశం, ప్రవరకి గోత్రం, సూత్రం, వేదం, నామధేయం అనే నాలుగు అంశాలు, వెరసి ఎనిమిది చెప్పాలి. ఈ ఎనిమిదింటిని ఎనిమిది నిరూపకాలు (coordinates) ఉపయోగించి నివేదించినప్పుడు ఆ అష్టమితీయ స్థలంలో (8-dimensional space) లో మన ఉనికి ఒక బిందువు అవుతుంది. ఈ విషయాలన్నీ రాబోయే వ్యాసాలలో చూస్తారు.

2 comments:

  1. రావు వేమూరి గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం

    హారం

    ReplyDelete
  2. http://miriyalaaravind.blogspot.com/2010/03/blog-post.html
    నేను నా బ్లాగులో
    "పూజ యొక్క సంకల్పంలో ఆది నుండి వర్తమానం వరకు గడిచిన కాలమానాన్ని ప్రస్తావిస్తూ ఉంటాము.దీన్ని అర్థం చేసుకోవడమే నేను చేస్తున్న ప్రయత్నం." అని వ్రాసుకున్నాను - 14th March, 2010.
    మీ బ్లాగు చదివాక, పూర్తిగా కాకపోయినా కాస్త అర్థం అయింది. మీకు నా నెనర్లు.
    అయితే భైరవభట్ల కామేశ్వర రావు గారికి వచ్చినట్టు నాకు ఒక సందేహం.
    ఏడవ బ్రహ్మ పద్మజుని కాలంలో ద్వితీయ పరార్థంలో 51వ సంవత్సరమైన శ్వేతవరాహ కల్పంలో ఉన్నామని చెప్పారు.
    శ్వేతవరాహ కల్పం అనేది సంవత్సరం పేరు అయితే, ఆ సంవత్సరంలో ఎన్నో కల్పంలో ఉన్నాము? లేకపోతే మీరు ఇంకో చోట వ్రాసినట్టు, బ్రహ్మ వయస్సు 100 సంవత్సరాలు కాకుండా 100 రోజులు మాత్రమే అయితే శ్వేతవరాహ కల్పం అనేది కల్పం పేరు అయి ఉంటాదా?

    ReplyDelete