Sunday, January 11, 2009

ఆరువందల వేల కోట్ల రూపాయలు - 1

జనవరి 2009

ఈ మధ్య ఏ పత్రిక తిరగేసి చూసినా ప్రభుత్వ, వ్యాపార రంగాలలో డబ్బు ఖర్చుల విషయం వచ్చేసరికి ఆరువందల వేల కోట్లు, 3,30,000 కోట్లు మొదలైన మాటలు తరచు వినిపిస్తున్నాయి. నేను చిన్నప్పుడు ఇరవై తొమ్మిది తరువాత "ఇరవై పది, ఇరవై పదకొండు, ఇరవై పన్నెండు అని లెక్కెట్టెస్తూ ఉంటే మా అన్నయ్య నా మూతి మీద వాత వేస్తానని బెదిరించేడు. ఇప్పుడు ఎవ్వరు, ఎవరి మూతి మీద ఏమి వెయ్యాలన్నది ప్రశ్న.

నేను చిన్నప్పుడు లెక్కలు చదువుకున్నప్పుడు లెక్కింపు పద్ధతి ఈ విధంగా వెళ్ళేది: ఒకట్లు (1), పదులు (10), వందలు (100), వేలు (1000), పదివేలు (10,000), లక్ష (1,00,000), పది లక్షలు (10,00,000), కోటి (1,00,00,000) పదికోట్లు (10,00,00,000). లెక్క ఇక్కడ ఆగిపోయేది. ఆ పైన లెక్క పెట్టవలసిన అవసరం అంతగా ఉండేది కాదు కనుక. ఆ రోజుల్లో లక్షాధికార్లు గొప్పవాళ్ళు; కోటీశ్వరులు నూటికో, కోటికో ఒకడు ఉండేవాడు. ఇప్పుడు లంచాలే కోట్ల మీద ఉన్నాయేమో అసలు ఖర్చులు గురించి మాట్లాడాలంటే ఇంకా పెద్ద సంఖ్యల అవసరం ఉంటుంది కనుక ఈ విషయాన్ని మరొక సారి పరిశీలిస్తే బాగుంటుందని నా మనవి.

ప్రతీ విషయాన్నీ సైన్సు కోణం నుండి పరిశీలించి, కోడిగుడ్డుకి ఈకలు పీకి, అందరి చేతా అక్షతలు వేయించుకోవటం నాకు అలవాటయిపోయింది. పైన చూపెట్టిన సంఖ్యల పేర్లు చూడండి. ఒకటితో మొదలు పెట్టేం. తరువాత ఒకటి పక్క సున్న తగిలించిన వెంబడి వచ్చిన 10 ని "పది" అన్నాం. (ఈ 10 ని శాస్త్రంలో 101 అని రాస్తారు.) ఒకటి పక్క రెండు సున్నలు తగిలించిన తరువాత కొత్త పేరు తయారు చేసి "వంద" అన్నాం. (ఈ 100 ని శాస్త్రంలో 102 అని రాస్తారు.) ఒకటి తరువాత మూడు సున్నలు వస్తే మరొక కొత్త పేరు - "వెయ్యి" - పెట్టేం. (ఈ 1000 ని శాస్త్రంలో 103 అని రాస్తారు.) వెధవ సున్నలు అలా వస్తూ ఉంటే కేశవ నామాలలా ఎన్ని పేర్లని పెడతాం? అందుకని వెయ్యి తరువాత సున్న చేర్చినప్పుడు కొత్త పేరు పెట్టకుండా "పది" అనే పూర్వ ప్రత్యయం తగిలించి "పది వేలు" (10,000 లేదా 104) అని పాత పేరునే మళ్ళా వాడేం. ఇప్పుడు మరొక సున్న తగిలించినప్పుడు "వంద వేలు" (ఈ వాడుక లేకపోలేదు) అనకుండా "లక్ష" అని కొత్త పేరు పెట్టేం. (1 లక్ష = 105). ఆ తరువాత "పది" చేర్చి "పది లక్షలు" అని "లక్ష" ని తిరిగి వాడేం. (10 లక్షలు = 106). ఆ పైన మరొక కొత్త పేరు - కోటి - పెట్టేం. (1 కోటి = 107). తరువాత "పది కోట్లు" (= 108).

ఈ బాణీ ప్రకారం నూరు కోట్లని "నూరు కోట్లు" (= 109) అనకుండా కొత్త పేరు పెట్టాలి. కాని నాకు తెలుసున్నంత వరకు మనకి "నూరు కోట్లు" కి, "వెయ్యి కోట్లు" (=1010) కీ కొత్త పేర్లు లేవు; “కోటి” నే recycle చేసేరు. "పదివేల కోట్లు" (= 1011) ని "అర్బుదం" అంటారు.

ఇక్కడనుండి మళ్ళా బాణీ మారుతుంది. అర్బుదం తరువాత మరొక సున్న తగిలించినప్పుడల్లా "మహా" అనే పూర్వ ప్రత్యయం చేర్చటం, రెండు సున్నలు చేర్చినప్పుడు కొత్త పేరు పెట్టటం చేసేరు, మన వాళ్ళు. ఈ పద్ధతిలో అర్బుదం తరువాత "పది అర్బుదాలు" కాకుండా "మహార్బుదం" (= 1012) వస్తుంది. మరొక సున్న చేర్చినప్పుడు ఖర్వం (= 1013), తరువాత మహా ఖర్వం (=1014), పద్మం (=1015), మహా పద్మం (=1016) , మొదలైనవి.

మన భారతీయ పద్ధతి వాడ దలుచుకుంటే "ఆరువేల కోట్ల రూపాయలు" (60,00,00,00,000 = 6x1010) అన్న ప్రయోగం సరి అయినదే అనిపిస్తున్నాది. కాని 3,00,000 కోట్ల రూపాయలు అంటే 3x1012 లేదా 3 మహార్బుదాల రూపాయలు.

ఇప్పుడు ఒక ప్రశ్న, రెండు గమనికలు.

ప్రశ్న: లక్ష రూపాయలు ఉన్నవాడిని లక్షాధికారి అంటాం కదా. కోటి ఉన్నవాడిని కోటీశ్వరుడు అంటాం. అర్బుదం రూపాయలు ఉన్నవాడిని ఏమనాలి? "అధికారి, ఈశ్వరుడు" కాకుండా మరొక ఉత్తర ప్రత్యయం కావాలి. ఏమంటే బాగుంటుందో చెప్పండి.

గమనిక 1: తెలుగులో బహువచనం వాడినప్పుడు "లక్షలు," "కోట్లు," "మిలియన్లు," "బిలియన్లు" వగైరా అంటాం. కాని ఇంగ్లీషులోకి అనువాదం చేసినప్పుడు lakhs, crores, millions, billions అనరు; lakh, crore, million, billion అనే అంటారు. "నాలుగు లక్షల రూపాయలు" అన్న పదబంధాన్ని "four lakh rupees" అనే అనాలి. అలాగే "పది మిలియన్ల డాలర్లు" ని "ten million dollars" అనే అనాలి. కాని "లక్షల కొద్దీ లంచాలు ఇచ్చుకున్నారు" అన్నప్పుడు మాత్రం lakhs of rupees were spent in bribes అనాలి. "మిలియన్ల డాలర్లు వృధా చేసేరు" అన్న దానిని "millions of dollars were wasted" అని అనువదించాలి. ...అని నేను అనుకుంటున్నాను. ఇందులో తప్పుంటే తెలియజెయ్య గలరు.

గమనిక 2: మన బాణీ వెయ్యి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి, పది కోట్లు .. అలా వెళ్ళాలంటే “వందకోట్లు” అనకుండా ఒక కొత్త పేరు పెట్టాలి. దానికి, మాటవరసకి, “నిఖర్వము” అని పేరు పెట్టేమనుకుందాం. అప్పుడు …కోటి, పదికోట్లు, నిఖర్వం, పది నిఖర్వాలు, అర్బుదం, మహార్బుదం, అలా బాణీ వెళుతుంది. అప్పుడు “పది వేలు” ని "మహా వెయ్యి” అనిన్నీ, పది లక్షలని “మహా లక్ష” అనిన్నీ, పదికోట్లని “మహా కోటి” అనిన్నీ అనవలసి వస్తుంది. ఏమంటారు?
ఎందుకొచ్చిన గొడవ, “శుబ్బరంగా” ఇంగ్లీషు మాటలు వాడేసుకుందామంటారా.

దీనిలో ఉన్న కష్టసుఖాలు తరువాయి బ్లాగులో………

6 comments:

  1. Kodiguddu ki eekalu baagane peekaaru Saaru...
    :-)
    Akshatalu maatram... eppudu naa pedavulapi viraboosina chirunavvule.. ;-)

    Chitramina English collective nouns (lakh, billion etc) ni dimma dirige laa enkaa cheppalante mind blank ayipoye laaa peeki vippi chooparu saaru :-)

    ReplyDelete
  2. అర్బుదం రూపాయలు ఉన్నవాడిని ఏమనాలి?

    అర్బుకుడు. :)

    అర్బుదమంతుడు, ఖర్వమంతుడు, పద్మవంతుడు అని ఇప్పుడే అనేసుకుంటే ప్రత్యయాలకోసం తర్వాత వెతుక్కునే పనుండదు. (మంతుడు అన్నది ఎలాగూ 'ఉన్నవాడు' అన్న అర్థాన్నిస్తుంది)

    ఇక గమనిక రెండులో, వెనక వాటి (కోటి మరియు అంతకంటే తక్కువవి) బాణీలు మార్చడమెందుకు? అంటే, పది కోట్లని మహా కోటి అనవలసిన అవసరం ఏమిటి? అన్నీ ఏకరూపంగా ఉండాలనా?

    పవర్‌ని superscirptగా (శీర్షాక్షరాల్లో/పైరాతగా) రాయడానికి 10<sup>4</sup> అని HTML కోడు వాడవచ్చు.

    ReplyDelete
  3. అర్బుదేంద్రుడు ఎలా ఉందండి?

    ReplyDelete
  4. వీవెన్

    పెద్ద చిక్కే వచ్చింది.

    నేను ఇక్కడ HTML tag తో comment post చేద్దామని ప్రయత్నిస్తే HTML tag not allowed అని warning వస్తోంది. మరి ఈ పని మీరు ఎలా చేసేరు?

    మీ సలహాని ప్రయత్నిస్తే లేఖిని అనుకున్నట్లు పని చెయ్యలేదు. sup, math రెండూ ప్రయత్నించేను. తెలుగు వికీలో ప్రయత్నించి చూసేను. అక్కడ పని చేసింది.

    నేను ఏదో తప్పు చేస్తూ ఉండుండాలి, లేదా లేఖిని పనిచేసే విధానం, వికీ పనిచేసే విధానంలో ఏదో తేడా ఉందేమో, మరి. వివరించగలరు!

    ReplyDelete
  5. వేమూరిగారూ ఈ మధ్య ఇటువైపు చూడలేదు. అందుకే ఆలస్యం.

    ఇక్కడ ఈ వ్యాఖ్య రాసే పెట్టెలో HTML ట్యాగులని అనుమతించదు. నేను రాసినది ట్యాగులా కాకుండా, కేవలం అలా కనిపించే విధంగా రాసానంతే. < మరియు > లను అలానే టైపు చేస్తే అప్పుడు అది HTML ట్యాగు అవుతుంది. కలనయంత్రం దాన్ని కోడు అనుకోకుండా ఉండటానికి &lt; మరియు &gt; అని టైపు చేసాను.

    లేఖినిలో కేవలం సాదాపాఠ్యాన్ని (plain text) మాత్రమే పొందగలం. కనుక అక్కడ పనిచెయ్యదు. వికీ అయితే, HTML ట్యాగులను గుర్తిస్తుంది మరియు అనుమతిస్తుంది కూడా అందుకే అక్కడ పనిచేసింది.

    ఇక మీకు ఇక్కడ మీ టపాలో పనిచేయాలంటే (వ్యాఖ్యల్లో నియంత్రించాడు కాబట్టి పనిచేయదు), ఈ బొమ్మలో చూపినట్టు చేయండి.

    ReplyDelete