Saturday, August 28, 2010

విశ్వస్వరూపం: ముందుమాట

విశ్వస్వరూపం: ముందుమాట

వేమూరి వేంకటేశ్వరరావు
2010

ఈ విశ్వం ఎక్కడ నుండి వచ్చింది? ఎప్పుడు పుట్టింది?
పుట్టినది గిట్టక మానదు అని చెబుతారు కనుక ఈ విశ్వం ఒకప్పుడు పుట్టి ఉంటే మరొకప్పుడు అంతం అవాలి కదా?
విశ్వం అంతం అవటం అంటే ఏమిటి? ఆ తరువాత ఏమవుతుంది?
ఈ విశ్వం పుట్టకమునుపు ఏమి ఉండేది?
ఈ విశ్వం శాశ్వతమా? అశాశ్వతమా?
సాంతమా? అనంతమా? (finite? or infinite?)
ఈ విశ్వం యొక్క స్వరూపం ఏమిటి? దీని ఆకారం ఎలా ఉంటుంది? బల్లపరుపుగా ఉంటుందా? గుండ్రంగా ఉంటుందా?
ఈ విశ్వాన్ని ఎవ్వరైనా సృష్టించేరా? సృష్టిస్తే ఆ సృష్టికర్త ఎవ్వరు?
సృష్టికార్యం అకస్మాత్తుగా జరిగిందా? ఒక రోజులో జరిగిందా?
ఆరు రోజులలో సృష్టి పూర్తిచేసేసి ఏడో రోజున విశ్రాంతి తీసుకున్నాడా ఆ సృష్టికర్త?
లేక, ఒక కల్పం పాటు సృష్టికార్యం జరిపి ఒక కల్పం పాటు విశ్రాంతి తీసుకుంటాడా (తీసుకుంటుందా)?
సృష్టికర్త బాధ్యతలు ఏమిటి? సృష్టించేసి “నీ దారి నువ్వు చూసుకో” అని విశ్వాన్ని అచ్చోసిన ఆంబోతులా వదిలెసేడా? లేక, విశ్వం యొక్క దైనందిన కార్యకలాపాలలో కలుగజేసుకుంటూ విశ్వం మంచిచెడ్డలు నిరంతరం ఆ సృష్టికర్త చూస్తున్నాడా?

దేవుడనే భావానికీ ఈ విశ్వాన్ని సృష్టించిన కర్తకీ ఏదైనా సంబంధం ఉందా? దేవుడు వేరు, సృష్టికర్త వేరూనా?
అసలు విశ్వం అంటే ఏమిటి? మన కంటికి కనిపించే సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంత వంటి క్షీరసాగరాలు, తేజోమేఘాలు, మొదలైనవే కాకుండా వాటితోపాటు వాటి వాటి లక్షణాలని నియంత్రించే ప్రకృతి శక్తులూనా? లేక, మన కంటికి కనబడని “పదార్ధాలు”, “శక్తులు” ఈ విశ్వంలో నిబిడీకృతం అయి ఉన్నాయా?

ఇటువంటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు వెతుకుదాం. ఈ అన్వేషణ జరిగేది ముఖ్యంగా ఆధునిక భౌతిక శాస్త్రం నిర్మించిన పరిధిలోనే జరిగినప్పటికీ, సారూప్యం చూపించటం కోసం అప్పుడప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు పురాతన కాలంలో ఎలా ఉండేవో చవి చూపిస్తూ ఉంటాను. కాని ముఖ్యంగా ఆధునిక శాస్త్రీయ కోణానికే ఇక్కడ ప్రాధాన్యత.

ప్రాచీన భారతీయ సంస్కృతికీ, దృక్పథానికీ, పాశ్చాత్య సంస్కృతికీ, దృక్పథానికీ మధ్య కొట్టొచ్చినట్లు చాల తేడాలు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరిణతి చెంది, పురోభివృద్ధి చెందుతూన్న దశలలో క్రైస్తవ మతాధికారులు, కేథలిక్ చర్చి అభ్యుదయ భావాలని తీవ్రంగా ఎదుర్కొన్నాయి. దీనికి కారణాలు అనేకం. క్రైస్తవ మతానిది మానవకేంద్ర దృక్పథం. మానవుడి జన్మ ఉత్కృష్టమైనదని ఒప్పుకున్నా, భారత దేశంలో పుట్టిన మతాలన్నీ కూడ సర్వభూతాలనీ మానవుడితో సమానంగానే చూశాయి. అందువల్ల విశ్వస్వరూపాన్ని అవగాహన చేసుకునే ఈ ప్రయత్నంలో ప్రాచ్య, పాశ్చాత్య భావాల మధ్య కొంత ఘర్షణ కనిపిస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో సింహభాగం పాశ్చాత్యుల పర్యవేక్షణలో జరిగింది కనుక వారి కోణంలో ఈ కథ చెప్పక తప్పదు. అయినా ఉండబట్టక కథని చెప్పేవాడిని నేను కనుక, కొంతవరకు సనాతన దృక్పథాన్ని చెప్పి పోలికలు చెప్పకుండా ఉండటమూ సాధ్యం కాదు. కనుక విశ్వరూపం మనకి అవగాహన అయిన వయినాన్ని ఈ రెండు కోణాలలోనూ చెప్పటానికి ప్రయత్నం చేస్తాను.

ఇంగ్లీషులో cosmology అన్న మాటని తెలుగులో “విశ్వశాస్త్రం” అనొచ్చు. కాస్మోస్ అంటే విశ్వం. ఇంగ్లీషులో universe అనే మాటని కూడ విశ్వం అన్న మాటకి పర్యాయపదంగా వాడతారు. “విస్” అనే సంస్కృత మూలానికి “వ్యాప్తి చెందేది” అనే అర్ధం ఉంది. ఈ మూలం నుండే విష్ణు శబ్దం పుట్టింది. వ్యాప్తి చెందే “విష్ణువు” విశ్వం అంతటినీ ఆక్రమించి ఉన్నాడు కనుక సర్వాంతర్యామి అయేడు. ఈ విశ్వం సమస్తాన్నీ ఆక్రమించుకుని ఉంది. కనుక “విశ్వరూపమే విష్ణువు, విష్ణురూపమే విశ్వం!” అనటం తప్పు కాదేమో!

విశ్వశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యటానికి భౌతిక శాస్త్రంలోనూ, గణిత శాస్త్రంలోనూ ఏళ్లతరబడి పరిశ్రమ చెయ్యాలి. అంత పరిశ్రమ చెయ్యలేనివారికి ఈ శాస్త్రంలోని ముఖ్యాంశాలని జనరంజక శైలిలో చెప్పాలనే కోరికతో ఈ వ్యాసాలని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఎంత జనరంజక శైలి అయినా కొద్దో, గొప్పో శాస్త్రంతో పరిచయం ఉంటే తప్ప “భావ సూక్ష్మతలు” (conceptual subtleties) అప్పుడప్పుడు అర్ధం కావు. అందుకని సందర్భోచితంగా అక్కడక్కడ కొంచెం పాఠం చెప్పటం కూడ జరిగింది.

“ఈ విశ్వం ఎంతో పెద్దది, ఎంతో పురాతనమైనది” అన్న విషయం పాశ్చాత్యులకి ఈ మధ్యనే అవగాహన అయింది. మొన్నమొన్నటి వరకు పాశ్చాత్యులు సృష్టి జరిగి 5,000 సంవత్సరాలు మాత్రమే అయిందని నమ్మేవారు. కాని భారతీయ పురాణాలలో సృష్టి ఎంత పురాతనమైనదో వర్ణించే కథలు ఎన్నెన్నో ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధ రంగంలో కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపిస్తాడు. ఆ విశ్వరూపం వర్ణన చదివిన వారికి విశ్వం అంటే ఏమిటో కొద్దో, గొప్పో అవగాహన ఉండి తీరుతుంది. మనం ఇక్కడ చేస్తూన్నదల్లా అధునాతన శాస్త్రీయ దృక్పథంతో విశ్వస్వరూపాన్ని ఆకళింపు చేసుకోటానికి చిన్న ప్రయత్నం.

ఈ వ్యాస పరంపర చదివే ముందు ఒక విషయం గుర్తు పెట్టుకొండి. విశ్వం గురించి పెద్ద ఎత్తున, అధునాతన దృక్పథంతో పరిశోధన మొదలయి పూర్తిగా అర్ధ శతాబ్దం కూడ అయి ఉండదు. రోజుకో కొత్త వార్త, కొత్త సిద్ధాంతం! కొన్ని సిద్ధాంతాలు కాలప్రవాహపు తాకిడికి తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. కొన్ని సిద్ధాంతాలు వీగిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. పస లేక వీగిపోయాయనుకున్న సిద్ధాంతాలు కొన్ని ప్రాణం పోసుకుని మళ్లా తలెత్తుతున్నాయి. కనుక ఈ వ్యాసాలలని చదివిన తరువాత “ఇదే వేదం” అని నమ్మేయకండి.

ఉదాహరణకి ఈ విశ్వం ఒక పెను పేలుడులో (Big Bang) పుట్టిందని చాలామంది ఒప్పుకుంటున్నారు. ఆ పేలింది ఏమిటో ఇదమిద్ధంగా తెలియదు. ఆ పేలుడు ఎప్పుడు జరిగింది అన్న విషయంలో కూడ తీవ్రమైన బేధాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు 8 బిలియను సంవత్సరాల క్రితమే అని అంటున్నారు. మరి కొందరు 20 బిలియను సంవత్సరాల క్రితం అంటున్నారు. ఆదిలోనే అభిప్రాయ బేధాలు ఉన్న ఈ శాస్త్రంలో ఇంకా ఎన్నో వాదోపవాదాలు ఉన్నాయి. ఇదే విధంగా విశ్వం ఎంత పెద్దదో కూడ మనకి పరిపూర్ణంగా అవగాహన కాలేదు. అసలు ఈ విశ్వం తయారీలో వాడబడ్డ ఘటక ద్రవ్యాలు (ingredients) ఏమిటో అన్న విషయం మీద కూడ ఏకీభావం లేదు. పెను పేలుడు జరిగిన తరువాత, “తత్‌తక్షణ ఉత్తర క్షణాలలో” (in the moments immediately afterwards), ఏమయిందో మనకి ఇంకా అంతుబట్టటం లేదు. ఈ విశ్వం ఎలా లయ పొందుతుందో కూడ తెలియదు. నిజానికి మన చుట్టుపట్ల ఉన్న క్షీరసాగరాలని దాటి దూరం వెళుతూన్న కొద్దీ అక్కడ విశ్వస్వరూపం ఎలా ఉంటుందో మనకి బాగా తెలియదు. మన చుట్టూ - మనకి దగ్గరగా ఉన్న - విశ్వాన్నయినా అంతా “చూడ” గలుగుతున్నామా లేక మన పక్కనే మన కంటికి కనపడకుండా అదృశ్య పదార్ధాలు, అదృశ్య శక్తులు ఏమయినా ఉన్నాయా అన్న విషయం కూడ మనకి పరిపూర్ణంగా తెలియదు. విశ్వం గురించి మనకి తెలియని మహా సింధువుతో పోల్చితే మనకి తెలిసినది, నేను ఇక్కడ చెప్పబోయేది కేవలం బిందు ప్రమాణం.

నెల నెలా వచ్చే ఈ వ్యాసాలు సులభ గ్రాహ్యంగా ఉండాలంటే ఏ వ్యాసానికి ఆ వ్యాసం స్వయంపూర్ణంగా, స్వయంసమృద్ధిగా, స్వయంవివరణాత్మకంగా నిలబడగలగాలి. అలా రాయాలంటే ఒక చోట చెప్పిన విషయాన్నే మరొక చోట చెప్పవలసి వస్తుంది. చెప్పే విషయం క్లిష్టమైనది కనుక ఈ చర్వితచర్వణం వల్ల పునరుక్తి దోషం ఉండదనే అనుకుంటున్నాను.

ఈ వ్యాసాలలోని పదార్ధం కొంత అంతర్జాల పత్రికలలోనూ, అచ్చుపత్రికలలోనూ, నా బ్లాగు “లోలకం” లోనూ ఒక సారి ప్రచురించటం జరిగింది. ఆ విషయాన్ని ఈ వ్యాస పరంపరకి అనుకూలంగా మార్చి, అవసరమయితే తిరగరాసి, ఇక్కడ వాడుకోవటం జరిగింది. అంతేకాదు. ఈ వ్యాసాలలో నేను చెప్పిన విషయాలన్నీ నేను విద్యార్ధిగా ఉన్నప్పుడు, అటుతరువాత, పుస్తకాలు చదివి నేర్చుకున్నవే తప్ప నేను స్వంతంగా సృష్టించినది ఏదీ లేదు. నేను సంప్రదించిన గ్రంధాల పేర్లు ఈ దిగువ చూపిస్తున్నాను. అదే విధంగా చాలమట్టుకి బొమ్మలు కూడ అంతర్జాలం (Internet) నుండి సేకరించినవే. నేను చేసినదల్లా ఇంగ్లీషులో ఉన్న విషయాన్ని సేకరించి, సంగ్రహించి, తిరిగి తెలుగులో నా మాటలలో చెప్పటమే.

“తెలుగులో సైన్సుని రాయటం ఎందుకు? ప్రపంచం అంతా ఇంగ్లీషు మార్గం వెంబడి పోతూన్నప్పుడు, ఉద్యోగాలకి ఇంగ్లీషు అత్యవసరం అయిపోతూన్న ఈ రోజుల్లో, తెలుగుని పట్టుకుని పాకులాడటం ప్రగతికి ప్రతిబంధకం కాదా?” అని నన్ను నిలదీసి అడిగిన వాళ్లకి ఓపిగ్గా సమాధానాలు చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడా ఓపిక లేదు. నా సరదాకి నేను రాసుకున్నాను. మీకు సరదా ఉంటేనే చదవండి. కథనం నడిపించినప్పుడు సాధ్యమయినంత వరకు తెలుగు మాటలని కాని, సంస్కృతం నుండి దిగుమతి అయిన మాటలని కాని వాడి తెలుగు వాక్యాలు నిర్మించటానికే ప్రయత్నం చేసేను. ఓక భావాన్ని తెలుగులో వ్యక్తపరచటం కష్టమనిపించినప్పుడు (ఇది ఒక్క సారే జరిగింది) ఆ పక్కన కుండలీకరణాలలో పూర్తి ఇంగ్లీషు వాక్యం రాసి చూపించేను. నా పిచ్చి నాకు ఆనందం కావచ్చు కాని అందరికీ ఈ గోల అర్ధం అవకపోవచ్చు. అందుకని సాంకేతిక భావాలకి తెలుగు మాటలు వాడినప్పుడల్లా మూలంలో ఉన్న ఇంగ్లీషు మాటలని, వెనువెంటనే, కుండలీకరణాలలో రాసి చూపించేను. వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా!



సంప్రదించిన మూలాలు

• http://news-service.stanford.edu/pr/95/950509Arc5236.html

• MIRA, Life and Death of a Photon, http://www.mira.org/museum/photon.htm

• Wikipedia, http://en.wikipedia.org/wiki/Shape_of_the_Universe

• Patricia Schwarz, http://www.superstringtheory.com/index.html

• V. Vemuri, http://www.lolakam.blogspot.com

• వేమూరి వేంకటేశ్వరరావు, “ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?,” ఈమాట, http://www.eemaata.com/em/, సెప్టెంబరు 2009

• M. S. Turner, “The Universe,” Scientific American, September 2009

• J. Frieman, M. S. Turner and D. Huerter, Dark Energy and Accelerating Universe, 2008, available online at arxiv.org/abs/0803.0982

• Andy Fell, “Cosmic Convergence,” UC Davis Magazine, pp 14-19, Spring, 2008.

• N. D. Tyson, Death by Black Hole and other Cosmic Quandaries, W. W. Norton and Company. New York, 2007.

• M. Riordan and W. A. Zajc, “The First Few Microseconds,” Scientific American, May, 2006

• Loeb, “The Dark Ages of the Universe,” Scientific American, November, 2006

• Lisa Randall, Warped Passages : Unraveling The Mysteries of The Universe's Hidden Dimensions, Ecco, 2005.

• వేమూరి వేంకటేశ్వరరావు, “ప్రకృతిలో చతుర్విధ బలాల బలాబలాలు,” ఈమాట, http://www.eemaata.com/em/, సెప్టెంబరు, 2005.

• R. Bousso and J. Polchinski, “The String Theory Landscape,” Scientific American, September, 2004

• Paul Halpern, The Great Beyond, John Wiley & Sons, Hoboken, NJ, 2004.

• G. Veneziano, “The Myth of the Beginning of Time,” Scientific American, May, 2004

• వేమూరి వేంకటేశ్వరరావు, అంకెలు, సంఖ్యలు: లెక్కకు అందని కాలమానం, ATA Souvenir, July 2004

• A. Guth, The Inflationary Universe, Basic, 1998

• V. Vemuri, “The Geometry of the Universe,” Science Reporter, pp 30-31, August. 1996. (Published by National Institute of Science Communication, New Delhi, India. Also available at http://www.cs.ucdavis.edu/~vemuri/EnglishPopularScience.htm

• Robert Osserman, Poetry of the Universe: A mathematical exploration of the Cosmos, Doubleday, New York, 1996

• E. W. Kolb and M. S. Turner, The Early Universe, Westview Press, 1994

• వేమూరి వేంకటేశ్వరరావు, బ్లేక్ హోలు అంటే ఏమిటి?, విద్యార్ధి చెకుముకి, pp 40-43, మే, 1993, Also in Rachana, pp 55-56, Feb. 1993

• వేమూరి వేంకటేశ్వరరావు, అన్వేషణ, స్వాతి మాసపత్రిక, pp 8-15, 1991

• S. Weinberg, The First Three Seconds, Basic, 1977

• Robert Jastrow and Malcolm Thomson, Astronomy: Fundamentals and Frontiers, Third Edition, John Wiley, 1972

• Heinrich Zimmer, Maya: Der Indische Mythos, 1936.

2 comments:

  1. చాలా చాలా ఆనందంగా ఉందండి! Stephen Hawking పుస్తకాలకి తెలుగు అనువాదాలు చదువుకొని సంతృప్తి పడుతున్న నాకు అచ్చంగా తెలుగులో, పైగా ప్రాచీన భారతీయ దృక్పథంతో పోలుస్తూ, మీరు అందించడం - గంజినీళ్ళు తాగేవాడికి పరమాన్నం లభించినంత ఆనందంగా ఉంది!
    ఈ వ్యాసాలు నెలనెలా ఈ బ్లాగులో చదవగలనని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. బాగుందండి , చాల రోజుల తరవాత రాసారు .ఈ వ్యాసాలు నెలనెలా చదవానికి ఎదురుచూస్తాను .

    ReplyDelete