Thursday, October 14, 2010

విశ్వస్వరూపం: 3. ఈ సృష్టికి ఎవ్వరు కారణం?

3. ఈ సృష్టికి ఎవ్వరు కారణం? 
 వేమూరి వేంకటేశ్వరరావు 

  1. ప్రేరణ కారణం ఈ చరాచర జగత్తుని సృష్టించినది ఎవ్వరు? ఈ సృష్టి ఎప్పుడు మొదలయింది? ఎందుకు జరిగింది? సృష్టికర్త ఎవ్వరు? ఆ సృష్టికర్తనే “దేవుడు” అంటున్నామా? అలాగయితే ఎవ్వరా దేవుడు? ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఎవ్వరైనా చూశారా? అసలు “దేవుడు” అన్న భావానికి నిర్వచనం ఏమిటి? సృష్టించినవాడా? రక్షించేవాడా? లయ కారకుడా? అన్నీనా? ఈ రకం ప్రశ్నలు అనాది నుండీ మానవులు అడుగుతూనే ఉన్నారు. వివిధ కాలాలలో, వివిధ సంస్కృతులలో పెరిగిన విద్వాంసులు ఈ ప్రశ్నలని వివిధ దృక్పథాలతో కూలంకషంగా పరిశీలించి అనేకమైన సిద్ధాంతాలని ప్రతిపాదించేరు. వీటిలో ఎవరికి అనుకూలమైన మార్గాన్ని వారు అవలంబించి “బ్రహ్మసత్యం” కనుక్కున్న మహానుభావుల కథలు ఎన్నో మనం వింటూనే ఉంటాం. అమెరికా సంయుక్త రాష్ట్రాల సంస్థాపకులలో ఒకడు, తరువాత అద్యక్ష పదవి అలంకరించిన వాడైన థామస్ జెఫర్‌సన్ ని మహా మేధావులలో ఒకడుగా ప్రెసిడెంట్ కెన్నడీ ఒక సారి కొనియాడేడు. అటువంటి జెఫర్‌సన్, దేవుడు సృష్టికి కారకుడు తప్ప సృష్టి జరిగిన తరువాత ఈ విశ్వం యొక్క దైనందిన కార్యక్రమాల్లో దేవుని పాత్ర లేదనిన్నీ, సృష్టి జరిగిన తరువాత ప్రకృతి శక్తుల ప్రభావ పరిధిలో ఈ జగత్కార్యం జరుగుతోందనిన్నీ నమ్మేడు. “దేవుడి మీద మీకు నమ్మకం ఉందా?” అని అయిన్‌స్టయిన్ ని అడిగితే “తాత్వికుడు స్పినోజా చెప్పిన దేవుడి లాంటి దేవుడిని అయితే నమ్ముతాను” అని సమాధానం చెప్పేడు. టూకీగా స్పినోజా ఏమన్నాడంటే, “ప్రకృతే దేవుడు. ప్రకృతి అంటే ఏమిటి? మనం మన చుట్టూ చూసే ఈ చరాచర జగత్తే ప్రకృతి. ఈ జగత్తుకి “బయట” ఎక్కడో ఉండి దేవుడు ఈ జగన్నాటకాన్ని తోలుబొమ్మలాటలా ఆడించటం లేదు. ఈ నాటకంలో దేవుడు కూడ ఒక నటుడే.” ఇటీవలి కాలం వాడు, అస్తిత్వవాది అయిన విశ్వకవి రవీంద్రనాథ టాగూరుకి దేవుడంటే నమ్మకం ఉంది కాని అతని దేవుడు సగటు హైందవ దేవుడు కాడు. విశ్వకవికి దేవుడు ఒక చెలికాడు, మానవహితాన్ని కోరే ఒక తండ్రి. అదేకాలపు వాడైన మహాత్మ గాంధి సంశయవాది (agnostic); అంటే దేవుడున్నాడో, లేడో రుజువు చెయ్యలేకపోయినా దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తి. గాంధి కి “దేవుడు సత్యం” (God is Truth) కాదు; అతనికి “సత్యమే దైవం” (Truth is God). సత్యం ఒక వాస్తవం. అది తిరుగు లేనిది. సత్యానికి దేవుడికి ఉన్న లక్షణాలు ఉన్నాయని జీవితాంతం నమ్మిన వ్యక్తి మహాత్ముడు. రామకృష్ణ పరమహంస తనకి “దేవుడిని చూపించేడు” అని స్వామీ వివేకానందుడే ఒక చోట చెప్పుకున్నాడు. కనుక మనందరి కండ్లకి కనిపించకపోయినా ఈ జగన్నాటకాన్ని ఆడించటానికి ఒక మహత్తర శక్తి ఏదో ఉండితీరాలని అనిపిస్తుంది. అనిపించటమేమిటి? “మయాద్యక్షేణ ప్రకృతిః సూయతేస చరాచరం, హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే” అని అనుమానానికి ఆస్కారం లేని భాషలో అర్జునుడికి కృష్ణుడు చెబుతాడు. ఈ శ్లోకం అర్ధం ఏమిటయ్యా అంటే, “ఈ జగద్రచనావ్యాపారమునకు అద్యక్షుడను నేనే. నా మాయా శక్తి నా కార్యదర్శి. నన్ను నిమిత్తముగా ఉంచుకొని, ఆమెయే స్థావర జంగమాత్మకమగు ఈ విశ్వమును సృజించి, పోషించి, లయమొందించుచున్నది.” ఇలా సాక్షాత్తు పరమేశ్వరుడే స్వయంగా చెబుతూ ఉంటే ఇంకా ఈ అన్వేషణ ఏమిటని మీలో కొందరు అడగొచ్చు. ఈ అన్వేషణకి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, విశ్వరూపం చూసే వరకు నారాయణుడి మాటలని నరుడు నమ్మలేదు. అలాంటిది ఏ రూపమూ చూడకుండా, పుస్తకాలలో ఉన్న శ్లోకాలని చదివి మానవమాత్రులమయిన మనం ఎలా నమ్మగలం? రెండు, సృష్టి, స్థితి, లయ, మొదలైన భావాలకి అతీతంగా, పాపం, పుణ్యం, మొదలైన కర్మకాండల ఫలితాలకి అతీతంగా, సృష్టిలో సౌందర్యమే దైవస్వరూపమని నమ్మేవారి దృష్టితో ఇవే ప్రశ్నలకి మరొక కోణం నుండి సమాధానాలు వెతకాలనే ఆకాంక్ష ఉంది కనుక ఈ అన్వేషణ ముఖ్యోద్దేశం మోక్ష సాధన కాదు. అపవర్గమనే బ్రహ్మీస్థితిని చేరుకోవటం అంతకంటె కాదు. “కారణాలన్నిటికి మూలకారణమయిన ఆదిశక్తిని నేనే!” అనగలిగే ఏకైక మహత్తర శక్తి ఏదయినా ఉంటే దాని ఉనికిని నిర్ణయించటమే ఇక్కడ ధ్యేయం. 

  2. ప్రత్యక్ష దైవం 

 దేవుడిని సృష్టికారకుడిగా ఊహించుకుంటే మన తల్లిదండ్రులే మన ప్రత్యక్ష దైవాలు. కాని, ఈ ప్రతిపాదనలో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఒకటి, తల్లిదండ్రులు సృష్టి, స్థితులకి కారకులు కాగలరు కాని లయకారకులు కాజాలరు. రెండు, పై నిర్వచనం ప్రకారం పిల్లలని కన్నవాళ్లు మాత్రమే దైవత్వానికి అర్హులు. మూడు, పైన చేసిన ప్రతిపాదన ప్రాణులకి మాత్రమే వర్తిస్తుంది. ప్రాణం లేని కొండలని, నదులని, సముద్రాలని ఎవ్వరు సృష్టించారు? మానవుడి ఉనికికి మూలాధారమైన మాతృమూర్తి ఈ భూదేవి. ఈ భూమే లేకపోతే మనకి కాలుని మోపే స్థావరమే లేదు. నవమాసాలు కాదు, ఈ భూమాత మనని బతికున్నన్నాళ్లూ మోస్తోంది. ఒక్క మోయడమేమిటి? పంటలు పండే అవకాశం కల్పించి పోషిస్తోంది. ఒక్క పోషించటమేమిటి? భూమ్యాకర్షణతో మనందరినీ తన గుండెకి హత్తుకుని, వాతావరణమనే వెచ్చటి పమిట చెంగుతో కప్పి, మనకి హాని కలిగించే కాస్మిక్ కిరణాల ధాటీ నుండి తప్పించి, రక్షించి, కంటికి రెప్పలా కాపాడుతోంది. ఈ భూదేవే లేకపోతే మన మనుగడకి ఆధారమే లేదు. కనుక ఈ భూలోకవాసులందరికీ ఈ భూమి ప్రత్యక్ష దైవం. భూమిని మాతృస్థానానికి లేవనెత్తాలంటే మన పితృదేవులెవ్వరో తెలియాలి. భూమి క్షేత్రాన్ని ప్రసాదిస్తున్నాది కాని, జీవానికి మూలకారణమైన బీజం సూర్యుడు ఇచ్చే వెలుగు. సూర్యుడు ఇచ్చే వేడి, వెలుగు లేకపోతే ఈ భూమి మీద మొక్కలు మొలవవు, పంటలు పండవు. సూర్యుడు లేకపోతే పోషణ అసంభవం. ఈ భూ, సూర్యుల జంటలో ఏ ఒక్కరు ఉన్నా సరిపోదు. ఇద్దరూ కావాలి. ఈ బాణీలో ఆలోచిస్తే భూమిని తల్లిగాను, సూర్యుడిని తండ్రిగానూ ఊహించుకుని, వీరిరువురిని ప్రత్యక్ష దైవాలుగా గౌరవించవచ్చు. 

  3. ఆదిమధ్యాంతరాహిత్యం 

 భగవంతుడు ఆదిమధ్యాంతరహితుడు అంటారు. క్షేత్రమాపక (geometrical) దృష్టితో చూస్తే గోళాకారంలో ఉన్న భూ, సూర్యులిద్దరూ ఆదిమధ్యాంతరహితులే. కాని కాలమాపక (temporal) దృష్టితో చూస్తే మాత్రం ఈ గమనిక నిజం కాదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ భూమితో పాటు సూర్య కుటుంబం ఉరమరగా 5 బిలియను సంవత్సరాల కిందటే పుట్టింది. మనందరికి మల్లే ఈ సౌర కుటుంబానికి కూడ బాల్య, కౌమార, వార్ధక్య దశలు, తదుపరి మరణము తథ్యం. జనన మరణాలు ఉన్న ఈ భూ, సూర్యులు దేవుళ్లు ఎలా అవుతారు? అంతే కాదు. ఈ భూ, సూర్యులిరువురికీ దైవత్వం అంటకట్టటానికి మరొక అడ్డంకి ఉంది. భూ, సూర్యులు ఈ భూ గ్రహం మీద ఉన్న వాళ్లకే మాతా పితలు. ఈ విశ్వంలో మన సూర్యుడి వంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇలా లెక్కకు అందని ప్రభాకరులలో కొన్నింటికయినా గ్రహకూటములు ఉండొచ్చు. వాటిలో కొన్నింటి మీదనైనా ప్రాణం వెల్లివిరిసి ఉండొచ్చు. ఆయా ప్రాణుల తల్లిదండ్రులు వేరు కదా. పోనీ భూమ్యేతర గ్రహాల మీద ప్రాణి లేదనుకుందాం. కనీసం ఆయా నక్షత్రాలని, వాటితోపాటు ఉండే గ్రహాలని ఎవ్వరో ఒకరు సృష్టించాలి కదా. ఈ సృష్టిని జరిపినది ఎవ్వరు? ఈ నభోమూర్తులన్నిటిని వాటి వాటి గతులు తప్పకుండా పరిభ్రమింపజేసేది ఎవ్వరు? విశ్వవ్యాప్తమూ, ఆదిమధ్యాంతరహితమూ అయిన ఈ అద్భుత శక్తి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు పుంఖానుపుంఖంగా పుట్టుకురాగా కాబోలు, మందార మకరందాలు చించిదిస్తూ, “ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపల నుండు…” అనే పద్యం రాసి మనకిచ్చేరు, పోతనామాత్యులు. భాగవతపురాణంలో భక్తులకి భక్తి మార్గం ఉంది, వైజ్ఞానిక పరిశోధకులకి విశ్వసత్యం ఉంది. మన ఉపనిషత్తులలోను, పురాణాలలోను ఈ అన్వేషణకి సంబంధించిన సమాధానాలు ఉన్నాయి. ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు ఇవే ప్రశ్నలకి సమాధాలకొరకు మరొక కోణం నుండి ఎలా వెతుకుతున్నారో, గత శతాబ్దంలో వీరు కనుక్కున్న విశ్వసత్యాలు ఏమిటో, వాటికీ మన పురాణ వచనాలకీ పొందుపొత్తికలు ఉన్నాయో లేదో సమీక్షించి, క్రోడీకరించి ఈ దిగువ పొందు పరుస్తాను. రాబోయే అధ్యాయాలలో వీటినే మరింత లోతుగా గాలించి మళ్లా చూద్దాం. 

  4. గురుత్వాకర్షణ 

సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదుల పుట్టుకకి కారణభూతమైనదీ, ఈ నభోమూర్తులన్నిటిని గతులు తప్పకుండా వేటి పరిధులలో వాటిని ఉంచగలిగేది, వాటి వాటి కాలాలు తీరిన తరువాత వాటిని తనలో ఐక్యం చేసికొని, మళ్లా సరికొత్త నక్షత్రాదుల జన్మకి కారణభూతం కాగలిగినదీ అయిన శక్తి ఒకటి ఉంది. దానిని గురుత్వాకర్షణ అంటారు. ఈ గురుత్వాకర్షణ అదృశ్యమానం, విశ్వవ్యాప్తం, ఆదిమధ్యాంతరహితం. ఈ గురుత్వాకర్షణ లేకపోతే సూర్యుడు, అతని సంతానం జన్మించి ఉండేవేకాదు. ఈ గురుత్వాకర్షణ ప్రభావం వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని తారలు కాలరంద్రాలు (black holes) గా మారే సావకాశం కూడ ఉంది. అప్పుడు ఆ పరిసరప్రాంతాలలో ఉన్న పదార్ధం అంతా ఆ కాలరంద్రంలో పడిపోతుంది. అదే “లయ” ప్రక్రియ అని కొందరు సిద్ధాంతీకరిస్తున్నారు. అంటే సృష్టి, స్థితి, లయ కారకురాలయిన ఈ గురుత్వాకర్షణ (gravity) సర్వకాల సర్వావస్థలయందు ఈ విశ్వానికి రూపు రేఖలు దిద్దుతోంది. కనుక దైవత్వానికి ఇది అభ్యర్ధే. ఈ గురుత్వాకర్షణ కంటికి కనిపించదు. గణితం లేకుండా వర్ణించి చెప్పటం కొంచెం కష్టమే. అయినా దీని గురించి కొంచెమయినా తెలుసుకుంటే కాని విశ్వరహశ్యం బోధపడదు. ఈ విశ్వంలో ఏ రెండు వస్తువులని తీసుకున్నా వాటి మధ్య ఒక రకం ఆకర్షణ (attraction) ఉంటుందని నూటన్ ఉద్ఘాటించేడు. పండిన పండు చెట్టుని వదలి వినువీధిలోకి రివ్వున ఎగిరిపోకుండా భూమి మీద పడటానికి కారణం పండుకీ, భూమికీ మధ్య ఉన్న పరస్పరమైన ఆకర్షణే. ఇదే విధమైన ఆకర్షణ భూమికి, చంద్రుడికి మధ్య ఉండటం వల్లనే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. నిజానికి భూమికి, చంద్రుడికి మధ్యనున్న ఈ ఆకర్షణకి చంద్రుడు భూమి మీదో, భూమి చంద్రుడి మీదో వెళ్లి పడాలి. ఇది ఎందుకు ఇలా జరగటం లేదో గణిత సమీకరణాలు రాసి సులభంగా చూపవచ్చు. గణితం లేకుండా చెప్పాలంటే ఉపమానాలు ఉపయోగించొచ్చు. ఉదాహరణకి ఒక రాయిని జోరుగా ఎదటికి విసిరేమనుకుందాం. అది కొంత దూరం ఒంపు తిరిగిన మార్గంలో వెళ్లి, చివరికి భూమి ఆకర్షణ కారణంగా భూమి మీద పడుతుంది. ఆ రాయిని ఇంకా జోరుగా విసిరితే మరికొంచెం దూరం వెళ్లి కింద పడుతుంది. ఇంకా చాలా బలంతో రాయిని గిరవాటు వేస్తే – అంటే, ఆ రాయి ప్రయాణం చేసే ఒంపు గుండ్రంగా ఉన్న భూమి ఒంపుకి దీటుగా ఉండటానికి సరిపోయే అంత జోరుగా విసిరితే - ఇహ ఆ రాయి సతతం అలా “కింద” పడటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, కాని పడ లేదు; అప్పుడు ఆ రాయి భూమి చుట్టు ప్రదక్షిణం చేస్తుంది. కృతిమ ఉపగ్రహాలని భూమి కక్ష్య లోనికి ఎక్కించటానికి రాకెట్లు చేసే పని ఇలాంటిదే. అదే విధంగా చంద్రుడు భూమి మీద పడలేక భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే విధంగా భూమి వెళ్లి సూర్యుడి మీద పడటానికి ప్రయత్నం చేస్తోంది; కాని భూమి సూర్యుడి చుట్టూ తిరిగే పరిభ్రమణ వేగం వల్ల సూర్యుడి మీద పడలేక సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఈ గురుత్వాకర్షణ విశ్వ వ్యాప్తం అని నూటన్ గమనించేడు కానీ, ఈ ఆకర్షణ ఎందుకు ఉందో కారణం చెప్పలేకపోయాడు. ఈ ప్రశ్నకి అయిన్‌స్టయిన్ సమాధానం చెప్పేడు. ఆయిన్‌స్టయిన్ ఉద్ఘాటించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం (General Theory of Relativity) ఆధారం చేసుకుని ఈ గురుత్వాకర్షణకి కారణం ఒక ఉపమానం సహాయంతో వివరిస్తాను. ఈ ఉపమానానికి ఒక ఊహాలోకంలో మనం ఒక ప్రయోగాన్ని సృష్టించుకోవాలి. ఇటువంటి ఉహాలోకపు ప్రయోగాలని ఊహా ప్రయోగాలు లేదా స్పురణ ప్రయోగాలు (thought experiments) అందాం. ఈ ఉపమానానికి ఒక ప్రదేశం (space), ఆ ప్రదేశంలో పదార్ధం (matter) కావాలి. ప్రదేశానికి ఒక పెద్ద జంబుఖానాని ఊహించుకుందాం. ఊహే కనుక, ఈ జంబుఖానా రబ్బరు గుడ్డతో చేసినది అని అనుకుందాం. ఈ రబ్బరు జంబుఖానాని నాలుగు పక్కలా గట్టిగా లాగి పట్టుకుందాం. ఈ జంబుఖానా ఉన్న మేరని మనం “విశ్వం” అని అనుకుందాం. ప్రస్తుతానికి ఈ విశ్వం అంతా ప్రదేశం ఆక్రమించుకుని ఉంది. ఈ ప్రదేశం సాపుగా, చదునుగా, ముడతలు, ఒంపులు లేకుండా ఉంది కదా. ఇప్పుడు ఈ విశ్వం మీద చిన్న “నల్లపూస” అనే పదార్ధాన్ని వేసేమని అనుకుందాం. ఈ నల్లపూసలో పదార్ధం తక్కువగా ఉంది కనుక దీని వల్ల మన జంబుఖానా ఆకారం ఏమీ మారదు. ఎక్కడ వేసిన పూస అక్కడే ఉంటుంది కదా? ఇప్పుడు ఈ జంబుఖానా మీద పెద్ద కొబ్బరి బొండాం పెట్టేమనుకుందాం. కొబ్బరి బొండాం అనే పదార్ధం జంబుఖానా అనే ప్రదేశం మీద పెట్టగానే ఆ ప్రదేశం ఆకారమే మారిపోయింది. కొబ్బరి బొండాం ఉన్న చోట రబ్బరు జంబుఖానాలో ఒక లొత్త పడుతుంది. అంటే ఏమిటన్న మాట? ప్రదేశం ఆకారం ఆ ప్రదేశంలో ఉన్న పదార్ధం మీద ఆధారపడి ఉంటుంది. లొత్త పడగానే ఇందాకటి నల్లపూస జరజరా జారి ఆ లొత్తలో పడుతుంది. జంబుఖానా మన కళ్లకి కనబడుతోంది కనుక ఆ జంబుఖానా మీద ఆ పూస “జారు”తోన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జంబుఖానాని మన కంటికి కనబడని గుడ్డతో చేసేరనుకుందాం. అప్పుడు కూడ నల్లపూస జారి బొండాం దగ్గరకి వెళుతుంది. కాని జంబుఖానా కనబడటంలేదు కనుక కొబ్బరి బొండాం నల్లపూసని ఆకర్షిస్తూన్నట్లు భ్రమ పడతాం. ఈ భ్రమే గురుత్వాకర్షణ అంటారు అయిన్‌స్టయిన్. ఇది రజ్జు సర్ప భ్రాంతి లాంటి భ్రమ. ఈ ప్రయోగం జరిగే వరకు కొబ్బరి బొండాం నల్లపూసని ఆకర్షిస్తున్నాదనే అనుకున్నాం. ప్రయోగం అయిన తరువాత, అంతా అర్ధం అయిన తరువాత – ఆకర్షణా లేదు, గీకర్షణా లేదు, అంతా ప్రదేశంలో ఉన్న ఒంపు వల్ల మనకి అలా అనిపిస్తున్నాదని ఇప్పుడు అనుకుంటున్నాం. అయితే ఈ గురుత్వాకర్షణేనా కారణాలన్నిటికి కారణమైన ఆది శక్తి? 

  5. ఆది శక్తి 

 ఆది శక్తి (primeval energy) అసలు స్వరూపం అర్ధం అవాలంటే అయిన్‌స్టయిన్ ప్రవచించిన మరొక సూత్రాన్ని అర్ధం చేసుకోవాలి. ఆయిన్‌స్టయిన్ చేసిన పనేమిటో చాల మందికి అర్ధం కాకపోయినా ఆయన పేరుతో చెలామణీ అయే ఒక గణిత సమీకరణం చాలమందికి తెలుసు. అదే E = mc2 అన్న సమీకరణం. ఈ సమీకరణం లో c అంటే వెలుగు వేగం. c2 అంటే వెలుగు వేగాన్ని వెలుగు వేగంతో గుణించగా వచ్చిన లబ్దం. ఈ సమీకరణం ప్రకారం విశ్వం అంతా పదార్ధం (m), శక్తి (E) అనే రెండింటి మయం. ఈ రెండింటికి తేడా లేదు. ఈ విశ్వాన్ని పదార్ధంగానైనా ఊహించుకోవచ్చు, శక్తిగానైనా ఊహించుకోవచ్చు. ఈ రెండూ ఒకదానికి మరొకటి రూపాంతరాలు. ఒకటి బొమ్మ అయితే, మరొకటి బొరుసు. ఉదాహరణకి ఒక అణువు (atom) ని తీసుకుందాం. ఈ అణువులో వడ్లగింజ మొనలో ఉన్నంత పదార్ధం ఉందని (“నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్వణూపమా”) వేదంలో ఉన్న మంత్రపుష్పం చెబుతోంది. అంత సూక్ష్మమైనంత పదార్ధంలో ఆత్మ ఉందో లేదో తెలియదు కాని, ఆ అణువులో ఉన్న శక్తి విడుదల చెయ్యగలిగితే మనకి “అణుబాంబు” వస్తుంది. అణుగర్భంలో అంత శక్తి ఇమిడి ఉందని పైన ఉదహరించిన E = mc2 అన్న సమీకరణం చెబుతోంది. ఈ స్థూల ప్రపంచం అంతా అణువుల సమూహం. ఈ విశ్వంలో ఎన్ని అణువులు ఉన్నాయి? ఒకటి తరువాత 80 సున్నలు చుడితే ఎంత సంఖ్య వస్తుందో (10E80) అన్ని అణువులు ఉన్నాయని ఒక అంచనా ఉంది. ఈ అణువులు అన్నీ స్థూల రూపంలో ఉన్న శక్తి. ఈ అణుగర్భాలలో ఉన్న శక్తి అంతా ఒకేసారి స్థూలరూపం వదలి నిజరూపం ధరిస్తే వచ్చే శక్తి ఎంతుంటుందో అయిన్‌స్టయిన్ సమీకరణం ఉపయోగించి లెక్క కట్టవచ్చు. కాంతి వేగం సెకండుకి ఉరమరగా 300,000,000 మీటర్లు అని వేసుకుని, ఒకొక్క అణువు గరిమ (mass) ఎంతుంటుందో చూసుకుని లెక్క వెయ్యవచ్చు. ఈ పని చదువరులకి వదలిపెడతాను. మీకు వచ్చిన సమాధానం ఆది శక్తిలో ఉన్న శక్తి!! ఏదో మాటవరసకి చదువరులకి లెక్క కట్టమని ఇచ్చేను కాని, ఈ సంఖ్య ఊహకి అందనంత పెద్దగా ఉంటుంది. అంత పెద్ద పెద్ద సంఖ్యలని ఊహించుకోవటం కష్టం. అందుకని కొంచెం సాయం చేస్తాను. మొట్టమొదట అణుబాంబుని జపాను మీద పేల్చే ముందు, అది అనుకున్నట్లు పేలుతుందో లేదో చూసుకోటానికి, అమెరికాలో, నూ మెక్సికోలో ఉన్న ఒక ఎడారిలో, ఒక బాంబుని ప్రయోగాత్మకంగా పేల్చేరు. ఆ ప్రయోగానికి పెద్ద ఆపెన్‌హైమర్ అనే ఆసామీ. ఈ బాంబులో ఉన్న యురేనియంలో కేవలం 600 మిల్లిగ్రాముల యురేనియం మాత్రం శక్తిగా మారింది. ఈ శక్తిని చూసి అది వర్ణనకి అందని దృశ్యం అనిన్నీ, కాదూ, కూడదు వర్ణించాలంటే ఒకే ఒక మార్గం ఉందని చెప్పి, భగవద్గీతలోని, “దివిసూర్యసహస్రస్య భవేద్యుగపదుద్ధితా, యది భాః సదృశీ సా స్యాద్ భాసస్ తస్య మహాత్మనః.” అన్న శ్లోకాన్ని చదివి అలా ఉందన్నారుట, ఆపెన్‌హైమర్! అంటే ఏమిటి? వెయ్యి సూర్యబింబాలు ఆకాశంలో ఒకే సారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని అర్ధం కదా. కేవలం 600 మిల్లిగ్రాముల పదార్ధం పేలితేనే ఆయనకి నోరెండిపోయి భగవద్గీతలోని శ్లోకం గుర్తుకి వచ్చెస్తే, విశ్వంలో ఉన్న అణువులలో ఉన్న శక్తి అంతా ఒకేసారి విడుదల అయితే దానిని వర్ణించటం మన తరమా? దానిని చూడగలమా? చూడగలిగినా గలగలేకపోయినా, ఊహించగలిగినా గలగలేకపోయినా అదే ఆది శక్తి అని అంటున్నారు భౌతిక శాస్త్రంలో ఉద్దండులైన పెద్దలు. “తస్యాశిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః” (అంటే, ఆ అణువు మధ్య ఉన్నది పరమాత్మే) అని వేదం ఘోషిస్తున్నాది. టూకీగా చెప్పాలంటే సృష్ట్యాదిలో ఉన్నది ఈ ఆది శక్తే. “మయా తతం ఇదం సర్వం, జగదవ్యక్తమూర్తినా” అని అన్నాడు కనుక జగ్గత్తంతయు అవ్యక్తరూపుడగు ఆది శక్తిచే ఆక్రమించబడి ఉన్నది. “అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే” అన్నాడు కనుక విశ్వంలో సర్వసమస్థానికీ మూలకారణం ఈ తేజస్సే! “యచ్చాపి సర్వభూతానాం బీజం” అన్నాడు కనుక సమస్త జీవులకు బీజం ఈ తేజస్సే! “యద్ యద్ విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవవా, తత్తదేవావ గచ్చత్వం మమతేజోంశ సంభవం” అని కూడా అన్నాడు కనుక విశ్వంలోని శక్తులు కాని, పదార్ధములు కాని ఈ తేజస్సు యొక్క అంశలే. 

6. ఆది శక్తికీ గురుత్వాకర్షణకీ సంబంధం ఏమిటి? 

 సృష్ట్యాదిలో ఉన్నది ఆది శక్తి. దీనినే భౌతిక శాస్త్రవేత్తలు ఆదిజ్వాల (primeval fireball) అని కూడ అంటారు. మనం బ్రహ్మాండం అని అంటాం. ఈ బ్రహ్మాండం ఎప్పుడు, ఎలా వచ్చిందో, ఎన్నాళ్లు అలా జ్వాలా (తేజో) రూపంలో ఉందో ఎవ్వరికీ తెలియదు. ఈ బ్రహ్మాండం ఎంత మేర స్థలం ఆక్రమించిందో కూడ ఎవ్వరికీ తెలియదు. “ఎంత మేర?, ఎన్నాళ్లు?” అనే ప్రశ్నలకి ఈ సందర్భంలో అర్ధం లేదని కొందరి వాదన. ఎందుకంటే ఆది శక్తి ఇలా తేజోరూపంలో ఉన్నప్పుడు స్థలం ఇంకా పుట్టలేదు, కాలం ఇంకా పుట్టలేదు. విపరీతమైన తేజస్సుతో, విపరీతమైన వేడితో వర్ధిల్లుతూన్న ఈ తేజో రూపం, ఈ బ్రహ్మాండం, ఒక శుభముహూర్తంలో, అకస్మాత్తుగా ఫెళ్లున పేలిపోయింది ట. ఇలా విచ్ఛిత్తి పొందిన బ్రహ్మాండం నుండి నాలుగు ప్రాధమిక బలాలు (four fundamental forces) పుట్టుకొచ్చేయి. ఇలా సృష్టి ఆరంభంలో పుట్టిన నాలుగు బలాలలో ఒకటి గురుత్వాకర్షణ బలం (gravitational force). మరొకటి విద్యుదయస్కాంత బలం (electromagnetic force). మూడవది త్రాణిక బలం (strong force). నాలుగవది నిస్త్రాణిక బలం (weak force). ఈ చతుర్విధ బలాల జననమే సృష్టికి మొదలని అనుకోవచ్చు. ఈ పేలుడు లోనే స్థలం (space), కాలం (time) కూడ పుట్టేయి. పేలుడు ప్రదేశం లోకి వ్యాపించటం మొదలుపెట్టింది. ఇలా వ్యాప్తి చెందిన ప్రదేశం పదార్ధంతో (matter) నిండటం మొదలయింది. ఈ పదార్ధం ఎక్కడ నుండి వచ్చింది. శక్తి లోంచి. ప్రదేశంలోకి విశ్వం వ్యాపిస్తూ పదార్ధంతో నిండుతూ ఉంటే కాలం ముందుకు నడవటం మొదలు పెట్టింది. విశ్వం చల్లారటం మొదలు పెట్టింది. తరువాత నక్షత్రాలు, గ్రహాలు పుట్టేయి. ప్రాణి పుట్టింది. మనిషి పుట్టేడు. పుట్టి, “కస్త్వం, కోహం?” అని అడిగేడు.