Saturday, April 20, 2013

పెట్రోలు వాడకం


పెట్రోలు వాడకం

వేమూరి వేంకటేశ్వరరావు

టి. ఎన్. టి. (TNT) అనేది ఒక ప్రతిష్టాత్మకమైన పేలుడు పదార్థం. పేలే పదార్థాలు ఎంత శక్తిమంతమైనవో వర్ణించి చెప్పటానికి టి. ఎన్. టి. (TNT) తో పోల్చి చెప్పటం ఆనవాయితీ.

టి. ఎన్. టి. పేలటానికి కారణం అందులో ఎంతో శక్తి (energy) నిక్షిప్తమై ఉండటం కాదు. తనలో ఉన్న శక్తిని అతి జోరుగా విడుదల చేయ్యగలగటమే దీని యొక్క పేలుడు స్వభావానికి కారణం. టి. ఎన్. టి. శక్తిని ఎంత జోరుగా విడుదల చేస్తుంది? ఒక క్షణంలోని మిలియనోవంతు కాలంలో! శక్తి అంత జోరుగా విడుదల అయేసరికి ఆ చుట్టుపట్ల పీడనం విపరీతంగా పెరుగుతుంది. అలా పెరిగిన పీడనానికి కొండలే పగిలిపోతాయి.

భౌతిక శాస్త్రంలో రెండు సంబంధిత భావాలు కల మాటలు ఉన్నాయి: energy లేదా శక్తి, power, లేదా సామర్ధ్యం. పరుగు పందెంలో మైలు దూరం పరిగెత్తే వ్యక్తికి శక్తి ఉండాలి. కాని 100 మీటర్లు పరిగెత్తే వ్యక్తికి “సమర్ధత” (power) ఉండాలి; అప్పుడే జోరుగా పరిగెట్టగకలడు. ఇక్కడ శక్తి, సమర్ధత అన్న మాటలకి సాహిత్య పరంగా కాకుండా శాస్త్ర పరంగా అర్థాలు చెప్పుకోవాలి. ఇదే విధంగా ఒక కోవాబిళ్లలో నిక్షిప్తమైన శక్తి ఉంది, టి. ఎన్. టి. లో సమర్ధత ఉంది.

ఒక గ్రాము బరువు ఉన్న టి. ఎన్. టి. లో 1,000 కేలరీల శక్తి ఇమిడి ఉంది. ఒక గ్రాము కోవాబిళ్ళలో 5,000 కేలరీలు ఉంటాయి అని నేను చెబితే ఆశ్చర్యం వెయ్యక మానదు. అటువంటప్పుడు ఒక కారులో బాంబు పెట్టి పేల్చేయాలంటే టి. ఎన్. టి. ఎందుకు, కోవాబీళ్లలతో పేల్చేయలేమూ? ఇది వీలుకాని పని అని మీకూ తెలుసు, నాకూ తెలుసు. ఎందుకంటే కోవాబిళ్లలు పేలలేవు. కోవాబిళ్లలతో పని జరిపించాలంటే అరడజను కుర్ర కుంకలకీ కోవాబిళ్లలు, లడ్డుండలు దండిగా మేపి, ఒకొక్కడికో సుత్తి చేతికిస్తే సాయంత్రానికల్లా కారు నామరూపాలు లేకుండా చెయ్యగలరు.

టి. ఎన్. టి. గురించి కొంచెం తెలుసుకున్నాం కనుక, ఇప్పుడు పెట్రోలు సంగతి చూద్దాం. నిజానికి పెట్రొలు కూడ పేలుడు పదార్థమే. పెట్రొలు కారు సిలిండరులోకి వెళ్లినప్పుడు అక్కడ విస్పులింగం తగలగానే భగ్గున మండి తనలో ఉన్న శక్తిని అంతా ఒక్కశారి జోరుగా విడుదల చేస్తుంది. అంతర్గతంగా ఉన్న శక్తి ఒక్క సారి బయటకి రావటమే పేలటం అంటే. పెట్రోలులో ఎంత పేలుడు శక్తి ఉంది? ఒకే బరువు ఉన్న టి. ఎన్. టి. ని, పెట్రోలుని విడివిడిగా పేల్చి చూస్తే పెట్రోలు 15 రెట్లు ఎక్కువ శక్తిమంతంగా పేలుతుంది. ఈ వ్యక్తిత్వం, ఈ లక్షణం పెట్రోలుకి ఉంది కాబట్టే పెట్రోలు అంటే మనందరికి అంత మమకారం.

పూర్వం పెట్రోలు చాల చవగ్గా దొరికేది. నేను అమెరికా వచ్చిన కొత్తలో గేలను 15 సెంట్లు ఉండేది. శుభ్రంగా, అంటే కల్మషాలు పుట్టించకుండా, కాలుతుంది. నిజానికి పెట్రోలు పరిపూర్ణంగా దగ్ధమైపోతే మిగిలే అవశేషం రంగు, రుచి, వాసన లేని కార్బన్ డై ఆక్సైడ్ వాయువు. ఈ వాయువే మనం ఊపిరి ఒదిలినప్పుడల్లా బయటకి వచ్చేది. మొక్కలు పెరిగి పెద్దవటానికి ఈ వాయువు అత్యవసరం. కనుక కార్బన్ డై ఆక్సైడ్‌ని కల్మషాల జాబితాలో వెయ్యకూడదు.

ఇదంతా కట్టు కథలా ఉందనుకుంటే పెట్రోలుని ప్రత్యామ్నాయమైన నేలబొగ్గుతో పోల్చి చూద్దాం. బొగ్గుని కాల్చటం అయిన తరువాత మనకి మిగిలేవి: మసి, సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువు, పాదరస వాయువు మాత్రమే కాకుడా తట్టెడు బూడిద మిగులుతుంది. అందుకనే బొగ్గుతో నడిచే బస్సులకి, రైళ్లకి బోలెడంత చాకిరీ చెయ్యాలి. మనం కారులో పెట్రోలు పోసుకుని టింగురంగా అని ఊళ్లు తిరిగేసి పెట్రోలు అయిపోగానే మళ్లా టేంకు నింపేసుకుంటాం; ఏదీ శుభ్రం చెయ్యవలసిన అవసరం లేదు.

అంతే కాదు. పెట్రోలు సురక్షితమైన ఇంధనం. కారు తోలుతూ ఉండగా పెట్రోలు టేంకు పేలిపోవటం ఎప్పుడైనా కన్నామా? విన్నామా? పెట్రోలుతో రెండే రెండు చిక్కులు ఉన్నాయి: వాడకం పెరిగిపోవటంతో సరఫరా సరిపోవటం లేదు. పెట్రోలు ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థం - “రాతి చమురు” (పెట్రోలియం) - నిక్షేపాలు అన్ని దేశాలలోను లేవు.

ఇలా రాజసంతో వెలుగుతూన్న పెట్రోలు కథ అడ్డం తిరిగింది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ మితి మీర కుండా ఉన్నంతసేపు పరవాలేదు. ప్రపంచంలో ఉన్న ఏడు బిలియను ప్రజలు పెట్రోలు మీద ఏదో ఒక విధంగా ఆధారపడి ఉండటంతో పెట్రోలు వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దానితో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం కూడ పెరుగుతోంది. ఇంతవరకు ఈ వాయువు మంచి గుణాలనే పొగిడి కొనియాడేను. కాని ఈ వాయువు “హరితగృహ వాయువు”; అంటే ఈ వాయువు వాతావరణంలో మితిమీరి పెరిగిపోతే మనభూ గ్రహం వేడెక్కిపోతుంది. ఈ కారణంగా సంభవించే ఉపద్రవాలు చాల ఉన్నాయి.

మన భూమి ఆరోగ్యం బాగా ఉండాలంటే కార్బన్ డై ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉత్పత్తి పెరగకుండా ఆపాలి. అంటే పెట్రొలు, బొగ్గు వంటి ఇంధనాల వాడకం తగ్గించాలి. మనం పెట్రోలుతో కేవలం ప్రేమవ్యవహారంలో పడి ఊరుకోలేదు; పెట్రోలుకి మూడు ముళ్లూ వేసేసి పెళ్లి చేసేసుకున్నాం. ఇప్పుడు విడాకులంటే రచ్చకెక్కి రభస పడాలి.

2 comments:

  1. జనాలందరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేస్తుంటే ఇంక విడాకుల ఊసెక్కడా..
    విఙానాన్ని వినోదం తో మేళవించి మీరు చెప్పిన తీరు చాలా బావుంది.

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పారు గురువుగారు,
    కారుల్లో పెట్రోలు బాంబులా పేలిపోకుండా దానిని వాడే తీఱు కూడా చెబితే తెలుసుకోవాలని వుంది.

    ReplyDelete