Thursday, October 29, 2015

హార్డ్^వేరు, సాఫ్ట్^వేరు, ప్రోగ్రాము

నా పరిచారికల మీద స్పందించినవారికి, ఇంకా స్పందిస్తున్న వారికీ, స్పందించబోయే వారికీ నా జేజేలు. స్థూలకాయం అంటే మరీ "ఒబీజ్^" గా ఉందని ఒకరు అన్నారు. ఆ స్పందన మీద స్పందిస్తూ మరికొంత మంది ప్రతిస్పందించేరు. వారందరికోసం ప్రత్యేకంగా రాసిన బ్లాగు ఇది. అక్షరాలు ఇంకా పెద్దవిగా చెయ్యమని ఒకరు అడిగేరు. అందుకని ప్రయోగాత్మకంగా ఈ
పేరాలో అక్షరాల సైజు పెంచి చూస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి!

సమానార్థకమైన తెలుగు మాటలు వెతికే సందర్భంలో  నన్ను అమితంగా ఇబ్బంది పెట్టిన మాటలు కంప్యూటర్ రంగంలో కొల్లలుగా ఉన్నాయి. నేను 1968 లో, సైన్సు విషయాలు తెలుగులో రాయటానికి మొదటి సారిగా ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదట కొరకరాని కొయ్యగా ఎదురైన సమస్య హార్డ్^వేర్, సాఫ్ట్^వేర్, ప్రోగ్రాం (hardware, software, program) అనే ఈ మూడు మాటలకీ తెలుగు మాటలు ఏమిటన్న విషయమే! ఇప్పటివరకు ఇవి కొరుకుబడలేదంటే ఇవెంత కష్టమో మీరే ఆలోచించుకొండి.

నేను డాక్టరేట్ పట్టా కోసం పాటుపడే రోజులలోనే కలనయంత్రాల వాడుక విద్యాలయాల్లో పెరగటం మొదలయింది. ఆ రోజులలోనే తెలుగులో ‘కంప్యూటర్లు’ అనే పేరుతో ఒక పుస్తకం రాసి, దానిని ‘తెలుగు భాషా పత్రిక’ లో రెండున్నర ఏళ్ల పాటు ధారావాహికగా ప్రచురించేను. అప్పుడు హార్డ్^వేర్, సాఫ్ట్^వేర్, ప్రోగ్రాం (hardware, software, program) మొదలైన వాటికి తెలుగు మాటలు వెతుక్కుంటూ స్పెయిన్ నుండి వచ్చిన నా సహాధ్యాయి మిగెల్ ని, “ఒరేయ్ మిగెల్లూ, మీ భాషలో హార్డ్^వేర్ (hardware) ని ఏమంటారురా?” అని అడిగేను.

వాడు నా కంటె ఘనుడు. అడిగినదానికి సమాధానం చెప్పకుండా, “ఫెర్రాతెరియా” అంటే ఇనప సరుకులు అమ్మే కొట్టు అన్నాడు. అనేసి ఊరుకోకుండా, “ ‘ఫెర్రా’ అంటే ‘ఇనుము’, ‘తెరియా’ అంటే  ‘దొరికే చోటు’ ” అని అర్ధం చెప్పేడు. చెప్పి, “దీన్నిబట్టి ‘హార్డ్^వేర్’ (hardware) ని స్పేనిష్ భాషలో ఏమంటే బాగుంటుందో నువ్వే చెప్పు” అని ప్రశ్నని తిరగబెట్టేడు.

“అలాగయితే ‘కేఫిటేరియా’ అంటే కాఫీ దొరికే చోటు” అని మనస్సులో అనుకుని, “అలాంటప్పుడు ‘తెరియా’ అన్న తోక తగిలిస్తే ‘దొరికే చోటు’ అనే అర్థం ఎల్లప్పుడూ స్పురిస్తుందా?” అని అడిగేను. “అలా కాదు, కొన్ని మాటల తోకలో ‘తెరియా’ వస్తుంది, కొన్ని మాటల తోకలో ‘ఇయా’ మాత్రమే వస్తుంది అని చెప్పి, ఉదాహరణకి పశువుల దొడ్డిని ‘బకెరియా’ అంటారు అన్నాడు. ఇంత కథనం జరిగింది కాని హార్డ్^వేర్ ని వాళ్ల భాషలో  ఏమంటారో  చెప్పలేక పోయాడు. ఈ వ్యాసం రాస్తూన్నప్పుడు, ఈ సందేహం తీర్చుకుందుకి స్పేనిష్-ఇంగ్లీష్ నిఘంటువుని సంప్రదించేను. స్పేనిష్ లో హార్డ్^వేర్ ని కూడా ‘ఫెర్రతెరియా’ అనే అంటారు ట – ఆ నిఘంటువు ప్రకారం. అంటే స్పేనిష్ భాషలో ‘ఫెర్రతెరియా’ అంటే ఇత్తడి సామాను కొట్టు అయినా అవొచ్చు, ఇనప సామాను కొట్టు అయినా అవొచ్చు, కంప్యూటర్ హార్డ్^వేర్ అయినా కావచ్చు.

మనకి హిందీలో కూడ ఇలాంటి మాటలు ఉన్నాయి. ‘దవాఖానా’ అంటే మందుల కొట్టు. ‘దవా’ అంటే మందు, ‘ఖానా’ అంటే ‘దొరికే చోటు’. మీరు ‘జింఖానా’ అన్న మాట వినే ఉంటారు. పెద్ద పెద్ద ఊళ్లల్లో ‘జింఖానా క్లబ్బు’లు ఉంటాయి. ఈ జింఖానాకి దవాఖానాకి ఏమైనా బాదరాయణ సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కాని, ఈ జింఖానా అన్న మాట ఇంగ్లీషులోని “జిమ్నేజియం” (gymnasium) ని హిందీలోని ‘ఖానా’ ని సంధించగా వచ్చిందని నా అనుమానం. పరిశోధన పూర్తి అయింది కనుక ప్రస్తుత కర్తవ్యం ఆలోచిద్దాం.

మనకి ‘యంత్రము, తంత్రము, మంత్రము’ అన్న మాటలున్నాయి. వీటిని   తీసుకుని హార్డ్^వేర్ ని ‘యంతర్ ఖానా’ అనో, ‘జంతర్ ఖానా’ అనో అని, దానికి తోడుగా సాఫ్ట్^వేర్ (software) ని ‘తంతర్ ఖానా’ అని అనో “మంతర్ ఖానా” అనో అనొచ్చు. “ఇవి తెలుగు మాటలు కావే” అని మీకు సందేహం రావచ్చు. నిజమే. ఇంగ్లీషు మాటలకన్న ఈ మాటలు కొంచెం దేశవాళీగా లేవూ? కాకపోతే యంత్రము/ జంత్రంము హార్డ్^వేర్ కీ,  తంత్రము/ మంత్రము  సాఫ్ట్^వేర్ కీ వాడొచ్చు.

మా ఊళ్లో చెక్కా శ్రీరామ్మూర్తి అనే వర్తకుడికి ఒక ఇనప/ ఇత్తడి సామాను కొట్టు ఉండేది. దానిని చెక్కా వారి కొట్టు అనే వాళ్లం. కనుక స్పేనిష్ పధ్ధతి ప్రకారం హార్డ్^వేర్ ని చెక్కా అంటే ఎలా ఉంటుందో? కర్ర చెక్క గట్టిగా ఉంటుంది కూడ! చెక్కా  తో ప్రాస కుదిరే మాటని వెతుక్కుని సాఫ్ట్^వేర్ కి వాడుకోవచ్చు.

హిందీలో  ‘పూజా సామగ్రి’ వంటి మాటలు ఉన్నాయి. సామాను, సరుకు, సామగ్రి, సరంజామా, ఇవన్నీ “వేర్” (ware) అన్న శబ్ద ప్రత్యయానికి బదులు వాడొచ్చు. అప్పుడు ‘యంత్రసామగ్రి, తంత్రసామగ్రి’ అనో ‘యంత్ర సామాను, తంత్ర సామాను’ అనో రెండు జతల మాటలు వస్తాయి. వీటిని మరి కొంచెం సవరించి యంత్రాగ్రి, తంత్రాగ్రి అనో యంత్రమాను, తంత్రమాను అనో కుదించి వాడవచ్చు. (ఈ ధోరణిని నియంత్రించకుండా ఊరుకుంటే సంజ్ఞా వాచకాలయిన “మైక్రోసాఫ్ట్” (Microsoft)  కాస్తా సూక్ష్మతంత్రం, “పీపుల్ సాఫ్ట్” (Peoplesoft) ప్రజాతంత్రం అవుతాయంటారా? )

మిగిలిన భాషల వాళ్లు ఏమిటి చేస్తున్నారో అని కుతూహలం పుట్టింది. రష్యా భాషలో “హార్డ్^వేర్” ని “అపరాత్ స్రెద్^స్త్వ”  అంటారు. ‘అపరాత్’ అంటే “ఏపరేటస్” (apparatus), లేదా, తెలుగులో పనిముట్టు, పరికరం. లేదా, సంస్కృతంలో సాధనం.   ‘స్రెద్^స్త్వ’ అంటే ‘ప్రత్యేకమైన’, ‘విశిష్ట’ అని అర్థం. కనుక ఈ దారి వెంబడి వెళితే “హార్డ్^వేర్” (hardware) ని ‘విశిష్ట సాధనం’ అనొచ్చు. సాఫ్ట్ వేర్ (software) ని రష్యా భాషలో ‘ప్రోగ్రాంనోయ్ ఒబెస్ పెచే ని’ అంటారు. నా దృష్టిలో – ఈ సందర్భంలో - రష్యా వాళ్ళ కంటె మనమే మెరుగు అనిపిస్తోంది!

నేను స్వీడన్ లో ఉన్నప్పుడు స్వీడన్ దేశీయులు హార్డ్^వేర్ ని ఏమంటారో వాకబు చేసేను. వారు “మెషీన్ వరా” అంటారు. దీన్ని కావలిస్తే “మెషీన్ వేర్” (machineware) అని ఇంగ్లీషులోకి మార్చుకుని అర్థం చేసుకోవచ్చు.

హార్డ్^వేర్ ని కఠిన + యంత్రము = కఠినాంత్రము అనిన్నీ సాఫ్ట్^వేర్ (software) ని కోమల + యంత్రము = కోమలాంత్రము అని కొందరు ప్రయత్నించి చూస్తున్నారు. ఇక్కడ ఏ సంధి సూత్రం పనిచేస్తోందో నాకు అర్థం అవలేదు.  ఇక్కడితో ఆగకుండా ముక్త కోమలాంత్రము = “ఫ్రీ సాఫ్ట్^వేర్ (free software), ఆముక్త కోమలాంత్రము = “నాన్-ఫ్రీ సాఫ్ట్^వేర్ (non-free software), ఉపకరణ కోమలాంత్రము = అప్లికేషన్ సాఫ్ట్^వేర్ (application software) అంటూ విజృంభిస్తున్నారు కొందరు. ఈ ప్రతిపాదించిన మాటలని అటుంచి ఈ ప్రయత్నంలో శుభసూచకమైన ధోరణి ఒకటి ఉంది. ప్రస్తుతానికి కావల్సిన మాట ఒక్కటీ తెలుగులో అనేసి ఊరుకోకుండా ఆ మాట చుట్టుపట్ల ఉన్న అనేక ఇతర మాటలని వివిధ సందర్భాలలో ఎలా వాడాలో ప్రయత్నించి చూడటం అనేదే ఈ శుభసూచకమైన ధోరణి.

సాఫ్ట్^వేర్ (Software) ని చాల భాషలలో ‘ప్రోగ్రాం’ అనే అంటారు. నేను చేసిన చిరు పరిశోధనని బట్టి హార్డ్^వేర్, సాఫ్ట్^వేర్  (hardware, software) అనే మాటలు తర్జుమాకి లొంగకుండా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్నాయి. కారణం ఏమిటంటే ఈ రెండు మాటలూ – ఈ రెండు మాటలే కాదు, వీటికి ‘ఆపరేటింగ్ సిస్టం’ (operating system) ని కూడ కలపొచ్చు – వర్ణనాత్మకమైన మాటలు కావు. అర్థవంతమైన మాటలని ఒక భాష లోంచి మరొక భాష లోకి తర్జుమా చెయ్యొచ్చు కాని, అర్థం, పర్థం లేని మాటలని తర్జుమా చెయ్యటం ఎలా? “అర్థం, చలి, తల్పం” అన్న మాటలని మీరు మరొక భాష లోకి అనువదించగలరు, కాని “పర్థం, గిలి, గిల్పం” ఇంగ్లీషులోకి అనువదించండి చూద్దాం! భాస్కరాచార్యులవారి “జీవ” అరబ్బుల రాతల్లోనూ, ఐరోపా వారి మాటల్లోనూ ఏమయిందో చూశారు కదా.

ఈ విషయం ఇంతలా ఇబ్బంది పెడుతూ ఉంటే కొంచెం వేదాంత ధోరణిలో ఆలోచించటం మొదలు పెట్టేను. కంటికి కనిపించేది, స్థిరంగా ఉండేది హార్డ్^వేర్  (hardware). కంటికి కనిపించనిది, హార్డ్^వేర్ కి ఒక వ్యక్తిత్వం ఇచ్చేది సాఫ్ట్^వేర్  (software). ఈ ధోరణిలో ఆలోచిస్తే ‘బోదె’ అన్న మాట హార్డ్^వేర్  తోనూ, ‘మేధ’ అన్నది సాఫ్ట్^వేర్  తోనూ సరితూగవచ్చు. ఈ రెండు మాటలకి కొంచెం ప్రాస కూడా కుదిరినట్లుంది. లేదా, ఈ జంటలని పరిశీలించండి: స్థూలకాయం, సూక్ష్మకాయం; దేహం, దేహి; మూర్తం, అమూర్తం.

ప్రోగ్రాము, కోడు, రొటీన్ (program, code, routine) అనే మాటలు కూడ రకరకాల సందర్భాలలో వాడతారు కనుక ఈ సందర్భంలోనే వీటిని కూడ ఏమంటారో ఆలోచించటం మంచిది.


ప్రోగ్రాం (program) అనే మాట కంప్యూటర్ వాళ్లు పుట్టించిన మాట కాదు. ఈ మాటని మనం ‘ప్రోగ్రాము’, ‘కార్యక్రమము’,‘కార్యసరళి, ‘కార్యవాహిక’, ‘కార్యసూచిక’ (లేదా ‘కాసూక’) అంటూ తెలిగించవచ్చు. నేను 1968 లో రాసిన పుస్తకంలో “ప్రోగ్రాం” (program) ని ‘క్రమణిక’ అని పిలచేను. దీనికి కూడ కారణం ఉంది.  “కల్చరల్ ప్రోగ్రాము” (cultural program) లో “ప్రోగ్రాం” నీ, “కంప్యూటర్ ప్రోగ్రాము” లో  “ప్రోగ్రాం” ని ఒకే మాటతో అనువదించాలని నిబంధన ఏదీ లేదుగా. నిజానికి ‘కార్యక్రమం’ అనే మాటకి ఒక నిర్ధిష్టమైన అర్థం ఉంది కనుక, ‘కార్య’ శబ్దం లేకుండా కొత్త మాట తయారు చెయ్యాలనే ఉద్దేశంతో ‘ఒక క్రమబద్ధమైన’ అనే అర్థం స్పురించే విధంగా ‘క్రమణిక’ అని వాడేను.

‘అప్లికేషన్’ (application) ని ‘అనువర్తన’ అని నోకియా వాడు వాడి తెలుగు ఫోనులో పెట్టేశాడు. ఇప్పుడు “అప్లికేషన్ ప్రోగ్రాం” అనువర్తిత క్రమణిక అవుతుంది. ఎలా ఉందంటారు? ఇవన్నీ సబబైన ఆలోచనలే. సందర్భోచితంగా ఏ ప్రయోగం పండుతుందో చూడాలి.

చూసారా, ఎన్ని మాటలు కూడబెట్టేమో!  కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. వీటిల్లో ఏది బాగా నప్పుతుంది అన్న ప్రశ్న పుట్టక మానదు. దీనికి సమాధానం కావాలంటే మనమంతా ఓపికగా కూర్చుని కలనయంత్రాల గురించి సమగ్రమైన వ్యాసాలు రాయాలి. ఆ వ్యాసాలలో సాధ్యమైనంత వరకు తెలుగు మాటలని వాడి, మనం ఇక్కడ ప్రతిపాదిస్తూన్న మాటలు రకరకాల సందర్భాలలో ఎలా నప్పుతాయో ప్రయోగించి  చూడాలి. గట్టు మీద కూర్చుని మెట్ట వేదాంతం చెబుతూ ఉన్నంత సేపూ ఈత రాదు; కాలు తడపాలి, మొల బంటి నీటిలోకి  దిగాలి. అప్పుడు కాని మన ప్రతిపాదనలలోని సత్తా బయట పడదు. అందుకనే నిఘంటువులోలా మాటలకి పొడి పొడిగా అర్థాలు ఇచ్చేసి “తాంబూలాలు ఇచ్చేశాను, ఇక తన్నుకు చావండి” అని చేతులు దులిపేసుకోకుండా  నేను చేట భారతంలా ఈ వ్యాసాలు రాస్తున్నాను – ప్రయోగం చేసి చూపెట్టాలనే కోరికతో.

- వచ్చే వారం: మిథ్యా కలనం

13 comments:

 1. ఆజ్ఞ = command
  ఆజ్ఞావళి = program

  ReplyDelete
 2. Very interesting suggestion. I'll see if I can use this in an appropriate context. Thanks

  Can you come up with a suggestion for an algorithm?

  ReplyDelete
  Replies
  1. ఆజ్ఞాసరళి ???

   Delete
  2. ఆజ్ఞావిధి ??

   Delete
  3. పరిష్కరణావిధి అన్నా బాగానే వుండొచ్చేమో!

   Delete
  4. ఆజ్ఞ = command
   ఆజ్ఞావళి = program
   -----------------
   ఇవే అన్నిటికన్నా బాగున్నాయి.యేదైనా సరళంగా సూటిగా పలకడానికి అనువుగా ఉండాలి,వీటికి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవే ఖాయం చేసుకుంటే బాగుంటుందని నా సూచన!

   Delete
  5. హరిబాబుగారూ,
   ఆజ్ఞావిధి/ఆజ్ఞాసరళి/పరిష్కరణావిధి = algorithm ???

   Delete
 3. నిర్వాహకవ్యవస్థ = OS
  బృహదాజ్ఞావళి = Software ???

  ReplyDelete
 4. యాంత్రికవ్యవస్థ = hardware ???

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. you:గట్టు మీద కూర్చుని మెట్ట వేదాంతం చెబుతూ ఉన్నంత సేపూ ఈత రాదు; కాలు తడపాలి, మొల బంటి నీటిలోకి దిగాలి. అప్పుడు కాని మన ప్రతిపాదనలలోని సత్తా బయట పడదు. అందుకనే నిఘంటువులోలా మాటలకి పొడి పొడిగా అర్థాలు ఇచ్చేసి “తాంబూలాలు ఇచ్చేశాను, ఇక తన్నుకు చావండి” అని చేతులు దులిపేసుకోకుండా నేను చేట భారతంలా ఈ వ్యాసాలు రాస్తున్నాను – ప్రయోగం చేసి చూపెట్టాలనే కోరికతో.

  me:most welcome!

  ReplyDelete
 7. Sir,

  I tried to come up with some words, having a uniformity in sound for {hardware, software etc.,} - just for fun.

  యంత్ర విధి - Hardware
  తంత్ర విధి - Software
  ఆజ్ఞావళి - program
  సూత్ర విధి - algorithm

  ~లలిత

  ReplyDelete