Saturday, July 27, 2013

1. కంప్యూటర్ల పూర్వజన్మ వృత్తాంతం


1. కంప్యూటర్ల పూర్వజన్మ వృత్తాంతం

నా చిన్నతనంలో నిజంగా జరిగిన ఉదంతం. మా పక్కింటి తాత చచ్చిపోతూ ఉంటే, మంచం మీంచి కిందకి దింపేసి, వీధి గుమ్మంలో రోడ్డు మీద చాప మీద పడుక్కోబెట్టేసి, ఇంటిల్లిపాదీ ఘొల్లుమన్నారు. దారిన పోతూన్న సుబ్బారాయుడు డాక్టరు గారు, జట్కాని ఆపి, తాతని పరీక్షించి, సూదిమందు ఇచ్చేరు. కొద్ది క్షణాల్లో కాలి వేళ్లల్లో కదలిక కనిపించింది. తరువాత కళ్లు తెరచేడు. లేచి కూర్చున్నాడు. మాట్లాడేడు. ప్రాణం లేని కట్టెకి ప్రాణం పోసేడని అందరూ సుబ్బారాయుడిగారిని మెచ్చుకున్నారు.

ఇదే విధంగా మనం బజారులో కంప్యూటరు కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్నప్పుడు అది కొన ఊపిరి ఉందో ఉడిగిందో అన్నటువంటి మృత దేహం లాంటిది. ఒక ప్లేస్టిక్ డబ్బా, లోపల కొంత ప్లేస్టిక్ సరంజామా, తీగలు, రేకు డబ్బాలు, సిలికాన్ చితుకులు, వగైరాలు తప్ప వాటిలో జీవం లేదు, చైతన్యం లేదు, చలనం లేదు. కంప్యూటరు మీద ఉన్న మీటని నొక్కగానే, కేవలం 3-5 వోల్టుల విద్యుత్తు ఎక్కడో అంతరాంతరాల్లో కొన ఊపిరితో ఊగిసలాడుతూన్న ప్రాణాన్ని లేవగొడుతుంది. పక్కింటి తాత లేచినట్లే అంతవరకు కదలిక లేని కంప్యూటర్ లేస్తుంది. అంతవరకు కంప్యూటర్‌కీ భోషాణం పెట్టెకి ఏమీ తేడా లేదు.

లేవడం అంటే లేచింది కాని, మన కంప్యూటర్‌కి ఇంకా భుజబలం, బుద్ధిబలం సంతరించలేదు; నిద్ర బద్ధకం వదలలేదు. అది ఇంకా శుద్ధమొద్దావతారమే. నిద్ర లేవగానే కాళ్లూ, చేతులూ, కన్నూ, ముక్కూ, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని తడిమి చూసుకున్నట్లు, కంప్యూటర్ లేవగానే తనతో కలసి మెలసి పని చెయ్యవలసిన యంత్రాంగాలన్నీ సజావుగా ఉన్నాయో లేదో తడిమి చూసుకుంటుంది. అప్పుడు ఈ రకం కనిష్ట స్పృహ తప్ప కంప్యూటర్‌కి చెప్పుకోదగ్గ ప్రజ్ఞానం (consciousness) ఉండదు. ఉండక పోయినా అటువంటి మేధా సామర్ధ్యం ఎక్కడ ఉంటుందో తడిమి తెలుసుకోగలిగే ఇంగిత జ్ఞానం కంప్యూటరు అంతరాంతరాల్లొ అప్పటికే అమరి ఉంటుంది. ఆ సామర్ధ్యం రాగానే శుక్లపక్ష చంద్రుడిలా కంప్యూటరు బుద్ధి వికాసం పొంది బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తుంది.

కాని కంప్యూటర్లు అన్నీ నిద్ర లేవడానికి ఇలా జనన వేదన లాంటి ఇబ్బందులు పడక్కరలేదు. కొన్ని రకాల కంప్యూటర్లు ఒకే ఒక పని చేస్తాయి. ఆ రకం కంప్యూటర్లని ఆ ఒక్క పనినీ సమర్ధవంతంగా చెయ్యడానికి వీలుగా నిర్మిస్తారు. ఉదాహరణకి కేలుక్యులేటర్లు (calculators), కార్లలో జ్వలన ప్రక్రియని నియంత్రించే కంప్యూటర్లు (ignition control systems) ఎప్పుడూ ఒకే పనిని చేస్తాయి కనుక వాటిలో ఆదేశాలని మార్పు లేకుండా శాశ్వతంగా ఉండేటట్లు దాచుకోవచ్చు; ఆదేశాలు (instructions) మాటిమాటికీ మారవలసిన అవసరం లేదు. ఈ రకం కంప్యూటర్లని “హార్డ్‌వైర్డ్” (hardwired) అంటారు. మనం పుట్టినప్పుడు మన మెదడు కూడ కొంత వరకు “హార్డ్‌వైర్డే!” అందుకనే ఎవ్వరూ నేర్పకపోయినా చూడగలం, వినగలం, ఏడవగలం, పాలు తాగగలం. మన బల్ల మీద ఉన్న కంప్యూటర్ రకరకాల పనులు చేస్తుంది. మనం చెప్పిన పనులు చేస్తుంది. ఈ సౌలభ్యం ఉన్న కంప్యూటర్లని క్రమణికాంకిత (programmed) కంప్యూటర్లు అంటారు; అంటే క్రమణికలు చెప్పినట్లు చేసేవి. ఈ ప్రవర్తనని “ఒకరు చెప్పగా నేర్చుకోవడం” తో పోల్చవచ్చు. ప్రతి మెదడులోను కొంత “హార్డ్‌వైర్డ్” (పుట్టుకతో వచ్చిన) భాగం, కొన్ని “సాఫ్ట్‌వైర్డ్” (నేర్చుకున్న) భాగాలు ఉంటాయి.

మనం వాడుకునే కంప్యూటర్ గొప్పతనం ఏమిటంటే, మనం దానిని “ఆన్” చేసినప్పుడల్లా అదొక ఖాళీ పలకలా లేదా తెల్ల కాగితంలా ప్రవర్తిస్తుంది. ఆ ఖాళీ పలక మీద మన ఊహా శక్తిని ఉపయోగించి సృజనాత్మకంగా రకరకాల పనులు చెయ్యవచ్చు: కథలు రాయాలనుకుంటే కథలు రాసుకోవచ్చు, బొమ్మలు గీయాలనుకుంటే గీసుకోవచ్చు, సంగీత వాద్యాలు వాయించాలంటే ఆ పనీ చేయించవచ్చు, జమాబందీ లెక్కలు చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ఎవరికి కావలసిన విధంగా వారు ఆ కంప్యూటర్‌ని తమతమ అవసరాలకి అనుకూలంగా మలుచుకోవచ్చు. క్రమణికలు రాయగలిగే ప్రత్యేక నైపుణ్యం లేకపోయినా సరే ఈ పనులన్నీ మనం చేసుకోవచ్చు. అందువల్లనే కంప్యూటర్ ఇంత ప్రజాదరణ పొందింది.

మొదట్లో కంప్యూటర్లు చాల పెద్దగా, బరువుగా, ఖరీదుగా ఉండేవి. ఉదాహరణకి 1940 దశకంలో కట్టిన ENIAC అనే కంప్యూటర్ 100 అడుగుల పొడుగు, 8 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువు ఉండేది. దాని ఖరీదు (ఆ నాటి మారకపు విలువలో) 5 లక్షల డాలర్లు. ట్రాన్సిస్టర్ పరిజ్ఞానం పెరిగిన తరువాత ఇవన్నీ క్రమేపీ తరగడం మొదలయింది. అయినా సరే కంప్యూటర్లు ప్రభుత్వ సంస్థలలోను, విశ్వవిద్యాలయాలలోను తప్ప ప్రజలకి అందుబాటులో ఉండేవి కాదు. ప్రజా (లేదా జనతా లేదా personal) కంప్యూటర్లు అనే భావాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఘనత కొంతవరకు ఏపిల్ (Apple) సంస్థకి చెందుతుంది. కాని ప్రజలలోకి కంప్యూటర్లు వెల్లువలా గట్టు తెగి ప్రవహించడానికి కారణం IBM కంపెనీ వారు తయారు చేసిన PC. IBM కంపెనీ వారు తెచ్చినది సాంకేతిక విప్లవం కాదు, వ్యాపార విప్లవం. కంప్యూటర్ ధర ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, విపణి వీధిలో సులభంగా దొరికే విడివిడి భాగాలతో కంప్యూటర్‌ని నిర్మించి, దాని రూపకల్పన (design) వివరాలని, వ్యాపార రహశ్యంగా దాచకుండా, బహిరంగం చేసేరు. ఈ నిర్ణయం వల్ల సరఫరాదారులు పెరిగేరు. పోటీ పెరిగింది. నాణ్యత పెరిగింది. వెల పడింది. కంప్యూటర్ రచన, నిర్మాణ రహశ్యాలు బట్టబయలు చేసినా ఒకే ఒక భాగం యొక్క ప్రచురణ హక్కులు (copyrights) IBM వారు అట్టేపెట్టుకున్నారు. ఈ భాగం పేరు “బయాస్” (BIOS, Basic Input/Output System). మెదడులో “హార్డ్‌వైర్” చేసిన భాగం ఎలాంటిదో కంప్యూటర్‌కి ఈ బయాస్ అలాంటిదని అనుకోవచ్చు. ఈ బయాస్‌లో ఒకే ఒక చిన్న సిలికాన్ చితుకు (chip) ఉంటుంది. ఇందులో రాసిన (దాచిన) ఆదేశాలు చెరపాలనుకున్నా చెరగవు. ఇలా చెరగకుండా నిల్వ చేయగలిగే వాటిని ఇంగ్లీషులో “రాం” (ROM, Read Only Memory) అంటారు. కంప్యూటర్‌లో ఉన్న ప్రాణం లేని భాగాలన్నీ (వీటిని కఠినాంగాలు అని తెలుగులోనూ, హార్డ్‌వేర్ అని ఇంగ్లీషులోనూ అందాం) ప్రాణం పుంజుకుని లేవడానికి కావలసిన ఆదేశాల యంత్రాంగం (దీనిని మృదులాంగం అని కాని కోమలాంగం అని కాని తెలుగులోనూ, సాఫ్ట్‌వేర్ అని ఇంగ్లీషులోను అందాం) అంతా ఈ బయాస్‌లో ఉంటుంది. ఈ సందర్భంలో IBM వారు రెండు పనులు చేసి PC పెరుగుదలకి నాంది పలికేరు. ఒకటి, పోటీదారులు బయాస్‌లో ఉన్న యంత్రాంగం ఎలా పని చేస్తుందో చూసి నేర్చుకోవచ్చు. రెండు, IBM వారి బయాస్‌ని మక్కీకి మక్కీ కాపీ కొట్టనంతసేపూ, భావాలని కాపీకొట్టి IBM వారు నిర్దేశించిన పనులని, IBM వారు నిర్దేశించిన విధంగా చేసినంతసేపూ, ఎవరికి కావలసిన విధంగా వారు ఆదేశాలు, క్రమణికలు రాసుకుని, కంప్యూటర్లు నిర్మించి పోటీ పడవచ్చు.

ఈ దెబ్బతో ఇంటింటా ఒక కంప్యూటరు వెలిసింది.      




Monday, July 22, 2013

కంప్యూటర్ల గురించి, తెలుగులో


కంప్యూటర్ల గురించి, తెలుగులో

0. ఈ వ్యాసాలు ఎవరికి? ఎందుకు?

ఈ రోజుల్లో కంప్యూటర్లు అంటే తెలియని వాళ్లు ఉండరు. కనిపించిన ప్రతి వ్యక్తి తనూ “సాఫ్ట్‌వేర్ ఇంజనీర్” నే అని చెప్పుకుంటూంటే మళ్లా ఈ వ్యాసాలు ఎందుకు అని చాల రోజులు తటపటాయించేను. ఈ మధ్య తరచుగా ఇండియా వెళ్లడం, వెళ్లినప్పుడల్లా కంప్యూటర్ చదువులు వెలిగిస్తున్న విద్యార్థుల పరిచయం అవడం జరిగింది. వాళ్లతో పది నిమిషాలు మాట్లాడిన తరువాత ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్లంతా ఇంగ్లీషు భాషలోను, కంప్యూటర్లలోను ప్రవీణులు అని అనేసుకోడానికి వీలు లేదని నాలో గట్టి నమ్మకం కలిగి తెలుగులో ఈ వ్యాసాలు రాయడానికి పురి కొల్పింది. అంతే కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లమని చెప్పుకునే వాళ్లకంటె కేవలం కంప్యూటర్‌ని వాడుకునే సామాన్యుల సంఖ్య అధికం. వీరు రోజూ కూపాన్లు ముద్రించుకోడానికో, విద్యుల్లేఖలు పంపడానికో, వార్తలు చదవడానికో, సినిమాలు చూడడానికో, సంగీతం వినడానికో, ఆటలు ఆడడానికో కంప్యూటర్లు వాడుతున్నారు. వీరికి కంప్యూటర్ల గురించి ఒ అంటే ఢం తెలియదు. కాని కుతూహలం ఉంటుంది కదా. కనుక నేను ఇక్కడ రాసే వ్యాసాలు వారికోసం అనుకుంటే “ఇంత చిన్న చిన్న విషయాలు మాకు తెలియవనుకుని మీరు మమ్మల్ని కించ పరుస్తునారు” అని నన్ను దూషించడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కాకపోతే మరొక్క అభ్యంతరం ఉండొచ్చు. “ఈ విషయాలన్నీ ఇంగ్లీషులో చదువుకుంటే సరిపోతుంది కదా” అని అనేవారు లేకపోలేదు. ఈ వ్యాసాలు అటువంటి వారి కోసం కాదు. ఇంగ్లీషులో లేనిది ఇక్కడ నేను ఏదీ కొత్తగా చెప్పడం లేదు.

ఈ వ్యాసాలు రాయడానికి పురికొల్పిన కారణాలు కొన్ని ఉన్నాయి. నేను 1968 లో “కంప్యూటర్లు” అనే పుస్తకం తెలుగులో రాస్తే దానిని “తెలుగు భాషా పత్రిక” వారు మూడేళ్ల పాటు ధారావాహికగా ప్రచురించేరు. ముఖస్తుతికే అన్నారో, మనస్పూర్తిగానే అన్నారో తెలియదు కాని, సంపాదకులు, పాఠకులు శైలి బాగుందని మెచ్చుకున్నారు. ఆ వ్యాస పరంపరలో మొదటి అయిదు వ్యాసాలు నల్లేరు మీద బండిలా సాగేయి. ద్వియాంశ (binary), అష్టాంశ (octal), షోడశాంశ (hexadecimal), ద్వింకము (bit), పుంజీ (nibble), అష్టాంకము లేదా అష్టా (byte), క్రమణిక (program), అంక కలనయంత్రము (digital computer), సారూప్య కలనయంత్రము (analog computer), సత్య సారణి (truth table) మొదలైన కొత్త మాటలతో ప్రయోగాలు చేసి చూశాను. కాని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టం, ఇన్‌పుట్, ఔట్‌పుట్, మొదలైన మాటలు కొన్ని కొరకరాని కొయ్యలై కూర్చున్నాయి. నలభై ఐదు ఏళ్ల తరువాత మళ్లా ఆ పాత పుస్తకాన్ని తిరగ రాయాలనే కోరిక పుట్టింది. అప్పుడు తేలికగా చేసిన పని ఇప్పుడు పదింతలు కష్టం అనిపిస్తోంది. కొద్దో గొప్పో ఇంగ్లీషు వచ్చిన తెలుగువారు సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రావీణ్యత, ప్రతిష్ట సంపాదించేరో లేదో నాకు తెలియదు కాని డబ్బు సంపాదించేరు. ఈ అత్యున్నత పురుషార్ధం అందరికీ అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో అన్న ఊహతో కంప్యూటర్లు ఎలా పని చేస్తాయో తెలుగులో చెప్పి చూద్దామనే ఉద్దేశం కలిగింది.

ఇది పాఠ్య పుస్తకం కాదు. ఇంగ్లీషులో ఉన్న పాఠ్య పుస్తకాలు చదివి అర్థం చేసుకోలేని వారు, తెలుగులో శాస్త్రీయ విషయాలు చదివితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలం ఉన్న వాళ్లు, తెలుగు వార్తాపత్రికలలో కంప్యూటర్ల గురించి రాసే పాత్రికేయులు, మొదలైన వారిని దృష్టిలో పెట్టుకుని జనరంజక (popular) శైలిలో రాసిన వ్యాసాలు ఇవి. ఈ శైలిలో నిజాన్ని క్లుప్తపరచి కాని వంగదీసి కాని రాయవలసి వస్తుంది. జనరంజక శైలిలో రాసినప్పుడు క్లిష్టమైన సాంకేతిక భావాలని తెలుగు మాటలలోనే, తెలుగు వారికి తెలిసిన ఉపమానాలతో, తెలుగు నుడికారంతో చెబితేనే బాగుంటుందని నా నమ్మకం. కనుక వీలైనంతవరకు తెలుగు పదజాలాన్నే వాడడానికి ప్రయత్నించినా వాటి సమానార్ధకాలైన ఇంగ్లీషు మాటలని పక్కపక్కనే చూపిస్తూనే ఉన్నాను. కంప్యూటర్ రంగంలో వాడుకలో ఉన్న మాటలన్నిటిని టోకు మొత్తంగా తెలుగులోకి మార్చడానికి ప్రయత్నించడం వ్యర్ధ ప్రయత్నమే అవుతుంది. వీలయినంతవరకు ప్రయోగం చేసి చూసేను.

నేను ఇంతకు పూర్వం తెలుగులో సైన్సు విషయాలు చాల రాసేను. కాని అవన్నీ ప్రకృతి శాస్త్రాలు (natural sciences) కి సంబంధించినవి. వాటితో పోల్చి చూస్తే, ఎందువల్లో తెలియదు కాని, కంప్యూటర్ల మీద తెలుగులో రాయడం చాల కష్టం అనిపించింది. కారణం? ఇది మానవ కల్పితమైన సాంకేతిక విద్య. మానవుడు కృత్రిమంగా తయారు చేసిన యంత్రాల గురించి, అంతకు ముందు ఎన్నడు కని, విని ఎరగని కృత్రిమమైన ఇంగ్లీషు భాషలో ఈ సృజనని వర్ణించి చెప్పేడు. అంటే కంప్యూటర్ రంగంలో మనం వాడే మాటలు, వాటి వెనక ఉన్న భావజాలాలు ఏభై ఏళ్ల క్రితం ఇంగ్లీషులోనే లేవు. ఈ యంత్రాలని నిర్మించిన వ్యక్తులు, వ్యాపార సంస్థలు వారి పబ్బం గడుపుకుందికి వారి భావాలని వారికి తోచిన మాటలతో వర్ణించుకున్నారే తప్ప ఏ వయ్యాకరణులనో, భాషాశాస్త్రవేత్తలనో సంప్రదించి కొత్త మాటలు కమిటీలలో పుట్టించలేదు.

అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక్క మెతుకు చిదిమి చూస్తే ఎలా సరిపోతుందో అదే విధంగా కంప్యూటర్ రంగంలో కొత్త మాటలు ఇంగ్లీషులో ఎలా, ఎంత అస్తవ్యస్తంగా పుట్టుకొచ్చేయో చెప్పడానికి ఒక్క ఉదాహరణ ఇస్తాను. “వికీపీడియా” అనే మాటని తెలుగులో ఏమంటారు? ఈ ప్రశ్నకి సమాధానంగా ఈ మాట ఇంగ్లీషులోకి ఈ మధ్యే ఎలా జొరబడిందో చెబుతాను. హవాయిలో విమానాశ్రయం నుండి ఊళ్లోకి తీసుకెళ్లే “ఎక్స్‌ప్రెస్ బస్సు” ని హవాయి భాషలో “వికీవికీ” అంటారు; మనం తెలుగులో “గబగబ” అన్నట్లు. కనుక ఎక్కువ ఆలోచన లేకుండా, ఏదో అవసరానికి తీరే పనిని అంతర్జాలంలో, నలుగురి సహాయంతో గబగబ చేసినప్పుడు దానికి “వికీ” అని పేరు పెట్టేడు ఒక కంప్యూటర్ ప్రభృతుడు. ఆ వికి ని ఎన్‌సైక్లొపీడియా ని సంధించగా వికీపీడియా వచ్చింది. ఇది దుష్టసంధి అయినా ఎవ్వరూ అభ్యంతరం పెట్టలేదు; అందరూ వాడెస్తున్నారు. ఈ వికీపీడియాని తెలుగులో ఏమనాలి? గబగబ తయారు చేసిన విజ్ఞాన సర్వస్వం కనుక “గబస్వం” అనొచ్చా? విక్ష్ణరీ “గబంటువు” అవుతుందా? సంషాబాదు విమానాశ్రయం నుండి ఊళ్లోకి తీసుకెళ్లే “ఎక్స్‌ప్రెస్ బస్సు” ని “గబగబగాడీ” అంటే ఎలాగుంటుంది?

ఇలా అనువాదానికి సులభంగా లొంగని, ఇంగ్లీషులో అర్థం పర్థం లేనివి, స్వయం బోధకాలు కానివి అయిన మాటలు కంప్యూటర్ రంగంలోనే కాదు ఇతర సాంకేతిక రంగాలలో కూడ ఎన్నో మాటలు ఉన్నాయి. వీటికి తెలుగు మాటలు తయారు చెయ్యడమా లేక ఆరు కోట్ల తెలుగు వారిని ఇంగ్లీషు నేర్చేసుకోమనడమా అన్న ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నేను ఈ వ్యాసాలలో వాడడానికి రెండు నిఘంటువలని తరచు సంప్రదించేను: మొదటిది, నేను కూర్చిన నిఘంటువు. ఇది 2000 సంవత్సరంలో అచ్చయి, ఇప్పుడు బజారులో దొరుకుతున్నాది. అచ్చయిన ప్రతి కంటె నా కంప్యూటర్‌లో ఉన్న ఇ-ప్రతి 50 శాతం పెద్దది. వీలు చూసుకుని ఈ ప్రతిని అందరికి అందుబాటులో ఉండేలా అంతర్జాలంలో పెడతాను. రెండవది, కినిగె సంస్థ వారు ప్రచురించిన ప్రవీణ్ యిళ్ల కూర్చిన “కప్యూటరు నిఘంటువు.” ఇది చిన్న ఇ-పుస్తకం. నా నిఘంటువులో లేని మాటలు ఇక్కడ కొన్ని దొరికేయి. అవసరం వెంబడి ఈ రెండు నిఘంటువులు వాడేను. ఎప్పుడు ఏ కొత్త మాటలు ప్రయోగించినా పక్కని ఇంగ్లీషు పదాలు తరచుగా ఇచ్చేను. వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా!

ఈ ప్రయత్నం ఎంత సజావుగా ముందుకి సాగుతుందో చెప్పలేను. ఈ ప్రయోగం సఫలం అవుతుందన్న నమ్మకమూ లేదు. చేపట్టిన పని ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ పని తేలికైతే ఈ పాటికి ఎందరో చేసి ఉండేవారు. ఇలాంటి పనుల వల్ల డబ్బు గణించే అవకాశం ఉన్నా ఎందరో చేసి ఉండేవారు. ఈ పురుష ప్రయత్నం యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో పాఠకులే నిర్ణయిస్తారు.

ఇటుపైన, వారం వారం కాకపోయినా, అప్పుడప్పుడు ఈ ప్రయోగాత్మకమైన వ్యాసాలు ఈ బ్లాగులో ప్రచురిస్తూ ఉంటాను. మీ స్పందనల కొరకు ఎదురు చూస్తూ ఉంటాను.

Monday, July 8, 2013


కంప్యూటర్ నిఘంటువు
కూర్పరి: ప్రవీణ్ యిళ్ల
ప్రచురణ: కినిగె
ఈ సమీక్ష రాయడానికి నా అర్హతలు ముందు చెబుతాను. నేను 1968 లో “కంప్యూటర్లు” అనే పుస్తకం రాస్తే దానిని తెలుగు భాషా పత్రిక వారు మూడేళ్ల పాటు ధారావాహికగా ప్రచురించేరు. మొదటి అయిదు అధ్యాయాలు నల్లేరు మీద బండిలా సాగేయి. ద్వియాంశ, అష్టాంశ, షోడశాంశ, ద్వింకము (బిట్), పుంజీ (నిబుల్), అష్టాంకము (బైట్), క్రమణిక (ప్రోగ్రాం), మొదలైన కొత్త మాటలతో ప్రయోగాలు చేసి చూశాను. కాని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టం, ఇన్‌పుట్, ఔట్‌పుట్, మొదలైన మాటలు కొరకరాని కొయ్యలై కూర్చున్నాయి. నలభై ఐదు ఏళ్ల తరువాత మళ్లా ఆ పాత పుస్తకాన్ని తిరగ రాయాలనే కోరిక పుట్టింది. అప్పుడు తేలికగా చేసిన పని ఇప్పుడు పదింతలు కష్టంగా అనిపించి, ప్రవీణ్ కూర్చిన నిఘంటువు గురించి కినిగెలో చూసి, ఆ ప్రతి సహాయపడుతుందేమోనని చదవడం మొదలు పెట్టేను. ఇక్కడ టూకీగా నా అభిప్రాయం రాస్తున్నాను.

వంట మాట దేవుడెరుగు; నాకు కప్పు కాఫీ కాచుకోవడం కూడ చేతకాదు. నా శ్రీమతి వంట అద్భుతంగా వండుతుంది. అయినా అప్పుడప్పుడు ఒక్క రవ ఉప్పు తక్కువవడమో, పులుపు ఎక్కువవడమో జరుగుతుంది. నోరు మూసుకుని తినకుండా రుచులు ఎన్నుతాను. అప్పుడప్పుడు విధి లేక నా వంట నేను వండుకోవలసిన పరిస్థితిలో నా వంట ఎప్పుడూ బాగానే ఉంటుంది. ఇదే విధంగా ఎవరి పుస్తకం వారికి బాగుంటుంది; ఇతరుల పుస్తకాలు చదివినప్పుడు అన్నీ తప్పులే కనిపిస్తాయి. నేను విద్యార్ధి దశలో ఉన్నప్పుడు ఒక పాఠం నేర్చుకున్నాను. మనం రాసిన వస్తువుని సునిశితంగా విమర్శ చేసేవాడే మన హితవు కోరేవాడు; ప్రియోపదేశాలు శుష్క వచనాలు.

ఈ నిఘంటువు గురించి. ఈ ప్రయత్నం బాగుంది. కంప్యూటర్ పరిభాషలో ఇది ఒక “బీటా,” అంటే ఇది ఇంకా పూర్తిగా వికసించని పువ్వు. వినియోగదారులు దీనిని విరివిగా వాడి నిగ్గు తేల్చాలి. ఒక సమీక్షకుడు ఒక అభిప్రాయం చెబితే సరిపోదు. అంటే కంప్యూటర్ల గురించి తెలుగులో రాసే వాళ్లకి ఈ నిఘంటువు ఉపయోగపడుతోందా లేదా అన్నది తేల్చవలసిన విషయం. మన దేశంలో తెలుగులో రాసే వాళ్లే బహు తక్కువ. సైన్సు గురించి రాసే వాళ్లు ఇంకా తక్కువ. ఔత్సాహికులు తప్ప కంప్యూటర్ల గురించి తెలుగులో రాసినా చదివే వారు లేరు. కనుక ఈ నిఘంటువులో కొత్త పదజాలం ఎంతవరకు ప్రజాదరణ పొందుతుందో నాకు తెలియదు.

ఈ నిఘంటువులో నాకు నచ్చిన/నచ్చని అంశాలు: ఒకటి, ప్రతి ఇంగ్లీషు మాటకి అర్థం ఇచ్చి ఊరుకోకుండా ఆ మాటని ఒక వాక్యంలో వాడి చూపించడం. ఇది బాగానే ఉంది కాని, ఆ వాక్యంలో – ఈ నిఘంటువులో తప్ప మరెక్కడా దొరకని – కొత్త మాటలని జొప్పించడంతో ఉదాహరణ కోసం వాడిన ఆ వాక్యం నిష్‌ప్రయోజనం అయిపోయింది. “లేదు, టోటల్ ఇమ్మర్షన్” కోసం ఆ పని చేసేం అని రచయిత అభిప్రాయ పడవచ్చు. తరగతిలో కూర్చున్నప్పుడు “పూర్తిగా ములగడం” అనే పని చేయడంలో ఉద్దేశం వేరు. నిఘంటువుని సంప్రదించేవాడు ఒక మాట అర్థం ఏమిటి, ఆ మాటని ఎలా వాడాలి అని చూస్తాడే తప్ప భాష మాట్లాడాలనే ఉద్దేశంతో కాదు. రెండు, ఇది కంప్యూటర్ నిఘంటువు అయినప్పుడు ఇందులో కంప్యూటర్లతో ఏ మాత్రం సంబంధం లేని మాటలు (ఉదా. డిస్కో నృత్యాలు, పాశ్చాత్య సంగీతం గురించిన మాటలు, వగైరా) అనవసరం. “లేదు, మాకు ఫలానా సందర్భంలో అవసరం అనిపించింది” అని కూర్పరి అనుకున్న పక్షంలో ఆ సందర్భం ఏమిటో ఉదాహరణలలో వివరించి ఉండవలసింది. మూడు, నిఘంటువు అన్నప్పుడు ఆరోపాలు ఏ భాషాభాగాలో చెప్పి ఉండవలసింది. పదార్థ దర్పణానికి, నిఘంటువుకి తేడా ఉంది కదా. నాలుగు, పుస్తకం చివరలో తెలుగు పదాల సూచి ఉంది. ఇది చాల ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. కాని “ఖతి” అనే మాట ఈ సూచిలో చెప్పిన పేజీలో కనిపించలేదు. ఐదు, అక్కడక్కడ తప్పులు దొర్లాయి; కొన్ని అచ్చు తప్పులు, కొన్ని కూర్పరి చేసిన తప్పులు. ఉదాహరణకి darkwave అన్న మాటకి అర్థం “డార్క్‌వేవ్” అని తెలుగు లిపిలో ఉంది. పైపెచ్చు ఈ మాటకీ, కంప్యూటర్లకీ ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాలేదు. ఆరు, కొత్త మాటలు తయారు చేసినప్పుడు అవి ఏ తర్కాన్ని అనుసరించి తయారు చేసేరో చెప్పి ఉంటే బాగుండేది. ఉదాహరణకి “ఖతి” అంటే ఏమిటో, ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.

ఇవేవీ క్షమించరాని తప్పులు కావు. నిఘటు నిర్మాణం కష్టతరం. అనుభవం ఉండాలి. ఓర్పు ఉండాలి. ఇతరులు రాసిన రాతలతోటీ, చేసిన ప్రయోగాల తోటీ పరిచయం ఉండాలి. కాని ఎవ్వరో ఒకరు ప్రయత్నం చెయ్యక పోతే ఎలా? అందుకని ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నాను. నాకు చేతనయినంత మేరకి ఇందులో దొరికిన కొన్ని కొత్త మాటలని వాడి చూస్తాను. ఈ ప్రయోగం పలుకుతుందో లేదో ప్రజలే నిర్ణయించాలి. పుస్తకం తయారీ బాగుంది. చదవడానికి తేలికగా ఉంది. ఇలాంటి ప్రయత్నాలని మనమే ప్రోత్సహించాలి.
- వేమూరి వేంకటేశ్వరరావు