Monday, September 8, 2014

నిత్యజీవితంలో రసాయనశాస్త్రం


పాతికేళ్ల క్రితం మాట. “రసగంధాయరసాయనం” అన్న పేరుతో ఒక పుస్తకం ప్రచురించేను. అంటే, సొంత ఖర్చులతో అచ్చు వేయించేను. నేను అమెరికాలోనూ, పుస్తకం అచ్చుకొట్టడం పిఠాపురం వంటి పలెటూళ్లోను. కాగితానికి కరువు. ఈ పరిస్థితులలో అచ్చు కొట్టిన “రుజువు పత్రాలు” చదివి సరిదిద్దడం సాధ్యం కాలేదు. ఎన్నో అచ్చు తప్పులతో తయారయినా అచ్చొత్తిన ప్రతులన్నీ ఖర్చు అయిపోయాయి. చదివిన వారు ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. ముఖస్తుతికే మెచ్చుకున్నారో, నిజంగానే నచ్చుకున్నారో నాకు తెలియదు.

ఇప్పుడు రోజులు మారేయి. నేను అమెరికాలో ఉన్నా, ప్రకాశకులు అంకుపాలెంలో ఉన్నా అంతర్జాలపు మహిమ వల్ల పనులు సుళువు అయిపోయాయి. పుస్తకంలో ఉన్న అచ్చుతప్పులు అన్నీ సవరించి, మంచి మేలు రకం బొమ్మలు సంపాదించి, అవసరమైన చోట్ల పదార్థాన్ని తిరగరాసి, పుస్తకాన్ని మెరుగు పరచేను. స్నేహితుల సలహా మీద పేరు మార్చేను.

అచ్చు పుస్తకాలతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వెయ్యి ప్రతులు అచ్చు కొట్టిస్తే ఎక్కడ దాచుకుంటాము? చెద పురుగుల్ బెడద ఒకటి. టపాలో పంపమని ఎవ్వరైనా అడిగితే బంగీ చెయ్యడానికి అయే ఖర్చులు, తపాలా ఖర్చులు, వగైరాలతో తడిపి మోపెడవుతున్నాది. “తెలుగువాళ్లు  కంప్యూటర్ రంగంలో ఇలా మెరిసిపోతూన్న ఈ రోజులలో కూడ అచ్చు పుస్తకాలు ఏమిటి స్వామీ?” అని స్నేహితులు అడుగుతున్నారు. అందుకని ఈ పుస్తకాన్ని “ఇ-పుస్తకం” రూపంలో కినిగె సంస్థ వారి సహకారంతో ప్రచురిస్తున్నాను. ఎంతో సరసమైన ధరకి వారు విక్రయిస్తున్నారు.

ఈ పుస్తకంలో ఉన్న అధ్యాయాలు చాలమట్టుకి ఈ బ్లాగులో  పూర్వం ప్రచురించేను. పుటలు వెనక్కి తిరగేసి చూస్తే కొన్ని మచ్చులు  చూడగలరు. తరువాత సిలికాన్ ఆంధ్రా వారి సుజరంజనిలో కొన్ని అధ్యాయాలు ప్రచురించేను. నా బ్లాగు చదివిన వారు, సుజనరంజని చదివిన వారు ఈ అధ్యాయాలని పుస్తకరూపంలో తీసుకురమ్మని పదేపదే కోరగా వారి కోరిక మేరకి ఈ పుస్తకం ప్రచురించేను.

ఈ పుస్తకం చదివి మీ అభిప్రాయం తెలీయజెయ్యండి.
ప్రాప్తి స్థానం:  http://kinige.com/kbook.php?id=3621


No comments:

Post a Comment