Monday, February 1, 2010

మిరపకాయల కథ
అరవ్వాడి వ్యాపార చిహ్నం (ట్రేడ్ మార్క్) సాంబారు అయితే తెలుగువాడి వ్యాపార చిహ్నం గోంగూర పచ్చడి ట. ఆవకాయ కాదుట.

చాల రోజులపాటు తెలుగువాడి వ్యాపార చిహ్నం ఆవకాయ అనుకునేవాడిని. అది పొరపాటని గ్రహింపుకి వచ్చేక ఈ రాత రాయడానికి సమకట్టేను.

మీరు మాగాయ టెంకని మజ్జిగలో ముంచుకుని గీరుతూ – ఓ కాలు స్వర్గంలోనూ, మరో కాలు ఇక్కడా వేసి - ఉన్న సమయంలో ఆవకాయకి ఈ గుర్తింపు లేదని చెప్పడం కొంచెం సాహసమే. కాని ఉన్న మాట చెబుతున్నాను. కారణం? ఆవకాయలో పడే మిరపకాయ కారం లో తెలుగు తనం లేకపోవడమే.

మిరపకాయ కి తెలుగు తనం లేకపోవడం ఏమిటండీ? మా గొల్లప్రోలు పచ్చమిర్చి ఆవకాయలో పడిందంటే దాని రుచే వేరు.

ఈ రోజుల్లో అయితే మిరపకాయలు ఒక్క గొల్లప్రోలు లోనే కాదు, ప్రపంచం అంతా పండుతున్నాయి. కాని కొలంబస్ అమెరికాకి దారి కనుక్కోడానికి ముందు రోజుల్లో మిరపకాయలు ఒక్క దక్షిణ అమెరికాలోనే పండేవి.

ఈ మిరపకాయలు లేని రోజులలో మన దేశంలో కారం కావాలంటే మిరియాలు వాడేవారనుకుంటాను. పోర్చుగీసు వాళ్ళు మన దేశానికి మిరపకాయలు తీసుకొచ్చినప్పుడు వాటిని మనవాళ్ళు “మిరియపు కాయలు” అనుంటారు. అదే మాట మిరపకాయ అని తెలుగులోనూ, మిర్చీ అని హిందీలోనూ స్థిరపడిపోయిందని నా సిద్ధాంతం.

కనుక మిరపకాయలు లేని రోజులలో ఆవకాయలో ఏ కారం వేసేవారో నాకు తెలియదు కాని మనం ఈ నాడు చవి చూస్తూన్న ఆవకాయ మాత్రం ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చినదని నా నమ్మకం.

మిరపకాయలని ఇంగ్లీషులో “చిల్లీ” అనీ “పెప్పర్” అనీ పిలుస్తారు. మరికొందరు అయితే కుర్చీపీట, బెంచీబల్ల మాదిరి “చిల్లీ పెప్పర్” అని అంటారు. ఏ పేరు పెట్టి పిలచినా మిరప మిరపే!

మిరపకాయలలో రకాలు ఉన్నాయని మనందరికీ తెలుసు: ఎర్ర మిరప; పచ్చ మిరప; సీమ మిరప, బొద్దు మిరప (బెల్ పెప్పర్) అని నాలుగైదు రకాలు స్పురణకి వస్తాయి. కాని 400 రకాలకి పైబడే మిరపకాయలు ఉన్నాయని మనలో ఎంతమందికి తెలుసు? తూర్పు ఆసియా, చైనా, జపాన్, ఇండోనేసియా, థాయిలాండ్, ఇండియా, మెక్సికో, మధ్య అమెరికా, మొదలైన దేశాలలో మిరప పంట విస్తారం. వీటిల్లో అమెరికాలో విస్తారంగా దొరికే రకాల పేర్లు కొన్ని చెబుతాను: హాలపేన్యో, సెర్రానో, పొబ్లానో, హాబర్నేరో, కయేన్. ఒకొక్క జాతి మిరపకి ఒకొక్క లక్షణం ఉంటుంది. కొన్ని బాగా కారంగా ఉంటాయి, కొన్నింటిలో కారం ఒక మోతాదులో ఉంటుంది. కొన్ని మిరపకాయలు అస్సలు కారంగానే ఉండవు. కనుక "చిటికెడు ఉప్పు, రెండు మిరపకాయలు" అన్నప్పుడు ఆ రెండు ఏ జాతి మిరపకాయలో తెలుసుకోవాలి. లేకపోతే కారం నసాళానికి అంటుకునే ప్రమాదం ఉంది.
ఉప్పు లో ఉప్పదనం తేడాలు కనిపిస్తూ ఉంటాయి కదా. అలాగే పంచదార, బెల్లం, తేనె వగైరాల తియ్యదనంలో తేడాలు తెలుస్తూనే ఉంటాయి. అలాగే మిరపకాయలలో కారం కూడా. అందుకని ఒకొక్క మిరపకాయ ఎంతకారంగా ఉందో చెప్పడానికి ఒక కొలమానం ఉంది. వేడిని సెల్సియస్, ఫారిహైట్ డిగ్రీలలో కొలిచినట్లే కారాన్ని “స్కోవిల్ యూనిట్లు” లో కొలవచ్చు. (సౌలభ్యం కోసం వీటిని నేను డిగ్రీలు అని పిలుస్తాను.) ఈ కొలమానం ప్రకారం బొద్దు మిరపలో కారం “సున్న డిగ్రీలు”. నిజానికి ఈ బొద్దు మిరప చూడడానికి గుండ్రంగా ఉండి, వాసన మాత్రం మిరప వాసన వేస్తుంది; కాని దీనికి కారమే ఉండదు. తరువాత పీట్జా వంటి ఇటాలియన్ వంటకాలలో తరచుగా వాడబడే పిమెంటో (Pimento) మిరప కారం 100 నుండి 500 డిగ్రీలు. టబేస్కో పచ్చడి (Tabasco sauce) లో కారం 2,500 డిగ్రీలు ఉంటుంది. హాలపేన్యో (Jalapeno) మిరప 2,500 నుండి 8,000 వరకు ఉంటుంది. ఊరబెట్టిన హాలపేన్యో మిరపని సేలడ్ లోనూ, సేండ్‌విచ్ లోనూ వేసుకుని తింటారు. టబేస్కో పచ్చడి లో వాడే మిరపకాయల కారం 30,000 – 50,000 డిగ్రీలు ఉంటుంది. జమైకా మిరపలో కారం 1,00,000 నుండి 2,00,000 డిగ్రీలు ఉంటుంది. అమెరికాలో పోలీసు దళాలు దుండగులని అదుపులో పెట్టడానికి వాడే మిరపాస్త్రం (Pepper spray) లో 5,000,000 డిగ్రీలు కారం ఉంటుంది. ఈ రకరకాల మిరపలో ఈ కారాన్ని ఇచ్చే రసాయన పదార్ధం పేరు కేప్సైసిన్ (Capsaisin). కల్తీలేని, అసలు, సిసలు కేప్సైసిన్ లో కారం 15,000,000 – 20,000,000 డిగ్రీలు ఉంటుంది.

గిన్నిస్ బుక్‌లోకి ఎక్కే సరదా ఉన్న భారతీయులకి “ప్రపంచం అంతటిలో ఎక్కువ కారం ఉన్న మిరపకాయ ఎక్కడ ఉంది?” అన్న అనుమానం రావచ్చు. సర్వసాధారణంగా ఈ గౌరవం 350,000-580,000 డిగ్రీలు ఉండే Red Savina Habarnero అనే మెక్సికో మిరపకి చెందాలి. కాని సా. శ. 2000 లో అస్సాం లోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం వారు “నాగా జొలాకియా” అనే మిరప 855,000 డిగ్రీలు కారం ఉందని ప్రకటించేరు. కాని ఈ స్వత్వాన్ని (claim ని) స్వతంత్ర ప్రతిపత్తితో సరిచూసిన నాధుడు లేకపోయేడు.బంగ్లాదేష్‌లో పెరిగే “నాగ మిరప” మొక్కని ఒక బ్రిటిష్‌వాడు వాళ్ళ ఊరైన డార్సెట్ (Dorset) పట్టుకెళ్ళి అక్కడ పెంచి దానికి Dorset Naga అని పేరు పెట్టేడుట. ఈ మిరప 923,000 డిగ్రీలు కారం ఉందని అతను ప్రకటించేడు.

ఇంతకీ ఈ కారం డిగ్రీలు ఏమిటంటారా? మిలియను పాళ్ళల్లో సిసలైన, కల్తీలేని కేప్సైసిన్ ఒక పాలు ఉంటే అది ఒక డిగ్రీ కారం అన్న మాట. ఈ కేప్సైసిన్ అన్న మాటలోంచే “కేప్సికం” అన్న ఇంగ్లీషు మాట వచ్చింది. మిరప జాతిని అంతటినీ ఉద్దేసించి మాట్లాడవలసి వస్తే ఈ “కేప్సికం” అన్న “జాతి నామం” (genus) వాడుతూ ఉంటారు. ఈ capsicum అన్న ఇంగ్లీషు మాట kapto అన్న గ్రీకు మాట నుండి పుట్టుకొచ్చింది. గ్రీకు భాషలో kapto అంటే కరవడం. తేలు కుట్టినప్పుడు (కరిచినప్పుడు) ఎలా చుర్రు మంటుందో అలానే మిరపని నోట్లో పెట్టుకుంటే కరిచినట్లు చుర్రు మంటుంది. అందుకని ఈ పేరు వచ్చింది.

చుర్రుమందని మిరపని తినడం మానెస్తామా? ఎంత కారంగా ఉన్నా మిరప రుచి మిరపదే! ఒక్క రుచే కాదు. మిరప ఆరోగ్యానికి మంచిది. మిరపలో విటమిన్ A, C విస్తారంగా ఉన్నాయి. కాయ ముదిరి పక్వానికి వచ్చే సమయానికి C తగ్గి బీటా కేరొటీను, కేప్సైసిన్ మట్టాలు పెరుగుతాయి. “ఈ స్థితిలో ఉన్న మిరపకాయని తింటే, నోరు మండడమే కాకుండా, ఒళ్ళు వేడెక్కి శరీరంలో చయాపచయం జోరు (metabolic rate) పెరుగుతుందని, ఇలా జోరు పెరగడం మూలంగా “కొవ్వు కరిగి” మనుష్యులు సన్నబడతారు” అని కొందరు. ఈ సిద్ధాంతంలో ఎంత పస ఉందో తెలియదు కాని ఒక మాట మాత్రం నిజం. వేడిగా ఉన్న రోజున కారం తింటే ఒళ్ళంతా చెమటపోసేసి చల్లబడుతుంది. అందుకనే కాబోలు మిరప తినే అలవాటు ఉష్ణ మండలాలలో ఎక్కువ కనిపిస్తుంది.

3 comments:

 1. భలే ఉంది మిర్చి కథ కమామీషు , కాని అదేంటండి ఆవకాయ పేటెంట్ మనది కాదు అనేసారు :(

  ReplyDelete
 2. mee tappaa chadavadam chaalaaa anandamgaa undi.

  telugu gurinchi inta tapinche vallu unnaraaa anipistondi.

  ReplyDelete
 3. చాలా బావుంది మాస్టారూ

  ReplyDelete