Monday, December 15, 2008

హోమియోపతీ వైద్య విధానానికి అభ్యంతరాలు

డిసెంబరు 2008

హోమియోపతీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ ఇది శాస్త్రీయమైన పద్ధతి కాదని వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.


హోమియోపతీ స్థాపించినది సేమ్యూల్ హానిమాన్ అనే జెర్మనీ దేశపు వ్యక్తి. ఈయన కళాశాలకి వెళ్ళి లక్షణంగా వైద్య శాస్త్రం అధ్యయనం చేసేడు. కుహనా వైద్యుడేమీ కాదు. గురుముఖంగా నేర్చుకున్న విద్యే కాని స్వయంకృషితో నేర్చుకున్నదీ కాదు. ఆయనకి అప్పటి వైద్య పద్ధతులలో చాలా లోపాలు కనిపించేయి. ఈ లోపాలని విడివిడిగా ఎదుర్కుంటే వైద్యశాస్త్రం అతుకుల బొంతలా అవుతుందని నమ్మి ఆయన ఒక సరి కొత్త పద్ధతిని కనిపెట్టేడు. అదే హోమియోపతీ. ఇలా పాత సిద్ధాంతాలని ఏకాండిగా పారేసి వాటి స్థానంలో సరికొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానిని ఇంగ్లీషులో ‘paradigm shift” అంటారు. హోమియోపతీ అప్పటి పద్ధతిలోనే కాకుండా దృక్పథంలోనే ఒక పెను మార్పు అన్న మాట. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత అంతవరకు ఉన్న పద్ధతిని ఎల్లోపతీ అనటం మొదలు పెట్టేరు. ఈ ఎల్లోపతీనే ఇంగ్లీషు వైద్యం అని భారతదేశంలో అంటారు.


విజ్ఞాన శాస్త్రపు ప్రగతి పథంలో ఇటువంటి పెను మార్పులు చాలా వచ్చేయి. ఎడ్వర్డ్ జెన్నరు టీకాల మందు కనిపెట్టటం అటువంటి పెను మార్పు కి మరొక ఉదాహరణ. అప్పట్లో ఆ మందు ఎందుకు పనిచేస్తుందో, ఎలా పని చేస్తుందో ఆయన చెప్పలేక పోయాడు; కాని మందు మాత్రం పని చేసింది. తరువాత నిలకడ మీద ఆ మందు పనిచేసే పద్ధతి అర్ధం అయింది. ఈ అధునాతన యుగంలో ఇంగ్లీషు మందులు పని చెయ్యని సందర్భాలలో కూడ ఏక్యుపంక్చర్ (సూదులతో గుచ్చటం), యోగా, ఆయుర్వేదం, మొదలైన పద్ధతులు పని చేస్తున్నాయని సర్వులూ ఒప్పుకుంటున్నారు. అందుకనే అవి కొంచెం ప్రాచుర్యం సంతరించుకుంటున్నాయి. కాని హోమియోపతీ ఆ రకం అదృష్టానికి కూడ నోచుకున్నట్లు లేదు.


హోమియోపతీ వైద్యానికి కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం: మనం ఇచ్చే మందు రోగానికి, రోగ లక్షణాలని తగ్గించటానికి కాదు; మనిషికి. ఒకే రోగం అందరిలోనూ ఒకే లక్షణాలని చూపించదనేది సర్వులూ గమనిస్తూన్న విషయమే. ఇది పటిష్టమైన సూత్రమే అని మానసిక శాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నవారు ఒప్పుకుంటున్నారు. ఈ సూత్రానికి “mind over matter” అని ఇంగ్లీషులో భాష్యం చెప్పొచ్చు. రెండవ సూత్రం: రోగికి ఏ మందు ఇవ్వాలనే ప్రశ్నకి సమాధానం చెబుతుందీ సూత్రం. ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చేత ఏదైనా పదార్ధం తినిపించినప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఏయే లక్షణాలు పొడచూపుతాయో అయా లక్షణాలు ప్రదర్శించిన రోగికి అదే పదార్ధం మందుగా పనిచేస్తుంది. ఈ సూత్రానికి “ఉష్ణం ఉష్ణేత శీతలే” అని సంస్కృతంలో భాష్యం చెప్పొచ్చు. ఎల్లోపతీ వైద్యంలో కూడ ఈ సూత్రం ఉంది. టీకాల మందులు దీనికి ఉదాహరణ. ఏ రోగం బారి నుండి తప్పించుకోవాలంటే ఆ రోగం లక్షణాలని శరీరంలో పుట్టిస్తుంది టీకాల మందు. కలరా, మసూచికం, పోలియో, టెటనస్, నుమోనియా, ఫ్లూ మొదలైన వాటికి ఎన్నిటికో “టీకాల మందులు” కనిపెట్టేరు. పుప్పొడి పడని వాళ్ళకి (allergy to pollen) కూడ టీకాల మందులు ఉన్నాయి. మలేరియా వంటి వ్యాధులకి కూడ టీకాల మందుల కోసం వేట సాగుతోంది. కనుక ఈ సూత్రంలో లోపం లేదు. కాని ప్రాయోగికమైన విషయాలలో బేధాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకి, టీకాలు వేయించుకున్న వ్యక్తి రక్తం పరీక్ష చేసి చూస్తే టీకాల వల్ల రక్తంలో తయారయిన ప్రతికాయాలు (antibodies) స్పష్టంగా కనిపిస్తాయి. అంటే టీకా మందు వల్ల శరీరం ఎలా స్పందిస్తుందో మనం రుజువు చేసి చూపించవచ్చు. హోమియోపతీ మందు వేసుకున్న తరువాత శరీరంలోని రక్తంలో కాని, జీవకణాలలో కాని ఎటువంటి మార్పు వస్తుందో ఎవ్వరూ ప్రమాణాత్మకంగా రుజువు చేసి చూపించలేకపోయారు. చేసిన ప్రయత్నాలన్నీటిలోనూ అనుకున్న మార్పులు కనబడలేదు. కనుక ఈ రెండు సూత్రాల దృష్ట్యా హోమియోపతీకీ, ఎల్లోపతీకీ మధ్య మౌలికమైన తేడా లేదనే చెప్పాలి; పైన ఉదహరించిన ప్రాయోగికమైన అభ్యంతరాలు మినహాయిస్తే.


ఇక పోతే హోమియోపతీకీ, ఎల్లోపతీకి మధ్య కనపడే పెద్ద తేడాలలో మొదటిది మందుల తయారీలో – అది కూడా “పొటెన్సీ” (అంటే, మందు యొక్క శక్తి) పెరిగే కొద్దీ మందులోని ఉత్తేజిత ఘటకద్రవ్యాలు (active ingredients) తగ్గుతాయనే భావన మీదనే. “పలచన చేసిన కొద్దీ మందు పటుత్వం పెరుగుతుంది” అనే హోమియోపతీ సూత్రాన్ని ఇంగ్లీషు వైద్యులు మింగలేకపోతున్నారు. ఉదాహరణకి ‘6 x’ అంటే మిలియన్ (1 తరువాత ఆరు సున్నలు చుట్టగా వచ్చే సంఖ్య) నీటి (లేదా ఆల్కహాలు) చుక్కలలో ఒక చుక్క మందు కలపగా వచ్చిన సాంద్రత (గాఢత). “ఇలా పలచబడ్డ ద్రావణం తీసుకొని, కొన్ని చుక్కలు ఒక సీసాడు పంచదార మాత్రల మీద పోసి, రంగరించి, అందులో మూడు మాత్రలు నోట్లో వేసుకుంటే మన శరీరంలోకి వెళ్ళే మందు ఏమాత్రం ఉంటుంది?” అనే అక్షేపణలో సత్తా లేకపోలేదు.
హోమియోపతీ మీద ఆఖరి అభ్యంతరం. హోమియోపతీ వైద్యం పొందినవారిలో కొందరికి గుణం కనిపిస్తుంది, కొందరికి కనిపించదు. గుణం కనిపించిన సందర్భాలు కేవలం కాకతాళీయం అని కొందరి వాదన. సరి అయిన గణాంకాలు లేకపోతే ఈ చిక్కు విడదు. ఈ చిక్కు విడదీయాలంటే జంట-అంధ (double blind) పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా, నియంత్రిత వాతావరణంలో, ప్రయోగాలు చేసి నిర్ధారించాలి. ఇలా నిర్ధారించవలసిన బాధ్యత హొమియోపతీ వైద్యాన్ని సమర్ధించేవారిది కాని ఆక్షేపించే వారిది కాదు. ఒకొక్క సారి మందు పేరిట పంచదార మాత్రలు వేసుకున్నా గుణం కనిపిస్తుంది. దీనిని ఇంగ్లీషులో 'ప్లసీబో ఎఫెక్ట్' అంటారు.


హోమియోపతీ వైద్యం గురించి అపోహలు, అనుమానాలు రాటానికి మరొక కారణం ఉంది. మన మధ్య ఉండే హోమియోపతీ వైద్యులు చాల మంది తరిఫీదు లేని స్వయంచోదిత కుహనా నిపుణులు. వారికి శాస్త్రం మీద అవగాహన లేదు; పైపెచ్చు వారు ఇచ్చే మందు పేరేమిటో చెప్పరు. అది వారి వ్యాపార రహస్యం అన్నమాట. వైద్యం ఇలా జరిగినన్నాళ్ళూ దానికి పరపతి పెరగదు. ప్రజలలో ఆదరణ ఉన్నా ప్రముఖుల ఆదరణ లభించదు.

6 comments:

 1. తెలిసిన విషయాలే గానీ, చాలా బాగా రాశారు. హోమియో వైద్యం అనుభవంలోకి వస్తే మాత్రం అంత తేలిగ్గా కొట్టిపారెయ్యడం కష్టం. ప్రస్తుతానికి ఈ వైద్య విధానం ఒక శేషప్రశ్నే.

  ReplyDelete
 2. కొందరు హేతువాదులు కూడా హోమియోపతి వైద్యవిధానాన్ని అవలంబించటం, ఈ వైద్యవిధాన విశ్వసనీయతపై అయోమయ స్థితి నెలకొనటానికి దారితీస్తుంది.

  ReplyDelete
 3. I recommend the latest book for clarity on Homeopathy: Trick or Treatment by Simon Singh, published in London 2008.
  or please go to Stephen Barret site:
  quackwatch for scientific criticism and latest developments.
  James Randi offered $10,000 to anyone who prove homeo as scientific.(www.randi.org)
  by Narisetti Innaiah

  ReplyDelete
 4. మా అమ్మమ్మగారు దీన్నే ఉమాపతి అనేవారు. :)) చాలారోజులతర్వాత తెలిసింది దాని అసలుపేరు. కేవలం ఖండన కాకుండా సహేతుకంగా రాసారు. మాపిల్లల చిన్నప్పుడు అల్లోపతి డాక్టర్ల కెమికల్ వార్ బారినుండి కాపాడుకోవడానికి హోమియోమందులు వాడడం మొదలు పెట్టాం. అవి చాలా సందర్భాలలో పనిచేయడం నాస్వానుభవం. కానీ వైద్యుడి అనుభవం, చిత్తశుద్ధి ముఖ్యం. ఈమధ్య అన్నిటికీ హోమియో పనిచేస్తుందని ధనార్జనకోసం చేస్తున్న మిధ్యాప్రచారం సమర్ధనీయంకాదు.

  ReplyDelete
 5. మీ భాష బాగుంటుంది. శైలి చదివిస్తుంది. క్లిష్టమైనవి కూడా సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉన్నవని మిత్రులు అంటున్నారు.

  ReplyDelete
 6. Homeopathic drugs can be made at home. You need not waste money by consulting those quacks who prescribe such drugs.

  ReplyDelete