Saturday, April 27, 2013

హరితగృహంహరితగృహం

వేమూరి వేంకటేశ్వరరావు

పగలు సూర్యుడి నుండి వచ్చే వికిరణం (కంటికి కనిపించే కాంతి, కంటికి కనబడని పరారుణ కిరణాలు) వల్ల మన భూమి వెచ్చబడుతోంది. రాత్రి సమయంలో ఈ వేడి పరారుణ కిరణాల (ఇన్‌ఫ్రా రెడ్, infrared) రూపంలో వికిరణ చెందగా భూమి చల్లబడుతోంది. పగలు రవి వికిరణ వల్ల మన గ్రహం సముపార్జించే వేడిలోంచి రాత్రి వికిరణ వల్ల ఉద్గారితమయే వేడిని తీసివేస్తే నికరంగా భూమికి ప్రతి రోజు ఎంత వేడి సంక్రమిస్తోందో తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారం మనకి నికరంగా మిగిలే వేడికి మంచు కరగదు. అంటే భూమి ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండాలి. మన సముద్రాలు రాయిలా గడ్డకట్టుకుపోయి ఉండాలి. కాని అలా లేదు కదా. దీనికి కారణం భూమిని దుప్పటిలా కప్పిన మన వాతావరణం. ఈ దుప్పటి వల్ల భూమి వెలిగక్కుతూన్న పరారుణ కిరణాలు అన్నీ బయట ఉన్న రోదసిలోకి పోకుండా మనకి దగ్గరగా ఉండి వెచ్చదనాన్ని ఇస్తాయి.

పైన వర్ణించిన ప్రక్రియ, హరితగృహం (గ్రీన్‌హౌస్, greenhouse) లో జరిగే ప్రక్రియ ఒకటే. హరితగృహం అంటే ఏమిటి? ఇవి భారతదేశంలో కంటె శీతల మండలాలలో తరచు కనిపిస్తూ ఉంటాయి. చలి దేశాలలో అరటి మొక్కల వంటి ఉష్ణమండలపు మొక్కలు పెరగవు. అటువంటి మొక్కలని పెంచాలనుకుంటే వాటిని ప్రత్యేకంగా గాజు అద్దాలతో కట్టిన సాలలో పెంచుతారు. గాజు సూర్య రస్మిని లోపలికి పోనిస్తుంది కాని లోపల నుండి పరారుణ కిరణాలని (అంటే, వేడిని) బయటకి పోనివ్వదు. కనుక బయట చలిగా, మోడుబారి ఉన్నా ఈ గాజద్దాల గృహాలలో వెచ్చగా ఉంటుంది కనుక ఇవి పచ్చటి మొక్కలతో కలకలలాడుతూ ఉంటాయి.

మన వాతావరణం కూడ ఇదే విధంగా భూమిని వెచ్చగా ఉంచుతుంది. మన వాతావరణం ఈ లక్షణాన్ని ఎలా సంతరించుకుంది? మన వాతావరణంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ అనే వాయువు వల్ల వాతావరణానికి ఈ లక్షణం వచ్చింది. అందుకనే కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువులని హరితగృహ వాయువులు (గ్రీన్‌హౌస్ గేసెస్, greenhouse gases) అంటారు. మానవుడు పుట్టకపూర్వం నుండీ ఈ హరితగృహ వాయువు భూమి వాతావరణంలో ఉంటోంది. ఈ హరితగృహ ప్రభావం లేకపోతే మన మనుగడకి మన ప్రగతికి వీలైన వాతావరణం ఈ భూమి మీద ఉండేది కాదేమో!

మరైతే ఏమిటీ గోలంతా? “హరితగృహ వాయువులు వల్ల భూమి వేడెక్కిపోతోంది. మంచుకొండలు కరిగిపోతున్నాయి, సముద్రమట్టం పెరిగిపోతోంది. పల్లపు భూములు ములిగి పోతున్నాయి. తుఫానుల తీవ్రత పెరిగిపోతోంది” అంటూ పర్యావరణ పరిరక్షకులు చేసే ఈ గోలంతా ఏమిటి? మనం అభివృద్ధి పేర చేపట్టే కార్యక్రమాలు (బొగ్గుని, పెట్రోలుని కాల్చటం వంటివి) ఇంతవరకు బాగా ఉన్న వాతావరణాన్ని అకస్మాత్తుగా హరితగృహంగా మార్చెయ్యటం లేదు. మన వాతావరణం మిలియన్ల సంవత్సరాలనుండి హరితగృహం లానే ప్రవర్తిస్తోంది. అభివృద్ధి పేరిట మానవుడు ఈనాడు చేసే కార్యక్రమాలు ఈ హరితగృహ ధోరణి యొక్క జోరుని పెంచుతున్నాయి. అదీ ఆరాటానికి కారణం.

సహజసిద్దంగా ఉన్న హరితగృహ ప్రభావం వల్ల మన వాతావరణం అనే దుప్పటి భూమి సగటు ఉహ్ణోగ్రతని -1 డిగ్రీ సెల్సియస్ (30 డిగ్రీలు ఫారెన్‌హైట్) దగ్గర ఉంచగలుగుతోంది. పారిశ్రామిక విప్లవం ద్వారా మానవుడు వాతావరణంలోకి విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ కారణంగా ఈ సగటు ఉష్ణోగ్రత, ఈ శతాబ్దం అంతం అయే వేళకి మరొక 1-2 డిగ్రీలు (5 డిగ్రీలు ఫారెన్‌హైట్) పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అప్పుడు భూమి సగటు ఉష్ణోగ్రత సెల్సియస్ కొలమానంలో 0 డిగ్రీలు దాటుతుంది. ఆ వేడికి మంచు కరిగిపోతుంది. అప్పుడు దక్షిణ ధ్రువం దగ్గర పేరుకున్న అపారమైన మంచు దిబ్బలు కరిగిపోతే సముద్రమట్టం పెరుగుతుంది. వాతావరణంలో విపరీత పరిస్థితులు పుడతాయి. అదీ ఈ ఆందోళనకి కారణం. మంచు కరగటం మొదలుపెట్టిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదు. అనుమాన ప్రమాణాలని ఆధారంగా చేసుకుని, ముందు చూపుతో చెయ్యవలసిన పని ఇది. ఎప్పుడో ఉద్యోగ విరమణ అయిన తరువాత వార్ధక్యానికి కావలసిన సొమ్ముని వెనకెయ్యచ్చులే అని ఉపేక్ష చేసినట్లే ఉంటుంది - ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే!

1 comment:

  1. మంచి సమాచారాన్ని అందించారు.

    ReplyDelete