Tuesday, January 4, 2022

వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు

 

వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు

ఈమాట, మే 2014 నుండి పునర్ముద్రితం
(తెలుగు "కోరా" సభ్యులు కొంతమంది అంతర్జాల సమావేశం జనవరి 23, 2022 న జరుపుకునే సందర్భంలో నన్ను 20 నిమిషాలు మాట్లాడమన్నారు. వారి సౌకర్యార్థం ఈ వ్యాసాన్ని మరొకసారి ఇక్కడ ప్రచురిస్తున్నాను. )

సంగ్రహం

వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో ఉన్న ఇంగ్లీషుని తెలుగులోకి మార్చటంలో ఉన్న సమస్యలని, వాటి పరిష్కార మార్గాలని అభివర్ణించటం జరిగింది. తెలుగులోకి అనువదించబడ్డ పాఠ్యాంశంలో తెలుగు నుడికారం ఉట్టిపడాలంటే తెలుగు వాడకంలో దొర్లే ఇంగ్లీషు తత్సమాలు 25 శాతం మించకుండా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించటం జరిగింది. ఈ గమ్యాన్ని చేరుకోవటం కష్టమేమీ కాదు. మొదట, ఇంగ్లీషు మాటలని యథాతథంగా పెద్ద ఎత్తున గుచ్చెత్తి వాడెయ్యకుండా, సాధ్యమైనంత వరకు ఉన్న తెలుగు మాటలని వాడటానికి ప్రయత్నం చెయ్యటం. రెండు, సమానార్థకమైన తెలుగు మాట లేకపోయినా, వెనువెంటనే స్పురించకపోయినా ఇంగ్లీషు తత్సమాలని వాడటం కంటె తెలుగు ఉచ్చారణకి లొంగే తద్భవాలని వాడటం. మూడు, సందర్భానికి సరిపోయే భావస్పోరకమైన తెలుగు మాటలని అవసర రీత్యా సృష్టించి వాడటం. నాలుగు, ఇంగ్లీషు వాడుకలో స్థిరపడిపోయిన దుర్నామాలని యథాతథంగా తెలుగులోకి దింపేసుకోకుండా జాగ్రత పడటం. చివరగా, ఈ ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భాలలో ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాయటం. (ముద్రణకి వీలయినప్పుడు, పక్కని కుండలీకరణాలలో ఇంగ్లీషు లిపిలో చూపించటం.) ఈ సూచనలన్నీ ఆచరణయోగ్యాలేనని స్వానుభవం చెబుతోంది.

1. ప్రవేశిక

ఆధునిక వాణిజ్య, వ్యాపార, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో విస్తారంగా వాడుకలో ఉన్న ఇంగ్లీషుని సరళమైన, భావస్పోరకమైన, దేశీ నుడికారంతో ఉట్టిపడే తెలుగులోకి మార్చటంలో ఉన్న కష్టసుఖాలని విశ్లేషించి, ఆచరణయోగ్యమైన సలహాలు ఉత్పాదించాలనే కోరిక ఈ వ్యాసానికి ప్రేరణ కారణం. అనువాదకుడు సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో అనుభవజ్ఞుడనిన్నీ, అతని మాతృభాష తెలుగనిన్నీ అనుకుందాం. ‘అంతా ఇంగ్లీషు నేర్చేసుకుంటే పోలేదా? అపారమైన ఇంగ్లీషు వైజ్ఞానిక సాహిత్యాన్ని తెలుగులోకి దింపటానికి ప్రయత్నించటం అవివేకం కాదా?’ వంటి ప్రశ్నల మీద తర్జనభర్జనలు జరపడానికి ఇది వేదిక కాదు, సమయమూ కాదు.

ముందుగా కొన్ని నిర్వచనాలతో మొదలుపెడదాం. ఒక భాషనుండి మరొక భాషలోకి తర్జుమా (డెరివేషన్, derivation) చెయ్యడానికి రెండు పద్ధతులు ఉన్నాయి: అనువాదం (ట్రాన్స్‌లేషన్, translation), అనుకరణ (ఎడాప్టేషన్, adaptation). ఈ అనుకరణలనే ‘స్వేచ్ఛానువాదాలు’ అనటం కూడ కద్దు. కవిత్రయం తెలిగించిన ఆంధ్ర మహాభారతం సంస్కృత మూలానికి అనుకరణ. ఏనుగు లక్ష్మణకవి తెలిగించిన నీతి శతకం సంస్కృత మూలానికి అనువాదం. అనుకరణ చేసేటప్పుడు మూలానికి మార్పులు, చేర్పులు చేసే వెసులుబాటు ఉంటుంది.

వైజ్ఞానిక, సాంకేతిక, వాణిజ్య, వ్యాపార రంగాలలో ఇంగ్లీషు నుండి ఇతర భాషలలోకి తర్జుమా చెయ్యవలసిన అవసరం తరచు వస్తూనే ఉంటుంది. పాఠ్య పుస్తకాలు, ఉపకరణాలు ఎలా వాడుకోవాలో తెలియజేసే కైపొత్తాలు (handbooks), కల్పనా సాహిత్యం, మనోవికాసక గ్రంథాలు, జనరంజక విజ్ఞానం, మొదలైన వాటిని ఏ ముక్కకాముక్క అనువదించకపోయినా పరవాలేదు – అనుకరణ సరిపోతుంది. కాని ఆర్ధిక విషయాలు, లావాదేవీలకి సంబంధించినవి, ఆస్తి హక్కులకి సంబంధించిన దస్తావేజుల వంటి రూఢి పత్రాలు, వగైరాలు అనుకరిస్తే సరిపోదు – వాటిని అనువదించాలి. ఇలా అనువాదాలకి, అనుసరణలకి మధ్య తేడాలు ఉన్నాయని గుర్తించి, రాత సౌకర్యం కొరకు ఈ రెండు ప్రక్రియలనీ గుత్తగుచ్చి అనువాదాలనే అందాం. అవసరం వచ్చినప్పుడు తేడాని గుర్తిస్తూ మాట్లాడుకోవచ్చు.

మన జీవితాలలో మూడు రకాల అనువాదాల అవసరం కనబడుతుంది: (1) తీరుబడిగా మూల గ్రంథాన్ని చదివి, జీర్ణం చేసుకుని, అనువాదం తయారు చేసి, దానిని బిగుతుగా తిరగ రాయటం, (2) ఒక గడువుని చేరుకోవాలనే తొందరలో మూల గ్రంథాన్ని చదువుతూ, త్వరగా అనువాదాన్ని తయారు చెయ్యటం. (పత్రికా విలేఖరులు తరచుగా ఎదుర్కునే సమస్య ఇది,) (3) ఒక వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే, అదే సమయంలో దానిని తెలుగులో చెప్పటం. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావన మొదటి అంశానికే పరిమితం.

1.1 దేశ, కాల, సంస్కృతులని పరిరక్షించటం

ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ ప్రపంచం సమతలంగా మారుతోందని ఉత్ప్రేక్షిస్తున్నారు. ఇక్కడ ‘సమతలం’ అంటే దేశకాల పరిస్థితుల వల్ల కాని, ఆర్ధిక భేదాల వల్ల కాని, రాజకీయ సిద్ధాంత ధోరణులవల్ల కాని బాహ్యంగా ప్రస్పుటమయే అడ్డుగోడలని పగులగొట్టి ప్రపంచం అన్ని చోట్లా ఒకేలా కనిపిస్తోందని భాష్యం చెప్పుకోవచ్చు. ఎన్ని అడ్డు గోడలని ఛేదించినా మాట్లాడే మాట, రాసే రాత అనే గోడ ఇంకా బలంగానే ఉందని చెప్పడానికి రెండు ఉదాహరణలు: (1) సెల్ ఫోను సౌకర్యం ప్రపంచమంతటా పాకిపోయింది. మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, సర్వులూ వాడుతూన్న పరికరం ఇది. వీరందరికీ ఇంగ్లీషు రావాలంటే ఎలా? ఈ పరికరాన్ని వాడుకునే విధివిధానాలు వారికి తెలుగులో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంగ్లీషు మోజులో పడిపోయిన వారికి ఆ అవసరం కనబడక పోయినా నోకియా వాడికి కనబడింది. (2) తెలుగువాళ్లు తండోపతండాలుగా విమానాలలో ప్రయాణాలు చేస్తున్నారు. వీరిలో తెలుగు తప్ప మరొక భాషతో వెసులుబాటు లేని వాళ్లు ఉంటూనే ఉన్నారు. వీరు విమానంలో కక్కసు దొడ్లోకి వెళ్ళి అక్కడ పాయిఖానా వసతులని వాడుకోవటం తెలియక వాటిని పాడు చేస్తున్నారు. మన మీద అభిమానం కొద్దీ కాకపోయినా వాడి విమానం శుభ్రంగా ఉండాలని ఎమిరేట్స్ విమానం కంపెనీ కక్కసు ఎలా వాడుకోవాలో తెలుగులో (తమిళంలో లేదు, మళయాళంలో లేదు, మరాఠీలో లేదు) సూచనలు రాసేరు. ఇంగ్లీషుని తెలుగులోకి మార్చి రాయవలసిన అవసరం నోకియా వాడికీ, ఎమిరేట్స్ వాడికీ కనబడింది.

ఇంగ్లీషుని తెలుగులోకి మార్చే సందర్భాలలో కొన్ని సాంస్కృతికమైన ఇబ్బందులు కూడ ఉంటాయి. ఉదాహరణకి ఇంగ్లీషులో, ‘మై మదర్, యువర్ మదర్’ అన్న పదబంధాలు ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించేటప్పుడు యడాగమసంధితో ‘నాయమ్మ, నీయమ్మ’ అని అనువదిస్తే నీచ్యార్థం ధ్వనించే అవకాశం ఉంది. మూలంలో బహువచనం లేకపోయినా, తెలుగు నుడికారానికి తల ఒగ్గి, వీటిని ‘మా అమ్మ, మీ అమ్మ’ అని మార్చితేనే బాగుంటుంది.

అమెరికాలో బేస్‌బాల్ బహుళ జనాదరణ పొందిన ఆట. అమెరికావారు మాట్లాడే భాషలో ఈ ఆటకి సంబంధించిన ఉపమానాలు, రూపకాలు అనేకం. వాటిని యథాతథంగా ఇంగ్లీషులోనే ఉంచినా, భావం తెలుగువారికి అర్థం కాదు – ఆటతో పరిచయం లేకపోవటం వల్ల. ఉదాహరణకి, హి హిట్ ఎ హోమ్ రన్ (He hit a home run) అంటే వాడి ప్రయత్నం బాగా ఫలించింది, అని అర్థం. ఎ బాల్ పార్క్ ఫిగర్ (a ball park figure) అంటే అంచనా, లేదా సుమారుగా చెప్పినది. గో టు బేట్ ఫర్ సమ్‌వన్ (go to bat for someone) అంటే మరొకరి తరఫున వకాల్తా పుచ్చుకుని సమర్ధించటం అని కాని, మరొకరికి చేయూత ఇవ్వటం అని కాని అర్థం. వీటిని సమానార్థకాలైన ఏ క్రికెట్ పరిభాషలోనో అనువదించాలి లేదా నేను పైన ఉదహరించిన మాదిరి తెలుగు నుడికారంతో అనువదించాలి.

అదే విధంగా తేదీ, నెలా రాసే పద్ధతి ప్రపంచం అంతా ఒకే ఒరవడిలో లేదు. వీటిని మనకి అలవాటైన రీతిలో రాసుకోవాలి. మూలంలో ఉన్న కొలమానాలని మెట్రిక్ పద్ధతిలోకి మార్చి రాయాలి. మిలియన్లని, బిలియన్లని లక్షలు, కోట్లు అని మార్చటమే కాకుండా సున్నలని గుంపులా విడగొట్టి, కామాలు పెట్టే తీరులో తేడాని గమనించాలి. (ఒక మిలియనుని 1,000,000 అని రాస్తారు కాని పదిలక్షలని 10,00,000 అని రాయాలి.) డాలర్లని రూపాయలలోకి మార్చి చూపదలుచుకుంటే వాటి మారకపు విలువ కూడ ఇస్తే వ్యాసం కాలదోషానికి గురి కాదు. ఈ విషయాలు ప్రధానాంశాలు కాకపోయినా ఇటువంటి జాగ్రతలు పాటిస్తే అనువాదం రాణిస్తుంది, రక్తి కడుతుంది.

2. ఇంగ్లీషు, తెలుగు భాషల పరిణతిలో పోలికలు

ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదం చేసే ప్రక్రియ మీద మన దృష్టి సారించినంతసేపూ, ఈ రెండు భాషలు ప్రస్తుతం అవి ఉన్న స్థితికి ఎలా చేరుకున్నాయో ఒక సారి సమీక్షించటం ఉపయుక్తం. మొదట్లో ఉత్తర జెర్మనీ, నెదర్లాండు దేశాలలో ప్రజలు ఇంగ్లండు వలస వచ్చినప్పుడు వారితో సంబంధితమైన భాషలని కొన్నింటిని తీసుకు వచ్చారు. ఆ కలగాపులగం భాషని పాత ఇంగ్లీషు (Olde English) అనీ ఏంగ్లో-సేక్సన్ (Anglo-Saxon) అనీ అనే వారు. ఈ ఏంగ్లో సేక్సన్ మీద రెండు శక్తుల ప్రభావం బాగా పడింది. సా. శ. 8, 9 శతాబ్దాలలో స్కేండినేవియా (ఇప్పటి నార్వే, స్వీడన్, ఫిన్లండ్) నుండి ఉప్పెనలా కొంతమంది వచ్చి పడ్డారు. తరువాత ఫ్రాన్సు కోస్తా ప్రాంతానికి చెందిన నార్మండీ నుండి మరికొంతమంది వచ్చి స్థిరపడ్డారు. ఈ ఊపులో ఇంగ్లీషులోకి తొంబతొంబలుగా ఫ్రెంచి మాటలు వచ్చి కలిసేయి. ఇప్పటికీ ఇంగ్లీషులో ఫ్రెంచి మాటలు దరిదాపు 25 శాతం ఉంటాయి. తరువాత ఐరోపాలో ఉద్భవించిన పునర్వికాసం వల్ల ఇంగ్లీషులో ఇబ్బడిముబ్బడిగా లేటిన్, గ్రీకు మాటలు వచ్చి చేరాయి. అందుకనే వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో వాడే ఇంగ్లీషుకి లేటిన్, గ్రీకు వాసనలు బాగా అంటుకున్నాయి. దీనికి తోడు వలస రాజ్యాధిపత్యం వల్ల ప్రపంచ భాషలలో మాటలు ఎన్నో కలిసిపోయి ఇంగ్లీషు ఒక ప్రతిదేయ (బారోయింగ్, borrowing) భాషగా వర్ధిల్లి ప్రపంచ భాషగా అవతరించింది.

తెలుగు దక్షిణ-మధ్య భారతంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌లో వినిపించే ద్రావిడ భాష. సా. శ. 2011లో, వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో 8.3 కోట్ల ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచ భాషలలో అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో తెలుగుది పదమూడవ స్థానం. కనీసం ఆరవ శతాబ్దపు శాసనాల నుండి తెలుగు లిఖిత రూపంలో కనిపిస్తోంది. ఆదికావ్యంగా ప్రశస్తి పొందిన నన్నయ తెలుగు భారతం పదకొండవ శతాబ్దానికి చెందింది. ఈ సమాచారాన్ని బట్టి ఆధునిక తెలుగు, ఆధునిక ఇంగ్లీషు సమాతరంగా ఎదిగేయని అనుకోవచ్చు.

ఫ్రెంచి, లేటిన్, గ్రీకు భాషలలోని మాటలు ఇంగ్లీషులో చేరినట్లే సంస్కృతం, ఇంగ్లీషు భాషలనుండి తెలుగులోకి పదజాలం విపరీతంగా వచ్చింది. తెలుగు మీద సోదర భాషల ప్రభావం ఉన్నా సంస్కృతం ప్రభావం అత్యధికం: సంస్కృతాన్ని తెలుగు లిపిలో రాసే సౌలభ్యం కోసం ఒత్తక్షరాలు తెలుగులో వచ్చి చేరాయి. కనుక ఇంగ్లీషుకి లాగే తెలుగుకి కూడ పరభాషలని తనలో ఇముడ్చుకునే శక్తి ఉంది. ఈ లక్షణాన్ని చూసే హాల్డేను (Haldane) తెలుగుని రాజభాష చెయ్యాలంటూ కితాబు ఇచ్చేడు.

అయినప్పటికీ వాక్య నిర్మాణంలో తెలుగుది ద్రావిడ భాషా సంప్రదాయమే. తెలుగు వాక్యంలో కర్త-కర్మ-క్రియ ఆ వరుసలో వస్తాయి. తెలుగు నామవాచకాలు వచనాన్ని బట్టీ, లింగాన్ని బట్టీ, విభక్తిని బట్టీ ద్రావిడ భాషా సంప్రదాయానుసారం రూపాంతరం చెందుతాయి.

3. తెలుగుపై ఇంగ్లీషు ప్రభావం

అనుకరణకి గమ్యం తెలుగు అనుకున్నప్పుడు ఏ తెలుగు అనే ప్రశ్న వస్తుంది? ఈ వ్యాసం నిర్మించుకున్న పరిధిలో మన గమ్యం శిష్టవ్యవహారికం – అనగా, ఈ రోజుల్లో వార్తాపత్రికలలోను, అంతర్జాలపత్రికలలోను, కథలలోను, తరచుగా కనిపించే వ్యవహార శైలి భాష. ఈ రకం భాష ముద్రణా మాధ్యమంలో కనిపిస్తోంది కాని టెలివిజన్ కార్యక్రమాల్లో ‘లంగరమ్మలు, లంగరయ్యలు’ మాట్లాడే భాషలో వినిపించటం లేదు. హలంతాలైన ఇంగ్లీషు శబ్దాలు కలుపు మొక్కలలా అజంతాలైన తెలుగు క్షేత్రంలో చొరబడటం తెలుగులో తెలుగుతనం లోపించడానికి ఒక కారణం. ఈ ధోరణి తెలుగు నుడికారానికే ఎసరు పెడుతున్నాది. ఉదాహరణకి, పుట్టగొడుగుల వేపుడు చెయ్యటం ఎలాగో, ఒక తెలుగు పత్రికలో, ఈ దిగువ చూపిన విధంగా అభివర్ణించేరు ఒక రచయిత్రి.

తయారు చేసే పద్ధతి:

ఆయిల్ ని హీట్ చేసి, అందులో థరవ్‌గా వాష్ చేసి డ్రెయిన్ చేసిన బాస్మతీ రైస్‌ని త్రీ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. అప్పుడు సూటబుల్ ఎమౌంట్ వాటర్ పోసి బోయిల్ చేసి రైస్ మెత్తబడేవరకూ కుక్ చెయ్యాలి. కుక్డ్ రైస్‌ని కూల్ చెయ్యాలి. అనదర్ డిష్ లో ఆయిల్ పోసి అందులో డైస్ చేసిన అనియన్ పీసెస్, క్యాప్సికం, బీన్స్ వేసి వన్ మినిట్ ఫ్రై చెయ్యాలి. ఆఫ్టర్‌వర్డ్స్ సోయ సాస్, టొమేటో పేస్ట్, పెప్పెర్ పౌడర్, సాల్ట్ ఏడ్ చేసి అప్పుడు డైస్ చేసిన మష్‌రూం పీసెస్ మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. మష్రూం పీసెస్ సాఫ్ట్‌గా అయిన తరువాత కుక్ చేసి, కూల్ చేసిన రైస్ మిక్స్ చేసి టెన్ మినిట్స్ ఫ్లేం మీద ఉంచి అప్పుడు సెర్వ్ చెయ్యాలి. చాల టేస్టీగా ఉంటుందీ డిష్. ట్రై చెయ్యండి.

ఇంగ్లీషు వాడకం తెలుగులోకి ఎంతలా జొరబడిందో, తెలుగులో తెలుగుతనానికి ఎసరు పెట్టే ప్రతికూల శక్తుల ప్రభావం ఎంతగా బలిసిందో చెప్పడానికి పై ఉదాహరణ చాలు. ఇప్పుడు ఒక ‘ఎదురు ఉదాహరణ’ని కూడ ఇస్తాను. ఒక ఇంగ్లీషు వ్యాసంలో ఈ దిగువ వాక్యం కనిపిస్తే సంపాదకులు ఒప్పుకుంటారా?

The Brahma brought the pooja saamagri into the madapam and instructed the vadhuvu and varudu to do a pradakshinam to the agnihotram.

శీర్షాసనం అనే భావం పాశ్చాత్యులకి లేదు; అది మన యోగశాస్త్రంలోని మాట. ఇంగ్లీషు పుస్తకాలలో శీర్షాసనం అని రాస్తే అర్థం కాదని ఆ మాటకి బదులు ‘హెడ్ స్టేండ్’ అని రాస్తున్నారు. అంటే ఏమిటన్నమాట? ఇంగ్లీషువాడికి ఇంగ్లీషులో సులభంగా ఇమడని కొత్తమాట తారస పడితే దానికి సమానార్ధకమైన ఇంగ్లీషు మాట తయారు చేసుకుంటున్నాడు. మనమో?

ఇవి ఆవేశంతో ఇచ్చిన ఉదాహరణలు కావు. ప్రతి భాషలోనూ అరువు తెచ్చుకున్న మాటలు ఉంటాయి. కాలక్రమేణ ఈ పరాయి మాటలు వాటి పూర్వపు వాసనని పోగొట్టుకొని కొత్త భాషలో కలిసిపోతాయి. ఈ రకంగా ఇంగ్లీషులో నాలుగింట ఒక మాట ఫ్రెంచి భాష నుండి వచ్చి కలిసిందన్నది నమ్మశక్యం కాని నిజం. ఇదే విధంగా – సహస్రాబ్దాల కాలవ్యవధిలో – సంస్కృతం నుండి తెలుగులోకి ఎన్నో మాటలు వచ్చేయి కదా. ఈ ప్రక్రియ శ్రుతి మించటంతో గ్రాంథికానికి ఆదరణ తగ్గి శిష్టవ్యవహారికానికి ఆదరణ పెరిగింది. పాత శిష్టవ్యవహారికంలో ‘సంస్కృత తత్సమాల పాలు’ తగ్గాలని మనం కోరుకున్నట్లే కొత్త శిష్టవ్యవహారికంలో ‘ఇంగ్లీషు తత్సమాల పాలు’ తగ్గాలని నా ప్రతిపాదన. తెలుగులో ఇంగ్లీషు పాలు ఎంత వరకు భరించవచ్చు? ‘ఇంగ్లీషులో ఫ్రెంచి పాలు ఉన్నంత,’ అని ప్రతిపాదించవచ్చు.

3.1 పూర్వపు పద్ధతి

పూర్వకాలంలో తెలుగు విజాతీయ భాషలని ఎదుర్కొన్నప్పుడు విదేశీ మాటలతో సరితూగే సరికొత్త మాటలని తయారు చేసుకునేది. అలా వీలు కాని పక్షంలో ‘తద్భవ రూపం’లో తనలోకి దింపుకునేది. ఆ ప్రక్రియ ఎలా సాగిందో చూద్దాం.

పాశ్చాత్యులు మన దేశానికి వర్తకం చెయ్యటానికి వచ్చిన కొత్త రోజులలో దక్షిణ అమెరికా నుండి ఎన్నో మొక్కలని తీసుకువచ్చి మనకి పరిచయం చేసేరు. మిరపకాయలు, పొగాకు, బంగాళాదుంపలు, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, మొదలైనవి. ఈ పేర్ల వెనక చరిత్రని చూస్తే తెలుగులో ఉన్న సృజనాత్మక శక్తి అర్థం అవుతుంది.

  • మిరపకాయలు: మాంసాన్ని వండడానికి మిరియాలు ముఖ్యంగా కావాలి. ఆ మిరియాలు భారతదేశంలోనే దొరికేవి. భారతదేశపు పూర్వపు ఆర్ధిక ఔన్నత్యానికి మిరియాలే కారణం. తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ని పట్టుకున్నప్పుడు పాశ్చాత్యులు భారతదేశానికి వచ్చే దారి బందయిపోయింది. దానితో సముద్రపు దారి కనుక్కుందామనే ప్రయత్నంలో, దారిలో అడ్డుతగిలిన అమెరికాలో పడ్డారు. అక్కడ పచ్చగా, ఎర్రగా, కారంగా ఉండే కాయలని చూసి అవే మిరియాలు అనుకొని వాటికి మిరియపుకాయలు అని వారి భాషలో పేరు పెట్టుకున్నారు. మిరియాలని ఇంగ్లీషులో పెప్పర్స్ అంటారు కనుక మధ్య అమెరికాలో కనిపించిన ఎర్రటి, పొడుగాటి కాయని ‘పెప్పర్ కార్న్’ అన్నారు. ఆ మొక్కలని మన దేశం తీసుకు వచ్చేరు. అది మనం కని, విని, ఎరగని కొత్త మొక్క. తెల్లవాళ్లు దానిని పెప్పర్ కార్న్ అన్నారు కనుక దానికి మనవాళ్లు మిరియపు కాయ అని పేరు పెట్టేరు. అదే మిరపకాయగా మారింది.
  • పొగాకు: ఇది కూడ తెల్లవాళ్లు దక్షిణ అమెరికా నుండి తీసుకువచ్చిన మొక్కే. దీని ఇంగ్లీషు పేరు ‘టుబేకో’ని పూర్తిగా విస్మరించి మనవాళ్లు దీనికి శుద్ధ తెలుగులో, పొగాకు అని పేరు పెట్టేరు. ఈ పేరు పెట్టిన వ్యక్తినీ, ‘డ్రెడ్జర్’కి తవ్వోడ అని పేరు పెట్టిన వ్యక్తిని మనం ఎంత గౌరవించినా సరిపోదు.
  • సపోటా: ఈ పండు కూడ దక్షిణ అమెరికాదే. అక్కడా దీన్ని సపోటా అనే అంటారు. అచ్చుతో అంతం అయిన పేరు కనుక మన భాషలో ఇది చక్కగా ఇమిడి పోయింది. నేను మెక్సికోలో ఈ పండు పేరు విన్నప్పుడు మన తెలుగు పేరే వాళ్లు తస్కరించేరని అనుకున్నాను.
  • సీతాఫలం, రామాఫలం: ఈ రెండు కూడ దక్షిణ అమెరికా పళ్లే. వీటికి నోరు తిరగని పేర్లు ఏవో ఉన్నాయి. మనవాళ్లు వీటికి తెలుగు పేర్లు కాకుండా సంస్కృతం పేర్లు పెట్టేరు. తెలుగు పేరు అయితే చివర ‘పండు’ వచ్చి ఉండేది. గమనించేరో లేదో ఈ రెండింటికే ‘ఫలం’ అనే తోక ఉంది; మిగిలినవాటన్నిటికీ ‘పండు’ తోకే!

    తోక ప్రస్తావన వచ్చింది కనుక, సీతాఫలం, రామాఫలంతో పాటు హనుమాఫలం ఉంటే బాగుంటుందని అనిపించింది. ఉష్ణమండలాలలో పెరిగే మరొక పండు పేరు ‘స్టార్ ఫ్రూట్.’ దీని స్వస్థలం శ్రీలంక. నున్నటి కాకరకాయ ఆకారంలో ఉండి అడ్డుకోతలో నక్షత్రాకారంలో ఉంటుందీ పండు. దీనికి నేను హనుమాఫలం అని పేరు పెట్టేసిన తరువాత దీనిని తెలుగులో అంబాణంకాయ అంటారని వికీపీడియాలో చదివేను. అంబాణంకాయ పేరు కన్న హనుమాఫలం పేరు బాగులేదూ?

ఇలా కొత్త భావాలకి తెలుగులో పేర్లు పెట్టే ధోరణి నా చిన్నతనం వరకు ఉండేది. కేవలం కాకతాళీయమో, కారణ-కార్య సంబంధం ఉందో తెలియదు కాని తెలుగు తిరోగమనం ఆంధ్ర రాష్ట్ర అవతరణతో మొదలయింది. ఈ రోజులలో, గోదావరి మీద కొత్త వంతెన కట్టేరు — అంటే మనల్ని చదువులేని బైతుల్లా చూస్తారు; గోదావరి మీద కొత్త బ్రిడ్జ్ కట్టేరు — అంటే పరవాలేదు. గోదావరి మీద నూ బ్రిడ్జ్ బిల్డుతున్నారు — అనే ప్రయోగం సుదూర భవిష్యత్తులో విన్నా వింటారు.

4. వైజ్ఞానిక విషయాన్ని అనువదించటం – నా సొంత దృక్కోణంలో

ఈ పత్రం యొక్క పరిధిలో పాఠ్యపుస్తకాలు లేవు కనుక ప్రభుత్వం వారు జారీ చేసిన నిబంధనలు కాని, తెలుగు అకాడమీ వారు ప్రచురించిన నిఘంటువులలోని పదజాలం కాని వాడాలనే నిర్బంధం నాకు లేదు. నా పరిధి అనుసరణల వరకే కనుక మూల గ్రంథాన్ని తు. చ. తప్పకుండా పాటించాలనే నిర్బంధం కూడ లేదు. మూలం లోని భావాన్ని సమగ్రంగా గ్రహించి, తిరిగి తెలుగులో చెప్పటమే నా ముఖ్యోద్దేశం. ఈ గమ్యం చేరుకోడానికి అవసరం అయితే పాఠ్యక్రమాన్ని మార్చడానికి కాని, మూలంలో ఉన్న ఉపమానాలని మార్చడానికి కాని, మూలంలో ఉన్న ఇంగ్లీషు మాటలకి సరి కొత్త తెలుగు మాటలని తయారు చేసి ప్రయోగాత్మకంగా వాడడానికి కాని వెనుక తియ్యను.

నేను తెలుగులో తిరగ రాయడానికి ముందు సాధారణంగా ఇంగ్లీషు మూలాన్ని — కేవలం అర్థం చేసుకునే నిమిత్తం — రెండు, మూడు సార్లు చదువుతాను. అప్పుడు ఆ పాఠాన్ని తెలుగులో చెప్పే నిమిత్తం కొన్ని ముఖ్యాంశాలని దృష్టిలో పెట్టుకుని తెలుగులో రాయటం మొదలు పెడతాను. రాతకి ఉపక్రమించే ముందు అందరికీ ఎదురయే సమస్యలే నాకూ ఎదురవుతాయి. మొదటిది, ఇంగ్లీషులో చదివినది పూర్తిగా అర్థం అయిందా? సాహిత్యాన్ని అనుకరించేటప్పుడు ఈ సందర్భంలో ఎదురయే సమస్యలు, ఇబ్బందులు వైజ్ఞానిక విషయాలని అనుకరించేటప్పుడు ఉండవు. ఈ సందర్భంలో మనకి కావలసినదల్లా భావ ప్రకటన; భాష అర్థం అయినంత మాత్రాన భావం అర్థం అవాలని లేదు. వృత్తి పదాల అర్థాలు తెలిసినంత మాత్రాన సరిపోదు. గణిత సమీకరణాల వ్యుత్పత్తి తెలిసినంత మాత్రాన సరిపోదు. వాటి వెనక ఉన్న భావసూక్ష్మత అవగాహనలోకి రావాలి. అనువాద లక్ష్యం తెలుగు అయినప్పుడు ఈ ఇబ్బంది ఇనుమడిస్తుంది. పాఠకులు శాస్త్రంతో పరిచయం లేని సామాన్యులు అయినప్పుడు ఈ ఇబ్బంది విషమిస్తుంది.

4.1 సారూప్యాల వాడుక

విజ్ఞాన శాస్త్రంలో కంటికి కనబడని ఊహనాల (కాన్సెప్ట్స్, concepts) అవసరం తరచు వస్తూ ఉంటుంది. చెప్పేది సుబోధకంగా ఉండడానికి పాఠకులకి పరిచయమైన నమూనాలు ఇటువంటి సందర్భాలలో వాడతారు.

ఉదా 1. నేను కళాశాలలో చదువుకునే రోజులలో ఇంగ్లీషులో రాసిన పాఠ్య పుస్తకాలు వాడేవాడిని. వాటిలో వస్తువుల ఆకారాలు వర్ణించటానికి ‘పిల్ బాక్స్, బ్రెడ్ బాక్స్, డోనట్’ వంటి సారూప్యాలు ఎక్కువగా కనిపించేవి. ఇవేమీ నాకు పరిచయమైన మాటలు కావు. పిల్లి అంటే తెలియని వాడికి మార్జాలం అంటే ఏమి తెలుస్తుంది? పిల్‌బాక్స్ అంటే మాత్రలు దాచుకునే పెట్టె. బ్రెడ్‌బాక్స్ అంటే రొట్టె దాచుకునే పెట్టె. డోనట్ అంటే చిల్లుగారె ఆకారంలో ఉండే తియ్యటి తినుబండారం. మా ఇంట్లో ఉండే హొమోపతీ మందుల సీసాలు అడ్డు కోతలో గుండ్రంగా ఉండేవి, కాని పిల్ బాక్స్ అడ్డుకోతలో చతురస్రాకారంగా ఉండి, అరచేతిలో పట్టేంత, చిన్న కుంకం భరిణంత పెట్టె. దీనిని ఇంగ్లీషు పరిభాషలో ‘రెక్టేంగ్యులర్ పేరలలోపైపెడ్’ అంటారు. ఈ నోరు తిరగని మాట చెపితే పిల్లలు భయపడతారని ఆ పుస్తకం రాసిన అమెరికా ఆసామీ ‘పిల్ బాక్స్’ అన్నాడు. అలాగే బ్రెడ్ బాక్స్ అంటే అదే ఆకారంలో ఉండే పెద్ద పెట్టె. డోనట్ అంటే చిల్లు గారె ఆకారం. అనుకరించేటప్పుడు మన అనుభవ పరిధిలో ఉన్న మాటలు వాడితే వ్రతమూ చెడదు, ఫలమూ దక్కుతుంది.

4.2 కొత్త మాటలు సృష్టించటం

కొత్త మాటలు పుట్టించవలసిన అవసరం రోజూ వస్తూనే ఉంటుంది. పరిశోధన చేసేటప్పుడు కొత్త భావాలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని నిర్ద్వందంగా వర్ణించడానికి కొత్త మాటలు అవసరం. ఉదాహరణకి, స్టేజ్ ఫియర్ అనే ఇంగ్లీషు మాటనే తీసుకుందాం. అనువాదం చేసే వేళకి ఈ భావానికి సరితూగే తెలుగు మాట తట్టలేదనుకుందాం. అప్పుడు ఏమి చేస్తాం? బద్దకిష్టులైతే ‘స్టేజ్ ఫియర్’ అని ఇంగ్లీషు మాట వాడెస్తారు. పైపెచ్చు, ‘తెలుగులో ఒకేబ్యులరీ లేదండీ’ అని తప్పు తెలుగుమీదకి తోసెస్తారు. ఇది అధమ మార్గం. కొంచెం ఆలోచనా శక్తి ఉన్నవాడయితే, ‘సభాకంపం’ అనే మాట సృష్టించి పబ్బం గడుపుకుంటాడు. ఇది మధ్యమ మార్గం. తెలుగు నుడికారంతో అలవాటు ఉన్నవాడయితే మనకి ఉన్న ‘సభాపిరికితనం’ అనే పదాన్ని అవసరానికి అనువుగా మార్చి ప్రసంగభయం అనో, సభాభయం అనో వాడుకుంటాడు. ఇది ఉత్తమ మార్గం.

ఉదాహరణ 2. గణితంలో తారసపడే ‘బౌండరీ కండిషన్’ అనే పదబంధాన్ని తీసుకుందాం. దీనిని ‘ప్రహరాంక్షలు’ అని అనువదించేను. ఈ పదబంధాన్ని సందర్భోచితంగా వాడి వినిపించినప్పుడు సభాసదులందరికీ ఏ ఇబ్బందీ లేకుండా విషయం అర్థం అయింది. అంటే ఏమిటన్నమాట? మనం కొత్తగా తయారు చేసే మాటలు అర్థగర్భితంగా, స్వయం విదితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు, ‘నీకు ఈ ఇంగ్లీషు మాటని ఇలా అనువదించడానికి అధికారం ఎవ్వరు ఇచ్చేరు?’ అని ఆక్షేపించకూడదు.

ఉదాహరణ 3. అమెరికాలో బాగా వాడుకలో ఉన్న ఫ్లీ మార్కెట్ (Flea market) అనే పదబంధాన్నే తీసుకుందాం. ఇది ఫ్రెంచి భాషలోని ‘మార్సే ఓ పూసే’ (ఈగల బజారు, Marche au puces) అన్న పదబంధానికి ఇంగ్లీషు అనువాదం. బహిరంగ మైదానంలో బడ్డీలు వేసి, వాటి మీద రకరకాల వస్తువులు (పాతవి, కొత్తవి) అమ్మే ప్రదేశం ఇది. బహిరంగంగా ఉన్న మైదానం కనుక ఈగలు మూగుతాయి. అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. ఇలాంటి బడ్డీలు మన దేశంలో పర్యాటక స్థలాలలో చూస్తూ ఉంటాం. మన ‘సంత’ వీరి ‘ఫార్మర్స్ మార్కెట్’తో తులతూగే అర్థాన్ని ఇస్తుంది.

ఫ్రెంచి మాటని యథాతథంగా వాడకుండా ఇంగ్లీషువాడు ఇంగ్లీషు వాసనతో ఎలా మార్చేడో అదే విధంగా ఇంగ్లీషు మాటని తెలుగు వాసనతో తెలుగులోకి ఎలా మార్చవచ్చో ఒక ఉదాహరణ ఇస్తాను. ఇంగ్లీషులో స్కై స్క్రేపర్ అనే మాట ఉంది. దీనిని ‘ఎత్తైన భవనం’ అంటే న్యాయం చేకూరదు. అందుకని దీనిని ‘అంబర చుంబితం’ అని అనువదించేను. ఆకాశహర్మ్యము అని కూడా అనవచ్చునేమో (ఇది పెంట్‌హౌస్‌కి మరింతగా నప్పుతుందని నాకనిపిస్తుంది.)

అనువాదం కాని, అనుసరణ కాని రాణించాలంటే భాష మీద పట్టు అవసరం. కాని అదొక్కటీ సరిపోదు. మంచి అనువాదానికి కావలసిన సామగ్రులు: (1) ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, సంబంధి పదకోశము. మాటలకి సాధికారమైన వర్ణక్రమాలు, నిర్వచనాలు, భాషాభాగాలు, వాడకానికి ఉదాహరణలతో కూడిన సూచనలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి ప్రక్రియలు, మొదలైనవన్నీ ఈ నిఘంటువులో ఉండాలి. ప్రతి ఇంగ్లీషు మాటకి వివరణాత్మకమైన అర్థం ఇస్తే సరిపోదు; ఆ ఇంగ్లీషు మాటకి సమానార్థకం అయిన ఒక తెలుగు మాట కాని తెలుగు పదబంధం కాని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. (2) తెలుగు లక్షణ గ్రంథం (స్టైల్ మేన్యువల్, style manual) కావాలి. ఈ గ్రంథంలో ఏయే భాషా ప్రయోగాలు అభిలషణీయమో సోదాహరణంగా చూపించాలి. (3) కొత్త వారికి ఒక ఒరవడిలా ఉపయోగపడే విధంగా సైన్సుని తెలుగులో బాగా రాసిన వారి రాతలు ప్రచారంలోకి తీసుకు రావాలి. తెలుగులో సైన్సుని వ్యక్తపరుస్తూ రాయలేమనే భ్రమని తొలగించాలి.

సైన్సుని తెలుగులో రాసేటప్పుడు ఎంత విస్తృతంగానూ, లోతుగానూ ఆలోచించి రాయాలో చవి చూపించటానికి ఈ దిగువ ఉదాహరణని పరిశీలించండి.

ఉదాహరణ 4. ఆధునిక శాస్త్ర రంగపు వేదిక మీద అణువు చాల ప్రథాన పాత్ర వహించింది కదా. అణువు అనే ఊహనం భారతీయ సంస్కృతిలో ప్రాచీనకాలం నుండీ ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో ‘ఎటామిక్ థియరీ’ని డాల్టన్ ప్రవచించడానికి సహస్రాబ్దాల ముందే వైశేషిక దర్శనంలో కాణాదుడు తన ‘అణు సిద్ధాంతం’ ఉద్ఘాటించేడు. కనుక పాశ్చాత్యుల ‘ఏటమ్’ మన ‘అణువు’తో సర్వ సమానం. అణువులు ఉన్నాయని ప్రతిపాదించటమే కాకుండా ‘ద్వయాణుకము, త్రయాణుకము’ అని రెండేసి అణువుల జంటలు, మూడేసి అణువుల జంటలు అనే ఊహనాలు కూడ ప్రవేశపెట్టేడు, కాణాదుడు. ఈ మాటలు రెండూ ఈనాటి ‘మోలిక్యూల్’ అనే భావనకి ముత్తాతలు.

కాని, ఈ రోజుల్లో, తెలుగు పుస్తకాలలో కొన్ని చోట్ల అణువుని ఏటమ్ అనే భావం తోనూ, కొన్ని చోట్ల మోలిక్యూల్ అనే భావం తోనూ వాడుతున్నారు. ఇదే ధోరణిలో ఏటమ్ అనే మాటని అణువు అని కొన్ని చోట్లా పరమాణువు అని కొన్నిచోట్లా అనువదిస్తున్నారు. కవిత్వంలో ఒకే భావానికి రకరకాల పేర్లు పెట్టి వర్ణిస్తే బాగుంటుంది కాని సైన్సులో ఒక మాటకి, ఆ మాట అర్థానికి మధ్య ఒక నిర్ధిష్టమైన లంకె ఉండాలి. లేకపోతే భావం గల్లంతు అయే ప్రమాదం ఉంది. ఈ లెక్కని ‘ఏటమ్’ అన్న మాటని ఎలా అనువదించాలి? అణువా? పరమాణువా?

ఈ ప్రహేళికని పరిష్కరించటానికి ఒక్క అడుగు వెనక్కి వేసి పరిస్థితిని సింహావలోకనం చేద్దాం. ఉదాహరణకి, అణు విద్యుత్తు, అణు బాంబు, అనే ప్రయోగాలు తరచు వినబడుతూ ఉంటాయి కాని, పరమాణు విద్యుత్తు, పరమాణు బాంబు, అన్న ప్రయోగాలు ఎప్పుడూ వినలేదు. కనుక అణువు అన్న మాటని ఏటమ్‌కి సమానార్థకంగా కేటాయిస్తే అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండకూడదు. అప్పుడు అణువులో ఉన్న ఎలక్‌ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు గురించి మాట్లాడవలసినప్పుడు వాటిని పరమాణువులు అనొచ్చు. ఈ పరమాణువుల కంటె చిన్నవి ఉన్నాయి. వాటిని పరమాణు రేణువులు అనొచ్చు.

ఇప్పుడు మోలిక్యూల్‌కి ఒక కొత్త మాట కావాలి. ఒక మోలిక్యూలులో రెండు కాని అంతకంటె ఎక్కువ కాని అణువులు ఉండొచ్చు కనుక కాణాదుడు వాడిన ద్వియాణువు, త్రయాణువు నప్పవు. బహుళంగా ఉన్న అణువుల మూకని బహుళాణువు లేదా – కొంచెం కుదించి – బణువు అని పిలవమని నా సలహా. ఒక నీటి బణువు చిన్న బణువుకి ఉదాహరణ; ఇందులో రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు మాత్రమే ఉంటాయి. రక్తానికి ఎరుపు రంగునిచ్చే పదార్థం పేరు ‘హీమ్’ ఒక్క హీమ్ బణువులో 75 నుండి 117 వరకు అణువులు ఉండొచ్చు. ఇటువంటి పెద్ద బణువులని బృహత్ బణువులు (మెగా మోలిక్యూల్స్, mega molecules) అనొచ్చు.

అణు బాంబులని మరొకసారి పరామర్శిద్దాం. ఈ బాంబులలో మళ్లా రెండు రకాలు: చిన్నవి, పెద్దవి. ఈ తేడా కేవలం పరిమాణాన్ని పురస్కరించుకుని కాదు. వాటి సిద్ధాంతాలే వేరు. వాటి నిర్మాణశిల్పమే వేరు. కనుక రెండింటినీ ఒకే పేరుతో పిలిస్తే ఎలా? ఇంగ్లీషులో ఈ రెండింటిని పిలవడానికి రకరకాల పేర్లు ఉన్నాయి. చిన్న జాతి బాంబులని ఏటమ్ బాంబు అని కాని, ఫిషన్ బాంబు అని కాని పిలుస్తారు. పెద్ద దానిని హైడ్రొజన్ బాంబు అని కాని, ఫ్యూషన్ బాంబు అని కాని, నూక్లియార్ బాంబు అని కాని పిలుస్తారు. తెలుగులో కూడ ఈ తేడాని గుర్తించాలంటే అణు బాంబుని ‘అణ్వస్త్రం’ అనిన్నీ, నూక్లియార్ బాంబుని ‘కణ్వస్త్రం’ అనిన్నీ అనమని నా సలహా. ఇంగ్లీషులో నూక్లియస్ అనే మాటని తెలుగులో కణిక అని తెలుగు భాషా పత్రికలో వాడటం చూసేను.

4.3 దుర్నామాలని సరిదిద్దటం

పరిభాషలో వాడే ఇంగ్లీషులో ‘అతకని’ పేర్లు తరచుగా తారసపడుతూ ఉంటాయి. ఏదైనా కొత్త విషయాన్ని పరిశోధించే మొదటి రోజుల్లో అవగాహన అస్పష్టంగా ఉంటుంది. అట్టి సమయాలలో, కేవలం అజ్ఞానం కొద్దీ, మనం అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అయినప్పుడు మనం తొందరపడి పెట్టిన పేరు అతకక పోవచ్చు. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో చెట్ల మీద నివసించే ఒక జంతువు చూడడానికి బుల్లి ఎలుగుబంటిలా ఉందని దానికి కొవాలా బేర్ (Koala bear) అని పేరు పెట్టేరు. దరిమిలా ఆ జంతువు ఎలుగుబంటి జాతికి చెందనే చెందదని తెలిసింది; కాని పెట్టిన పేరు అతుక్కుపోయింది. ఇదే విధంగా పీనట్, కోకోనట్ అన్న మాటలు ఇంగ్లీషులో దుర్నామాలు. వృక్షశాస్త్రం దృష్టిలో నట్ (nut) అనే మాట నిర్వచనంలో కోకోనట్ ఇమడదు. మనం తెలుగులో వాడే ‘కొబ్బరికాయ’ శాస్త్రీయంగా సరి అయిన ప్రయోగం; కొబ్బరికాయ ‘గింజ’ కాదు, అదొక పండు. అదే విధంగా పీనట్, గ్రౌండ్‌నట్, అనే మాటలు కూడ దుర్నామాలే (మిస్‌నోమర్స్, misnomers). మనం తెలుగులో వాడే వేరుశెనగ అన్న పేరు నిజానికి దగ్గర. అంటే ఏమిటన్నమాట? ఈ సందర్భంలో ఇంగ్లీషు పేర్ల కంటె తెలుగు పేర్లు శాస్త్రీయంగా సరి అయినవి.

ఈ సందర్భంలో మరొక ఉదాహరణ. ఇంగ్లీషులో బటర్ ఫ్లై (butterfly) అన్న మాటకి ఆ పేరు ఎలా వచ్చిందో, దానికి తెలుగులో సీతా (శీతా?) కోక చిలక అన్న పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు కాని బటర్ ఫ్లై లో ‘బటరూ’ లేదు, అది శాస్త్రీయంగా ‘ఫ్లై’ కాదు. సీతాకోక చిలకలో ‘సీత’ (శీత) లేదు, ‘కోక’ లేదు, అది ‘చిలక’ కాదు! అందువల్ల ఈ అనువాదంతో ఇబ్బందీ లేదు.

గణితంలో రేండమ్ వేరియబుల్ అనే భావం ఉంది. ఇది ‘రేండమూ’ కాదు, ‘వేరియబులూ’ కాదు. ఏదో ఇంగ్లీషులో పొరపాటు దొర్లి వాడుకలోకి వచ్చేసింది. ఇప్పుడు దీనిని ‘అనిర్ధిష్ట చలరాసి’ అని అనువదిస్తే అది అతకని అనువాదమే అవుతుంది. ఇది ఎంత అతకని పదబంధం అయినా ఈ ఇంగ్లీషు మాట పాతుకు పోయింది. దీని పేరు ఇప్పుడు మరమ్మత్తు చెయ్యలేము. కాని దీనికి తెలుగులో పేరు పెట్టాలనే ‘పిచ్చి’ ఉన్నవాళ్లు మాత్రం దీనిని అనిర్ధిష్ట చలరాసి అని తెలిగించకుండా స్వయం బోధకమైన మాటతో తెలిగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

భౌతిక శాస్త్రంలో పోలరైజేషన్ (Polarization) అనే భావం ఉంది. దీనిని ధ్రువీకరణ అని అనువదించటం శుద్ధ తప్పు; ఎందుకంటే పోలరైజేషన్ అన్న పేరు ఎంపికలో పొరపాటు జరిగింది కనుక. పూర్వం కాంతి రేణువుల రూపంలో ఉంటుందనిన్నీ, ఈ రేణువులకి అయస్కాంత ధ్రువాలలా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయనీ అనుకునేవారు. ఈ ధ్రువాలు సిపాయిలలా బారులు తీరి ఉన్నప్పుడు ఆ కాంతిని పోలరైజ్‌డ్ కాంతి అనమన్నారు. కాని దరిమిలా కాంతి కెరటాలులా ప్రవహిస్తుందనిన్నీ, ఈ కెరటాలు ఒకే సమయంలో రెండు దిశలలో (పైకి, కిందికి; ముందుకి, వెనక్కి) ఊగిసలాడుతూ ఉంటాయనీ తెలిసింది. కొన్ని రకాల అద్దాల గుండా కాంతి ప్రవహించినప్పుడు ఆ గాజు అద్దం గుండా పైకీ,కిందకీ ఊగిసలాడే కెరటమే వెళుతుంది కాని ముందుకీ, వెనక్కీ ఊగిసలాడేది వెళ్లలేదు. అంటే ఒక తలంలో ఊగిసలాడే కాంతి వెళుతుంది, దానికి లంబ దిశలో ఊగిసలాడే కెరటం అడ్డగించబడుతుంది. ఇదీ జరిగే తంతు. ఇందులో ఎక్కడా ధ్రువాలు లేవు. ఈ తంతుని ‘తలీకరణ’ అంటే బాగుంటుంది కాని, ధ్రువీకరణ అంటే తప్పు అర్థం స్పురిస్తుంది, అలా అనకూడదు. ఇలాంటి ఉదాహరణలు ఇంగ్లీషులో కోకొల్లలు. ఏదో ఇంగ్లీషువాడు పప్పులో కాలేస్తే వేసేడు, ఆ కాలు పట్టుకుని మనం ఎందుకు వేల్లాడటం? ఆలోచించండి.

జీవశాస్త్రంలో క్రోమోజోము అన్న మాటనే తీసుకుందాం. గ్రీకు భాషలో క్రొమో అంటే రంగు, సోమా అంటే పదార్థం కనుక ‘క్రోమోజోము’ ఒక రంగుపదార్థం. తెలుగులో ఈ మాటని యథాతథంగా ఉంచేసినా, రంగుపదార్థం అని అనువదించినా మనకి కలిగే మనో వికాసం శూన్యం. మరి ఇంగ్లీషువాడు వీటిని రంగు పదార్థం అని ఎందుకు అన్నాడు? జీవకణం లోని పదార్థం పారదర్శకంగా ఉంటుంది. దానిని పారదర్శకంగా ఉన్న గాజు పలకకి పులిమి, ఆ గాజు పలకని సూక్ష్మదర్శనిలో పెట్టి చూస్తే గాజు పలకకి, కణం లోని పదార్థానికి మధ్య విచక్షణ తెలిసేది కాదు. అందుకని కణానికి రంగు పులిమేవారు. వారు పులిమిన రంగు అంటుకున్న భాగాలు మనకి ఖణిగా కనిపించేవి. అలా ఖణిగా కనిపించిన పదార్థాన్ని రంగు పదార్థం లేదా క్రోమోజోము అని పిలవటం మొదలు పెట్టేరు. అంతేకాని ఆ పదార్థానికి స్వతహాగా రంగు లేదు. కనుక ఇంగ్లీషులో ‘క్రోమోజోము’ అన్న పేరు తప్పు. కాని దాని వాడుక పాతుకుపోయింది. దానిని మార్చమని నేను అడిగితే నన్ను ఏ పిచ్చాసుపత్రిలోనో పడెస్తారు. కాని దానికి తెలుగులో పేరు పెట్టవలసి వచ్చినప్పుడు ‘వారసవాహికలు’ అని తెలిగిస్తే ఎంత సుబోధకంగా ఉందో చూడండి. నేను ఇలా తాపత్రయం పడిపోతూ ఉంటే ఒక పెద్దమనిషి నా మీద జాలి పడి, “ఱావు గారూ, అలాగే లెండి. ఇటుపైన ‘కణములో కనిపించే వారసవాహికలని క్రోమోజోములు అందురు’ అని పాఠం చెబుతాను లెండ”ని నన్ను ఊరడించేడు.

అలాగని ఇంగ్లీషుని పరిపూర్ణంగా పరిత్యజించమనటానికి కూడ వీలు లేదు. రసాయన శాస్త్రంలో తారసపడే నిర్మాణక్రమాలు (స్ట్రక్చరల్ ఫార్ములాస్, structural formulas), సాంఖ్య క్రమాలు (ఎంపిరికల్ ఫార్ములాస్, empirical formulas) రాయవలసి వచ్చినప్పుడు మూలకాల పేర్లని ఇంగ్లీషు లిపిలోనే రాయాలని ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. మడిగట్టుకుని H2O ని ‘ఎచ్2ఒ’ అని రాయమనటం భావ్యం కాదు.

5. ముక్తాయింపు

తెలుగులో వైజ్ఞానిక విషయాల మీద రాసిన రాతలు బహు కొద్ది. తెలుగులో పాఠ్య పుస్తకాలు రాసే వారికి సైన్సు మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి. అయినప్పటికీ ఒక భాషలో రాసిన విషయాన్ని మరొక భాషలోకి మార్చటం తేలిక అయిన విషయం కాదు. సాహిత్యాన్ని అనువాదం చేసేటప్పుడు ఎదురయే సమస్యలు వేరు, విజ్ఞాన శాస్త్రాన్ని అనువదించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరు. తెలుగులో పారిభాషిక పదజాలం లేదంటూ ఆలోచనారహితంగా ఇంగ్లీషు పదబంధాల మధ్య తెలుగు క్రియావాచకాలని జొప్పించగా వచ్చే కంతిరీ భాష తెలుగూ కాదు, ఇంగ్లీషూ కాదు. అటువంటి భాష వాడితే ఇటు ఇంగ్లీషులోను, అటు తెలుగులోనూ ప్రతిభ లేదని చాటుకోవటమే అవుతుంది.

సంప్రదించిన గ్రంథాలు

  1. Sumanyu Satpathy, “Let a Hundred Tongues be Heard,” The Hindu, 27 Sep 2012.
  2. Constanza Gerding-Salas, “Teaching Translation: Problems and Solutions,” Translation Education, Vol. 4, No. 3, July 2000.
  3. Vallampati Venkatasubbayya, “అనువాదకళ, నా అనుభవాలు” (in Telugu), eemaaTa webzine, March 2000.
  4. Budaraju Radhakrishna, భాషశాస్త్ర వ్యాసాలు, Visalandhra Publishing House, Hyderabad, Second Printing, 1995.
  5. Ananda Kishore, The Rice Transliteration Standard for Telugu.
  6. G. N. Reddy, The Influence of English on Telugu Literature,1800-1950: with references to translations and adaptations.
  7. Md. Ziaul Haque, The Problems in Translating Literary Prose. Department of English, Sylhet International University, Shamimabad, Sylhet, Bangladesh.

1 comment: