Saturday, March 30, 2013

అసలు ఆల్కహాలు, నకిలీ ఆల్కహాలు


అసలు ఆల్కహాలు, నకిలీ ఆల్కహాలు

వేమూరి వేంకటేశ్వరరావు

అమెరికాలో విచిత్రమైన చట్టాలు చాల ఉన్నాయి. మనుష్యులు తాగే ఆల్కహాలు “సహజసిద్దమైన” శాకాలు, పళ్లు, ధాన్యాలు, వగైరాలతోనే కాని కృత్రిమంగా రసాయన మంత్రాలు ఉపయోగించి సృష్టించినది కాకూడదు” అనే చట్టం ఒకటి ఉంది. సాధారణంగా మనం తాగే ఆల్కహాలు (కల్లు, సారా, విస్కీ, బ్రాందీ, జిన్ను, వాద్కా, వగైరాలన్నీ) చెట్ల నుండి లభించే పదార్ధాల ద్వారా చేస్తారు. అంటే తాటి నీరా, ద్రాక్ష, చెరకు, బియ్యం, బార్లీ, మొదలైనవి ముడి పదార్థాలుగా వాడతారు. వీటన్నిటిలోను మనకి మత్తెక్కించే అసలు పదార్థం పేరు ఆల్కహాలు. “ఒక సూర్యుండు సమస్థ జీవులకు తానొకొక్కడై తోచు పోలిక” అన్నట్లు ఈ ఒక్క ఆల్కహాలూ రకరకాల పేర్లతో, రకరకాల రంగులతో, రకరకాల ఆకారాలు ఉన్న సీసాలలో మనకి తారస పడుతూ ఉంటుంది. శాస్త్ర పరంగా ఆల్కహాళ్లల్లో రకాలు ఉన్నాయి కనుక నిర్దిష్టతకి మనకి కావలసిన ఆల్కహాలు పేరు ఎతల్ ఆల్కహాలు. సౌలభ్యానికి “ఆల్కహాలు” అని టూకీగా అనెద్దాం.

ఒక ఆల్కహాలు బణువులో (మోలిక్యూలు) ఎన్నెన్ని కర్బనపు అణువులు (ఏటం) ఉన్నాయో, ఉదజని అణువులు ఉన్నాయో, ఆమ్లజని అణువులు ఉన్నాయో మనకి తెలుసు. అంతే కాదు. ఈ అణువులు ఏ అమరికలో ఉన్నాయో తెలుసు. కనుక ప్రయోగశాలలో ఆయా అణువులని చేరదీసి మనకి కావలసిన విధంగా అమర్చితే మనకి చెట్ల అవసరం లేకుండా కృత్రిమంగా ఆల్కహాలుని సృష్టించగలిగే స్థోమత ఉంది. ఈ రోజుల్లో ఇదేమీ బ్రహ్మ విద్య కాదు. కర్రని పోలిన కర్రని సృష్టించవచ్చు. పట్టుని పోలిన పదార్థం నైలాన్ ని సృష్టించేము కదా. పట్టు చీరల కంటె నైలాను చీరలు చవక కూడా. అలాగే ఆల్కహాలుని పోలిన ఆల్కహాలుని ప్రయోగశాలలో సృష్టించవచ్చు. మూడొంతులు అసలు సరుకు కంటే చవగ్గా అమ్మ వచ్చు.

ఆల్కహాలుని ఇలా సృష్టించదలుచుకుంటే మనకి కావలసిన ముడి పదార్థం ముడి చమురు లేదా క్రూడ్ ఆయిల్. భూమి లోపల నుండి బయటకి తీసిన ముడి చమురుని అంశిక స్వేదనం (ఫ్రేక్షనల్ డిస్టిలేషన్) చేసి కిరసనాయిలు, పెట్రోలు, వగైరాలు తీసినట్లే ఆల్కహాలుని కూడ తయారు చెయ్య వచ్చు. ఈ పద్ధతిలో చేసిన ఆల్కహాలుని నకిలీ ఆల్కహాలు అని పిలుద్దాం. దినుసులని పులియబెట్టి చేసిన ఆల్కహాలుకీ, ఈ నకిలీ సరుకుకి రసాయనంగా కాని, రుచిలో కాని, వాసనలో గాని ఏమాత్రం తేడా ఉండదు. రెండింటిలో ఏది తాగినా ప్రాణానికేమీ అపాయం ఉండదు. రెండూ ఒకే మాదిరి “కిక్కు” ఇస్తాయి. అటువంటప్పుడు అమెరికాలో ప్రవేశపెట్టిన చట్టానికి కారణం? ఈ చట్టం వల్ల రెండు లాబీ వర్గాలకి లాభం ఉంది. బజారులో ఆల్కహాలు సరఫరా తక్కువగా ఉంటే ధర పెరిగి అందరికీ అందుబాటులో ఉండదు కనుక ప్రజలు తాగుడు తగ్గిస్తారు అన్న ఆశావాదుల లాబీ ఒకటి. ఖనిజపు చమురుకి సంబంధించిన వ్యాపార వర్గాల నుండి ఆల్కహాలు పోటీకి రాకపోతే “మందు” అమ్మే వ్యాపారులకి లాభదాయికం అనే ఆశించే వర్గం మరొకటి. అందుకని ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చినప్పుడు ఇరు పక్షాలవారూ సంతోషించేరు.

ఈ చట్టం అమలులో పెట్టటం ఎలా? “అసలు” ఆల్కహాలుకీ “నకిలీ” ఆల్కహాలుకీ తేడా లేకపోతే నకిలీ ఆల్కహాలుని తయారు చేసేవాళ్లని పట్టుకుని శిక్షించటం ఎలా? పోలీసులు భౌతిక శాస్త్రవేత్తలని సంప్రదించేరు. ఈ తేడాని పసిగట్టటానికి ఒకటే కీలక సూత్రం ఉంది. అసలు ఆల్కహాలుకి అతి కొద్ది మోతాదులో వికిరణ ఉత్తేజితం (“రేడియో ఏక్టివిటీ”) ఉంటుంది. ఇదెలాగంటే, అసలు ఆల్కహాలులో ఉన్న కర్బనం మొక్కలనుండి సంక్రమిస్తుంది కదా. మొక్కలలోకి కర్బనం వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు నుండి సంక్రమిస్తుంది. వాతావరణంలో ఉన్న కర్బనంలో అతి స్వల్ప మోతాదులో వికిరణ ఉత్తేజితమైన కర్బనం-14 (రేడియో ఏక్టివ్ కార్బన్-14”) ఉంటుంది. ఈ కర్బనం-14 ఉనికిని ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు పట్టుకోకలరు.

నేల లోంచి తీసిన రాతి చమురు (పెట్రోలియం) కూడ మొక్కల నుండి వచ్చినదే. కాని ఈ మొక్కలు ఎప్పుడో 100 మిలియను సంవత్సరాల కిందటి రోజుల్లో భూమి మీద బతికినవి. ఇవి చచ్చి, భూగర్భంలో పాతుకుపోయిన కొత్త రోజుల్లో ఇవి కూడ వికిరణ ఉత్తేజితాన్ని ప్రదర్శించే ఉంటాయి. కాని కర్బనం-14 అర్ధాయుస్షు 5,700 సంవత్సరాలు కనుక వాటి శక్తి ప్రతి 5,700 సంవత్సరాలకి సగం తగ్గుతూ 50 దశలలో, అనగా 300,000 సంవత్సరాలు గతించేసరికి, లేశం కూడ ఉండకుండా నశించిపోయి ఉంటాయి. అందుచేత రాతి చమురు (“క్రూడ్ ఆయిల్”) కి రేడియో ఏక్టివిటీ ఉండదు.

కల్తీ వ్యాపారం చేసే వాడి “శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు” ఉంటాయి. వాడు నల్ల బాజారులో కర్బనం-14 కొని నకిలీ ఆల్కహాలులో కలపొచ్చు. కాని బజారులో కర్బనం-14 కొనుక్కోవటం అంత సులభం కాదు. పోతే అసలు ఆల్కహాలుని కొద్దిగా నకిలీ ఆల్కహాలులో కలపొచ్చు. ఈ రకం “అవిడియాలు” కావాలంటే మా ఊరు వర్తకులని అడగండి, చెబుతారు. పప్పులోనూ, బియ్యంలోనూ కలపటానికి వీలయిన సైజులో రాళ్లు మా ఊరు దగ్గర ఉన్న పెంటకోట రేవు నుండే ఎగుమతి అయేవని చెబుతారు. ఈ నిజాయతీకి నిదర్శనంగా పెంటకోట సముద్రపుటోడ్డున శిధిలమయిన దీపస్తంభం ఒకటి ఉండేది – నా చిన్న తనంలో.

7 comments:

 1. అసలు నకిలీ ఏంటండి....అంతా ఆల్కాహాలే కదా! :-)

  ReplyDelete
 2. మనం తయారు చేసినది అసలు, పోటీదారు చేసినది "నకిలీ"

  ReplyDelete
 3. Interesting ! నకిలీ ఆల్కహాల్ తో ఆరోగ్యానికి ఎటువంటీ హానీ ఉండదా అండి ? ఈ ఆల్కహాల్ సంగతి తెలియదు కానీ పాలు అసలు పాలు కాకుండా ఇలా నకిలీవి కొన్ని డైలీ పార్లర్లు సప్లై చేస్తాయి అని, అదీ ముఖ్యం గా ఎండాకాలం లో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి నకిలీ పాలు సప్లై చేస్తారు అని ఆరోపణలు విన్నానండి. అవి కూడా ఇలా తయారుచేసినవే కదా ఆరోగ్యానికి ఏమీ హానీ చేయవంటారా ?

  ReplyDelete
  Replies
  1. ఇది చాల బరువైన ప్రశ్న. నేను "అసలు", "నకిలీ" అన్న పదాలు చాల సంకుచితమైన దృక్పథంతో వాడేను. నా వ్యాసంలో "అసలు" అంటే దినుసులతో చేసినది" అనే అర్థం చేసుకోవాలి. "నకిలీ" అన్న పదం శిలతైలం ("పెట్రోలియం") నుండి తీసిన ఆల్కహోలు అనే అర్థం చేసుకోవాలి. అంతే కాదు. నేను "ఆల్కహోలు" అన్నప్పుడు అది ఎతల్ ఆల్కహోలు లేదా ఎతనోలు అనే అర్థం చేసుకోవాలి. అప్పుడు రసాయనపరంగా అసలు కీ, నకిలీకీ ఏమీ తేడా ఉండకూడదు. అప్పుడు నకిలీ ఆల్కహోలు ప్రాణానికి హాని చెయ్యకూడదు.

   కాని మన దేశంలో మరో రకం "నకిలీ" సరుకు అమ్ముతారు. దాని పేరు "మెతల్ ఆల్కహోలు" లేదా కర్ర సారా. ఇది విషం. ఇది తాగి కళ్లు పోగొట్టుకున్నవాళ్లూ, చచ్చిపోయినవాళ్లూ ఉన్నారు.

   ఆల్కహోలు అనేది ఒక జాతి పేరు. అందులో ఒక్క ఎతల్ ఆల్కహోలే తాగుడుకి వాడేది.

   పాల సంగతి నాకు తెలియదు. భారతదేశంలో కల్తీ సరుకులు ఎక్కువ, నిజాయతీ తక్కువ కనుక మంచి నీళ్లు కూడ ఆలోచించకుండా నోట్లో పోసుకోకూడదు.

   ఇంతకీ ఈ వ్యాసం రేడియో ఏక్టివిటీని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దృష్టితో రాసేను తప్ప ఆల్కహోలు లక్షణాలు చెప్పే ఉద్దేశంతో రాయలేదు.

   Delete
 4. Do we need to manufacture alcohol using crude oil while the present crude oil reserves are not enough for our fuel needs?

  ReplyDelete
 5. No we do not. I was referring to a time when Americans (including myself) used petrol (gasoline) to wash greasy hands. At 15 cents a gallon, in 1961, gasoline was cheaper than milk!

  The point you raised, although has merit, is not germane to the point I was making. My goal in writing this blog is to explore how a "dangerous" radioactivity can be harnessed to do useful things.

  Thanks for your comment, though.

  ReplyDelete
 6. Was petrol so cheap in 1960s? Indian Railways had no diesel locosheds until 1964. So I was surprised after reading about the price.

  ReplyDelete