Monday, March 23, 2009

ఇంటింటి రసాయనం, వంటింటి రసాయనం - 2

2. కర్బన రసాయనం

గత బ్లాగులో “కర్బన రసాయనం” (carbon chemistry) అన్న శాఖ ఎలా పుట్టిందో తెలుసుకున్నాం. శాస్త్రంతో కొద్దిగా పరిచయం ఉన్న పిన్నలకి ఇక్కడ చిన్న సందేహం రావచ్చు. ప్రకృతిలో 108 మూలకాలు (elements) ఉన్నాయని పెద్దలు తటపటాయిస్తూ, నసుగుతూ అంగికరించేరు కదా. ఈ జాబితాలో బంగారం, వెండి, రాగి, ఉదజని, రవిజని, సీసం, తగరం, గంధకం, యురేనియం, మొదలైనవాటితో పాటు కర్బనం (Carbon) మరొక మూలకం మాత్రమే! అటువంటప్పుడు ఈ కర్బనం ఏమి ఊడబొడిచిందని? ఈ ఒక్క కర్బనపు అణువులు ఉన్న రసాయన ద్రవ్యాలన్నిటిని మూటగట్టి వాటిని ఒక వర్గమనిన్నీ, మిగిలిన 107 మూలకాలని గుత్తగుచ్చి మరొక వర్గమనినీ విభజించటం ఏమి సబబు?

తమాషా ఏమిటంటే కర్బనంతో సంయోగం చెందగలిగే రసాయనాల సంఖ్యతో పోల్చి చూస్తే మిగిలిన 107 మూలకాలతో తయారవగలిగే పదార్ధాల సంఖ్య అతి స్వల్పం. ఈ రెండింటికి తేడా హస్తిమశకాంతరం. ఎందుకింత తేడా వచ్చిందో తెలుసుకోవాలంటే కథనాన్ని ఇక్కడ ఆపి చిన్న పిట్ట కథ చెప్పుకోవాలి.

పదార్ధం (matter) కంటికి కనబడనంత చిన్న చిన్న అణువుల సముదాయం. ఒక సంఘానికి మానవులు ఎలాగో పదార్ధానికి అణువులు (atoms) అలాంటివి. మానవుడు సంఘజీవి; ఒక్కడూ ఉండలేదు, జట్లు జట్లుగా తిరుగుతాడు. మనమైతే పరాయి దేశంలో భారతీయులకోసం, భారతదేశంలో తెలుగు వాళ్ళకోసం, తెలుగు దేశంలో కులం వాళ్ళ కోసం తాపత్రయపడి జట్టు కట్టమూ? అలాగే అణువులు సావకాశం దొరికినప్పుడల్లా గుంపులు గుంపులుగా “తిరుగుతాయి.” ఈ గుంపులలో అణువులు రెండు ఉండొచ్చు, రెండు వేలు ఉండొచ్చు, ఇరవై వేలు ఉండొచ్చు. బహుళంగా ఉన్న ఈ అణువుల గుంపులకి తెలుగులో ఇంతవరకు పేరు లేదు కనుక వీటిని బణువులు (“బహుళమైన అణువులు”) అందాం. ఇప్పుడు బణువులో ఉండేవి అణువులు, అణువులో ఉండేవి పరమాణువులు అని భాష్యం చెప్పుకుంటే ఎలక్‌ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు పరమాణువులు అవుతాయి. మనం ఇక్కడ చదివే రసాయనశాస్త్రంలో అణువులు, బణువులు మాత్రమే ఉంటాయి; పరమాణువుల ప్రస్తావన ఉండదు.

ఒక బణువులో "ఇన్ని" అణువులు ఉండాలని నిబంధన ఏమీ లేదు. ఉదాహరణకి ఒక నీటి బణువు (water molecule, H2O) లో రెండు ఉదజని (Hydrogen) అణువులు, ఒక ఆమ్లజని (Oxygen) అణువు ఉంటాయి. ఒక రబ్బరు బణువులో వేలకి పైబడి అణువులు ఉంటాయి. ఇలా పెద్ద పెద్ద బణువులు తయారు కావాలంటే కర్బనపు బణువు అత్యవసరం. ఒక్క కర్బనపు బణువుకే ఇటువంటి బృహత్ బణువులని కూర్చగలిగే స్థోమత ఉంది; మిగిలిన మూలకాలకి ఈ శక్తి లేదు. కర్బనపు అణువులతో నిర్మించిన బణువులు కోటగోడల్లా దిట్టంగా ఉంటాయి. మిగిలిన మూలకాలతో పెద్ద పెద్ద బణువుల నిర్మాణం కొనసాగదు; సాగినా అవి సునాయాసంగా శిధిలం అయిపోతాయి. అందుకనే రసాయనశాస్త్రం అనే మహా వృక్షంలో “కర్బన రసాయనం” అనే శాఖకి ఇంత ప్రత్యేకత.

3. సమభాగులు, సాంఖ్యక్రమాలు

శాస్త్రం అంటే భావాలకి పేర్లు పెట్టటం అని చెప్పేను కదా. రసాయనశాస్త్రంలో మనకి తారసపడేది భావాలు ఒక్కటే కాదు, హనుమంతుడి తోకలా పెరుగుతూన్న ఎన్నెన్నో పదార్ధాలు. వీటిల్లో కొన్ని మనకి చిరపరిచితాలు: పాలు, పంచదార, కిరసనాయిలు, కర్పూరం, మొదలైనవి. కొన్ని మనకి అంతగా అలవాటు లేని పేర్లు: మెతల్ ఆల్కహాలు, ఎతల్ ఆల్కహాలు, డై మెతల్ ఈథర్, మొదలైనవి. మరికొన్ని చోట్ల మనం సాధారణంగా వాడే పేరుకీ, దాని శాస్త్రీయ నామానికి పోలికే ఉండదు. చాకలిసోడా అన్నది సాధారణ నామం అయితే సోడియం కార్బనేటు అన్నది శాస్త్రీయ నామం. ఈ సాధారణ, శాస్త్రీయ నామాలే కాకుండా ప్రతీ రసాయనానికీ ఒక హ్రస్వ నామం ఉంటుంది. సాధారణ నామం, శాస్త్రీయ నామం దేశం, భాష మారినప్పుడు మారవచ్చు కాని ఈ హ్రస్వ నామం మారదు, మార్చటం శ్రేయస్కరం కూడా కాదు. మనకి తెలుగు మీద ఎంత అభిమానం ఉన్నా ఈ హ్రస్వ నామాల దగ్గర గిరి గియ్యవలసినదే.

ఈ హ్రస్వ నామాల వాడుకకి అంతర్జాతీయ ఒడంబడిక ఉంది. అన్ని దేశాలవారూ, అన్ని భాషలవారు, ఉదజని అణువుని H అనీ, ఆమ్లజని అణువుని O అనిన్నీ, కర్బనపు అణువుని C అనిన్నీ, అలా ప్రతి ఒక్క మూలకానికి ఒక ప్రత్యేకమైన ఇంగ్లీషు అక్షరాన్ని కానీ, రెండు అక్షరాల జంటని కానీ, కేటాయించేరు. ఇప్పుడు రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు కలిస్తే ఒక నీటి బణువు వస్తుందని చెప్పటానికి

2H + O --> H2O

అని రాస్తారు కాని 2HO అని రాయరు. ఈ H2O అన్నదానిని నీటి యొక్క సాంఖ్యక్రమం (empirical formula) అంటారు. ఒక నీటి బణువులో ఏయే జాతి అణువుల సంఖ్య ఎంతెంతో చెబుతోంది కనుక ఈ రకపు రాతని “సాంఖ్యక్రమం” అన్నారు. ప్రతీ రసాయనం లోనూ ఏయే అణువులు ఎన్నెన్ని ఉన్నాయో సూచిస్తూ ఈ సాంఖ్యక్రమం పద్ధతిలో రాయమని సలహా ఇచ్చినది మరెవ్వరో కాదు – మన పేర్ల పెద్దయ్య, బెర్‌జీలియస్! ఈ పద్ధతి ప్రకారం H2O అని రాసినప్పుడు అది ఎల్లప్పుడు, అన్ని దేశాలలోనూ, విశ్వం అంతటా, మంచుని కాని, నీటిని కాని, నీటి ఆవిరిని కాని సూచిస్తుంది తప్ప మరే ఇతర పదార్ధాన్ని సూచించదు. ఇదే విధంగా NaCl అన్నది ఎల్లప్పుడూ "సోడియం క్లోరైడ్" అయి తీరాలి, CuSO4 ఎల్లప్పుడూ మైలతుత్తం (copper sulfate) అయి తీరాలి.

ఇక్కడో పిట్టకథ. నేను ఇక్కడ వాడే వర్ణక్రమం (spelling) అమెరికాలో చలామణీ అయేది. అమెరికాలో గంధకాన్ని Sulfur అని రాస్తారు, ఇంగ్లండులోలా Sulphur అనరు, కనుక sulfate అని రాసేను. ఇదే విధంగా అమెరికాలో మెతల్ ఆల్కహాల్, ఎతెల్ ఆల్కహాల్ అంటారు కాని “మీథైల్ ఆల్కహాల్” అనీ “ఈథైల్ ఆల్కహాల్” అని అనరు. ఛదువరులు, దేశకాల పరిస్థితులకి అనుగుణంగా వర్ణక్రమ, ఉచ్చారణలు సవరించుకోగలరు!

సాంఖ్యక్రమం అనే ఊహనం (concept) వికర్బన రసాయనం (inorganic chemistry) దగ్గర పనికొచ్చింది కాని కర్బన రసాయనపు పొలిమేరలలోకి వచ్చేసరికి కుంటుపడింది. ఉదాహరణకి C2H6O అనే సాంఖ్య క్రమాన్నే తీసుకుందాం. అంటే, ఈ పదార్ధంలో రెండు కర్బనపు అణువులు, ఆరు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు ఉన్నాయని అర్ధం. కాని ఇదే సాంఖ్యక్రమం ఉన్న పదార్ధాలు రెండు ఉన్నాయి. ఒకదాని పేరు “ఎతల్ ఆల్కహాలు” (ethyl alcohol), రెండవదాని పేరు "డై మెతల్ ఈథర్" (dimethyl ether). ఎతల్ ఆల్కహాల్ అంటే “గుల్మా మందు”. మనం క్లబ్బులలోనూ, కాక్‌టెయిల్ పార్టీలలోనూ సేవించే బీరు, సారా (wine), విస్కీ మొదలైన వాటిల్లో నిషా ఎక్కించే ఘటక ద్రవ్యం (ingredient) ఎతల్ ఆల్కహల్. పోతే, డైమెతల్ ఈథర్ అన్నది ఒక వాయు పదార్ధం. ఈ రెండింటికి ఏ విధమైన పోలికా లేనేలేదు. ఈ రెండింటిని ఒకే సాంఖ్యక్రమంతో సూచిస్తే ఎలా? ఈ దెబ్బతో మన బెర్‌జీలియస్ గారి పరువు ప్రతిష్టలు చెట్టెకేసేయని కొందరు అనుకున్నారు. (ఆనందించేరో, ఆరాటపడ్డారో నాకు తెలియదు!) మన గురువుగారు అంత తేలికగా లొంగిపోతే ఆయన పేరు మనం ఇప్పుడు ఎందుకు స్మరిస్తాం? కరవ్యం తెలియనప్పుడల్లా ప్రభుత్వాలు కమిటీలు వేస్తాయి. అలాగే ఇబ్బంది ఎదురయినప్పుడల్లా బెర్‌జీలియస్ పేర్లు పెడుతూ ఉంటారు. రెండు విభిన్నమయిన రసాయనాలకి ఒకే సాంఖ్యక్రమం ఉంటే వాటిని ఐసోమర్స్ (isomers) అనమన్నారాయన. గ్రీకు భాషలో iso అంటే “సమ”, mer అంటే “భాగం.” కనుక isomer అంటే “సమభాగి” – లేదా సమాన భాగాలు, లేదా పాళ్ళు గలది. ఈ నిర్వచనం ప్రకారం ఎతల్ ఆల్కహాలు, డైమెతల్ ఈథర్ సమభాగులు. అంటే ఈ రెండింటిలో ఒకే రకం అణువులు ఒకే నిష్పత్తిలో ఉన్నాయని అర్ధం; కాని లక్షణాలు మాత్రం తేడా. ఈ తేడా ఎందుకొచ్చిందంటే, అణువులు ఒకటయినా వాటి అమరికలో తేడా ఉండొచ్చు కదా. "స్వరములు ఏడైనా, రాగాలెన్నో” అన్నట్లు అనుకొండి. ఇంగ్లీషులో అక్షరాలు 26 అయినా మాటలు ఎన్నో! ఒక పోగు ఇటికలతో తులసికోట కట్టొచ్చు, లేదా గోరీ కట్టొచ్చు; ఇటికల అమరిక మారిందంతే. ఈ వ్యవహారం అంతా ఒక కొలిక్కి వచ్చేసరికి కర్బన రసాయనంలో సాంఖ్యక్రమం ఒక్కటీ తెలిసినంతా మాత్రాన సరిపోదు, ఒక బణువులోని అణువుల అమరిక కూడా తెలియాలీ అని తేలింది.

4. బాహుబలం, నిర్మాణక్రమం

కర్బన రసాయనంలో అణువుల అమరిక ఎంత ముఖ్యమో తెలపటానికి ఒక ఉపమానం చెబుతాను. మనందరికీ 1, 2, 3, 4, … వగైరా అంకెలు తెలుసు. ఇలాంటి అంకెలు రెండు కాని అంతకంటె ఎక్కువ కాని ఉంటే వాటిని సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 27, 476 అనేవి సంఖ్యలు. ఈ 476 అనే సంఖ్యనే తీసుకుందాం. ఇందులో 4, 6, 7 అనే మూడు అంకెలు ఉన్నాయి. ఇప్పుడు 746 అనే సంఖ్యని తీసుకొండి. ఇందులోనూ 4, 6, 7 అనే అంకెలే ఉన్నాయి – కాని ఇక్కడ వీటి అమరిక వేరు. ఆమరిక మారటంతో 476 విలువ ఒకటయితే 746 విలువ మరొకటి అయింది.

మరొక ఉదాహరణ. C, A, T అనే ఇంగ్లీషు అక్షరాలనే తీసుకుందాం. వీటి అమరికని బట్టి అర్ధం మారుతుంది. CAT అంటే పిల్లి. ACT అంటే నటన అని ఒక అర్ధం. కాని TAC అంటే ఏ అర్ధమూ లేదు. ఇదే విధంగా మన దగ్గర ఉన్న అణువులని ఒక విధంగా అమర్చితే ఒక రసాయనం రావచ్చు, మరొక విధంగా అమర్చితే మరొక రసాయనం రావచ్చు, మూడో విధంగా అమర్చితే ఏ పదార్ధమూ రాకపోవచ్చు.

ఇక్కడ అంకెలు, అక్షరాలతో ఇచ్చిన ఉదాహరణలు ఏక-మాత్రక (one-dimensional) ఉదాహరణలు. అమెరికాలో Scrabble అనే బల్ల ఆట (board game) ఉంది. ఈ ఆటలో ఒక బల్ల మీద అక్షరాలని రెండు దిశలలో పేర్చి మాటలు తయారుచేస్తాం, గళ్ళనుడికట్టు మాదిరి. కనుక Scrabble ద్వి-మాత్రక (two-dimensional) ఆట. ఇదే విధంగా మూడు దిశలలో వ్యాపించే ఆటని ఊహించుకొండి. ఎందుకంటే రసాయనశాస్త్రానికి కావలసిన మన ప్రపంచం త్రి-మాత్రకం (three-dimensional). ఒక అణువుని మరొక అణువుకి తగిలించినప్పుడు ఆ అమరికలు తిన్నగా చీపురు పుల్లలాగా ఉండవు, పల్చగా అప్పడాలలాగా ఉండవు; అణువులు మూడు దిశలలోనూ వ్యాపించి ఉంటాయి. ఏ అణువు ఏ అణువుకి ఎటుపక్క ఉందో నిర్ద్వందంగా చూపించాలంటే పూసలు-పుల్లలు నమూనాలు (ball and rod models) ఉపయోగించాలి. కాగితం మీద కాని, తెర మీద కాని ఇటువంటి బొమ్మలు గీసి చూపించటం అంత తేలిక కాదు. అందుకని ఇటుపైన అణువుల అమరికని నిర్మాణక్రమం (structural formula) అనే బొమ్మ గీసి చూపించినప్పుడు, సులభమైన పద్ధతిలో గీసి చూపిస్తాను. వీటిని అప్పడ నిర్మాణక్రమం (flat structural formula) అందాం. ఈ రోజుల్లో రసాయనశాస్త్రపు పాఠ్య పుస్తకాలలో ఇంతకంటె మంచి బొమ్మలు వేస్తున్నారు. ఆ రకం బొమ్మల కంటె నేను గీసి చూపించే బొమ్మలు అర్ధం చేసుకోవటం తేలిక. విషయం అర్ధం అయిన తరువాత కావలిస్తే క్లిష్టమయిన బొమ్మలు అర్ధం చేసుకోవటం తేలిక.

నిర్మాణక్రమం అర్ధం అవటానికి చిన్న ఉపమానం చెబుతాను. ప్రతి అణువుకి కొన్ని చేతులు (లేదా బాహువులు) ఉన్నట్లు ఊహించుకుందాం. అమ్మాయిలు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని “ఒప్పులగుప్ప” ఆట ఆడరూ? అలాగే అణువులు తమ స్నేహితులయిన ఇతర అణువుల చేతులు పట్టుకోటానికి ఇష్టపడతాయని అనుకుందాం. ఇలా ఒకరి చేతులు మరొకరు పట్టుకోగా తయారయే గుంపులే బణువులు. అమ్మాయిలకి రెండేసి చేతులు ఉన్నాయని మనకి తెలుసు. అణువులకి ఎన్నేసి చేతులు ఉన్నట్లు? మనుష్యులకి మల్లే రెండు చేతులా? దేవుళ్ళకి మల్లే నాలుగు చేతులా?

ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే పరిమాణాత్మక విశ్లేషణ (quantitative analysis) చెయ్యాలి. రెండు ఉదజని అణువులు ఒక ఆమ్లజని అణువుతో కలిస్తే నీరు వస్తుందన్న విషయం పరిమాణాత్మక విశ్లేషణ ద్వారానే తెలిసింది. మన ఒప్పులగుప్ప ఉపమానం ప్రకారం ఒక ఆమ్లజని రెండు ఉదజని అణువుల “చేతులు” పట్టుకోవాలి కనుక ఆమ్లజని అణువుకి రెండు చేతులు, ఉదజని అణువు ఒకొక్కదానికి ఒకొక్క చెయ్యి ఉంటే సరిపోతుంది. ఇదే విషయాన్ని రసాయన పరిభాషలో చెప్పాలంటే ఆమ్లజని బాహుబలం 2, ఉదజని బాహుబలం 1 అని అంటాం. ఈ “బాహుబలం” అన్న మాట ఇంగ్లీషులోని “వేలెన్సీ (valency) అన్న మాటకి తెలుగుసేత. లేటిన్ భాషలో ‘వేలెన్సీ” అంటే బలం. (ఇందులోంచే valor లేదా పరాక్రమం వచ్చి ఉంటుంది.) కనుక ఈ మాటని మనం “బలం” అని కాని మరికొంచెం వివరణాత్మకంగా ఉంటుందనుకుంటే “బాహుబలం” అని కాని అనొచ్చు. లేదా కొంచెం కుదించి “బాలం” అనొచ్చు. మనం "బాలం" అందాం.

ఈ బాహుబలాన్ని బొమ్మగీసి చూపించటం రివాజు. ఆమ్లజని బాలం 2 కనుకనున్నూ, ఆమ్లజని హ్రస్వనామం O కనుకనున్నూ, ఆమ్లజని బాలం చూపించటానికి O రాసి దానికి ఇటో గీత, అటో గీత, ఈ విధంగా - O - గీసి చూపుతారు. ఈ గీతలని బంధాలు (bonds) అంటారు. ఇదే విధంగా ఉదజని బాలం 1 కనుక, ఉదజనిని ఇలా - H కాని, ఇలా H - కాని చూపుతారు. ఈ పద్ధతిని నీరు (H2O) నిర్మాణక్రమం (structural formula) H-O-H అవుతుంది. ఆమ్లజనికి రెండు చేతులు, రెండు ఉదజని అణువులకి, ఒకొక్కదానికి ఒకొక్క చేయి చొప్పున, వెరసి మొత్తం నాలుగు చేతులు ఉండాలి. కాని ఇక్కడ H-O-H లో రెండే కనిపిస్తున్నాయి. ఇక్కడ జరిగినది ఏమిటంటే ఉదజని, ఆమ్లజని రసాయన సంయోగం చెందినప్పుడు ఉదజని చెయ్యి ఒకటి, ఆమ్లజని చెయ్యి ఒకటి టంకం వేసినట్లు అతుక్కుపోయి ఒకే ఒక చెయ్యిలా కనిపిస్తుంది. కనుక రెండు జతల చేతులు అతుక్కుపోయి రెండు చేతులలా కనిపిస్తాయి.

ఆమ్లజనికీ, ఉదజనికీ ఉన్నట్లే ప్రతి అణువుకి కొంత బాలం ఉంటుంది. ఉదాహరణకి గంధకం (Sulfur) యొక్క బాలం 2, నత్రజని (Nitrogen) యొక్క బాలం 3, కర్బనం (Carbon) యొక్క బాలం 4, భాస్వరం (Phosphorus) యొక్క బాలం 4, ….. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఆ మాటకొస్తే కొన్ని మూలకాలకి బాలం 0 (సున్న). ఈ మూలకాలకి బాహువులు లేవన్న మాట. వీటిని కావలిస్తే “నిర్బాహువులు” (నిర్భాగ్యులు కాదు) అనొచ్చు. డబ్బు లేని వాళ్ళ సంపర్కం ఎవ్వరికీ ఎలాగ అక్కరలేదో అలాగే నిర్బాహులయిన నిర్భాగ్యపు మూలకాలతో సంయోగం చెందటానికి ఏవీ ఇష్టపడవు. నియాను (Neon), ఆర్గాను (Argon) వంటి వాయువులు ఈ జాతికి చెందినవి. కావలిస్తే వీటిని నిర్భాగ్యపు వాయువులు (inert gases) అనొచ్చు.

బాలం (valency) అంటే ఏమిటో ఈ పాటికి అర్ధం అయి ఉండాలి. ఈ బాలం అనే ఊహనం (concept) ఉపయోగించి, నిర్మాణక్రమం అనే కొత్త ఊహనాన్ని ప్రవేశపెట్టి, ఎతల్ ఆల్కహాలు, డైమెతల్ ఈథరు తెచ్చి పెట్టిన చిక్కు సమస్యని మన బెర్‌జీలియస్ ఎలా పరిష్కరించేరో వచ్చే బ్లాగులో చూద్దాం. ఈ రెండింటి సాంఖ్యక్రమం C2H6O అని అనుకున్నాం కదా. ఈ C2H6O లో రెండు కర్బనపు అణువులు ఉన్నాయి కదా. ఒకొక్క కర్బనానికి నాలుగు చేతులు. వీటిల్లో ఒక చేతితో పక్కనున్న కర్బనపు అణువు చేతిని పట్టుకుందనుకుందాం. అప్పుడు ఒకొక్క దానికి మూడేసి ఖాళీ చేతులు (రిక్త హస్తాలు) చొప్పున మొత్తం ఆరు ఖాళీ చేతులు ఉంటాయి. ఈ ఆరు ఖాళీ చేతులకీ ఆరు ఉదజని అణువులనీ తగిలించెస్తే సరిపోలా? మరి మిగిలిపోయిన ఆమ్లజని సంగతి? ఈ ఆమ్లజని అణువుని కూడా ఇరికించాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాలనీ బొమ్మలు గీసి చూపించాలి. ఆ రకం బొమ్మలు గియ్యటం నాకు బాగా అలవాటులేని పని. ఆ సూక్ష్మం ఎవ్వరైనా చెబుతారేమోనని గత బ్లాగులో ఒక మనవి రాసేను. ఆది ఎవ్వరూ చూడలేదో, చూసినా నిర్లిప్తతో ఊరుకున్నారో తెలియదు. కనుక ఆ బొమ్మ గియ్యటం నేర్చుకున్నాక మిగిలిన విషయాలు రాస్తాను. కొన్నాళ్ళు పట్టొచ్చు. ఓపిక పట్టండి.

2 comments:

  1. గురువు గారికి ప్రణామాలు.

    మీ వైజ్ఞానిక వ్యాసాలు చాలా సరళంగా, అందంగా, అధ్బుతంగా వున్నాయి. నా చిన్న తనం లో రసాయన శాస్త్రాన్ని బట్టీయం వేయించే వారు తప్ప ఇలా చెప్పేవాళ్ళు లేక పోవడంతో దీన్నీ ఒక తల నొప్పి వ్యవహారం గానే భావించాను. కానీ నేను ఎంత ఎంత మిస్సయానో ఇప్పుడు తెలుస్తోంది.

    మీకు కావలసిన చిత్రాలను నేను గీసి ఇస్తాను. నాకు బొమ్మలు గీయడం లో కాస్తో కూస్తో అనుభవం కూడా వుంది లెండి. ఒక్కసారి నాకు [yes.prasadm@gmail.com కు] మెయిలు పంపగలరా? మిగితా విషయం వివరంగా చర్చించవచ్చు.

    ఒక శిష్య పరమాణువు
    ప్రసాదం

    ReplyDelete
  2. సర్ Chemistry ఇంత సులభంగా ఉంటుందా అనిపిస్తుంది
    నాకు ఫొర్ములస్ అంటే ఉన్న భయం వల్ల సరిగా చదవ లేక పోయే వాన్ని
    Thanks for the post

    ReplyDelete