Sunday, March 29, 2009

ఇంటింటి రసాయనం, వంటింటి రసాయనం - 4

II ఉదకర్బన రసాయనం – తైల సాగర మధనం

రసాయనశాస్త్రం అనే మహా వృక్షానికి రెండు ముఖ్యమయిన శాఖలు ఉన్నాయి. కర్బనం అనే మూలకం ముఖ్య పాత్ర వహించే శాఖని కర్బన రసాయనం (carbon chemistry) అంటారు. దీనినే ఆంగిక రసాయనం (organic chemistry) అని కూడ అంటారు. ఇటు పైన ఇక్కడ ఈ కర్బన రసాయనాన్నే ప్రస్తావిస్తాం.

కర్బనం యొక్క బాహుబలం లేదా బాలం 4. అంటే, కర్బనపు అణువుకి నాలుగు చేతులు ఉన్నట్లు ఊహించుకుంటున్నామనన్న మాట. ఈ నాలుగు చేతులని నాలుగు వైపులా బార జాపి అక్కడ మరొక అణువు ఏదైనా ఉంటే దాని చేతిని పట్టుకునే సామర్ధ్యం కర్బనానికి ఉందన్న మాట. ప్రతీ కర్బనపు అణువు తన నాలుగు చేతులతోటీ మరొక కర్బనపు అణువునే పట్టుకుంటే మనకి మిగిలేది కర్బనమే. కాని కర్బనం మిగిలిన మూలకాలతో కూడ సంయోగం చెందితే మనకి రకరకాల పదార్ధాలు లభిస్తాయి. ఈ విశాల విశ్వంలో ఎక్కువ సమృద్ధిగా దొరికే మూలకం ఉదజని (Hydrogen). కనుక కర్బనము, ఉదజని సంయోగం చెందినప్పుడు మనకి దొరికే వాటి గురించి ముందుగా కొంత విచారణ చేద్దాం. ఈ జాతి పదార్ధాలని ఇంగ్లీషులో “హైడ్రోకార్బన్స్” (hydrocarbons) అంటారు. ఇక్కడ హైడ్రో అనే విశేషణం “హైడ్రొజన్” ని సూచిస్తుంది, హైడ్రొజన్ అంటే ఉదజని, కార్బన్ అంటే కర్బనం కనుక "హైడ్రోకార్బన్స్" అన్నది ఉదకర్బనాలు అని తెలుగులోకి తర్జుమా అవుతుంది. తెలుగు అంటే పడని వారు, తెలుగు పొడ కిట్టని వారూ ఇంగ్లీషు మాట వాడేసినా మరేమీ నష్టం లేదు. ఇప్పుడు కొన్ని ఉదకర్బనాల లక్షణాలు, అవి మన జీవితాలలో ఎక్కడెక్కడ ఎదురవుతాయో విచారిద్దాం.

1. మెతేను, కొరివి దయ్యాలు!


ఉదకర్బనాలన్నిటిలో అతి సూక్ష్మమైనది మెతేను (methane). ఈ మెతేను బణువులో ఒకే ఒక కర్బనం అణువు, నాలుగు ఉదజని అణువులు ఉంటాయి. కర్బనం బాలం 4 కదా. కనుక కర్బనానికి నాలుగు చేతులు. ఈ నాలుగు చేతులూ నిండుగా ఉండాలి; ఖాళీ చేతులు ఉండటానికి వీలు లేదు. కనుక ఒకొక్క చేతికి ఒకొక్క ఉదజని అణువుని తగిలిస్తే మనకి మెతేను వస్తుంది. మెతేను బణువు నిర్మాణక్రమం ఎలా ఉంటుందో బొమ్మ 1 లో చూపుతాను.బొమ్మ 1. మెతేను నిర్మాణక్రమం (రెండు విధాలు).

ఈ బొమ్మలో C కర్బనాన్ని సూచిస్తుంది. C కి నాలుగు పక్కలా ఉన్న చిన్న గీతలు నాలుగు బాహువులని సూచిస్తాయి. ఈ సందర్భంలో వీటిని బాహు బంధాలు అని కాని, “రసాయన బంధాలు" (chemical bonds) అని కాని, టూకీగా బంధాలు (bonds) అని కాని అంటారు. నిర్మాణక్రమం అవసరం లేనప్పుడు మెతేనుని క్లుప్తంగా CH4 అని రాస్తారు.

గతంలో ఒకసారి చెప్పినట్లు, ఈ మెతేనుని ఇండియాలోనూ, ఇంగ్లండు ప్రభావం ఉన్న దేశాలలోనూ “మీథేను” అని కూడ అంటారు. మనం ఏ పద్ధతిలో ఉచ్చరించినా సరే, ఇది వాయు పదార్ధం. దీనికి రంగు, రుచి, వాసన లేవు. మిగిలిన వాయుపదార్ధాలకి మల్లే ఇది కూడ బాగా చల్లార్చితే ద్రవపదార్ధంగా మారుతుంది. ఎంతవరకు చల్లార్చాలి? మన భూలోకంలో సహజసిద్దంగా సంభవించే చల్లదనం సరిపోదు. ఆఖరికి దక్షిణ ధృవం దగ్గరకి వెళ్ళినా, హిమాలయా శిఖరాగ్రాల మీదకి వెళ్ళినా మెతేను వాయువు గానే ఉంటుంది. ప్రయోగశాలలో, ప్రత్యేకమయిన పరికరాలు ఉపయోగించి మెతేనుని ద్రవీకరించవచ్చు.

మెతేను ముఖ్య లక్షణం మండటం. మెతేనుని అగ్గిపుల్ల వేసి వెలిగించినప్పుడు ఆ వేడికి పైన పటంలో చూపిన బంధాలు విడిపోతాయి. అలా బంధ విముక్తి పొందిన ఉదజని అణువులు గాలిలోని ఆమ్లజని అణువులతో సంయోగం చెంది మంట వేడికి నీటి ఆవిరిగా మారి పోతాయి. కర్బనం మండి మనకి వేడినీ, వెలుగునీ ఇస్తుంది. ఈ మండే గుణం ఉంది కనుకనే ఈ మెతేనుని గొట్టాల ద్వారా ఇళ్ళల్లోకి తీసుకెళ్ళి, అక్కడ మండించి, వంటలకీ, వార్పులకీ వాడుకోవచ్చు. ఈ దృష్టితో చూస్తే మెతేను వాయు రూపంలో ఉన్న "వంట చెరకు" అన్నమాట!

పేరు ఇంగ్లీషు పేరులా ఉన్నా ఈ మెతేను మనకి మరీ పరిచయం లేని వాయువు కాదు. పల్లెటూళ్ళల్లో మనకి అప్పుడప్పుడు “బయోగేస్” పరికరాలు కనబడుతూ ఉంటాయి. ఈ బయోగేస్ లో దరిదాపు 50 శాతం మెతేనే. పేడ, ఆకులు, అలములు, మొదలైన పదార్ధాలని కుండీలో వేసి, మూత పెట్టి కుళ్ళబెడితే ఈ వాయువు అక్కడ నుండి పుట్టుకొస్తుంది. పల్లెపట్టులలో మురుగు భూములు (marsh lands) ఉంటాయి. అక్కడ చెత్త, చెదారం, జంతువుల కళేబరాలు, మొదలైనవి చేరి, సహజంగానే కుళ్ళి, ఈ వాయువుని పుట్టిస్తాయి. సర్వసాధారణంగా ఈ వాయువు వీచే గాలికి చెదిరిపోయి చుట్టు ఉన్న గాలిలో కలిసిపోతుంది. రంగు, రుచి, వాసన లేవు కనుక మనకి ఈ విషయం అవగాహనకి రానే రాదు. కాని, అప్పుడప్పుడు, గాలి వీచని వేసవి రోజులలో ఈ వాయువు చెదిరిపోకుండా ఒకే చోట పేరుకోటానికి సావకాశం ఉంది. అప్పుడు ఏ మాత్రం చిన్న నిప్పు రవ్వ తగిలినా, లేక కేవలం గాలి వేడికి ఈ మెతేను వాయువు అంటుకుని భగ్గున మండుతుంది. అసలే పల్లెపట్టు. చీకటి. అకస్మాత్తుగా మంట కనిపించేసరికి దాన్ని చూసి కొరివి దయ్యం అనుకుని భయపడ్డామంటే భయపడమూ? చీకట్లో దయ్యాలుంటాయేమో కాని కొరివి దయ్యాలు మాత్రం ఉండవని మనం – క్షమించండి – సైంటిఫిక్ గా రుజువు చెయ్యవచ్చు. ఈ మెతేను వాయువు బొగ్గు గనులలో కూడ పుడుతుంది. అక్కడ మండే అవకాశం నిజంగా ఉంది. అప్పుడు అది పెద్ద ప్రమాదం. ధన నష్టం, ప్రాణ నష్టం.

2. ఎతేను, ప్రొపేను, బ్యుటేను, గేసు సిలిండర్లు

మెతేను బణువులో ఒకే ఒక కర్బనపు అణువు ఉంది. ఇప్పుడు రెండు కర్బనపు అణువుల్ని తీసుకుని వాటిని ఒక బంధంతో జత చేసేమని అనుకుందాం. ఈ బంధం కొరకు వాడేసిన హస్తం మినహాయించగా ప్రతి కర్బనపు అణువుకి ఇంకా మూడేసి చొప్పున ఖాళీ చేతులు ఉన్నాయి కదా. ఈ రిక్త హస్తాలకి ఒకొక్క ఉదజని అణువుని అంటగట్టేమనుకుందాం. అప్పుడు ఆ బణువు యొక్క నిర్మాణక్రమం బొమ్మ 2 లో చూపినట్లు ఉంటుంది.

బొమ్మ 2. ఎతేను నిర్మాణక్రమం


ఈ రకం నిర్మాణ క్రమం ఉన్న పదార్ధాన్ని ఎతేను (ethane) అంటారు. దీని సాంఖ్యక్రమం C2H6. ఎతేను కూడ మెతేను వంటి లక్షణాలు కలిగిన వాయు పదార్ధమే. కాని మెతేనులా ఇది సహజసిద్ధం కాదు; గనులలో దొరికే సహజ వాయువు (natural gas) లో ఉండే అనేక ఉదకర్బన వాయువుల మిశ్రమం నుండి విడదీస్తారు. సహజ వాయువులో ఎక్కువ భాగం మెతేను, 1 నుండి 5 శాతం వరకు ఎతేను ఉంటాయి.

మెతేనులో ఒక కర్బనం అణువు, ఎతేనులో రెండు. ఇదే పద్దతిని, గొలుసుకట్టుగా కర్బనపు అణువులని అలా జతపరుస్తూ ఎంత దూరం అయినా వెళ్ళవచ్చు. మచ్చుకి మూడు కర్బనపు అణువులని ఒకొక్క బంధంతో, గొలుసుకట్టులా, జత చేసి మిగిలిన ఎనిమిది రిక్త హస్తాలకి ఎనిమిది ఉదజని అణువులని తగిలిస్తే వచ్చేది ప్రోపేను (propane) అనే మరొక వాయువు. ఈ ప్రొపేను సాంఖ్యక్రమం C3H8. నాలుగు కర్బనపు అణువులని గొలుసులా చేసి, మిగిలిన రిక్త హస్తాలకి ఉదజని అణువులని తగిలిస్తే వచ్చేది బ్యుటేను (butane) అనే వాయువు. ఈ బ్యుటేను సాంఖ్యక్రమం C4H10.


ఈ నాలుగింటిలోనూ మెతేను బణువు చిన్నది, ఎతేను బణువు మరికొంచెం పెద్దది, ప్రొపేను ఇంకొంచెం పెద్దది, బ్యుటేను ఇంకా పెద్దది అని నేను మళ్ళా అరటి పండు ఒలచినట్లు చెప్పక్కరలేదనుకుంటాను; బొమ్మ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మెతేను బణువులో అయిదే అణువులు ఉన్నాయి. ఎతేనులో ఎనిమిది, ప్రొపేనులో 12, బ్యుటేనులో 14 అణువులు ఉన్నాయి. ఇలా బణువు పరిమాణం (size) పెరిగే కొద్దీ ఆ బణువులో అణువుల సంఖ్య పెరుగుతుంది, ఆ బణువు బరువు పెరుగుతుంది. అంతే కాకుండా “సైజు” పెరిగే కొద్దీ ఆ బణువుని చల్లార్చి ద్రవీకరించటం తేలిక. హిమాలయా పర్వత శిఖరాగాల మీద చలికి ప్రొపేను ద్రవంగా మారుతుంది. బ్యుటేనుని ద్రవీకరించాలంటే ఏ సిమ్లా లాంటి ప్రదేశానికో చలికాలంలో తీసికెళితే చాలు. ఈ నాలుగు వాయువులు ఏయే ఉష్ణోగ్రతల దగ్గర ద్రవరూపం నుండి వాయు రూపంలోకి మారతాయో ఈ దిగువ పట్టికలో చూపెడుతున్నాను.

పట్టిక 1.


Name Formula BoilingPoint (C) State at 25 C
methane CH4 -164 gas
ethane C2H6 -88.6 gas
propane C3H8 -42.1 gas
butane C4H10 -0.5 gas


ప్రొపేను, బ్యుటేనులు అగ్గిపుల్ల వేస్తే మండుతాయి. కనుక వీటిని కూడ వంటలకి వాడవచ్చు. ఆ మాట కొస్తే మన ఊళ్ళల్లో గేస్ సిలిండర్లు అమ్ముతారు కదా. వాటిల్లో మెతేను, ఎతేను, ప్రొపేను, బ్యుటేను ల మిశ్రమం ఉంటుంది. వాహనాల్లో ఇంధనంగా వాడినప్పుడు ప్రొపేనుని ద్రవీకరించి, సిలిండర్లలో నింపి, తోడ తీసుకెళతారు. ఇటువంటి సందర్భాలలో దీనిని liquid petroleum gas (LPG) అంటారు. చదువరులు LPG సిలిండర్లు అన్న పేరు వినే ఉంటారు. సిగరెట్లు అంటించుకుందికి వాడే “లైటర్లు” లో సాధారంగా బ్యుటేను వాడతారు. ఎందుకంటే బ్యుటేను వాడకం ప్రొపేను అంత ప్రమాదం కాదు. ప్రొపేను పీపాలు వంట గదుల్లో పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. పంట్లాం జేబులో ఉన్న లైటర్ పేలిపోతే ప్రమాదం కదా; అందుకని బ్యుటేన్ వాడతారు.


ఏ ఇంధనం అయినా సరే మన అదుపులో ఉండి కాలినంత సేపూ పరవాలేదు; అదుపు తప్పితేనే ప్రమాదం. ఈ తేడా సోదాహరణంగా చెబుతాను. తాటేకు మంటకీ పొయ్యిలో కర్రల మంటకీ తేడా లేదూ? కర్ర “నిలచి” కాలుతుంది. తాటేకు చరచర కాలేసి ఆగిపోతుంది. అందుకనే కర్రల మోపు (కట్టెల మోపు) కొనుక్కోటానికి ఆదివారం సంతకి వెళ్ళే ముందు మా నాన్నగారు, చెప్పేవారు: “అబ్బాయీ, నిలచి కాలే కర్ర ఎంపిక చెసి మరీ కొను, అర్ధణా డబ్బులు ఎక్కువయినా పరవా లేదు.” ఇలా నిలచి కాలే గుణం కర్రలకే కాదు, ఇంధన వాయువులకి కూడ ఉంది. ఈ లక్షణం అర్ధం చేసుకోటానికి ఒక సారి బ్యూటేను నిర్మాణక్రమం పరిశీలిద్దాం. బ్యూటేను సాంఖ్యక్రమం C4H10 కదా. ఈ నాలుగు కర్బనపు అణువులని, పది ఉదజని అణువులని, మన నిబంధనలకి తలఒగ్గుతూ, ఎన్నో విధాలుగా అమర్చ వచ్చు. వాటిల్లో రెండు అమరికల్ని బొమ్మ 3 లో చూపిస్తాను.
బొమ్మ 3 a. నార్మల్ బ్యూటేన్

బొమ్మ 3 b. ఐసోబ్యూటేన్


బొమ్మ 3 a లో చూపించిన నార్మల్ బ్యూటేన్ (normal butane) లో కర్బనపు అణువులు అన్నీ బారుగా ఒకే వరుసలో ఉన్నాయి. అంటే, ఈ గొలుసు తిన్నగా ఉంది. ఇటువంటి తిన్ననైన అమరిక ఉన్న బణువుల పేరు ముందు “నార్మల్” (సాధారణ) అనే విశేషణం చేర్చుతారు. మనం నాటు భాషలో చెప్పుకోవాలంటే “మామూలు బ్యూటేను”. ఇప్పుడు బొమ్మ 3 b లో ఉన్న అమరిక ని చూడండి. ఇక్కడ మూడు కర్బనపు అణువులు తిన్నగా ఉన్నాయి. మధ్యలో ఉన్న C నుండి కిందకి దిగి ఒక -CH3 గుంపు ఉంది. రిక్త హస్తాలన్నిటికి ఒకొక్క ఉదజని ఉంది. ఇటువంటి అమరిక ఉన్న బణువుల పేరుకి ముంది “ఐసో” అనే విశేషణం చేర్చుతారు. కనుక బొమ్మ 3 b లో ఉన్న పదార్ధం ఐసొబ్యుటేను (isobutane). “నార్మల్” అన్న పూర్వ ప్రత్యయం ఉన్న ఇంధనాలు గబగబ తాటేకులా కాలిపోతాయి. “ఐసో” అన్న పూర్వ ప్రత్యయం ఉన్న ఇంధనాలు నిలచి కాలుతాయి. ఎందుకు అని అడగకండి. అవన్నీ చెప్పటానికి చోటు లేదు. కాలేజీలో కెమెస్ట్రీ చదవండి. అర్ధం అవుతుంది.

ఈ అంశం వదలే లోపుగా మరొక్క మాట. ఈ జాతి ఉదకర్బనాల సాంఖ్యక్రమాలు మరొక్క సారి చూడండి. CH4, C2H6, C3H8, C4H10… ఈ బాణీలో ఉన్నాయి కదా. వీటన్నిటిని కలిపి CnH2n+2 అని ఒకే ఒక పెట్టున రాయవచ్చు. ఇక్కడ n = 1 అయినప్పుడు CnH2n+2 = C1H4 = మెతేను, n = 2 అయినప్పుడు CnH2n+2 = C2H6 = ఎతేను, n =3 అయినప్పుడు CnH2n+2 = C3H8 = ప్రొపేను, అలా వెళుతుంది. కనుక ఈ పరంపర లో ఉన్న ఉదకర్బనాలన్నిటిని కలిపి CnH2n+2 అని రాస్తూ ఉంటారు.

3. ఉదకర్బనపు గొలుసుల పేర్లు, వాటిలో బాణీలు

ఇంతవరకు ఒకటి నుండి నాలుగు వరకు కర్బనపు అణువులు ఉన్న బణువుల గురించి ముచ్చటించుకున్నాం.. వాటి పేర్లు మెతేను, ఎతేను, ప్రొపేను, బ్యుటేను అని చెప్పేను. ఇవన్నీ పాత కాలపు పేర్లు. క్రమేపీ ఈ రకం కర్బనపు గొలుసులని ఎంత పొడుగాటివైనా కట్టొచ్చని అర్ధం అయింది. అంటే 5, 6, … 10, 15,…. కర్బనపు అణువులతో, అలా, ఎంత పెద్ద గొలుసునైనా కట్టవచ్చన్న మాట. వీటన్నిటికీ పేర్లు పెట్టటం అంటే మజాకానా? పెట్టినా వాటిని గుర్తుపెట్టుకోవటం ఇంకా కష్టం. మిధునం కథలో బుచ్చిలక్ష్మికి పుచ్చపాదు కాపులా పిల్లలు పుట్టుకొస్తూ ఉంటే అప్పదాసు పిల్లల పేర్లకి తడుముకోవటం ఎందుకని కేశవనామాలు అందుకున్నాడని శ్రీరమణ చమత్కరిస్తాడు. ఏదీ కేశవనామాలు తప్పులు లేకుండా ఎంతమంది క్రమంలో చెప్పగలరో చూడండి! కనుక పుంఖానుపుంఖంగా పేర్లు పెట్టవలసి వచ్చినప్పుడు కేశవనామాల కంటె తేలిక పద్ధతి కావాలి.

ఈ సాధక బాధకాలు అర్ధం అయేసరికి శాస్త్రవేత్తల విషయ పరిజ్ఞానం కూడ పెరిగింది. రసాయనాల పేర్లు ఆషామాషీగా పెట్టేయకుండా ఒక క్రమ పద్ధతిలో పెడితే తప్ప పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించి ఒక పద్ధతి కనిపెట్టేరు. ఈ పద్ధతి లోని ముఖ్య అంశం ఏమిటంటే - ఉదకర్బనాల పేర్ల విషయంలో - పేరు చెప్పగానే అందులో ఎన్ని కర్బనపు అణువులు ఉన్నాయో తెలిసేలా ఉండాలన్నారు. అంతే కాకుండా ఏ పదార్ధం ఏ రసాయన వంశానికి (జాతికి) చెందిందో తెలపటానికి ఒక “ఇంటిపేరు” లాంటిది ఉండాలన్నారు. ఉదాహరణకి తెలుగు వాళ్ళల్లో బ్రాహ్మణులంతా “శాస్త్రి” అన్న తోకని, క్షత్రియులంతా “రాజు” అన్న తోకని, వైశ్యులంతా “సెట్టి” అన్న తోకని, కమ్మలంతా “చౌదరి” అన్న తోకని, మాలలు “మాల” తోకనీ, మాదిగలు, “మాదిగ" తోకనీ అలా, అంతా తలో తోక పేరుని పెట్టిన పేరుకి తగిలించుకుంటే ఈ ముసుగులో గుద్దులాటలు ఉండవు కదా; అలా అన్న మాట.

ఇప్పుడు చూడండి! మెతేను (methane), ఎతేను (ethane), ప్రొపేను (propane), బ్యుటేను (byutane) – ఈ నాలుగూ “-ఏను” (ఇంగ్లీషులో -ane) శబ్దంతో అంతం అవుతున్నాయి కదా. కనుక ఈ “ఏను” ని ఈ జాతి పేరుగా వాడుకోమన్నారు. ఈ పద్ధతిలో అయిదు కర్బనపు అణువులు ఉన్న ఉదకర్బనం పేరు “పెంటా + ఏను = పెంటేను” (penta + ane = pentane) అవుతుంది. మెతేను పేడ, వగైరాల లోంచి పుట్టినట్లే పెంటేను పెంట మీద పుట్టలేదండోయ్! గ్రీకు భాష లో “పెంటా” అంటే ఐదు; మన సంస్కృతంలోని “పంచ” కి జ్ఞాతి పదం. కనుక ఒక వేళ నాలాంటి ఛాందసులు తెలుగు పేరు పెట్టాలని సరదా పడితే, "పెంటేను" (pentane) తెలుగులో “పంచేను” అవుతుంది. ఇలాగే ఆరు కర్బనపు అణువులు ఉన్న ఉదకర్బనం పేరు షష్టేను, లేదా ఇంగ్లీషులో హెక్సేను (hexane). ఇదే ధోరణిలో ఏడు కర్బనపు అణువులు ఉన్నది "హెప్టేను" (heptane) లేదా తెలుగులో సప్తేను. అటుతరువాత అష్టేను (octane), నవేను (nonane), దశేను (decane), ఏకాదశేను (undecane), ద్వాదశేను (dodecane), త్రయోదశేను, మొదలైన పేర్లని తడుముకోకుండా పుట్టించవచ్చు. ఈ పేర్లు ఇదే బాణీలో పెట్టాలని జినీవాలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ముఖ్యమైన అంశం పేరు లోని చివరి భాగం - అనగా ఇంటిపేరు - యొక్క ఉచ్చారణ, వర్ణక్రమమూను. కనుక మనం ప్రస్తుతం ప్రస్తావిస్తూన్న ఉద కర్బనాల జాతి పేర్లు అన్నీ "-ఏను" (-ane) శబ్దంతో అంతం అవ్వాలి. అదీ నియమం. అదీ ఒప్పందం.

ఇంటిపేరు ఖరారు అయింది కనుక ఇక పెట్టిన పేరు సంగతి చూద్దాం. బణువులో ఎన్ని కర్బనపు అణువులు ఉన్నాయో ఆ సంఖ్య పెట్టిన పేరుని నిర్ణయిస్తుంది. అప్పుడప్పుడు ఒక కర్బనపు అణువు తిన్నటి వరసలో ఇమడకుండా ఒక పక్కకి జారుకుంటుంది. ఇటువంటి సందర్భాలలో మనం “వెంకట”, “నాగ” అని మన పేర్లకి పూర్వ ప్రత్యయం చేర్చినట్లే ఇక్కడ “నార్మల్” (normal), “ఐసొ” (iso) వంటి ప్రత్యయాలు చేర్చుతారు. ఈ విధంగా వచ్చిన పేర్లే “నార్మల్ బ్యూటేన్” (normal butane), “ఐసొబ్యుటాన్” (isobutane), ఐసొఆక్టేన్ (iso-octane), “నార్మల్ హెప్టేన్” (normal heptane) మొదలైన పేర్లు. వీటి గురించి సందర్భం వచ్చినప్పుడు ఇంకా తెలుసుకుందాం.

జినీవా ఒప్పందం జరిగే వేళకి మొదటి నాలుగు ఉదకర్బనాల పేర్లు అప్పటికే వాడుకలో స్థిరపడిపోయాయి. ఈ అలవాటుని మార్చి అన్ని పేర్లనీ ఒక తాటి మీదకి తీసుకురావటానికి ఎంత ప్రయత్నించినా ప్రజలలో పాత అలవాట్లు పోవటం లేదు. చూడండి, మన తెలుగు వాళ్ళకి ఉగ్గుపాలతో ఇంగ్లీషు అబ్బేసింది కనుక తెలుగులో మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా - దీని తస్సాగొయ్యా - ఆ ఇంగ్లీషు మాటలే స్పురణకి వస్తాయి; అలాగన్నమాట!

4. వేమన కాలంలో ఆధునిక రసానాల పేర్లు ఎలా పెట్టుండేవారో?


మన తెలుగు వాళ్ళల్లో రసాయనశాస్త్రం మీద మిక్కుటంగా పరిశోధన చేసినది యోగి వేమన. సువర్ణయోగం సిద్ధిస్తుందేమోనని విపరీతంగా కృషి చేసేడు వేమన. ఇప్పుడు కాలయంత్రం (time machine) లో మనం ఒక సారి వేమన కాలానికి వెళదాం. ఆ రోజులలోనే కర్బన రసాయనపు పోకడలు మనవారికి అర్ధం అయి పోయేయని ఒక సారి ఊహించుకుందాం. ఇది కేవలం ఊహా చిత్రణ మాత్రమే. సరదాకి రాస్తున్నాను. వేమన 14 వ శతాబ్దం వాడని అంటారు కనుక బెర్‌జీలియస్ కంటె నాలుగైదు శతాబ్దాల ముందువాడు. ఆ రోజుల్లో ఈ పరిశోధన జరిగుంటే మనం ప్రస్తావిస్తూన్న రసాయనాల పేర్లు ఈ దిగువ విధంగా ఉండి ఉండేవి.

(క) మెతేను. ఒక (ఏక) కర్బనపు అణువు. ఉదకర్బనాల పేరు "-ఏను" ధాతువుతో అంతం అవాలి. కనుక ఏక + ఏను = ఏకేను.

(చ) ఎతేను. రెండు (ద్వ) కర్బనపు అణువులు. ఉదకర్బనాల పేరు "-ఏను" ధాతువుతో అంతం అవాలి. కనుక ద్వ + ఏను = ద్వయేను.

(ట) ప్రొపేను. మూడు (త్ర) కర్బనపు అణువులు. ఉదకర్బనాల పేరు "-ఏను" ధాతువుతో అంతం అవాలి. కనుక త్ర + ఏను = త్రయేను.

(త) బ్యుటేను. నాలుగు (చతుర్ధ) కర్బనపు అణువులు. ఉదకర్బనాల పేరు "-ఏను" ధాతువుతో అంతం అవాలి. కనుక చతుర్ధ + ఏను = చతుర్ధేను.

ఈ పద్ధతిలో సొగసు ఏమిటంటే ఈ వంశానికి చెందిన ఏ పదార్ధానికైనా ఇట్టే పేరు పెట్టవచ్చు. ఉదాహరణకి 14 కర్బనపు అణువులు 34 ఉదజని అణువులు ఉన్న పదార్ధం పేరు చతుర్దశేను.

ఈ పేర్లు చదువుతూ ఉంటే తిథులు జ్ఞాపకం రావటం లేదూ? ఈ కాలంలో కాన్వెంటు చదువులు వెలగబెట్టిన మన పిల్లలకి తిథుల పేర్లు ఎలాగూ తెలియవు కనుక, కనీసం రసాయనశాస్త్రం వంకతో తిథుల పేర్లు నేర్పించవచ్చు. కాని మన తిథుల పేర్లు మొదట్లో “ఏక”, “ద్వ”, “త్ర” మొదలైన పూర్వప్రత్యయాలతో మొదలవకుండా, పాడ్యమి, విదియ, తదియ, చవితి అని మొదలవుతాయి. కనుక మెతేనుని పాడేను, ఎతేనుని విదేను, ప్రొపేనుని తదేను, అని అన్నా అనొచ్చు. కృషితో నాస్తి దుర్బిక్షం! ప్రయత్నించి చూస్తే కాని ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు. ప్రయోగం ఫలించకపోతే మనకి ఇంగ్లీషువాడు పెట్టిన బిక్ష ఎలానూ ఉంది.

కృతజ్ఞత: ఈ వ్యాసంలో బొమ్మలు వేసినది ప్రసాదం,
బ్లాగే స్థలం: http://prasadm.wordpress.com/

1 comment: