Sunday, March 1, 2009

పంచాంగాలు, కేలండర్లు

మార్చి 2009

పంచాంగం ఎలా నిర్మిస్తారని నా బ్లాగు చదివిన పాఠకులు ఒకరు అడిగేరు. పంచాంగం ఎలా నిర్మిస్తారో నాకు తెలియదు. కాని పంచాంగం అంటే ఏమిటో, కేలండరు అంటే ఏమిటో తెలుసు. వాటి గురించి టూకీగా చెప్పటం కష్టం; అయినా ప్రయత్నిస్తాను.

ముందుగా, పంచాంగానికీ, కేలండరుకీ తేడా ఏమిటో చూద్దాం. మా ఇంట్లో గోడ మీద ఎప్పుడూ వెంకట్రామా అండ్‌కో వారి కేలండర్ ఒకటి ఉంటూవుండేది. దాంట్లో జనవరి లగాయతు డిసెంబరు వరకు నెలకో పేజీ చొప్పున 12 పేజీలు ఉండేవి. ప్రతీ నెలా, వారాల వారీగా (అంటే ఆది, సోమ, వగైరా పేర్లతో), గళ్ళు ఉండి, ఆ గళ్ళల్లో తేదీ లేక తారీఖుతో పాటు తిథి, వారం, నక్షత్రం, దుర్ముహూర్తం, వర్జం, వగైరాలు ఉండేవి. ఈ రకం కేలండర్లని “కంచర పంచాగాలు” అనవచ్చు – అటు పంచాగమూ కాదు, ఇటు కేలండరూ కాదు, మధ్యే మార్గం.

మరి పంచాంగం అంటే ఏమిటి? మా ఇంట్లో పంచాంగం - కేలండరు మాదిరి గోడమీద వేళ్ళాడదియ్యకుండా - చుట్టబెట్టి చూరులో పెట్టేవారు. మా నాన్న గారికి తప్ప మా ఇంట్లో ఎవ్వరికీ దానిని వాడటం వచ్చేది కాదు. ఈ రకం పంచాంగానికి అయిదు అంగాలు ఉంటాయి ట. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం . వీటిల్లో దరిదాపు మనందరికీ తిథి, వారం, నక్షత్రం అంటే ఏమిటో పూర్తిగా తెలియకపోయినా ఈ మాటలు అలవాటుపడ్డ మాటలు; కనుక తెలుసనే అనుకుంటూ ఉంటాం. వీటిల్లో తిథికీ, నక్షత్రానికీ ఖగోళ శాస్త్రపు దృష్టితో తాత్పర్యం చెప్పుకోవచ్చు. “వారం” ఇటు ఖగోళా శాస్త్రానికీ పనికిరాదు, అటు జ్యోతిష శాస్త్రానికీ పనికి రాదు. పోతే, యోగం, కరణం అనేవి జ్యోతిష శాస్త్రానికి సంబంధించినవి. వీటి గురించి నేను టూకీగా చెప్పటానికి ప్రయత్నించినా పెద్ద ప్రయోజనం ఉండదు. అయినా వారం, యోగం, కరణం గురించి కొద్దిగా చెబుతాను.

ముందు కేలండర్ గురించి తెలుసుకుందాం. పొడుగుని కొలవటానికి కొందరు గజాలు, అడుగులు, అంగుళాలు వాడితే మరి కొందరు సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్లు వాడినట్లే, కాల గమనాన్ని కొలవటానికి పూర్వులు రకరకాల కొలబద్దలు వాడేవారు. పూర్వం గడియారాలు సులభంగా అందుబాటులో ఉండేవి కావు కనుక కాలాన్ని కొలవటానికి అందరికీ “అందుబాటులో” ఉన్న చంద్రుడిని, సూర్యుడిని, “కొలబద్దలు”గా వాడే వారు. ఇదెలాగో అర్ధం అయితేకాని పంచాంగం అర్ధం కాదు.

భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల వచ్చే పగలు, రాత్రి, పగలు, రాత్రి, ... మనం చూస్తూనే ఉన్నాం కదా. నిర్దిష్టత కోసం “ఒక పగలు + ఒక రాత్రి = ఒక రోజు” అని వాడదాం. కనుక కాల గమనాన్ని కొలవటానికి అనుకూలమైన, సహజమైన, ఒక కొలమానం "రోజు." (ఇక్కడ హిందీ మాట “రోజు” ఎందుకు వాడుతున్నానంటే "దినము" అన్న తెలుగు మాటకి రెండు అర్ధాలు ఉన్నాయి కనుక స్పష్టత పోతోంది.) ఈ “రోజు” పొడవు సుమారుగా 24 గంటలు.

రాంత్రింబవళ్ళ “నడక” తరువాత మనకి కావలసిన ప్రకృతి దృశ్యం చంద్ర కళలు. ఈ చంద్రకళలని కూడా కాల గమనానికి కొలబద్దగా వాడ వచ్చు. చంద్రుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని పూర్ణిమ నుండి పూర్ణిమకి మధ్య ఉండే వ్యవధికి "నెల" అని పేరు పెట్టేరు.

కథలో పిట్ట కథ. తెలుగులో "నెల" అంటే చంద్రుడు అనే అర్ధం కూడా ఉందని మరచిపోకండి. తెలుగులోనే కాదు. చాల భాషలలో "మాసం" కీ "చంద్రుడు" కీ ఒకటే పేరు. రష్యన్ భాషలో "మేస్యత్స" అంటే చంద్రుడు, మాసం అనే రెండు అర్ధాలూ ఉన్నాయి. సంస్కృతంలో "మానం" అంటే కొలత. ఇందులోంచే moon అన్న మాట వచ్చింది. ఇంగ్లీషులో moon అనే మాట నుంచే month అనే మాట వచ్చింది. ఆ మాటకొస్తే "మానం" అన్నా "మాసం" అన్నా ఒక్కటే. ఇదంతా చూస్తూ ఉంటే చంద్రుడుని ఒక కొలమానంగా ఉపయోగించేవారని తెలుస్తోంది కదా. లేటిన్ లో “me" అనే ధాతువుకి "కొలుచుట" అని అర్ధం. ఈ ధాతువులోంచే measurement వచ్చింది. చూశారా! మూలం తెలిస్తే మాటలు తార్కికంగా ఎలా పుట్టించవచ్చో! పిట్ట కథ ఇంతటితో సమాప్తం.

పూర్ణిమ నుండి పూర్ణిమ కి 29.5 రోజులు (30 రోజులు కాదు. అయినప్పటికీ లెక్క సౌలభ్యం కోసం నెలకి 30 రోజులు అని అనేస్తూ ఉంటాం.) కనుక 12 నెలలకి 12 x 29.5 = 354 రోజులు. ఇదే చంద్ర సంవత్సరం! కాని మనం అందరమూ సంవత్సరానికి 365 రోజులని చదువుకున్నాం. ఇది సూర్య (సౌర) సంవత్సరం! చంద్రుడుని పట్టించుకోకుండా ఒక్క సూర్యుడి కదలిక పైన ఆధారపడ్డ సంవత్సరం ఇది. చూసారా! చంద్రుడుని కొలబద్దగా వాడగా వచ్చిన “సంవత్సరం” లో 11 రోజులు తక్కువ. ఇప్పుడు ఏ కొలబద్దని వాడటం? (ఈ రకం కొలమానాలలో “తేడాలు’ అతి సహజం. మా జిల్లాలో పాతిక మామిడి పళ్ళు కొంటే 28 వస్తాయి. కంప్యూటర్ రంగంలో “వెయ్యి” అంటే 1024. కనుక ఇక్కడ గాభరా పడవలసిన పని లేదు.)

“ఈ రెండు కొలబద్దలలో ఏది మంచిది?” అన్నది అడగదగిన ప్రశ్నే. ఈ ప్రశ్నకి రెండు దిశలలో సమాధానాలు వెతకొచ్చు. వాడుకకి తేలిక అయినది చంద్ర సంవత్సరం. మన అవసరాలని తీర్చేది సౌర సంవత్సరం. ఇక్కడ తర్కం ఏమిటో చూద్దాం ఇప్పుడు.

తల ఎత్తి చూస్తే చాలు, ఆకాశంలో చంద్రుడి కళలు ప్రయత్నం లేకుండానే కనబడతాయి. కనుక చంద్ర కళలని ఆధారంగా చేసుకుని కాల గమనం కొలవటం తేలిక. కాని అలా కొలిచిన కాలం మన దైనందిన అవసరాలకి అంతగా ఉపయోగ పడదు. ఎందుకు ఉపయోగపడదని అడుగుతారా? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే అసలు “ప్రజలకి కేలండర్ అవసరం ఎందుకొచ్చింది?” అన్న ప్రశ్నకి సమాధానం వెతకాలి. వర్షాలు ఎప్పుడు పడతాయో, విత్తులు ఎప్పుడు నాటాలో, కోతలు ఎప్పుడు కొయ్యాలో, మొదలయిన పనులకి ఒక కేలండరు లాంటిది ఉంటే దానిని బట్టి ఏ సమయంలో ఏయే పనులు చెయ్యాలో తెలుస్తుంది. అంటే ఏ రుతువులు ఎప్పుడు మొదలవుతుందో చెప్పటానికి కేలండర్ అవసరం. చంద్రుడి మీద ఆధార పడ్డ సంవత్సరం ఈ అవసరాన్ని తీర్చలేకపోయింది; ఎందుకంటే రుతువులని నిర్ణయించేది సూర్యుడు, చంద్రుడు కాదు. (ఈ ప్రక్రియ విపులంగా చెప్పాలంటే ఈ కథనం చాంతాడంత అవుతుంది.)

సూర్య గమనం కొలబద్దగా తీసుకుని కాల నిర్ణయం చెయ్యటం కొంచెం కష్టం. ఎందుకంటే సూర్యుడి వైపు చూడటమే కష్టం. చూడగలిగినా సూర్యుడికి కళలు లేవు; ఎప్పుడూ ఒకేలా కనిపిస్తాడు. ఈ కొరత తీర్చటానికి మరొక పద్దతి కావలసి వచ్చింది. సూర్యుడికి కళలు లేకపోయినా సూర్యుడు ఉదయించే దిశ రోజు రోజుకీ కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటుంది. అంటే, ఆకాశంలో సూర్యుడు ఎప్పుడూ ఒకే చోట ఉదయించడు. సూర్యోదయం ఉత్తర దిశగా కొన్నాళ్ళు జరిగి, మరికొన్నాళ్ళు దక్షిణ దిశగా జరుగుతుంది. సూర్యోదయ స్థానం ఉత్తర దిశగా జరుగుతూన్నంత కాలం ఉత్తరాయణం. సూర్యోదయ స్థానం దక్షిణ దిశగా జరుగుతూన్నంత కాలం దక్షిణాయణం. ఆకాశంలో సూర్యుడు ఒక రోజు ఎక్కడ ఉదయించేడో గుర్తు పెట్టుకుని సరిగ్గా మళ్ళా అక్కడే ఉదయించటానికి సుమారు 365 రోజులు పడుతుందని మన పూర్వులు గ్రహించేరు; అదే సౌర సంవత్సరం. ఈ సౌర సంవత్సరాన్ని కొలబద్దగా తీసుకుంటే ప్రతి ఏటా రుతువులు ఎప్పుడు మొదలవుతాయో లెక్క కట్టి చెప్పవచ్చు. ఈ జ్ఞానం పంటలు పండించే వ్యవసాయదారులకీ, చేపలు పట్టే బెస్త వారికీ ఎంతో ఉపయోగం.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే కాలగమనాన్ని కొలవటానికి చంద్రుడినైనా వాడుకోవచ్చు, సూర్యుడినైనా వాడుకోవచ్చు. పొడుగుని కొలవటానికి జానలు, మూరలు, బారలు వాడొచ్చు లేదా అంగుళాలు, అడుగులు, గజాలు వాడవచ్చు. ఏ పద్ధతి లాభాలు దానికి ఉన్నాయి. మన దేశంలో హిందువులు కర్మకాండలకి వాడే పంచాంగాలలో రెండు పద్ధతులూ పక్క పక్కని వాడతారు – దేని లాభాలు దానికున్నాయి కనుక. కనుక ఈ రకం పంచాంగాన్ని చంద్ర-సౌర పంచాంగం అంటారు.

ఇప్పుడు హిందూ పంచాంగం గురించి టూకీగా తెలుసుకుందాం. అమావాశ్య నుండి అమావాశ్యకి మధ్య కాలం ఉరమరగా 30 రోజులు అని చెప్పేను కదా. ఈ ముప్పది రోజులలో చంద్రుడు భూమి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణం చేస్తాడు కనుక, చంద్రుడు ప్రయాణం చేసిన కోణీయ దూరం 360 డిగ్రీలు. (డిగ్రీలని జ్యోతిషశాస్త్రంలో "భాగలు" అంటారు.) లేదా రోజు ఒక్కంటికి సగటున 360/30 = 12 డిగ్రీలు కోణం తిరుగుతాడు చంద్రుడు. అమావాశ్య నాడు భూమి నుండి చూస్తే చంద్రుడు, సూర్యుడు ఒకే దిశలో ఉంటారు కనుక ఆ మరునాటికి చంద్రుడు సూర్యుడిని అధిగమించి 12 డిగ్రీలు ముందుకి జరుగుతాడు. ఇలా ముందుకి జరగటానికి పట్టే కాలం ఒక “తిథి”. ఈ తిథులలో మొదటిది పాడ్యమి. మరో 12 డిగ్రీలు ముందుకు జరగటానికి పట్టే కాలం రెండవ తిథి, విదియ. ఇలా 15 తిథులని దాటేసరికి ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు ఎదురెదురుగా ఉంటారు – మధ్యలో భూమి ఉంటుంది. ఇదే పూర్ణిమ. మరో 15 తిథులని దాటేసరికి మళ్ళా అమావాశ్య వచ్చెస్తుంది.

చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుడి చుట్టూ స్థిర వేగాలలో తిరగరు కనుక ఈ తిథుల “పొడవులు” సమాన వ్యవధిలో ఉండవు. కనుక స్థూలంగా రోజుకో తిథి అనుకున్నా సూక్ష్మంగా పరిశీలిస్తే అప్పుడప్పుడు కొన్ని తిథులు “ఏష్యం” అయిపోయే పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే (అంటే ఆ సమయానికి సూర్య చంద్రుల మధ్య ఉండే కోణీయ దూరాన్ని బట్టి) ఆ రోజుకి ఆ తిథి అని నిర్ణయిస్తారు. ఈ తిథి అనేది పంచాంగానికి మొదటి అంగం.

చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే వ్యవధిలో సూర్యుడు తూర్పున ఉదయించే స్థానం కొద్దిగా ఉత్తరానికో, దక్షిణానికో జరుగుతుంది కనుక ఆకాశంలో సూర్య చంద్రులు గత అమావాశ్యనాడు ఉన్న స్థానాలు ఒకటయితే, ఈ అమావాశ్యనాడు ఉన్న స్థానాలు మరొకటి. కనుక ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పటానికి మనకి కదలకుండా ఉండే బండ గుర్తులు కావాలి. ఆ బండగుర్తులే నక్షత్రాలు. (ఈ వ్యాఖ్యానం భూమి చుట్టు సూర్యుడు, చంద్రుడు తిరుగుతున్నారన్న దృస్టితో రాసినది.)

మినుకు మినుకు మంటూ చుక్కలులా కనిపించే నక్షత్రాలన్నీ ఒకేలా కనిపిస్తూ ఉంటే వాటిని బండ గుర్తులుగా ఎలా వాడటం? అందుకని సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో నడిచే దారి వెంబడి గుర్తు పెట్టుకోటానికి వీలుగా నక్షత్రాలని గుంపులుగా విడగొట్టి, వాటికి పేర్లు పెట్టేరు. ఆ నక్షత్రాల గుంపులనే మనం అశ్వని, భరణి, మొదలైన 27 పేర్లతో పిలుస్తాము. కనుక మనం “అశ్వనీ నక్షత్రం” అన్నప్పుడు “అశ్వని” అన్నది ఒక గుంపు పేరు. దీనినే ఇంగ్లీషులో asterism అంటారు. కనుక 360 డిగ్రీలని 27 చేత భాగిస్తే ఒకొక్క “ఇల్లు” 13 డిగ్రీల 20 నిమిషాల ప్రమాణంలో ఉంటుంది. ఆకాశంలో చంద్రుడు ప్రయాణం చేస్తూ “ఒకొక్క ఇంట్లో ఒకొక్క రోజు గడుపుతాడు” అని మనవాళ్ళు చమత్కరించేరు. చంద్రుడు మగ కనుక నక్షత్రాలను “ఆడ” గా ఊహించుకుంటే “నెల రాజు” ఒకొక్క రాత్రి ఒకొక్క “రాణి”తో గడిపినట్లు ఊహించుకున్నారు పూర్వులు.

చంద్రమార్గంలో ఉన్న నక్షత్రాలని 27 గుంపులుగానే ఎందుకు విభజించేరు? ఈ 27 ప్రత్యేకత ఏమిటి? చంద్రుడు భూమి చుట్టూ ఒక సారి తిరగటానికి (అమావాశ్య నుండి అమావాశ్యకి కాదు) 27-1/3 రోజులు పడుతుంది. కనుక ఆ దారిని 27 భాగాలు చేస్తే చంద్రుడు ఒకొక్క “భార్య” తో ఒకొక్క రోజు గడిపినట్లు అవుతుంది. అందుకని.

ఇప్పుడు ఈ రోజు నక్షత్రం ఏమిటో మనకి ఎలా తెలుస్తుంది? సూర్యోదయం వేళకి చంద్రుడు ఏ రాణి గారి ఇంట్లో ఉంటే అదే ఈ నాటి నక్షత్రం. మన పంచాంగాలలో చంద్రుడు ఏ నక్షత్రంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, ఎప్పుడు వదలిపెడతాడో గంటలు, నిమిషాలతో సహా చెబుతారు. ఇది హిందూ కర్మకాండకి అవసరం. ఈ సమాచారం పంచాగానికి రెండవ అంగం.

పంచాంగానికి మూడో అంగం – వారం. వారం యొక్క అవసరం కాని, వారానికి ఏడు రోజులు ఉండాలనే నియమం కాని ఖగోళశాస్త్ర దృష్ట్యా లేదు. శతాబ్దాలుగా పాతుకుపోయిన అలవాటు తప్పితే దీనికి ప్రయోజనం లేదు. వారానికి ఏడు రోజులు ఉండాలనేది బైబిలు లో ఉంది తప్ప శాస్త్రీయమైన కారణం లేదు. ఆ మాటకొస్తే వారానికి ఆరు రోజులు, నెలకి అయిదు వారాలు, ఏడాదికి 12 నెలలు ఉంటే కొన్ని లాభాలు ఉన్నాయి. ఈ విషయం మరొక బ్లాగులో చర్చిస్తాను. ఈ “వారం” అనే భావన పాశ్చాత్య ప్రభావం వల్ల మన పంచాంగాల్లో ఎక్కి పంచాంగానికి మూడవ అంగం అయి కూర్చుంది అనిపిస్తుంది నాకు.

పోతే, పంచాంగానికి నాలుగో అంగం – యోగం, అయిదో అంగం కరణం. వీటికి శాస్త్రీయమైన మద్దత్తు లేదు. వీటిని జాతకాలలో ఉపయోగిస్తారు తప్ప వీటికి ఖగోళపరంగా వ్యాఖ్యానాలు ఉన్నట్లు నాకు తెలియదు.

అదండీ నాకు తెలిసిన పంచాంగం కథ. ఈ పంచాంగంలో నిజంగా రెండు అంగాలే ప్రధానం.

3 comments:

 1. chala dhanyavadalandi. nakunna konni sandehalu teerayi.

  sathibabu.

  ReplyDelete
 2. చిన్న సవరణ
  "ఆకాశంలో సూర్యుడు ఒక రోజు ఎక్కడ ఉదయించేడో గుర్తు పెట్టుకుని సరిగ్గా మళ్ళా అక్కడే ఉదయించటానికి సుమారు 365 రోజులు పడుతుందని మన పూర్వులు గ్రహించేరు; అదే సౌర సంవత్సరం."

  అని బ్లాగులో అన్నాను. నిశితంగా ఆలోచిస్తే ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే ఒక చోట ఉదయించిన స్థలంలో మళ్ళా ఉదయించటానికి అర్ధ సంవత్సరం చాలు. సూర్యుడు ఉత్త దిశగా (లేదా దక్షిణ దిశగా) నడుస్తూ మళ్ళా అదే స్థానంలో ఉదయించటానికి 365 రోజులు పడుతుంది.

  ReplyDelete
 3. ఇది నా ఇష్టాంశాలలో ఒకిటి :)

  ----------
  రోజు - హిందీ (పెర్షియన్)
  దినము - సంస్కృతం (తెలుఁగు) {దిన్ - హిందీ}
  పొద్దు - అచ్చతెలుఁగు
  మొన్నో పొద్దు, ఒక సినిమాలో "ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా వుండాదీ " అనే మాట విన్న నాకూ చాలా సంతోషం వేసింది.

  పొద్దు అంటే అసలు అర్ధం సూర్యుడు(సంస్కృతం) అనుకోండి. ఒకనాడు నేను సాయంత్రం పొలాన సూర్యుని పోటో తీస్తుంటే,"పొద్దుని తీత్నారా అండీ" అని ఒకడు అడిగేసరికి, నా పోటోకన్నా, నీ నుడికారం బాగుందయ్యా అనుకున్నాను మనసులోఁ.

  అలానే నెల (నెలబాలుడు, నెలవంక) అంటే చంద్రుడన్న మట, మన తెలుఁగులో దీన్ని అంతగా వడకపోయినా, మలయాళ కన్నడాలలోఁ చంద్రుని పేరు తింగళు (తింకళు). తింగళు అంటే మాసం కూడా. "ఇరడు తింగళా అయిత్తప్పా, ననగే సంబళ కొట్టిల్ల కంపెనీ అవరు". ఇద్దరు చంద్రుళ్లు వచ్చిపోయాయఁట, వీడి తస్సాగొయ్యా అనుకొనేవాడిని :)

  ---------

  చంద్రమానంలో 354. సౌర్యమానంలో 356.25.., మఱి నక్షత్రమానం అని ఇంకోటి వుంది కదండి అందులోనో.. ? (సౌర్యమానం కంటే ఒక రోజు ఎక్కువో తక్కవో వుంటుందనుకుంట).
  -------------
  నిశితంగా ఆలోచిస్తే ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే ఒక చోట ఉదయించిన స్థలంలో మళ్ళా ఉదయించటానికి అర్ధ సంవత్సరం చాలు.ఇంకా నిశితంగా ఆలోచిస్తే, ఇది కూడా నిజం కాదు. కొన్ని చోట్ల ఎనిమిది నెలలు, నాలుగు నెలలూ పట్టవచ్చు. ఈక్వేటరు దగ్గర ఆఱారు నెలలు పట్టవచ్చు. కొన్ని చోట్ల పన్నెండు, సున్నా నెలలు పట్టవచ్చు. ఈ విషయం మీకు తెలుసుననుకోండి. ఊరికినే చదువర్ల కోసం.


  -------------
  అన్నట్టు మనదేశంలో వారాలు బైబిలు పుట్టక ముందే వుందనుకుంటగా, హోరములు (hour) వుంటాయి, వాటికి అధిపతులుంటారు. ఒక దినమున మొదటి హోరాధిపతి ఎవరైతే వారి పేరిట ఆ దనము ఏర్పడుతుందని, నేను పలు ఛానళ్ళలో చూసి తెలుసుకున్నాను.

  మీ
  రాకేశ్వర

  ReplyDelete