విశ్వస్వరూపం (గత సంచిక తరువాయి)
10. ప్రాదుర్భావం నుండి మహాభినిష్క్రమణం దాకా
వేమూరి వేంకటేశ్వరరావు
1. ప్రాదుర్భావం
విశ్వశాస్త్రంలో ఇప్పటికి మనకి తెలిసిన విషయాలు కొన్ని, తెలిసీతెలియని విషయాలు కొన్ని, బొత్తిగా ఏమీ తెలియని విషయాలు మరికొన్నీ ఉన్నాయి. ఈ విశ్వం చాల పెద్దది. ఊహకి అందనంతగా వ్యాప్తి చెందినంత పెద్దది. ఊహకి అందనంత కాలం నుండీ ఉంటోన్నంత పాతది. ఊహకి అందనంత కాలం ఇంకా మనుగడ కొనసాగిస్తుంది. ఇవి తెలిసున్న విషయాలు.
ఈ విశ్వం ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందో మనకి బొత్తిగా తెలియదు. జనన ఘడియల గురించి కూడా మనకి బాగా తెలియదు. ఈ విశ్వం భ్రూణ (embryo) దశలో ఉన్నప్పుడు ఏమిటి జరిగిందో ఇప్పటికీ మనకి అవగాహన కావటం లేదు. కాని, విశ్వం “పుట్టి” కొద్ది క్షణాలు గడచినప్పటినుండి (అంటే శైశవ దశ నుండి) ఇప్పటివరకు ఏమి జరిగిందో చూచాయగా అర్ధం అయింది. సుదూర భవిష్యత్తులో (అంటే, వార్ధక్య దశలో) ఏమవుతుందో తెలియదు కాని, కొంతవరకు ఊహించగలం. ఈ ప్రాదుర్భావ నిష్క్రమణ ప్రక్రియల మధ్య అవినాభావ సంబంధం ఉంది కనుక ఈ రెండింటిని కలిపి ఇక్కడ ప్రస్థావిస్తున్నాను. సిద్ధాంతాలు అనేకం ఉండటం ఉన్నాయి. ఆయా సిద్ధాంతాలని ఒక సారి పరిశీలిద్దాం.
ముందుగా ఈ విశ్వం ప్రాదుర్భావానికి (emergence) చెలామణీలో ఉన్న ఊహాగానాలు కొన్ని చెబుతాను. ఈ విశ్వం ఒక మహా పేలుడులో లేదా పెను పేలుడు (Big Bang) లో పుట్టిందని దరిదాపు అందరూ ఒప్పుకుంటున్నారు. ఈ పేలుడు జరగటానికి ముందు ఏముండేదో తెలియదు కాని ఏమి ఉండుంటుందో ఊహిస్తూ నాలుగు సిద్ధాంతాలు ఉన్నాయి.
ఒకటవ సిద్ధాంతం: అకస్మాత్ ప్రాదుర్భావం (Sudden Emergence). ఈ విశ్వానికి ముందు ఏమీ లేదు. పదార్ధం (matter), శక్తి (energy), స్థలం (space), కాలం (time) ఈ పెను పేలుడులోనే అకస్మాత్తుగా పుట్టేయి.
రెండవ సిద్ధాంతం: గుళిక ప్రాదుర్భావం (Quantum Emergence). స్థలం (space), కాలం (time) అంతకు ముందు ఉన్న ప్రాచీన పరిస్థితి (primeval state) నుండి పుట్టుకొచ్చేయి. ఆ ప్రాచీన పరిస్థితిని వర్ణించటానికి ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలు సరిపోవు; గుళిక గురుత్వాకర్షణ సిద్ధాంతం (Quantum theory of gravity) అనే పేరుగల సిద్ధాంతం కావాలి. ప్రస్తుతానికి అటువంటి సిద్ధాంతం ఏమీ లేదు.
మూడవ సిద్ధాంతం: బహువిశ్వ సిద్ధాంతం (Multiverse Theory). మన విశ్వం అసంఖ్యాకమైన విశ్వాలలో ఒక్కటి మాత్రమే. ఈ అసంఖ్యాకమైన విశ్వాలన్నీ కూడా ఒక అపరిమితమయిన మహాసముద్రంలో బుడగలలాంటివి. ఒకొక్క బుడగని ఒకొక్క విశ్వంలా ఉహించుకోవాలి. అపారమైన మహాసాగరం వంటి బ్రహ్మ పదార్ధం నుండి ఈ బుడగలు అలా పుడుతూనే ఉంటాయి. పుట్టిన బుడగలు పెరిగి, పెరిగి, చివరికి పేలిపోయి మళ్ళా బ్రహ్మ పదార్ధంలో కలసిపోతూ ఉంటాయి. అలాంటి బుడగలలో ఒక బుడగ ఉపరితలం మీద మన విశ్వం ఉంది. బుడగ వ్యాప్తి చెందినట్లే మన విశ్వం కూడ వ్యాప్తి చెందుతోంది. ఎప్పుడో “టప్” మని పేలిపోతుంది. బుడగలోని తుంపరలు మహాసాగరంలో కలిసిపోయినట్లే ఈ విశ్వం కూడ లయం అయిపోతుంది. ఈ నమూనా ప్రకారం మన విశ్వానికి మరొక విశ్వానికి మధ్య సమాచారం ప్రయాణం చెయ్యటమనేది అసంభవం. “ఈ బ్రహ్మ పదార్ధం ఎక్కడ నుండి వచ్చింది? ఎన్నాళ్ల బట్టి ఉంది?” వంటి చొప్పదంటు ప్రశ్నలు అడగకండి. అది బ్రహ్మ పదార్ధం. దానికి జనన మరణాలు లేవు.
నాలుగవ సిద్ధాంతం: చక్రీయ విశ్వ సిద్ధాంతం (Cyclic Universe) . మన విశ్వం యొక్క ప్రాదుర్భావ సమయంలో జరిగిన పెను పేలుడు వియుక్తంగా (isolated) జరిగిన ఒక ఏకైక సంఘటన కాదు. అది నిరంతరం, అవిరళంగా (continuously) జరిగే “పేలుడు - వ్యాప్తి – ముకుళిత – పేలుడు” వంటి చక్రీయ ప్రక్రియలో ప్రస్తుతం నడుస్తూన్న దశ అతి అధునాతనమైన (most recent) చక్రం. ఇదే నిజం అయితే “కాలం” గతి బాణం లా కాకుండా చక్రంలా ఉందని తీర్మానించవచ్చు. అప్పుడు “కాలచక్రం” అనే పదబంధం యొక్క అర్ధం ఇనుమడిస్తుంది.
ఈ నాలుగు సిద్ధాంతాలలో ఏది నిజమో తేల్చటానికి సాహసోపేతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సిద్ధాంతాలలో ఎక్కువ ఆశోపేతమైనది String Theory. ఈ విశ్వానికి పొడుగు, వెడల్పు, లోతు, కాలము అనే నాలుగు కొలతలే కాకుండా ఇంకా ఎక్కువ కొలతలు ఉన్నయనిన్నీ, ఇలాంటి ప్రదేశంలో మనదే కాక ఇంకా అనేక విశ్వాలు ఉన్నాయనీ ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నాది. మనం “పెను పేలుడు” అని అనుకునే పేలుడు నిజంగా పేలుడు కాదనిన్నీ, రెండు విశ్వాలు ఢీ కొన్న సంఘటన అనిన్నీ ఈ సిద్ధాంతం ద్వారా తర్కించవచ్చు. బహువిశ్వ సిద్ధాంతం (Multiverrse Theory) ఇంకా శైశవ దశలో ఉంది. ఈ సిద్ధాంతాన్ని సమర్ధించటానికి కీలకమైన విషయాలు రెండు ఉన్నాయి. మొదటిది, ఘాతీయ వ్యాప్తి (inflationary expansion) అన్న ప్రక్రియ ఒక సారి జరిగిందని ఒప్పుకుంటే, అదే ప్రక్రియ మరెన్ని సార్లో జరగటానికి అవకాశం ఉంది కదా. ఆ మాటకొస్తే ఈ ప్రక్రియ అనంతమైన కాలంలో అనంతమైనన్ని సార్లు జరిగి ఉండొచ్చు. ఈ ప్రక్రియ జరిగినప్పుడల్లా సముద్రంలో మరొక బుడగ పుట్టి వ్యాప్తి చెందుతోదని ఊహించుకోవచ్చు. ఒక బుడగకీ (విశ్వానికీ) మరొక బుడగకీ మధ్య ఏమీ సంబంధం లేదు కనుక ఈ అనంతమైన విశ్వాల మధ్య పొందుపొత్తికలు ఉండనవసరం లేదు. ఏ విశ్వం దారి ఆ విశ్వానిదే. రెండు, String Theory నిజం అయితే ఈ అనంత విశ్వముల మధ్య పొందు పొత్తికలు లేకపోవటమే కాకుండా ఇవన్నీ “ఎవరికి వారే” లా రకరకాల భౌతిక లక్షణాలు కలిగి ఉండొచ్చు.
బహువిశ్వ సిద్ధాంతంతో మరి కొన్ని లాభాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతంలో “పెను పేలుడుకి ముందు ఏమయింది?” అన్న ప్రశ్నకి తేలికగా సమాధానం చెప్పొచ్చు. అలాగే మన భౌతిక ప్రపంచం “ఇలాగే ఎందుకు ఉండాలి?” అన్న ప్రశ్నకి కూడ సమాధానం చెప్పటం తేలిక. ఉదాహరణకి, మన పెను పేలుడు ముందు అనంతమైన పెను పేలుళ్లు జరిగేయి. మన పెను పేలుడుతోపాటు అనంతమైన పెను పేలుళ్లు జరుగుతూ ఉండి ఉండొచ్చు; మనకి తెలియదు, అంతే. అలాగే మన భౌతిక సిద్ధాంతాలలోనూ (physical theories), మన భౌతిక స్థిరాంకాలలోనూ (physical constants) ప్రత్యేకత ఏమీ లేదు. మరో విశ్వంలో ఈ సిద్ధాంతాలు వేరు కావచ్చు, వాటిలో ఉండే స్థిరాంకాలు వేరు కావచ్చు.
ఈ బహు విశ్వ సిద్ధాతం వంటి సిద్ధాంతాలతో ఒక చిక్కు ఉంది. ఈ సిద్ధాంతం తప్పో, ఒప్పో తేల్చుకోవాలంటే మరొక విశ్వం ఉందో, లేదో ప్రాయోగికంగా రుజువు చెయ్యాలి. మరొక విశ్వంతో మనం “సంభాషణ” కూడా జరపలేని స్థితిలో ఈ సిద్ధాంతం వైజ్ఞానిక సిద్ధాంతం అనిపించుకోదు. పురాణ గాథలా ఉంటుంది. ఈ ఒక్క అభ్యంతరాన్ని విస్మరిస్తే, ఈ బహు విశ్వ సిద్ధాంతానికి మంచి ఆకర్షణ ఉంది.
2. ఆ జన్మ మరణ పర్యంతం
విశ్వం పుట్టుక యొక్క కథనం కొంతవరకూ అధ్యయనం చేసేం కనుక మరొకసారి వెనక్కి వెళ్ళి తెలుసుకున్న విషయాలని సింహావలోకనం చేద్దాం. సౌలభ్యం కొరకు విశ్వం యొక్క జీవన పరిధిని భ్రూణ దశ, శైశవ దశ, బాల్యం, కౌమారం, వార్ధక్యం అనే దశలుగా విభజించి చూద్దాం.
భ్రూణ దశ: సున్న నుండి 10E-5 సెకండ్ల కాలం వరకు. అంటే పెను పేలుడు ప్రారంభమయినది మొదలు ఒక “లిప్త” మాత్రపు కాల ప్రమాణంలో జరిగిన తంతు ఈ దశలోకి వస్తుంది. ఇక్కడ కాలగతిని కొలవటానికి మైక్రో సెకండులు (ఒక సెకండులో మిలియనవ వంతు), నేనో సెకండులు (ఒక సెకండులో బిలియనవ వంతు) సరిపోవు; ఇంకా చిన్న పరిమాణంలో ఉన్న సంఖ్యలని సూచించగలగాలి. అందుకని మైక్రో సెకండుని 10E-6 అనిన్నీ, పికో సెకండుని 10E-12 అనిన్నీ రాద్దాం. ఈ పద్దతిలో 10E-35 అని రాసినప్పుడు. పెను పేలుడు జరిగి 10E-35 సెకండ్లు కాలం గడచినదని అర్ధం. ఇక్కడ 35 ని చూసీ, “సెకండ్లు” అన్న బహువచనాన్ని చూసీ మోసపోవద్దు; 35 ముందు ఉన్న రుణ సంజ్ఞ చూస్తే 10E-35 చాల చిన్న సంఖ్య అని అర్ధం అవుతుంది. పెను పేలుడు జరిగి ఈ సమయం చేరుకోటానికి అతి సుక్ష్మాతి సూక్ష్మమైనంత కాలం మాత్రమే పడుతుందని మరచిపోవద్దు. (లేదా, సృష్ట్యాదిలో కాల గమనం జోరు ఇప్పటి కాలగమనం జోరు కంటె తక్కువ ఉండొచ్చు. ఈ ఊహ కేవలం నా స్వకపోల జనితం!) ఈ దశలో ఇప్పటికీ మనకి పరిపూర్ణంగా అర్ధం కాని ఘాతీయ విశ్వవృద్ధి (cosmic inflation) అనే ప్రక్రియ వల్ల విశ్వ వ్యాప్తి జోరు అనూహ్యంగా పెరిగిందని సరికొత్త సిద్ధాంతాలు చెబుతున్నాయి. వ్యాప్తి చెందటానికి చోటు ఉండాలి కదా. అందుకని స్థలం (space) సృష్టించబడింది. కాలం గడుస్తోంది కనుక కాలం (time) సృష్టించబడిందని మనం అనుకోవాలి. ఈ స్థలకాలం (spacetime) లోకి విశ్వం వ్యాప్తి చెందుతూ ఉంటే ఆ స్థలకాలాన్ని “నింపటానికి” క్వార్కుల (quarks) మయమైన గంజి లాంటి పదార్ధం (quark soup) తయారయింది. ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చేయి? ఆదిలో ఉన్న “ఆదిశక్తి” నుండి!
భ్రూణ దశలోనే కాలం నడుస్తూ 10E-30 సెకండ్లు చేరుకునే సరికి అదృశ్యమానమైన ఒక రకం కృష్ణ పదార్ధం (one type of dark matter) తయారవటం మొదలయింది. ఈ కృష్ణ పదార్ధాన్ని ఈ రోజుల్లో axions అని పిలుస్తున్నారు. ఈ ఏక్సియాను గరిమ (mass) ఎలక్‌ట్రాను గరిమలో ట్రిలియనోవంతు ( 1 ని 1,000,000,000 భాగాలు చెయ్యగా అందులో ఒక భాగం) ఉంటుందని ఒక సైద్ధాంతిక ఊహనం (theoretical conjecture) ఉంది.
కాలం 10E-11 సెకండ్లు చేరుకునే సరికి పదార్ధం (matter) ప్రతిపదార్ధం (ani-matter) మధ్య జరిగిన పోటీలో పదార్ధం విజయం సాధించింది.
కాలం 10E-10 సెకండ్లు చేరుకునేసరికి మరొక రకం కృష్ణ పదార్ధం (a second type of dark matter) తయారవటం మొదలయింది. ఈ రెండవ రకం కృష్ణ పదార్ధాన్ని ఈ రోజుల్లో nutralinos అని పిలుస్తున్నారు. ఈ నూట్రలీనో గరిమ ప్రోటాను గరిమ కంటె ఏ నూరింతలో, వెయ్యింతలో ఉంటుందని ఊహిస్తున్నారు. దీని ఉనికిని స్థిరీకరించటానికి జినీవాలో ఉన్న Large Hadron Collider ఉపయోగపడుతుందని ఆశపడుతున్నారు.
పైన చిత్రించిన భ్రూణ దశ అంతా మనకి పరిపూర్ణంగా అవగాహన కాలేదు కాని, పై చిత్రణ చాల మట్టుకు నిజమే కావచ్చని శాస్త్రవేత్తల నమ్మకం. కాని ఈ భ్రూణ దశలో 10E-35 సెకండ్ల కంటె ముందు ఏమి జరిగిందో ఇంకా ఇప్పటికీ, ఎవ్వరికీ బోధపడటం లేదు. ఈ గడ్డు సమస్య ఇలా ఉండటానికి కారణం ఉంది. ఇరవయ్యవ శతాబ్దంలో, భౌతిక శాస్త్రంలో జరిగిన ప్రగతికి అయిన్‌స్టయిన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఒక మార్గదర్శి. అయినప్పటికీ, ఇంత గొప్ప సిద్ధాంతంలోనూ ఒక వెలితి ఉండిపోయింది. ఇరవయ్యవ శతాబ్దంలో ప్రభవించి, వర్ధిల్లిన మరొక సిద్ధాంతరాజం “గుళిక సిద్ధాంతం” (Quantum theory). సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని అయిన్‌స్టయిన్ ఒంటి చేత్తో లేవదీస్తే, గుళిక సిద్ధాంతాన్ని అనేకులు సాయం పట్టి లేవదీశారు. కాని ఈ రెండు సిద్ధాంతాలకీ మధ్య పొంతన కుదరటం లేదు. అయిన్‌స్టయిన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం విశ్వాన్ని భారీ ప్రమాణంలో ఆకళింపు చేసుకోటానికి ఉపయోగిస్తుంది. గుళిక సిద్ధాంతం విశ్వాన్ని సూక్ష్మాతిసూక్ష్మమైన దృష్టితో చూసినప్పుడు ఉపయోగిస్తుంది. ఈ రెండినీ సమన్వయ పరుస్తూ ఒక కొత్త సిద్ధాంతం వస్తే కాని విశ్వం ఆవిర్భవించినప్పుడు జరిగిన సంఘటనలు అర్ధం కావని శాస్త్రవేత్తల నమ్మకం. అటువంటి సమైక్య సిద్ధాంతం (unified theory) ఇంతవరకు ఎవ్వరూ ప్రతిపాదించలేకపోతున్నారు కాని దానికి ఒక పేరు మాత్రం పెట్టేసేరు: గుళిక గురుత్వాకర్షణ సిద్ధాంతం (Quantum Theory of Gravity). ఈ సిద్ధాంతం కొరకు ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి.
శైశవ దశ: 10E-5 సెకండ్లు నుండి 380,000 సంవత్సరాల వరకు. ఈ కాల పరిమితిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఏ భాగంలో ఏమి జరిగిందో చెబుతాను.
కాలం 10E-5 సెకండు నుండి 0.01 సెకండ్ల వరకు. విశ్వం వయస్సు సెకండులో లక్షవ వంతు కి చేరుకునే సరికి అణువుల నిర్మాణానికి కావలసిన ముడి సరుకులు – అంటే ప్రోటానులు, నూట్రానులు, క్వార్కులు, అణుకేంద్రకాలు, అణువులు – తయారవటం మొదలయిందని చెప్పొచ్చు. ఈ కార్యక్రమం అంతా విశ్వం వయస్సు ఒక సెకండులో వందో వంతు (అంటే 10E-2) కాలం చేరుకునే సరికి జరిగిపోయింది ట.
కాలం 0.01 సెకండ్ల నుండి 300 సెకండ్ల వరకు. ఈ దశలో ప్రోటానులు, నూట్రానులు అనే ముడి పదార్ధాల నుండి ఉదజని, రవిజని అణువుల కేంద్రకాలు తయారయేయి.
కాలం 300 సెకండ్ల నుండి 380,000 సంవత్సరాల వరకు. ఇలా తయారయిన కేంద్రకాల చుట్టూ ఎలక్ట్రానులు చేరి అవి పరిపూర్ణమైన అణువులుగా మారి, ఒక రకం “ఓంకారనాదం” లేదా కాస్మిక్ మైక్రోవేవ్ బేక్‌గ్రౌండ్ రేడియేషన్ (cosmic microwave background radiation) ని విడుదల చేసే సరికి విశ్వం వయస్సు దరిదాపు నాలుగు లక్షల సంవత్సరాలు చేరుకుంది. ఈ దశకి చేరుకునే సరికి విశ్వం అంతా చిట్టచీకటిగా ఉండేదిట.
బాల్య దశ: 380,000 సంవత్సరాల నుండి 300 మిలియను సంవత్సరాల వరకు. విశ్వం చరిత్రలో ఇదొక అంధకార యుగం (dark age). విశ్వం వయస్సు 380,000 సంవత్సరాల నుండి 300 మిలియను సంవత్సరాలు చేరుకునే వరకు, విశ్వంలో వెలుగు లేదు. అంతకు పూర్వం ఉన్న ఆదిశక్తి యొక్క “ధగ ధగ” ఈ సమయానికి క్రమేపీ నశించిపోయి, విశ్వం చిట్ట చీకటిగా (మన కళ్ళకి) ఉండి ఉంటుంది. ఈ కాలంలో గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ప్రాంతీయ సాంద్రతలలో ఉన్న విభేదాలు పుంజుకోవటం మొదలయి ఉండాలి.
కాలం 300 మిలియను సంవత్సరాల పైబడి. ప్రాంతీయ సాంద్రతలలో ఉన్న విభేదాల వల్ల విశ్వంలో ఉన్న పదార్ధం లుమ్మలు చుట్టుకుని, ఉండకట్టి క్షీరసాగరాల రూపాలలోనూ, వాటి లోని నక్షత్రాల రూపంలోనూ తయారవటం మొదలయింది. ఈ నక్షత్రాలు రగులుకోగానే వాటిలో పుట్టిన కాంతి నక్షత్ర గర్భం నుండి బయటకి రాటానికి మరొక మిలియను సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. నక్షత్రాలు ప్రకాశించటం మొదలవగానే విశ్వం మొదటిసారి వెలుగుని చూసింది. కనుక దేవుడు Let there be light అనేసరికి ఠకీమని వెలుగు పుట్టేయలేదన్నమాట!
కాలం ఉరమరగా ఒక బిలియను సంవత్సరాలు. నక్షత్రాలు, క్షీరసాగరాలు పరిణతి చెందుతూనే ఉన్నాయి. ఆకాశంలో ఇప్పుడు మనం చూడగలిగే నభోమూర్తులలో అత్యధిక ఎరుపు మొగ్గు (red shift) చూపించేవి ఇవే. ఇప్పుడు మన దగ్గర ఉన్న అతి శక్తిమంతమైన పనిముట్లతో వీటిని మాత్రమే చూడగలుగుతున్నాం. వీటికంటె పాతవి మన కంటికి కనిపించటం లేదు. వాటిని చూడాలంటే ఇంకా శక్తిమంతమైన పరికరాలు కావాలి. ఎంత శక్తిమంతమైన పరికరాలు ఉన్నా ఆ ఎరుపు మొగ్గు మరీ ఎక్కువయితే వర్ణమాలలోని ఎరుపు హద్దు దాటి కంటికి కనబడని పరారుణ మండలంలోకి గాని, ఎరుపు మొగ్గు ఇంకా ఎక్కువ అయితే మైక్రోవేవ్ మండలం లోకి గాని వెళిపోవచ్చు. మైక్రోవేవ్ మండలం లోకి వెళ్ళిపోతే మనకి కనిపించేది 2.74 కెల్విన్ డిగ్రీల దగ్గర ఉన్న మైక్రోవేవ్ నేపధ్యపు రొద. కనుక ఇంత కంటె పాత రోజులు టెలిస్కోపులకి అందక పోవచ్చు.
కాలం ఉరమరగా 3 బిలియను సంవత్సరాలు. క్షీరసాగరాలు ఒంటెత్తుగా ఉండకుండా గుంపులు గుంపులా తయారవటం మొదలయింది. నక్షత్రాల జనన వేగం పతాక స్థాయికి చేరుకుంది.
కాలం ఉరమరగా 9 బిలియను సంవత్సరాలు. పాలపుంతలో మన సూర్యుడు జన్మించేడు. సూర్యుడు తనదంటూ ఒక గ్రహకూటమిని సంతరించుకోవటం జరిగింది.
కాలం ఉరమరగా 10 బిలియను సంవత్సరాలు. విశ్వం కృష్ణ శక్తి ఆధిపత్యంలోకి రావటంతో విశ్వ వ్యాప్తి జోరు పెరిగింది. (ఇది ప్రస్తుతానికి సిద్ధాంతం మాత్రమే!)
కాలం ఉరమరగా 13.7 బిలియను సంవత్సరాలు. ఈ నాడు.
కాలం ఉరమరగా 20 బిలియను సంవత్సరాలు. (అంటే, ఇప్పటి నుండి 6.3 బిలియను సంవత్సరాల తరువాత.) మన పాలపుంత (Milkyway), ఇంద్రమద (Andromeda) క్షీరసాగరాలు ఒకదానితో మరొకటి ఢీకొంటాయి. దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఉహించటానికి ఇక్కడ స్థలం చాలదు.
3. మహా నిష్క్రమణం
ఇటుపైన ఏమవుతుందో ఉహించాలంటే విశ్వం ఎలా పుట్టిందో పరిపూర్ణంగా అర్ధం కావాలి. ఇప్పుడు మనకి బొత్తిగా అర్ధం కాకుండా ఉండిపోయిన కృష్ణ పదార్ధం, కృష్ణ శక్తి ఏమిటో మనకి అవగాహన కావాలి. గురుత్వాకర్షణ ఏకచ్ఛత్రాధిపత్యంతో రాజ్యం ఏలినంత కాలం నక్షత్రాలు, క్షీరసాగరాలు, క్షీరసాగర సమూహాలు ఏర్పడుతూ ఉండేవి. గురుత్వాకర్షణకి వ్యతిరేకమైన కృష్ణ శక్తి ఆధిపత్యంలోకి వచ్చిందనే సిద్ధాంతమే నిజమయితే ఇహ కొత్త కొత్త క్షీరసాగరాల గుంపులు తయారవటానికి సావకాశాలు తక్కువ. కనుక భవిష్యత్తు అవగాహనకి కీలకం కృష్ణ శక్తిని అవగాహన చేసుకోవటం.
ఇప్పుడు మనం చెయ్యగలిగేది అసంపూర్ణమైన మిడిమిడి జ్ఞానంతో ఊహాగానాలు చెయ్యటం. ఫ్రస్తుత పరిస్థితులే కొనసాగితే మరొక 30 బిలియను సంవత్సరాల పాటు మన విశ్వం ఇప్పటిలాగే వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఈ వ్యాప్తి వల్ల పొరుగునున్న క్షీరసాగరాలు తప్ప దూరంగా ఉన్నవి మరీ దూరం వెళ్లిపోయి మన దుర్భిణిలో కూడ కంటికి కనబడవు. మరొక విధంగా చెప్పాలంటే దూరంలో ఉన్న క్షీరసాగరాల ఎరుపు మొగ్గు బాగా పెరిగిపోయి వర్ణమాలలో మన కంటికి కనబడని ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న మైక్రోవేవ్ మండలం లోకి వెళ్లిపోతుంది.
Monday, May 9, 2011
Subscribe to:
Post Comments (Atom)
వేమూరి గారు,
ReplyDeleteఈ విశ్వం పుట్టుకను, వ్యాప్తినీ ఎంత బాగా కళ్ళకు దర్శింపజేశారు!! ఇదంతా ఒక సారి వెళ్ళి చూసినట్టుగా వుంది నాకు. అంతా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మన వేదాల ప్రకారం నాలుగు యుగాల కాలం అయిపోగానే విశ్వం లయించి పోతుందేమో. మళ్ళీ విశ్వం జనించి యుగాలు మళ్ళీ మొదలు అవుతాయేమో. మన సైన్స్ కూ పాశ్చాత్యుల సైన్స్ కూ అన్వయించి మీరు మరొక బ్లాగు రాస్తే బాగుంటుందేమో నని అనుకుంటున్నాను.