Tuesday, January 4, 2022

వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు

 

వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు

ఈమాట, మే 2014 నుండి పునర్ముద్రితం
(తెలుగు "కోరా" సభ్యులు కొంతమంది అంతర్జాల సమావేశం జనవరి 23, 2022 న జరుపుకునే సందర్భంలో నన్ను 20 నిమిషాలు మాట్లాడమన్నారు. వారి సౌకర్యార్థం ఈ వ్యాసాన్ని మరొకసారి ఇక్కడ ప్రచురిస్తున్నాను. )

సంగ్రహం

వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో ఉన్న ఇంగ్లీషుని తెలుగులోకి మార్చటంలో ఉన్న సమస్యలని, వాటి పరిష్కార మార్గాలని అభివర్ణించటం జరిగింది. తెలుగులోకి అనువదించబడ్డ పాఠ్యాంశంలో తెలుగు నుడికారం ఉట్టిపడాలంటే తెలుగు వాడకంలో దొర్లే ఇంగ్లీషు తత్సమాలు 25 శాతం మించకుండా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించటం జరిగింది. ఈ గమ్యాన్ని చేరుకోవటం కష్టమేమీ కాదు. మొదట, ఇంగ్లీషు మాటలని యథాతథంగా పెద్ద ఎత్తున గుచ్చెత్తి వాడెయ్యకుండా, సాధ్యమైనంత వరకు ఉన్న తెలుగు మాటలని వాడటానికి ప్రయత్నం చెయ్యటం. రెండు, సమానార్థకమైన తెలుగు మాట లేకపోయినా, వెనువెంటనే స్పురించకపోయినా ఇంగ్లీషు తత్సమాలని వాడటం కంటె తెలుగు ఉచ్చారణకి లొంగే తద్భవాలని వాడటం. మూడు, సందర్భానికి సరిపోయే భావస్పోరకమైన తెలుగు మాటలని అవసర రీత్యా సృష్టించి వాడటం. నాలుగు, ఇంగ్లీషు వాడుకలో స్థిరపడిపోయిన దుర్నామాలని యథాతథంగా తెలుగులోకి దింపేసుకోకుండా జాగ్రత పడటం. చివరగా, ఈ ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భాలలో ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాయటం. (ముద్రణకి వీలయినప్పుడు, పక్కని కుండలీకరణాలలో ఇంగ్లీషు లిపిలో చూపించటం.) ఈ సూచనలన్నీ ఆచరణయోగ్యాలేనని స్వానుభవం చెబుతోంది.

1. ప్రవేశిక

ఆధునిక వాణిజ్య, వ్యాపార, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో విస్తారంగా వాడుకలో ఉన్న ఇంగ్లీషుని సరళమైన, భావస్పోరకమైన, దేశీ నుడికారంతో ఉట్టిపడే తెలుగులోకి మార్చటంలో ఉన్న కష్టసుఖాలని విశ్లేషించి, ఆచరణయోగ్యమైన సలహాలు ఉత్పాదించాలనే కోరిక ఈ వ్యాసానికి ప్రేరణ కారణం. అనువాదకుడు సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో అనుభవజ్ఞుడనిన్నీ, అతని మాతృభాష తెలుగనిన్నీ అనుకుందాం. ‘అంతా ఇంగ్లీషు నేర్చేసుకుంటే పోలేదా? అపారమైన ఇంగ్లీషు వైజ్ఞానిక సాహిత్యాన్ని తెలుగులోకి దింపటానికి ప్రయత్నించటం అవివేకం కాదా?’ వంటి ప్రశ్నల మీద తర్జనభర్జనలు జరపడానికి ఇది వేదిక కాదు, సమయమూ కాదు.

ముందుగా కొన్ని నిర్వచనాలతో మొదలుపెడదాం. ఒక భాషనుండి మరొక భాషలోకి తర్జుమా (డెరివేషన్, derivation) చెయ్యడానికి రెండు పద్ధతులు ఉన్నాయి: అనువాదం (ట్రాన్స్‌లేషన్, translation), అనుకరణ (ఎడాప్టేషన్, adaptation). ఈ అనుకరణలనే ‘స్వేచ్ఛానువాదాలు’ అనటం కూడ కద్దు. కవిత్రయం తెలిగించిన ఆంధ్ర మహాభారతం సంస్కృత మూలానికి అనుకరణ. ఏనుగు లక్ష్మణకవి తెలిగించిన నీతి శతకం సంస్కృత మూలానికి అనువాదం. అనుకరణ చేసేటప్పుడు మూలానికి మార్పులు, చేర్పులు చేసే వెసులుబాటు ఉంటుంది.

వైజ్ఞానిక, సాంకేతిక, వాణిజ్య, వ్యాపార రంగాలలో ఇంగ్లీషు నుండి ఇతర భాషలలోకి తర్జుమా చెయ్యవలసిన అవసరం తరచు వస్తూనే ఉంటుంది. పాఠ్య పుస్తకాలు, ఉపకరణాలు ఎలా వాడుకోవాలో తెలియజేసే కైపొత్తాలు (handbooks), కల్పనా సాహిత్యం, మనోవికాసక గ్రంథాలు, జనరంజక విజ్ఞానం, మొదలైన వాటిని ఏ ముక్కకాముక్క అనువదించకపోయినా పరవాలేదు – అనుకరణ సరిపోతుంది. కాని ఆర్ధిక విషయాలు, లావాదేవీలకి సంబంధించినవి, ఆస్తి హక్కులకి సంబంధించిన దస్తావేజుల వంటి రూఢి పత్రాలు, వగైరాలు అనుకరిస్తే సరిపోదు – వాటిని అనువదించాలి. ఇలా అనువాదాలకి, అనుసరణలకి మధ్య తేడాలు ఉన్నాయని గుర్తించి, రాత సౌకర్యం కొరకు ఈ రెండు ప్రక్రియలనీ గుత్తగుచ్చి అనువాదాలనే అందాం. అవసరం వచ్చినప్పుడు తేడాని గుర్తిస్తూ మాట్లాడుకోవచ్చు.

మన జీవితాలలో మూడు రకాల అనువాదాల అవసరం కనబడుతుంది: (1) తీరుబడిగా మూల గ్రంథాన్ని చదివి, జీర్ణం చేసుకుని, అనువాదం తయారు చేసి, దానిని బిగుతుగా తిరగ రాయటం, (2) ఒక గడువుని చేరుకోవాలనే తొందరలో మూల గ్రంథాన్ని చదువుతూ, త్వరగా అనువాదాన్ని తయారు చెయ్యటం. (పత్రికా విలేఖరులు తరచుగా ఎదుర్కునే సమస్య ఇది,) (3) ఒక వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే, అదే సమయంలో దానిని తెలుగులో చెప్పటం. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావన మొదటి అంశానికే పరిమితం.

1.1 దేశ, కాల, సంస్కృతులని పరిరక్షించటం

ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ ప్రపంచం సమతలంగా మారుతోందని ఉత్ప్రేక్షిస్తున్నారు. ఇక్కడ ‘సమతలం’ అంటే దేశకాల పరిస్థితుల వల్ల కాని, ఆర్ధిక భేదాల వల్ల కాని, రాజకీయ సిద్ధాంత ధోరణులవల్ల కాని బాహ్యంగా ప్రస్పుటమయే అడ్డుగోడలని పగులగొట్టి ప్రపంచం అన్ని చోట్లా ఒకేలా కనిపిస్తోందని భాష్యం చెప్పుకోవచ్చు. ఎన్ని అడ్డు గోడలని ఛేదించినా మాట్లాడే మాట, రాసే రాత అనే గోడ ఇంకా బలంగానే ఉందని చెప్పడానికి రెండు ఉదాహరణలు: (1) సెల్ ఫోను సౌకర్యం ప్రపంచమంతటా పాకిపోయింది. మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, సర్వులూ వాడుతూన్న పరికరం ఇది. వీరందరికీ ఇంగ్లీషు రావాలంటే ఎలా? ఈ పరికరాన్ని వాడుకునే విధివిధానాలు వారికి తెలుగులో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంగ్లీషు మోజులో పడిపోయిన వారికి ఆ అవసరం కనబడక పోయినా నోకియా వాడికి కనబడింది. (2) తెలుగువాళ్లు తండోపతండాలుగా విమానాలలో ప్రయాణాలు చేస్తున్నారు. వీరిలో తెలుగు తప్ప మరొక భాషతో వెసులుబాటు లేని వాళ్లు ఉంటూనే ఉన్నారు. వీరు విమానంలో కక్కసు దొడ్లోకి వెళ్ళి అక్కడ పాయిఖానా వసతులని వాడుకోవటం తెలియక వాటిని పాడు చేస్తున్నారు. మన మీద అభిమానం కొద్దీ కాకపోయినా వాడి విమానం శుభ్రంగా ఉండాలని ఎమిరేట్స్ విమానం కంపెనీ కక్కసు ఎలా వాడుకోవాలో తెలుగులో (తమిళంలో లేదు, మళయాళంలో లేదు, మరాఠీలో లేదు) సూచనలు రాసేరు. ఇంగ్లీషుని తెలుగులోకి మార్చి రాయవలసిన అవసరం నోకియా వాడికీ, ఎమిరేట్స్ వాడికీ కనబడింది.

ఇంగ్లీషుని తెలుగులోకి మార్చే సందర్భాలలో కొన్ని సాంస్కృతికమైన ఇబ్బందులు కూడ ఉంటాయి. ఉదాహరణకి ఇంగ్లీషులో, ‘మై మదర్, యువర్ మదర్’ అన్న పదబంధాలు ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించేటప్పుడు యడాగమసంధితో ‘నాయమ్మ, నీయమ్మ’ అని అనువదిస్తే నీచ్యార్థం ధ్వనించే అవకాశం ఉంది. మూలంలో బహువచనం లేకపోయినా, తెలుగు నుడికారానికి తల ఒగ్గి, వీటిని ‘మా అమ్మ, మీ అమ్మ’ అని మార్చితేనే బాగుంటుంది.

అమెరికాలో బేస్‌బాల్ బహుళ జనాదరణ పొందిన ఆట. అమెరికావారు మాట్లాడే భాషలో ఈ ఆటకి సంబంధించిన ఉపమానాలు, రూపకాలు అనేకం. వాటిని యథాతథంగా ఇంగ్లీషులోనే ఉంచినా, భావం తెలుగువారికి అర్థం కాదు – ఆటతో పరిచయం లేకపోవటం వల్ల. ఉదాహరణకి, హి హిట్ ఎ హోమ్ రన్ (He hit a home run) అంటే వాడి ప్రయత్నం బాగా ఫలించింది, అని అర్థం. ఎ బాల్ పార్క్ ఫిగర్ (a ball park figure) అంటే అంచనా, లేదా సుమారుగా చెప్పినది. గో టు బేట్ ఫర్ సమ్‌వన్ (go to bat for someone) అంటే మరొకరి తరఫున వకాల్తా పుచ్చుకుని సమర్ధించటం అని కాని, మరొకరికి చేయూత ఇవ్వటం అని కాని అర్థం. వీటిని సమానార్థకాలైన ఏ క్రికెట్ పరిభాషలోనో అనువదించాలి లేదా నేను పైన ఉదహరించిన మాదిరి తెలుగు నుడికారంతో అనువదించాలి.

అదే విధంగా తేదీ, నెలా రాసే పద్ధతి ప్రపంచం అంతా ఒకే ఒరవడిలో లేదు. వీటిని మనకి అలవాటైన రీతిలో రాసుకోవాలి. మూలంలో ఉన్న కొలమానాలని మెట్రిక్ పద్ధతిలోకి మార్చి రాయాలి. మిలియన్లని, బిలియన్లని లక్షలు, కోట్లు అని మార్చటమే కాకుండా సున్నలని గుంపులా విడగొట్టి, కామాలు పెట్టే తీరులో తేడాని గమనించాలి. (ఒక మిలియనుని 1,000,000 అని రాస్తారు కాని పదిలక్షలని 10,00,000 అని రాయాలి.) డాలర్లని రూపాయలలోకి మార్చి చూపదలుచుకుంటే వాటి మారకపు విలువ కూడ ఇస్తే వ్యాసం కాలదోషానికి గురి కాదు. ఈ విషయాలు ప్రధానాంశాలు కాకపోయినా ఇటువంటి జాగ్రతలు పాటిస్తే అనువాదం రాణిస్తుంది, రక్తి కడుతుంది.

2. ఇంగ్లీషు, తెలుగు భాషల పరిణతిలో పోలికలు

ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదం చేసే ప్రక్రియ మీద మన దృష్టి సారించినంతసేపూ, ఈ రెండు భాషలు ప్రస్తుతం అవి ఉన్న స్థితికి ఎలా చేరుకున్నాయో ఒక సారి సమీక్షించటం ఉపయుక్తం. మొదట్లో ఉత్తర జెర్మనీ, నెదర్లాండు దేశాలలో ప్రజలు ఇంగ్లండు వలస వచ్చినప్పుడు వారితో సంబంధితమైన భాషలని కొన్నింటిని తీసుకు వచ్చారు. ఆ కలగాపులగం భాషని పాత ఇంగ్లీషు (Olde English) అనీ ఏంగ్లో-సేక్సన్ (Anglo-Saxon) అనీ అనే వారు. ఈ ఏంగ్లో సేక్సన్ మీద రెండు శక్తుల ప్రభావం బాగా పడింది. సా. శ. 8, 9 శతాబ్దాలలో స్కేండినేవియా (ఇప్పటి నార్వే, స్వీడన్, ఫిన్లండ్) నుండి ఉప్పెనలా కొంతమంది వచ్చి పడ్డారు. తరువాత ఫ్రాన్సు కోస్తా ప్రాంతానికి చెందిన నార్మండీ నుండి మరికొంతమంది వచ్చి స్థిరపడ్డారు. ఈ ఊపులో ఇంగ్లీషులోకి తొంబతొంబలుగా ఫ్రెంచి మాటలు వచ్చి కలిసేయి. ఇప్పటికీ ఇంగ్లీషులో ఫ్రెంచి మాటలు దరిదాపు 25 శాతం ఉంటాయి. తరువాత ఐరోపాలో ఉద్భవించిన పునర్వికాసం వల్ల ఇంగ్లీషులో ఇబ్బడిముబ్బడిగా లేటిన్, గ్రీకు మాటలు వచ్చి చేరాయి. అందుకనే వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో వాడే ఇంగ్లీషుకి లేటిన్, గ్రీకు వాసనలు బాగా అంటుకున్నాయి. దీనికి తోడు వలస రాజ్యాధిపత్యం వల్ల ప్రపంచ భాషలలో మాటలు ఎన్నో కలిసిపోయి ఇంగ్లీషు ఒక ప్రతిదేయ (బారోయింగ్, borrowing) భాషగా వర్ధిల్లి ప్రపంచ భాషగా అవతరించింది.

తెలుగు దక్షిణ-మధ్య భారతంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌లో వినిపించే ద్రావిడ భాష. సా. శ. 2011లో, వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో 8.3 కోట్ల ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచ భాషలలో అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో తెలుగుది పదమూడవ స్థానం. కనీసం ఆరవ శతాబ్దపు శాసనాల నుండి తెలుగు లిఖిత రూపంలో కనిపిస్తోంది. ఆదికావ్యంగా ప్రశస్తి పొందిన నన్నయ తెలుగు భారతం పదకొండవ శతాబ్దానికి చెందింది. ఈ సమాచారాన్ని బట్టి ఆధునిక తెలుగు, ఆధునిక ఇంగ్లీషు సమాతరంగా ఎదిగేయని అనుకోవచ్చు.

ఫ్రెంచి, లేటిన్, గ్రీకు భాషలలోని మాటలు ఇంగ్లీషులో చేరినట్లే సంస్కృతం, ఇంగ్లీషు భాషలనుండి తెలుగులోకి పదజాలం విపరీతంగా వచ్చింది. తెలుగు మీద సోదర భాషల ప్రభావం ఉన్నా సంస్కృతం ప్రభావం అత్యధికం: సంస్కృతాన్ని తెలుగు లిపిలో రాసే సౌలభ్యం కోసం ఒత్తక్షరాలు తెలుగులో వచ్చి చేరాయి. కనుక ఇంగ్లీషుకి లాగే తెలుగుకి కూడ పరభాషలని తనలో ఇముడ్చుకునే శక్తి ఉంది. ఈ లక్షణాన్ని చూసే హాల్డేను (Haldane) తెలుగుని రాజభాష చెయ్యాలంటూ కితాబు ఇచ్చేడు.

అయినప్పటికీ వాక్య నిర్మాణంలో తెలుగుది ద్రావిడ భాషా సంప్రదాయమే. తెలుగు వాక్యంలో కర్త-కర్మ-క్రియ ఆ వరుసలో వస్తాయి. తెలుగు నామవాచకాలు వచనాన్ని బట్టీ, లింగాన్ని బట్టీ, విభక్తిని బట్టీ ద్రావిడ భాషా సంప్రదాయానుసారం రూపాంతరం చెందుతాయి.

3. తెలుగుపై ఇంగ్లీషు ప్రభావం

అనుకరణకి గమ్యం తెలుగు అనుకున్నప్పుడు ఏ తెలుగు అనే ప్రశ్న వస్తుంది? ఈ వ్యాసం నిర్మించుకున్న పరిధిలో మన గమ్యం శిష్టవ్యవహారికం – అనగా, ఈ రోజుల్లో వార్తాపత్రికలలోను, అంతర్జాలపత్రికలలోను, కథలలోను, తరచుగా కనిపించే వ్యవహార శైలి భాష. ఈ రకం భాష ముద్రణా మాధ్యమంలో కనిపిస్తోంది కాని టెలివిజన్ కార్యక్రమాల్లో ‘లంగరమ్మలు, లంగరయ్యలు’ మాట్లాడే భాషలో వినిపించటం లేదు. హలంతాలైన ఇంగ్లీషు శబ్దాలు కలుపు మొక్కలలా అజంతాలైన తెలుగు క్షేత్రంలో చొరబడటం తెలుగులో తెలుగుతనం లోపించడానికి ఒక కారణం. ఈ ధోరణి తెలుగు నుడికారానికే ఎసరు పెడుతున్నాది. ఉదాహరణకి, పుట్టగొడుగుల వేపుడు చెయ్యటం ఎలాగో, ఒక తెలుగు పత్రికలో, ఈ దిగువ చూపిన విధంగా అభివర్ణించేరు ఒక రచయిత్రి.

తయారు చేసే పద్ధతి:

ఆయిల్ ని హీట్ చేసి, అందులో థరవ్‌గా వాష్ చేసి డ్రెయిన్ చేసిన బాస్మతీ రైస్‌ని త్రీ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. అప్పుడు సూటబుల్ ఎమౌంట్ వాటర్ పోసి బోయిల్ చేసి రైస్ మెత్తబడేవరకూ కుక్ చెయ్యాలి. కుక్డ్ రైస్‌ని కూల్ చెయ్యాలి. అనదర్ డిష్ లో ఆయిల్ పోసి అందులో డైస్ చేసిన అనియన్ పీసెస్, క్యాప్సికం, బీన్స్ వేసి వన్ మినిట్ ఫ్రై చెయ్యాలి. ఆఫ్టర్‌వర్డ్స్ సోయ సాస్, టొమేటో పేస్ట్, పెప్పెర్ పౌడర్, సాల్ట్ ఏడ్ చేసి అప్పుడు డైస్ చేసిన మష్‌రూం పీసెస్ మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. మష్రూం పీసెస్ సాఫ్ట్‌గా అయిన తరువాత కుక్ చేసి, కూల్ చేసిన రైస్ మిక్స్ చేసి టెన్ మినిట్స్ ఫ్లేం మీద ఉంచి అప్పుడు సెర్వ్ చెయ్యాలి. చాల టేస్టీగా ఉంటుందీ డిష్. ట్రై చెయ్యండి.

ఇంగ్లీషు వాడకం తెలుగులోకి ఎంతలా జొరబడిందో, తెలుగులో తెలుగుతనానికి ఎసరు పెట్టే ప్రతికూల శక్తుల ప్రభావం ఎంతగా బలిసిందో చెప్పడానికి పై ఉదాహరణ చాలు. ఇప్పుడు ఒక ‘ఎదురు ఉదాహరణ’ని కూడ ఇస్తాను. ఒక ఇంగ్లీషు వ్యాసంలో ఈ దిగువ వాక్యం కనిపిస్తే సంపాదకులు ఒప్పుకుంటారా?

The Brahma brought the pooja saamagri into the madapam and instructed the vadhuvu and varudu to do a pradakshinam to the agnihotram.

శీర్షాసనం అనే భావం పాశ్చాత్యులకి లేదు; అది మన యోగశాస్త్రంలోని మాట. ఇంగ్లీషు పుస్తకాలలో శీర్షాసనం అని రాస్తే అర్థం కాదని ఆ మాటకి బదులు ‘హెడ్ స్టేండ్’ అని రాస్తున్నారు. అంటే ఏమిటన్నమాట? ఇంగ్లీషువాడికి ఇంగ్లీషులో సులభంగా ఇమడని కొత్తమాట తారస పడితే దానికి సమానార్ధకమైన ఇంగ్లీషు మాట తయారు చేసుకుంటున్నాడు. మనమో?

ఇవి ఆవేశంతో ఇచ్చిన ఉదాహరణలు కావు. ప్రతి భాషలోనూ అరువు తెచ్చుకున్న మాటలు ఉంటాయి. కాలక్రమేణ ఈ పరాయి మాటలు వాటి పూర్వపు వాసనని పోగొట్టుకొని కొత్త భాషలో కలిసిపోతాయి. ఈ రకంగా ఇంగ్లీషులో నాలుగింట ఒక మాట ఫ్రెంచి భాష నుండి వచ్చి కలిసిందన్నది నమ్మశక్యం కాని నిజం. ఇదే విధంగా – సహస్రాబ్దాల కాలవ్యవధిలో – సంస్కృతం నుండి తెలుగులోకి ఎన్నో మాటలు వచ్చేయి కదా. ఈ ప్రక్రియ శ్రుతి మించటంతో గ్రాంథికానికి ఆదరణ తగ్గి శిష్టవ్యవహారికానికి ఆదరణ పెరిగింది. పాత శిష్టవ్యవహారికంలో ‘సంస్కృత తత్సమాల పాలు’ తగ్గాలని మనం కోరుకున్నట్లే కొత్త శిష్టవ్యవహారికంలో ‘ఇంగ్లీషు తత్సమాల పాలు’ తగ్గాలని నా ప్రతిపాదన. తెలుగులో ఇంగ్లీషు పాలు ఎంత వరకు భరించవచ్చు? ‘ఇంగ్లీషులో ఫ్రెంచి పాలు ఉన్నంత,’ అని ప్రతిపాదించవచ్చు.

3.1 పూర్వపు పద్ధతి

పూర్వకాలంలో తెలుగు విజాతీయ భాషలని ఎదుర్కొన్నప్పుడు విదేశీ మాటలతో సరితూగే సరికొత్త మాటలని తయారు చేసుకునేది. అలా వీలు కాని పక్షంలో ‘తద్భవ రూపం’లో తనలోకి దింపుకునేది. ఆ ప్రక్రియ ఎలా సాగిందో చూద్దాం.

పాశ్చాత్యులు మన దేశానికి వర్తకం చెయ్యటానికి వచ్చిన కొత్త రోజులలో దక్షిణ అమెరికా నుండి ఎన్నో మొక్కలని తీసుకువచ్చి మనకి పరిచయం చేసేరు. మిరపకాయలు, పొగాకు, బంగాళాదుంపలు, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, మొదలైనవి. ఈ పేర్ల వెనక చరిత్రని చూస్తే తెలుగులో ఉన్న సృజనాత్మక శక్తి అర్థం అవుతుంది.

  • మిరపకాయలు: మాంసాన్ని వండడానికి మిరియాలు ముఖ్యంగా కావాలి. ఆ మిరియాలు భారతదేశంలోనే దొరికేవి. భారతదేశపు పూర్వపు ఆర్ధిక ఔన్నత్యానికి మిరియాలే కారణం. తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ని పట్టుకున్నప్పుడు పాశ్చాత్యులు భారతదేశానికి వచ్చే దారి బందయిపోయింది. దానితో సముద్రపు దారి కనుక్కుందామనే ప్రయత్నంలో, దారిలో అడ్డుతగిలిన అమెరికాలో పడ్డారు. అక్కడ పచ్చగా, ఎర్రగా, కారంగా ఉండే కాయలని చూసి అవే మిరియాలు అనుకొని వాటికి మిరియపుకాయలు అని వారి భాషలో పేరు పెట్టుకున్నారు. మిరియాలని ఇంగ్లీషులో పెప్పర్స్ అంటారు కనుక మధ్య అమెరికాలో కనిపించిన ఎర్రటి, పొడుగాటి కాయని ‘పెప్పర్ కార్న్’ అన్నారు. ఆ మొక్కలని మన దేశం తీసుకు వచ్చేరు. అది మనం కని, విని, ఎరగని కొత్త మొక్క. తెల్లవాళ్లు దానిని పెప్పర్ కార్న్ అన్నారు కనుక దానికి మనవాళ్లు మిరియపు కాయ అని పేరు పెట్టేరు. అదే మిరపకాయగా మారింది.
  • పొగాకు: ఇది కూడ తెల్లవాళ్లు దక్షిణ అమెరికా నుండి తీసుకువచ్చిన మొక్కే. దీని ఇంగ్లీషు పేరు ‘టుబేకో’ని పూర్తిగా విస్మరించి మనవాళ్లు దీనికి శుద్ధ తెలుగులో, పొగాకు అని పేరు పెట్టేరు. ఈ పేరు పెట్టిన వ్యక్తినీ, ‘డ్రెడ్జర్’కి తవ్వోడ అని పేరు పెట్టిన వ్యక్తిని మనం ఎంత గౌరవించినా సరిపోదు.
  • సపోటా: ఈ పండు కూడ దక్షిణ అమెరికాదే. అక్కడా దీన్ని సపోటా అనే అంటారు. అచ్చుతో అంతం అయిన పేరు కనుక మన భాషలో ఇది చక్కగా ఇమిడి పోయింది. నేను మెక్సికోలో ఈ పండు పేరు విన్నప్పుడు మన తెలుగు పేరే వాళ్లు తస్కరించేరని అనుకున్నాను.
  • సీతాఫలం, రామాఫలం: ఈ రెండు కూడ దక్షిణ అమెరికా పళ్లే. వీటికి నోరు తిరగని పేర్లు ఏవో ఉన్నాయి. మనవాళ్లు వీటికి తెలుగు పేర్లు కాకుండా సంస్కృతం పేర్లు పెట్టేరు. తెలుగు పేరు అయితే చివర ‘పండు’ వచ్చి ఉండేది. గమనించేరో లేదో ఈ రెండింటికే ‘ఫలం’ అనే తోక ఉంది; మిగిలినవాటన్నిటికీ ‘పండు’ తోకే!

    తోక ప్రస్తావన వచ్చింది కనుక, సీతాఫలం, రామాఫలంతో పాటు హనుమాఫలం ఉంటే బాగుంటుందని అనిపించింది. ఉష్ణమండలాలలో పెరిగే మరొక పండు పేరు ‘స్టార్ ఫ్రూట్.’ దీని స్వస్థలం శ్రీలంక. నున్నటి కాకరకాయ ఆకారంలో ఉండి అడ్డుకోతలో నక్షత్రాకారంలో ఉంటుందీ పండు. దీనికి నేను హనుమాఫలం అని పేరు పెట్టేసిన తరువాత దీనిని తెలుగులో అంబాణంకాయ అంటారని వికీపీడియాలో చదివేను. అంబాణంకాయ పేరు కన్న హనుమాఫలం పేరు బాగులేదూ?

ఇలా కొత్త భావాలకి తెలుగులో పేర్లు పెట్టే ధోరణి నా చిన్నతనం వరకు ఉండేది. కేవలం కాకతాళీయమో, కారణ-కార్య సంబంధం ఉందో తెలియదు కాని తెలుగు తిరోగమనం ఆంధ్ర రాష్ట్ర అవతరణతో మొదలయింది. ఈ రోజులలో, గోదావరి మీద కొత్త వంతెన కట్టేరు — అంటే మనల్ని చదువులేని బైతుల్లా చూస్తారు; గోదావరి మీద కొత్త బ్రిడ్జ్ కట్టేరు — అంటే పరవాలేదు. గోదావరి మీద నూ బ్రిడ్జ్ బిల్డుతున్నారు — అనే ప్రయోగం సుదూర భవిష్యత్తులో విన్నా వింటారు.

4. వైజ్ఞానిక విషయాన్ని అనువదించటం – నా సొంత దృక్కోణంలో

ఈ పత్రం యొక్క పరిధిలో పాఠ్యపుస్తకాలు లేవు కనుక ప్రభుత్వం వారు జారీ చేసిన నిబంధనలు కాని, తెలుగు అకాడమీ వారు ప్రచురించిన నిఘంటువులలోని పదజాలం కాని వాడాలనే నిర్బంధం నాకు లేదు. నా పరిధి అనుసరణల వరకే కనుక మూల గ్రంథాన్ని తు. చ. తప్పకుండా పాటించాలనే నిర్బంధం కూడ లేదు. మూలం లోని భావాన్ని సమగ్రంగా గ్రహించి, తిరిగి తెలుగులో చెప్పటమే నా ముఖ్యోద్దేశం. ఈ గమ్యం చేరుకోడానికి అవసరం అయితే పాఠ్యక్రమాన్ని మార్చడానికి కాని, మూలంలో ఉన్న ఉపమానాలని మార్చడానికి కాని, మూలంలో ఉన్న ఇంగ్లీషు మాటలకి సరి కొత్త తెలుగు మాటలని తయారు చేసి ప్రయోగాత్మకంగా వాడడానికి కాని వెనుక తియ్యను.

నేను తెలుగులో తిరగ రాయడానికి ముందు సాధారణంగా ఇంగ్లీషు మూలాన్ని — కేవలం అర్థం చేసుకునే నిమిత్తం — రెండు, మూడు సార్లు చదువుతాను. అప్పుడు ఆ పాఠాన్ని తెలుగులో చెప్పే నిమిత్తం కొన్ని ముఖ్యాంశాలని దృష్టిలో పెట్టుకుని తెలుగులో రాయటం మొదలు పెడతాను. రాతకి ఉపక్రమించే ముందు అందరికీ ఎదురయే సమస్యలే నాకూ ఎదురవుతాయి. మొదటిది, ఇంగ్లీషులో చదివినది పూర్తిగా అర్థం అయిందా? సాహిత్యాన్ని అనుకరించేటప్పుడు ఈ సందర్భంలో ఎదురయే సమస్యలు, ఇబ్బందులు వైజ్ఞానిక విషయాలని అనుకరించేటప్పుడు ఉండవు. ఈ సందర్భంలో మనకి కావలసినదల్లా భావ ప్రకటన; భాష అర్థం అయినంత మాత్రాన భావం అర్థం అవాలని లేదు. వృత్తి పదాల అర్థాలు తెలిసినంత మాత్రాన సరిపోదు. గణిత సమీకరణాల వ్యుత్పత్తి తెలిసినంత మాత్రాన సరిపోదు. వాటి వెనక ఉన్న భావసూక్ష్మత అవగాహనలోకి రావాలి. అనువాద లక్ష్యం తెలుగు అయినప్పుడు ఈ ఇబ్బంది ఇనుమడిస్తుంది. పాఠకులు శాస్త్రంతో పరిచయం లేని సామాన్యులు అయినప్పుడు ఈ ఇబ్బంది విషమిస్తుంది.

4.1 సారూప్యాల వాడుక

విజ్ఞాన శాస్త్రంలో కంటికి కనబడని ఊహనాల (కాన్సెప్ట్స్, concepts) అవసరం తరచు వస్తూ ఉంటుంది. చెప్పేది సుబోధకంగా ఉండడానికి పాఠకులకి పరిచయమైన నమూనాలు ఇటువంటి సందర్భాలలో వాడతారు.

ఉదా 1. నేను కళాశాలలో చదువుకునే రోజులలో ఇంగ్లీషులో రాసిన పాఠ్య పుస్తకాలు వాడేవాడిని. వాటిలో వస్తువుల ఆకారాలు వర్ణించటానికి ‘పిల్ బాక్స్, బ్రెడ్ బాక్స్, డోనట్’ వంటి సారూప్యాలు ఎక్కువగా కనిపించేవి. ఇవేమీ నాకు పరిచయమైన మాటలు కావు. పిల్లి అంటే తెలియని వాడికి మార్జాలం అంటే ఏమి తెలుస్తుంది? పిల్‌బాక్స్ అంటే మాత్రలు దాచుకునే పెట్టె. బ్రెడ్‌బాక్స్ అంటే రొట్టె దాచుకునే పెట్టె. డోనట్ అంటే చిల్లుగారె ఆకారంలో ఉండే తియ్యటి తినుబండారం. మా ఇంట్లో ఉండే హొమోపతీ మందుల సీసాలు అడ్డు కోతలో గుండ్రంగా ఉండేవి, కాని పిల్ బాక్స్ అడ్డుకోతలో చతురస్రాకారంగా ఉండి, అరచేతిలో పట్టేంత, చిన్న కుంకం భరిణంత పెట్టె. దీనిని ఇంగ్లీషు పరిభాషలో ‘రెక్టేంగ్యులర్ పేరలలోపైపెడ్’ అంటారు. ఈ నోరు తిరగని మాట చెపితే పిల్లలు భయపడతారని ఆ పుస్తకం రాసిన అమెరికా ఆసామీ ‘పిల్ బాక్స్’ అన్నాడు. అలాగే బ్రెడ్ బాక్స్ అంటే అదే ఆకారంలో ఉండే పెద్ద పెట్టె. డోనట్ అంటే చిల్లు గారె ఆకారం. అనుకరించేటప్పుడు మన అనుభవ పరిధిలో ఉన్న మాటలు వాడితే వ్రతమూ చెడదు, ఫలమూ దక్కుతుంది.

4.2 కొత్త మాటలు సృష్టించటం

కొత్త మాటలు పుట్టించవలసిన అవసరం రోజూ వస్తూనే ఉంటుంది. పరిశోధన చేసేటప్పుడు కొత్త భావాలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని నిర్ద్వందంగా వర్ణించడానికి కొత్త మాటలు అవసరం. ఉదాహరణకి, స్టేజ్ ఫియర్ అనే ఇంగ్లీషు మాటనే తీసుకుందాం. అనువాదం చేసే వేళకి ఈ భావానికి సరితూగే తెలుగు మాట తట్టలేదనుకుందాం. అప్పుడు ఏమి చేస్తాం? బద్దకిష్టులైతే ‘స్టేజ్ ఫియర్’ అని ఇంగ్లీషు మాట వాడెస్తారు. పైపెచ్చు, ‘తెలుగులో ఒకేబ్యులరీ లేదండీ’ అని తప్పు తెలుగుమీదకి తోసెస్తారు. ఇది అధమ మార్గం. కొంచెం ఆలోచనా శక్తి ఉన్నవాడయితే, ‘సభాకంపం’ అనే మాట సృష్టించి పబ్బం గడుపుకుంటాడు. ఇది మధ్యమ మార్గం. తెలుగు నుడికారంతో అలవాటు ఉన్నవాడయితే మనకి ఉన్న ‘సభాపిరికితనం’ అనే పదాన్ని అవసరానికి అనువుగా మార్చి ప్రసంగభయం అనో, సభాభయం అనో వాడుకుంటాడు. ఇది ఉత్తమ మార్గం.

ఉదాహరణ 2. గణితంలో తారసపడే ‘బౌండరీ కండిషన్’ అనే పదబంధాన్ని తీసుకుందాం. దీనిని ‘ప్రహరాంక్షలు’ అని అనువదించేను. ఈ పదబంధాన్ని సందర్భోచితంగా వాడి వినిపించినప్పుడు సభాసదులందరికీ ఏ ఇబ్బందీ లేకుండా విషయం అర్థం అయింది. అంటే ఏమిటన్నమాట? మనం కొత్తగా తయారు చేసే మాటలు అర్థగర్భితంగా, స్వయం విదితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు, ‘నీకు ఈ ఇంగ్లీషు మాటని ఇలా అనువదించడానికి అధికారం ఎవ్వరు ఇచ్చేరు?’ అని ఆక్షేపించకూడదు.

ఉదాహరణ 3. అమెరికాలో బాగా వాడుకలో ఉన్న ఫ్లీ మార్కెట్ (Flea market) అనే పదబంధాన్నే తీసుకుందాం. ఇది ఫ్రెంచి భాషలోని ‘మార్సే ఓ పూసే’ (ఈగల బజారు, Marche au puces) అన్న పదబంధానికి ఇంగ్లీషు అనువాదం. బహిరంగ మైదానంలో బడ్డీలు వేసి, వాటి మీద రకరకాల వస్తువులు (పాతవి, కొత్తవి) అమ్మే ప్రదేశం ఇది. బహిరంగంగా ఉన్న మైదానం కనుక ఈగలు మూగుతాయి. అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. ఇలాంటి బడ్డీలు మన దేశంలో పర్యాటక స్థలాలలో చూస్తూ ఉంటాం. మన ‘సంత’ వీరి ‘ఫార్మర్స్ మార్కెట్’తో తులతూగే అర్థాన్ని ఇస్తుంది.

ఫ్రెంచి మాటని యథాతథంగా వాడకుండా ఇంగ్లీషువాడు ఇంగ్లీషు వాసనతో ఎలా మార్చేడో అదే విధంగా ఇంగ్లీషు మాటని తెలుగు వాసనతో తెలుగులోకి ఎలా మార్చవచ్చో ఒక ఉదాహరణ ఇస్తాను. ఇంగ్లీషులో స్కై స్క్రేపర్ అనే మాట ఉంది. దీనిని ‘ఎత్తైన భవనం’ అంటే న్యాయం చేకూరదు. అందుకని దీనిని ‘అంబర చుంబితం’ అని అనువదించేను. ఆకాశహర్మ్యము అని కూడా అనవచ్చునేమో (ఇది పెంట్‌హౌస్‌కి మరింతగా నప్పుతుందని నాకనిపిస్తుంది.)

అనువాదం కాని, అనుసరణ కాని రాణించాలంటే భాష మీద పట్టు అవసరం. కాని అదొక్కటీ సరిపోదు. మంచి అనువాదానికి కావలసిన సామగ్రులు: (1) ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, సంబంధి పదకోశము. మాటలకి సాధికారమైన వర్ణక్రమాలు, నిర్వచనాలు, భాషాభాగాలు, వాడకానికి ఉదాహరణలతో కూడిన సూచనలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి ప్రక్రియలు, మొదలైనవన్నీ ఈ నిఘంటువులో ఉండాలి. ప్రతి ఇంగ్లీషు మాటకి వివరణాత్మకమైన అర్థం ఇస్తే సరిపోదు; ఆ ఇంగ్లీషు మాటకి సమానార్థకం అయిన ఒక తెలుగు మాట కాని తెలుగు పదబంధం కాని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. (2) తెలుగు లక్షణ గ్రంథం (స్టైల్ మేన్యువల్, style manual) కావాలి. ఈ గ్రంథంలో ఏయే భాషా ప్రయోగాలు అభిలషణీయమో సోదాహరణంగా చూపించాలి. (3) కొత్త వారికి ఒక ఒరవడిలా ఉపయోగపడే విధంగా సైన్సుని తెలుగులో బాగా రాసిన వారి రాతలు ప్రచారంలోకి తీసుకు రావాలి. తెలుగులో సైన్సుని వ్యక్తపరుస్తూ రాయలేమనే భ్రమని తొలగించాలి.

సైన్సుని తెలుగులో రాసేటప్పుడు ఎంత విస్తృతంగానూ, లోతుగానూ ఆలోచించి రాయాలో చవి చూపించటానికి ఈ దిగువ ఉదాహరణని పరిశీలించండి.

ఉదాహరణ 4. ఆధునిక శాస్త్ర రంగపు వేదిక మీద అణువు చాల ప్రథాన పాత్ర వహించింది కదా. అణువు అనే ఊహనం భారతీయ సంస్కృతిలో ప్రాచీనకాలం నుండీ ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో ‘ఎటామిక్ థియరీ’ని డాల్టన్ ప్రవచించడానికి సహస్రాబ్దాల ముందే వైశేషిక దర్శనంలో కాణాదుడు తన ‘అణు సిద్ధాంతం’ ఉద్ఘాటించేడు. కనుక పాశ్చాత్యుల ‘ఏటమ్’ మన ‘అణువు’తో సర్వ సమానం. అణువులు ఉన్నాయని ప్రతిపాదించటమే కాకుండా ‘ద్వయాణుకము, త్రయాణుకము’ అని రెండేసి అణువుల జంటలు, మూడేసి అణువుల జంటలు అనే ఊహనాలు కూడ ప్రవేశపెట్టేడు, కాణాదుడు. ఈ మాటలు రెండూ ఈనాటి ‘మోలిక్యూల్’ అనే భావనకి ముత్తాతలు.

కాని, ఈ రోజుల్లో, తెలుగు పుస్తకాలలో కొన్ని చోట్ల అణువుని ఏటమ్ అనే భావం తోనూ, కొన్ని చోట్ల మోలిక్యూల్ అనే భావం తోనూ వాడుతున్నారు. ఇదే ధోరణిలో ఏటమ్ అనే మాటని అణువు అని కొన్ని చోట్లా పరమాణువు అని కొన్నిచోట్లా అనువదిస్తున్నారు. కవిత్వంలో ఒకే భావానికి రకరకాల పేర్లు పెట్టి వర్ణిస్తే బాగుంటుంది కాని సైన్సులో ఒక మాటకి, ఆ మాట అర్థానికి మధ్య ఒక నిర్ధిష్టమైన లంకె ఉండాలి. లేకపోతే భావం గల్లంతు అయే ప్రమాదం ఉంది. ఈ లెక్కని ‘ఏటమ్’ అన్న మాటని ఎలా అనువదించాలి? అణువా? పరమాణువా?

ఈ ప్రహేళికని పరిష్కరించటానికి ఒక్క అడుగు వెనక్కి వేసి పరిస్థితిని సింహావలోకనం చేద్దాం. ఉదాహరణకి, అణు విద్యుత్తు, అణు బాంబు, అనే ప్రయోగాలు తరచు వినబడుతూ ఉంటాయి కాని, పరమాణు విద్యుత్తు, పరమాణు బాంబు, అన్న ప్రయోగాలు ఎప్పుడూ వినలేదు. కనుక అణువు అన్న మాటని ఏటమ్‌కి సమానార్థకంగా కేటాయిస్తే అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండకూడదు. అప్పుడు అణువులో ఉన్న ఎలక్‌ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు గురించి మాట్లాడవలసినప్పుడు వాటిని పరమాణువులు అనొచ్చు. ఈ పరమాణువుల కంటె చిన్నవి ఉన్నాయి. వాటిని పరమాణు రేణువులు అనొచ్చు.

ఇప్పుడు మోలిక్యూల్‌కి ఒక కొత్త మాట కావాలి. ఒక మోలిక్యూలులో రెండు కాని అంతకంటె ఎక్కువ కాని అణువులు ఉండొచ్చు కనుక కాణాదుడు వాడిన ద్వియాణువు, త్రయాణువు నప్పవు. బహుళంగా ఉన్న అణువుల మూకని బహుళాణువు లేదా – కొంచెం కుదించి – బణువు అని పిలవమని నా సలహా. ఒక నీటి బణువు చిన్న బణువుకి ఉదాహరణ; ఇందులో రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు మాత్రమే ఉంటాయి. రక్తానికి ఎరుపు రంగునిచ్చే పదార్థం పేరు ‘హీమ్’ ఒక్క హీమ్ బణువులో 75 నుండి 117 వరకు అణువులు ఉండొచ్చు. ఇటువంటి పెద్ద బణువులని బృహత్ బణువులు (మెగా మోలిక్యూల్స్, mega molecules) అనొచ్చు.

అణు బాంబులని మరొకసారి పరామర్శిద్దాం. ఈ బాంబులలో మళ్లా రెండు రకాలు: చిన్నవి, పెద్దవి. ఈ తేడా కేవలం పరిమాణాన్ని పురస్కరించుకుని కాదు. వాటి సిద్ధాంతాలే వేరు. వాటి నిర్మాణశిల్పమే వేరు. కనుక రెండింటినీ ఒకే పేరుతో పిలిస్తే ఎలా? ఇంగ్లీషులో ఈ రెండింటిని పిలవడానికి రకరకాల పేర్లు ఉన్నాయి. చిన్న జాతి బాంబులని ఏటమ్ బాంబు అని కాని, ఫిషన్ బాంబు అని కాని పిలుస్తారు. పెద్ద దానిని హైడ్రొజన్ బాంబు అని కాని, ఫ్యూషన్ బాంబు అని కాని, నూక్లియార్ బాంబు అని కాని పిలుస్తారు. తెలుగులో కూడ ఈ తేడాని గుర్తించాలంటే అణు బాంబుని ‘అణ్వస్త్రం’ అనిన్నీ, నూక్లియార్ బాంబుని ‘కణ్వస్త్రం’ అనిన్నీ అనమని నా సలహా. ఇంగ్లీషులో నూక్లియస్ అనే మాటని తెలుగులో కణిక అని తెలుగు భాషా పత్రికలో వాడటం చూసేను.

4.3 దుర్నామాలని సరిదిద్దటం

పరిభాషలో వాడే ఇంగ్లీషులో ‘అతకని’ పేర్లు తరచుగా తారసపడుతూ ఉంటాయి. ఏదైనా కొత్త విషయాన్ని పరిశోధించే మొదటి రోజుల్లో అవగాహన అస్పష్టంగా ఉంటుంది. అట్టి సమయాలలో, కేవలం అజ్ఞానం కొద్దీ, మనం అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అయినప్పుడు మనం తొందరపడి పెట్టిన పేరు అతకక పోవచ్చు. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో చెట్ల మీద నివసించే ఒక జంతువు చూడడానికి బుల్లి ఎలుగుబంటిలా ఉందని దానికి కొవాలా బేర్ (Koala bear) అని పేరు పెట్టేరు. దరిమిలా ఆ జంతువు ఎలుగుబంటి జాతికి చెందనే చెందదని తెలిసింది; కాని పెట్టిన పేరు అతుక్కుపోయింది. ఇదే విధంగా పీనట్, కోకోనట్ అన్న మాటలు ఇంగ్లీషులో దుర్నామాలు. వృక్షశాస్త్రం దృష్టిలో నట్ (nut) అనే మాట నిర్వచనంలో కోకోనట్ ఇమడదు. మనం తెలుగులో వాడే ‘కొబ్బరికాయ’ శాస్త్రీయంగా సరి అయిన ప్రయోగం; కొబ్బరికాయ ‘గింజ’ కాదు, అదొక పండు. అదే విధంగా పీనట్, గ్రౌండ్‌నట్, అనే మాటలు కూడ దుర్నామాలే (మిస్‌నోమర్స్, misnomers). మనం తెలుగులో వాడే వేరుశెనగ అన్న పేరు నిజానికి దగ్గర. అంటే ఏమిటన్నమాట? ఈ సందర్భంలో ఇంగ్లీషు పేర్ల కంటె తెలుగు పేర్లు శాస్త్రీయంగా సరి అయినవి.

ఈ సందర్భంలో మరొక ఉదాహరణ. ఇంగ్లీషులో బటర్ ఫ్లై (butterfly) అన్న మాటకి ఆ పేరు ఎలా వచ్చిందో, దానికి తెలుగులో సీతా (శీతా?) కోక చిలక అన్న పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు కాని బటర్ ఫ్లై లో ‘బటరూ’ లేదు, అది శాస్త్రీయంగా ‘ఫ్లై’ కాదు. సీతాకోక చిలకలో ‘సీత’ (శీత) లేదు, ‘కోక’ లేదు, అది ‘చిలక’ కాదు! అందువల్ల ఈ అనువాదంతో ఇబ్బందీ లేదు.

గణితంలో రేండమ్ వేరియబుల్ అనే భావం ఉంది. ఇది ‘రేండమూ’ కాదు, ‘వేరియబులూ’ కాదు. ఏదో ఇంగ్లీషులో పొరపాటు దొర్లి వాడుకలోకి వచ్చేసింది. ఇప్పుడు దీనిని ‘అనిర్ధిష్ట చలరాసి’ అని అనువదిస్తే అది అతకని అనువాదమే అవుతుంది. ఇది ఎంత అతకని పదబంధం అయినా ఈ ఇంగ్లీషు మాట పాతుకు పోయింది. దీని పేరు ఇప్పుడు మరమ్మత్తు చెయ్యలేము. కాని దీనికి తెలుగులో పేరు పెట్టాలనే ‘పిచ్చి’ ఉన్నవాళ్లు మాత్రం దీనిని అనిర్ధిష్ట చలరాసి అని తెలిగించకుండా స్వయం బోధకమైన మాటతో తెలిగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

భౌతిక శాస్త్రంలో పోలరైజేషన్ (Polarization) అనే భావం ఉంది. దీనిని ధ్రువీకరణ అని అనువదించటం శుద్ధ తప్పు; ఎందుకంటే పోలరైజేషన్ అన్న పేరు ఎంపికలో పొరపాటు జరిగింది కనుక. పూర్వం కాంతి రేణువుల రూపంలో ఉంటుందనిన్నీ, ఈ రేణువులకి అయస్కాంత ధ్రువాలలా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయనీ అనుకునేవారు. ఈ ధ్రువాలు సిపాయిలలా బారులు తీరి ఉన్నప్పుడు ఆ కాంతిని పోలరైజ్‌డ్ కాంతి అనమన్నారు. కాని దరిమిలా కాంతి కెరటాలులా ప్రవహిస్తుందనిన్నీ, ఈ కెరటాలు ఒకే సమయంలో రెండు దిశలలో (పైకి, కిందికి; ముందుకి, వెనక్కి) ఊగిసలాడుతూ ఉంటాయనీ తెలిసింది. కొన్ని రకాల అద్దాల గుండా కాంతి ప్రవహించినప్పుడు ఆ గాజు అద్దం గుండా పైకీ,కిందకీ ఊగిసలాడే కెరటమే వెళుతుంది కాని ముందుకీ, వెనక్కీ ఊగిసలాడేది వెళ్లలేదు. అంటే ఒక తలంలో ఊగిసలాడే కాంతి వెళుతుంది, దానికి లంబ దిశలో ఊగిసలాడే కెరటం అడ్డగించబడుతుంది. ఇదీ జరిగే తంతు. ఇందులో ఎక్కడా ధ్రువాలు లేవు. ఈ తంతుని ‘తలీకరణ’ అంటే బాగుంటుంది కాని, ధ్రువీకరణ అంటే తప్పు అర్థం స్పురిస్తుంది, అలా అనకూడదు. ఇలాంటి ఉదాహరణలు ఇంగ్లీషులో కోకొల్లలు. ఏదో ఇంగ్లీషువాడు పప్పులో కాలేస్తే వేసేడు, ఆ కాలు పట్టుకుని మనం ఎందుకు వేల్లాడటం? ఆలోచించండి.

జీవశాస్త్రంలో క్రోమోజోము అన్న మాటనే తీసుకుందాం. గ్రీకు భాషలో క్రొమో అంటే రంగు, సోమా అంటే పదార్థం కనుక ‘క్రోమోజోము’ ఒక రంగుపదార్థం. తెలుగులో ఈ మాటని యథాతథంగా ఉంచేసినా, రంగుపదార్థం అని అనువదించినా మనకి కలిగే మనో వికాసం శూన్యం. మరి ఇంగ్లీషువాడు వీటిని రంగు పదార్థం అని ఎందుకు అన్నాడు? జీవకణం లోని పదార్థం పారదర్శకంగా ఉంటుంది. దానిని పారదర్శకంగా ఉన్న గాజు పలకకి పులిమి, ఆ గాజు పలకని సూక్ష్మదర్శనిలో పెట్టి చూస్తే గాజు పలకకి, కణం లోని పదార్థానికి మధ్య విచక్షణ తెలిసేది కాదు. అందుకని కణానికి రంగు పులిమేవారు. వారు పులిమిన రంగు అంటుకున్న భాగాలు మనకి ఖణిగా కనిపించేవి. అలా ఖణిగా కనిపించిన పదార్థాన్ని రంగు పదార్థం లేదా క్రోమోజోము అని పిలవటం మొదలు పెట్టేరు. అంతేకాని ఆ పదార్థానికి స్వతహాగా రంగు లేదు. కనుక ఇంగ్లీషులో ‘క్రోమోజోము’ అన్న పేరు తప్పు. కాని దాని వాడుక పాతుకుపోయింది. దానిని మార్చమని నేను అడిగితే నన్ను ఏ పిచ్చాసుపత్రిలోనో పడెస్తారు. కాని దానికి తెలుగులో పేరు పెట్టవలసి వచ్చినప్పుడు ‘వారసవాహికలు’ అని తెలిగిస్తే ఎంత సుబోధకంగా ఉందో చూడండి. నేను ఇలా తాపత్రయం పడిపోతూ ఉంటే ఒక పెద్దమనిషి నా మీద జాలి పడి, “ఱావు గారూ, అలాగే లెండి. ఇటుపైన ‘కణములో కనిపించే వారసవాహికలని క్రోమోజోములు అందురు’ అని పాఠం చెబుతాను లెండ”ని నన్ను ఊరడించేడు.

అలాగని ఇంగ్లీషుని పరిపూర్ణంగా పరిత్యజించమనటానికి కూడ వీలు లేదు. రసాయన శాస్త్రంలో తారసపడే నిర్మాణక్రమాలు (స్ట్రక్చరల్ ఫార్ములాస్, structural formulas), సాంఖ్య క్రమాలు (ఎంపిరికల్ ఫార్ములాస్, empirical formulas) రాయవలసి వచ్చినప్పుడు మూలకాల పేర్లని ఇంగ్లీషు లిపిలోనే రాయాలని ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. మడిగట్టుకుని H2O ని ‘ఎచ్2ఒ’ అని రాయమనటం భావ్యం కాదు.

5. ముక్తాయింపు

తెలుగులో వైజ్ఞానిక విషయాల మీద రాసిన రాతలు బహు కొద్ది. తెలుగులో పాఠ్య పుస్తకాలు రాసే వారికి సైన్సు మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి. అయినప్పటికీ ఒక భాషలో రాసిన విషయాన్ని మరొక భాషలోకి మార్చటం తేలిక అయిన విషయం కాదు. సాహిత్యాన్ని అనువాదం చేసేటప్పుడు ఎదురయే సమస్యలు వేరు, విజ్ఞాన శాస్త్రాన్ని అనువదించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరు. తెలుగులో పారిభాషిక పదజాలం లేదంటూ ఆలోచనారహితంగా ఇంగ్లీషు పదబంధాల మధ్య తెలుగు క్రియావాచకాలని జొప్పించగా వచ్చే కంతిరీ భాష తెలుగూ కాదు, ఇంగ్లీషూ కాదు. అటువంటి భాష వాడితే ఇటు ఇంగ్లీషులోను, అటు తెలుగులోనూ ప్రతిభ లేదని చాటుకోవటమే అవుతుంది.

సంప్రదించిన గ్రంథాలు

  1. Sumanyu Satpathy, “Let a Hundred Tongues be Heard,” The Hindu, 27 Sep 2012.
  2. Constanza Gerding-Salas, “Teaching Translation: Problems and Solutions,” Translation Education, Vol. 4, No. 3, July 2000.
  3. Vallampati Venkatasubbayya, “అనువాదకళ, నా అనుభవాలు” (in Telugu), eemaaTa webzine, March 2000.
  4. Budaraju Radhakrishna, భాషశాస్త్ర వ్యాసాలు, Visalandhra Publishing House, Hyderabad, Second Printing, 1995.
  5. Ananda Kishore, The Rice Transliteration Standard for Telugu.
  6. G. N. Reddy, The Influence of English on Telugu Literature,1800-1950: with references to translations and adaptations.
  7. Md. Ziaul Haque, The Problems in Translating Literary Prose. Department of English, Sylhet International University, Shamimabad, Sylhet, Bangladesh.

Monday, October 14, 2019

పంటికింద పోకచెక్క

ఇది ఒక హోమియోపతీ వైద్యుడి కథ!

పంటికింద పోకచెక్క

1

కొమ్ములు తిరిగిన వైద్యులకి కూడ అంతు పట్టని జబ్బులని ఒక హోమియోపతీ వైద్యుడు కుదర్చగలడని ఎవ్వరైనా గప్పాలు కొడితే ఎవరు మాత్రం ఎలా నమ్మగలరు? అందులోనూ విశ్వవిద్యాలయంలో పి. ఎహ్. డి. పట్టా పుచ్చుకున్న నేనా?

2

ఘోసాసుపత్రికి ఎదురుగా ఉన్న వీధిలోనే మా అత్తవారి ఇల్లు. రామేశం పంతులు గారి ఇల్లంటే ఆ ఊళ్లో తెలియనివారుండరు. గేటు తెరుచుకుని, వాకిలి నిండా ఉన్న అరటి చెట్లని దాటుకుని వెళితే పర్ణశాలలా చిన్న ఒంటిదూలం పెంకుటిల్లు కనిపించేది. ముందు వరండా. ఆ వరండాని ఆనుకుని ఉయ్యాలా గది. దానికొక పక్క పడక గది, రెండవ పక్క దేవుడి గది. ఆ దేవుడి గది గోడ మీంచి ఒక పంచపాళీ దింపి దాన్ని వంట గదిగా వాడుకునేవారు. ముందు వరండా మీద, పడకగదిని ఆనుకుని, చిన్న పీలికంత కొట్టుగది. ఆ కొట్లేనే మందుల పుస్తకాలు, మందుల పెట్లు ఉండేవి. అందుకని దానిని మందులకొట్టు అనేవారు. ఆ మందులకొట్టుకి బయట, వరండా మీద ఎత్తయిన పెద్ద బల్ల ఉండేది. కచేరీలో పనయి ఇంటికొచ్చిన తరువాత రామేశంగారు ఆ బల్ల మీదే కొలువు తీర్చేవారు. పెద్దనక, పిల్లనక, ఉన్న వాళ్లనక, లేని వాళ్లనక, ఊరు వాళ్లనక, పైఊరు వాళ్లనక, ఎప్పుడూ ఎవ్వరో ఒకరు పంతులుగారి సలహా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. 

ఆ రోజు ఆదివారం. సంత పని చూసుకొని, మరీ పొద్దెక్కిపోకుండా నాలుగు మెతుకులు కతికి, అలవాటు ప్రకారం చుట్ట చుట్టిన పరుపుని ఆసరాగా పెట్టుకుని, కునుకు తీద్దామన్న ఉద్దేశంతో నడ్డి వాల్చి, రాత్రి అల్లుడు తెచ్చిన పుస్తకం చదవడం మొదలు పెట్టేరు రామేశం గారు. ఇంతలోనే వీధి గుమ్మంలో కారు ఆగింది. కారు తలుపు తెరుచుకుని ఒకామె, ఆమె వెనకాతలే ఒక చిన్నమ్మాయి దిగేరు. పొరుగూరు నుండి పక్కనే ఉన్న ఘోషాసుపత్రికి ఎవ్వరో పేషెంట్లు వచ్చి ఉంటారని అనుకుని రామేశం గారు పుస్తకంలో తల దూర్చేసిన తలని పైకి తీయదలుచుకోలేదు. ఇంతలో ఇద్దరూ గేటు తెరచుకుని లోపలికి రావడం ఓరకంటితో గమనించిన రామేశం గారు

“అమ్మాయీ! ఎవరో వచ్చారు, చూడమ్మా.” ఆని అనడమూ,

“రామేశం గారి ఇల్లు ఇదేనా?” అని ఆమె వాకబు చెయ్యడమూ ఒకేసారి జరిగేయి.

తండ్రి పిలుపుకి కూతురు బయటకి వచ్చి ఆగంతకులని పరకాయించి చూసింది. పెద్దామెకి ముప్ఫయ్ దాటి ఉండొచ్చు. ఆమె దేహకాంతిలో పాలమీగడలాంటి స్నిగ్ధత పాలు ఎక్కువ, దబ్బ పండును పోలిన పసిమి ఛాయ తక్కువ. దమ్మిడీ అంత బొట్టు, సింగారంగా చుట్టిన సిగ, చెవులకి రవ్వల దుద్దులు, సన్నటి శంఖం లాంటి  పొడుగాటి మెడ, పువ్వుల వాయిల్ చీర, చేతిలో చేతిసంచి, కాళ్లకి చెంకీ చెప్పులు. పిల్లకి పదేళ్లు ఉంటాయేమో.

“ఎవరు కావాలండీ?”

“అమ్మా, రామేశం పంతులు గారు ఉన్నారా?”

“నేనేనండి, రామేశాన్ని” అని అంటూ రామేశం గారు బల్ల మీద లేచి కూర్చుని, పక్కనుక్క కాశీ తువ్వాలు తీసి భుజం మీద వేసుకుని, “ఎవరి తాలుకమ్మా?” అని అడిగేరు.

“నన్ను స్వరాజ్యలక్ష్మి అంటారండి. నారికేళవలస జమీందారు గారి తాలూకండి. మావారే వద్దామనుకున్నారు. కాని ఆయనకి వ్యాపకాలు ఎక్కువ.”


“నారికేళవలస అంటే బరంపురం దగ్గర కదూ? జగన్మోహనరావు బహద్దరు గారి బంధువులా….” అంటూ అర్థ గర్భితంగా మాటని మధ్యలోనే ఆపేసి, “దయచేయండి” అంటూ ఆహ్వానించేరు.

ఈ కుశల ప్రశ్నలు ఇలా అవుతూ ఉండగా కూతురు వచ్చిన వారు కూర్చుందుకి వరండాలో చాప వేసి కూర్చోబెట్టి, సేద తీర్చుకుందికి చల్లటి మంచి నీళ్లు ఇచ్చి చెయ్యవలసిన కనీసపు మర్యాదలు చేసింది.

“మా సరోజకి వచ్చిన రోగం ఏమిటో తెలుసుకుందామని తిరగని ఊరు లేదండి. వైజాగు నుండి వెల్లూరు వరకు అన్ని ఊళ్లూ తిరిగేమండి.” చల్లకొచ్చి ముంత దాచడమెందుకని వచ్చిన పనేమిటో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది స్వరాజ్యలక్ష్మి.

“పడిశం పడితే పల్సటిల్లా, దెబ్బ తగిలితే ఆర్నికా అంటూ ఇంట్లో పిల్లలకోసం నేర్చుకున్న పంచదార మాత్రల వైద్యం అమ్మా నాది. ఏదో ఆప్తులు అడిగితే కాదనలేక ఒక మాత్ర అడపా తడపా ఇచ్చేనేమో. మీరేదో నా మీద గౌరవం కొద్దీ వచ్చేరు. సంతోషం.  ఇది నా తలకి మించిన పని. పోనీ, పిఠాపురం డాక్టరు గారికి చూపించలేకపోయేరా?”

“పిఠాపురం డాక్టర్లు, బెండపూడి యోగులు, పెందుర్తి భూతవైద్యులు,... అంతా అయేరండి. మేము చూడని స్పెషలిస్టు లేడండి. ఆఖరికి, యెలమంచిలిలో ఓరుగంటి సోమసుందరం గారు లేరండీ? వకీలు గారు. మీ కాళ్ల మీద పడమని సలహా ఇచ్చింది ఆయనే! మీరు కాదంటే వల్ల కాదు.”

స్వరాజ్యలక్ష్మి ఇలా అంటూ ఉండగానే డ్రైవరు ఒక సజ్జ చేతితో పట్టుకుని వచ్చి యజమానురాలి కనుసన్న కోసం చూస్తూ వేచి ఉన్నాడు. సజ్జలో పళ్లు, వాటి మీద ప్లేస్టిక్ సంచిలో కంచి పట్టు చీర, రవికల గుడ్డ, పసుపు, కుంకం, తమలపాకులు, వక్కలు ఉన్నాయి. సజ్జని డ్రైవరు చేతిలోంచి అందుకుని, కొంగుతో చెయ్యి తుడుచుకుంటూ వంట గదిలోంచి బయటకి  వచ్చి ఉయ్యాల గదిలో తలుపు చాటున నిలబడ్డ సీతమ్మ గారి చేతికి ఇచ్చి, వంగి, ఆవిడ పాదాలకి దండం పెట్టింది స్వరాజ్యలక్ష్మి.

“అమ్మా! మీరు ఒక్క మారు నా తరఫున బాబుగారితో చెప్పి....”

ఈ తతంగం అంతా ఇలా జరుగుతూన్నంత సేపూ సరోజ ఉలుకూ పలుకూ లేకుండా, బెల్లం కొట్టిన రాయిలా, కదలకుండా, మెదలకుండా అలా వరండాలో ఒక కర్ర కుర్చీలో కూర్చొని ఉంది. విగ్రహం అంటే కుర్చీలో ఉంది కాని దృష్టి మాత్రం ఎక్కడో ఉంది. రామేశం గారు పిల్లని ఓరకంటితో చూస్తూనే ఉన్నారు.

సీతమ్మ గారు సజ్జని అందుకుని ఏవో క్షేమ సమాచారపు ప్రశ్నలు రెండు వేసి,

“ఎండకి బాగా అలసిపోయినట్లు ఉన్నారు. కాస్త ఫలహారం ఏదైనా చేసి పట్టుకు వస్తాను” అని లోపలికి వెళుతూ, “ఆ పంకా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టమ్మా” అని కూతురుకి పురమాయించించేరు.

“ఎంత ఎండా కాలంలో అయినా ఉదకమండలంలా ఉండే మన వరండాలో ఫేను ఎందుకమ్మా, ఆ పెరటి తలుపు తెరిస్తే గాలి రివ్వున వస్తుంది,” అంటూ రామేశం గారు అతిథిని ఉద్దేశించి మళ్లా అందుకున్నారు.

“చూడండమ్మా. ఎండవేళప్పుడు వచ్చేరు. ఒక గంట అయినా ఇక్కడ కూర్చుని సేద తీర్చుకోకుండా ఎలాగూ మా ఆవిడ మిమ్మల్ని తిరిగి  వెళ్లనివ్వదు. ఈ లోగా నాలుగు ప్రశ్నలు అడుగుతాను. మీకు చేతనయినంత మేరకి సమాధానాలు ఇవ్వండి. నాకు చేతనయిన సలహా ఇస్తాను,” అంటూ స్వరాజ్యలక్ష్మి సమాధానం కోసం ఆగకుండా,

“పిల్ల చూడ్డానికి చాల అర్భకంగా కనిపిస్తోంది. పుట్టినప్పటినుండి ఇలానే ఉందా లేక ఈ మధ్య ఏదయినా సుస్తీ చేసిందా?”

ఈ ప్రశ్నకి తల్లి సమాధానం చెప్పేలోగా సరోజ గొంతుకలోంచి ఒక విచిత్రమైన శబ్దం వచ్చింది. గదిలో పిల్లిని బంధించి తలుపుకు గొళ్లెం పెడితే ఆ పిల్లి పెట్టే కూతలా ఉందా శబ్దం.

“ఛప్, సరూ! ఆ శబ్దం చెయ్యొద్దని ఎన్ని సార్లు చెప్పేను. పెద్దవాళ్ల ఎదుట అలా ప్రవర్తించవచ్చా?”

తల్లి గదమాయింపుకి ప్రతిస్పందనా అన్నట్లు సరోజ ఆ చప్పుడు చెయ్యడం ఆపేసింది. కాని సరోజ దృష్టి మాత్రం ఎక్కడో ఉన్నట్లు ఉంది.

“సరోజ సాధారణంగా చాల బుద్ధిమంతురాలు. ఆ మాయదారి రోగం ప్రకోపించినప్పుడల్లా ఇలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. నేను వర్ణించి చెబితే ఎవ్వరూ నమ్మడం లేదు. మీరు చూస్తున్నారు కదా. ఇదీ ఈ పిల్లకి వచ్చిన మాయదారి రోగం.”

రామేశం గారు పిల్లని అలా పరికించి చూస్తూనే ఉన్నారు. ఆ పిల్ల లోకమే వేరు.

“వెల్లూరులో కాని, వైజాగులో కాని పిల్ల ‘ఆటిస్టిక్’ అని ఎవ్వరైనా చెప్పేరా?”

స్వరాజ్యలక్ష్మికి ఆ ‘ఆటిస్టిక్’ అన్న మాట అర్థం అయినట్లు లేదు.

రామేశం గారు ఈ విషయం పసికట్టి, “ఆటిజం అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచంతో నిమిత్తం లేనట్లు ప్రవర్తించే ఒక రకం లక్షణ సముదాయం. ఇది ఒకొక్కరిలో ఒకొక్క విధంగా అభివ్యక్తం అవుతుంది.”


“లేదండి. ఈ రోజంటే ఇలా ఉంది కాని సాధారణంగా బాగా కలుపుగోలుగా ఉండే పిల్లండి. ఈ మాయదారి రోగం విజృంభించినప్పుడు మాత్రం దయ్యం పట్టిన పిల్లలా ప్రవర్తిస్తుంది.”

“ఎంత తరచుగా వస్తూ ఉంటుందీ విజృంభణ?”

“ఏటికి ఒక సారో రెండు సార్లో వస్తుందీ పిశాచం. వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. లేనప్పుడు చిలకలా ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. అదృష్టం బాగుండి ఈ రోజు మీరు చూస్తూండగా వచ్చింది. మేము రాయవెల్లూరు వెళ్లినప్పుడు ఆసుపత్రిలో నెల్లాళ్లు మకాం వేసేం. పిల్ల చిలకలా ఉంది. డాక్టర్లు చూస్తూ ఉండగా ఒక్క సారి రోగం విజృంభించేలా చెయ్యి నాయనా అని ఆ వేంకటరమణమూర్తికి మొక్కుకున్నాను కూడా. లేని పోని రోగాలని పిల్లకి ఆపాదించే పిచ్చిదానిలా నన్ను జమకట్టెస్థారేమోనని భయపడ్డాను. పోనీలెండి. ఇప్పటికయినా  ఆ దేవుడికి దయ కలిగింది.”

ఇది వచ్చినప్పుడు ఎంత ఏపు ఉంటుంది?” ఈ జబ్బు ఇదమిత్థంగా ‘ఇదీ’ అని తేలలేదు కనుక, దాన్ని ఏ పేరు పెట్టి పిలవాలో తెలియక రామేశం గారు ‘ఇది’ అనేసి ఊరుకున్నారు.

“వచ్చినప్పుడల్లా రోజో, రెండ్రోజులో, వారమో, రెండు వారాలో ఉంటుంది. ఎప్పుడొస్తుందో తెలియదు. ఎన్నాళ్లుంటుందో తెలియదు.”

“ఇది మూర్చ రోగమని ఎవ్వరైనా నిర్ధారణ చేసేరా?”

“మెడ్రాసులో డాక్టర్లకి చూపించేమండి. బుర్రకి తీగలు తగిలించి మెదడులో నాడీ తరంగాలని పరీక్షించి చూసేరండి. రక్తపు పరీక్ష అన్న మిషతో చిట్టితల్లి చేతులనిండా, కనీసం పది సార్లయినా, తూట్లు పెట్టేసేరండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా! ఇది నా బుర్రకి పట్టిన రోగమా? లేక, నా చిట్టితల్లికి పట్టిన దయ్యమా?”

“పరీక్షలేనా? లేక, ఎవ్వరైనా ఏదయినా మందు ఇచ్చేరా?”

“ఒక డాక్టరు మూర్చ రోగమని ‘డైలేన్‌టిన్ సోడియం’ ఇచ్చేరండి. కిందటి వారం వైజాగులో మరొక డాక్టరు ‘టెగ్రిటాల్’ వాడమన్నారండి. ఏ మందు వాడినా వీసమెత్తు గుణం కనిపించడం లేదండి. అసలీ వైద్యాల వల్ల లేని రోగాలు తెచ్చిపెట్టుకుంటూన్నామేమో అని భయంగా ఉంటోందండి.”

రామేశం గారికి ఈ రోగం యొక్క ఆద్యంతాలు అర్థం కాలేదు. 

“అమ్మాయికి మొట్టమొదటిసారి ‘ఇది’ వచ్చినప్పుడు వయస్సెంత?”

స్వరాజ్యలక్ష్మి మెల్లగా పూర్వ చరిత్ర చెప్పుకొచ్చింది.

“సరోజకి మూడేళ్ల వయస్సు వచ్చేవరకు ఏ రోగమూ, రొష్టూ లేకుండా చిలకలా ఉండేది. మూడేళ్లప్పుడు మెడ్రాసులో మావయ్య ఇంటికి వెళ్లింది. అక్కడ అరుగు మీదనుండి కింద పడి మోచెయ్యి విరగ్గొట్టుకుంది. అప్పుడు ఆ చేతి మీద శస్త్రం చెయ్యవలసి వచ్చింది. ఆ సందర్భంలో మత్తు మందు వాడేరు. కోతి పుండు బ్రహ్మ రాక్షసి అయింది. సర్జరీ అయిన తరువాత పిల్లకి మరి మెలుకువ రాలేదు. పిల్ల కోమా లోకి వెళ్లిపోయింది. మత్తు మందు పడక మెదడు దెబ్బ తిందేమోనని అనుమానపడ్డారు. ఊళ్లో పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి కనుక “సి.టి. స్కేను” తీసి చూడగలిగేరు. మెదడు బాగానే ఉందన్నారు. తరువాత “ఏంటీబయటిక్కులు,” “స్టీరాయిడ్లు” – ఇలా ఒకటేమిటి. డాక్టర్లు ప్రయత్నం చెయ్యని మందు లేదు. ఫలితం మాత్రం శూన్యం. పిల్ల చచ్చిపోయిందనే అనుకున్నాం. ఏదో గుడ్డిలో మెల్ల. బతికి బయట పడింది.”

రామేశం గారు అంతా శ్రద్ధగా వింటున్నారు. మత్తు మందు లోంచి తేరుకుని వెంటనే బయట పడలేదు. అదొకటి. మత్తు మందు వాడిన తరువాతే సరోజకి ఈ వింత జబ్బు వచ్చింది. ఈ రెండింటికి ఏమిటి సంబంధం?

“పిల్ల అలా కోమాలో ఎన్నాళ్లు ఉంది?”

“రెండు వారాలండి. ఆ రెండు వారాలూ రెండు యుగాలులా గడిచేయండి. పిల్ల పక్కనే ఉండి జాగరం చేసేనండి. అక్కడ డాక్టర్లు వాళ్లకి తెలిసినంతవరకు పిల్లకి ఏ జబ్బూ లేదంటారండి! కాని కోమాలోకి ఎందుకు వెళ్లిపోయిందో, కోమా నుండి బయటకి ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోయారండి.

“ఈ డాక్టర్ల మీద ఆధారపడి లాభం లేదని నేనే చొరవ చేసి అక్కడ ఉన్న గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలెన్నో తిరగేసి చూసేనండి. గ్రీకు భాషలో ‘కోమా’ అంటే ఘాటైన నిద్ర అని అప్పుడు తెలిసింది. ఈ రకం ఘాటు నిద్రలో ఉన్న వారికి పక్కన బాంబులు వేసినా మెలుకువ రాదుట. సూదితో గుచ్చినా మెలుకువ రాదుట. అంత తీక్షణమైన నిద్రట. కోమాలో పడ్డవారి జ్ఞానేంద్రియాలు మూసుకు పోయాయన్నమాట. మనవాళ్లు ‘చెవులకి గెడలు పడిపోయాయి’ అనే పదజాలాన్ని వాడుతూ ఉంటారు. అదేనేమో కోమా అంటే! ఏది ఏమయితేనేమి, కోమాలో పడ్డవాళ్లకి మళ్లా మెలుకువ వచ్చి మన లోకంలో పడాలంటే వాళ్లతో మనం మాట్లాడుతూ ఉండాలిట. శరీరాన్ని నిమురుతూ ఉండాలిట. అలా కొన్నాళ్లు పోతే, మన అదృష్టం బాగుంటే, జ్ఞానేంద్రియాలకి పడ్డ మూతలు తెరుచుకునే అవకాశం ఉందిట. అందుకని సరోజ చేతులు నిమురుతూ, ఇష్టమైన పాటలు పాడుతూ, కబుర్లు చెబుతూ, పిల్లని ఒక్క క్షణం వదలకుండా పదిహేను రోజులు కాపలా కాసేను.  నా నోములు ఫలించేయి. ఓక రోజు సరోజ అకస్మాత్తుగా లేచి, ‘అమ్మా’ అని పలకరించింది.”

స్వరాజ్యలక్ష్మి ఇలా కథనం చెబుతూ ఉంటే సరోజ రామేశం గారు కూర్చున్న బల్ల దగ్గరకి వెళ్లి, బల్ల మీద బుగ్గ ఆనించి, విగ్రహంలా నిలబడింది.

రామేశం గారు పిల్లని ఎగా, దిగా చూసి, కాసింత కంగారు పడి, కర్తవ్యం తోచక పిల్ల చేతిని తన చేతిలోకి తీసుకుని నాడి చూడడం మొదలెట్టేరు.

“మరేమీ పరవా లేదండి. ఆ రోగం వచ్చినప్పుడల్లా ఈ ప్రవర్తన ఇలాగే ఉంటుందండి,” అని స్వరాజ్యలక్ష్మి ధైర్యం చెప్పింది.

“ఈ మొదటి సంఘటన తరువాత పిల్ల మామూలుగా అయిపోయిందా?”

“ఏం మామూలండి. పక్షవాతం వచ్చినట్లు ముఖం కుడి పక్క అంతా వాచిపోయిందండి. ఆ వాతంతో జన్మంతా బాధ పడాల్సిందే అని డాక్టర్లు తీర్మానించి చెప్పేరండి. కాని, డాక్టర్లు చెప్పింది ఎప్పుడు నిజం అయిందండి? వారం రోజుల్లో వాతపు లక్షణాలు అన్నీ హరించుకుపోయాయండి. పూర్తిగా నయం అయిపోయిందనే అనుకున్నాను. కాని మళ్లా ఎప్పుడో ఆ రోగం కమ్ముకు వస్తుందండి. ఆ తరువాత ముఖానికి వాతం కమ్ముతుంది. తరువాత దానంట అదే సర్దుకుంటుంది.”

రామేశం గారు బల్ల పక్క గూట్లో ఉన్న పలక, బలపం తీసుకుని, ఆ పలక మీద వరుసగా ‘మత్తు మందు వాడిన తరువాత మొద్దు నిద్ర, ‘ ‘ముఖానికి పదే పదే పక్షవాతం’ అని రాసుకుంటూ,

“ఇప్పటికి ఈ రుగ్మత ఎన్ని సార్లు ఇలా విజృంభించి ఉంటుందంటారు?”

“ఏటికి రెండు, మూడు సార్లయినా వస్తూ ఉంటుందండి. ఇప్పటికి కనీసం పాతిక సార్లయినా వచ్చి ఉంటుందని నా అంచనా.”

“ఇంకేమయినా చెప్పగలరా? కొంచెం జ్ఞాపకం చేసుకోండి.”

స్వరాజ్యలక్ష్మి కొద్ది సేపు ఆలోచించి, తనకి తట్టినది చెప్పదగ్గ లక్షణమో కాదో అని తటపటాయించి, “ఇది వచ్చినప్పుడల్లా మాట ఖణిగా రాదండి.”

“మాట ఖణిగా రాదు” అని పలక మీద రాసుకున్నారు.

“నిద్ర లేమి కూడానండి. ఇది వచ్చినప్పుడల్లా రెండు, మూడేసి రోజులు అస్సలు నిద్రపోదండి. తను నిద్రపోకపోతే ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటుందో అని నేను కూడా నిద్రపోకుండా పిల్లకి కాపోలా కాస్తానండి.“

ఇప్పుడు రామేశం గారికి అర్థం అయింది, స్వరాజ్యలక్ష్మి ముఖం ఎందుకు అలా అలసిపోయినట్లు కనిపిస్తోందో. పలక మీద ‘నిద్ర లేమి’ అని రాసుకుంటూ,

“అమ్మా! ఆ బీరువాలో ఉన్న ఎర్ర బైండింగు ఉన్న పుస్తకం ఒక సారి ఇలా పట్టుకురా, తల్లీ” అంటూ కూతురికి పురమాయించేరు.

ఆయన అలా రాసుకుంటూ ఉంటే ఎందుకో స్వరాజ్యలక్ష్మికి ధైర్యం పెరిగి మరొక విషయం జ్ఞాపకం తెచ్చుకుంది.

“అకస్మాత్తుగా రెండు, మూడు పర్యాయాలు ‘నొప్పి, నొప్పి’ అని బాధ పడిందండి. ఒక సారి గుండెల్లో నొప్పి వస్తే ‘హార్ట్ ఎటాక్’ అన్నారండి. చిన్న పిల్లకి హార్ట్ ఎటేక్ ఏమిటండి? మరొక సారి కడుపులో నొప్పి వస్తే ‘ఎపెండిసైటిస్’ అని చెప్పి ఆపరేషన్ చేస్తామన్నారండి. ఒక సారి ఆపరేషన్ చేయించి అనుభవిస్తున్నాం కదండి? అందుకని ఒప్పుకోలేదు. నొప్పి దానంటట అదే తగ్గిపోయిందండి.”

రామేశం గారు తన పలక మీద ఉన్న జాబితాని ఒక సారి తేరిపార చూసేరు. 
“మత్తు మందు, మొద్దు నిద్ర, ముఖానికి పక్షవాతం, మాట నములుడు, నిద్రలేమి, నొప్పి.”

ఆయన కనుబొమ ముడి పడింది. ఈ లోగా కూతురు పుస్తకాన్ని ఆయనకి అందించింది. ఆ పుస్తకంలో పుటలని కొంతసేపు ఇటూ అటూ తిరగేసి, తరువాత తను చదువుతూ చదువుతూ తలగడ కింద దాచిన అల్లుడు ఇచ్చిన పుస్తకాన్ని ఒకసారి సంప్రదించి, తల పైకైనా ఎత్తకుండా,

“జబ్బు చేసినప్పుడు పిల్ల మూత్రం రంగులో ఏదైనా మార్పు గమనించేరా?”

ఈ ప్రశ్న వినగానే స్వరాజ్యలక్ష్మి ముఖ కళవళికలలో వచ్చిన మార్పుని వర్ణించడం కష్టం; చూసి తీరాల్సిందే!

“ఏడేళ్ల బట్టి దేశం అంతా కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నానండి. బాబూ, మీరే ఈ ప్రశ్న వేసేరు. జబ్బు చేసినప్పుడల్లా పిల్ల మూత్రం పసుపు పచ్చగా కాకుండా, ముదర రంగులో పడుతుందండి. మీరు అడిగేవరకు ఈ జబ్బుకీ ఆ రంగుకీ సంబంధం ఉందనే అనుకోలేదండి.”

కూతురి జబ్బు అప్పుడే నయం అయిపోయినంత ఉత్సాహం ఆమె కంఠంలో ద్యోతకం అయింది. 

“అమ్మా! మీ అమ్మాయిని అట్టి వేధిస్తూన్న జబ్బు ఏమిటో కొంచెం చూచాయగా ఆచూకీ దొరికింది. లక్షణాలని బట్టి ఇది ‘ఎక్యూట్ ఇంటర్మిటెంట్ పోర్ఫిరియా’ అన్న జబ్బులా అనిపిస్తోంది. నా అనుమానమే నిజం అయితే ఇది చాల అరుదుగా వచ్చే జబ్బు. ఈ జబ్బుని నేను కుదర్చగలనో లేనో చెప్పలేను.”

“బాబు గారూ! ఇంతవరకు పిల్లకి ఏ జబ్బూ లేదని దబాయించినవారే. అలా దబాయిస్తూనే మందులిచ్చిన్వాళ్లు కొందరు, ఆపరేషన్లు చేస్తామన్నవాళ్లు మరికొందరు. తమరు కుదర్చ గలిగినా లేకపోయినా పరవా లేదు. మా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. కనీసం ఆ జబ్బు ఏమిటో నాకు అర్థం అయేటట్లు చెప్పండి” అని స్వరాజ్యలక్ష్మి ప్రాధేయపడింది.

ఈ లోగా సీతమ్మ గారు పళ్లెంలో ఫలహారం పెట్టి పట్టుకొచ్చి తినమని బలవంతం చెయ్యడంతో, మొహమాటపడుతూనే పుచ్చుకున్నారు.

‘ఎక్యూట్ ఇంటర్‌మిటెంట్ పోర్ఫిరియా’ అనేది వంశపారంపర్యంగా వచ్చే జబ్బని రామేశం గారికి తెలుసు. పిల్లకి ఈ జబ్బు వచ్చిందంటే దాని అంకురం తల్లిదండ్రులలో ఉండి తీరాలి. ఎటు నుండి వచ్చిందో తెలుసుకుందామని, ఆవిడ ఫలహారం చేస్తూన్నప్పుడే, రామేశం గారు కూపీ లాగడానికి ప్రయత్నం మొదలు పెట్టేరు.

“మీరు చూలింతరాలుగా ఉన్నప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉండేది?”

ఫలహారం చేస్తూన్న స్వరాజ్యలక్ష్మి కింది దవడ జారిపోయింది! ఆమె ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ‘ఈయన ఆవలిస్తే పేగులు లెక్కపెట్టెస్తున్నాడు’ అని లోలోపలే అనుకుని, పిల్ల మూత్రం రంగుకీ తను గర్భవతిగా ఉన్నప్పుడు తన ఆరోగ్యానికి మధ్య లంకె అర్థం కాక,

“బాబు గారూ! మీరు నా ముఖం చూసి నా జాతకం చెప్పెస్తున్నారు. నేను సరోజని మోస్తూనున్నాళ్లూ మంచం మీదనే ఉన్నాననుకొండి. రెండు సార్లు ఆసుపత్రిలో కూడ జేర్పించవలసి వచ్చింది. మొదటి సారి నెల తప్పేనని తెలిసిన కొద్ది రోజులకే నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. గర్భం నిలవదేమోనని కంగారు పడ్డారు. డాక్టర్లకి అర్థం కాక కడుపుని కోసి, లోపల చూసి, ఏమీ లేదని నిర్ధారించేరు. తరువాత నొప్పి ఎలా వచ్చిందో అలానే పోయింది.”
“రెండవ సారి?”

“ఒక నెల్లాళ్లు పోయిన తరువాత, ఒకటే వాంతులు. వేవిళ్లు అనుకున్నాను. ఆసుపత్రిలో ఆరు వారాలు ఉన్నాను. శరీరం ఎండిపోతూ ఉంటే ‘సేలీను’ ఎక్కించి బతికించేరు.”

సరోజకి వచ్చిన జబ్బేమిటో అదే జబ్బు తల్లికి కూడ ఉందని పంతులుగారికి అవగాహన అయిపోయింది. లక్షణాలు తేడా. మరికొంచెం తవ్వి చూడాలి.

“మీ వారి ఆరోగ్యం గురించి కొంచెం చెబుతారా?”

“ఆయన జన్మలో జిర్రున చీదెరగరు. వాళ్ల వాళ్లంతా ఆరోగ్యవంతులే.”

“మీ పుట్టింటి వారి ఆరోగ్యం సంగతి ఏమి చెప్పగలరు?’

“మావాళ్లంతా ఎప్పుడూ ఏవో జాడ్యాలతో మూలుగులేనండి. మా అమ్మ బాగానే ఉండేదండి. వైద్యుడి దగ్గర దాపరికాలు కూడదంటారు కనుక చెబుతున్నాను. మా నాన్న అడపా తడపా మయికంతో ఇంటికి వచ్చేవాడండి. తాగుడేమోనని మొదట్లో అనుమానించేరు. కాని, ఆయనకి ఆల్కహాలు పొడ కిట్టదండి. మా పెద్దత్తకి కూడ మూర్చ రోగం లాంటిదేదో ఉండేదండి........”

రామేశం గారు ఇంక ఆలశ్యం చెయ్యదలుచుకోలేదు. 

“అమ్మా! ఇది వంశపారంపర్యంగా సంక్రమించే జబ్బని నా మనస్సు ఘోష పెడుతోంది. మీ తండ్రి గారు తాగినవాడిలా తూలుతూ కనిపించేరంటే అది కూడ ఈ రోగ లక్షణమే. ఆని నా అనుమానం. మీరు చూలింతరాలుగా ఉన్నప్పుడు వచ్చిన కడుపు నొప్పి కూడ ఈ రోగ లక్షణమే అయి ఉంటుంది.”

“ఈ జబ్బు నివురు కప్పిన నిప్పులా మా అందరిలోనూ ఉన్నా మేము మా జీవితాలని ఈడిచేస్తున్నాం కదా. మా సరోజ ఏం పాపం చేసుకుంది?”

“ఇది జన్యు రోగం అమ్మా. ఇది అందరిలోనూ ఒకేలా ప్రకోపించదు.  సరోజలో ప్రకోపన ఎక్కువగా ఉంది. అది మీ దురదృష్టం.”

“బాబు గారూ! మీరు చెప్పిన మాటలన్నీ అమృత వాక్కులులా ఉన్నాయి. మీ అమృత హస్తంతో మీరే మా సరోజ నోట్లో మూడు మాత్రలు వెసి ఇంత పుణ్యం కట్టుకొండి. మీకు రుణపడి ఉంటాను.”

రామేశం గారి మస్తిష్కంలో ఒక నైతిక సమశ్య ఎదురయింది. జన్యు రోగాలు మన జీవకణాలలో ఉన్న వారసవాహికలో ఉన్న లోపాల వల్ల వస్తాయి. ఈ వారసవాహికలు తల్లిదండ్రుల నుండి పిల్లలకి సంక్రమిస్తాయి. వీటిల్లోనే మన భవిష్యత్తు అంతా రాసి పెట్టి ఉంటుంది. కనుక జన్యు రోగాలని కుదర్చడం అంటే విధి వ్రాతని మార్చడం అన్నమాట. పైపెచ్చు ఈ జీవకణాలు శరీరం అంతటా ఉంటాయి. ఎన్నని మరమ్మత్తు చెయ్యగలం? ఈ రకం జబ్బులకి మందు లేదని చెప్పడమా? లేక, మందు వేస్తూన్నట్లు నటించి, రోగికి కొంచెంనమ్మకం కలిగించి, లక్షణాల ఉపశమనానికి పునాది వెయ్యడమా?

“అమ్మా! ఎక్యూట్ ఇంటర్‌మిటెంట్ పోర్ఫిరియా కి ఇంగ్లీషు వైద్యంలో ప్రస్తుతానికి మందు లేదు. హోమియోపతీలో ఫలానా జబ్బుకి ఫలానా మందంటూ ఎప్పుడూ లేదు. ఒక వ్యక్తిని సమగ్రంగా పరిశీలించి ఆ వ్యకి వ్యక్తిత్వానికి సరిపోయే మందు ఇస్తాం కాని రోగ లక్షణాలకి కాదు. కనుక నేను మందు ఇచ్చినా కుదురుతుందని ఆశపెట్టి ఇవ్వలేను. మందు వేసుకుని, నేను చెప్పిన పథ్యాన్ని తు. చ. తప్పకుండా పాటిస్తే కొంత ఉపశమనం కలగవచ్చు.”

“చెప్పండి. ఎన్నో మందులు వాడి ఇంతవరకు కాలహరణం చేసేం. మీరిచ్చే మందు పని చేస్తుందని ఆశగా ఉంది..”

“మీరు మొట్టమొదట చెయ్యవలసిన పని ఆ ఇంగ్లీషు మందులు మానెయ్యడం. ఆ  ‘డైలేంటిన్ సోడియం,’ ని ఆ ‘టెగ్రిటాల్’ ని చెత్త కుండిలో పారెయ్యండి. తరువాత పథ్యం. కర్బనోదకాలు ఎక్కువగా ఉన్న భోజనమే పెట్టండి. అంటే మాంసం, గుడ్లు, వగైరా మానేసి శాకాహారాలే పెట్టండి,” అని చెప్పి, కూతురుని పిలచి, “అమ్మా! మన మందుల పెట్టెలో, కింద అరలో, మూడో వరసలో  ఉంటుంది, ‘సేక్‌లేక్ సిక్సెక్స్’ సీసా ఇలా పట్టుకురా, తల్లీ” అని పురమాయించేరు.  

కూతురు ముసుముసి నవ్వులు నవ్వుతూ పట్టుకొచ్చిన సీసా అందుకుని, స్వయంగా పరీక్షించి, చేతి చెమట తగిలితే మందు గుణం చెయ్యదని చెబుతూ, అందులోని మాత్రలు తిన్నగా సరోజ నోట్లో పడేటట్లు వేసి,

“అమ్మా! నెల్లాళ్లవరకు మరొక మోతాదు అక్కరలేదు. ఎందుకైనా మంచిది, వైజాగు వెళ్లి డాక్టరు సత్యనారాయణ గారికి కూడ ఒక సారి చూపించండి. ఉత్తరం రాసిస్తాను. రక్త పరీక్ష చేయించి నా నిర్ణయం సరి అయినదో కాదో ఆయన రూఢి పరిస్తే మీకూ ధైర్యంగా ఉంటుంది, నాకూ సంతృప్తిగా ఉంటుంది.”

“బాబు గారూ, మీ మాట మీదే మాకు నమ్మకం. అయినా మీ మాట కాదనడం ఎందుకు. అలాగే రక్త పరీక్ష చేయిస్తాను. మరి తమ ఫీజు ఎంతో.....” అంటూ స్వరాజ్యలక్ష్మి లేచి నిలబడింది.

“అమ్మా! ఇంతవరకు నేను ఎవ్వరినీ చిల్లి గవ్వ ఫీజు ఇమ్మని అడగలేదు.  సంతోషంగా తమలపాకులు, అరటిపండు చేతిలో పెడితే నా కదే పది వేలు. అయినా అమ్మాయికి గుణం కనిపించాలి కదా. క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రాండి. శలవ్!”

3

మావగారు వైద్యం చెసే వయినం అంతా పక్కనున్న పడక గదిలోని కిటికీ గుండా పరికిస్తూనే ఉన్నాను. స్వరాజ్యలక్ష్మి కారు చప్పుడు విన్న తరువాత వరండాలో మావగారి దగ్గరకి వచ్చేను.

“పెద్ద పెద్ద డాక్టర్లకి అంతు పట్టని విషయాన్ని మీరెలా పట్టగలిగేరండీ?”

“చూడు అల్లుడూ! ముందస్తుగా హోమియోపతీ వైద్యానికీ, ఎల్లోపతీ వైద్యానికి మధ్య తేడా చెప్పనీ. ఇంగ్లీషు డాక్టరు దగ్గరకి వెళితే నిన్ను రెండు, మూడు నిమిషాల కంటె ఎక్కువ సేపు చూడడు.  చూడలేడు. ఎందుకంటే, వాళ్లకి ఎంత మంది పేషెంట్లని చూస్తే అంత డబ్బు.  స్వరాజ్యలక్ష్మి కథ వినడానికి నాకు గంటన్నర పైగా పట్టింది. ఈ సమయంలో ఆమె గురించి, వారి వంశం గురించి తెలుసుకోగలిగేను కనుకనే ఇది జన్యు రోగమని నిర్ధారించగలిగేను.

“ఎల్లోపతీ వైద్యులు రోగ లక్షణాలు వింటారు తప్ప రోగిని చూడరు. వాళ్ల దృష్టిలో ఈ శరీరం ఒక యంత్రం. రక్తం, మలం, మూత్రం, వగైరాలు అన్నీ పరీక్షిస్తారు తప్ప రోగిని మనిషిలా చూడరు. రోగి పది లక్షణాలు చెబితే పది మందులు రాసిస్తారు. రోగి సంసారం గురించి వాళ్లకి అక్కర లేదు. హోమియోపతీ వైద్యం దీనికి వ్యతిరేకం. మాకు రోగం కంటె రోగే ముఖ్యం. మనిషి, ఆ మనిషి ఆలోచనా సరళి, తత్వం, ఆ మనిషి అలవాట్లు, ఇంట్లోవాళ్ల అలవాట్లు – ఇవన్నీ మాకు కావాలి. రోగిని ఒక వ్యక్తిగా అర్థం చేసుకోవడం ప్రథాన అంశం. రోగ లక్షణాలు ద్వితీయాంశం.

“కలకత్తాలో మహేంద్రనాథ్ సర్కార్ అని పేరుపడ్డ హోమియో వైద్యుడు ఒకాయన ఉండేవాడు. ఆయన రోగి ముఖం చూసి, నడక తీరు చూసి, మనిషి వాటం చూసి, ఒక్క ప్రశ్న అయినా అడగకుండా మందు ఇచ్చి కుదిర్చేవాడుట. ఆ కథ మరొక సారి చెబుతా కాని......

“కాలం, కర్మం కలిసి రావాలంటారు చూడు. అలాగ ఈ దినం నాకు కలిసొచ్చిన రోజు. రోగం విజృంభించిన సమయంలో సరోజని పరీక్ష చేసే సదవకాశం నాకు ఒక్కడ్కే దొరికింది. మిగిలిన వైద్యులంతా ఆమెని ఆరోగ్యంగా ఉన్న పరిస్థితిలోనే చూసేరు. నేను బరంపురంలో ఉద్యోగం చేసే రోజుల్లో నారికేళవలస జమీందారుగారి గురించి విన్న కథలు కొన్ని ఆధారాలు ఇచ్చేయి. ఆఖరికి నువ్వు నిన్న రాత్రి అనుకోకుండా రావడం కూడ ఒక విధంగా ఈ సమస్యని పరిష్కరించడానికి తోడ్పడిందనుకో!

“రాత్రి నువ్వు పట్టుకొచ్చిన పుస్తకంలో “బ్రిటిష్ రాజవంశంలో జబ్బులు” అనే శీర్షిక కింద ఒక వ్యాసం ఉంది.   బ్రిటిష్ రాజులలో మూడవ జార్జి ఒక వింతయిన జబ్బుతో బాధ పడేవాడట. సరోజకి వచ్చినట్లే లక్షణాలు అడపా, తడపా పొడచూపేవట. వణుకు, అపస్మారం, అర్థం కాని నొప్పి, నిద్రలేమి, మొదలయిన లక్షణాలు చూసి ఆనాటి వైద్యులు ఏమీ చెయ్యలేకపోయారుట. కాని వాళ్లు చేసిన మంచి పని ఏమిటంటే జార్జి ప్రభువు లక్షణాలు, ఆయనకి వారు చేసిన వైద్యం, అంతా పూసగుచ్చినట్లు పుస్తకాలలో రాసి ఉంచేరుట. ఈ మధ్య, అంటే 1966 లో, ఇద్దరు బ్రిటిష్ డాక్టర్లు ఆ పుస్తకాల దుమ్ము దులిపి ఒక కొత్త సిద్ధాంతం లేవదీశారుట. ఆ సిద్ధాంతం ప్రకారం జార్జి ప్రభువు ‘ఎక్యూట్ ఇంటర్మిటెంట్ పోర్ఫొరియా’ తో బాధ పడ్డాడని తీర్మానించేరు. ఆ వ్యాసం నిన్న రాత్రే చదివేను. రెండూ, రెండూ కలిపేను. అంతే.

“ఈ జబ్బు ఇంగ్లండు మొదలయిన పాశ్చాత్య దేశాలలోనే ఉంది. తెల్ల వారి సంపర్కం వల్ల మన దేశంలో కూడ వ్యాపించిందని నా అనుమానం.

ఈ “పోర్ఫొరియా’ అనేది రక్త సంబంధమైన అనేక జబ్బులకి ఉమ్మడిగా పెట్టే పేరుట. ఈ జబ్బు ఉన్నవారి శరీరం హిమోగ్లోబిన్ అనే ప్రాణ్యాన్ని సరిగ్గా తయారు చెయ్యలేదుట.

ఈ హిమోగ్లోబిన్ లో హీం లేదా రక్తచందురం అనే రంజన ద్రవ్యం, గ్లోబిన్ అనే ప్రాణ్యం ఉంటాయి. ఈ హీం రక్తానికి ఎరుపు రంగుని ఇస్తుంది. 

“ ‘పోర్ఫొరియా’ ఉన్న వారి శరీరంలో రక్తచందురానికి కావలసిన ఘటకద్రవ్యాలు అన్నీ తయారవుతాయి కాని అవి రక్తచందురం పొందవలసిన ఆకారం పొందకుండా మధ్యంతరంగా ఆ ప్రక్రియ ఆగిపోయి, ఆయా ముడి పదార్థాలు రక్తంలో అలా ఉండిపోతాయి.  ఇలా ఆగిపోడానికి జన్యు పదార్థంలో లోపమే కారణం. దీనికి పర్యవసానంగా శరీరం పాలిపోవడం, నీరసించడమే కాకుండా, రక్తం విషపూరితం అవడం మొదలు పెడుతుంది. కొంతవరకు మూత్రపిండాలు ఈ విష పదార్థాన్ని వడగట్టి మూత్రం ద్వారా బయటికి తోడెస్తాయి. అందుకనే ఈ జబ్బు చేసిన వారి మూత్రం కోకాకోలా రంగులో ఉంటుందిట. రక్తంలో ఈ విష పదార్థాలు ఉన్నన్నాళ్లూ రకరకాలయిన దుర్గుణాలు కనిపిస్తాయిట. అవే నొప్పులు, తిప్పులు, వికారాలుగా మనకి ప్రస్పుటమవుతాయి. ఇదంతా నువ్వు రాత్రి పట్టుకొచ్చిన పుస్తకంలో చూసేనోయ్!

“అసలు సరోజకి పుట్టుకతోటే ఈ రోగం వచ్చింది. మెడ్రాసులో చేతికి ఆపరేషను చేసినప్పుడు ఇచ్చిన మత్తు మందు పడి ఉండదు. పైపెచ్చు ఆ ‘ట్రామా’ నిద్రాణంగా ఉన్న జబ్బుని రెచ్చగొట్టి ఉంటుంది. ఈ రోజు జబ్బు ఉద్రేకించడానికి కారణం వారం రోజుల క్రితం వాడిన ‘ఫీనోబార్బిటాల్’ అని నా అనుమానం. అందుకనే ‘టెగ్రిటాల్ వెంటనే మానెయ్యమని చెప్పేను.”

“మావగారి ప్రజ్ఞా పాటవాలకి ముక్కు మీద వేలేసుకుంటున్నాను” అని చెప్పేను పక్కనున్న నా శ్రీమతితో.

“నారికేళవలసకీ ఈ జబ్బుకీ ఉన్న సంబంధం ఏమిటో నాకు బోధపడలేదు” అంది శ్రీమతి.

“నారికేళవలస జమీందారు ఒకాయన ఇంగ్లీష్ అమ్మాయిలతో జరిపిన కృష్ణలీలలు గురించి అడవి బాపిరాజు నారాయణరావు నవలలో ఒక చోట ప్రస్తావించేరు. బరంపురంలో ఉద్యోగం చేసిన వాడిని కనుక అదంతా కట్టుకథ కాదని నాకు తెలుసు,” అంటూ రామేశం గారు మసాల అందించేరు. 

“’ ‘ఇది జన్యు రోగం. దీనికి మందు లేదు’ అని చెబుతూనే మీరు ఆ అమ్మాయికి ఏదో అమందు ఇచ్చేరు. ఇది ధర్మమేనా?” అని నేను ప్లేటు ఫిరాయించేను, తెలుగు సాహిత్యం చదవనందుకు నన్ను నేనే నిందించుకుంటూ.

“నేను ఆ అమ్మాయి నోట్లో వేసినవి పంచదార మాత్రలోయ్! ఏదో మందు పుచ్చుకుంటున్నానన్న సంతృప్తి, ఆ మందు పని చేస్తుందన్న నమ్మకం లేకపోతే ఏ జబ్బూ నయమవదోయ్!”

“మరితే మందేదీ ఇవ్వనప్పుడు.......”

“మందివవ్కపోవడమేమిటోయ్. వెర్రి కక్కగట్టలా ఉన్నావ్.  మాంసం ముట్టొద్దనీ, కర్బనోదకాలు తినమనీ చెప్పేను కాదోయ్.  ఇదేఎల్లోపతీ డాక్టరు అయితే ‘హై కార్బ్ డయట్’ అని ఇంగ్లీషులో చెబుతాడు. పుట్టుకతో వచ్చినె జబ్బుకి పథ్యమే పరమౌషధం. మోతాదుగా తిన్న తిండే కదుటోయ్ మందు అంటే,” అని రామేశం గారు చిన్న కునుకు తియ్యడానికి తలగడ మీదకి జారబడుతూ ఉండగా గేటు తెరుచుకుని సత్యవరం అప్పన్న తాత ఒక మోద తమలపాకులతో ప్రత్యక్షం అయేడు.

“ఆదోరం సంతకొచ్చా బాబూ. తవఁ దరిసెనం సేసుకోని, తవఁ కాళ్లొకసారి పట్టుకోని పోదావని ఒచ్చేను బాబయ్యా! డరమ పెబువులు. పదేళ్ల కితం సచ్చిన బొందికి పేణం పోసి బతికించేవి కదా. ఏదో పేడోణ్ణి. ఈ తవలపాకులు తప్ప ఇంకేదీ ఇచ్చుకోలేను.  బాబూ నేను సచ్చిన తరువాత ఈ సెరమం ఒలిపించి చెప్పులు కుట్టించుకోండి.....”

“తాతా, నువ్వు చావా వద్దు.  మాకు చెప్పులూ వద్దు. ణువ్వు వారం వారం, బతికున్నన్నాళ్లూ, ఇలా మాకు తమలపాకులు పట్టుకురానక్కర లేదని నీకెన్ని సార్లు చెప్పేను? ఎండలో వచ్చేవు. నీకింత అన్నం పెడతాను. తిని కాసేపు నీడని అలా పడుక్కో!” అంటూ సీతమ్మ గారు గదమాయించేసరికి 

“దమ్మ పెబువులు” అంటూ తాత అరిటాకేసుకుని చతికిల పడ్డాడు. 

రామేశం గారు అప్పటికే చిన్న కోడి కునుకు లోకి జారుకున్నారు.

(ఆంధ్ర ప్రభ వార పత్రిక, మార్చి 1996 (వారం వారం కథా ప్రభ శీర్షిక లో)

Friday, May 25, 2018

గుళిక రసాయనం అనబడే క్వాంటం కెమిస్ట్రీ



నేను రాసిన పుస్తకాలలో మూడు తెలుగు ఇ-పుస్తకాలు అంతర్జాలం ద్వారా ఉచితంగా
దింపుకొనే వెసులుబాటు కల్పించేను. కినిగె వారి సమాచారం ప్రకారం దింపుకోలు
గణాంకాలు ఇలా ఉన్నాయి:


Total downloads

రామానుజన్ నుండి ఇటూ, అటూ: 1729
ఫెర్మా చివరి సిద్ధాంతం: 493
చుక్కల్లో చంద్రుడు - చంద్రశేఖర్ చరిత్ర: 302


కానీ ఈ 2,524 వ్యక్తులలో ఒక్కరు - మాటవరసకు ఒక్కరు - వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చిన
పాపాన్న పోలేదు: బాగుంది, బాగులేదు, అర్థం అవలేదు, వగైరా. మిగిలిన రచయితల
సంగతి నాకు తెలియదు కానీ నా రాతలపై స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలనే
కుతూహలం నాకు ఉంది. కనీసం పుస్తకాన్ని విపణివీధిలో పెట్టినప్పుడు అమ్మకాల
గణాంకాలు చూసి పాఠకుల స్పందనని అంచనా వెయ్యవచ్చు. అందుకని పుస్తకాలని
ఉచితంగా పంచిపెట్టడంలో విజ్ఞత కనిపించడం లేదు. ఈ కోణంలో ఆలోచించి నా
తరువాత పుస్తకాన్ని విక్రయించడానికే నిశ్చయించుకున్నాను.


నేను ఇదివరలో జనరంజక శైలిలో చాల సైన్సు పుస్తకాలు రాసేను. కాని ఆ పుస్తకాలలో
గణిత సమీకరణాలు వంటి బరువైన అంశాలు లేకుండా జాగ్రత్త పడ్డాను. “మనవాళ్లకి
గణితం అంటే భయం లేదు, మీరు ధైర్యంగా గణితం వాడి ఒక పుస్తకం రాయండి,”
అని ఒక మిత్రుడు ప్రోత్సాహపరచడంతో “క్వాంటం కెమెస్ట్రీ” ని తెలుగులో పరిచయం
చెయ్యడానికి ఒక చిన్న పుస్తకం రాసేను. కినిగె (kinige.com) సంస్థ ప్రచురించేరు.


ఈ పుస్తకం రసాయన శాస్త్రం అధ్యయనం చేసే విద్యార్థులని ఉద్దేశించి రాసినది.
అలాగని ఇది పాఠ్య పుస్తకం కాదు. జనరంజక శైలిలో రాసినదీ కాదు. మధ్యే మార్గంలో
ఉంటుంది. అమెరికాలో ఉన్నత పాఠశాలలో ఉన్న 12 వ తరగతి విద్యార్థులు కానీ,
కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు కానీ ఈ స్థాయిలో ఉన్న పాఠ్యాంశాలని
చదువుతారు. అందుకని తెలుగు దేశంలో మొదటి సంవత్సరం కళాశాల విద్యార్థులకి
ఇది అందుబాటులో ఉంటుందనే అనుకుంటున్నాను.


ఇది 20 వ శతాబ్దపు ఆరంభ దశలో భౌతిక, రసాయన శాస్త్రాలలో జరిగిన విప్లవాల కథ.
ఏదో కాశీమజిలీ కథలు చదివేసినట్లు కాకుండా కాసింత దృష్టి నిలిపి చదివితే అర్థం
అవుతుంది. కథలోని పతాక సన్నివేశాలు చదివి ఆనందించాలంటే గణితం సహాయం
లేకుండా సాధ్యం కాదు. అందుకని గణిత సమీకరణాలు వాడక తప్పలేదు. ఆ సమీకరణాలు
ఎలా ఉత్పన్నమయాయో అర్థం కాకపోయినా అవి చెప్పే కథ అర్థం చేసుకుంటే విషయం
లోతుగా అర్థం అవుతుంది.

పేరుకి రసాయన శాస్త్రం అని అన్నాను కానీ, ఈ  పుస్తకంలో ఎక్కువగా కనిపించేది
రసాయన శాస్త్రానికి కావలసిన భౌతిక శాస్త్రపు పునాదులు, ఆ శాస్త్రంలో కనిపించే
వాదాలు (theories), ప్రయోగాలు (experiments), వాటిని ఆకళింపు చేసుకోడానికి
కావలసిన గణితం. భౌతిక శాస్త్రంలో వచ్చిన “గుళిక విప్లవం” (quantum revolution)
రసాయన శాస్త్రాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.

Sunday, May 13, 2018

ప్రాణి ఎలా పుట్టింది?



అనాది కాలం నుండీ మానవ మేధస్సుని వేధిస్తూన్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. 

నేను ఎవరు? ఎక్కడనుండి వచ్చేను? “నేను” అంటే ఏమిటి? భౌతిక శరీరమా? లేక ఈ శరీరానికి చైతన్యాన్ని ఇచ్చే ప్రాణమా? ప్రాణం అంటే ఏమిటి? ఆత్మ అన్నా ప్రాణం అన్నా ఒకటేనా? ఆత్మకీ (soul), ప్రాణానికీ (life), చేతస్సుకీ  (consciousness) సంబంధం ఏమిటి? అసలు ప్రాణికీ జడ పదార్థానికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? 

ఈ ప్రశ్నలకి ఆధునిక శాస్త్రీయ దృక్పథంతో సమాధానాలు వెతకడం కోసం "ప్రాణి ఎలా పుట్టింది?" అనే పేరుతో ఒక ఇ-పుస్తకం kinige.com ద్వారా ప్రచురించేను.  ఈ నాటి జీవశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో జడ పదార్థం నుండి ప్రాణి ఎలా పుట్టుకొచ్చిందో చాలమట్టుకి అర్థం అయింది. కాని మరొక ప్రాణి సహాయం లేకుండా, కేవలం జడ పదార్థంతో మొదలుపెట్టి, ప్రయోగశాలలో ఆ జడ పదార్థానికి ప్రాణం పొయ్యడం మనకి ఇంకా చేతకాలేదు. రేపో, మాపో అదీ జరుగుతుంది. అనాది కాలం నుండీ నేటి వరకు ఈ దిశలో శాస్త్రీయ పరిశోధన లోని ముఖ్య ఘట్టాలని సందర్శించడమే ఈ పుస్తకం యొక్క ముఖ్య లక్ష్యం. 

అంతే కాదు. జడ పదార్థానికి ప్రాణం పోసి మనం సాధించేది ఏమిటి? ఈ అన్వేషణ, ఈ పరిశోధన, అంతా కేవలం మన కుతూహలం అనే దాహం తీర్చుకోడానికేనా? లేక, ఈ విద్య సముపార్జించడం వల్ల మన దైనందిన అవసరాలు తీరుతాయా? ఈ పరిజ్ఞానం వల్ల మన జీవితాలని - మన ఆర్థిక పరిస్థితిని, మన ఆరోగ్య పరిస్థితిని - మెరుగుపరచుకునే సావకాశాలు ఉన్నాయా? మన ప్రధాన లక్ష్యం మీద గురి ఉంచి, దారిలో ఎదురయే ఈ ప్రశ్నలకి కూడ సమాధానాలు వెతుకుదాం. 

"ఇరవయ్యో శతాబ్దం భౌతిక శాస్త్రాలు (physical sciences) కి స్వర్ణయుగం అయితే ఇరవయ్యొకటవ శతాబ్దం జీవశాస్త్రాలు (biological sciences) కి  స్వర్ణయుగం కాబోతూంది" అని విజ్ఞులు అంటున్నారు. ఈ మాటలో నిజం ఎంతో అతిశయోక్తి ఎంతో  నిర్ధారించి చెప్పలేను కాని, ఒకటి మాత్రం నిర్ద్వందంగా నిజం – భౌతిక శాస్త్రపు పరిధి కంటె జీవశాస్త్రపు పరిధి బాగా పెద్దది. ఉదాహరణకి  అమెరికా ప్రభుత్వం జీవశాస్త్రం మీద పెట్టే ఖర్చు చూసినా, జీవశాస్త్రపు పరిధిలో ఉన్న పనివారి సంఖ్య చూసినా, జీవశాస్త్రంలో మనం చేసే పరిశోధనల వల్ల  మనకి వచ్చే లాభాలని లెక్క వేసుకొన్నా – ఇలా ఏ దృక్కోణంలో చూసినా - జీవశాస్త్రం ఇరవయ్యొకటవ శతాబ్దాన్ని ఏలెస్తుందనడంలో సందేహం లేదు. నిజానికి జీవశాస్త్రపు లోతుల్లో ఉన్న రహస్యాలని పరిశోధించి వెలికి తీసుకు రావడం వల్ల కలిగే తాకిడి మన ఆర్ధిక వ్యవస్థనీ, నైతిక దృక్పథాన్నీ, ఆఖరికి మన మనుగడనీ విపరీతంగా ప్రభావితం చేస్తుందనటంలో సందేహం లేదు. కనుక ఈ పుస్తకంలో సృజించే విషయాలు కేవలం జీవశాస్త్రపు విద్యార్థులనే దృష్టిలో పెట్టుకుని రాసినవి కావు. జనసామాన్యం, పాలక వర్గాలు కూడ తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ ముచ్చటించేను.

జీవశాస్త్రం (biology), జీవ సాంకేతికం (biotechnology), జన్యు సాంకేతికం (genetic technology) కూడ కలన యంత్రాలు తొక్కిన దారి వెంబడే ప్రయాణించిన పక్షంలో – అంటే ఒక మహా పరిశ్రమలా కొద్దిమంది చేతులలో కాకుండా, "ఇంటింటా ఒక సొంత కంప్యూటరు" తో ఒక కుటీర పరిశ్రమలా తయారయిన నాడు – జీవశాస్త్రపు పరిశ్రమలకి కూడ ఒక స్వర్ణ యుగం వస్తుంది. మొన్న మొన్నటి వరకూ బీద దేశంగా మగ్గిన భారత దేశం కంప్యూటర్ల ధర్మమా అని అకస్మాత్తుగా మధ్య తరగతి దేశమైనట్లే, ఈ జన్యు సాంకేతికం కూడ కుటీర పరిశ్రమలా పరివర్తన చెందిన నాడు మన దేశం మరొక అడుగు ముందుకు వేసి సకల ఐశ్వర్యాలతో తులతూగుతుందని జోశ్యం చెబుతున్నాను. ఆ రోజు ఎప్పుడు వస్తుంది? కంప్యూటరు పరిశ్రమ ఊపు ఎలా అందుకుందో అటువంటి పరిస్థితులు మళ్లా జన్యు సాంకేతికం విషయంలో సమకూడిన నాడు!  కంప్యూటర్ల ధర నలుగురికీ అందుబాటు లోకి రావటం, కంప్యూటరు వాడకానికి క్రమణికలు (programs) రాయగలిగే ప్రతిభ అందరికీ అవసరం లేకపోవటం, అంతర్జాలం (Internet) అనే రహదారి ద్వారా సమాచారాన్ని ప్రపంచంలో ఒక మూల నుండి మరొక మూలకి లిప్త మాత్రపు కాలంలో పంపగలిగే స్థోమత రావటం – ఈ మూడూ కంప్యూటర్లని కుటీర పరిశ్రమగా మార్చటానికి తోడ్పడ్డాయి. ఈ రకపు త్రివేణీ సంగమం  జీవసాంకేతిక రంగంలో ఏర్పడిననాడు - అంటే, వినియోగదారులకి అనుకూలమైన స్నేహశీల (user-friendly) వాతావరణం వచ్చిన నాడు - మనం కంటూన్న కల నిజం అవుతుంది. 

జన్యుసాంకేతికంలోని కీలకమైన భావాలు జనసామాన్యానికి, పాలకవర్గానికి అవగాహన అయితే ఒరిగేదేమిటి? ఈ రోజుల్లో వార్తాపత్రికలలో తరచుగా వచ్చే వార్తలలో రెండు ముఖ్యాంశాలు కనబడుతున్నాయి: ఒకటి, బహుళజాతి సంస్థలు లాభాపేక్షతో జన్యుపరంగా మార్పులు చేసిన పంటలని మన రైతుల నెత్తి మీద వేసి రుద్దుతున్నారనిన్నీ, వీటి వల్ల మన కర్షక వర్గానికి ధన నష్టం, ప్రాణ నష్టం కలగడమే కాకుండా ఈ కొత్త రకం ఆహారం తినడం వల్ల ప్రజాబాహుళ్యం వ్యాధిగ్రస్తం అవుతున్నాదనీ ఆందోళన చేస్తున్నారు. రెండు, జన్యు సాంకేతికం అవగాహనలోకి వస్తూన్నకొద్దీ ఇంతవరకు లొంగని రోగాలకి క్రొంగొత్త మందులు కనిపెడుతున్నారనిన్నీ, వీటి వల్ల కేన్సరు, డయబెటీస్, వంశపారంపర్యంగా సంక్రమించే కొన్ని రకాల జన్యు రోగాలకి చికిత్స దొరుకుతుంద్నీ ఆశ పడుతున్నారు. ఒక పక్క నుండి భయం! మరొక పక్క నుండి ఆస! చీకటిలో కాలికి మెత్తని తాడు తగిలితే అది పాము అని భయపడతాం. ఆ చీకటిలో ఒక వెలుగు రేఖ ప్రసరించగానే  అది పాము కాదనీ, కేవలం తాడు మాత్రమేననీ తెలిసిన తరువాత ఆ భయం పూర్తిగా పోతుంది. ఈ పుస్తకం అటువంటి కిరణరేఖని ఒకదానిని ప్రసరించగలిగితే నా ప్రయత్నం సఫలం అయినట్లే.


Wednesday, February 7, 2018

మోల్ అంటే ఏమిటి?


రసాయన శాస్త్రంలో "మోల్" అనే భావం చాలా కీలకమైనది. ఈ మాట అర్థం కాక విద్యార్ధులు చాల తికమక పడుతూ ఉంటారు.

నా చిన్నతనంలో బజారుకి వెళ్లి సరుకులు కొన్నప్పుడు కొన్ని కొలమానాలు వాడేవాడిని. డజను అరటి పళ్లు, వంద మామిడి పళ్లు, కుంచం బియ్యం, శేరు పాలు, వీశ వంకాయలు, బుట్టెడు రేగు పళ్లు, ఇలా ఉండేవి ఆ రోజుల్లో కొలమానాలు. ఇంట్లో వంట వండేటప్పుడు చేరెడు బియ్యం, చిటికెడు పసుపు, ఇండుపగింజంత ఇంగువ, అంటూ మరొక రకం కొలమానం వాడేవారు. అదే విధంగా రసాయన శాస్త్రంలో అణువులు (atoms) ఎన్ని ఉన్నాయో కొలవడానికి "మోల్" అనే కొలమానం వాడతారు.

డజను అంటే 12 వస్తువులు, జత అంటే 2 వస్తువులు, పుంజీ అంటే 4 వస్తువులు, అయినట్లే మోల్ అంటే 602,000,000,000,000,000,000,000 వస్తువులు లేదా 602 హెక్సిలియను వస్తువులు. ఇది మన ఊహకి అందనంత పెద్ద సంఖ్య. ఉదాహరణకి ఒక మోలు చింతపిక్కలని పోగు పోసి, ఉండలా కడితే ఆ ఉండ మన భూమి అంత పెద్ద గోళం అవుతుంది. మరొక ఉదాహరణ. ఒక మోలు గారెలు వరసగా ఒకదాని మీద మరొకటి దండలా పేర్చుకుంటూ పోతే ఇక్కడ నుండి సూర్యుడి వరకు, తిరిగి వెనక్కి భూమి వరకు, తిరిగి సూర్యుడి వరకు, అలా 200,000,000,000 (200 బిలియను) సార్లు తిరగొచ్చు.

పై ఉదాహరణని బట్టి తెలిసిందేమిటిట? ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి. మనం రోజువారీ కార్యక్రమాల్లో కిలోలు, లీటర్లు వాడతాం. మందులు కొలిచేటప్పుడు గ్రాములు వాడతాం. బస్సు బరువుని గ్రాములలో చెబితే ఏమి సబబుగా ఉంటుంది? టన్నులలో చెప్పాలి. పూర్వపు రోజులలో, పంటకొచ్చిన ధాన్యాన్ని గిద్దలలో కొలిచేవాళ్లమా? లేదే, గరిసెలలో కొలిచేవాళ్లం. మా ఊరు నుండి ఢిల్లీ ఎంత దూరం అంటే మిల్లీమీటర్లలో చెబుతామా? చెప్పం, కిలోమీటర్లలో చెబుతాం. అదే విధంగా ఒక జాడీలో చారెడు గంధకం గుండ వేసి ఆ గుండలో ఎన్ని అణువులు ఉన్నాయి అని అడిగితే దానికి సమాధానం  "ఏ 2 మోలులో ఉంటాయి" అని సమాధానం చెబితే సబబుగా ఉంటుంది. "రెండు మోలుల అణువులు" అని అనకుండా 1,204,000,000,000,000,000,000,000 అణువులు అంటే ఏమి సబబుగా ఉంటుంది? ఇండియా నుండి అమెరికా ఎంత దూరం అంటే 22,000 కిలో మీటర్లు అనకుండా 22,000,000,000 మిల్లీమీటర్లు అన్నట్లు ఉంటుంది.

కనుక, జత అంటే 2, పుంజీ అంటే 4, డజను అంటే 12, మోలు అంటే 602,000,000,000, 000,000,000,000. రసాయన శాస్త్రంలో ఈ కొలమానం తరచు వాడుకలోకి వస్తూ ఉంటుంది కనుక దీనికి ఆచార్య అవగాడ్రో గౌరవార్థం "అవగాడ్రో సంఖ్య" అని పేరు పెట్టేరు.

బాగానే ఉందయ్యా! జాడీలో వేసిన చారెడు గంధకం గుండలో 1,204,000,000,000, 000,000,000,000 అణువులు ఉన్నాయో లేదో లెక్కపెట్టి తేల్చడం ఎలా? దీనికి చిన్న ఉపమానం చెబుతాను. నా చిన్నతనంలో పచారీ కొట్లో కానీ ఇస్తే నాలుగు "పంచదార బల్లిగుడ్లు" ఇచ్చేవారు. ఆ కొట్టుకి వెళ్లి ఒక లక్ష బల్లిగుడ్లు అడిగేమనుకొండి. ఆ కొట్టువాడు ఒకటీ, రెండు, మూడు అనుకుంటూ లక్ష వరకు లెక్కపెడుతూ కూర్చోలేడు కదా. కాని ఆ కొట్టువాడికి తెలుసు: తూకం వేస్తే కిలోకి 3,500 బిళ్లలు తూగుతాయని! కనుక లక్ష బల్లిగుడ్లు 28.57 కిలోలు తూగుతాయి అని లెక్క కట్టి, నిమిషంలో తూకం వేసి లక్ష బల్లిగుడ్లు ఇస్తాడు.  ఇదే విధంగా ఒక మోలు గంధకం తూకం వేస్తే ఎంత బరువు ఉంటుందో మనకి ముందుగా తెలిస్తే మన జాడీలో ఉన్న గంధకంలో ఎన్ని అణువులు ఉన్నాయో మనం చెప్పొచ్చు.

ఒక మోలు గంధకం ఎంత తూగుతుంది? ఇది మనకి మూలకాల ఆవర్తన పట్టిక (Periodic Table of Elements) చూస్తే తెలుస్తుంది. ఆవర్తన పట్టికలో, గంధకం గడిలో, S అనే అక్షరం కింద 32.07 అనే సంఖ్య ఉంటుంది, ఒక సారి చూసి నిర్ధారించుకొండి. దాని అర్థం ఏమిటంటే, తూకం వేసి  32.07 గ్రాముల గంధకం తీసుకుంటే అందులో ఖచ్చితంగా ఒక మోలు గంధకం అణువులు (Sulfer atoms) ఉంటాయి. ఇదే పద్ధతిలో ఆవర్తన పట్టికలో ప్రతీ మూలకం యొక్క మోలార్ భారం (molar weight) ఉంటుంది. ఉదాహరణకి కర్బనం (Carbon) మోలార్ భారం 12.01 అని ఉంటుంది. అనగా 12.01 గ్రాముల కర్బనంలో కూడ ఒక మోలు కర్బనం అణువులు ఉంటాయి, అనగా 602,000,000,000,000,000,000,000 కర్బనం అణువులు ఉంటాయి, లేదా కాసింత క్లుప్తంగా, 6.02 x 10^23 కర్బనం అణువులు ఉంటాయి, లేదా అవగాడ్రో సంఖ్య అన్ని అణువులు ఉంటాయి.

ఆమ్లజని మోలార్ భారం ఎంత? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం పీల్చే గాలిలో ఉన్న ఆమ్లజని అణువు (atom) రూపంలో ఉండదు; బణువు (molecule) రూపంలో ఉంటుంది. ఇక్కడ బణువు అంటే రెండు ఆమ్లజని అణువుల జంట. ఒకొక్క అణువు మోలార్ భారం 16 కనుక ఆమ్లజని బణువు మోలార్ భారం 32 అవుతుంది. కనుక 32 గ్రాముల ఆమ్లజని లో 6.02 x 10^23 బణువులు ఉంటాయి లేదా 16 గ్రాముల ఆమ్లజని లో 6.02 x 10^23 అణువులు ఉంటాయి. ఈ తేడాని గమనించి తీరాలి.

విద్యార్థులు గమనించవలసిన అతి ముఖ్య విషయం. ఇంగ్లీషులో "మోలార్" అనే మాటకి "మోలిక్యులార్" అనే మాటకి మధ్య అర్థంలో బోలెడు తేడా ఉంది. ఒక అణువు యొక్క భారం అనే భావాన్ని సూచించడానికి "అణు భారం" (atomic mass or atomic weight) అన్న మాట వాడతారు. అదే విధంగా ఒక బణువు యొక్క భారం "బణుభారం" (molecular mass or molecular weight) అన్న మాట వాడతారు. కాని ఈ "బణు భారం" అనే పదబంధం పాతబడిపోయింది. దీని స్థానంలో "సాపేక్ష బణు భారం (relative molecular mass) అనే పదబంధం వాడుతున్నారు. ఇక్కడ "సాపేక్ష" అన్నాము కనుక మన బణువు ఒక ప్రామాణిక బణువుతో (సాధారణంగా కర్బనం-12 బణువుతో) పోల్చి చూసినప్పుడు ఎంత బరువుందో చెబుతుంది. కాని "మోలార్ అన్నప్పుడు "ఒక మోలుతో పోల్చి చూసినప్పుడు" అని అర్థం. ఈ సూక్ష్మం అర్థం అవటానికి కాసింత పరిశ్రమ అవసరం.

సాయన పరిశ్రమలో మోల్ అనే భావం ఎలా ఉపయోగపడుతుందో సోదాహరణంగా  చూపిస్తాను. టైటేనియమ్ అనే లోహం తయారీ కి ఈ  దిగువ చూపిన రసాయన అభిక్రియ (chemical reaction) తరచు వాడుతూ  ఉంటారు.


2 Mg(l) + TiCl4(g) → 2 MgCl2(l) + Ti(s),  [Temp  = 800–850 °C]


ఈ రసాయన సమీకరణంల్లో ఎడమ పక్కన ఉన్న ముడి పదార్థాలు ఆయా కొలతలతో వాడితే కుడి పక్కన చూపిన లబ్ది పదార్థాలు వస్తాయి. ఎడమ పక్కన ఉన్న 2 Mg (l)  అంటే  ద్రవ రూపంలో ఉన్న 2 మోలుల మెగ్నీసియం. కుండలీకరణలలో ఉన్న l  అనే అక్షరం liquid అని చెబుతొంది. తరువాత TiCl4 (g) అంటే ఒక మోలు వాయు రూపంలో ఉన్న టైటేనియమ్ టెట్రా క్లోరైడ్ (టూకీగా, టికిల్ అంటారు). మెగ్నీషియం క్లోరిన్ తో కలిసి ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది కనుక  పైన చూపిన రసాయన సంయోగం జరుగుతుంది. తరువాత కుడి వైపు ద్రవ రూపంలో ఉన్న మెగ్నీసియం క్లోరైడ్, ఘన రూపంలో  టైటేనియమ్ వస్తాయి.


ఈ ప్రక్రియ జరగడానికి ముడి పదార్థాలని బిగుతుగా మూతి  ఉన్న ఒక తొట్టెలో పెట్టి దానిని 800-850 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చెయ్యాలి. అప్పుడు తొట్టెలో అట్టడుగుకి బరువుగా ఉన్న  టైటేనియమ్ లోహం మడ్డిలా దిగిపోతుంది. ఆ మడ్డి మీద తేలుతూ  ద్రవ రూపంలో మెగ్నీసియం క్లోరైడ్, దాని  పైన తేలుతూ ద్రవ రూపంలో ఉన్న మెగ్నీసియం, ఆ పైన తేలుతూ వాయు రూపంలో టికిల్, విడివిడిగా స్తరాల  (layers) మాదిరి ఉంటాయి. అభిక్రియ ఉపలబ్ధులు కిందకి దిగిపోతూ ఉంటాయి కనుక పైన తేలుతున్న మెగ్నీసియం కి ఆ పైన ఉన్న ట్రికిల్ కి మధ్య అంతరాయం లేకుండా అభిక్రియ జరుగుతూనే ఉంటుంది.


ఇప్పుడు కార్ఖానాలో ఉన్న అధినేత 200 కిలోల టికిల్, 25 కిలోల మెగ్నీసియం తొట్టెలో  వేసి టైటేనియమ్ తయారు చెయ్యమని ఆనతి జారీ చేసేడనుకుందాం. అప్పుడు ఎంత టైటేనియమ్ తయారవుతుంది? ఈ లెక్క చెయ్యడానికి  200 కిలోలని, 25 కిలోలని మోలులలోకి మార్చాలి. ఒక టికిల్ బణువులో (TCl4) ఒక అణువు టైటేనియమ్, నాలుగు క్లోరిన్ అణువులు ఉన్నాయి కనుక టికిల్ “అణుభారం” ఎంతో ఆవర్తన పట్టికని చూసి లెక్క కట్టవచ్చు. (ఈ లెక్క పాఠకులకి వదిలేస్తున్నాను). అప్పుడు


200 కిలోల టికిల్ = 1054 మోలులు టికిల్ అవుతుంది.
25 కిలో ల మెగ్నీసియం  = 1029 మోలులు మెగ్నీసియం అవుతుంది.

కానీ సమీకరణం ఏమిటి చెబుతున్నది? ఒక పాలు టికిల్ కి రెండు పాళ్ళు మెగ్నీసియం ఉండాలంటోంది; కానీ కర్మాగారం యజమాని మంజూరు చేసిన ముడిసరుకులో టికిల్, మెగ్నీసియం దరిదాపు సమ పాళ్లల్లో ఉన్నాయి. కనుక టికిల్ లో ఉన్న టైటేనియమ్ అంతా టైటేనియం లోహం గా  మారటం లేదు. మనకి ఉరమరగా 515 మోలుల  టైటేనియం మాత్రమే వస్తోంది. అనగా 24.7 kg. (ఈ  లెక్క కూడా జాగ్రత్తగా చేసి చూడమని పాఠకులని కోరుతున్నాను.) ఈ  రకంగా లెక్క వేసి ముడి పదార్థాలు ఎంతెంత వాడాలో చూసుకుంటే రసాయన చర్య సమర్ధవంతంగా సాగుతుంది.