నేను లెక్చరరుని కాదు, టీచర్ ని. నేను పాఠం చెప్పేటప్పుడు, రెండు, మూడు వారాలు అయిన తరువాత, విద్యార్ధులని అడుగుతాను, "చెప్పిన పాఠం అర్ధం అవుతోందా? జోరు తగ్గించాలా? ఇంకొంచెం జోరు పెంచొచ్చా?" వగైరా ప్రశ్నలు. లేకపోతే బధిరశంఖన్యాయంలా తయారవుతుంది పరిస్థితి.
ఇదే ధోరణిలో నాలుగు రోజుల క్రితం నా బ్లాగు చదివే పాఠకులని, "ఏమిటి మీ స్పందన?" అంటూ ఒక చిన్న ప్రశ్న అడిగేను. నేను నోరు విడచి అడిగినందుకు పన్నెండు మంది సమాధానం ఇచ్చేరు. వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సమాధానాలని నాలుగు వర్గాలుగా విడగొట్టవచ్చు.
1. మీరు రాసింది బాగుంది. పదే పదే ఎందుకు చెప్పటం అని మేము స్పందించలేదు.
2. మీకు ఒకరి స్పందనతో పనేమిటీ? మీరు ఒకరి మన్నన పొందటానికి రాయటం లేదు కదా!
3. కొంచెం స్థాయి తగ్గించి రాయండి, లేకపోతే నాకు అర్ధం కావటం లేదు.
4. ఆ తెలుగు మాటల వాడకం ఆపి ఇంగ్లీషు మాటలే వాడెయ్యండి, అందరికీ సులభంగా అర్ధం అవుతుంది.
నేను విద్యార్ధిగా ఉన్న రోజులలో, మొదటిసారి పరిశోధనా పత్రం రాసి ప్రచురణకి పంపినప్పుడు, సంప్రదాయానుసారంగా, ఆ పత్రికా సంపాదకుడు నేను రాసిన పత్రం మరో నలుగురికి పంపి వాళ్ళ అభిప్రాయాలు అడిగి, ఆ అభిప్రాయాలు సేకరించి నాకు తిరిగి పంపి, నా పత్రాన్ని తదనుగుణంగా సవరించి పంపమన్నాడు. అందులో మూడు అభిప్రాయాలు, "ఈ పరిశోధనా పత్రం బాగానే ఉంది. ప్రచురణార్హమే!" అని వచ్చేయి. నాలుగోది మాత్రం నన్ను ఏకెస్తూ వచ్చింది. నా గురువుగారు నాలుగూ చదివి, మొదటి మూడూ మనకి పనికిరానివి, అవి పక్కన పెట్టెయ్; ఆ నాలుగోది ఘాటుగా ఉందని ఉడుక్కోకు, అదే మనకి ఉపయోగపడుతుంది. ఆ నాలుగో అభిప్రాయం చదివి అందులో ఉన్న ఆక్షేపణలన్నిటిని మనస్పూర్తిగా స్వీకరించి, నా పత్రాన్ని మరమ్మత్తు చెయ్యమని చెప్పి, నాతో అన్నారు: "మన పనిని అక్షేపించినవాడే మన అసలు స్నేహితుడు. ఇది జ్ఞాపకం పెట్టుకో!"
కనుక పైన ఉన్న నాలుగు వర్గాలలోనూ నాకు కావలసినవి ఆఖరి రెండు అభిప్రాయాలూను. నేను రాసేదాని స్థాయి ఎక్కువగా ఉంది, అర్ధం చేసుకోవటం కష్టంగా ఉంది అంటే, మరికొంచెం శ్రమ పడి చూస్తాను. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకొండి. ఇది పాఠ్యపుస్తకం (text book) కాదు. జనరంజకమైన శైలిలో స్థాయి తగ్గించి రాసినప్పుడు స్పష్టత కోసం ఖచ్చితత్వం (accuracy) కొంత త్యాగం చెయ్యవలసి వస్తుంది. మరొక విషయం. చదివినది అంతా, చదివిన వెంటనే అర్ధం అవక్కరలేదు. సైన్సు పులుసు లాంటిది. మరిగిన కొద్దీ పులుసుకి రుచి ఎలా వస్తుందో అలాగే చదివినదే మళ్ళా మళ్ళా చదివితే మరికొంచెం బాగా అర్ధం అవుతుంది. అందుకనే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళకి చెప్పిన పాఠమే మళ్ళా మళ్ళా చెప్పినట్లు ఉండదు. ప్రతి సారీ పాత పాఠమే మరొక కొత్త అనుభూతిని ఇస్తుంది.
రెండవ ఆక్షేపణ. ఇంగ్లీషు మాటలు వాడేసి రాసేస్తే సులభంగా అర్ధం అయిపోతుందనే భావన. ఈ బ్లాగు రాయటానికి ప్రేరణ కారణం వీలయినంత వరకు తెలుగు మాటలు వాడి తెలుగులో సైన్సు చెప్పగలమని, రాయగలమని నిరూపించటం. మరొక విధంగా చెప్పాలంటే తెలుగులో సైన్సు రాస్తే ఎలాగుంటుందో ప్రయత్నించి చూడాలనే తపన ఈ కార్యక్రమానికి మూల కారణం. ఇప్పుడు నేను అన్నీ ఇంగ్లీషు మాటలు వాడేసి రాసేస్తే నా వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు. కనుక ఇలా రాయాలనే రాస్తున్నాను. కాని అందరికీ అర్ధం అవాలన్న ఆకాంక్షతో నేను వాడిన ప్రతి తెలుగు మాటకి పక్కనే ఆ మాటని ఇంగ్లీషులో ఏమంటారో కూడ రాసి చూపిస్తున్నాను కదా. నేను ఇంగ్లీషుని మానేయమనటం లేదు. నేను మానెయ్యమన్నా మన తెలుగువారు మానరు, మానలేరు. తెలుగులో రాసి చూపిస్తున్నాను, అంతే. ఈ ప్రయోగం సఫలం అవాలంటే చదువరులు కూడ కొంచెం ఓపిక పట్టాలి - అలవాటు లేని పని కనుక.
రసాయనశాస్త్రం అంటే చాలమందికి ఇష్టం ఉండదు. అర్ధం అవదు, కష్టంగా ఉంది అంటారు. ఒడుపు తెలిస్తే రసాయనశాస్త్రం చాల తేలిక అని నా అభిప్రాయం. ఈ శాస్త్రం చదువుతూన్నప్పుడు నేను పొందే అనుభూతి ఎలాంటిదో మీకు కూడ రుచి చూపించాలనే తాపత్రయంతో రాస్తున్నాను. "సీరియస్" గా తీసుకోకుండా "కేషువల్" గా చదవండి. అదే అర్ధం అవుతుంది.
Wednesday, April 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
సరే సార్. తప్పకుండా. :) ఇకపై ఈ బడిలో చెప్పిందంతా మాకు అర్థమయిందో లేదో వెంటనే చెబుతాం.
ReplyDeleteనాకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల్లో కెమిస్ట్రీ లో చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది, అప్పటి నుండి కెమిస్ట్రీ అంటే విపరీతమైన భయం (ఫోబియా లాంటిది) ఏర్పడింది :-)
ReplyDelete~సూర్యుడు :-)
అమ్మో కెమిస్ట్రీ అంటే నాకు చచ్చేంత భయం. అందుకే మీ బ్లాగుకు కాస్త దూరంగానే ఉంటాను. ఎలాగో తంటాలు పడి ఇంటర్ వరకు పరీక్షలకోసమే చదివేసాను. ఇపుడు మళ్లీ ఆ పాఠాలంటే మీ బ్లాగు చుట్టుపక్కల కనపడను. ఏమనుకోవద్దండి..
ReplyDelete"ఇప్పుడు నేను అన్నీ ఇంగ్లీషు మాటలు వాడేసి రాసేస్తే నా వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు."
ReplyDeleteమీదే కాదు, మాది కూడా. :)
"ఈ బ్లాగు రాయటానికి ప్రేరణ కారణం వీలయినంత వరకు తెలుగు మాటలు వాడి తెలుగులో సైన్సు చెప్పగలమని, రాయగలమని నిరూపించటం. "
నిరూప్సితున్నారుగా, పదండి ముందుకు, పదండి తోసుకు!!
"...నా గురువుగారు నాలుగూ చదివి, మొదటి మూడూ మనకి పనికిరానివి, అవి పక్కన పెట్టెయ్; ఆ నాలుగోది ఘాటుగా ఉందని ఉడుక్కోకు, అదే మనకి ఉపయోగపడుతుంది..."
ReplyDeleteరావు గారు - మీరు నెమరు వేసుకున్న ఈ అనుభవం చాలా బాగుంది. నేర్చుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవారికి అన్నిటికన్నా అవసరమయినది ఇదే! విమర్శలను *అర్థం చేసుకోగలగడం*. చాలా థాంక్సండి!!
సలహాలు ఉచితమే కాబట్టి మీకు నాదో సలహా: మీరు ఇప్పటివరకూ రాస్తూ వస్తున్న విషయాలు చాలా బాగున్నాయి(ఇంతకన్నా నిర్మాణాత్మకంగా వ్యాఖ్యానించగల స్థాయి నాకు లేదు), రసాయనశాస్త్రం యొక్క manifestations, అంటే.. ఫలితాలు కళ్ళముందు కనబడే చిన్ని చిన్ని ప్రయోగాలు మీరు పరిచయం చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మనలో కొత్త information పట్ల అందరికంటే ఎక్కువ receptive ధృక్పథం ఉండేది లేత హృదయాలకు, వారికి హత్తుకునేలా....
చెప్పాలనుకుంటున్నది సరిగ్గా చెప్పలేకపోతున్నా. Blame it on my linguistic inability, but here is an example: http://homeschooling.gomilpitas.com/explore/chemistry.htm
another here: http://www.sciencemadesimple.com/kidschemistryexperiments.html
(These are not *the* best, but couple of random points to illustrate my point, hope I am understood)
Cheers!