II ఉదకర్బన రసాయనం – తైల సాగర మధనం
6 ఏప్రిల్ 2009
5. పెట్రోలు, కిరసనాయిలు
ఇంతవరకు ముచ్చటించిన మొదటి నాలుగు ఉదకర్బనాలూ – అంటే మెతేను, ఎతేను, ప్రొపేను, బ్యుటేను – సాధారణ వాతావరణ పరిస్థితులలో వాయువులే. ఈ “సాధారణ వాతావరణ పరిస్థితులు” అంటే మనం ఉండే గది వెచ్చదనంలో (room temperature) అని అర్ధం. కాని సప్తేను (septane), అష్టేను (octane), నవేను (nonane) – ఈ మూడు గది ఉష్ణోగ్రత దగ్గర ద్రవ పదార్ధాలుగా ఉంటాయి. ఈ విషయం గుర్తు పెట్టుకోటానికి ఒక చిటకా ఉంది. ఏదైనా ఉదకర్బనపు గొలుసులో కర్బనపు అణువులు తక్కువగా ఉంటే ఆ ఉదకర్బనపు బణువులు చిన్నవిగా ఉండి, చులాగ్గా తిరగగలవు – అంటే అవి వాయువు రూపంలో ఉంటాయన్న మాట. ఏదైనా ఉదకర్బనపు గొలుసులో కర్బనపు అణువులు మరికొంచెం ఎక్కువగా ఉంటే ఆ ఉదకర్బనపు బణువుల “సైజు” పెరుగుతుంది. సైజుతో పాటు బరువు కూడా పెరుగుతుంది. అప్పుడు అంత చులాగ్గా తిరగగలేవు – అంటే అప్పుడు అవి ద్రవం రూపంలో ఉంటాయన్న మాట. గొలుసులో కర్బనపు అణువులు బాగా ఎక్కువగా ఉంటే ఆ ఉదకర్బనపు బణువుల “సైజు” - బుడుగు కథలో పక్కింటి పిన్నిగారిలా - బాగా భారీగా తయారవుతాయి. అప్పుడు ఉన్న చోటు నుండి కదలలేవు. అంటే ద్రవాలకి ఉన్నపాటి చైతన్యం కూడ ఉండదు. ఆ పరిస్థితులలో అవి ఘన పదార్ధాల రూపంలో మనకి తారస పడతాయి.
ఈ సందర్భంలో కొన్ని ఉదకర్బనాలు ఎప్పుడు ఘన, ద్రవ, వాయు రూపాలలో ఉంటాయో ఈ దిగువ పట్టికలో చూపిస్తాను. ఉత్సాహం ఉన్నవాళ్ళు ఈ పట్టికని కొద్దిగా అధ్యయనం చెయ్యండి; తరువాయి కథ ఈ పట్టిక మీద ఆధారపడదు కనుక ఈ పట్టికని నిర్లక్ష్యం చేసినా మరేమీ ప్రమాదం లేదు.
Table 1: The Saturated Hydrocarbons, or Alkanes
గమనిక: తెర మీద కనిపించే బాణం గుర్తుని ఈ పట్టిక మీద ఉంచి నొక్కితే పట్టిక పెద్దదయి చదవటానికి అనుకూలంగా ఉంటుంది.
ఇంతవరకు పరిశీలించిన ఉదకర్బనాలలో సప్తేను (septane), అష్టేను (octane), నవేను (nonane) లకి ఈ పారిశ్రామిక యుగంలో చాల ప్రత్యేకమైన స్థానం ఉంది. సప్తేను, అష్టేను, నవేనుల మిశ్రమమే మన కారులలో వాడే పెట్రోలు (అమెరికాలో అయితే గేసలీను అని కాని, లేక ముద్దుగా గేసు అని కాని అంటారు.) ఈ మూడు ఉదకర్బనాలూ పేరుకి ద్రవ పదార్ధాలే కాని, సీసా మూత తీసి గాలి తగలనిస్తే వీటిల్లో కొన్ని హరించి పోతాయి. నిజానికి పంచేను 36.1 C డిగ్రీల దగ్గర, షష్టేను 68.9 C డిగ్రీల దగ్గరా మరుగుతాయి – అంటే ద్రవ రూపం నుండి వాయు రూపం లోకి మారతాయి. (ఇక్కడ C అంటే సెల్సియస్ డిగ్రీలు అని అర్ధం.) అనుభవంతో బేరీజు వేసి చూసుకోటానికి కొన్ని ఉదాహరణలు: నీళ్ళు 100 డిగ్రీలు సెల్సియస్ దగ్గర మరిగి ఆవిరి అవుతాయి. ఇదే కొలమానంలో మన శరీరం ఉష్ణోగ్రత ఉరమరగా 37 డిగ్రీలు. నాలుగు చుక్కల పంచేను మన చేతి మీద వేసుకుంటే అవి మన శరీరపు వేడిని పీల్చుకుని, మరిగి వాయువులు అయిపోతాయి. అప్పుడు వేడిని కోల్పోయిన మన చెయ్యి చల్లబడ్డట్టు అనిపిస్తుంది. కాని అష్టేను, నవేను దశేను అంత సులభంగా వాయు రూపంలోకి పోలేవు – వాటి మరిగే స్థానం (boiling point) మన శరీరం వేడి కంటె ఎక్కువ.
మనం కార్లలో వాడే పేట్రోలులో, పంచేను నుండి, ద్వాదశేను వరకు ఉన్న ఉదకర్బనాలని ఒక నిర్ధిష్టమైన పాళ్ళల్లో కలుపుతారు. అప్పుడప్పుడు ఒక మోతాదు బ్యూటేను కూడా పడుతూ ఉంటుంది. ఈ పాళ్ళని బట్టి మేలు రకం పెట్రోలుగానో, నాసి రకం పెట్రోలుగానో, డీసెలు ఆయిలు గానో, విమానాల కిరసనాయిలు గానో, బుడ్డి దీపాల కిరసనాయిలు గానో అమ్ముతారు.
ఉదాహరణకి మనం కార్లలో వాడే పెట్రోలు లో అంతా సప్తేను తప్ప మరేదీ లేదని అనుకుందాం. ఈ సప్తేను కారు సిలిండరులోకి వెళ్ళి, అతి త్వరగా వాయువుగా మారిపోయి, విస్పులింగపు చురక తగలగానే భగ్గున మండి, ఎండిన తాటేకులా చరచర కాలిపోతుంది కాని నిలచి కాలదు. ఇదే సందర్భంలో అష్టేనుకి నిలచి కాలే గుణం ఉంది. ఆ మాటకొస్తే అష్టేనుకి చాలా సమభాగులు (isomers) ఉన్నాయి. వీటిల్లో ఐసో అష్టేను (iso-octane) మిగతా సమభాగుల కంటె బాగా నిలచి కాలుతుంది. మన కార్లలో వాడే ఇంధనానికి చురక తగలగానే అంటుకునే లక్షణమూ ఉండాలి, మంట అంటుకున్న తరువాత నిలచి కాలే లక్షణమూ ఉండాలి. మనకి అవ్వా కావాలి, బువ్వా కావాలి. ఈ రెండు గొంతేలమ్మ కోరికలూ తీరాలంటే ఐసోఅష్టేనునీ, నార్మల్ హెప్టేనునీ ఒక నిర్దిష్టమైన పాళ్ళల్లో కలపాలి. ఈ రెండింటి నిష్పత్తిని అష్టేను సంఖ్య (octane number) అంటారు. ఒక ఇంధనం యొక్క అష్టేను సంఖ్య 100 కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది, అంత ఖరీదైనదీ అవుతుంది. సాధారణంగా అమెరికాలో వాడుకలో ఉన్న కారులకి 87 అష్టేను సంఖ్య ఉన్న పెట్రోలు వాడితే సరిపోతుంది. (దీనినే regular గేసలీన్ అంటారు.) కొంచెం ఖరీదైన కార్లలో 89 అష్టేను సంఖ్య ఉన్న ఇంధనాన్ని వాడతారు. ఇంకా విలాసమైనవి, విలువైనవి అయిన కార్లలో 91 అష్టేను సంఖ్య సరిపోతుంది. పరుగు పందేలలో వాడే కార్లకి ఇంకా మెరుగైన పెట్రోలు వాడతారు.
అష్టేను సంఖ్య తక్కువ అయితే ఆ పెట్రోలు నిలచి కాలదు. అంటే సిలిండరు లోకి వెళ్ళిన తరువాత చురక తగలగానే భగ్గున మండి. ఠప్ మని పిస్తొలు పేల్చినట్లు చప్పుడు చేసి, కొద్దిగా శక్తిని విడుదల చేస్తుంది. ఇలా కారు ఇంజనులో ఇంధనం ఠప్ ఠప్ మంటూ కాలుతూన్న కారులో కూర్చుంటే రామచంద్రపురం గుర్రబ్బండిలోలా ప్రయాణం కుదుపుగా ఉంటుంది. ఈ రకం కుదుపునే ఇంగ్లీషులో “నాక్” (knock) అంటారు. ఇలా కుదుపునిచ్చే పెట్రోలుని “నాక్ చేస్తున్నాది” అంటారు. (నాకుతున్నాది అని అనకండి, బాగుండదు!)
ఉదకర్బనాలలో కర్బనపు గొలుసుల పొడుగు ఇంకా పెరిగితే మనకి దశేను (decane), ద్వాదశేను (dodecane), త్రయోదశేను వంటి పదార్ధాలు వస్తాయి. వీటి మిశ్రమమే కిరసనాయిలు. కిరసనాయిలు లో ఉన్న బణువులు పెట్రోలులో ఉన్న బణువుల కంటె పెద్దవి, బరువైనవి. అందుకనే కిరసనాయిలు పెట్రోలులా త్వరగా ఆవిరి అయిపోదు, పెట్రోలులా జోరుగా రాజుకుని మండనూ మండదు. అష్టేను కంటె కూడ నెమ్మదిగా, నిదానంగా కాలుతుంది.
6. ఉదకర్బనాల జన్మవృత్తాంతం
పెట్రోలు, కిరసనాయిలు, మొదలయిన ఉదకర్బనాల కథ ముగించే లోగా ఇవి మనకి ప్రకృతిలో ఎలా దొరుకుతాయో, వీటి కథా కమామీషు కొద్దిగా విచారిద్దాం. మెతేను (లేదా, ఏకేను) మనకి ఎక్కడనుండి వచ్చిందని అనుకున్నాం? కుళ్ళబెట్టిన ఆకులు, అలములూ, పేడా, పెంటా, వగైరాలు దీనికి జన్మ కారకులు. ఇదే విధంగా మిగిలిన ఉదకర్బనాలు కూడ ఈ పేడ, పెంటలకి మూల కారణమయిన మృగవృక్షాదుల జీవన ప్రక్రియల మీద ఆధారపడి ఉన్నాయి. శతాబ్దాల క్రితం వెల్లివిరిసిన అరణ్యాలు, తదితర జీవకోటి ప్రకృతి శక్తుల ప్రభావానికి లోనయి, భూగర్భంలోని రాతిపొరల మధ్య చిక్కుకొని, పైనున్న శిలావరణం (lithospehere) యొక్క పీడన ప్రక్రియలకి లోబడి, అనేక మార్పులకి లోనయి, చివరికి రాతిచమురు (petroleum) గా మారిందనే సిద్ధాంతం ఒకటి బాగా చలామణీ అవుతోంది. లేటిన్ భాషలో “పెట్రో” అంటే రాయి, “ఓల్” అంటే చమురు. ఈ “ఓల్” నుండే ఇంగ్లీషులోని "ఆయిల్" అన్న మాట పుట్టింది. కనుక “పెట్రోలియం” అన్న మాటకి “రాతిచమురు” అన్నది సరి అయిన తెలుగు సేత. “పెట్రోలియం” అనే ముడి చమురుని శుద్ధి చేయగా "పెట్రోలు" వస్తుంది. ఈ పెట్రోలు నే అమెరికాలో “గేసలీన్” అంటారు.
భూగర్భంలో దొరికే ఈ రాతిచమురులో అనేకమైన ఉదకర్బనాలు ఉన్నాయి. నేల లోకి గొట్టాలు దింపి ఈ రాతి చమురుని బయటకి తోడినప్పుడు ఇది నల్లగా, చిక్కగా, జిడ్డుగా, మడ్డిలా ఉంటుంది. ఈ నల్లబంగారాన్ని అమాంతం అలా వాడేసుకోలేము. ఉదకర్బనాలు గొలుసులులా ఉంటాయని ఊహించుకున్నాం కదా. భూగర్భంలో మిలియన్ల సంవత్సరాలు చిక్కుపడి ఉండటం వల్ల ఈ గొలుసులు – రకరకాలవి – బాగా చిక్కులు పడిపోయి గజిబిజిగా ఉంటాయి. అంటే మెతేను గొలుసులు, ఎతేను, …, డోడెకేను.. ఈ గొలుసులన్నీ లుమ్మలు చుట్టుకుపోయి ఉంటాయి. వీటి చిక్కులని విడదియ్యాలి. ఎలా?
చిన్న చిన్న, పొట్టి గొలుసులు వేడికి త్వరగా వాయువులుగా మారిపోతాయని తెలుసుకున్నాం కదా. కనుక ఈ మడ్డిని వేడి చేస్తే ముందస్తుగా మెతేను, ఎతేను, ప్రొపేను, బ్యుటేను లాంటివి వాయువులుగా మారి జిగురు ముద్దలోంచి బయటకి వచ్చెస్తాయి. వీటిని గొట్టాలలో పట్టి, సిలిండర్లలోకి ఎక్కించి మనం వంటలకి “వంటచెరకు”గా వాడుకోవచ్చు. ఇలా వాడుకోగా మిగిలిపోయిన వాయువులని గాలిలోకి ఒదిలెయ్యకుండా ముట్టించి మండించెస్తారు. విశాఖపట్నంలో కాల్టెక్స్ (ఇప్పుడు కంపెనీ పేరు మారిందనుకొండి) నూనెశుద్ధి కర్మాగారంలో ఇటువంటి మంట ఒకటి (flares) ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది.
పెట్రోలియం మడ్డిని ఇంకా వేడి చేస్తే సప్తేను, అష్టేను, వగైరా వాయురూపంలోకి వస్తాయి. వీటిని చల్లార్చగా వచ్చినదే పెట్రోలులో వాడతారు. ఇంకా వేడి చేస్తే దశేను, ఏకాదశేను, వగైరా వస్తాయి. వీటిని చల్లార్చితే మనకి కిరసనాయిలు (kerosine) వస్తుంది. మరికొంచెం వేడి చేస్తే “డీసెల్ ఆయిల్” (diesel oil) వస్తుంది. ఆ తరువాత ఇంధనపు చమురు (fuel oil) వస్తుంది. మన దేశంలో ఈ రకపు ఇంధనపు చమురుకి ఉపయోగం లేకపోవచ్చు కాని, చలిదేశాలలో ఈ చమురుని కొనుక్కుని, ఇంట్లో కొలిమిలో మండించి, ఆ మంటతో పుట్టే వేడితో ఇళ్ళని వేడి చేసుకుంటారు. ఈ ఇంధనపు చమురులోని ఉదకర్బనాల బణువులు చాల పొడుగైనవి కాబట్టి, ఇది పెట్రోలులా గభీమని అంటుకోదు. కనుక ఇళ్ళలోని కొలిమిలో మండించినా పేలిపోయే ప్రమాదం లేదు.
రాతి చమురుని ఈ విధంగా మరిగించి, దానిలోని భాగాలని విడదీయటాన్ని ఇంగ్లీషులో “ఫ్రేక్షనల్ డిస్టిలేషన్” (fractional distillation) అంటారు. “డిస్టిలేషన్” అంటే దిగమరిగించటం. మామూలుగా గిన్నెలో పోసి మరిగించకుండా ఒక పొడుగాటి, గొట్టం రూపంలో ఉన్న, అరల పెట్టిని ఒక దానిని తయారు చేసి, ఈ అరలపెట్టి అడుగున పెట్రోలియం మడ్డిని పోస్తారు. పోసి మరిగిస్తారు. అన్నీటికన్న మీదనున్న అరలలోకి తేలిక వాయువులు చేరతాయి. దాని కింద ఉన్న అరలలోకి మరికొంచెం బరువైన వాయువులు, అలాగన్న మాట. నూనెశుద్ధి కర్మాగారాల్లో మనకి కనిపించే పొడుగాటి బురుజులు చేసే పని ఇదే.
తెలుగులో “అర” అన్న మాటకి రెండు అర్ధాలు ఉన్నాయి. ఒకటి: అలమారులో కాని బీరువాలో కాని ఉండే అర. ఈ రకం అరలు ఉన్న పెట్టిని “అరల పెట్టి” అంటారు. ఈ రకం “అర” ని ముందుకీ వెనక్కీ జరపే సదుపాయం ఉంటే అప్పుడు దానిని “సొరుగు” అంటారు. మనకి ఇక్కడ కావలసినది “అరలు” ఉన్న పొడుగాటి బీరువా లాంటి ఉపకరణం. ఈ అరల పెట్టి అడుగున పోసి దిగమరిగించే పద్ధతిని మనం సరదాగా “అరమరిగించటం” అని అందాం. ఇప్పుడు fractional distillation అంటే “అరమరిగించటం”. ఎలా ఉంది ఈ ప్రయత్నం?
రెండవ ప్రపంచయుద్ధపు రోజుల్లో పెట్రోలు గిరాకీ బాగా పెరిగింది. రాతి చమురుని అరమరగించినప్పుడు మనకి ప్రాప్తం ఉన్నంత పెట్రోలు వస్తుంది కాని, మనకి "పెట్రోలు దాహం" ఎక్కువయినప్పుడల్లా ఎక్కువ రాదు. అలాగని కర్మ సిద్ధాంతాన్ని పట్టుకు కూర్చుంటే పనులెలా అవుతాయి? ఈ సందర్భంలో ఎవ్వరో అన్నారు. పెట్రోలులో ఉన్న బణువులకీ కిరసనాయిలు లో ఉన్న బణువులకీ తేడా ఏమిటి? పెట్రోలులో ఉన్న బణువులు చిన్నవి, తేలిక అయినవీ అయితే కిరసనాయులులో ఉన్నవి మరి కొంచెం పెద్దవి, బరువైనవి. కిరసనాయిలులో ఉన్న బణువులని “చితగ్గొట్టి” చిన్న చిన్న బణువులుగా చెయ్యొచ్చు కదా! అష్టవంకరలతో చుట్టుకుపోయి ఉన్న జంతికని “చిదిపి” కారప్పూస చేసినట్లన్నమాట. ఈ చిదపటాన్ని ఇంగ్లీషులో “క్రేకింగ్” (cracking) అంటారు. జంతికని చిదిపి కారప్పూస చేసేరంటే నాటుగా ఉంటుంది, జంతికని “క్రేక్” చేస్తున్నారంటే ఫేషనబుల్ గా ఉంటుంది. ఇలా అరమరగించో, “చిదిపో”, క్రేక్ చేసో మొత్తం మీద ఒక గేలను రాతి చమురు నుండి అర గేలను పెట్రోలు తియ్యవచ్చు.
7. కొవ్వొత్తులు, పద్మపత్రాలు
ఇంతవరకు రాతి చమురు నుండి తీసిన ఉదకర్బనాలు నిప్పు రవ్వ తగిలేసరికల్లా ఠపీమని పేలనయినా పేలేయి లేదా నిలచి కాలేయి. అలాగని ఉదకర్బనాలన్నీ పేలాలనీ లేదు, కాలాలనీ లేదు. ఈ బణువులలో ఉన్న కర్బనపు గొలుసు పొడుగు పెరిగే కొద్దీ ఈ కాలే గుణానికి కాలదోషం పట్టెస్తుంది. అంతే కాదు. బణువుల పరిమాణం పెద్ద అయేసరికల్లా ఆ పదార్ధం పెట్రోలులా పలచగా ఉండకుండా చిక్కబడుతుంది. వీటిని ఇంగ్లీషులో “లూబ్రికేటింగ్ ఆయిల్స్" (lubricating oils) అంటారు. వీటికి తెలుగులో కందెన చమురు అనే పేరు ఉంది; నేనేమీ సృష్టించలేదు, నా కంటె ముందే ఈ పని చేసి ఎవ్వరో పుణ్యం కట్టుకున్నారు. ఈ కందెన చమురుని ఇంకా బాగా శుద్ధి చేస్తే వచ్చేదానిని ఖనిజపు చమురు (mineral oil) అంటారు. ఖనిజపు చమురులో కర్బనపు గొలుసుల పొడుగు 15 నుండి 40 దాకా ఉండొచ్చు. చలికాలంలో ఒళ్ళు పగలకుండా దీనిని ఒంటికి రాసుకుంటారు. మలబద్ధకంతో బాధ పడేవారు దీనిని ఒక మోతాదు తాగుతారు కూడ. ఇది జీర్ణం అయే పదార్ధం కాదు కనుక కడుపులోని పెద్ద పేగుల వరకూ నేరుగా వెళ్ళిపోతుంది. అక్కడ పిష్టం కట్టిన మలానికీ, పేగుల గోడలకి మధ్య చేరి ఆ ప్రదేశాన్ని జారుగా (lubricate) చేస్తుంది. అప్పుడు విరేచనం అయే అవకాశం పెరుగుతుంది.
ఖనిజపు చమురుని ఇంకా అనేక సందర్భాలలో వాడతాం. పసిపాపల శరీరాన్ని చెమ్మగా ఉంచటానికి వాడే "బేబీ లోషన్" (baby lotion) లో ఖనిజపు తైలం వాడతారు. అదే విధంగా "కోల్డ్ క్రీం" (cold cream), లిప్‌స్టిక్ (lipstick), మొదలైన మైపూతలు, అంగరాగాలు, సురభిళ విలేపనాలు, మొదలైన అలంకరణ సామగ్రులలో కూడ ఇది విరివిగా వాడతారు. నేనిలా రాసేనని తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో శుద్ధి చేయని పదార్ధాన్ని తిన్నా, ఒంటికి పూసుకున్నా ప్రమాదం. ఈ వ్యాసపరంపరలో రాసేవన్నీ చదువరుల విజ్ఞాన పరిధులు పెంచటానికే కాని సొంత వైద్యం చేసుకోమని ప్రోత్సహించటానికి కాదు అని మరో సారి మనవి చేసుకుంటున్నాను.
ఈ చముర్లన్నిటినీ బయటకి తీసిన తరువాత మిగిలిన మడ్డిలో పనికొచ్చే పదార్దాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటి బణువులు చాల పెద్దవి కావటం ములాన్న ఇవి సాధారణ గది ఉష్ణోగ్రత దగ్గర ద్రవ పదార్ధాలుగా కాకుండా మెత్తటి ఘన పదార్ధాల రూపంలో ఉంటాయి; గడ్డ పెరుగు, జున్ను, వగైరా పదార్ధాలలా అన్న మాట. ఇటువంటి మెత్తటి ఘన పదార్ధాలలన్నిటిలోకి ముఖ్యమైనది “పెట్రోలియం జెల్లీ” (petroleum jelly). ఈ పెట్రోలియం జెల్లీ పేరు వినని వాళ్ళు ఉండొచ్చు కాని దీని వ్యాపార నామం (trade name) వినని వాళ్ళు ఉండరేమో! ఈ పెట్రోలియం జెల్లీనే “వేసలీను” (Vaseline) అనే వ్యాపార నామంతో అమ్ముతారు. ఖనిజపు చమురు లాగే దీన్ని కూడ ఒంటికి, పెదాలకి రాసుకుంటే అవి పగలకుండా ఉంటాయి. సంస్కృతంలో “ఖమీరం” అంటే ముద్ద. కనుక దీనిని “రాతిచమురు ముద్ద” అనొచ్చు. ఇది మరీ నాటు మాటలా ఉంటుందనుకుంటే దీనిని “శిలతైల ఖమీరం” అంటే పెట్రోలియం జెల్లీ కి సిసలైన అనువాదం అవుతుంది. ఈ పదబంధం తెలుగు కాదు కనుక తెలుగు వారు దీనిని వాడటానికి కొంచెం సుముఖత చూపవచ్చు. ఈ శిలతైల ఖమీరంలో మందులు రంగరించి అమృతాంజనం (టైగర్ బాం, విక్స్ వేపోరబ్, మొదలైన) వంటి లేపనాలు చెయ్యవచ్చు.
ఈ శిలతైల ఖమీరాన్ని తొలగించిన తరువాత రాతి చమురు నుండి మరొక పదార్ధం వస్తుంది. ఇది వేసలీన్ కంటె గట్టిగా ఉండి, దరిదాపు కొవ్వొత్తిలోని కొవ్వు మాదిరి, తెల్లగా, నున్నగా, జారుగా, అంటే సాఫీగా (సాఫీ అన్నది soft కి తెలుగులో బ్రష్ట రూపం అనుకుంటాను), ఈ ఘన పదార్ధాన్ని ఇంగ్లీషులో “పేరఫిన్ వేక్స్” (paraffin wax) అంటారు. పెట్రోలియం ని రాతి చమురు అన్నట్లే పేరఫిన్ వేక్స్ ని “రాతి మైనం” అనొచ్చు. ఈ రాతి మైనం ఒకరి జోలికి పోదు, మరొకరు తన దగ్గరకి వచ్చినా అంటీముట్టనట్లు ఉండి తామరాకు మీద నీటిబొట్టులా ప్రవర్తిస్తుంది. అసలు “పేరఫిన్” అనే మాట లేటిన్ నుండి వచ్చింది. ఈ మాటని parum (= బొటాబొటీగా) + affinis (= పొత్తు) అని విడగొట్టి దీనికి “పరుల పొత్తు కిట్టనిది” అని వ్యుత్పత్తి చెప్పుకోవచ్చు. లేటిన్ లో param అన్న మూలాన్ని "దరిదాపు, దగ్గరగా", అని కూడ తెలిగించవచ్చు. Paratyphoid అంటే అసలుదానికి "దగ్గరగా మరో టైఫోయిడ్" అని అర్ధం. Paramedic అంటే అసలు వైద్యుడు కాదు కాని, దగ్గరగా మరో రకపు వైద్య నిపుణుడు అని అర్ధం.
ఇప్పుడు ఈ మైనాన్ని కాగితానికి అంటిస్తే మనకి “మైనపు కాగితం” (wax paper) వస్తుంది.ఈ మైనపు కాగితం మీద నీళ్ళు పడితే తామరాకు మీద నీటిబొట్టులా పక్కకి జారిపోతాయి తప్ప కాగితం తడవదు. ఈ మైనపు కాగితానికి చెమ్మ అంటుకోదు. కనుక ఇటువంటి మైనపు కాగితాలని చేసి అమ్మ దలుచుకుంటే వాటికి “పద్మ పత్రాలు” అనే వ్యాపారనామం పెట్టి అమ్మి డబ్బు చేసుకోవచ్చు. తినుభండారాలని ఈ కంపెనీ వారి పద్మ పత్రాలలో చుట్టబెట్టి బంగీలుగా కట్టి అమ్మితే ఆ బంగీలలోకి చెమ్మ చేరదు; లోపల వస్తువులు తాజాగా, కరకరలాడుతూ చాల కాలం నిల్వ ఉంటాయి.
ఒక్క రాతి మైనమే కాదు, ఉదకర్బనపు జాతి పదార్ధాలన్నీ కూడ నీటితో కలవటానికి ఇష్టపడవు. నూనె, నీళ్ళు కలుస్తాయా? మొదట్లో నువ్వుల లోంచి వచ్చినదానిని నూనె అనేవారు; తిలలోంచి వచ్చిన దానిని తైలం అనేవారు. ఇప్పుడు ఆ వ్యత్యాసాన్ని గమనించటం లేదు కదా. నూతిలోంచి వచ్చినా నువ్వులలోంచి వచ్చినా అది ఈ రోజుల్లో "నూనే." నీళ్ళల్లో కరిగేవి నూనెలో కరగవు, నూనెలో కరిగేవి నీళ్ళల్లో కరగవు. అందుకనే నూనె మరకలు పడ్డ బట్టలని నీళ్ళల్లో ఎంత ఉతికినా మరకలు పోవు. “ఉష్ణం ఉష్ణేత శీతలే” అన్నట్లు నూనె మరకలు తియ్యటానికి నూనెనే వాడాలి. అందుకనే నూనె మరకలు తియ్యటానికి కొన్ని రకాల ఉదకర్బనాలు వాడతారు. నీళ్ళు లేకుండా ఉతికే పద్దతి కనుక దీనిని “డ్రై క్లీనింగ్” (dry cleaning) అన్నారు. డ్రై క్లీనింగ్ ని "టెలుగూలో" ఏమంటారో?
కృతజ్ఞత: ఈ వ్యాసంలో బొమ్మలు వేసినది ప్రసాదం,
బ్లాగే స్థలం: http://prasadm.wordpress.com/
నేను బ్లాగే మరో స్థలం: http://latebloomer-usa.blogspot.com
Sunday, March 29, 2009
ఇంటింటి రసాయనం, వంటింటి రసాయనం - 5
Labels:
కిరసనాయిలు,
కొవ్వొత్తులు,
పద్మపత్రాలు,
పెట్రోలు,
శిలతైల ఖమీరం
Subscribe to:
Post Comments (Atom)
Petroleum ki sambandhinchina vishayalu chala bagha unnayi
ReplyDelete