వికీపీడియాలో వేమూరి_నిఘంటువు_(ఇంగ్లీషు-తెలుగు)
ఎప్పుడో 1967 లో మొదలు పెట్టి ఇప్పటివరకు సంకలించుకుంటూ వస్తున్న నా నిఘంటువుని అందరికీ అందుబాటులో ఉండాలని తెలుగు వికీపీడియాలో పెట్టేను. ఈ దిగువ లంకె నొక్కితే (లేదా కాపీ చేసి మీ విహారిణిలో ఉంచితే) మీకు ఈ నిఘంటువు కనిపించాలి. లేకపోతే తెలుగు వికీపీడియాలోకి వెళ్లి అక్కడ ఉన్న "వెతుకు" పెట్టెలో "వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)" అని వర్ణక్రమ దోషం లేకుండా టైపు చేస్తే కనిపించాలి.
https://te.wikipedia.org/wiki/వేమూరి_నిఘంటువు_(ఇంగ్లీషు-తెలుగు)
ఈ నిఘంటువు నేపథ్యం, చరిత్ర కొద్దిగా చెబుతాను. నేను సైన్సుని తెలుగులో రాసే సందర్భాలలో ఇంగ్లీషు మాటలకి సమానార్థకాలైన తెలుగు మాటలు బుర్రకి తట్టక చాల ఇబ్బంది పడేవాడిని. అందుకని నాకు అవసరమైన మాటలకి అర్థాలు దొరికినప్పుడల్లా కాగితాల మీద రాసుకుని దాచుకునేవాడిని (1967 లో సంగతి). తరువాత "వర్డ్ ప్రోసెసర్లు" వచ్చేయి. వాటి సహాయంతో నేను సేకరిస్తున్న మాటల జాబితాని కంప్యూటర్లో ఎక్కించడం మొదలు పెట్టేను. క్రమేపీ జాబితా పెరిగి పద్దదయింది. అప్పుడు దానిని English-Telugu & Telugu-English Dictionary and Thesaurus అనే పేరుతో Asian Educational Services (New Delhi) పుస్తక రూపంలో 2002 లో ప్రచురించేరు. ఇది ఇప్పుడు బజారులో దొరుకుతోంది. ఈ నిఘంటువులోని ఇంగ్లీషు-తెలుగు భాగాన్ని అప్పట్లోనే sahiti.org లో ఉంచేను.
గత 12 ఏళ్లల్లోను ఈ నిఘంటువు పొడుగు పెరిగింది. ఎన్నో కొత్త మాటలు చేర్చేను. అచ్చులో దోర్లిన తప్పులని సరి చేసేను. అక్కడక్కడ బొమ్మలు కూడ అతికించేను. ఇప్పుడు ఈ కొత్త నిఘంటువులోని ఇంగ్లీషు-తెలుగు భాగాన్ని తెలుగు వికీపీడియాలో పెట్టేను.
ఈ ఇంగ్లీషు మాటకి అర్థం చెప్పడానికి బదులు సమానార్థకమైన తెలుగు మాటలు ఇవ్వడానికి పెద్ద పీట వేసేను. వీలున్నప్పుడు ఒక సారి చూడండి. తప్పులు కనిపిస్తే చెప్పండి. ఇంకా మెరుగు పరచడానికి సలహాలు ఇవ్వండి. ధన్యవాదాలు.
- వేమూరి వేంకటేశ్వరరావు (సెప్టెంబరు 2015)
చాలా సంవత్సరాల క్రితం నేను తెలుగులో సైన్స్ క్రాస్ ఫర్డ్ పజిల్స్ తయారు చేసినపుడు మీ నిఘంటువుని వాడుకొన్నాను .అప్పుడు నేను ప్రింట్ వెర్ష న్ పుస్తకాన్ని హైద రాబాద్ లో కొన్నాను . మీరు ఇప్పుడు దాని ని పెద్దదిగా చెసి వెబ్ లో పెట్టినందుకు చాలా సంతోషం.
ReplyDeleteకృష్ణకుమారి చాగంటి