Saturday, July 27, 2013

1. కంప్యూటర్ల పూర్వజన్మ వృత్తాంతం


1. కంప్యూటర్ల పూర్వజన్మ వృత్తాంతం

నా చిన్నతనంలో నిజంగా జరిగిన ఉదంతం. మా పక్కింటి తాత చచ్చిపోతూ ఉంటే, మంచం మీంచి కిందకి దింపేసి, వీధి గుమ్మంలో రోడ్డు మీద చాప మీద పడుక్కోబెట్టేసి, ఇంటిల్లిపాదీ ఘొల్లుమన్నారు. దారిన పోతూన్న సుబ్బారాయుడు డాక్టరు గారు, జట్కాని ఆపి, తాతని పరీక్షించి, సూదిమందు ఇచ్చేరు. కొద్ది క్షణాల్లో కాలి వేళ్లల్లో కదలిక కనిపించింది. తరువాత కళ్లు తెరచేడు. లేచి కూర్చున్నాడు. మాట్లాడేడు. ప్రాణం లేని కట్టెకి ప్రాణం పోసేడని అందరూ సుబ్బారాయుడిగారిని మెచ్చుకున్నారు.

ఇదే విధంగా మనం బజారులో కంప్యూటరు కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్నప్పుడు అది కొన ఊపిరి ఉందో ఉడిగిందో అన్నటువంటి మృత దేహం లాంటిది. ఒక ప్లేస్టిక్ డబ్బా, లోపల కొంత ప్లేస్టిక్ సరంజామా, తీగలు, రేకు డబ్బాలు, సిలికాన్ చితుకులు, వగైరాలు తప్ప వాటిలో జీవం లేదు, చైతన్యం లేదు, చలనం లేదు. కంప్యూటరు మీద ఉన్న మీటని నొక్కగానే, కేవలం 3-5 వోల్టుల విద్యుత్తు ఎక్కడో అంతరాంతరాల్లో కొన ఊపిరితో ఊగిసలాడుతూన్న ప్రాణాన్ని లేవగొడుతుంది. పక్కింటి తాత లేచినట్లే అంతవరకు కదలిక లేని కంప్యూటర్ లేస్తుంది. అంతవరకు కంప్యూటర్‌కీ భోషాణం పెట్టెకి ఏమీ తేడా లేదు.

లేవడం అంటే లేచింది కాని, మన కంప్యూటర్‌కి ఇంకా భుజబలం, బుద్ధిబలం సంతరించలేదు; నిద్ర బద్ధకం వదలలేదు. అది ఇంకా శుద్ధమొద్దావతారమే. నిద్ర లేవగానే కాళ్లూ, చేతులూ, కన్నూ, ముక్కూ, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని తడిమి చూసుకున్నట్లు, కంప్యూటర్ లేవగానే తనతో కలసి మెలసి పని చెయ్యవలసిన యంత్రాంగాలన్నీ సజావుగా ఉన్నాయో లేదో తడిమి చూసుకుంటుంది. అప్పుడు ఈ రకం కనిష్ట స్పృహ తప్ప కంప్యూటర్‌కి చెప్పుకోదగ్గ ప్రజ్ఞానం (consciousness) ఉండదు. ఉండక పోయినా అటువంటి మేధా సామర్ధ్యం ఎక్కడ ఉంటుందో తడిమి తెలుసుకోగలిగే ఇంగిత జ్ఞానం కంప్యూటరు అంతరాంతరాల్లొ అప్పటికే అమరి ఉంటుంది. ఆ సామర్ధ్యం రాగానే శుక్లపక్ష చంద్రుడిలా కంప్యూటరు బుద్ధి వికాసం పొంది బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తుంది.

కాని కంప్యూటర్లు అన్నీ నిద్ర లేవడానికి ఇలా జనన వేదన లాంటి ఇబ్బందులు పడక్కరలేదు. కొన్ని రకాల కంప్యూటర్లు ఒకే ఒక పని చేస్తాయి. ఆ రకం కంప్యూటర్లని ఆ ఒక్క పనినీ సమర్ధవంతంగా చెయ్యడానికి వీలుగా నిర్మిస్తారు. ఉదాహరణకి కేలుక్యులేటర్లు (calculators), కార్లలో జ్వలన ప్రక్రియని నియంత్రించే కంప్యూటర్లు (ignition control systems) ఎప్పుడూ ఒకే పనిని చేస్తాయి కనుక వాటిలో ఆదేశాలని మార్పు లేకుండా శాశ్వతంగా ఉండేటట్లు దాచుకోవచ్చు; ఆదేశాలు (instructions) మాటిమాటికీ మారవలసిన అవసరం లేదు. ఈ రకం కంప్యూటర్లని “హార్డ్‌వైర్డ్” (hardwired) అంటారు. మనం పుట్టినప్పుడు మన మెదడు కూడ కొంత వరకు “హార్డ్‌వైర్డే!” అందుకనే ఎవ్వరూ నేర్పకపోయినా చూడగలం, వినగలం, ఏడవగలం, పాలు తాగగలం. మన బల్ల మీద ఉన్న కంప్యూటర్ రకరకాల పనులు చేస్తుంది. మనం చెప్పిన పనులు చేస్తుంది. ఈ సౌలభ్యం ఉన్న కంప్యూటర్లని క్రమణికాంకిత (programmed) కంప్యూటర్లు అంటారు; అంటే క్రమణికలు చెప్పినట్లు చేసేవి. ఈ ప్రవర్తనని “ఒకరు చెప్పగా నేర్చుకోవడం” తో పోల్చవచ్చు. ప్రతి మెదడులోను కొంత “హార్డ్‌వైర్డ్” (పుట్టుకతో వచ్చిన) భాగం, కొన్ని “సాఫ్ట్‌వైర్డ్” (నేర్చుకున్న) భాగాలు ఉంటాయి.

మనం వాడుకునే కంప్యూటర్ గొప్పతనం ఏమిటంటే, మనం దానిని “ఆన్” చేసినప్పుడల్లా అదొక ఖాళీ పలకలా లేదా తెల్ల కాగితంలా ప్రవర్తిస్తుంది. ఆ ఖాళీ పలక మీద మన ఊహా శక్తిని ఉపయోగించి సృజనాత్మకంగా రకరకాల పనులు చెయ్యవచ్చు: కథలు రాయాలనుకుంటే కథలు రాసుకోవచ్చు, బొమ్మలు గీయాలనుకుంటే గీసుకోవచ్చు, సంగీత వాద్యాలు వాయించాలంటే ఆ పనీ చేయించవచ్చు, జమాబందీ లెక్కలు చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ఎవరికి కావలసిన విధంగా వారు ఆ కంప్యూటర్‌ని తమతమ అవసరాలకి అనుకూలంగా మలుచుకోవచ్చు. క్రమణికలు రాయగలిగే ప్రత్యేక నైపుణ్యం లేకపోయినా సరే ఈ పనులన్నీ మనం చేసుకోవచ్చు. అందువల్లనే కంప్యూటర్ ఇంత ప్రజాదరణ పొందింది.

మొదట్లో కంప్యూటర్లు చాల పెద్దగా, బరువుగా, ఖరీదుగా ఉండేవి. ఉదాహరణకి 1940 దశకంలో కట్టిన ENIAC అనే కంప్యూటర్ 100 అడుగుల పొడుగు, 8 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువు ఉండేది. దాని ఖరీదు (ఆ నాటి మారకపు విలువలో) 5 లక్షల డాలర్లు. ట్రాన్సిస్టర్ పరిజ్ఞానం పెరిగిన తరువాత ఇవన్నీ క్రమేపీ తరగడం మొదలయింది. అయినా సరే కంప్యూటర్లు ప్రభుత్వ సంస్థలలోను, విశ్వవిద్యాలయాలలోను తప్ప ప్రజలకి అందుబాటులో ఉండేవి కాదు. ప్రజా (లేదా జనతా లేదా personal) కంప్యూటర్లు అనే భావాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఘనత కొంతవరకు ఏపిల్ (Apple) సంస్థకి చెందుతుంది. కాని ప్రజలలోకి కంప్యూటర్లు వెల్లువలా గట్టు తెగి ప్రవహించడానికి కారణం IBM కంపెనీ వారు తయారు చేసిన PC. IBM కంపెనీ వారు తెచ్చినది సాంకేతిక విప్లవం కాదు, వ్యాపార విప్లవం. కంప్యూటర్ ధర ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, విపణి వీధిలో సులభంగా దొరికే విడివిడి భాగాలతో కంప్యూటర్‌ని నిర్మించి, దాని రూపకల్పన (design) వివరాలని, వ్యాపార రహశ్యంగా దాచకుండా, బహిరంగం చేసేరు. ఈ నిర్ణయం వల్ల సరఫరాదారులు పెరిగేరు. పోటీ పెరిగింది. నాణ్యత పెరిగింది. వెల పడింది. కంప్యూటర్ రచన, నిర్మాణ రహశ్యాలు బట్టబయలు చేసినా ఒకే ఒక భాగం యొక్క ప్రచురణ హక్కులు (copyrights) IBM వారు అట్టేపెట్టుకున్నారు. ఈ భాగం పేరు “బయాస్” (BIOS, Basic Input/Output System). మెదడులో “హార్డ్‌వైర్” చేసిన భాగం ఎలాంటిదో కంప్యూటర్‌కి ఈ బయాస్ అలాంటిదని అనుకోవచ్చు. ఈ బయాస్‌లో ఒకే ఒక చిన్న సిలికాన్ చితుకు (chip) ఉంటుంది. ఇందులో రాసిన (దాచిన) ఆదేశాలు చెరపాలనుకున్నా చెరగవు. ఇలా చెరగకుండా నిల్వ చేయగలిగే వాటిని ఇంగ్లీషులో “రాం” (ROM, Read Only Memory) అంటారు. కంప్యూటర్‌లో ఉన్న ప్రాణం లేని భాగాలన్నీ (వీటిని కఠినాంగాలు అని తెలుగులోనూ, హార్డ్‌వేర్ అని ఇంగ్లీషులోనూ అందాం) ప్రాణం పుంజుకుని లేవడానికి కావలసిన ఆదేశాల యంత్రాంగం (దీనిని మృదులాంగం అని కాని కోమలాంగం అని కాని తెలుగులోనూ, సాఫ్ట్‌వేర్ అని ఇంగ్లీషులోను అందాం) అంతా ఈ బయాస్‌లో ఉంటుంది. ఈ సందర్భంలో IBM వారు రెండు పనులు చేసి PC పెరుగుదలకి నాంది పలికేరు. ఒకటి, పోటీదారులు బయాస్‌లో ఉన్న యంత్రాంగం ఎలా పని చేస్తుందో చూసి నేర్చుకోవచ్చు. రెండు, IBM వారి బయాస్‌ని మక్కీకి మక్కీ కాపీ కొట్టనంతసేపూ, భావాలని కాపీకొట్టి IBM వారు నిర్దేశించిన పనులని, IBM వారు నిర్దేశించిన విధంగా చేసినంతసేపూ, ఎవరికి కావలసిన విధంగా వారు ఆదేశాలు, క్రమణికలు రాసుకుని, కంప్యూటర్లు నిర్మించి పోటీ పడవచ్చు.

ఈ దెబ్బతో ఇంటింటా ఒక కంప్యూటరు వెలిసింది.
2 comments:

  1. రావు వేమూరి గారూ మీ లోలకం మాకు అతి కీలకం!విజ్ణాన శాస్త్రాన్ని ఎంచక్కా తేట తెలుగులో వ్రాయగలమని సంకల్పం చెప్పుకొని వ్రాసి చూపిస్తున్న మీ పూనిక తెలుగుకు ఒక ఆధునిక నిశ్రేణిక!

    ReplyDelete
  2. హార్డువేర్ మరియు బయోస్ గురించి బాగా చెప్పారు ...

    ReplyDelete