ఇది ఒక హోమియోపతీ వైద్యుడి కథ!
పంటికింద పోకచెక్క
1
కొమ్ములు తిరిగిన వైద్యులకి కూడ అంతు పట్టని జబ్బులని ఒక హోమియోపతీ వైద్యుడు కుదర్చగలడని ఎవ్వరైనా గప్పాలు కొడితే ఎవరు మాత్రం ఎలా నమ్మగలరు? అందులోనూ విశ్వవిద్యాలయంలో పి. ఎహ్. డి. పట్టా పుచ్చుకున్న నేనా?
2
ఘోసాసుపత్రికి ఎదురుగా ఉన్న వీధిలోనే మా అత్తవారి ఇల్లు. రామేశం పంతులు గారి ఇల్లంటే ఆ ఊళ్లో తెలియనివారుండరు. గేటు తెరుచుకుని, వాకిలి నిండా ఉన్న అరటి చెట్లని దాటుకుని వెళితే పర్ణశాలలా చిన్న ఒంటిదూలం పెంకుటిల్లు కనిపించేది. ముందు వరండా. ఆ వరండాని ఆనుకుని ఉయ్యాలా గది. దానికొక పక్క పడక గది, రెండవ పక్క దేవుడి గది. ఆ దేవుడి గది గోడ మీంచి ఒక పంచపాళీ దింపి దాన్ని వంట గదిగా వాడుకునేవారు. ముందు వరండా మీద, పడకగదిని ఆనుకుని, చిన్న పీలికంత కొట్టుగది. ఆ కొట్లేనే మందుల పుస్తకాలు, మందుల పెట్లు ఉండేవి. అందుకని దానిని మందులకొట్టు అనేవారు. ఆ మందులకొట్టుకి బయట, వరండా మీద ఎత్తయిన పెద్ద బల్ల ఉండేది. కచేరీలో పనయి ఇంటికొచ్చిన తరువాత రామేశంగారు ఆ బల్ల మీదే కొలువు తీర్చేవారు. పెద్దనక, పిల్లనక, ఉన్న వాళ్లనక, లేని వాళ్లనక, ఊరు వాళ్లనక, పైఊరు వాళ్లనక, ఎప్పుడూ ఎవ్వరో ఒకరు పంతులుగారి సలహా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు.
ఆ రోజు ఆదివారం. సంత పని చూసుకొని, మరీ పొద్దెక్కిపోకుండా నాలుగు మెతుకులు కతికి, అలవాటు ప్రకారం చుట్ట చుట్టిన పరుపుని ఆసరాగా పెట్టుకుని, కునుకు తీద్దామన్న ఉద్దేశంతో నడ్డి వాల్చి, రాత్రి అల్లుడు తెచ్చిన పుస్తకం చదవడం మొదలు పెట్టేరు రామేశం గారు. ఇంతలోనే వీధి గుమ్మంలో కారు ఆగింది. కారు తలుపు తెరుచుకుని ఒకామె, ఆమె వెనకాతలే ఒక చిన్నమ్మాయి దిగేరు. పొరుగూరు నుండి పక్కనే ఉన్న ఘోషాసుపత్రికి ఎవ్వరో పేషెంట్లు వచ్చి ఉంటారని అనుకుని రామేశం గారు పుస్తకంలో తల దూర్చేసిన తలని పైకి తీయదలుచుకోలేదు. ఇంతలో ఇద్దరూ గేటు తెరచుకుని లోపలికి రావడం ఓరకంటితో గమనించిన రామేశం గారు
“అమ్మాయీ! ఎవరో వచ్చారు, చూడమ్మా.” ఆని అనడమూ,
“రామేశం గారి ఇల్లు ఇదేనా?” అని ఆమె వాకబు చెయ్యడమూ ఒకేసారి జరిగేయి.
తండ్రి పిలుపుకి కూతురు బయటకి వచ్చి ఆగంతకులని పరకాయించి చూసింది. పెద్దామెకి ముప్ఫయ్ దాటి ఉండొచ్చు. ఆమె దేహకాంతిలో పాలమీగడలాంటి స్నిగ్ధత పాలు ఎక్కువ, దబ్బ పండును పోలిన పసిమి ఛాయ తక్కువ. దమ్మిడీ అంత బొట్టు, సింగారంగా చుట్టిన సిగ, చెవులకి రవ్వల దుద్దులు, సన్నటి శంఖం లాంటి పొడుగాటి మెడ, పువ్వుల వాయిల్ చీర, చేతిలో చేతిసంచి, కాళ్లకి చెంకీ చెప్పులు. పిల్లకి పదేళ్లు ఉంటాయేమో.
“ఎవరు కావాలండీ?”
“అమ్మా, రామేశం పంతులు గారు ఉన్నారా?”
“నేనేనండి, రామేశాన్ని” అని అంటూ రామేశం గారు బల్ల మీద లేచి కూర్చుని, పక్కనుక్క కాశీ తువ్వాలు తీసి భుజం మీద వేసుకుని, “ఎవరి తాలుకమ్మా?” అని అడిగేరు.
“నన్ను స్వరాజ్యలక్ష్మి అంటారండి. నారికేళవలస జమీందారు గారి తాలూకండి. మావారే వద్దామనుకున్నారు. కాని ఆయనకి వ్యాపకాలు ఎక్కువ.”
“నారికేళవలస అంటే బరంపురం దగ్గర కదూ? జగన్మోహనరావు బహద్దరు గారి బంధువులా….” అంటూ అర్థ గర్భితంగా మాటని మధ్యలోనే ఆపేసి, “దయచేయండి” అంటూ ఆహ్వానించేరు.
ఈ కుశల ప్రశ్నలు ఇలా అవుతూ ఉండగా కూతురు వచ్చిన వారు కూర్చుందుకి వరండాలో చాప వేసి కూర్చోబెట్టి, సేద తీర్చుకుందికి చల్లటి మంచి నీళ్లు ఇచ్చి చెయ్యవలసిన కనీసపు మర్యాదలు చేసింది.
“మా సరోజకి వచ్చిన రోగం ఏమిటో తెలుసుకుందామని తిరగని ఊరు లేదండి. వైజాగు నుండి వెల్లూరు వరకు అన్ని ఊళ్లూ తిరిగేమండి.” చల్లకొచ్చి ముంత దాచడమెందుకని వచ్చిన పనేమిటో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది స్వరాజ్యలక్ష్మి.
“పడిశం పడితే పల్సటిల్లా, దెబ్బ తగిలితే ఆర్నికా అంటూ ఇంట్లో పిల్లలకోసం నేర్చుకున్న పంచదార మాత్రల వైద్యం అమ్మా నాది. ఏదో ఆప్తులు అడిగితే కాదనలేక ఒక మాత్ర అడపా తడపా ఇచ్చేనేమో. మీరేదో నా మీద గౌరవం కొద్దీ వచ్చేరు. సంతోషం. ఇది నా తలకి మించిన పని. పోనీ, పిఠాపురం డాక్టరు గారికి చూపించలేకపోయేరా?”
“పిఠాపురం డాక్టర్లు, బెండపూడి యోగులు, పెందుర్తి భూతవైద్యులు,... అంతా అయేరండి. మేము చూడని స్పెషలిస్టు లేడండి. ఆఖరికి, యెలమంచిలిలో ఓరుగంటి సోమసుందరం గారు లేరండీ? వకీలు గారు. మీ కాళ్ల మీద పడమని సలహా ఇచ్చింది ఆయనే! మీరు కాదంటే వల్ల కాదు.”
స్వరాజ్యలక్ష్మి ఇలా అంటూ ఉండగానే డ్రైవరు ఒక సజ్జ చేతితో పట్టుకుని వచ్చి యజమానురాలి కనుసన్న కోసం చూస్తూ వేచి ఉన్నాడు. సజ్జలో పళ్లు, వాటి మీద ప్లేస్టిక్ సంచిలో కంచి పట్టు చీర, రవికల గుడ్డ, పసుపు, కుంకం, తమలపాకులు, వక్కలు ఉన్నాయి. సజ్జని డ్రైవరు చేతిలోంచి అందుకుని, కొంగుతో చెయ్యి తుడుచుకుంటూ వంట గదిలోంచి బయటకి వచ్చి ఉయ్యాల గదిలో తలుపు చాటున నిలబడ్డ సీతమ్మ గారి చేతికి ఇచ్చి, వంగి, ఆవిడ పాదాలకి దండం పెట్టింది స్వరాజ్యలక్ష్మి.
“అమ్మా! మీరు ఒక్క మారు నా తరఫున బాబుగారితో చెప్పి....”
ఈ తతంగం అంతా ఇలా జరుగుతూన్నంత సేపూ సరోజ ఉలుకూ పలుకూ లేకుండా, బెల్లం కొట్టిన రాయిలా, కదలకుండా, మెదలకుండా అలా వరండాలో ఒక కర్ర కుర్చీలో కూర్చొని ఉంది. విగ్రహం అంటే కుర్చీలో ఉంది కాని దృష్టి మాత్రం ఎక్కడో ఉంది. రామేశం గారు పిల్లని ఓరకంటితో చూస్తూనే ఉన్నారు.
సీతమ్మ గారు సజ్జని అందుకుని ఏవో క్షేమ సమాచారపు ప్రశ్నలు రెండు వేసి,
“ఎండకి బాగా అలసిపోయినట్లు ఉన్నారు. కాస్త ఫలహారం ఏదైనా చేసి పట్టుకు వస్తాను” అని లోపలికి వెళుతూ, “ఆ పంకా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టమ్మా” అని కూతురుకి పురమాయించించేరు.
“ఎంత ఎండా కాలంలో అయినా ఉదకమండలంలా ఉండే మన వరండాలో ఫేను ఎందుకమ్మా, ఆ పెరటి తలుపు తెరిస్తే గాలి రివ్వున వస్తుంది,” అంటూ రామేశం గారు అతిథిని ఉద్దేశించి మళ్లా అందుకున్నారు.
“చూడండమ్మా. ఎండవేళప్పుడు వచ్చేరు. ఒక గంట అయినా ఇక్కడ కూర్చుని సేద తీర్చుకోకుండా ఎలాగూ మా ఆవిడ మిమ్మల్ని తిరిగి వెళ్లనివ్వదు. ఈ లోగా నాలుగు ప్రశ్నలు అడుగుతాను. మీకు చేతనయినంత మేరకి సమాధానాలు ఇవ్వండి. నాకు చేతనయిన సలహా ఇస్తాను,” అంటూ స్వరాజ్యలక్ష్మి సమాధానం కోసం ఆగకుండా,
“పిల్ల చూడ్డానికి చాల అర్భకంగా కనిపిస్తోంది. పుట్టినప్పటినుండి ఇలానే ఉందా లేక ఈ మధ్య ఏదయినా సుస్తీ చేసిందా?”
ఈ ప్రశ్నకి తల్లి సమాధానం చెప్పేలోగా సరోజ గొంతుకలోంచి ఒక విచిత్రమైన శబ్దం వచ్చింది. గదిలో పిల్లిని బంధించి తలుపుకు గొళ్లెం పెడితే ఆ పిల్లి పెట్టే కూతలా ఉందా శబ్దం.
“ఛప్, సరూ! ఆ శబ్దం చెయ్యొద్దని ఎన్ని సార్లు చెప్పేను. పెద్దవాళ్ల ఎదుట అలా ప్రవర్తించవచ్చా?”
తల్లి గదమాయింపుకి ప్రతిస్పందనా అన్నట్లు సరోజ ఆ చప్పుడు చెయ్యడం ఆపేసింది. కాని సరోజ దృష్టి మాత్రం ఎక్కడో ఉన్నట్లు ఉంది.
“సరోజ సాధారణంగా చాల బుద్ధిమంతురాలు. ఆ మాయదారి రోగం ప్రకోపించినప్పుడల్లా ఇలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. నేను వర్ణించి చెబితే ఎవ్వరూ నమ్మడం లేదు. మీరు చూస్తున్నారు కదా. ఇదీ ఈ పిల్లకి వచ్చిన మాయదారి రోగం.”
రామేశం గారు పిల్లని అలా పరికించి చూస్తూనే ఉన్నారు. ఆ పిల్ల లోకమే వేరు.
“వెల్లూరులో కాని, వైజాగులో కాని పిల్ల ‘ఆటిస్టిక్’ అని ఎవ్వరైనా చెప్పేరా?”
స్వరాజ్యలక్ష్మికి ఆ ‘ఆటిస్టిక్’ అన్న మాట అర్థం అయినట్లు లేదు.
రామేశం గారు ఈ విషయం పసికట్టి, “ఆటిజం అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచంతో నిమిత్తం లేనట్లు ప్రవర్తించే ఒక రకం లక్షణ సముదాయం. ఇది ఒకొక్కరిలో ఒకొక్క విధంగా అభివ్యక్తం అవుతుంది.”
“లేదండి. ఈ రోజంటే ఇలా ఉంది కాని సాధారణంగా బాగా కలుపుగోలుగా ఉండే పిల్లండి. ఈ మాయదారి రోగం విజృంభించినప్పుడు మాత్రం దయ్యం పట్టిన పిల్లలా ప్రవర్తిస్తుంది.”
“ఎంత తరచుగా వస్తూ ఉంటుందీ విజృంభణ?”
“ఏటికి ఒక సారో రెండు సార్లో వస్తుందీ పిశాచం. వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. లేనప్పుడు చిలకలా ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. అదృష్టం బాగుండి ఈ రోజు మీరు చూస్తూండగా వచ్చింది. మేము రాయవెల్లూరు వెళ్లినప్పుడు ఆసుపత్రిలో నెల్లాళ్లు మకాం వేసేం. పిల్ల చిలకలా ఉంది. డాక్టర్లు చూస్తూ ఉండగా ఒక్క సారి రోగం విజృంభించేలా చెయ్యి నాయనా అని ఆ వేంకటరమణమూర్తికి మొక్కుకున్నాను కూడా. లేని పోని రోగాలని పిల్లకి ఆపాదించే పిచ్చిదానిలా నన్ను జమకట్టెస్థారేమోనని భయపడ్డాను. పోనీలెండి. ఇప్పటికయినా ఆ దేవుడికి దయ కలిగింది.”
ఇది వచ్చినప్పుడు ఎంత ఏపు ఉంటుంది?” ఈ జబ్బు ఇదమిత్థంగా ‘ఇదీ’ అని తేలలేదు కనుక, దాన్ని ఏ పేరు పెట్టి పిలవాలో తెలియక రామేశం గారు ‘ఇది’ అనేసి ఊరుకున్నారు.
“వచ్చినప్పుడల్లా రోజో, రెండ్రోజులో, వారమో, రెండు వారాలో ఉంటుంది. ఎప్పుడొస్తుందో తెలియదు. ఎన్నాళ్లుంటుందో తెలియదు.”
“ఇది మూర్చ రోగమని ఎవ్వరైనా నిర్ధారణ చేసేరా?”
“మెడ్రాసులో డాక్టర్లకి చూపించేమండి. బుర్రకి తీగలు తగిలించి మెదడులో నాడీ తరంగాలని పరీక్షించి చూసేరండి. రక్తపు పరీక్ష అన్న మిషతో చిట్టితల్లి చేతులనిండా, కనీసం పది సార్లయినా, తూట్లు పెట్టేసేరండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా! ఇది నా బుర్రకి పట్టిన రోగమా? లేక, నా చిట్టితల్లికి పట్టిన దయ్యమా?”
“పరీక్షలేనా? లేక, ఎవ్వరైనా ఏదయినా మందు ఇచ్చేరా?”
“ఒక డాక్టరు మూర్చ రోగమని ‘డైలేన్‌టిన్ సోడియం’ ఇచ్చేరండి. కిందటి వారం వైజాగులో మరొక డాక్టరు ‘టెగ్రిటాల్’ వాడమన్నారండి. ఏ మందు వాడినా వీసమెత్తు గుణం కనిపించడం లేదండి. అసలీ వైద్యాల వల్ల లేని రోగాలు తెచ్చిపెట్టుకుంటూన్నామేమో అని భయంగా ఉంటోందండి.”
రామేశం గారికి ఈ రోగం యొక్క ఆద్యంతాలు అర్థం కాలేదు.
“అమ్మాయికి మొట్టమొదటిసారి ‘ఇది’ వచ్చినప్పుడు వయస్సెంత?”
స్వరాజ్యలక్ష్మి మెల్లగా పూర్వ చరిత్ర చెప్పుకొచ్చింది.
“సరోజకి మూడేళ్ల వయస్సు వచ్చేవరకు ఏ రోగమూ, రొష్టూ లేకుండా చిలకలా ఉండేది. మూడేళ్లప్పుడు మెడ్రాసులో మావయ్య ఇంటికి వెళ్లింది. అక్కడ అరుగు మీదనుండి కింద పడి మోచెయ్యి విరగ్గొట్టుకుంది. అప్పుడు ఆ చేతి మీద శస్త్రం చెయ్యవలసి వచ్చింది. ఆ సందర్భంలో మత్తు మందు వాడేరు. కోతి పుండు బ్రహ్మ రాక్షసి అయింది. సర్జరీ అయిన తరువాత పిల్లకి మరి మెలుకువ రాలేదు. పిల్ల కోమా లోకి వెళ్లిపోయింది. మత్తు మందు పడక మెదడు దెబ్బ తిందేమోనని అనుమానపడ్డారు. ఊళ్లో పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి కనుక “సి.టి. స్కేను” తీసి చూడగలిగేరు. మెదడు బాగానే ఉందన్నారు. తరువాత “ఏంటీబయటిక్కులు,” “స్టీరాయిడ్లు” – ఇలా ఒకటేమిటి. డాక్టర్లు ప్రయత్నం చెయ్యని మందు లేదు. ఫలితం మాత్రం శూన్యం. పిల్ల చచ్చిపోయిందనే అనుకున్నాం. ఏదో గుడ్డిలో మెల్ల. బతికి బయట పడింది.”
రామేశం గారు అంతా శ్రద్ధగా వింటున్నారు. మత్తు మందు లోంచి తేరుకుని వెంటనే బయట పడలేదు. అదొకటి. మత్తు మందు వాడిన తరువాతే సరోజకి ఈ వింత జబ్బు వచ్చింది. ఈ రెండింటికి ఏమిటి సంబంధం?
“పిల్ల అలా కోమాలో ఎన్నాళ్లు ఉంది?”
“రెండు వారాలండి. ఆ రెండు వారాలూ రెండు యుగాలులా గడిచేయండి. పిల్ల పక్కనే ఉండి జాగరం చేసేనండి. అక్కడ డాక్టర్లు వాళ్లకి తెలిసినంతవరకు పిల్లకి ఏ జబ్బూ లేదంటారండి! కాని కోమాలోకి ఎందుకు వెళ్లిపోయిందో, కోమా నుండి బయటకి ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోయారండి.
“ఈ డాక్టర్ల మీద ఆధారపడి లాభం లేదని నేనే చొరవ చేసి అక్కడ ఉన్న గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలెన్నో తిరగేసి చూసేనండి. గ్రీకు భాషలో ‘కోమా’ అంటే ఘాటైన నిద్ర అని అప్పుడు తెలిసింది. ఈ రకం ఘాటు నిద్రలో ఉన్న వారికి పక్కన బాంబులు వేసినా మెలుకువ రాదుట. సూదితో గుచ్చినా మెలుకువ రాదుట. అంత తీక్షణమైన నిద్రట. కోమాలో పడ్డవారి జ్ఞానేంద్రియాలు మూసుకు పోయాయన్నమాట. మనవాళ్లు ‘చెవులకి గెడలు పడిపోయాయి’ అనే పదజాలాన్ని వాడుతూ ఉంటారు. అదేనేమో కోమా అంటే! ఏది ఏమయితేనేమి, కోమాలో పడ్డవాళ్లకి మళ్లా మెలుకువ వచ్చి మన లోకంలో పడాలంటే వాళ్లతో మనం మాట్లాడుతూ ఉండాలిట. శరీరాన్ని నిమురుతూ ఉండాలిట. అలా కొన్నాళ్లు పోతే, మన అదృష్టం బాగుంటే, జ్ఞానేంద్రియాలకి పడ్డ మూతలు తెరుచుకునే అవకాశం ఉందిట. అందుకని సరోజ చేతులు నిమురుతూ, ఇష్టమైన పాటలు పాడుతూ, కబుర్లు చెబుతూ, పిల్లని ఒక్క క్షణం వదలకుండా పదిహేను రోజులు కాపలా కాసేను. నా నోములు ఫలించేయి. ఓక రోజు సరోజ అకస్మాత్తుగా లేచి, ‘అమ్మా’ అని పలకరించింది.”
స్వరాజ్యలక్ష్మి ఇలా కథనం చెబుతూ ఉంటే సరోజ రామేశం గారు కూర్చున్న బల్ల దగ్గరకి వెళ్లి, బల్ల మీద బుగ్గ ఆనించి, విగ్రహంలా నిలబడింది.
రామేశం గారు పిల్లని ఎగా, దిగా చూసి, కాసింత కంగారు పడి, కర్తవ్యం తోచక పిల్ల చేతిని తన చేతిలోకి తీసుకుని నాడి చూడడం మొదలెట్టేరు.
“మరేమీ పరవా లేదండి. ఆ రోగం వచ్చినప్పుడల్లా ఈ ప్రవర్తన ఇలాగే ఉంటుందండి,” అని స్వరాజ్యలక్ష్మి ధైర్యం చెప్పింది.
“ఈ మొదటి సంఘటన తరువాత పిల్ల మామూలుగా అయిపోయిందా?”
“ఏం మామూలండి. పక్షవాతం వచ్చినట్లు ముఖం కుడి పక్క అంతా వాచిపోయిందండి. ఆ వాతంతో జన్మంతా బాధ పడాల్సిందే అని డాక్టర్లు తీర్మానించి చెప్పేరండి. కాని, డాక్టర్లు చెప్పింది ఎప్పుడు నిజం అయిందండి? వారం రోజుల్లో వాతపు లక్షణాలు అన్నీ హరించుకుపోయాయండి. పూర్తిగా నయం అయిపోయిందనే అనుకున్నాను. కాని మళ్లా ఎప్పుడో ఆ రోగం కమ్ముకు వస్తుందండి. ఆ తరువాత ముఖానికి వాతం కమ్ముతుంది. తరువాత దానంట అదే సర్దుకుంటుంది.”
రామేశం గారు బల్ల పక్క గూట్లో ఉన్న పలక, బలపం తీసుకుని, ఆ పలక మీద వరుసగా ‘మత్తు మందు వాడిన తరువాత మొద్దు నిద్ర, ‘ ‘ముఖానికి పదే పదే పక్షవాతం’ అని రాసుకుంటూ,
“ఇప్పటికి ఈ రుగ్మత ఎన్ని సార్లు ఇలా విజృంభించి ఉంటుందంటారు?”
“ఏటికి రెండు, మూడు సార్లయినా వస్తూ ఉంటుందండి. ఇప్పటికి కనీసం పాతిక సార్లయినా వచ్చి ఉంటుందని నా అంచనా.”
“ఇంకేమయినా చెప్పగలరా? కొంచెం జ్ఞాపకం చేసుకోండి.”
స్వరాజ్యలక్ష్మి కొద్ది సేపు ఆలోచించి, తనకి తట్టినది చెప్పదగ్గ లక్షణమో కాదో అని తటపటాయించి, “ఇది వచ్చినప్పుడల్లా మాట ఖణిగా రాదండి.”
“మాట ఖణిగా రాదు” అని పలక మీద రాసుకున్నారు.
“నిద్ర లేమి కూడానండి. ఇది వచ్చినప్పుడల్లా రెండు, మూడేసి రోజులు అస్సలు నిద్రపోదండి. తను నిద్రపోకపోతే ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటుందో అని నేను కూడా నిద్రపోకుండా పిల్లకి కాపోలా కాస్తానండి.“
ఇప్పుడు రామేశం గారికి అర్థం అయింది, స్వరాజ్యలక్ష్మి ముఖం ఎందుకు అలా అలసిపోయినట్లు కనిపిస్తోందో. పలక మీద ‘నిద్ర లేమి’ అని రాసుకుంటూ,
“అమ్మా! ఆ బీరువాలో ఉన్న ఎర్ర బైండింగు ఉన్న పుస్తకం ఒక సారి ఇలా పట్టుకురా, తల్లీ” అంటూ కూతురికి పురమాయించేరు.
ఆయన అలా రాసుకుంటూ ఉంటే ఎందుకో స్వరాజ్యలక్ష్మికి ధైర్యం పెరిగి మరొక విషయం జ్ఞాపకం తెచ్చుకుంది.
“అకస్మాత్తుగా రెండు, మూడు పర్యాయాలు ‘నొప్పి, నొప్పి’ అని బాధ పడిందండి. ఒక సారి గుండెల్లో నొప్పి వస్తే ‘హార్ట్ ఎటాక్’ అన్నారండి. చిన్న పిల్లకి హార్ట్ ఎటేక్ ఏమిటండి? మరొక సారి కడుపులో నొప్పి వస్తే ‘ఎపెండిసైటిస్’ అని చెప్పి ఆపరేషన్ చేస్తామన్నారండి. ఒక సారి ఆపరేషన్ చేయించి అనుభవిస్తున్నాం కదండి? అందుకని ఒప్పుకోలేదు. నొప్పి దానంటట అదే తగ్గిపోయిందండి.”
రామేశం గారు తన పలక మీద ఉన్న జాబితాని ఒక సారి తేరిపార చూసేరు.
“మత్తు మందు, మొద్దు నిద్ర, ముఖానికి పక్షవాతం, మాట నములుడు, నిద్రలేమి, నొప్పి.”
ఆయన కనుబొమ ముడి పడింది. ఈ లోగా కూతురు పుస్తకాన్ని ఆయనకి అందించింది. ఆ పుస్తకంలో పుటలని కొంతసేపు ఇటూ అటూ తిరగేసి, తరువాత తను చదువుతూ చదువుతూ తలగడ కింద దాచిన అల్లుడు ఇచ్చిన పుస్తకాన్ని ఒకసారి సంప్రదించి, తల పైకైనా ఎత్తకుండా,
“జబ్బు చేసినప్పుడు పిల్ల మూత్రం రంగులో ఏదైనా మార్పు గమనించేరా?”
ఈ ప్రశ్న వినగానే స్వరాజ్యలక్ష్మి ముఖ కళవళికలలో వచ్చిన మార్పుని వర్ణించడం కష్టం; చూసి తీరాల్సిందే!
“ఏడేళ్ల బట్టి దేశం అంతా కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నానండి. బాబూ, మీరే ఈ ప్రశ్న వేసేరు. జబ్బు చేసినప్పుడల్లా పిల్ల మూత్రం పసుపు పచ్చగా కాకుండా, ముదర రంగులో పడుతుందండి. మీరు అడిగేవరకు ఈ జబ్బుకీ ఆ రంగుకీ సంబంధం ఉందనే అనుకోలేదండి.”
కూతురి జబ్బు అప్పుడే నయం అయిపోయినంత ఉత్సాహం ఆమె కంఠంలో ద్యోతకం అయింది.
“అమ్మా! మీ అమ్మాయిని అట్టి వేధిస్తూన్న జబ్బు ఏమిటో కొంచెం చూచాయగా ఆచూకీ దొరికింది. లక్షణాలని బట్టి ఇది ‘ఎక్యూట్ ఇంటర్మిటెంట్ పోర్ఫిరియా’ అన్న జబ్బులా అనిపిస్తోంది. నా అనుమానమే నిజం అయితే ఇది చాల అరుదుగా వచ్చే జబ్బు. ఈ జబ్బుని నేను కుదర్చగలనో లేనో చెప్పలేను.”
“బాబు గారూ! ఇంతవరకు పిల్లకి ఏ జబ్బూ లేదని దబాయించినవారే. అలా దబాయిస్తూనే మందులిచ్చిన్వాళ్లు కొందరు, ఆపరేషన్లు చేస్తామన్నవాళ్లు మరికొందరు. తమరు కుదర్చ గలిగినా లేకపోయినా పరవా లేదు. మా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. కనీసం ఆ జబ్బు ఏమిటో నాకు అర్థం అయేటట్లు చెప్పండి” అని స్వరాజ్యలక్ష్మి ప్రాధేయపడింది.
ఈ లోగా సీతమ్మ గారు పళ్లెంలో ఫలహారం పెట్టి పట్టుకొచ్చి తినమని బలవంతం చెయ్యడంతో, మొహమాటపడుతూనే పుచ్చుకున్నారు.
‘ఎక్యూట్ ఇంటర్మిటెంట్ పోర్ఫిరియా’ అనేది వంశపారంపర్యంగా వచ్చే జబ్బని రామేశం గారికి తెలుసు. పిల్లకి ఈ జబ్బు వచ్చిందంటే దాని అంకురం తల్లిదండ్రులలో ఉండి తీరాలి. ఎటు నుండి వచ్చిందో తెలుసుకుందామని, ఆవిడ ఫలహారం చేస్తూన్నప్పుడే, రామేశం గారు కూపీ లాగడానికి ప్రయత్నం మొదలు పెట్టేరు.
“మీరు చూలింతరాలుగా ఉన్నప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉండేది?”
ఫలహారం చేస్తూన్న స్వరాజ్యలక్ష్మి కింది దవడ జారిపోయింది! ఆమె ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ‘ఈయన ఆవలిస్తే పేగులు లెక్కపెట్టెస్తున్నాడు’ అని లోలోపలే అనుకుని, పిల్ల మూత్రం రంగుకీ తను గర్భవతిగా ఉన్నప్పుడు తన ఆరోగ్యానికి మధ్య లంకె అర్థం కాక,
“బాబు గారూ! మీరు నా ముఖం చూసి నా జాతకం చెప్పెస్తున్నారు. నేను సరోజని మోస్తూనున్నాళ్లూ మంచం మీదనే ఉన్నాననుకొండి. రెండు సార్లు ఆసుపత్రిలో కూడ జేర్పించవలసి వచ్చింది. మొదటి సారి నెల తప్పేనని తెలిసిన కొద్ది రోజులకే నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. గర్భం నిలవదేమోనని కంగారు పడ్డారు. డాక్టర్లకి అర్థం కాక కడుపుని కోసి, లోపల చూసి, ఏమీ లేదని నిర్ధారించేరు. తరువాత నొప్పి ఎలా వచ్చిందో అలానే పోయింది.”
“రెండవ సారి?”
“ఒక నెల్లాళ్లు పోయిన తరువాత, ఒకటే వాంతులు. వేవిళ్లు అనుకున్నాను. ఆసుపత్రిలో ఆరు వారాలు ఉన్నాను. శరీరం ఎండిపోతూ ఉంటే ‘సేలీను’ ఎక్కించి బతికించేరు.”
సరోజకి వచ్చిన జబ్బేమిటో అదే జబ్బు తల్లికి కూడ ఉందని పంతులుగారికి అవగాహన అయిపోయింది. లక్షణాలు తేడా. మరికొంచెం తవ్వి చూడాలి.
“మీ వారి ఆరోగ్యం గురించి కొంచెం చెబుతారా?”
“ఆయన జన్మలో జిర్రున చీదెరగరు. వాళ్ల వాళ్లంతా ఆరోగ్యవంతులే.”
“మీ పుట్టింటి వారి ఆరోగ్యం సంగతి ఏమి చెప్పగలరు?’
“మావాళ్లంతా ఎప్పుడూ ఏవో జాడ్యాలతో మూలుగులేనండి. మా అమ్మ బాగానే ఉండేదండి. వైద్యుడి దగ్గర దాపరికాలు కూడదంటారు కనుక చెబుతున్నాను. మా నాన్న అడపా తడపా మయికంతో ఇంటికి వచ్చేవాడండి. తాగుడేమోనని మొదట్లో అనుమానించేరు. కాని, ఆయనకి ఆల్కహాలు పొడ కిట్టదండి. మా పెద్దత్తకి కూడ మూర్చ రోగం లాంటిదేదో ఉండేదండి........”
రామేశం గారు ఇంక ఆలశ్యం చెయ్యదలుచుకోలేదు.
“అమ్మా! ఇది వంశపారంపర్యంగా సంక్రమించే జబ్బని నా మనస్సు ఘోష పెడుతోంది. మీ తండ్రి గారు తాగినవాడిలా తూలుతూ కనిపించేరంటే అది కూడ ఈ రోగ లక్షణమే. ఆని నా అనుమానం. మీరు చూలింతరాలుగా ఉన్నప్పుడు వచ్చిన కడుపు నొప్పి కూడ ఈ రోగ లక్షణమే అయి ఉంటుంది.”
“ఈ జబ్బు నివురు కప్పిన నిప్పులా మా అందరిలోనూ ఉన్నా మేము మా జీవితాలని ఈడిచేస్తున్నాం కదా. మా సరోజ ఏం పాపం చేసుకుంది?”
“ఇది జన్యు రోగం అమ్మా. ఇది అందరిలోనూ ఒకేలా ప్రకోపించదు. సరోజలో ప్రకోపన ఎక్కువగా ఉంది. అది మీ దురదృష్టం.”
“బాబు గారూ! మీరు చెప్పిన మాటలన్నీ అమృత వాక్కులులా ఉన్నాయి. మీ అమృత హస్తంతో మీరే మా సరోజ నోట్లో మూడు మాత్రలు వెసి ఇంత పుణ్యం కట్టుకొండి. మీకు రుణపడి ఉంటాను.”
రామేశం గారి మస్తిష్కంలో ఒక నైతిక సమశ్య ఎదురయింది. జన్యు రోగాలు మన జీవకణాలలో ఉన్న వారసవాహికలో ఉన్న లోపాల వల్ల వస్తాయి. ఈ వారసవాహికలు తల్లిదండ్రుల నుండి పిల్లలకి సంక్రమిస్తాయి. వీటిల్లోనే మన భవిష్యత్తు అంతా రాసి పెట్టి ఉంటుంది. కనుక జన్యు రోగాలని కుదర్చడం అంటే విధి వ్రాతని మార్చడం అన్నమాట. పైపెచ్చు ఈ జీవకణాలు శరీరం అంతటా ఉంటాయి. ఎన్నని మరమ్మత్తు చెయ్యగలం? ఈ రకం జబ్బులకి మందు లేదని చెప్పడమా? లేక, మందు వేస్తూన్నట్లు నటించి, రోగికి కొంచెంనమ్మకం కలిగించి, లక్షణాల ఉపశమనానికి పునాది వెయ్యడమా?
“అమ్మా! ఎక్యూట్ ఇంటర్మిటెంట్ పోర్ఫిరియా కి ఇంగ్లీషు వైద్యంలో ప్రస్తుతానికి మందు లేదు. హోమియోపతీలో ఫలానా జబ్బుకి ఫలానా మందంటూ ఎప్పుడూ లేదు. ఒక వ్యక్తిని సమగ్రంగా పరిశీలించి ఆ వ్యకి వ్యక్తిత్వానికి సరిపోయే మందు ఇస్తాం కాని రోగ లక్షణాలకి కాదు. కనుక నేను మందు ఇచ్చినా కుదురుతుందని ఆశపెట్టి ఇవ్వలేను. మందు వేసుకుని, నేను చెప్పిన పథ్యాన్ని తు. చ. తప్పకుండా పాటిస్తే కొంత ఉపశమనం కలగవచ్చు.”
“చెప్పండి. ఎన్నో మందులు వాడి ఇంతవరకు కాలహరణం చేసేం. మీరిచ్చే మందు పని చేస్తుందని ఆశగా ఉంది..”
“మీరు మొట్టమొదట చెయ్యవలసిన పని ఆ ఇంగ్లీషు మందులు మానెయ్యడం. ఆ ‘డైలేంటిన్ సోడియం,’ ని ఆ ‘టెగ్రిటాల్’ ని చెత్త కుండిలో పారెయ్యండి. తరువాత పథ్యం. కర్బనోదకాలు ఎక్కువగా ఉన్న భోజనమే పెట్టండి. అంటే మాంసం, గుడ్లు, వగైరా మానేసి శాకాహారాలే పెట్టండి,” అని చెప్పి, కూతురుని పిలచి, “అమ్మా! మన మందుల పెట్టెలో, కింద అరలో, మూడో వరసలో ఉంటుంది, ‘సేక్‌లేక్ సిక్సెక్స్’ సీసా ఇలా పట్టుకురా, తల్లీ” అని పురమాయించేరు.
కూతురు ముసుముసి నవ్వులు నవ్వుతూ పట్టుకొచ్చిన సీసా అందుకుని, స్వయంగా పరీక్షించి, చేతి చెమట తగిలితే మందు గుణం చెయ్యదని చెబుతూ, అందులోని మాత్రలు తిన్నగా సరోజ నోట్లో పడేటట్లు వేసి,
“అమ్మా! నెల్లాళ్లవరకు మరొక మోతాదు అక్కరలేదు. ఎందుకైనా మంచిది, వైజాగు వెళ్లి డాక్టరు సత్యనారాయణ గారికి కూడ ఒక సారి చూపించండి. ఉత్తరం రాసిస్తాను. రక్త పరీక్ష చేయించి నా నిర్ణయం సరి అయినదో కాదో ఆయన రూఢి పరిస్తే మీకూ ధైర్యంగా ఉంటుంది, నాకూ సంతృప్తిగా ఉంటుంది.”
“బాబు గారూ, మీ మాట మీదే మాకు నమ్మకం. అయినా మీ మాట కాదనడం ఎందుకు. అలాగే రక్త పరీక్ష చేయిస్తాను. మరి తమ ఫీజు ఎంతో.....” అంటూ స్వరాజ్యలక్ష్మి లేచి నిలబడింది.
“అమ్మా! ఇంతవరకు నేను ఎవ్వరినీ చిల్లి గవ్వ ఫీజు ఇమ్మని అడగలేదు. సంతోషంగా తమలపాకులు, అరటిపండు చేతిలో పెడితే నా కదే పది వేలు. అయినా అమ్మాయికి గుణం కనిపించాలి కదా. క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రాండి. శలవ్!”
3
మావగారు వైద్యం చెసే వయినం అంతా పక్కనున్న పడక గదిలోని కిటికీ గుండా పరికిస్తూనే ఉన్నాను. స్వరాజ్యలక్ష్మి కారు చప్పుడు విన్న తరువాత వరండాలో మావగారి దగ్గరకి వచ్చేను.
“పెద్ద పెద్ద డాక్టర్లకి అంతు పట్టని విషయాన్ని మీరెలా పట్టగలిగేరండీ?”
“చూడు అల్లుడూ! ముందస్తుగా హోమియోపతీ వైద్యానికీ, ఎల్లోపతీ వైద్యానికి మధ్య తేడా చెప్పనీ. ఇంగ్లీషు డాక్టరు దగ్గరకి వెళితే నిన్ను రెండు, మూడు నిమిషాల కంటె ఎక్కువ సేపు చూడడు. చూడలేడు. ఎందుకంటే, వాళ్లకి ఎంత మంది పేషెంట్లని చూస్తే అంత డబ్బు. స్వరాజ్యలక్ష్మి కథ వినడానికి నాకు గంటన్నర పైగా పట్టింది. ఈ సమయంలో ఆమె గురించి, వారి వంశం గురించి తెలుసుకోగలిగేను కనుకనే ఇది జన్యు రోగమని నిర్ధారించగలిగేను.
“ఎల్లోపతీ వైద్యులు రోగ లక్షణాలు వింటారు తప్ప రోగిని చూడరు. వాళ్ల దృష్టిలో ఈ శరీరం ఒక యంత్రం. రక్తం, మలం, మూత్రం, వగైరాలు అన్నీ పరీక్షిస్తారు తప్ప రోగిని మనిషిలా చూడరు. రోగి పది లక్షణాలు చెబితే పది మందులు రాసిస్తారు. రోగి సంసారం గురించి వాళ్లకి అక్కర లేదు. హోమియోపతీ వైద్యం దీనికి వ్యతిరేకం. మాకు రోగం కంటె రోగే ముఖ్యం. మనిషి, ఆ మనిషి ఆలోచనా సరళి, తత్వం, ఆ మనిషి అలవాట్లు, ఇంట్లోవాళ్ల అలవాట్లు – ఇవన్నీ మాకు కావాలి. రోగిని ఒక వ్యక్తిగా అర్థం చేసుకోవడం ప్రథాన అంశం. రోగ లక్షణాలు ద్వితీయాంశం.
“కలకత్తాలో మహేంద్రనాథ్ సర్కార్ అని పేరుపడ్డ హోమియో వైద్యుడు ఒకాయన ఉండేవాడు. ఆయన రోగి ముఖం చూసి, నడక తీరు చూసి, మనిషి వాటం చూసి, ఒక్క ప్రశ్న అయినా అడగకుండా మందు ఇచ్చి కుదిర్చేవాడుట. ఆ కథ మరొక సారి చెబుతా కాని......
“కాలం, కర్మం కలిసి రావాలంటారు చూడు. అలాగ ఈ దినం నాకు కలిసొచ్చిన రోజు. రోగం విజృంభించిన సమయంలో సరోజని పరీక్ష చేసే సదవకాశం నాకు ఒక్కడ్కే దొరికింది. మిగిలిన వైద్యులంతా ఆమెని ఆరోగ్యంగా ఉన్న పరిస్థితిలోనే చూసేరు. నేను బరంపురంలో ఉద్యోగం చేసే రోజుల్లో నారికేళవలస జమీందారుగారి గురించి విన్న కథలు కొన్ని ఆధారాలు ఇచ్చేయి. ఆఖరికి నువ్వు నిన్న రాత్రి అనుకోకుండా రావడం కూడ ఒక విధంగా ఈ సమస్యని పరిష్కరించడానికి తోడ్పడిందనుకో!
“రాత్రి నువ్వు పట్టుకొచ్చిన పుస్తకంలో “బ్రిటిష్ రాజవంశంలో జబ్బులు” అనే శీర్షిక కింద ఒక వ్యాసం ఉంది. బ్రిటిష్ రాజులలో మూడవ జార్జి ఒక వింతయిన జబ్బుతో బాధ పడేవాడట. సరోజకి వచ్చినట్లే లక్షణాలు అడపా, తడపా పొడచూపేవట. వణుకు, అపస్మారం, అర్థం కాని నొప్పి, నిద్రలేమి, మొదలయిన లక్షణాలు చూసి ఆనాటి వైద్యులు ఏమీ చెయ్యలేకపోయారుట. కాని వాళ్లు చేసిన మంచి పని ఏమిటంటే జార్జి ప్రభువు లక్షణాలు, ఆయనకి వారు చేసిన వైద్యం, అంతా పూసగుచ్చినట్లు పుస్తకాలలో రాసి ఉంచేరుట. ఈ మధ్య, అంటే 1966 లో, ఇద్దరు బ్రిటిష్ డాక్టర్లు ఆ పుస్తకాల దుమ్ము దులిపి ఒక కొత్త సిద్ధాంతం లేవదీశారుట. ఆ సిద్ధాంతం ప్రకారం జార్జి ప్రభువు ‘ఎక్యూట్ ఇంటర్మిటెంట్ పోర్ఫొరియా’ తో బాధ పడ్డాడని తీర్మానించేరు. ఆ వ్యాసం నిన్న రాత్రే చదివేను. రెండూ, రెండూ కలిపేను. అంతే.
“ఈ జబ్బు ఇంగ్లండు మొదలయిన పాశ్చాత్య దేశాలలోనే ఉంది. తెల్ల వారి సంపర్కం వల్ల మన దేశంలో కూడ వ్యాపించిందని నా అనుమానం.
ఈ “పోర్ఫొరియా’ అనేది రక్త సంబంధమైన అనేక జబ్బులకి ఉమ్మడిగా పెట్టే పేరుట. ఈ జబ్బు ఉన్నవారి శరీరం హిమోగ్లోబిన్ అనే ప్రాణ్యాన్ని సరిగ్గా తయారు చెయ్యలేదుట.
ఈ హిమోగ్లోబిన్ లో హీం లేదా రక్తచందురం అనే రంజన ద్రవ్యం, గ్లోబిన్ అనే ప్రాణ్యం ఉంటాయి. ఈ హీం రక్తానికి ఎరుపు రంగుని ఇస్తుంది.
“ ‘పోర్ఫొరియా’ ఉన్న వారి శరీరంలో రక్తచందురానికి కావలసిన ఘటకద్రవ్యాలు అన్నీ తయారవుతాయి కాని అవి రక్తచందురం పొందవలసిన ఆకారం పొందకుండా మధ్యంతరంగా ఆ ప్రక్రియ ఆగిపోయి, ఆయా ముడి పదార్థాలు రక్తంలో అలా ఉండిపోతాయి. ఇలా ఆగిపోడానికి జన్యు పదార్థంలో లోపమే కారణం. దీనికి పర్యవసానంగా శరీరం పాలిపోవడం, నీరసించడమే కాకుండా, రక్తం విషపూరితం అవడం మొదలు పెడుతుంది. కొంతవరకు మూత్రపిండాలు ఈ విష పదార్థాన్ని వడగట్టి మూత్రం ద్వారా బయటికి తోడెస్తాయి. అందుకనే ఈ జబ్బు చేసిన వారి మూత్రం కోకాకోలా రంగులో ఉంటుందిట. రక్తంలో ఈ విష పదార్థాలు ఉన్నన్నాళ్లూ రకరకాలయిన దుర్గుణాలు కనిపిస్తాయిట. అవే నొప్పులు, తిప్పులు, వికారాలుగా మనకి ప్రస్పుటమవుతాయి. ఇదంతా నువ్వు రాత్రి పట్టుకొచ్చిన పుస్తకంలో చూసేనోయ్!
“అసలు సరోజకి పుట్టుకతోటే ఈ రోగం వచ్చింది. మెడ్రాసులో చేతికి ఆపరేషను చేసినప్పుడు ఇచ్చిన మత్తు మందు పడి ఉండదు. పైపెచ్చు ఆ ‘ట్రామా’ నిద్రాణంగా ఉన్న జబ్బుని రెచ్చగొట్టి ఉంటుంది. ఈ రోజు జబ్బు ఉద్రేకించడానికి కారణం వారం రోజుల క్రితం వాడిన ‘ఫీనోబార్బిటాల్’ అని నా అనుమానం. అందుకనే ‘టెగ్రిటాల్ వెంటనే మానెయ్యమని చెప్పేను.”
“మావగారి ప్రజ్ఞా పాటవాలకి ముక్కు మీద వేలేసుకుంటున్నాను” అని చెప్పేను పక్కనున్న నా శ్రీమతితో.
“నారికేళవలసకీ ఈ జబ్బుకీ ఉన్న సంబంధం ఏమిటో నాకు బోధపడలేదు” అంది శ్రీమతి.
“నారికేళవలస జమీందారు ఒకాయన ఇంగ్లీష్ అమ్మాయిలతో జరిపిన కృష్ణలీలలు గురించి అడవి బాపిరాజు నారాయణరావు నవలలో ఒక చోట ప్రస్తావించేరు. బరంపురంలో ఉద్యోగం చేసిన వాడిని కనుక అదంతా కట్టుకథ కాదని నాకు తెలుసు,” అంటూ రామేశం గారు మసాల అందించేరు.
“’ ‘ఇది జన్యు రోగం. దీనికి మందు లేదు’ అని చెబుతూనే మీరు ఆ అమ్మాయికి ఏదో అమందు ఇచ్చేరు. ఇది ధర్మమేనా?” అని నేను ప్లేటు ఫిరాయించేను, తెలుగు సాహిత్యం చదవనందుకు నన్ను నేనే నిందించుకుంటూ.
“నేను ఆ అమ్మాయి నోట్లో వేసినవి పంచదార మాత్రలోయ్! ఏదో మందు పుచ్చుకుంటున్నానన్న సంతృప్తి, ఆ మందు పని చేస్తుందన్న నమ్మకం లేకపోతే ఏ జబ్బూ నయమవదోయ్!”
“మరితే మందేదీ ఇవ్వనప్పుడు.......”
“మందివవ్కపోవడమేమిటోయ్. వెర్రి కక్కగట్టలా ఉన్నావ్. మాంసం ముట్టొద్దనీ, కర్బనోదకాలు తినమనీ చెప్పేను కాదోయ్. ఇదేఎల్లోపతీ డాక్టరు అయితే ‘హై కార్బ్ డయట్’ అని ఇంగ్లీషులో చెబుతాడు. పుట్టుకతో వచ్చినె జబ్బుకి పథ్యమే పరమౌషధం. మోతాదుగా తిన్న తిండే కదుటోయ్ మందు అంటే,” అని రామేశం గారు చిన్న కునుకు తియ్యడానికి తలగడ మీదకి జారబడుతూ ఉండగా గేటు తెరుచుకుని సత్యవరం అప్పన్న తాత ఒక మోద తమలపాకులతో ప్రత్యక్షం అయేడు.
“ఆదోరం సంతకొచ్చా బాబూ. తవఁ దరిసెనం సేసుకోని, తవఁ కాళ్లొకసారి పట్టుకోని పోదావని ఒచ్చేను బాబయ్యా! డరమ పెబువులు. పదేళ్ల కితం సచ్చిన బొందికి పేణం పోసి బతికించేవి కదా. ఏదో పేడోణ్ణి. ఈ తవలపాకులు తప్ప ఇంకేదీ ఇచ్చుకోలేను. బాబూ నేను సచ్చిన తరువాత ఈ సెరమం ఒలిపించి చెప్పులు కుట్టించుకోండి.....”
“తాతా, నువ్వు చావా వద్దు. మాకు చెప్పులూ వద్దు. ణువ్వు వారం వారం, బతికున్నన్నాళ్లూ, ఇలా మాకు తమలపాకులు పట్టుకురానక్కర లేదని నీకెన్ని సార్లు చెప్పేను? ఎండలో వచ్చేవు. నీకింత అన్నం పెడతాను. తిని కాసేపు నీడని అలా పడుక్కో!” అంటూ సీతమ్మ గారు గదమాయించేసరికి
“దమ్మ పెబువులు” అంటూ తాత అరిటాకేసుకుని చతికిల పడ్డాడు.
రామేశం గారు అప్పటికే చిన్న కోడి కునుకు లోకి జారుకున్నారు.
(ఆంధ్ర ప్రభ వార పత్రిక, మార్చి 1996 (వారం వారం కథా ప్రభ శీర్షిక లో)

శాస్త్రీయమైన దానిని తెలుగులో రాయగలమా? నిరభ్యంతరంగా. కొద్దిగా అవసరమైన చోట ఇంగ్లీష్ పరిభాషిక పదాలుపయోగించి. దానికి ఇదే ఉదాహరణ. కొన్ని పదాలని ఇంగ్లీషునుంచి తెలుగు మారిస్తే పిల్లి బడాలం అవుతుందంతే!
ReplyDeleteఇక ఈ కథనం అద్భుతం. హోమియో తో పరిచయం ఉన్నవారికైతే అనగా హోమియో వైద్యం చేయడం అలవాటున్నవారికి చాలా గొప్పగా అనిపిస్తుందన్నది సత్యం. ఈయన మొత్తం నా జాతకం చెబుతున్నాడే అన్నట్టే ఉంటాయి ప్రశ్నలు,పరిప్రశ్నలున్నూ! అలా అలా రోగి మరియు కుటుంబ చరిత్ర తవ్వుకుంటూపోతే మూలాలలో తప్పించి రోగానికి చికిత్స లేకపోవచ్చు, దానిని ఆహారం లో మార్పు ద్వారాను,ప్లాసిబో చికిత్స ద్వారాను తగ్గించవచ్చు.
మరో అసందర్భం మాటే హోమియోలో లేకసిస్ అనే మందు ఒక పాము విషాన్నుంచి తయారు చేస్తారనీ ఆ విషాన్ని తన పైనే ప్రయోగించుకున్న వైద్యుడు జీవితకాలం ఒక ఇబ్బంది పడి చొక్క పై బొత్తాం పెట్టుకోలేకపోయాడనీ ఎక్కడో చదివిన గుర్తు, అతను డాక్టర్ నాష్ అన్న పేరు కూడా గుర్తు.
ఇది ఒక కథలా చెప్పినా జీవితంలో జరిగిన సంఘటనగానే అనుకుంటా. కథనం అద్భుతం..
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteకష్టేఫలి తాతగారు ఈ కామెంటు పెట్టుకుంటే మంచి కథ మిస్సయిపోయుందును !
అద్భుతః గ్రామంలో కూర్చొని మా కష్టేఫలి వారి లా విన్నాణం గల మేధావి రామేశం పాత్రలో కనిపించేరు .
రావు గారు మీ సొంత కథేన యిది ?
జిలేబి