Monday, July 13, 2015

విశ్వస్వరూపం - నా కినిగె పుస్తకం



నేను ఇదివరలో, ఈ లోలకం బ్లాగులో, విశ్వం యొక్క స్వరూప స్వభావాల గురించి అడపా తడపా కొన్ని వ్యాసాలు రాసేను. ఇవే కాకుండా ఈమాట అంతర్జాల పత్రికలో కూడ కొన్ని వ్యాసాలు రాసేను. వాటన్నిటినీ కూడగట్టి, సమన్వయ పరచి, అవసరమైన చోట్ల తిరగ రాసి, అవసరమైనిపించినప్పుడల్లా కొత్త పదార్థం చేర్చి ఈ పుస్తకాన్ని రూపొందించేను. గణిత సమీకరణాల జోలికి పోకుండా ఉపమానాలు, బొమ్మలు ఉపయోగించి చెప్పదలుచుకున్నది చెప్పేను.

ఋగ్వేదకాలానికి ముందు నుండీ మానవుడు ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాడు. చూసి ఈ సృష్టి గురించి దీర్ఘంగా ఆలోచించేడనటానికి దాఖలాలు ఉన్నాయి. కాని గత వంద సంవత్సరాలలో సృష్టి గురించి మన అవగాహన విస్తారంగా పెరిగింది. ఆ అవగాహనని పాఠకుల ముందు ఉంచడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.

గతంలో నండూరి రామమోహనరావు గారు రాసిన “విశ్వరూపం” కీ ఈ పుస్తకానికీ పేరులోనే పోలిక తప్ప పుటలు తిరగెయ్యడం మొదలు పెట్టిన తరువాత పోలిక కనిపించదు. ఆ పుస్తకం రాసిన నాటి నుండి నేటి వరకు మన అవగాహన పరిధి బాగా పెరిగింది. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. కనుక ఆ పుస్తకం చదివిన వారు మళ్లా ఈ పుస్తకం చదవటం ఎందుకని అనుకోవద్దు.

ఈ పుస్తకం కినిగె వారి వద్ద (kinige.com) కేవలం ఇ-పుస్తకం రూపంలోనే దొరుకుతుంది.

- వేమూరి