Monday, July 22, 2013

కంప్యూటర్ల గురించి, తెలుగులో


కంప్యూటర్ల గురించి, తెలుగులో

0. ఈ వ్యాసాలు ఎవరికి? ఎందుకు?

ఈ రోజుల్లో కంప్యూటర్లు అంటే తెలియని వాళ్లు ఉండరు. కనిపించిన ప్రతి వ్యక్తి తనూ “సాఫ్ట్‌వేర్ ఇంజనీర్” నే అని చెప్పుకుంటూంటే మళ్లా ఈ వ్యాసాలు ఎందుకు అని చాల రోజులు తటపటాయించేను. ఈ మధ్య తరచుగా ఇండియా వెళ్లడం, వెళ్లినప్పుడల్లా కంప్యూటర్ చదువులు వెలిగిస్తున్న విద్యార్థుల పరిచయం అవడం జరిగింది. వాళ్లతో పది నిమిషాలు మాట్లాడిన తరువాత ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్లంతా ఇంగ్లీషు భాషలోను, కంప్యూటర్లలోను ప్రవీణులు అని అనేసుకోడానికి వీలు లేదని నాలో గట్టి నమ్మకం కలిగి తెలుగులో ఈ వ్యాసాలు రాయడానికి పురి కొల్పింది. అంతే కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లమని చెప్పుకునే వాళ్లకంటె కేవలం కంప్యూటర్‌ని వాడుకునే సామాన్యుల సంఖ్య అధికం. వీరు రోజూ కూపాన్లు ముద్రించుకోడానికో, విద్యుల్లేఖలు పంపడానికో, వార్తలు చదవడానికో, సినిమాలు చూడడానికో, సంగీతం వినడానికో, ఆటలు ఆడడానికో కంప్యూటర్లు వాడుతున్నారు. వీరికి కంప్యూటర్ల గురించి ఒ అంటే ఢం తెలియదు. కాని కుతూహలం ఉంటుంది కదా. కనుక నేను ఇక్కడ రాసే వ్యాసాలు వారికోసం అనుకుంటే “ఇంత చిన్న చిన్న విషయాలు మాకు తెలియవనుకుని మీరు మమ్మల్ని కించ పరుస్తునారు” అని నన్ను దూషించడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కాకపోతే మరొక్క అభ్యంతరం ఉండొచ్చు. “ఈ విషయాలన్నీ ఇంగ్లీషులో చదువుకుంటే సరిపోతుంది కదా” అని అనేవారు లేకపోలేదు. ఈ వ్యాసాలు అటువంటి వారి కోసం కాదు. ఇంగ్లీషులో లేనిది ఇక్కడ నేను ఏదీ కొత్తగా చెప్పడం లేదు.

ఈ వ్యాసాలు రాయడానికి పురికొల్పిన కారణాలు కొన్ని ఉన్నాయి. నేను 1968 లో “కంప్యూటర్లు” అనే పుస్తకం తెలుగులో రాస్తే దానిని “తెలుగు భాషా పత్రిక” వారు మూడేళ్ల పాటు ధారావాహికగా ప్రచురించేరు. ముఖస్తుతికే అన్నారో, మనస్పూర్తిగానే అన్నారో తెలియదు కాని, సంపాదకులు, పాఠకులు శైలి బాగుందని మెచ్చుకున్నారు. ఆ వ్యాస పరంపరలో మొదటి అయిదు వ్యాసాలు నల్లేరు మీద బండిలా సాగేయి. ద్వియాంశ (binary), అష్టాంశ (octal), షోడశాంశ (hexadecimal), ద్వింకము (bit), పుంజీ (nibble), అష్టాంకము లేదా అష్టా (byte), క్రమణిక (program), అంక కలనయంత్రము (digital computer), సారూప్య కలనయంత్రము (analog computer), సత్య సారణి (truth table) మొదలైన కొత్త మాటలతో ప్రయోగాలు చేసి చూశాను. కాని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టం, ఇన్‌పుట్, ఔట్‌పుట్, మొదలైన మాటలు కొన్ని కొరకరాని కొయ్యలై కూర్చున్నాయి. నలభై ఐదు ఏళ్ల తరువాత మళ్లా ఆ పాత పుస్తకాన్ని తిరగ రాయాలనే కోరిక పుట్టింది. అప్పుడు తేలికగా చేసిన పని ఇప్పుడు పదింతలు కష్టం అనిపిస్తోంది. కొద్దో గొప్పో ఇంగ్లీషు వచ్చిన తెలుగువారు సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రావీణ్యత, ప్రతిష్ట సంపాదించేరో లేదో నాకు తెలియదు కాని డబ్బు సంపాదించేరు. ఈ అత్యున్నత పురుషార్ధం అందరికీ అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో అన్న ఊహతో కంప్యూటర్లు ఎలా పని చేస్తాయో తెలుగులో చెప్పి చూద్దామనే ఉద్దేశం కలిగింది.

ఇది పాఠ్య పుస్తకం కాదు. ఇంగ్లీషులో ఉన్న పాఠ్య పుస్తకాలు చదివి అర్థం చేసుకోలేని వారు, తెలుగులో శాస్త్రీయ విషయాలు చదివితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలం ఉన్న వాళ్లు, తెలుగు వార్తాపత్రికలలో కంప్యూటర్ల గురించి రాసే పాత్రికేయులు, మొదలైన వారిని దృష్టిలో పెట్టుకుని జనరంజక (popular) శైలిలో రాసిన వ్యాసాలు ఇవి. ఈ శైలిలో నిజాన్ని క్లుప్తపరచి కాని వంగదీసి కాని రాయవలసి వస్తుంది. జనరంజక శైలిలో రాసినప్పుడు క్లిష్టమైన సాంకేతిక భావాలని తెలుగు మాటలలోనే, తెలుగు వారికి తెలిసిన ఉపమానాలతో, తెలుగు నుడికారంతో చెబితేనే బాగుంటుందని నా నమ్మకం. కనుక వీలైనంతవరకు తెలుగు పదజాలాన్నే వాడడానికి ప్రయత్నించినా వాటి సమానార్ధకాలైన ఇంగ్లీషు మాటలని పక్కపక్కనే చూపిస్తూనే ఉన్నాను. కంప్యూటర్ రంగంలో వాడుకలో ఉన్న మాటలన్నిటిని టోకు మొత్తంగా తెలుగులోకి మార్చడానికి ప్రయత్నించడం వ్యర్ధ ప్రయత్నమే అవుతుంది. వీలయినంతవరకు ప్రయోగం చేసి చూసేను.

నేను ఇంతకు పూర్వం తెలుగులో సైన్సు విషయాలు చాల రాసేను. కాని అవన్నీ ప్రకృతి శాస్త్రాలు (natural sciences) కి సంబంధించినవి. వాటితో పోల్చి చూస్తే, ఎందువల్లో తెలియదు కాని, కంప్యూటర్ల మీద తెలుగులో రాయడం చాల కష్టం అనిపించింది. కారణం? ఇది మానవ కల్పితమైన సాంకేతిక విద్య. మానవుడు కృత్రిమంగా తయారు చేసిన యంత్రాల గురించి, అంతకు ముందు ఎన్నడు కని, విని ఎరగని కృత్రిమమైన ఇంగ్లీషు భాషలో ఈ సృజనని వర్ణించి చెప్పేడు. అంటే కంప్యూటర్ రంగంలో మనం వాడే మాటలు, వాటి వెనక ఉన్న భావజాలాలు ఏభై ఏళ్ల క్రితం ఇంగ్లీషులోనే లేవు. ఈ యంత్రాలని నిర్మించిన వ్యక్తులు, వ్యాపార సంస్థలు వారి పబ్బం గడుపుకుందికి వారి భావాలని వారికి తోచిన మాటలతో వర్ణించుకున్నారే తప్ప ఏ వయ్యాకరణులనో, భాషాశాస్త్రవేత్తలనో సంప్రదించి కొత్త మాటలు కమిటీలలో పుట్టించలేదు.

అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక్క మెతుకు చిదిమి చూస్తే ఎలా సరిపోతుందో అదే విధంగా కంప్యూటర్ రంగంలో కొత్త మాటలు ఇంగ్లీషులో ఎలా, ఎంత అస్తవ్యస్తంగా పుట్టుకొచ్చేయో చెప్పడానికి ఒక్క ఉదాహరణ ఇస్తాను. “వికీపీడియా” అనే మాటని తెలుగులో ఏమంటారు? ఈ ప్రశ్నకి సమాధానంగా ఈ మాట ఇంగ్లీషులోకి ఈ మధ్యే ఎలా జొరబడిందో చెబుతాను. హవాయిలో విమానాశ్రయం నుండి ఊళ్లోకి తీసుకెళ్లే “ఎక్స్‌ప్రెస్ బస్సు” ని హవాయి భాషలో “వికీవికీ” అంటారు; మనం తెలుగులో “గబగబ” అన్నట్లు. కనుక ఎక్కువ ఆలోచన లేకుండా, ఏదో అవసరానికి తీరే పనిని అంతర్జాలంలో, నలుగురి సహాయంతో గబగబ చేసినప్పుడు దానికి “వికీ” అని పేరు పెట్టేడు ఒక కంప్యూటర్ ప్రభృతుడు. ఆ వికి ని ఎన్‌సైక్లొపీడియా ని సంధించగా వికీపీడియా వచ్చింది. ఇది దుష్టసంధి అయినా ఎవ్వరూ అభ్యంతరం పెట్టలేదు; అందరూ వాడెస్తున్నారు. ఈ వికీపీడియాని తెలుగులో ఏమనాలి? గబగబ తయారు చేసిన విజ్ఞాన సర్వస్వం కనుక “గబస్వం” అనొచ్చా? విక్ష్ణరీ “గబంటువు” అవుతుందా? సంషాబాదు విమానాశ్రయం నుండి ఊళ్లోకి తీసుకెళ్లే “ఎక్స్‌ప్రెస్ బస్సు” ని “గబగబగాడీ” అంటే ఎలాగుంటుంది?

ఇలా అనువాదానికి సులభంగా లొంగని, ఇంగ్లీషులో అర్థం పర్థం లేనివి, స్వయం బోధకాలు కానివి అయిన మాటలు కంప్యూటర్ రంగంలోనే కాదు ఇతర సాంకేతిక రంగాలలో కూడ ఎన్నో మాటలు ఉన్నాయి. వీటికి తెలుగు మాటలు తయారు చెయ్యడమా లేక ఆరు కోట్ల తెలుగు వారిని ఇంగ్లీషు నేర్చేసుకోమనడమా అన్న ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నేను ఈ వ్యాసాలలో వాడడానికి రెండు నిఘంటువలని తరచు సంప్రదించేను: మొదటిది, నేను కూర్చిన నిఘంటువు. ఇది 2000 సంవత్సరంలో అచ్చయి, ఇప్పుడు బజారులో దొరుకుతున్నాది. అచ్చయిన ప్రతి కంటె నా కంప్యూటర్‌లో ఉన్న ఇ-ప్రతి 50 శాతం పెద్దది. వీలు చూసుకుని ఈ ప్రతిని అందరికి అందుబాటులో ఉండేలా అంతర్జాలంలో పెడతాను. రెండవది, కినిగె సంస్థ వారు ప్రచురించిన ప్రవీణ్ యిళ్ల కూర్చిన “కప్యూటరు నిఘంటువు.” ఇది చిన్న ఇ-పుస్తకం. నా నిఘంటువులో లేని మాటలు ఇక్కడ కొన్ని దొరికేయి. అవసరం వెంబడి ఈ రెండు నిఘంటువులు వాడేను. ఎప్పుడు ఏ కొత్త మాటలు ప్రయోగించినా పక్కని ఇంగ్లీషు పదాలు తరచుగా ఇచ్చేను. వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా!

ఈ ప్రయత్నం ఎంత సజావుగా ముందుకి సాగుతుందో చెప్పలేను. ఈ ప్రయోగం సఫలం అవుతుందన్న నమ్మకమూ లేదు. చేపట్టిన పని ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ పని తేలికైతే ఈ పాటికి ఎందరో చేసి ఉండేవారు. ఇలాంటి పనుల వల్ల డబ్బు గణించే అవకాశం ఉన్నా ఎందరో చేసి ఉండేవారు. ఈ పురుష ప్రయత్నం యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో పాఠకులే నిర్ణయిస్తారు.

ఇటుపైన, వారం వారం కాకపోయినా, అప్పుడప్పుడు ఈ ప్రయోగాత్మకమైన వ్యాసాలు ఈ బ్లాగులో ప్రచురిస్తూ ఉంటాను. మీ స్పందనల కొరకు ఎదురు చూస్తూ ఉంటాను.

1 comment:

  1. computer=గణని
    calculator=లెఖ్ఖిని(లెక్కించేది)

    రావుగారు మీ ప్రయత్నం చాలా మంచిది, మీరు సరి ఐన దిశగా అలొచిస్తున్నారు. ఇంకొక పది సంవత్సరాలలొ తెలుగుదే వెలుగు.

    cssarma

    ReplyDelete