Tuesday, December 26, 2017

తెలుగు భాషాభిమానులందరికీ ఒక విన్నపం.

తెలుగు భాషాభిమానులందరికీ ఒక విన్నపం. కంప్యూటరు మీద తెలుగు "టైపు" కొట్టడం నేర్చుకొండి. కష్టం కాదు. ఆ పని చెయ్యడానికి వెసులుబాట్లు ఉన్నాయి. కాగితం మీద కలంతో రాయడం కంటెలాభాలు ఉన్నాయి. తప్పులు దిద్దుకోవడం తేలిక. మనం రాసింది మరొకరికి పంపడం తేలిక. కాని కంప్యూటరు అంటే "భయం" కొద్దీఆ పని చెయ్యడానికి పూనుకోవడం లేదు.

ఈ విషయం మీద పాత్రికేయుడు, శ్రీ శ్రవణ్ బాబు ఒక వ్యాసం ప్రచురించేరు. అది ఈ దిగువ పునర్ముద్రిస్తున్నాను. ఆసాంతం చదవండి. ఒకటికి రెండు సార్లు చదవండి. చదివి మీరు కూడా కంప్యూటరు ఉపయోగించి తెలుగు రాయడం అలవాటు చేసుకొండి.

శ్రీ శ్రవణ్ బాబు గారి జాలస్థలి చిరునామా ఇక్కడ ఇస్తే నా బ్లాగు ఎందువల్లో పనిచెయ్యటం లేదు. అందుకని అది ఇవ్వటం లేదు. సమస్య ఏమిటో తెలిసిన తరువాత ఇస్తాను.

కంప్యూటర్ లో తెలుగు వాడకంపై ప్రభుత్వాలకెందుకింత నిర్లక్ష్యం!ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల పుణ్యమా అని తెలుగు భాషపై విస్తృతంగా చర్చజరగటం, ప్రాధాన్యత పెరగటం మంచి పరిణామాలే. కానీ ఏలినవారు తెలుగుభాషకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన కోణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇందుగలడందులేడన్నట్లుగా కంప్యూటర్ లు అన్నిచోట్లా వ్యాపించిఉన్న ప్రస్తుత తరుణంలో కంప్యూటర్లలో తెలుగు భాష వాడకంపై అత్యధికశాతం ప్రజలలో(విద్యావంతులలోనే) నెలకొని ఉన్న అవగాహనాలోపాన్ని, అజ్ఞానాన్ని తొలగించి సులభంగా, విస్తృతంగా ఉపయోగించేదిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటంలేదు.

కంప్యూటర్లలో తెలుగు భాషావినియోగం అందుబాటులోకివచ్చి దాదాపు 25 సంవత్సరాలుపైనే అవుతోంది. మొదట్లో కంప్యూటర్ లో తెలుగు వాడాలంటే చాలా పెద్ద తతంగం ఉండేది. అప్పట్లో తెలుగు ఫాంట్ ను, తెలుగు కంపోజ్ చేసే కీబోర్డ్ సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇన్ స్టాల్ చేసిన తర్వాత కంప్యూటర్ ను రీస్టార్ట్ చేస్తే అవి ఎనేబుల్ అయ్యేవి. అప్పడే తెలుగులో కంపోజ్ చేయాలన్నా, కంప్యూటర్ లో తెలుగును చదవాలన్నా వీలయ్యేది. ఈనాడు వంటి తెలుగు దినపత్రికలు కంప్యూటర్ లో చదవాలన్నా ఆయా దినపత్రికలు ఉపయోగించే ఫాంట్ ను డౌన్ లోడ్ చేసుకుంటేనే అవి కంప్యూటర్ లో కనపడేవి. లేకపోతే బాక్సులలాగా కనబడేవి. ఇప్పుడు దినపత్రికలవారు కూడా యూనీకోడ్ ఫాంట్ కు మారటంతో నేరుగానే కంప్యూటర్ లలో వాటిని చదవగలుగుతున్నాము.

అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగుపడింది. మొదట్లో ఉన్న తతంగమంతా ఇప్పుడు అవసరంలేదు. మైక్రోసాఫ్ట్ వారు తమ తాజా విండోస్ ఓఎస్ వెర్షన్‌లలో తెలుగు ఫాంట్ ను, ఇన్ స్క్రిప్ట్ అనే తెలుగు కీబోర్డ్ ను డిఫాల్ట్ గా ఇచ్చేస్తున్నారు. దానికి చేయవలసిందల్లా సెట్టింగ్స్ లో చిన్నపాటి మార్పులు చేసుకోవటమే. కానీ, ఈ విషయం… కంప్యూటర్లలో తెలుగు భాషను ఇలా అతిసులభంగా, సునాయాసంగా వాడుకోవచ్చన్న సంగతి అత్యధికశాతం విద్యావంతులకు తెలియకపోవటం చాలా బాధాకరం. 'అనూ స్క్రిప్ట్ మేనేజర్'వంటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ ఉంటేనే తెలుగులో కంపోజ్ చేయగలమని చాలామంది భావిస్తుంటారు. ఆ సాఫ్ట్ వేర్ లేకుండానే నేరుగా తెలుగు భాషను టైప్ చేయొచ్చని, యూనీకోడ్ లో కూడా చక్కటి, అందమైన ఫాంట్లు ఎన్నో ఉన్నాయనే కనీస అవగాహన - టైపు చేయటమే ఉపాధిగా వ్యవహరించే డీటీపీ ఆపరేటర్లలో కూడా 90శాతం మందికికూడా లేకపోవటం ఆశ్చర్యపరిచే విషయం. ఎమ్మార్వో, మున్సిపాలిటీ, కలెక్టరాఫీసు, కోర్టులు వంటి ప్రభుత్వ కార్యాలయాలవద్ద కంప్యూటర్లలో దరఖాస్తులు నింపే ఈ డీటీపీ ఆపరేటర్లలోఅత్యధికశాతంమంది తెలుగులో టైపింగ్ కోసం అనూ స్క్రిప్ట్ మేనేజర్(ప్రొప్రైటరీ) అనే సాఫ్ట్ వేర్ కు సంబంధించినపైరేటెడ్ కాపీలను వాడుతూ ఉంటారు. ఒకవేళ ఆ సాఫ్ట్ వేర్ రూపొందించిన సంస్థ వీరిని పట్టుకుంటే పెద్ద జరిమానా కట్టాల్సివస్తుందనే విషయంకూడా వారికి తెలియదు.

డీటీపీ ఆపరేటర్లంటే ఓమాదిరి విద్యావంతులై ఉంటారు కాబట్టి వారికి తెలియకపోవచ్చు. కానీ చాలామంది ఉన్నత విద్యావంతులకు కంప్యూటర్లలో తెలుగు వాడకం సులభమన్న విషయం తెలియదు. వీరు కంప్యూటర్లలో తెలుగును వాడాలంటే ఫొనెటిక్ కీబోర్డును వాడుతూ ఉంటారు. ఫొనెటిక్ అంటే తెలుగు పదాలను ఇంగ్లీషుభాషలో టైప్ చేస్తుంటే తెలుగులో అక్షరాలు పడటం(ట్రాన్స్ లిటరేషన్). పోనీ ఇదేమన్నా సులభంగా ఉంటుందా అంటే అలా ఏమీ ఉండదు. దీనిలో వత్తులు ఇవ్వటం కొద్దిగా క్లిష్టంగానే ఉంటుంది…. ఇన్ స్క్రిప్ట్, యాపిల్ కీబోర్డులలోకన్నా 25 శాతం స్ట్రోక్స్ ఎక్కువ ఇవ్వాల్సిఉంటుంది. అంత కష్టపడే బదులు వారంరోజులలో తెలుగు కీబోర్డు టైపింగును నేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ దానిని పట్టించుకోరు.

తెలుగు ప్రచురణరంగంలోకూడా ఈ అవగాహనాలోపం బాగా ఉంది. కొందరు ఔత్సాహిక రచయితలు తమ కంప్యూటర్ లో తమ రచనలను తామే కంపోజ్ చేసుకున్నప్పటికీ ఆ ఫైలును ప్రచురణకర్తలు ముద్రణకు అంగీకరించటంలేదు. దీనికి కారణం ఆ ఫైలు యూనీకోడ్ లో ఉండటం… ప్రచురణకర్తల వద్ద యూనీకోడ్ ఫైల్స్ తో ప్రచురించే పరిజ్ఞానం లేకపోవటం. యూనీకోడ్ అనేది కంప్యూటర్లలో టైపింగుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏర్పరుచుకున్న ఒక సార్వత్రిక ప్రమాణలిపి. ఏ కంప్యూటర్ లో అయినా యూనీకోడ్ లో టైప్ చేయొచ్చు. కానీ ప్రచురణ కర్తలు యూనీకోడ్ లో టైప్ చేసిఉన్న ఫైల్ తో ప్రింటింగ్ చేయలేకపోవటానికి ప్రధాన కారణం - ప్రచురణలో ఉపయోగించే పాత మోడల్ పేజ్ మేకింగ్ సాఫ్ట్ వేర్ యూనీకోడ్ ఫైలును అంగీకరించకపోవటం. అయితే ఇటీవల యూనీకోడ్ ను అంగీకరించే(కంపాటబుల్) ‘ఇన్ డిజైన్’ వంటి అత్యాధునిక పేజ్ మేకర్ సాఫ్ట్ వేర్ లు అందుబాటులోకి వచ్చినప్పటికీ వీటిని ప్రచురణకర్తలు వాడటం ప్రారంభించలేదు. అందుకే రచయిత ఒకవేళ స్వయంగా కంప్యూటర్ లో తన రచనను కంపోజ్ చేసుకున్నప్పటికీ అది పనికిరాదని మళ్ళీ అనూ స్క్రిప్ట్ మేనేజర్ తో రీటైపింగ్ చేయిస్తున్నారు. అయితే యూనీకోడ్ లో కంపోజ్ అయిఉన్న స్క్రిప్టును అనూఫాంట్స్ లోకి(http://www.eemaata.com/font2unicode/Encoder/unicode2font.php5), అనూ ఫాంట్స్ లో కంపోజ్ అయిన స్క్రిప్టును యూనీకోడ్ లోకి(http://anu2uni.harivillu.org) మార్చే సాఫ్ట్ వేర్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు.

యూనీకోడ్ ను ప్రచురణకర్తలు అంగీకరించకపోవటానికి మరో కారణం తెలుగులో అందుబాటులో ఉన్నయూనీకోడ్ ఫాంట్స్ పై అవగాహన లేకపోవటం. ప్రచురణకర్తలు, డీటీపీ ఆపరేటర్లువిండోస్ లో డిఫాల్ట్ గా కనిపించే గౌతమి ఫాంట్ ను మాత్రమే చూసిఉండటంతో మంచి ఆకర్షణీయమైన తెలుగు యూనీకోడ్ ఫాంట్స్ లేవని భావిస్తుంటారు. అది వారి అపోహ మాత్రమే. అనూ ఫాంట్స్ లో అత్యధికంగా ఉపయోగించే ప్రియాంక ఫాంట్ ను తలదన్నే ఫాంట్స్ యూనీకోడ్ లోకూడా ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం... అప్పాజీ అంబరీష్, పురుషోత్తమకుమార్ వంటి వారితో వివిధ శైలులలో20రకాల తెలుగు యూనీకోడ్ ఫాంట్స్ ను రూపొందింపజేసి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది(http://www.opentypefoundry.com). పోతన, వాణి, రమణీయ, లోహిత్ వంటి తెలుగు యూనీకోడ్ ఫాంట్స్ చూడముచ్చటగా ఉంటాయి. ఇవికాకుండా డీఓఈ(DOE)వారు కూడా పెద్దసంఖ్యలో తెలుగుతోసహా అన్ని భాషల్లోనూ యూనీకోడ్ ఫాంట్లు చేయించి అందుబాటులో ఉంచారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. పై వెబ్ సైట్(http://www.opentypefoundry.com)లోనే ఇన్ స్క్రిప్ట్, యాపిల్ కీబోర్డులను ఇన్ స్టాల్ చేసుకునే విధానం కూడా స్పష్టంగా ఇచ్చారు.

హైదరాబాద్ నగరంలో కంప్యూటర్ లలో తెలుగు వాడకాన్ని, తెలుగు బ్లాగింగును ప్రోత్సహించటానికి వీవెన్, కొలిచాల సురేష్, వెన్నా నాగార్జున, చావా అర్జునరావు వంటి తెలుగు భాషాభిమానులు చాలా కృషిచేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 కోట్లమంది తెలుగువారితో పోల్చుకుంటే వీరి కృషివలన ప్రయోజనంపొందినవారు చాలా స్వల్పశాతమనే చెప్పాలి.  రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు బృహత్తరస్థాయిలో పూనుకుంటే తప్ప పని జరగదు. ప్రభుత్వాలు రెండు విషయాలమీద దృష్టి పెట్టాలి. ఒకటి - కంప్యూటర్ లో తెలుగు టైపింగ్ చేయటంపై అవగాహన కల్పించటం, రెండు - ప్రచురణరంగంలో యూనీకోడ్ లో కంపోజ్ అయిన స్క్రిప్టుతోనే ప్రచురణకు మార్గం సుగమం చేయటం. మొదట ఆంగ్లంరానివారితో సహా విద్యావంతులైన ప్రతిఒక్కరూ కంప్యూటర్ లో తెలుగును వాడొచ్చన్న విషయాన్ని తెలియజెప్పటానికి ప్రభుత్వాలు విస్తృతంగా ఉద్యమస్థాయిలో ప్రచార కార్యక్రమాలు(క్యాంపెయిన్)ప్రారంభించాలి. దీనికోసం, తెలుగును కంప్యూటర్ లో ఎనేబుల్ చేసుకోవటంపై, అందుబాటులో ఉన్న యూనీకోడ్ ఫాంట్స్ పై, ఈ ఫాంట్స్ తో ప్రచురణ చేసే సాంకేతికపరిజ్ఞానంపై వీడియోలు రూపొందింపజేసి యూట్యూబ్ లో అందుబాటులో ఉంచాలి. ఈ వీడియోలను ఫేస్ బుక్, వాట్సప్ గ్రూపులద్వారా విస్తతంగా షేర్ చేయాలి. దినపత్రికలలో,  న్యూస్ ఛానల్స్‌లో, ధియేటర్లలో దీనికి సంబంధించి ప్రకటనలు ఇవ్వాలి. తెలుగు ప్రచురణకర్తలతో ఒక సెమినార్ నిర్వహించి యూనీకోడ్ లో కంపోజ్ అయిన స్క్రిప్టుతోనే ప్రచురించటంపై అవగాహన కల్పించాలి. అప్పుడే కంప్యూటర్లలో తెలుగు వాడకం పెరుగుతుంది…. చిట్టచివరి గ్రామస్థాయిదాకా వ్యాపిస్తుంది. తెలుగుకంటెంట్ మరింత విస్తృతంగా కంప్యూటర్ లో అందుబాటులోకి వస్తుంది. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఫలాలు అట్టడుగుస్థాయిదాకా చేరతాయి.


కంప్యూటర్ లో తెలుగులో టైపింగ్ చేసే విధానం

తెలుగులో టైపింగ్ చేయటానికి ప్రధానంగా మూడు రకాల కీబోర్డులు ఉన్నాయి. 1. ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు. 2. యాపిల్ కీబోర్డ్. 3. ఫొనెటిక్ కీబోర్డ్.

ఇన్ స్క్రిప్ట్ కీబోర్డును భారత ప్రభుత్వ సంస్థ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ 1986లో రూపొందించింది. అత్యధికశాతం కంప్యూటర్లలో ఉండే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇటీవల ఈ ఇన్ స్క్రిప్ట్ కీబోర్డ్ ను, గౌతమి అనే తెలుగు ఫాంట్ ను డిఫాల్ట్ గా అమర్చి ఇస్తున్నారు. కంప్యూటర్ సెట్టింగ్స్ లో కొద్దిపాటి మార్పులతో ఈ కీబోర్డుతో నేరుగా మనం తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు.

దీనికి చేయవలసిందేమిటంటే కంప్యూటర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ల్యాంగ్వేజి సెక్షన్ లోకి వెళ్ళి ‘యాడ్ ఏ లాంగ్వేజ్’ బటన్ పై నొక్కాలి. అప్పుడు వచ్చిన లాంగ్వేజి ఆప్షన్స్ నుంచి తెలుగును ఎంచుకోవాలి. దానిలో ఇన్ స్క్రిప్ట్ కీబోర్డ్(http://ildc.in/images/inscript-kb/Telugu-Inscript-Layout.jpg) డిఫాల్ట్ గా ఉంటుంది. ఈ కీబోర్డ్ యొక్క లే ఔట్(కీబోర్డులో అక్షరాల అమరికను లే ఔట్ అంటారు)ను చూసుకుంటూ ఒక్కవారం రోజులు ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోతుంది. దీనికి సంబంధించిన యూట్యూబ్ వీడియోను ఇక్కడ చూడండి - https://www.youtube.com/watch?v=WsbSUXSKBTg.

విండోస్ ఓఎస్ లో యాపిల్ కీబోర్డు లేకపోవటంవలన కూడా చాలామంది అనూ సాఫ్ట్ వేర్ పైరేటెడ్ కాపీలను వాడుతున్నారు. మైక్రోసాఫ్ట్ వారు యాపిల్ కీబోర్డునుకూడా డిఫాల్ట్ గా ఇచ్చేలా ప్రభుత్వం చొరవతీసుకుని ప్రయత్నించాలి. ప్రస్తుతానికి యాపిల్ కీబోర్డ్ వాడాలనుకునేవారు ఈ లింక్ ద్వారా ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకుని ఎనేబుల్ చేసుకోవచ్చు - http://crossroads.veeven.com/2007/12/25/apple-keyboard-layout/. అయితే విండోస్ 10లో దీనిని ఎనేబుల్ చేసుకోవటానికి కొద్దిగా సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిని పరిష్కరించుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళాలి - https://veeven.wordpress.com/2017/02/02/telugu-keyboard-layouts-in-windows10/.


ఇన్ స్క్రిప్ట్, యాపిల్ కీబోర్డులను నేర్చుకునేటంత సమయం, ఓపిక లేదనుకునేవారికి గూగుల్ టైపింగ్ టూల్స్(https://www.google.co.in/inputtools/try/) ను డౌన్ లోడ్ చేసుకుని దానిలోని ఫొనెటిక్ కీబోర్డ్ తో టైప్ చేసుకోవటమే మార్గాంతరం.

No comments:

Post a Comment