Monday, June 6, 2016

మేఘ కలనం

నన్నడిగితే కంప్యూటర్  రంగంలో ఉన్న వాళ్లంతా సంస్కృతం నేర్చుకుని కాళిదాసు రాసిన రఘువంశం చదవాలంటాను. కనీసం అందరూ మొదటి శ్లోకం చదివి, అర్థం ఒంటబట్టించుకుని ఉండుంటే  మనందరం  ఇటివల కాలంలో పడుతూన్న యమయాతన తప్పేది అంటాను. లేకపోతే ఏమిటి చెప్పండి? నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉందో  మేఘ కలనం (క్లౌడ్ కంప్యూటింగ్, cloud computing) లో మేఘాల పాత్రా అంతే ఉంది.

ఇంతకీ కాళిదాసు ఏమన్నాడో చెప్పనియ్యండి.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే | జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥

ఈ శ్లోకానికి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న అర్థం:  “పార్వతీ పరమేశ్వరులు ఎలా విడదీయరాని బంధంతో (అర్థనారీశ్వర రూపంలో) ఉన్నారో అదే విధంగా మాటకి (వాక్కుకి), దాని అర్థానికి విడదీయరాని బంధం ఉండేలా చూడు నాయనా” అని ప్రార్థిస్థున్నాడు.

కంప్యూటర్ రంగంలో పని చేసేవారు కూడ “మేము మాట్లాడే మాటకి, దాని అర్థానికి కాసింత అయినా సంబంధం (some బంధం) ఉండేటట్లు చూడు మహానుభావా!” అని ప్రార్థించి ఉండుంటే మనకి ఈ తిప్పలు ఉండేవి కావు. అందుకనే “నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉందో  మేఘ కలనంలో మేఘాలు కూడ అన్నే ఉన్నాయని విన్నవించుకుంటున్నాను.

మరయితే ఈ  పేరు ఎలా వచ్చింది? చిన్న ఉపమానం చెబుతాను. ఏదో ఒక యంత్రం నిర్మించే ప్రయత్నంలో ఉన్నామనుకుందాం. మన ఊహ మరొకరికి చెప్పడానికి కాగితం మీద రకరకాల పళ్ల చక్రాలు గీసి వాటి చుట్టూ ఒక సున్నా చుట్టి పక్కన పెట్టేం అనుకుందాం. ఆ చుట్టూ చుట్టిన సున్న ఒక మేఘంలా ఉంటుంది కదా (బొమ్మ చూడండి). కనుక అందాకా ఆ యంత్రాన్ని  “మేఘ యంత్రం" అని మనం పిలవచ్చు. మేఘ కలనం అన్న పదబంధం అలానే పుట్టింది. మన ఆలోచనలోఉన్న కలన యంత్రాల భాగాలన్నిటిని ఒక చోట చేర్చి, వాటి చుట్టూ ఒక సున్నా చుట్టి, ఆ సున్నాలో ఉన్న కలన యంత్రాంగాన్ని అంతటినీ కలిపి మేఘం అనడం మొదలు పెట్టేరు.

cloud.png

బొమ్మ. ఒక యంత్రం రూపకల్పన చేస్తున్నప్పుడు చిత్తుగా గీసుకున్న “మేఘ యంత్రం" బొమ్మ.

ఇంతకీ మేఘ కలనం అంటే ఏమిటి? నా చిన్నతనంలో మా ఊళ్లో ఒక టూరింగు  టాకీస్ ఉండేది. దానిని నడపడానికి పాక లాంటి కట్టడం వెనక ఒక డైనమో ఉండేది. ఊళ్లో విద్యుత్ సరఫరా ఉన్నా, లేకపోయినా ఆ సినిమా హాలులో ఎప్పుడూ విద్యుత్తు ఉండేది. మా స్నేహితులొకరు - కొంచెం సామంతులు - పెరట్లో డైనమో పెట్టుకుని ఇంట్లో విద్యుత్ దీపాలు వెలిగించుకునేవారు. పెరట్లో స్వంత  డైనమో పెట్టుకునే తాహతు లేక మేము ఊళ్లోకి కరెంటు వచ్చే వరకు ఆగవలసి వచ్చింది. ఇదే విధంగా అందరూ స్వంతంగా కంప్యూటర్లు కొనుక్కోలేకపోవచ్చు. కొనుక్కున్నా కావలసిన హంగులన్నీ ఆ కంప్యూటరులో ఉండకపోవచ్చు. ఉన్న హంగులన్నీ మన అవసరాలకి పనికిరాకపోవచ్చు. నిజానికి మన ఇళ్ళల్లో ఉండే ఉరోపరు (laptop) లలో ఉన్న హంగులలో 10 శాతం వాడతామేమో. మిగిలిన హంగుల మీద  అనవసరంగా డబ్బు తగలేస్తున్నామేమో.  అవసరం మేరకి విద్యుత్ శక్తిని వాడుకున్నట్లే అవసరం మేరకి మాత్రమే కలన శక్తిని వాడుకుంటేనో. అప్పుడు పెరట్లో ఖరీదైన డైనమో పెట్టుకున్నట్లు ప్రతి ఇంట్లోనూ ఖరీదైన కంప్యూటరు అక్కరలేదు. విద్యుత్తుని వాడుకున్నట్లే “యూనిట్” కి ఇంత అని జమ కట్టి కలన శక్తిని కూడ వాడుకోవచ్చు కదా. అప్పుడు కంప్యూటరు ఒక్కంటికి రెండు వేల డాలర్లు (లక్ష రూపాయలు) చొప్పున గుమ్మరించి మదుపు పెట్టక్కర లేదు. అవసరం వచ్చినప్పుడు దీపం  వేసుకుని, అవసరం తీరిపోగానే దీపం ఆర్పేసినట్లు అవసరం ఉన్నప్పుడే కలన శక్తిని వాడుకునే సదుపాయం ఉంటే దానిని మేఘ కలనం అంటారు. ఈ  సందర్భంలో కంప్యూటరు ఎక్కడ ఉంది? ఎక్కడో ”మేఘం” లో ఉంది అంటారు. అంటే, కంప్యూటరు ఎక్కడుందో అనే ప్రస్తావన మనకి అనవసరం! ఎక్కడో ఉన్న కలన సదుపాయాలని మనం అంతర్జాలం ద్వారా అందుకుని వాడుకుంటాం. ఇలా ఎక్కడో ఉండి మనకి పరిచర్యలు చేసే కంప్యూటర్ ని పరిచారిక (server) అంటారు. ఈ  రకం పరిచారికల గురించి గతంలో ఒక బ్లాగులోచర్చించేను.

కనుక మేఘ కలనం అంటే ఏమిటి? అంతర్జాలంలోఎక్కడో ఉన్న పరిచారికల గుంపు  (group  of servers) ని ఉమ్మడిగా ఉపయోగించుకుంటూ అనేకులు  కలన కార్యక్రమాలని కొనసాగించే వెసులుబాటు ఉన్న పద్ధతి. ఈ  పద్ధతి అప్పుడే మనం వాడుకుంటున్నాం. ఇ-టపా, డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్ వంటి సదుపాయాలు మనలోచాలమందికి తెలుసుకదా. ఇవన్నీ మేఘ కలనానికి ఉదాహరణలే.

No comments:

Post a Comment