ఈ మధ్య శ్రీధర్ దూరవాణిలో పిలచి (నిఝం! కోత కాదు), “మేష్టారూ మీరు లోలకంలో రాసినవన్నీ చదువుతున్నాను. ఈ మధ్య మా కంపెనీలో “బాట్లు” వాడకం గురించి ఆలోచిస్తున్నాము. కొంచెం బాట్ల గురించి రాస్తారా!” అని అడిగేడు. నేను “లోలకం”లో రాయడం మొదలుపెట్టిన తరువాత, “మీరు ఫలానా విషయం మీద రాయండి” అని పిలచి ఒక పాఠకుడు అడగడం ఇది రెండవసారి; మొదటిసారి, ఏళ్ల క్రితం, రాకేష్ Uncertainty Principle మీద రాయమని అడిగేడు. అదింకా రాయనేలేదు.
చదివేవాడు దొరికేడు కనుక ముందు తెలుగు పాఠంతో మొదలు పెడతాను.
రోబాట్ అనే మాట “హార్డ్‌వేరు” ని ఉద్దేసించిన్నీ, బాట్ అన్న మాట సాఫ్ట్‌వేరుని ఉద్దేసించిన్నీ వాడతారు కనుక రోబాట్ పరిధి వేరు, బాట్ పరిధి వేరు. రోబాట్లు ఇళ్ల్లలో చిన్నా చితకా పనులు చేస్తూ కనిపించవచ్చు, కర్మాగారాల్లో భారీ పనులు చేసే యంత్రాలులా కనిపించవచ్చు. కాని బాట్లు కంప్యూటర్లలో క్రమణికల రూపంలో ఉండే అశరీరమైన శాల్తీలు. వీటి ఉనికి కలనయంత్రాలలోనూ, అంతర్జాలం లోనూ.
రోబాట్ అనే మాట స్లావిక్ భాషా శాఖ నుండి వచ్చింది. ఉదాహరణకి, రష్యా భాషలో “రబోతా” అంటే పని. కనుక పని చేసే యంత్రాన్ని రోబాట్ అన్నారు. ఇక్కడ పని అంటే చాకిరీ. నౌకరీ చేస్తే జీతం ఇస్తారు. ఇంట్లో మనం చేస్తూన్న చాకిరీకి (వంట వండడం, బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం, వగైరాలు చాకిరీ. దీనికి ఎవ్వరూ జీతం, బత్తెం ఇవ్వరు. నౌకరీ చేసే వ్యక్తిని నౌకరు అన్నట్లే చాకిరీ చేసే యంత్రాన్ని చాకరు అనొచ్చు. "అనొచ్చు" ఏమిటి? "నౌకర్లు, చాకర్లు" అనే పదబంధం వాడుకలో ఉంది కదా? కనుక తెలుగులో చాకరు అంటే ఇంగ్లీషులో రోబాట్.
“బాట్” అనే ఇంగ్లీషు మాట “రోబాట్” తల నరకగా వచ్చింది. తలని నరికెస్తే మిగిలిన మొండెం ఏ తెలివినీ ప్రదర్శించలేదుకదా! అందుకని మనం "చాకిరీ" తోక నరికి తల అట్టేపెట్టుకుని, బాట్ కి తెలుగులో "చాకి" అని పేరు పెడదాం. చాకరు కి ఒక వ్యక్తిత్వం ఇచ్చి, మానవుడి ఆకారం ఇచ్చి ఎలా ఊహించుకుంటున్నామో అదే విధంగా "చాకి" కి కూడ ఒక వ్యక్తిత్వం ఇచ్చి, ఆకారం లేని మనిషిగా, అనగా అశరీరి గా, ఊహించుకోవచ్చు.
ఇప్పుడు బాట్ (bot) లేదా “చాకి” గురించి మరికొంచెం ఆలోచిద్దాం. మనుష్యులకి వెగటు పుట్టించే, బోరు కొట్టించే, అలసట పుట్టించే, ఎక్కువగా బుర్ర ఉపయోగించవలసిన అవసరం లేకుండా, చెయ్యవలసిన పనులు ఎన్నో ఉంటాయి కదా? ఈ రకం పనులని, తనంత తానుగా, చేసుకుంటూ పోయే సాఫ్ట్‌వేరు ని ఇంగ్లీషులో బాట్ అనిన్నీ, తెలుగులో చాకి అనిన్నీ అంటారు. ఇలా పని చేసుకుంటూ పోయేదానిని ఒకానొకప్పుడు “ప్రోగ్రాం” (క్రమణిక) అనేవారు. ఈ మాట పాత చింతకాయ పచ్చడిలా తయారయేసరికి దాని పేరు మార్చి కొన్నాళ్లు API అన్నారు. వాడగా వాడగా అది కూడ మొహం మొత్తి, మెరుపు తగ్గింది. అందుకని ఆ పాత సారాని కొత్త సీసాలో పేసి, పేరు మార్చి, బాట్ (చాకి) అంటున్నారు. పూర్వపు ప్రోగ్రాములు మరీ మొద్దు రాచ్చిప్పల లాంటివి అనుకుంటే నేటి బాట్లు కాసింత తెలివి మీరిన ఘటాలు. పాతకాలపు క్రమణికలకి చెయ్యవలసిన పని అంతా విడమర్చి, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు, చెప్పవలసి వచ్చేది. ఇప్పుడో? ఈ పిదప కాలపు చాకిలు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు; కాసింత చెబితే చాలు, మిగిలినదంతా వాటంతట అవే నేర్చేసుకుంటున్నాయి. అంటే ఈ చాకిలలో కృత్రిమ మేథని జొప్పించి, దరిదాపు మనుష్యుల్లా ప్రవర్తించేలా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఉన్న కొన్ని చాకీలని ఉదహరిస్తాను.
(1) విరామ స్థానాలు సరి చేసే చాకి: మనందరికీ భాషలో పాండిత్యం ఉండదు. రాసినప్పుడు చుక్క, కామా, కుండలీకరణాలు, కొటేషన్ మార్కులు ఎలా పెట్టాలో అందరికీ తెలియదు. కొందరు వాక్యం అయిపోయిన తరువాత ఒక ఖాళీ వదలి అప్పుడు చుక్క పెడతారు. అది తప్పు; వాక్యం అయిన వెంటనే పెట్టాలి. తెలుగు వికీపీడియాలో ఈ తప్పు తరచు కనిపిస్తూ ఉంటుంది. ఎంతమందికి ఎన్ని సార్లు చెప్పినా ఎవ్వరూ వినిపించుకోరు; పైపెచ్చు చెప్పినవాడి మీద కోపం వస్తుంది. అందుకని ఈ తప్పుని సవరించడానికి ఒక క్రమణిక రాయొచ్చు. ఈ క్రమణికనే చాకి (bot) అంటారు. ఇది అంతర్జాలంలో ఉన్న తెలుగు వికీపీడియాలోకి వెళ్లి, ఎక్కడైతే ఈ తప్పు కనిపిస్తుందో చూసి, ఆ పుటని బయటకి లాగి, తప్పుని సవరించి, మళ్లా ఉండవలసిన చోట ఆ పుట్టని పెట్టేస్తుంది. ఈ పని ఎన్ని వందల సార్లు అయినా విసుగు, విరామం లేకుండా చేస్తుంది. ఈ కార్యక్రమంలో "తప్పు సవరించడం" అనే భాగాన్ని ఒక బొమ్మ రూపంలో చూపెడుతున్నాను: పేజీని చదవడం (read), తప్పు ఎక్కడ ఉందో పట్టడం (calculate), దొరికిన తప్పుని సవరించడం (edit). ఈ మూడు భాగాలూ బాట్ చేస్తుంది.
బొమ్మ: తప్పులని సవరించే బాట్ చేసే మూడు ముఖ్యమైన పనులు
కాని, వికీపీడియాలో ఉన్న పేజీని బయటకి లాగడం, పని అయిపోయిన తరువాత ఆ పేజీని మళ్లా లోపల యథా స్థానంలో పెట్టడం అనే పనులని మరొక క్రమణిక చూసుకుంటుంది. ఈ రకం క్రమణికని ముద్దుగా ఎపీఇ (API లేదా Application Program Interface) అంటారు. ఈ రకం API లు చాల ఉన్నాయి. ఉదాహరణకి Mediawiki API (api.php) అనే గ్రంథాలయం (library) లో రకరకాల అవసరాలకి పనికొచ్చే క్రమణికలు దొరుకుతాయి.
(2) మరొక ఉదాహరణగా ప్రశ్నలకి సమాధానాలు చెప్పే “చాకి” ని ఇంగ్లీషులో ఛాట్‌బాట్ (chatbot) అంటారు. ఛాట్ అంటే బాతాకానీ. ఇటువంటి "బాతాచాకీ"లు మనందరికీ తారసపడుతూనే ఉంటాయి. విమానం (లేదా రైలు) ఎంత ఆలశ్యంగా నడుస్తూందో కనుక్కోవలసి వచ్చినప్పుడు కాని, బేంకులో డబ్బు నిల్వ ఎంతుందో కనుక్కోవలసినప్పుడు కాని, మనం అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి జీతం ఇచ్చి మనిషిని పెట్టుకుంటే తడిపి మోపెడు అవుతుంది. ఈ రకం పనులు చెయ్యడానికి ఒక "చాకీ" చాలు. వీటితో బాతాకానీ కొడుతూన్నప్పుడు అవతల మనిషి ఉన్నట్లే మనకి అనిపిస్తుంది - కాని సర్వసాధారణంగా అవతల మనతో మాట్లాడేది ఒక ప్రోగ్రాము మాత్రమే! అదే "బాట్" అంటే.