Saturday, June 1, 2013

అణు విద్యుత్తు


అణు విద్యుత్తు

వేమూరి వేంకటేశ్వరరావు

ఈ మధ్య పెద్ద సునామీ వచ్చి జపాను బాగా దెబ్బ తింది. బట్టతలవాడు ఎండ దెబ్బ తట్టుకోలేక తాటిచెట్టు నీడని నిలబడితే తాటిపండు నెత్తిమీద పడ్డాదిట. అలా వక్రించింది జపాను జాతకం.

ఎక్కడో సముద్రగర్భంలో భూకంపం వచ్చింది. ఆ ధాటికి అక్కడ భూమి గతక్కున దిగజారిపోయింది. భూమితోపాటు సముద్రంలోని నీరు ఆ అగాథంలోకి పడింది. దానితో సముద్రంలో పెద్ద కెరటం పుట్టింది. ఉవ్వెత్తున లేచిన కెరటం విమానం పరిగెట్టినంత జోరుతో పరుగు తీసి జపాను కోస్తా ప్రాంతాలమీద విరుచుకు పడింది. జనావాసాలు ములిగిపోయేయి. భారీగా ప్రాణ నష్టం వచ్చింది. నిజంగా ఎంత నష్టం వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. చాల మంది ఆ ఉప్పెనలో కొట్టుకుపోయారు. ఇంకా భారీగా ఆస్తి నష్టం వచ్చింది. ఇదంతా ప్రకృతి వైపరీత్యం తప్ప మానవుడు చేసిన తప్పు లేదు.

ఈ సునామీని ప్రేరేపించిన భూకంపం చిన్నదేమీకాదు. ఈ భూకంపానికి జపాను కోస్తాలో ఉన్న ఫుకుషిమా అనే ఊళ్లో ఉన్న అణు విద్యుత్ ఉత్పాదక కేద్రం దెబ్బతింది. ఎలా అని అడగరేం? భూకంపం తాకిడికి కేంద్రంలోని కాంక్రీటు కట్టడాలు బాగానే తట్టుకున్నాయి. సునామీ తెచ్చిన ముంపు వల్ల కూడ కట్టడాలకి హాని జరగలేదు. “రియాక్టర్” ని చల్లబరచటానికి వాడే నీటి పంపులని నడిపే యంత్రాంగానికి విద్యుత్ సరఫరా కావాలి కదా. ఆ సరఫరా చేసే వలయం దెబ్బ తింది. ఈ వలయానికి వెనక దన్నుగా మరొకదానిని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రాథమిక సూత్రం మరిచిపోయేరు. దానితో రియాక్టరుకి శీతలోపచారాలు చేసే కార్యక్రమం కుంటు పడింది. దాంతో “రియాక్టరు” వేడెక్కి కరిగిపోయి, లోపల ఉన్న వికిరణాన్ని బయటకి విడుదల చేసింది. దీనితో ఆ చుట్టుపట్ల 12 మైళ్లు దూరంలో ఉన్న జనావాసాలు ఖాళీ చెయ్యవలసి వచ్చింది. విపరీతమైన ధన నష్టం వచ్చింది. అసలే డబుల్ టైఫాయిడ్ వచ్చి బాధ పడుతూన్న వ్యక్తికి నుమోనియా కూడ వచ్చినట్లయింది ఈ ఫుకుషీమా దగ్గర. అయినా కేవలం వికిరణం తాకిడి వల్ల చచ్చిపోయిన వాళ్ల సంఖ్య ప్రస్తుతానికి అత్యల్పం.

జపానులో భూకంపాలు తరచు వస్తూ ఉంటాయి. భూకంపంతోపాటు సునామీ రావటం కొంచెం అరుదు. భూకంపం కంటె సునామీ ఎక్కువ హాని చేసింది. సునామీ వల్ల జరిగిన ప్రాణ నష్టంతో పోల్చి చూస్తే ఫుకుషిమా రియాక్టరు వల్ల జరిగిన ప్రాణ నష్టం అత్యల్పం. కాని వార్తలలో పతాక శీర్షిక అధిరోహించినది ఈ అణుశక్తి కేంద్రంలో జరిగిన ప్రమాదం.

భారతదేశంలో, రోడ్డు ప్రమాదాలలో, 2007 లో 1 లక్ష 14 వేల మంది, 2010 లో 1 లక్ష 30 వేల మంది చచ్చిపోయేరుట. ఈ గణాంకాలు చూసి రోడ్ల మీద ప్రయాణాలు మానుకుంటామా? ప్రయాణాలు ప్రమాదరహితంగా ఉండటానికి మంచి రోడ్లు ఉండాలి, మంచి కారులు ఉండాలి, చోదకులు బాధ్యతాయుతంగా కార్లు నడపాలి, వారిపై పోలీసు పర్యవేక్షణ ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలలో ప్రతి ఏటా దరిదాపు 1,000 మంది మాత్రమే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినా విమాన ప్రమాదం ప్రపంచంలో ఏ మూల జరిగినా పత్రికలలో పతాక శీర్షికే. ప్రపంచవ్యాప్తంగా, గత 60 సంవత్సరాలలో, అణు విద్యుత్ కేంద్రాలలో కేవలం 4 ప్రమాదాలు జరిగేయి. వీటిలో ప్రమాదం కారణంగా 66 మంది, సంబంధిత కారణాల వల్ల 4,000 మంది చచ్చిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదాలని సందర్భోచితమైన సమదృష్టితో చూసినప్పుడు ఉద్రేకరహితమైన అవగాహన ఏర్పడుతుంది.

భారతదేశం కూడ అగ్ర రాజ్యాలలో ఒకటిగా లెక్కింపబడాలంటే శక్తి వనరులకి ఇతరులమీద ఎక్కువగా ఆధారపడటం మంచిది కాదు. కాని ఖనిజ తైలాల, సహజ వాయువుల నిక్షిప్తాలు మన దేశంలో దరిదాపు పూజ్యం; ప్రపంచంలో ఉన్న నిక్షిప్తాలలో నూరింట ఒక పాలు మాత్రమే మనదేశంలో ఉన్నాయి. కాని, ప్రపంచంలో ఉన్న ప్రతి 100 మందిలో 17 మంది మన దేశంలోనే ఉన్నారు. మన దేశంలో ఉన్న శక్తి వనరులు అత్యల్పం కావటం వల్ల ఏటా 100 బిలియను డాలర్లు ఖర్చుపెట్టి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. ఇలా ఎన్నాళ్లు సాగుతుంది? ఎప్పటికయినా మన కాళ్ల మీద మనం నిలబడాలంటే కేవలం విద్యుత్ ఉత్పాదనకని శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం తగ్గించాలి. ఈ విధంగా విచారణ చేసి చూస్తే భారతదేశం అణు విద్యుత్తు మీద ఆధారపడటం తప్ప గత్యంతరం ఉన్నట్లు కనిపించటం లేదు. కనుక ఇప్పుడు బహిరంగ వేదికల మీద చర్చించవలసిన అంశం ఏమిటంటే “అణు విద్యుత్ కేంద్రాలని సురక్షితం చెయ్యటానికి ఏయే పనులు చెయ్యాలి?”

దేశ రక్షణ కోణం నూండి కూడ చూద్దాం. చైనా వద్ద 240 బాంబులు ఉన్నాయి; వీటిల్లో చాల మట్టుకు భారత పట్టణాలపై గురి పెట్టి ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 80 బాంబులు ఉన్నాయి; ఇవన్నీ ఇండియా మీదే గురిపెట్టి ఉన్నాయి. వాళ్లు ఆ మారణాయుధాలని మనమీద ప్రయోగించకుండా ఉండాలంటే మన దగ్గర అంతకంటె పెద్దవి, మంచివి ఉన్నాయని వాళ్లల్లో నమ్మకం కలిగించాలి. ఈ పని చెయ్యాలంటే అణు శక్తి మీద, అణు విద్యుత్తు మీద మనం అలా పరిశోధనలు చేస్తూనే ఉండాలి. మన పరిశోధనా ఫలితాలని ప్రపంచానికి చాటుతూ ఉండాలి.

విమాన ప్రయాణాలు ఇప్పుడు ఇంత సురక్షితంగా ఉండటానికి కారణం? ఏ మూల ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా “ఆ ప్రమాదానికి కారణం ఏమిటి? మళ్లా అటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ఏమిటి చెయ్యాలి?” అని ప్రశ్నలు లేవదీసి, వాటికి సమాధానాలు వెతికి తగు చర్యలు తీసుకోవటమే. అదే విధంగా అణు విద్యుత్ ని కూడ మచ్చిక చేసుకోవాలి కాని, జపాను లోను, ఉక్రెయిన్ లోను జరిగిన ప్రమాదాలని ఆసరాగా తీసుకుని “మాకు అణు విద్యుత్ కేంద్రాలేవద్దు” అని మంకు పట్టు పట్టి కూర్చుంటే వేసవి కాలంలో మనకి విసనకర్రలే శరణ్యం.

2 comments:

  1. చక్కగా చెప్పారండి !

    ReplyDelete
  2. ఇండియా లో అణు పరశోధన ఆవశ్యకత మీద విశదీకరణ బాగుంది.

    ReplyDelete