Saturday, March 29, 2014

అలనాటి "అమెరికా అనుభవాలు"

అలనాటి  "అమెరికా అనుభవాలు"

తెలుగు రచయితలు సాధారణంగా సొంత ఖర్చులతో తమ పుస్తకాలు అచ్చేయించుకుంటారు. ఖర్చు ఎక్కువవుతుందని భయం ఒక పక్క, అచ్చయిన పుస్తకాలు ఖర్చు అవవేమో అనే బెంగ మరొక పక్క పీడిస్తూ ఉంటే ఏ 400 ప్రతులతోనో సరిపెట్టుకుంటారు. అవి కూడా ఖర్చు అవకపోతే ఏ చెదపురుగులు తినేస్తాయో అని ఆ పుస్తకాలని స్నేహితులు నలుగురికీ పంచిపెట్టుకుంటారు. నేను కూడ ఈ పని చేసిన వాడినే.

ఇటువంటి వాతావరణంలో "మీ పుస్తకాల స్టాకు అయిపోయింది" అని ప్రకాశకులు చెప్పినా, "మీ పుస్తకాలు ఏ విక్రయశాల లోను దొరకడం లేదు, మాకు ప్రతులు కావాలంటే ఎక్కడకి రాయాలి?" అని పాఠకులు అడిగినా "ఇది కలా? నిజమా?" అని ప్రతి రచయితా అనుకుంటాడనే నా అభిప్రాయం. ఇతర రచయితల సంగతి నాకు నిజంగా తెలియదు కాని అలా నేను అనుకున్నాను.

అచ్చు పుస్తకాలతో ఒక ఇబ్బంది ఉంది. వెయ్యి ప్రతులు కొట్టిస్తే ఎక్కడ పెట్టుకుంటాను? టపాలో పంపమని ఎవ్వరైనా అడిగినా పుస్తకం వెల కంటే తపాలా ఖర్చులు పెరిగిపోతున్నాయి కద. "తెలుగు వాళ్లు కంప్యూటరు రంగంలో ఇలా విజృంభిస్తూన్న ఈ రోజులలో కూడ అచ్చు పుస్తకాలేమిటి, స్వామీ?" అని స్నేహితులు పోరగా ఈ పుస్తకాన్ని కినిగె సంస్థ వారి సహాయంతో "ఇ-పుస్తకం" గా ప్రచురించేను.

కినిగె సంస్థ వారు (kinige.com) ఈ పుస్తకాన్ని అతి సరసమైన ధరకి విక్రయిస్తున్నారు. వారిచ్చే రాయితీతో మీరు ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు లేకపోతే కేవలం 40 రూపాయలకి అద్దెకి తీసుకుని చదవ వచ్చు. "ఇ-పుస్తకం" గా ప్రచురించిన తేదీ లగాయతు వేడి వేడి పకీడీలలా  సరుకు కదులుతోంది.

నా పుస్తకం గురించి నేను ఇలా రాసుకోవడం స్వోత్కర్ష అవుతుంది. నేను ప్రచురించిన పుస్తకాలన్నిటిలో నా నిఘంటువు, అమెరికా అనుభవాలు బాగా చెల్లుబాటు అవుతున్నాయి. ప్రజలు మెచ్చే పుస్తకాలేమిటో అర్థం అవుతోంది.

No comments:

Post a Comment