III ఉదకర్బనాలలో జంట, త్రిపుట బంధాలు
ఇంతవరకు కర్బనపు గొలుసులలో కర్బనపు అణువుల మధ్య ఒకే ఒక బంధం ఉన్నవాటినే పరిశీలించేం. ఇప్పుడు ఈ నిబంధనని సడలించి కర్బనపు అణువుల మధ్య రెండు కాని, మూడు కాని బంధాలు ఉన్న పదార్ధాలని పరిశీలిద్దాం.
మచ్చుకి, ఒక కర్బనం అణువు తన పక్కనున్న మరొక కర్బనం అణువు యొక్క చేతులలో రెండింటిని తన చేతులలో రెండింటితో పట్టుకుందనుకుందాం. అప్పుడు ఒకొక్క కర్బనానికి రెండేసి చేతులు చొప్పున నాలుగు ఖాళీ చేతులు మిగులుతాయి కదా. ఈ నాలుగు చేతులకి నాలుగు ఉదజని అణువులని తగిలిద్దాం. ఇలా వచ్చిన పదార్ధం సాంఖ్యక్రమం C2H4. ఈ రసాయనం పేరు ఎతిలీను. దీని నిర్మాణక్రమం ఈ దిగువ బొమ్మ 1 చ. లో చూపుతున్నాను.
బొమ్మ 1 క. గత అధ్యాయంలో చూపిన ఎతేను నిర్మాణక్రమం.
బొమ్మ 1 చ. ఇక్కడ ప్రస్తావిస్తూన్న ఎతిలీను నిర్మాణక్రమం.
గతంలో పరిచయమైన ఎతేను (ethane) సాంఖ్యక్రమం C2H6, ఇక్కడ ప్రస్తావిస్తూన్న ఎతిలీను సాంఖ్యక్రమం C2H4. వీటి నిర్మాణక్రమాలు కూడ పోల్చి చూడాలంటే గత అధ్యాయంలో ఉన్న ఎతేను బొమ్మతో ఇక్కడ ఉన్న ఎతిలీను బొమ్మని సరిపోల్చి చూడండి. వీటి రెండింటిలో కొట్టొచ్చినట్లు కనబడే విషయం ఏమిటంటే ఎతేను లో అన్నీ ఏక బంధాలే, కాని ఇక్కడ ఎతిలీను లో ఒక జంట బంధం (double bond) ఉంది.
ఇదే విషయాన్ని మరొక కోణం గుండా చూద్దాం. ఎతేను లో ఉన్న రెండు కర్బనం అణువులు తమకి ఉన్న ఖాళీ చేతులతో ఆరు ఉదజని అణువులని పట్టుకున్నాయి. అంటే, ఎతేను చేతులన్నీ ఉదజనితో నిండుగా ఉన్నాయి. ఎతిలీను విషయంలో ఇలా జరగలేదు. ఇక్కడా రెండు కర్బనపు అణువులు ఉన్నాయి. కాని ఇవి నాలుగు ఉదజని అణువులని పట్టుకోగా మిగిలిన ఖాళీ చేతులతో పట్టుకోటానికి మరేమీ లేక పక్క నున్న కర్బనపు అణువునే పట్టుకున్నాయి. (చేతులేవీ ఖాళీగా ఉండకూడదనే నిబంధనకి తల ఒగ్గుతూ.) ఈ పరిస్థితిని మనం ఒక విధంగా ఉపయోగించుకోవచ్చు. ఎతిలీను లో ఉన్న కర్బనం అణువులు మధ్య ఉన్న జట్టాపట్టాలని విడగొట్టగా వచ్చిన ఖాళీ చేతులలో ఒక జతని ఒకరినొకరు పట్టుకోటానికి వాడి, మిగిలిన రెండు ఖాళీ చేతులకీ చెరొక ఉదజని అణువుని తగిలించవచ్చు.
ఇదే విషయాన్ని మరొక విధంగా చెప్పవచ్చు. ఎతేను సంతుష్టిగా భోజనం చేసిన వ్యక్తి వంటిది. దానికి ఇహ “ఉదజని అణువులని తినటానికి” చేతులు ఖాళీగా లేవు. అందుకని ఎతేను ని "సంతుష్ట ఉదకర్బనం" (saturated hydrocarbon) అంటారు. ఈ ఉపమానం ప్రకారం ఎతిలీను కి మరో రెండు ఉదజని అణువులని మొయ్యగలిగే (లేదా "తినగలిగే") స్థోమత ఉంది. అందువల్ల జంట బంధాలు, త్రిపుట బంధాలు (బహు బంధాలు) ఉన్న ఉదకర్బనాలని అసంతృప్త ఉదకర్బనాలు (unsaturated hydrocarbons) అంటారు. అసంతృప్త ఉదకర్బనాల గుండా ఉదజని వాయువుని పంపి వాటిని సంతృప్తి పరచటాన్ని ఉదజనీకరణ (hydrogenation) అంటారు.
పైన ఉదహరించిన ఉదజనీకరణ అనే ప్రక్రియ మరీ మనకి తెలియనిది కాదు. నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, పత్తి నూనె, సూర్యకాంతపు నూనె (sunflower oil) మొదలైన నూనెల గుండా ఉదజని వాయువుని పంపితే ఆ నూనె కాస్తా వనస్పతి అవుతుంది. ఈ ప్రక్రియ వల్ల నూనెలలో ఉన్న అసంతృప్త గోరోజనామ్లాలు (fatty acids) సంతృప్త గోరోజనామ్లాలుగా మారతాయి. ఇలా మారినప్పుడు గది ఉష్ణోగ్రత దగ్గర ద్రవ రూపంలో ఉన్న నూనెలు వెన్నలా ఘన రూపంలోకి మారతాయి. ఇలా ఘన రూపంలో ఉన్న కొవ్వు పదార్ధాలని నిల్వ చెయ్యటం తేలిక, రవాణా చెయ్యటం తేలిక. అంతే కాదు. కొన్ని రకాల వంటలకి ఘన రూపంలో ఉన్న కొవ్వులని వాడితేనే అవి గుల్లబారి, విచ్చుకుని, తినటానికి బాగుంటాయి. మరొక వ్యాపార రహశ్యం ఏమిటంటే ముడి పదార్ధాలుగా ఏ చవకబారు నూనెని వాడినా వనస్పతీకరణ అయిన తరువాత తేడాని పోల్తి పట్టలేము. అందుకనే వనస్పతులని తయారు చెయ్యటానికి చవక రకం నూనెలని వాడటం సర్వసాధారణంగా జరుగుతుంది. భారత దేశంలో మనకి చిరపరిచితమయిన వనస్పతి వ్యాపారనామం డాల్డా. అమెరికాలో ఈ వనస్పతులని మార్జరీన్ (margarine) అనిన్నీ షార్టెనింగ్ (shortening) అనిన్నీ అంటారు.
వనస్పతీకరణ వల్ల ఆరోగ్యానికి (ప్రత్యేకించి గుండె ఆరోగ్యానికి) ఏమైనా నష్టం ఉందేమోనని ఈ మధ్య కొందరు అనుమాన పడుతున్నారు. వనస్పతీకరణ ద్వారా కొవ్వు పదార్ధాల సహజ లక్షణాలని కృత్రిమంగా మార్చటం వల్ల ట్రాన్స్ ఫేట్స్ (trans fats) అనే కొవ్వులు తయారవుతున్నాయనిన్నీ ఈ ట్రాన్స్ ఫేట్స్ గుండె ఆరోగ్యానికి మంచిది కాదనిన్నీ కొందరు వైద్యులు ఆరాట పడుతున్నారు. ఈ ఆరోగ్య సంబంధమైన విషయాలన్నీ కూలంకషంగా చర్చించటానికి ఇది అనువైన సమయమూ కాదు, స్థలమూ కాదు.
దండించబడ్డ ఉదకర్బనాలు, పోలీతేను సంచులు
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే బహుబంధాలున్న ఉదకర్బనాలు ఉమ్మడి కుటుంబాలలాంటివి. ఉమ్మడి కుటుంబాలలో ఉన్న సంసారాలకి ఎలా మశ్శాంతి ఉండదో అలాగే బహుబంధాలు ఉన్న బణువులకి "మనశ్శాంతి" ఉండదు. ఉమ్మడి కుటుంబాలలో ఉన్న సభ్యుల మధ్య కలతలు పెట్టి విడగొట్టటం ఎంత తేలికో అలాగే బహుబంధాలు ఉన్న బణువుల మధ్య బంధాలని విడగొట్టటం తేలిక.
మరొక కోణం గుండా చెప్పాలంటే బహుబంధాలు ఉన్న బణువులకి నిశ్చలత (stability) తక్కువ. అంటే చురుకుదనం ఎక్కువ. రెండు బంధాలు కన్న మూడు బంధాలు ఉన్న బణువులకి ఈ చురుకుదనం ఇంకా ఎక్కువ. ఈ చురుకుదనాన్ని మన ఉపయోగాలకి ఎలా వినియోగించుకోవచ్చో చెబుతాను.
ఉదాహరణకి ఎతిలీనుని గట్టిగా మూత ఉన్న గిన్నెలో వేసి వేడి చేస్తే ఆ వేడికి ఈ బణువుల చైతన్యం పెరుగుతుంది. మూత ఉన్నది కనుక బయటకి పోలేవు. చైతన్యం ఉంది కనుక వాటిలో అవే ఢీకొట్టుకుంటూ ఉంటాయి. అప్పుడు కొన్ని జంత బంధాలు తెగిపోయి పక్కనున్న బణువులతో కలిసి ఇంకా పెద్ద బణువులుగా తయారవుతాయి. 9గతంలో ఒక సారి ఉదకర్బనాలని గొలుసులతో పోల్చేము కదా.) కనుక చిన్న చిన్న గొలుసులుగా ఉన్న ఎతిలీను బణువులు బాగా పొడుగాటి బణువులుగా మారతాయన్నమాట. ఈ పొడుగాటి గొలుసులలో ఒకొక్క లంకె (link) ఒకొక్క ఎతిలీను బణువు అన్నమాట. గొలుసులో "ఎన్నో" ఎతిలీను బణువులు ఉన్నాయన్నమాట. ఈ "ఎన్నో" లేదా "చాలా" అన్న విశేషణం గ్రీకు భాషలో "పోలీ" కి సరితూగుతుంది. ఇదే ఇంగ్లీషులో poly అన్న మాటకి మూలం. "పోలీటెక్నిక్" లో "పోలీ" అర్ధం కూడా ఇదే. ఎన్నో "టెక్నిక్కులు" నేర్పే పాఠశాలని "పోలీటెక్నిక్ కాలేజీ" అంటాం. అదే విధంగా ఎన్నో ఎతిలీను లంకెలు ఉన్న గొలుసుని ఏమంటాం? "పోలీ ఎతిలీను". అందాకా దీనిని మనం "బహు ఎతిలీను" అందాం - సరదాకి.
సగం తెలుగు, సగం ఇంగ్లీషుతో దుష్టసంధి చేస్తూ "బహు ఎతిలీను" ఏమిటని మీరు కోపగించుకోకండి. కర్బన రసాయనశాస్త్రం ఇంకా శైసవావస్థలో ఉన్నప్పుడు, ఇప్పటిలా అప్పుడు వార్తా సౌకర్యాలు గట్రా లేవు గనుక, రసాయనాలకి ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు పెట్టెస్తూ ఉండేవారు - ఇప్పుడు నేను బహు ఎతిలీను అని పెట్టినట్లు. ఈ వేలం వెర్రిలో రసాయనశాస్త్రం రసాభాసు అయినంత పని అయింది. అప్పుడు, అంటే సా. శ. 1892 లో, పెద్దలంతా జినీవా, స్విట్జర్లండులో సమావేశమయి ఒక ఒప్పందానికి వచ్చేరు. సంతృప్త ఉదకర్బనాల పేర్లు అన్నీ "-ఏను" (-ane) శబ్దంతో అంతం అవాలనీ, జంట బంధాలున్న ఉదకర్బనాలన్నీ "-ఈను" (-ene) శబ్దంతో అంతం అవాలనీ, త్రిపుట బంధాలున్న ఉదకర్బనాలన్నీ "-ఐను" (-yne) శబ్దంతో అంతం అవాలనీ ఈ ఒప్పందం యొక్క సారాంశం. "ఒప్పందాలన్నీ ఉల్లంఘించటానికే" అనే నానుడి ఇక్కడా నిజం అయింది. కొత్తగా కనిబెట్టబడ్డ పదార్ధాలకి ఈ ఒప్పందం ప్రకారం పేర్లు పెట్టటం మొదలు పెట్టేరు, అవి అతుక్కున్నాయి కూడా. కాని అప్పటికే స్థిరపడిపోయిన పాత పేర్లని అలవాటుపడ్డ ప్రాణాలు మార్చలేకపోయాయి.
ఏది ఏమైతేనేమి, మెతేను, ఎతేను, బ్యుటేను అన్న పాత పేర్లు ఈ ఒప్పందానికి అనుకూలంగానే ఉన్నాయి కనుక ఇబ్బంది లేకపోయింది. కాని జంటబంధం ఉన్న "ఎతిలీను" అన్న పేరు ఈ జినీవా ఒప్పందానికి విరుద్ధంగా ఉంది. అందుకని ఈ పేరుని "ఎతీను" అని మార్చమని పెద్దలంతా సెలవిచ్చేరు. విన్నవాళ్ళు విన్నారు. మొండికేసిన ఘటాలు మొండికేసేయి. ఇంత రాద్ధాంతం చేసిన తరువాత పాఠకలోకాన్ని పూర్తిగా పోగొట్టుకుంటే వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు. అందుకని పాత పేర్లనీ, కొత్త పేర్లనీ ఇక్కడ ఒక సారి పరామర్శ చేద్దాం.
పాత పేరు: ఎతేను (ethane)
కొత్త పేరు: ఎతేను (ethane)
సాంఖ్య క్రమం: C2H6
నిర్మాణ క్రమం: H3C-CH3
పాత పేరు: ఎతిలీను (ethylene)
కొత్త పేరు: ఎతీను (ethene)
సాంఖ్య క్రమం: C2H4
నిర్మాణ క్రమం: H2C=CH2
పాత పేరు: ఎసిటిలీను (acetylene)
కొత్త పేరు: ఎతైను (ethyne)
సాంఖ్య క్రమం: C2H2
నిర్మాణ క్రమం:
దుష్టసంధి చెయ్యవచ్చా కూడదా అని మీమాంస పడుతూ పెడదారి పట్టేం. ఇదంతా ఎందుకు ఏకరువు పెడుతున్నానంటే ఇంగ్లీషులో పేర్లు పెట్టటం కూడ ఏమీ తేలిక పని కాదు. ఇలా ప్రయాస పడితే పేర్లు పెట్టటం సంగతి అటుంచి పాఠ్యాంశం కొంచెం బాగా అర్ధం అవుతుంది కదా. కనుక అప్పుడప్పుడు ప్రయోగం పేరిట కొత్త కొత్త పేర్లు పెడుతూ ఉంటాను. పక్కన ఇంగ్లీషు పేరు ఎలాగూ ఉంటూ ఉంటుంది కనుక తెలుగు వారికి అర్ధం అవటంలో ఇబ్బంది ఉండదు.
ఇప్పుడు ఎతిలీను కి తెలుగు పేరు పెడదాం - కేవలం సరదాకి మాత్రమే సుమా! పాడ్యమి, విదియ అన్న తిధులని గుర్తు చేసుకుంటూ మెతేనుకి పాడేను అనీ, ఎతేనుని విదేను అనీ గతంలో ఒకసారి ప్రయోగించి చూశాం. ఈ లెక్కన జంట బంధాలు ఉన్న ఎతిలీను (లేదా, కొత్త పేరు, ఎతీను) విదిలీను (లేదా, విదీను) అవుతుంది. ఇప్పుడు "పోలీఎతిలీను" అన్నది "బహువిదిలీను" అవుతుంది. పోలీఎతిలీను కి బదులు కొత్త పేరు పోలీఎతీను వాడితే దానితో సరితూగే తెలుగు పేరు బహువిదీను. పోలీఎతిలీను అన్నా పోలీతేను అన్నా ఒకటే. ఈ రెండింటిని మనం "బహువిదీను" అని కొత్త పేరుతోటే పిలుద్దాం.
ఈ బహువిదీను (లేదా పోలీతేను) బణువు మైనం (wax) బణువుని పోలి ఉంటుంది. కాని మైనం బణువు కంటె బహువిదీను బణువుల పొడుగు చాల ఎక్కువ. మైనం లాగే ఇది కూడా దేనితోటీ రసాయన సంయోగం చెందదు. ఈ పదార్ధం మసక తెలుపు (cloudy white) రంగులో ఉండి, తాకితే జారుగా ఉంటుంది. కాని మైనం కి ఉన్న పెళుసుదనం ఉండదు. ఒంచితే ఒంగుతుంది. సాగదీస్తే సాగుతుంది. పల్చటి పొరలులా చేయనిస్తుంది. మైనం చేతి వేడికి కరుగుతుంది కాని ఇది అలా కరిగిపోదు. ఈ బహువిదీను వేడినీళ్ళల్లో వేస్తే మెత్తబడుతుంది. వేడినీళ్ళల్లో వేసి, మెత్తబరచిన తరువాత మనకి కావలసిన రీతిలో ఒంచ వచ్చు. ఇలా కుమ్మరిమట్టిలా ఎలా పెడితే అలా ఒంగే లక్షణం ఉన్న పదార్ధాలన్నిటిని గుత్తగుచ్చి ప్లేస్టిక్ (plastic) పదార్ధాలు అంటారు. కనుక పోలీతేను (లేదా బహువిదీను) ప్లేస్టిక్ జాతికి చెందిన పదార్ధం అన్నమ్నాట. కుమ్మరిమట్టి కూడా ఒక విధంగా ప్లేస్టిక్ జాతి పదార్ధమే. “ప్లేస్టిక్” అనే మాట నామవాచకం రూపంలో తెలుగువారింట ముద్దల కోడలై కూర్చుంది. నామవాచకం రూపంలో ఈ మాట తెలుగులో ఇమిడిపోయినా విశేషణం రూపంలో ఇమడలేదు. కనుక మనకి ఈ మాటతో సరితూగే దేశవాళీ మాట ఒకటి కావాలి. ఆలోచించండి!
ఎతీనుతో మొదలుపెట్టి పోలీతేను చేసినట్టే, అనేక రకాల బణువులని దండలుగా గుచ్చి “బహుబణువులు” చెయ్యవచ్చు. మచ్చుకి, స్టైరీను (styrene) బణువులు ఉన్నాయి. వీటిని దండలుగా గుచ్చితే వచ్చే పదార్ధం పేరు – చెప్పుకోండి, చూద్దాం? ఆహః. పోలీస్టైరీను. అలాగని మన కంటికి కనిపించిన పదార్ధాలన్నిటిని ఇలా దండలులా గుచ్చలేము. కాని దండలుగా గుచ్చగలిగే సందర్భాలలో ఈ పద్దతిని పొలిమరైజేషన్ అంటారు. పోలిమర్ అంటే బహుభాగి. కనుక polymerization అంటే “బహుభాగించటం”, బహుభాగిగా చెయ్యటం, లేదా దండలా గుచ్చటం, లేదా దండించటం. ఈ మాటలన్నిటిలోకీ “దండించటం” అన్న మాట నాకు నచ్చింది. కనుక “దండించుట” అన్నది “పొలిమైరైజేషన్” కి పర్యాయపదంగా వాడుదాం. ఇప్పుడు పోలీతేను దండించబడ్డ ఎతేను.
ఇలా దండించబడ్డ పోలీతేనుతో చేసిన సంచులు ఇప్పుడు విరివిగా వాడుకలో ఉన్నాయి. ఈ సంచులలో ఏదైనా పోసి మూతిని వేడి చేసి అతికెయ్యవచ్చు. సంచీని విప్పాలంటే కత్తెర తోనో గోళ్ళతోనో చింపెయ్యవచ్చు. ఇలాంటి సంచులే కాకుండా ఈ బహువిదీనుతో రకరకాల రంగుల సంచులు, బుట్టలు, సజ్జలు, డబ్బాలు, మొదలైన గృహోపకరణాలు ఎన్నో చెయ్యవచ్చు. అలాగే పోలీస్టైరీనుకి కూడ రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. గురివింజగింజ చూట్టానికి ఎంత ఎర్రగా, బుర్రగా ఉన్నా దాని వెనక ఒక నలుపు మచ్చ ఉన్నట్లే ఈ దండించబడ్డ ఉదకర్బనాలతో తయారయే గృహోపకరణాల వాడుకలో ఒక వెలితి ఉంది. పోలీతేను సంచులనే తీసుకుందాం. వీటిని ఒకసారి వాడిన తరువాత చెత్తలో పారేస్తాం. కాని ఈ సంచుల తయారీలో వాడిన రసాయనం దేనితోనూ సంయోగం చెందదు (అందుకనే మనం ఇళ్ళల్లో వాడటానికి భయపడం కూడ). కొన్నాళ్ళకి ఈ చెత్త పేరుకుపోతుంది; గోనె సంచుల మాదిరి చివికి, శిధిలమై, మట్టిలో కలిసిపోదు. దీని పర్యవసానం పర్యావరణ కాలుష్యం. సంధాన రసాయనాలని విశృంఖలంగా వాడటం అంత శ్రేయోదాయకం కాదేమో! ఇది ఆలోచించవలసిన విషయం.
కృతజ్ఞత: ఈ వ్యాసంలో బొమ్మలు వేసినది ప్రసాదం,
బ్లాగే స్థలం: http://prasadm.wordpress.com/
నేను బ్లాగే మరో స్థలం: http://latebloomer-usa.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
నా కెమిస్ట్రీ లెక్చరర్ ఇంత సులభంగా చెప్పి ఉంటే ఎంత బాగుండేదో :(
ReplyDelete